కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w17 జూన్‌ పేజీలు 4-8
  • కష్టాలన్నిటిలో యెహోవా మనల్ని ఓదారుస్తాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • కష్టాలన్నిటిలో యెహోవా మనల్ని ఓదారుస్తాడు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • భార్యాభర్తల మధ్య సమస్యలు
  • కష్టాల్లో ఓదార్పు పొందడం
  • కుటుంబాలకు ఓదార్పు
  • ‘సమస్తమైన ఆదరణ అనుగ్రహించే దేవుడైన’ యెహోవాపై నమ్మకం ఉంచండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • దుఃఖిస్తున్నవారిని ఓదార్చండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • ‘దుఃఖిస్తున్న వాళ్ళందర్నీ ఓదార్చండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • లైంగిక దాడికి గురైనవాళ్లకు ఓదార్పును ఇవ్వడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
w17 జూన్‌ పేజీలు 4-8
ప్రార్థిస్తున్న హన్నా

కష్టాలన్నిటిలో యెహోవా మనల్ని ఓదారుస్తాడు

‘ఓదార్పును ఇచ్చే దేవుడు మన కష్టాలన్నిటిలో మనల్ని ఓదారుస్తాడు.’ —2 కొరిం. 1:3, 4.

పాటలు: 38, 6

మీరెలా జవాబిస్తారు?

  • భార్యాభర్తల మధ్య అలాగే కుటుంబంలో సమస్యలు ఎందుకు వస్తాయి?

  • గతంలోని కొంతమంది దేవుని సేవకులు ప్రార్థన చేయడంవల్ల ఎలా ఓదార్పు పొందారు?

  • ఇతరుల్ని మీరెలా ఓదార్చవచ్చు?

1, 2. కష్టాల్లో ఉన్నప్పుడు యెహోవా మనల్ని ఎలా ఓదారుస్తాడు? ఆయన వాక్యంలో మనం ఏ అభయాన్ని చూస్తాం?

పెళ్లికాని ఒక యువ సహోదరుడు, 1 కొరింథీయులు 7:28⁠లో ఉన్న మాటల గురించి ఆలోచించాడు. పెళ్లి చేసుకునేవాళ్లకు “శరీర సంబంధమైన శ్రమలు వస్తాయి” అని ఆ లేఖనంలో ఉంది. దాంతో ఆ సహోదరుడు, పెళ్లయిన ఒక వృద్ధ సంఘపెద్ద దగ్గరకు వెళ్లి, “పెళ్లయినవాళ్లకు వచ్చే ‘శ్రమలు’ ఏమిటి? ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటే వాటిని ఎలా ఎదుర్కోవాలి?” అని అడిగాడు. ఆ ప్రశ్నకు సంఘపెద్ద సమాధానం చెప్పే ముందు, పౌలు రాసిన మరో విషయం గురించి ఆలోచించమని అతనికి చెప్పాడు. అదేమిటంటే, యెహోవా “ఓదార్పును ఇచ్చే దేవుడు. ఆయన మన కష్టాలన్నిటిలో [“శ్రమలన్నిటిలో,” అధస్సూచి] మనల్ని ఓదారుస్తాడు.”—2 కొరిం. 1:3, 4.

2 మన తండ్రైన యెహోవాకు మనమంటే ఇష్టమని, మనకు కష్టాలు వచ్చినప్పుడు ఆయన ఓదారుస్తాడని మనకు తెలుసు. యెహోవా తన వాక్యం ద్వారా మీకు సహాయం చేసిన, మిమ్మల్ని నడిపించిన సందర్భాలు మీకు గుర్తుండేవుంటాయి. ఆయన ఎప్పుడూ మన మంచినే కోరుకుంటాడని నమ్మవచ్చు ఎందుకంటే గతంలోని తన సేవకులకు కూడా ఆయన మంచే చేశాడు.—యిర్మీయా 29:11, 12 చదవండి.

3. ఈ ఆర్టికల్‌లో మనం ఏ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటాం?

