జీవిత కథ
నిరుత్సాహపడకూడదని నిర్ణయించుకున్నాను
“డాడీ, పప్పా, అంకుల్.” బెతెల్‌లోని చాలామంది యౌవనులు నన్ను ఇలానే పిలుస్తుంటారు. 89 ఏళ్ల నాకు అలా పిలిపించుకోవడం ఇష్టం. ప్రేమగా పిలిచే ఈ పిలుపులు, 72 ఏళ్లపాటు పూర్తికాల సేవచేసినందుకు యెహోవా నాకిచ్చిన ప్రతిఫలంలో భాగం అనుకుంటాను. దేవుని సేవలో నాకు ఎదురైన అనుభవాలను బట్టి యౌవనుల్ని ఇలా ప్రోత్సహిస్తుంటాను, ‘మీరు నిరుత్సాహపడకుండా ఉంటే మీ పనికి ప్రతిఫలం దొరుకుతుంది.’—2 దిన. 15:7, NW.
అమ్మానాన్నలు, తోబుట్టువులు
మా అమ్మానాన్నలు యుక్రెయిన్ నుండి కెనడాకు వలస వచ్చి, మానిటోబాలోని రాస్బెర్న్ అనే పట్టణంలో స్థిరపడ్డారు. మా అమ్మానాన్నలకు 16 మంది పిల్లలు. ఎనిమిది మంది అబ్బాయిలు, ఎనిమిదిమంది అమ్మాయిలు, వాళ్లలో కవలలు ఎవ్వరూ లేరు. నేను 14వ సంతానాన్ని. నాన్నకు బైబిలంటే చాలా ఇష్టం, ప్రతీ ఆదివారం ఉదయం మా అందరికీ బైబిలు చదివి వినిపించేవాడు. కానీ మతమంటే, డబ్బు సంపాదించడానికి మతనాయకులు ఎంచుకున్న ఒక మార్గమని ఆయన అనుకునేవాడు. “ప్రకటించి, బోధించినందుకు యేసుకు ఎవరు డబ్బులు ఇచ్చారో” అని అప్పుడప్పుడు సరదాగా నాన్న మాతో అంటుండేవాడు.
నా తోబుట్టువుల్లో ఎనిమిదిమంది సత్యాన్ని అంగీకరించారు. మా అక్క రోజ్, చనిపోయేదాకా పయినీరు సేవ చేసింది. ఆమె తన జీవితంలోని ఆఖరి రోజుల్లో, బైబిలు ఏమి చెప్తుందో తెలుసుకోమని అందర్నీ ప్రోత్సహిస్తూ “మిమ్మల్ని కొత్త లోకంలో చూడాలనుకుంటున్నాను” అనేది. మొదట్లో మా అన్న టెడ్, నరకం ఉందని బోధించేవాడు. పాపులు నిత్యం నరకాగ్నిలో కాల్చబడతారని ప్రతీ ఆదివారం రేడియోలో ప్రసంగిస్తూ శ్రోతల్ని భయపెట్టేవాడు. చివరికి ఆయన కూడా నమ్మకమైన, ఉత్సాహవంతమైన యెహోవా సేవకుడు అయ్యాడు.
నా పూర్తికాల సేవ ఆరంభం
1944, జూన్‌లో ఒక రోజు నేను స్కూల్ నుండి ఇంటికి తిరిగొచ్చేసరికి మా డైనింగ్ టేబుల్ మీద ద కమింగ్ వరల్డ్ రిజెనరేషన్a అనే చిన్నపుస్తకం కనిపించింది. ముందు ఒకటో పేజీ చదివాను, తర్వాత రెండో పేజీ, అలా పుస్తకమంతా చదివేశాను. చదవడం పూర్తయ్యేసరికి, యేసులాగే నేను కూడా యెహోవా సేవ చేయాలని బలంగా నిర్ణయించుకున్నాను.
