సంతోషం-పవిత్రశక్తి పుట్టించే ఒక లక్షణం
ప్రజలు సంతోషంగా ఉండాలనుకుంటారు. కానీ, ఈ చివరి రోజుల్లో ఎదురౌతున్న సమస్యలవల్ల ప్రతిఒక్కరూ ‘కష్ట కాలాన్ని’ అనుభవిస్తున్నారు. (2 తిమో. 3:1) అన్యాయం వల్ల, అనారోగ్యం వల్ల, ఉద్యోగం పోవడంవల్ల లేదా ఇష్టమైనవాళ్లు చనిపోవడంవల్ల కొంతమంది తమ సంతోషాన్ని కోల్పోతారు. ఇంకొంతమంది, తమకు ఆందోళన కలిగించేది లేదా బాధ కలిగించేది ఏదైనా జరగడంవల్ల సంతోషాన్ని కోల్పోతారు. యెహోవా ఆరాధకులకు కూడా నిరుత్సాహం ఎదురవ్వవచ్చు, దానివల్ల వాళ్లు మెల్లమెల్లగా సంతోషాన్ని కోల్పోవచ్చు. ఒకవేళ మీకలా జరిగివుంటే, సంతోషాన్ని మీరెలా తిరిగి పొందవచ్చు?
ఆ ప్రశ్నకు జవాబు తెలుసుకోవడానికి, ముందుగా నిజమైన సంతోషం అంటే ఏమిటో, కష్టాలు వచ్చినా కొంతమంది ఎలా సంతోషంగా ఉండగలిగారో అర్థంచేసుకుందాం. ఆ తర్వాత మన సంతోషాన్ని ఎలా కాపాడుకోవచ్చో, దాన్ని ఎలా అధికం చేసుకోవచ్చో పరిశీలిద్దాం.
సంతోషం అంటే ఏమిటి?
ఒక వ్యక్తి నవ్వుతూ ఉన్నంత మాత్రాన అతను సంతోషంగా ఉన్నాడని కాదు. ఉదాహరణకు, బాగా మందు తాగిన వ్యక్తి ఎంతో ఆనందంగా కనిపించవచ్చు. కానీ మత్తు దిగిపోయాక ఆ ఆనందమంతా మాయమైపోతుంది, తన జీవితాన్ని మళ్లీ భారంగా కొనసాగిస్తాడు. కేవలం కొద్దిసేపు ఉన్న అతని నవ్వు నిజమైన సంతోషం కాదు.—సామె. 14:13.
బదులుగా, మనకు ఏదైనా మంచి జరిగినప్పుడు లేదా జరగాలని ఎదురుచూసినప్పుడు మన హృదయంలో కలిగే బలమైన భావనే సంతోషం. సంతోషంగా ఉండడమంటే మన పరిస్థితులు బాగున్నా, బాలేకపోయినా ఆనందంగా ఉండడం. (1 థెస్స. 1:6) నిజానికి, మనకు ఏదైనా బాధ కలిగినప్పటికీ సంతోషంగా ఉండవచ్చు. ఉదాహరణకు, యేసు గురించి ప్రకటిస్తున్నందుకు అపొస్తలులను కొట్టారు. కానీ, “యేసు పేరు కోసం అవమానించబడే గొప్ప అవకాశం తమకు దక్కిందని సంతోషిస్తూ వాళ్లు మహాసభ నుండి వెళ్లిపోయారు.” (అపొ. 5:41) దెబ్బలు తిన్నందుకు వాళ్లు సంతోషించలేదు గానీ దేవునికి నమ్మకంగా ఉండగలిగినందుకు సంతోషించారు.
సంతోషం పుట్టుకతో వచ్చే లేదా దానంతటదే వచ్చే లక్షణం కాదు. ఎందుకంటే, నిజమైన సంతోషం పవిత్రశక్తి పుట్టించే ఒక లక్షణం. పవిత్రశక్తి సహాయంతో మనం “కొత్త వ్యక్తిత్వాన్ని” అలవర్చుకోవచ్చు. ఆ కొత్త వ్యక్తిత్వంలో సంతోషం కూడా ఒక భాగం. (ఎఫె. 4:24; గల. 5:22) సంతోషంగా ఉన్నప్పుడు కష్టాలను తట్టుకోవడం మరింత తేలికౌతుంది.
