3 సమస్యలను సహించడానికి సహాయం
ఇప్పుడు ఉన్న కొన్ని సమస్యల్ని రాకుండా ఆపలేము లేదా పరిష్కరించలేము. ఉదాహరణకు, మీరు ప్రేమించేవాళ్లు చనిపోయి ఉండవచ్చు లేదా మీరు ఎంతోకాలంగా ఒక జబ్బుతో బాధపడుతూ ఉండవచ్చు, ఆ నొప్పిని సహించడం తప్ప మీకు వేరే దారి లేదు. అలాంటి ఘోరమైన పరిస్థితుల్లో బైబిలు మనకు సహాయం చేయగలదా?
ఎంతోకాలంగా పీడిస్తున్న జబ్బులు
రోస్ ఇలా అంటుంది: “నాకు జన్యుపరమైన లోపాలు ఉన్నాయి, అందువల్ల నాకు ఎప్పుడూ తీవ్రమైన నొప్పి ఉంటుంది. నా జీవితంలో నాణ్యత తగ్గిపోయింది.” ఆమెను బాగా బాధించిన విషయం ఏమిటంటే కొన్నిసార్లు ఆమె బైబిలు చదవడానికి, ఆధ్యాత్మిక పనులు చేయడానికి తన మనస్సు నిలుపలేకపోయేది. కానీ మత్తయి 19:26లో ఉన్న యేసు మాటలు ఆమెకు బాగా సహాయం చేశాయి: “దేవునికి అన్నీ సాధ్యం.” బైబిల్ని స్టడీ చేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయని రోస్ తెలుసుకుంది. కొన్నిసార్లు ఆమె నొప్పి వల్ల చదువుకోవడం అస్సలు వీలుపడేది కాదు కాబట్టి ఆమె బైబిల్ని, బైబిలు ప్రచురణల రికార్డింగ్‌లను వినడం మొదలు పెట్టింది.a ఆమె ఇలా అంటోంది, “ఆ అవకాశం లేకపోతే, నేను దేవునితో నా సంబంధాన్ని ఎలా కాపాడుకోగలిగే దాన్నో తెలియదు.”
రోస్ ఒకప్పుడు చేయగలిగినంత ఇప్పుడు చేయలేకపోతున్నానని బాధ పడినప్పుడు, 2 కొరింథీయులు 8:12లో ఉన్న మాటలు ఆమెకు ఓదార్పును ఇచ్చాయి: “మనస్ఫూర్తిగా ఇచ్చే విరాళాలను దేవుడు ఎంతో ఇష్టపడతాడు. ఎందుకంటే ఒక వ్యక్తి ఇవ్వగలిగేదాన్నే దేవుడు అతని నుండి ఆశిస్తాడు కానీ ఇవ్వలేనిదాన్ని కాదు.” ఆ మాటలు ఇప్పుడు ఆమె చేయగలుతున్నది చూసి దేవుడు సంతోషిస్తాడని రోస్‌కి గుర్తుచేశాయి, ఎందుకంటే, ఆమెకున్న పరిమితుల్లో ఆమె చేయగలిగినదంతా ఆమె చేస్తుంది.
దుఃఖం
ముందు మాట్లాడుకున్న దియా ఇలా గుర్తు చేసుకుంటుంది: “నా 18 సంవత్సరాల కూతురు చనిపోయినప్పుడు కలిగిన బాధను తట్టుకోలేకపోయాను, అసలు నేను బ్రతకగలనని అనుకోలేదు. అంతా ఒక్కసారిగా మారిపోయింది.” ఆమెకు కీర్తన 94:19లో మాటలు ఎంతో ఓదార్పును ఇచ్చాయి, అక్కడ కీర్తనకర్త దేవునితో ఇలా అన్నాడు: ఆందోళనలు నన్ను ముంచేసినప్పుడు నువ్వు నన్ను ఓదార్చావు, ఉపశమనం ఇచ్చావు. ఆమె ఇలా చెప్తుంది, “నా నొప్పిని తగ్గించుకోవడానికి ఏమి చేయాలో తెలుసుకునేలా సహాయం చేయమని యెహోవాకు ప్రార్థించాను.”
ఆమె స్వచ్ఛంద సేవ చేస్తూ బిజీగా ఉంది. కొంత కాలానికి, ఆమె తన గురించి ఇలా అనుకోవడం మొదలుపెట్టింది. చిన్నపిల్లలు రంగులు వేసుకునే క్రేయాన్స్ విరిగిపోయినా ఇంకా ఉపయోగపడతాయి. అదేవిధంగా, తన జీవితం ముక్కలు అయినట్లుగా ఆమె అనుకుంటున్నా, ఆమె ఇంకా ఇతరులకు సహాయం చేయగలదు అని తెలుసుకుంది. ఆమె ఇలా గుర్తుచేసుకుంటుంది: “నా దగ్గర బైబిలు నేర్చుకునే వాళ్లను ఓదార్చడానికి బైబిలు సలహాలను ఉపయోగించినప్పుడు, లేఖనాలు ప్రకారం ఆలోచించడం వాళ్లకు నేర్పించినప్పుడు వెంటనే నాకు ఒక విషయం అర్థం అయ్యింది. యెహోవా నాకు ఆ విధంగా ఉపశమనం ఇస్తూ నన్ను ఓదారుస్తున్నాడు.” బైబిల్లో ఎంతో బాధను అనుభవించిన వాళ్ల పేర్లను ఆమె రాసి పెట్టుకుంది. “నిస్సందేహంగా వాళ్లంతా ఎంతో ఎక్కువగా ప్రార్థన చేసినవాళ్లే” అని ఆమె తెలుసుకుంది. “అయినా మీ బైబిలు మూసేసి ఉంటే మీకు ఏ సహాయం దొరకదు” అని కూడా ఆమె తెలుసుకుంది.
బైబిల్ని చదవడం ద్వారా దియా మరో విషయాన్ని కూడా నేర్చుకుంది. జరిగిపోయినవాటి గురించి ఆలోచించకుండా భవిష్యత్తు మీద మనసు పెట్టాలని తెలుసుకుంది. అపొస్తలుల కార్యాలు 24:15లో ఉన్న విషయాలు ఆమెను ఓదార్చాయి: ‘నీతిమంతుల్ని, అనీతిమంతుల్ని దేవుడు పునరుత్థానం చేస్తాడు.’ యెహోవా ఆమె కూతుర్ని తిరిగి బ్రతికిస్తాడని ఆమె ఎంతవరకు నమ్మింది? దియా జవాబు చూడండి: “నా కూతుర్ని భవిష్యత్తులో చూస్తాను. మేము కలుసుకోబోయే ‘రోజు’ ఏదో నా తండ్రి కాలెండర్‌లో ఇప్పటికే ఉంది. నా కూతురు పుట్టినప్పుడు ఆమెను చూసి నేను ఎంతగా ప్రేమించానో మళ్లీ అలానే మా ఇద్దర్నీ నేను మా తోటలో స్పష్టంగా చూస్తున్నాను.”
a అలాంటి ఎన్నో రికార్డింగ్‌లు jw.org వెబ్‌సైట్‌లో ఉన్నాయి.
దిక్కుతోచని సమయాల్లో కూడా ఓదార్పును పొందడానికి బైబిలు సహాయం చేస్తుంది