అసలు ఆ పుస్తకం మా టేబుల్ మీదకు ఎలా వచ్చింది? ఎవరో ఇద్దరు వ్యక్తులు పుస్తకాల్ని అమ్ముకుంటూ ఇంటికి వచ్చారని మా అన్న స్టీవ్ చెప్పాడు. “ఈ పుస్తకం తక్కువ ధరకే వస్తుందని కొన్నాను” అని కూడా అన్న చెప్పాడు. ఆ ఇద్దరు వ్యక్తులు తర్వాతి ఆదివారం మళ్లీ మా ఇంటికి వచ్చారు. తాము యెహోవాసాక్షులమనీ, ప్రజలకున్న సందేహాలను బైబిలు సహాయంతో తీరుస్తామనీ మాకు చెప్పారు. అది మాకు నచ్చింది, ఎందుకంటే అమ్మానాన్నలు చిన్నప్పటి నుండే మాలో బైబిలుపై గౌరవాన్ని నింపారు. అయితే విన్నిపెగ్‌లో జరిగే యెహోవాసాక్షుల సమావేశానికి ఆ ఇద్దరు వ్యక్తులు మమ్మల్ని ఆహ్వానించారు. అక్కడ మా అక్క ఎల్సీ ఉంటుంది. నేను ఆ సమావేశానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాను.
నేను సుమారు 320 కి.మీ. సైకిల్ తొక్కుకుంటూ విన్నిపెగ్ బయల్దేరాను, మధ్యలో కెల్వుడ్లో ఆగాను. మా ఇంటికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆ ప్రాంతంలోనే ఉంటారు. అక్కడ ఒక మీటింగ్‌కి కూడా వెళ్లాను, అసలు సంఘం అంటే ఎలా ఉంటుందో అప్పుడే అర్థమైంది. అంతేకాదు యేసులాగే ప్రతీఒక్కరూ ఇంటింటికి వెళ్లి ప్రకటించాలని తెలుసుకున్నాను.
విన్నిపెగ్ సమావేశంలో మా అన్న జాక్‌ను కలిశాను, ఆయన ఉత్తర ఒంటారియో నుండి సమావేశానికి వచ్చాడు. సమావేశంలో బాప్తిస్మం ఇవ్వబోతున్నారని ఒక సహోదరుడు మొదటి రోజు ప్రకటన చేశాడు. ఆ సమావేశంలో బాప్తిస్మం తీసుకోవాలని నేనూ, జాక్ నిర్ణయించుకున్నాం. బాప్తిస్మం తీసుకున్నాక వీలైనంత త్వరగా పయినీరు సేవ మొదలుపెట్టాలని కూడా అనుకున్నాం. సమావేశం అయిన వెంటనే జాక్ పయినీరు సేవ మొదలుపెట్టాడు. కానీ నాకు అప్పటికి 16 ఏళ్లే కావడంతో సమావేశం అయ్యాక స్కూల్‌కి వెళ్లాను. ఆ తర్వాతి సంవత్సరం నేను కూడా పయినీరు సేవ మొదలుపెట్టాను.
పయినీరు సేవ నేర్పించిన పాఠాలు
నేను స్టాన్ నికల్సన్తో కలిసి మానిటోబాలోని సౌరిస్ అనే ప్రాంతంలో పయినీరు సేవ మొదలుపెట్టాను. అయితే ఆ సేవ అంత తేలిక కాదని కొన్నిరోజులకే అర్థమైంది. రోజులు గడిచేకొద్దీ మా దగ్గరున్న డబ్బులు అయిపోయాయి, కానీ మేం మాత్రం పయినీరు సేవను ఆపలేదు. ఒక రోజు ప్రీచింగ్ నుండి ఇంటికొచ్చేసరికి చేతిలో చిల్లిగవ్వ లేదు, ఒకవైపేమో ఆకలి దంచేస్తోంది. ఆశ్చర్యకరంగా, మా గుమ్మం దగ్గర పెద్ద సంచి నిండా ఎవరో ఆహారం పెట్టి వెళ్లారు! ఎవరు పెట్టారో ఈరోజు వరకు మాకు తెలీదు. ఆరోజు సాయంత్రం మేం రాజుల్లా తిన్నాం. నిరుత్సాహపడి సేవను ఆపనందుకు ఎంతో చక్కని ప్రతిఫలం పొందాం. నిజానికి ఆ నెల చివరికల్లా చాలా బరువు పెరిగాను.