మనం అనుకరించాలనుకునే వ్యక్తులు
భూమ్మీద మంచి జరగాలని యెహోవా కోరుకున్నాడు. కానీ దానికి భిన్నంగా నేడు చెడు జరగడాన్ని మనం చూస్తున్నాం. ప్రజలు చెడ్డపనులు చేస్తున్నప్పటికీ యెహోవా తన సంతోషాన్ని కోల్పోలేదు. బైబిలు ఇలా చెప్తుంది, “బలమును సంతోషమును ఆయనయొద్ద ఉన్నవి.” (1 దిన. 16:27) అంతేకాదు, తన సేవకులు చేసే మంచిపనుల్ని చూసి యెహోవా సంతోషిస్తున్నాడు.—సామె. 27:11.
ఏదైనా మనం అనుకున్నట్లు జరగనప్పుడు, సంతోషాన్ని కోల్పోకుండా ఉండడం ద్వారా యెహోవాను అనుకరించవచ్చు. అలాంటి సమయంలో అతిగా బాధపడే బదులు, ప్రస్తుతం మన దగ్గరున్న మంచివాటి మీద మనసుపెడుతూ, భవిష్యత్తులో పొందబోయే మరింత మంచివాటి కోసం ఓపిగ్గా ఎదురుచూడవచ్చు.a
సమస్యల్ని ఎదుర్కొన్నప్పటికీ తమ సంతోషాన్ని కాపాడుకున్న ఎంతోమంది గురించి బైబిల్లో ఉంది. అలాంటి వాళ్లలో ఒకరు అబ్రాహాము. ఆయన ప్రాణం ప్రమాదంలో ఉన్నప్పటికీ, ఇతరుల నుండి సమస్యల్ని ఎదుర్కొన్నప్పటికీ తన సంతోషాన్ని కోల్పోలేదు. (ఆది. 12:10-20; 14:8-16; 16:4, 5; 20:1-18; 21:8, 9) అదెలా సాధ్యమైంది? మెస్సీయ పరిపాలనలోని కొత్తలోకంలో జీవించే నిరీక్షణ గురించి అబ్రాహాము ఆలోచించాడు. (ఆది. 22:15-18; హెబ్రీ. 11:10) “మీ తండ్రి అబ్రాహాము నా రోజును చూస్తాననే ఆశతో చాలా సంతోషించాడు” అని యేసు అన్నాడు. (యోహా. 8:56) మనం భవిష్యత్తులో పొందబోయే సంతోషం గురించి ఆలోచిస్తూ ఉండడం ద్వారా అబ్రాహామును అనుకరించవచ్చు.—రోమా. 8:21.
అబ్రాహాములాగే పౌలు, సీల కూడా ఎన్ని కష్టాలు ఎదురైనా బలమైన విశ్వాసం చూపించారు, తమ సంతోషాన్ని కాపాడుకున్నారు. ఉదాహరణకు వాళ్లను బాగా కొట్టి, జైల్లో వేసినప్పుడు ‘ప్రార్థిస్తూ పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతించారు.’ (అపొ. 16:23-25) భవిష్యత్తు గురించి దేవుడు చేసిన వాగ్దానాలను ఆలోచించడం ద్వారా ఆ బాధను తట్టుకోగలిగారు. అంతేకాదు క్రీస్తు శిష్యులైనందుకు బాధలు అనుభవిస్తున్నామని వాళ్లు సంతోషించారు. మనం దేవునికి నమ్మకంగా సేవచేసినప్పుడు కలిగే ప్రయోజనాలను గుర్తుచేసుకోవడం ద్వారా పౌలు, సీలను అనుకరించవచ్చు.—ఫిలి. 1:12-14.
ఈరోజుల్లో కూడా చాలామంది సహోదరసహోదరీలు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నప్పటికీ తమ సంతోషాన్ని కాపాడుకుంటున్నారు. ఉదాహరణకు, 2013 నవంబరులో ఫిలిప్పీన్స్‌లో వచ్చిన హైయాన్ అనే అతిపెద్ద తుఫాను ప్రభావానికి 1,000 కన్నా ఎక్కువమంది యెహోవాసాక్షులు తమ ఇళ్లను కోల్పోయారు. టక్‌లోబాన్ నగరంలో ఉండే జార్జ్ అనే సహోదరుని ఇల్లు కూడా పూర్తిగా నాశనమైపోయింది. ఆయనిలా చెప్తున్నాడు, “అలాంటి పరిస్థితుల్లో కూడా సహోదరులు సంతోషంగానే ఉన్నారు. మా సంతోషాన్ని మాటల్లో చెప్పలేను.” యెహోవా మనకు చేసిన సహాయం గురించి ఆలోచించి, ఆయనపట్ల కృతజ్ఞతతో ఉంటే పెద్దపెద్ద కష్టాలు వచ్చినప్పటికీ సంతోషంగా ఉంటాం. యెహోవా మనకిచ్చిన ఇంకా ఏయే విషయాలను బట్టి మనం సంతోషించవచ్చు?