3 అసలు మనకు సమస్యలు, శ్రమలు ఎందుకు వస్తున్నాయో తెలుసుకుంటే వాటిని తేలిగ్గా సహించగలుగుతాం. ఇంతకీ భార్యాభర్తల మధ్య అలాగే కుటుంబంలో సమస్యలు ఎందుకు వస్తాయి? బైబిల్లో అలాగే మనకాలంలో ఉన్న ఏ ఉదాహరణల నుండి మనం ఓదార్పు పొందవచ్చు? ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటూ, కష్టాలను ఎలా సహించవచ్చో నేర్చుకుందాం.

భార్యాభర్తల మధ్య సమస్యలు

4, 5. భార్యాభర్తలకు ఎలాంటి శ్రమలు రావచ్చు?

4 యెహోవా మొదటి స్త్రీని సృష్టించి, ఆమెను పురుషుని దగ్గరకు తీసుకెళ్లినప్పుడు ఆమె అతనికి భార్య అయ్యింది. అప్పుడు యెహోవా ఇలా అన్నాడు, ‘పురుషుడు తన అమ్మానాన్నల్ని విడిచిపెట్టి, తన భార్యను అంటిపెట్టుకొని ఉంటాడు, వాళ్లు ఒక్క శరీరం అవుతారు.’ (ఆది. 2:24, NW) నిజానికి మనందరం అపరిపూర్ణులం. (రోమా. 3:23) అందుకే, స్త్రీపురుషులు పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ల మధ్య సమస్యలు వస్తాయి. ఉదాహరణకు అమ్మాయి విషయమే తీసుకుంటే, పెళ్లి అవ్వకముందు ఆమె తన అమ్మానాన్నల మాట వింటుంది. కానీ పెళ్లయిన తర్వాత భర్త ఆమెకు శిరస్సు అవుతాడని బైబిలు చెప్తుంది. (1 కొరిం. 11:3) అబ్బాయికి మొదట్లో, తన భార్యకు నిర్దేశాలివ్వడం కష్టంగా అనిపించవచ్చు. అలాగే అప్పటివరకు అమ్మానాన్నల మాట విన్న అమ్మాయికి, ఇప్పటినుండి భర్త మాట వినాలంటే కష్టంగా అనిపించవచ్చు. అంతేకాదు, పెళ్లయిన తర్వాత భార్యభర్తలిద్దరికీ తమ అత్తామామలతో అభిప్రాయభేదాలు రావచ్చు. కాబట్టి అది కూడా ఒక శ్రమలా మారవచ్చు.

5 తాము అమ్మానాన్నలం అవ్వబోతున్నామని తెలియగానే భార్యాభర్తల్లో కలిగే సంతోషం గురించి ఒకసారి ఆలోచించండి. అయితే వాళ్లు కాస్త ఆందోళనపడతారు కూడా. గర్భంతో ఉన్నప్పుడు వచ్చే అనారోగ్యం గురించి, బిడ్డ ఆరోగ్యం గురించి, పిల్లలు పుట్టాక పెరిగే ఖర్చుల గురించి వాళ్లు ఆందోళనపడుతుంటారు. పిల్లలు పుట్టాక భార్యాభర్తలు ఇంకొన్ని మార్పులు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. తల్లికి ఎక్కువ సమయం బిడ్డను చూసుకోవడంతోనే సరిపోతుంది. కాబట్టి భార్యాభర్తలు అంతకుముందులా ఒకరి గురించి ఒకరు పట్టించుకోవడం ఇప్పుడు కుదరకపోవచ్చు. తండ్రి బాధ్యతలు కూడా పెరుగుతాయి. తన భార్యాబిడ్డల అవసరాలన్నీ అతను తీర్చాలి.

6-8. పిల్లలులేని భార్యాభర్తల భావాలు ఎలా ఉంటాయి?