కొన్ని నెలలకు మమ్మల్ని సౌరిస్కు 240 కి.మీ. ఉత్తరాన ఉన్న గిల్బర్ట్ ప్లెయిన్స్ అనే ప్రాంతానికి నియమించారు. అప్పట్లో, ప్రతీ సంఘంలో స్టేజీ మీద పెద్ద చార్టు ఉండేది. నెలనెలా చేసిన ప్రకటనా పని వివరాలు దానిమీద రాసేవాళ్లు. ఏ నెలైనా ప్రకటనా పని సరిగ్గా చేయకపోతే, సహోదరసహోదరీలు ప్రకటనా పనిలో పాల్గొనడానికి మరింత కృషి చేయాలని నొక్కి చెప్తూ ప్రసంగం ఇచ్చేవాణ్ణి. ఒకసారి మీటింగ్ తర్వాత, ఒంటరిగా సత్యంలో ఉన్న ఒక వృద్ధ పయినీరు సహోదరి ఏడుస్తూ నా దగ్గరికి వచ్చి, “నేను చాలా ప్రయత్నించాను గానీ ఇంతకుమించి చేయలేకపోయాను” అంది. అప్పుడు ఏడ్వడం నా వంతు అయింది, ఆమెను క్షమాపణ అడిగాను.
ఉత్సాహవంతులైన యౌవన సహోదరులు ఎవరైనా నాలాగే పొరపాట్లు చేసి, తర్వాత బాధపడే అవకాశం ఉంది. కానీ అలాంటివి జరిగినప్పుడు నిరుత్సాహపడే బదులు, చేసిన పొరపాటు నుండి పాఠం నేర్చుకొని ముందుకు సాగిపోవాలని నా అనుభవం ద్వారా తెలుసుకున్నాను. మనం నమ్మకంగా చేసే అలాంటి సేవకు ప్రతిఫలం పొందుతాం.
క్విబెక్ పోరాటం
నా 21వ ఏట 14వ తరగతి గిలియడ్ పాఠశాలకు హాజరయ్యే గొప్ప అవకాశం వచ్చినందుకు చాలా సంతోషించాను. 1950, ఫిబ్రవరిలో జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో 103 విద్యార్థుల్లో దాదాపు 25 మందిని ఫ్రెంచ్ భాషా క్షేత్రమైన కెనడాలోని క్విబెక్‌కు పంపించారు. అక్కడ యెహోవాసాక్షుల పట్ల హింస చెలరేగుతోంది. నన్ను క్విబెక్‌కు నైరుతి దిశలో ఉన్న వాల్-డిఓర్ అనే పట్టణానికి పంపించారు. ఒక రోజు, దగ్గర్లో ఉన్న వాల్-సెన్నివిల్ల అనే పల్లెటూరులో ప్రకటించడానికి వెళ్లాం. మేము అక్కడినుండి వెళ్లకపోతే కొడతానని స్థానిక మతనాయకుడు మమ్మల్ని బెదిరించాడు. నేను అతని మీద కేసు పెట్టాను. కోర్టు ఆ మతనాయకునికి జరిమానా విధించింది.
ఆ సంఘటన, అలాంటి మరెన్నో సంఘటనలు ‘క్విబెక్ పోరాటంలో’ భాగమయ్యాయి. 300 కన్నా ఎక్కువ ఏళ్లపాటు క్విబెక్ నగరం రోమన్ క్యాథలిక్ చర్చి గుప్పిట్లో ఉంది. మతనాయకులు రాజకీయ నాయకులతో చేతులు కలిపి యెహోవాసాక్షుల్ని హింసించేవాళ్లు. పరిస్థితులు చాలా కష్టంగా ఉండేవి, పైగా సాక్షులు ఎక్కువమంది ఉండేవాళ్లు కాదు. కానీ మేం ఎన్నడూ నిరుత్సాహపడలేదు. అయితే క్విబెక్లో మంచి మనసున్న కొంతమంది స్పందించారు. నేను స్టడీ చేసిన చాలామంది సత్యాన్ని అంగీకరించారు. వాళ్లలో ఒకే కుటుంబానికి చెందిన పదిమంది ఉన్నారు, వాళ్లందరూ యెహోవాను సేవించడం మొదలుపెట్టారు. వాళ్లు చూపించిన ధైర్యం వల్ల ఇతరులు కూడా క్యాథలిక్ చర్చిని వదిలి వచ్చే సాహసం చేశారు. మేం అలుపెరగకుండా ప్రకటిస్తూ ఉన్నాం, చివరికి పోరాటంలో గెలిచాం.
సహోదరులకు తమ సొంత భాషలో శిక్షణనివ్వడం
1956లో నన్ను హయిటీకి నియమించారు. చాలామంది కొత్త మిషనరీలు ఫ్రెంచ్ నేర్చుకోవడానికి ఎంతో కష్టపడ్డారు, ప్రజలు కూడా వాళ్లు చెప్పేది విన్నారు. స్టాన్లీ బోగెస్ అనే మిషనరీ ఇలా చెప్పాడు, “మా మనసులో ఉన్నది చెప్పడానికి ప్రజలు మాకు చేసిన సహాయం చూసి ఆశ్చర్యపోయాం.” నేను అప్పటికే క్విబెక్లో ఫ్రెంచ్ నేర్చుకున్నాను కాబట్టి ఫర్లేదని మొదట్లో అనుకున్నాను. కానీ స్థానిక సహోదరుల్లో ఎక్కువశాతం మంది హయిటియన్ క్రియోల్ భాష మాట్లాడతారని తర్వాత మాకు తెలిసింది. కాబట్టి మిషనరీలుగా మేం చేసే సేవకు మంచి ఫలితాలు రావాలంటే మేం ఆ భాష నేర్చుకోవాలి. నేర్చుకున్నాం, చేసిన కృషికి తగిన ప్రతిఫలాలు కూడా పొందాం.
అక్కడి సహోదరులకు మరింత సహాయం చేయడం కోసం, పరిపాలక సభ అనుమతితో కావలికోట అలాగే ఇతర ప్రచురణల్ని హయిటియన్ క్రియోల్ భాషలోకి అనువదించడం మొదలుపెట్టాం. దానివల్ల, దేశవ్యాప్తంగా కూటాలకు హాజరయ్యే వాళ్ల సంఖ్య వేగంగా పెరిగింది. 1950 నాటికి హయిటీలో 99 మంది ప్రచారకులు ఉండేవాళ్లు, 1960 కల్లా ఆ సంఖ్య 800 దాటింది. అప్పుడే నాకు బెతెల్‌కు రమ్మనే ఆహ్వానం వచ్చింది. 1961లో రాజ్య పరిచర్య పాఠశాలను నిర్వహించే అవకాశాన్ని పొందినందుకు సంతోషంగా ఉంది. ఆ నియామకంలో భాగంగా మేం 40 మంది సంఘపెద్దలకు, ప్రత్యేక పయినీర్లకు శిక్షణ ఇవ్వగలిగాం. 1962 జనవరిలో జరిగిన సమావేశంలో, అర్హులైన స్థానిక సహోదరులు తమ పరిచర్యను విస్తృతపర్చుకోవాలని ప్రోత్సహించాం. వాళ్లలో కొంతమంది ప్రత్యేక పయినీర్లుగా కూడా నియమించబడ్డారు. సరిగ్గా అప్పుడే వ్యతిరేకత మొదలైంది కాబట్టి సహోదరులకు సరైన సమయంలో ప్రోత్సాహం అందిందని చెప్పవచ్చు.
1962 జనవరి 23న, అంటే సమావేశం అయిపోయిన వెంటనే, పోలీసులు బ్రాంచి ఆఫీసుకు వచ్చి నన్నూ అలాగే ఆండ్రూ డి అమీకో అనే మిషనరీ సహోదరుణ్ణి అరెస్టు చేశారు. అంతేకాదు 1962 జనవరి 8 తేజరిల్లు! (ఫ్రెంచ్ భాష) ప్రతులన్నిటినీ జప్తు చేశారు. హయిటీలో వూడూ అనే మంత్రతంత్రాలకు సంబంధించిన ఆచారాన్ని పాటిస్తారని రాసిన కొన్ని ఫ్రెంచ్ వార్తాపత్రికల పేర్లను ఆ తేజరిల్లు! ప్రస్తావించింది. కానీ కొంతమందికి ఆ మాట నచ్చలేదు. దాంతో ఆ మాటల్ని రాసింది బ్రాంచి కార్యాలయంలో ఉన్న మేమే అని ఫిర్యాదు చేశారు. ఇదంతా జరిగిన కొన్ని వారాలకే మిషనరీలను తమ స్వదేశానికి పంపించేశారు.b కానీ శిక్షణ పొందిన స్థానిక సహోదరులే పనిని అద్భుతంగా కొనసాగించారు. వాళ్లు చూపించిన సహనం, సాధించిన ఆధ్యాత్మిక ప్రగతి తలచుకుంటే ఇప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇప్పుడు హయిటియన్ క్రియోల్ భాషలో పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం కూడా ఉంది. ఒకప్పుడు దానికోసం కలలు కన్నాం.
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్లో నిర్మాణ పని
హయిటీ తర్వాత నన్ను సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్కు మిషనరీగా నియమించారు. తర్వాత అక్కడ ప్రయాణ పర్యవేక్షకునిగా, ఆ తర్వాత బ్రాంచి పర్యవేక్షకునిగా సేవచేసే గొప్ప అవకాశం నాకు దొరికింది.
ఆ రోజుల్లో ఎన్నో రాజ్యమందిరాలు సాదాసీదాగా ఉండేవి. పొదల్లో నుండి గడ్డిని ఏరుకొచ్చి పైకప్పును ఎలా తయారు చేయాలో నేను నేర్చుకున్నాను. ఆ పని అలవాటులేని నన్ను చూసి దారినపోయేవాళ్లు నవ్వేవాళ్లు. కానీ నన్ను చూసి ప్రోత్సాహం పొందిన సహోదరులు నిర్మాణ పనిలో తమ వంతు కృషి అందించారు, అలాగే తమ సొంత రాజ్యమందిరాల్ని చక్కని స్థితిలో ఉంచుకున్నారు. అయితే మతనాయకులు మమ్మల్ని ఎగతాళి చేసేవాళ్లు, ఎందుకంటే వాళ్ల చర్చీలకు రేకుతో చేసిన పైకప్పులు ఉండేవి, మాకు గడ్డితో చేసిన పైకప్పులు ఉండేవి. కానీ మేం ఏమాత్రం నిరుత్సాహపడకుండా వాటితోనే సర్దుకుపోయాం. ఒకసారి రాజధాని నగరమైన బంగుయ్లో వచ్చిన పెద్ద తుఫాను వల్ల, మమ్మల్ని ఎగతాళి చేసేవాళ్ల నోళ్లు మూతపడ్డాయి. ఎందుకంటే తుఫాను తాకిడికి చర్చి రేకు పైకప్పులు ఊడి వీధిలో పడ్డాయి. కానీ మన రాజ్యమందిరాల గడ్డి పైకప్పులు మాత్రం అలానే ఉన్నాయి. రాజ్య పనిని బాగా పర్యవేక్షించడం కోసం అక్కడే ఒక కొత్త బ్రాంచి కార్యాలయాన్ని, మిషనరీ హోమ్‌ను నిర్మించుకున్నాం. అది కూడా ఐదు నెలల్లోనే!c
ఉత్సాహవంతమైన ప్రచారకురాలితో నా వివాహ జీవితం
మా పెళ్లి రోజున
1976లో సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్లో మన రాజ్య పనిని నిషేధించారు. దాంతో నన్ను పొరుగు దేశమైన చాడ్ రాజధాని ఎన్జమీనా అనే ప్రాంతానికి నియమించారు. అక్కడ నేను హ్యాపీ అనే ఉత్సాహవంతమైన ప్రత్యేక పయినీరు సహోదరిని కలిశాను, ఆమె కామెరూన్ దేశస్థురాలు. 1978 ఏప్రిల్ 1న మేం పెళ్లి చేసుకున్నాం. అదే నెల అంతర్యుద్ధం మొదలవ్వడంతో అందరిలానే మేం కూడా దేశంలోని దక్షిణ ప్రాంతానికి వెళ్లిపోయాం. యుద్ధం ముగిశాక మా ఇంటిని చూడ్డానికి వెళ్లాం. ఆయుధాలు ధరించిన ఒక గుంపు మా ఇంటిని తమ ప్రధాన కార్యాలయంగా మార్చుకుందని గ్రహించాం. మన ప్రచురణలతోపాటు హ్యాపీ పెళ్లి బట్టలు, పెళ్లికి వచ్చిన బహుమతులు పోయాయి. కానీ మేం నిరుత్సాహపడలేదు. మేం ఒకరికొకరం తోడుగా ఉన్నామనే ధైర్యంతో ముందుముందు చేయబోయే వాటిగురించి ఆలోచించాం.
దాదాపు రెండేళ్ల తర్వాత సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్లో మన పనిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేశారు. దాంతో మేం మళ్లీ వచ్చి ప్రయాణ సేవను మొదలుపెట్టాం. ఒక వ్యాన్‌ను మా ఇంటిగా మార్చుకున్నాం. అందులో మడత మంచం, 200 లీటర్ల నీటిని నిల్వ చేసుకోగల డ్రమ్ము, ప్రోపేన్ గ్యాస్ ఫ్రిడ్జ్, గ్యాస్ స్టవ్ ఉండేవి. ప్రయాణం చాలా కష్టంగా ఉండేది. ఒకసారైతే, 117 కన్నా ఎక్కువ పోలీస్ చెక్‌పోస్టుల దగ్గర మేం ఆగాల్సి వచ్చింది.
ఒక్కోసారి వాతావరణ ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు చేరేవి. సమావేశాలు జరుపుకునేటప్పుడు బాప్తిస్మం కోసం సరిపడా నీళ్లు దొరకడం కూడా కష్టంగా ఉండేది. కాబట్టి సహోదరులు ఎండిపోయిన నదుల్లో తవ్వి, కొద్దికొద్దిగా దొరికిన నీటితో పెద్ద డ్రమ్మును నింపేవాళ్లు. అందులోనే బాప్తిస్మం ఇచ్చేవాళ్లు.
ఇతర ఆఫ్రికన్ దేశాల్లో చేసిన సేవ
1980లో మమ్మల్ని నైజీరియాకు నియమించారు. అక్కడ రెండున్నర ఏళ్లపాటు, కొత్త బ్రాంచి కార్యాలయ నిర్మాణ పనుల్లో సహాయం చేశాం. బ్రాంచి కార్యాలయం కోసం మన సహోదరులు రెండు అంతస్తులున్న ఒక గోడౌన్‌ను కొన్నారు. అది నిర్మాణ వస్తువుల్ని భద్రపర్చుకోవడం కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న ఒక చిన్న బిల్డింగ్ లాంటిది. దాన్ని విడదీసి మన స్థలంలో బిగించాలి. ఒక రోజు ఉదయం దాన్ని విడదీయడం కోసం నేను బిల్డింగ్ పైకి ఎక్కాను. మధ్యాహ్నం, ఎక్కిన దారిలోనే కిందికి దిగుతున్నప్పుడు కాలు జారి కిందపడ్డాను. ఏదో పెద్ద ప్రమాదమే జరిగినట్లు అనిపించింది. కానీ ఎక్స్‌రేలు, ఇతర పరీక్షలు చేశాక డాక్టరు హ్యాపీతో, “కంగారుపడకండి. కొన్ని లిగమెంట్లు దెబ్బతిన్నాయి అంతే. ఒకట్రెండు వారాల్లో సరైపోతుంది” అన్నాడు.
“స్థానిక రవాణా” ఉపయోగించుకుని సమావేశానికి వెళ్తున్నప్పుడు
1986లో మేం కోటె డి ఐవరీకి వెళ్లి ప్రయాణ పనిని కొనసాగించాం. అందులో భాగంగా మేం బుర్కీనా ఫాసోకు కూడా వెళ్లాం. కొంతకాలం వరకు అదే మా ఊరు అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు.
ప్రయాణ సేవలో ఉన్నప్పుడు ఈ వ్యాన్‌నే మా ఇంటిగా మార్చుకున్నాం
నేను 1956లో కెనడా విడిచి వచ్చాను. 47 ఏళ్ల తర్వాత అంటే 2003లో మళ్లీ కెనడాలోని బెతెల్‌కి తిరిగొచ్చాను. కానీ ఈసారి హ్యాపీతో వచ్చాను. నిజానికి మేం కెనడా దేశస్థులమే గానీ, ఎక్కువ ఏళ్లు ఆఫ్రికా దేశంలో ఉండడం వల్ల అదే మా సొంత దేశంలా అనిపించింది.
బుర్కీనా ఫాసోలో బైబిలు స్టడీ చేస్తూ
2007లో అంటే నాకు 79 ఏళ్లు ఉన్నప్పుడు మళ్లీ ఆఫ్రికాకు వెళ్లాం. అక్కడ బుర్కీనా ఫాసోలో కంట్రీ కమిటీ సభ్యునిగా సేవచేశాను. తర్వాత ఆ కార్యాలయాన్ని బెనిన్ బ్రాంచి కింద పనిచేసే అనువాద కార్యాలయంగా మార్చారు. 2013 ఆగస్టులో మమ్మల్ని బెనిన్ బెతెల్‌కి ఆహ్వానించారు.
బెనిన్ బ్రాంచిలో సేవ చేస్తున్నప్పుడు హ్యాపీతో
ఆరోగ్యం అంతగా సహకరించకపోయినా ఇప్పటికీ నాకు పరిచర్య అంటే చాలా ఇష్టం. గత మూడేళ్లలో సంఘపెద్దలు దయతో చేసిన సహాయం వల్ల, నా భార్య ప్రేమతో ఇచ్చిన మద్దతు వల్ల జేడేయోన్, ఫ్రేజిస్ అనే నా ఇద్దరు బైబిలు విద్యార్థులు బాప్తిస్మం తీసుకోవడం చూడగలిగాను. వాళ్లిప్పుడు ఉత్సాహంగా యెహోవా సేవ చేస్తున్నారు.
ఆ తర్వాత నన్నూ, నా భార్యనూ దక్షిణ ఆఫ్రికాలోని బ్రాంచి కార్యాలయానికి ఆహ్వానించారు. అక్కడున్న బెతెల్ కుటుంబం దయతో మా ఆరోగ్య అవసరాల్ని చూసుకుంటోంది. ఆఫ్రికా ఖండంలో నేను పనిచేసిన దేశాల్లో దక్షిణ ఆఫ్రికా ఏడవది. 2017 అక్టోబరులో ఒక గొప్ప దీవెనను పొందాం. న్యూయార్క్‌లోని వార్విక్‌లో ఉన్న మన ప్రపంచ ప్రధాన కార్యాలయం సమర్పణకు హాజరయ్యే అవకాశం దొరికింది. అది నా జీవితంలో మర్చిపోలేని సంఘటన.
1994 వార్షిక పుస్తకంలో (ఇంగ్లీషు) 255వ పేజీలో ఇలా ఉంది: ‘ఎన్నో ఏళ్ల నుండి ఓపిగ్గా సేవచేస్తున్న వాళ్లందర్నీ ఇలా ప్రోత్సహిస్తున్నాం: “మీరు నిబ్బరంగా ఉండండి, నిరుత్సాహపడకండి. ఎందుకంటే, మీ పనికి ప్రతిఫలం దొరుకుతుంది.”—2 దిన. 15:7, NW.’ ఈ ప్రోత్సాహానికి అనుగుణంగా జీవించాలని నేనూ, హ్యాపీ నిర్ణయించుకున్నాం. ఇతరుల్ని కూడా అలాగే జీవించమని ప్రోత్సహిస్తూ ఉంటాం.
a ఇది 1944లో యెహోవాసాక్షులు ప్రచురించినది, కానీ ఇప్పుడు ముద్రించడం లేదు.
b దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు 1994 యెహోవాసాక్షుల వార్షిక పుస్తకంలోని (ఇంగ్లీషు) 148-150 పేజీల్లో ఉన్నాయి.
c 1966, మే 8 తేజరిల్లు! (ఇంగ్లీషు) 27వ పేజీలోని ‘గట్టి పునాది మీద కట్టడం’ అనే ఆర్టికల్ చూడండి.