సంతోషించడానికి కారణాలు
మనం సంతోషించడానికి ఉన్న ప్రాముఖ్యమైన కారణం యెహోవాతో మనకున్న సంబంధం. ఈ విశ్వానికే రాజైన వ్యక్తి మనకు తెలుసు. ఆయన మన తండ్రి, దేవుడు, స్నేహితుడు.—కీర్త. 71:17,18.
అంతేకాదు యెహోవా మనకు జీవం ఇచ్చినందుకు, దాన్ని ఆనందించే సామర్థ్యాన్ని ఇచ్చినందుకు ఆయనపట్ల కృతజ్ఞత చూపిస్తాం. (ప్రసం. 3:12, 13) యెహోవా తన గురించి మనకు తెలియజేశాడు కాబట్టి, మన విషయంలో ఆయన ఇష్టమేమిటో తెలుసుకోగలిగాం, మనం ఎలా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడో అర్థంచేసుకోగలుగుతున్నాం. (కొలొ. 1:9, 10) కానీ చాలామందికి జీవిత సంకల్పం ఏమిటో తెలియదు. మనకూ, వాళ్లకూ మధ్య తేడాను నొక్కిచెప్పడానికి పౌలు ఇలా అన్నాడు, ‘“తనను ప్రేమించేవాళ్ల కోసం దేవుడు సిద్ధం చేసిన విషయాలు కళ్లు చూడలేదు, చెవులు వినలేదు, మనిషి హృదయానికి తట్టలేదు.” ఎందుకంటే, దేవుడు తన పవిత్రశక్తి ద్వారా మనకే వాటిని వెల్లడిచేశాడు.’ (1 కొరిం. 2:9, 10) యెహోవా ఇష్టమేమిటో, ఆయన సంకల్పం ఏమిటో అర్థంచేసుకున్నప్పుడు మనం సంతోషంగా ఉంటాం.
యెహోవా మనకోసం ఇంకా ఎన్నో చేశాడు. మన పాపాలకు క్షమాపణ దొరికేలా చేశాడు. (1 యోహా. 2:12) త్వరలో రాబోయే కొత్త లోకంలో జీవించే నిరీక్షణ ఇచ్చాడు. (రోమా. 12:12) ఇప్పుడు కూడా, ఆయన్ను ఆరాధించే చాలామందిని మనకు స్నేహితులుగా ఇచ్చాడు. (కీర్త. 133:1) సాతాను నుండి, అతని చెడ్డదూతల నుండి మనల్ని కాపాడుతున్నాడు. (కీర్త. 91:11) యెహోవా మనకిచ్చిన ఈ దీవెనలన్నిటి గురించి లోతుగా ఆలోచించినప్పుడు మన సంతోషం అధికమౌతుంది.—ఫిలి. 4:4.
సంతోషాన్ని ఎలా అధికం చేసుకోవచ్చు?
ఇప్పటికే సంతోషంగా ఉన్న ఒక క్రైస్తవుడు తన సంతోషాన్ని అధికం చేసుకోగలడా? యేసు ఇలా అన్నాడు, “నాకున్న సంతోషాన్నే మీరూ పూర్తిగా అనుభవించాలని ఈ విషయాలు మీకు చెప్పాను.” (యోహా. 15:11) దానర్థం మన సంతోషాన్ని ఎల్లప్పుడూ అధికం చేసుకుంటూ ఉండవచ్చు. మన సంతోషాన్ని మంటతో పోల్చవచ్చు. ఆ మంటను పెంచాలంటే మరిన్ని కట్టెలు వేయాలి. సంతోషం పవిత్రశక్తి పుట్టించే ఒక లక్షణమని గుర్తుంచుకోండి. కాబట్టి మన సంతోషం అధికం అవ్వాలంటే, పవిత్రశక్తి కోసం దేవున్ని అడుగుతూ ఉండాలి. అంతేకాదు, పవిత్రశక్తి సహాయంతో రాయబడిన బైబిల్ని చదివి, లోతుగా ఆలోచిస్తూ ఉండాలి.—కీర్త. 1:1, 2; లూకా 11:13.