6 ఇంకొంతమంది భార్యాభర్తలకు ఎదురయ్యే మరో రకమైన శ్రమ ఏమిటంటే పిల్లలు పుట్టకపోవడం. పిల్లలు పుట్టనప్పుడు భార్య చాలా వేదనకు గురౌతుంది. (సామె. 13:12) బైబిలు కాలాల్లో, పిల్లలులేని స్త్రీలను చాలా చులకనగా చూసేవాళ్లు. అందుకే, యాకోబు భార్యయైన రాహేలు తన అక్కకు పిల్లలు పుట్టి తనకు పుట్టనందుకు చాలా బాధపడింది. (ఆది. 30:1, 2) నేడు కొన్ని దేశాల్లో, ఎక్కువమంది పిల్లలు ఉండడం చాలా ప్రాముఖ్యమని అనుకుంటారు. అలాంటి దేశాల్లో ఉంటున్న మిషనరీలను అక్కడివాళ్లు, మీకు పిల్లలు ఎందుకు లేరని తరచూ అడుగుతుంటారు. అప్పుడు మిషనరీలు వాళ్లకు అర్థమయ్యేలా ఎంత చక్కగా వివరించినప్పటికీ కొందరు ఇలా అంటారు, “అయ్యో, మీకు పిల్లలు పుట్టాలని ప్రార్థిస్తాం.”

7 మరో అనుభవాన్ని పరిశీలించండి. ఇంగ్లాండ్‌లోని ఒక సహోదరికి తల్లి అవ్వాలని చాలా ఆశగా ఉండేది. కానీ తనకు పిల్లల్ని కనే వయసు దాటిపోయిందని తెలిసినప్పుడు ఆమె తట్టుకోలేకపోయింది. అప్పుడు ఒక బిడ్డను దత్తత తీసుకోవాలని ఆమె, ఆమె భర్త నిర్ణయించుకున్నారు. అయినా ఆమెకు బాధ తగ్గలేదు. ఆమె ఇలా అంది, “దత్తత తీసుకోవడం, స్వయంగా బిడ్డకు జన్మనివ్వడం ఒకటి కాదని నాకు తెలుసు.”

8 “పిల్లల్ని కనడం ద్వారా స్త్రీ సురక్షితంగా ఉంటుంది” అని బైబిలు చెప్తుంది. (1 తిమో. 2:15) కానీ పిల్లలు ఉంటేనే ఆమెకు శాశ్వత జీవితం ఉంటుందని దానర్థం కాదు. మరి ఈ వచనాన్ని మనమెలా అర్థంచేసుకోవచ్చు? ఒక తల్లి తన పిల్లల్ని, ఇంటిని చూసుకుంటూ చాలా బిజీగా ఉంటుంది. దానివల్ల ఇతరుల గురించి లేనిపోనివి మాట్లాడడం, అనవసరమైన వాటిలో తలదూర్చడం వంటివాటికి దూరంగా ఉండగలుగుతుంది. (1 తిమో. 5:13) అయినాసరే తన వివాహ జీవితంలో, కుటుంబంలో ఆమెకు సమస్యలు రావచ్చు.

బాధలో ఉన్నప్పుడు తోటి సహోదరి ద్వారా, మీటింగ్స్‌ ద్వారా, పరిచర్య ద్వారా ఓదార్పును, సహాయాన్ని పొందుతున్న ఒక సహోదరి

వివాహజతను కోల్పోయిన బాధను ఎలా తట్టుకోవచ్చు? (9, 12 పేరాలు చూడండి)

9. భార్యాభర్తలకు ఎదురయ్యే ఇంకొక శ్రమ ఏమిటి?

9 మరికొంతమంది భార్యాభర్తలకు ఎదురయ్యే శ్రమ ఏమిటంటే తమ వివాహజత చనిపోవడం. అలా జరుగుతుందని ఎన్నడూ ఊహించనప్పటికీ ఆ కష్టతరమైన పరిస్థితిని చాలామంది ఎదుర్కోక తప్పలేదు. కానీ క్రైస్తవులు పునరుత్థాన నిరీక్షణను బలంగా నమ్ముతారు కాబట్టి వాళ్లు ఎంతో ఓదార్పును పొందుతారు. (యోహా. 5:28, 29) కష్టాల్లో ఉన్నప్పుడు మనకు ఓదార్పునిచ్చే యెహోవా వాగ్దానాలు ఎన్నో ఆయన వాక్యమైన బైబిల్లో ఉన్నాయి. వాటినుండి యెహోవా సేవకుల్లో కొందరు ఎలా ఓదార్పు పొందారో, ఆ ఓదార్పు నుండి వాళ్లెలా ప్రయోజనం పొందారో ఇప్పుడు పరిశీలిద్దాం.