మన సంతోషాన్ని అధికం చేసుకోవడానికి మనం చేయాల్సిన మరో పని ఏమిటంటే, యెహోవాను సంతోషపెట్టే పనుల్లో బిజీగా ఉండడం. (కీర్త. 35:27; 112:1) ఎందుకు? బైబిలు ఇలా చెప్తుంది, “దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి.” (ప్రసం. 12:13) అంటే, మనం దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి సృష్టించబడ్డాం. కాబట్టి మనం యెహోవా సేవ చేసినప్పుడు సాధ్యమైనంత ఎక్కువ సంతోషాన్ని పొందుతాం.b
సంతోషంగా ఉండడం వల్ల ప్రయోజనాలు
మన సంతోషాన్ని అధికం చేసుకుంటూ ఉన్నప్పుడు ఇతర ప్రయోజనాలు కూడా పొందుతాం. ఉదాహరణకు, సమస్యలు ఉన్నప్పటికీ మనం యెహోవా సేవలో సంతోషంగా కొనసాగితే ఆయన మరింత సంతోషిస్తాడు. (ద్వితీ. 16:15; 1 థెస్స. 5:16-18) అంతేకాదు యెహోవా సేవలో నిజమైన సంతోషాన్ని పొందుతాం కాబట్టి, మన జీవితంలో వస్తుసంపదలకు అత్యంత ప్రాముఖ్యమైన స్థానం ఇవ్వం. బదులుగా దేవుని రాజ్యం కోసం మరిన్ని గొప్ప త్యాగాలు చేయడానికి కృషిచేస్తాం. (మత్త. 13:44) అలా త్యాగాలు చేయడంవల్ల వచ్చే మంచి ఫలితాల్ని చూసినప్పుడు, మన సంతోషం అధికమౌతుంది. దాంతో మనం సంతోషంగా ఉండడమేకాదు ఇతరులు కూడా సంతోషంగా ఉండడానికి సహాయం చేస్తాం.—అపొ. 20:35; ఫిలి. 1:3-5.
మనం ఎంత సంతోషంగా ఉంటే, మన ఆరోగ్యం కూడా అంతే బాగుంటుంది. బైబిలు ఇలా చెప్తుంది, “సంతోషముగల మనస్సు ఆరోగ్యకారణము.” (సామె. 17:22) అమెరికాలోని నెబ్రాస్కా విశ్వవిద్యాలయంలో ఆరోగ్యం గురించి అధ్యయనం చేసిన ఒక పరిశోధకుడు కూడా బైబిలు చెప్పిన మాటలతో ఏకీభవించాడు. ఆయనిలా అన్నాడు, “ఒకవేళ మీరు ఇప్పుడు సంతోషంగా, సంతృప్తిగా ఉంటే భవిష్యత్తులో మరింత ఆరోగ్యంగా ఉంటారు.”
మనం ఒత్తిడి ఎక్కువౌతున్న కాలంలో జీవిస్తున్నప్పటికీ, పవిత్రశక్తి సహాయంతో నిజమైన సంతోషాన్ని అనుభవించవచ్చు. ప్రార్థన చేయడం ద్వారా, బైబిల్ని అధ్యయనం చేసి, ధ్యానించడం ద్వారా మనం పవిత్రశక్తిని పొందవచ్చు. అంతేకాదు, ప్రస్తుతం యెహోవా మనకు ఇచ్చిన దీవెనల గురించి ఆలోచించినప్పుడు, ఇతరుల విశ్వాసాన్ని అనుకరించినప్పుడు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించినప్పుడు మన సంతోషం అధికమౌతుంది. అప్పుడు, “నీతిమంతులు యెహోవానుబట్టి సంతోషించుచు ఆయన శరణుజొచ్చెదరు” అని కీర్తన 64:10 లో ఉన్న మాటలు మన విషయంలో నెరవేరడాన్ని చూస్తాం.
a పవిత్రశక్తి పుట్టించే లక్షణాల గురించి చర్చించే ఆర్టికల్స్‌లో త్వరలో ఓర్పు గురించి చూస్తాం.
b “సంతోషాన్ని అధికం చేసుకోవడానికి మరిన్ని మార్గాలు” అనే బాక్సు కూడా చూడండి.