కష్టాల్లో ఓదార్పు పొందడం

10. హన్నా ఎలా ఓదార్పును పొందింది? (ప్రారంభ చిత్రం చూడండి.)

10 ఎల్కానా భార్యయైన హన్నాకు ఎదురైన పరిస్థితిని పరిశీలించండి. ఆమె పిల్లల్ని కావాలనుకుంది కానీ పుట్టలేదు. తన సవతి పెనిన్నాకు మాత్రం చాలామంది పిల్లలు పుట్టారు. (1 సమూయేలు 1:4-7 చదవండి.) పైగా పెనిన్నా “ఏటేట” హన్నాను ఎగతాళి చేయడంవల్ల ఆమె బాధ మరింత ఎక్కువైంది. మరి ఓదార్పు కోసం హన్నా ఏమి చేసింది? ఆమె యెహోవాకు ప్రార్థించింది. ఆమె యెహోవా ఆలయానికి కూడా వెళ్లి ఎక్కువసేపు ప్రార్థన చేసేది. తనకు ఒక మగబిడ్డను ఇవ్వమని ఆమె యెహోవాను అడిగింది. ఆయన ఇస్తాడని కూడా నమ్మింది. అలా ప్రార్థించిన తర్వాత చాలావరకు ఆమె బాధ తగ్గి, ‘ఆమె ముఖం తర్వాత ఎప్పుడూ కృంగిపోయినట్లు లేదు.’ (1 సమూ. 1:12, 17, 18, NW) యెహోవా తనకు మగ బిడ్డను ఇస్తాడని లేదా మరో విధంగానైనా తనను ఓదారుస్తాడని హన్నాకు తెలుసు.

11. ఓదార్పు పొందాలంటే ప్రార్థన ఎలా చేయాలి?

11 మనం అపరిపూర్ణులం పైగా సాతాను లోకంలో జీవిస్తున్నాం కాబట్టి మనకు శ్రమలు లేదా సమస్యలు వస్తూనే ఉంటాయి. (1 యోహా. 5:19) కానీ సహాయం పొందడానికి ఒక మార్గం ఉంది. ‘ఓదార్పును ఇచ్చే దేవుడైన’ యెహోవాకు మనం ప్రార్థించవచ్చు. హన్నా అదే చేసింది. ఆమె తన మనసులో ఉన్న బాధంతా యెహోవాకు వివరంగా చెప్పి, సహాయం చేయమని వేడుకుంది. అదేవిధంగా, మనం బాధపడుతున్నప్పుడు మన సమస్యల గురించి ప్రార్థనలో కేవలం ప్రస్తావిస్తే సరిపోదు. సహాయం కోసం యెహోవాను వేడుకోవాలి, మనకు మనసులో ఎలా అనిపిస్తుందో ఆయనకు వివరంగా చెప్పాలి.—ఫిలి. 4:6, 7.

12. కష్టాల్లో కూడా సంతోషంగా ఉండడానికి అన్నకు ఏది సహాయం చేసింది?

12 పిల్లలు పుట్టనప్పుడు లేదా వివాహజత చనిపోయినప్పుడు చాలా వేదన కలగవచ్చు. అయినప్పటికీ, మనకు ఓదార్పు దొరకుతుంది. ప్రాచీన కాలంలో జీవించిన అన్న గురించి ఆలోచించండి. పెళ్లయిన ఏడు సంవత్సరాలకే ఆమె భర్తను పోగొట్టుకుంది. బహుశా ఆమెకు పిల్లలు కూడా లేకపోయి ఉండవచ్చు. మరి ఆమెకు ఏది సహాయం చేసింది? “ఆమె మానకుండా ఆలయానికి వెళ్తూ” ఉండేది. 84 ఏళ్ల వయసులో కూడా ప్రార్థన చేయడానికి, యెహోవాను ఆరాధించడానికి ఆమె ఆలయానికి వెళ్లేది. (లూకా 2:37) కష్టాల్లో ఉన్నప్పుడు అదే ఆమెకు ఓదార్పునిచ్చింది, సంతోషంగా ఉండడానికి సహాయం చేసింది.

13. మన బంధువులు మనల్ని నిరుత్సాహపర్చినా నిజమైన స్నేహితులు మనకు ఎలా ఓదార్పునిస్తారు?

13 సంఘంలో దొరికే నిజమైన స్నేహితుల నుండి కూడా మనం ఓదార్పు పొందవచ్చు. (సామె. 18:24) పౌల అనే సహోదరికి ఐదేళ్లు ఉన్నప్పుడు ఆమె అమ్మ యెహోవాను సేవించడం ఆపేసింది. పౌలకు చాలా బాధనిపించింది. కొంతకాలానికి ఆన్‌ అనే పయినీరు సహోదరి పౌలను కలిసి, ప్రోత్సహించి, బైబిల్‌ స్టడీ ప్రారంభించింది. “ఆన్‌ నాకు బంధువు కాకపోయినా, ఆమె చూపించిన ప్రేమపూర్వక శ్రద్ధ నాకు చాలా ఓదార్పునిచ్చింది. నేను యెహోవాను ఆరాధిస్తూ ఉండడానికి అది నాకు సహాయం చేసింది” అని పౌల వివరించింది. ఆ తర్వాత, పౌల వాళ్ల అమ్మ మళ్లీ మీటింగ్స్‌కు రావడం మొదలుపెట్టింది. ఇప్పుడు పౌల చాలా సంతోషంగా ఉంది. యెహోవాను సేవించేలా పౌలకు సహాయం చేయగలిగినందుకు ఆన్‌కి కూడా సంతోషంగా అనిపించింది.

14. ఇతరుల్ని ఓదార్చడం ద్వారా మనమెలా ప్రయోజనం పొందుతాం?

14 మనం ఇతరులకు సహాయం చేయడంలో బిజీగా ఉన్నప్పుడు మన సమస్యల గురించి ఎక్కువ ఆలోచించం. ఉదాహరణకు పెళ్లయిన, పెళ్లికాని చాలామంది సహోదరీలు ఇతరులకు దేవుని రాజ్యం గురించిన మంచివార్తను ప్రకటిస్తున్నారు. అలా ప్రకటించడం వల్ల తాము యెహోవాతో కలిసి పని చేస్తున్నామని, ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తున్నామని వాళ్లు గుర్తిస్తారు. అది వాళ్లకు సంతోషాన్నిస్తుంది. నిజానికి, మనందరం మంచివార్తను ప్రకటించడం ద్వారా ఇతరుల పట్ల మనకు శ్రద్ధ ఉందని చూపించవచ్చు. అంతేకాదు, మన సహోదరసహోదరీల పట్ల కూడా శ్రద్ధ చూపించినప్పుడు వాళ్లకు మరింత దగ్గరౌతాం. (ఫిలి. 2:4) అపొస్తలుడైన పౌలు కూడా అలాగే చేశాడు. “పాలిచ్చే తల్లి తన పిల్లల్ని అపురూపంగా చూసుకున్నట్టు” పౌలు ఇతరులను శ్రద్ధగా చూసుకున్నాడు. అంతేకాదు, “తండ్రి తన పిల్లలతో వ్యవహరించినట్టు” అతను సహోదరులను ఓదార్చి, ప్రోత్సహించాడు.—1 థెస్సలొనీకయులు 2:7, 11, 12 చదవండి.

కుటుంబాలకు ఓదార్పు

15. యెహోవా గురించి పిల్లలకు నేర్పించే బాధ్యత ఎవరిది?

15 సంఘంలోని కుటుంబాలను మనమెలా ఓదార్చవచ్చు? మీటింగ్స్‌కు కొత్తగా వస్తున్నవాళ్లు, తమ పిల్లలకు యెహోవా గురించి నేర్పించే విషయంలో కొన్నిసార్లు మన సహాయం కోరవచ్చు లేదా తమ పిల్లలకు బైబిలు స్టడీ చేయమని మనల్ని అడగవచ్చు. అయితే పిల్లలకు బోధించి, శిక్షణనిచ్చే బాధ్యత యెహోవా అమ్మానాన్నలకే ఇచ్చాడని బైబిలు చెప్తుంది. (సామె. 23:22; ఎఫె. 6:1-4) కొన్ని సందర్భాల్లో పిల్లలకు బోధించడంలో ఇతరులు సహాయం చేసినప్పటికీ, అమ్మానాన్నలే తమ పిల్లలకు బోధించాలి. వాళ్లు పిల్లలతో మాట్లాడుతూ వాళ్ల మనసుల్లో ఏముందో తెలుసుకోవాలి.

16. వేరేవాళ్ల పిల్లలకు స్టడీ ఇస్తున్నప్పుడు మనమేమి గుర్తుంచుకోవాలి?

16 ఎవరైనా తమ పిల్లలకు బైబిలు స్టడీ చేయమని మనల్ని అడిగినప్పుడు, పిల్లలపై తల్లిదండ్రులకు ఉన్నంత అధికారం మనకు ఉండదని గుర్తుంచుకోవడం మంచిది. కొన్నిసార్లు సత్యంలోలేని తల్లిదండ్రుల పిల్లలకు కూడా మనం స్టడీ చేయాల్సిరావచ్చు. కాబట్టి, వేరేవాళ్ల పిల్లలకు స్టడీ చేస్తున్నప్పుడు వాళ్ల ఇంట్లోనే వాళ్ల తల్లిదండ్రుల సమక్షంలో లేదా పరిణతిగల సాక్షి సమక్షంలో స్టడీ చేయడం మంచిది. లేదా అందరికీ కనబడే చోట స్టడీ చేయడం మంచిది. అప్పుడు చూసేవాళ్లు కూడా తప్పుగా అనుకోరు. కొంతకాలం గడిచాక, బహుశా తల్లిదండ్రులే తమ పిల్లల ఆధ్యాత్మిక అవసరాల్ని తీర్చవచ్చు.

17. పిల్లలు తమ కుటుంబ సభ్యులకు ఎలా ఓదార్పుగా ఉండవచ్చు?

17 యెహోవా గురించి నేర్చుకుని ఆయన్ను ప్రేమిస్తున్న పిల్లలు తమ కుటుంబ సభ్యులను ఓదార్చవచ్చు, ప్రోత్సహించవచ్చు. ఎలా? తమ అమ్మానాన్నలను గౌరవించడం ద్వారా, వాళ్ల పనుల్లో సహాయం చేయడం ద్వారా అలా చేయవచ్చు. అంతేకాదు పిల్లలు యెహోవాకు నమ్మకంగా ఉన్నప్పుడు అది కుటుంబ సభ్యులందరికీ ప్రోత్సాహకరంగా ఉంటుంది. జలప్రళయం రాకముందు జీవించిన లెమెకు యెహోవాను ఆరాధించాడు. తన కొడుకైన నోవహు గురించి అతను ఇలా అన్నాడు, ‘యెహోవా శపించిన ఈ నేల వల్ల మనం పడుతున్న ప్రయాస నుండి, వేదనతో కూడిన మన చేతుల కష్టం నుండి ఇతను మనకు ఊరటను ఇస్తాడు.’ యెహోవా, జలప్రళయం తర్వాత నేలకున్న శాపాన్ని తీసేసినప్పుడు ఈ ప్రవచనం నెరవేరింది. (ఆది. 5:29, NW; 8:21) కాబట్టి నేడు, యెహోవాకు నమ్మకంగా ఉండే పిల్లలు కూడా తమ కుటుంబ సభ్యులకు ఓదార్పుగా ఉంటారు. అంతేకాదు ఇప్పుడు అలాగే భవిష్యత్తులో వచ్చే కష్టాలను తట్టుకోవడానికి తమ కుటుంబంలోని ప్రతీఒక్కరికి వాళ్లు సహాయం చేయగలుగుతారు.

18. ఎలాంటి కష్టాన్నైనా సహించడానికి ఏవి మనకు సహాయం చేస్తాయి?

18 ప్రార్థన ద్వారా, బైబిల్లో ఉన్న ఉదాహరణల గురించి ధ్యానించడం ద్వారా, తోటి సహోదరసహోదరీలతో స్నేహం చేయడం ద్వారా యెహోవా ప్రజలు ఓదార్పు పొందుతున్నారు. (కీర్తన 145:18, 19 చదవండి.) మనకు సహాయం చేయడానికి యెహోవా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడని మనకు తెలుసు. అంతేకాదు మనకు వచ్చే ఎలాంటి కష్టాన్నైనా సహించడానికి ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి