అణకువ ఎందుకు ప్రాముఖ్యం?
“వినయముగలవారియొద్ద [అణకువగలవారియొద్ద, NW] జ్ఞానమున్నది.”—సామె. 11:2.
1, 2. దేవుడు సౌలును ఎందుకు తిరస్కరించాడు? (ప్రారంభ చిత్రం చూడండి.)
యెహోవా సౌలును రాజుగా ఎంపిక చేసుకున్నప్పుడు, అతను అణకువగా ఉండేవాడు. (1 సమూ. 9:1, 2, 21; 10:20-24) కానీ రాజైన తర్వాత, అతనిలో అహంకారం మొదలైంది. ఒక సందర్భంలో, వేలమంది ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల మీద యుద్ధానికి వచ్చారు. అప్పుడు సమూయేలు ప్రవక్త తాను వచ్చి యెహోవాకు బలి అర్పిస్తానని సౌలుకు చెప్పాడు. కానీ, సమూయేలు రాక ముందే, ఇశ్రాయేలీయుల్లో చాలామంది భయంతో సౌలును వదిలి వెళ్లిపోయారు. దాంతో సహనం కోల్పోయిన సౌలు, సమూయేలు కోసం ఎదురుచూసే బదులు తానే బలి అర్పించాడు. నిజానికి, అలా చేసే అధికారం సౌలుకు లేదు, యెహోవాకు కూడా అతను చేసిన పని నచ్చలేదు.—1 సమూ. 13:5-9.
2 సమూయేలు వచ్చాక, యెహోవాకు అవిధేయత చూపించినందుకు సౌలును గద్దించాడు. కానీ తాను ఏ తప్పు చేయలేదని సౌలు అనుకున్నాడు. అతను సాకులు చెప్తూ తన తప్పును ఇతరుల మీద నెట్టడానికి ప్రయత్నించాడు. (1 సమూ. 13:10-14) అప్పటినుండి, సౌలు అహంకారంతో చాలా పనులు చేశాడు. అందుకే యెహోవా అతన్ని రాజుగా తిరస్కరించాడు. (1 సమూ. 15:22, 23) ఎంతో చక్కగా ప్రారంభమైన సౌలు జీవితం విషాదంగా ముగిసింది.—1 సమూ. 31:1-6.
3.(ఎ) అణకువ అనే లక్షణం గురించి చాలామంది ఏమనుకుంటున్నారు? (బి) మనం ఏ ప్రశ్నలు పరిశీలిస్తాం?
3 అణకువగా ఉంటే తాము జీవితంలో పైకి రాలేమని, లేదా విజయం సాధించలేమని నేడు చాలామంది అనుకుంటారు. అంతేకాదు తాము ఇతరులకన్నా పైస్థానంలో ఉన్నామని చూపించుకోవడానికి గొప్పలు చెప్పుకుంటారు. ఉదాహరణకు ఒక ప్రఖ్యాత నటుడు, రాజకీయ నాయకుడైన ఒకతను ఇలా చెప్పాడు, “ఏవిధంగానూ అణకువ అనే పదం నాకు వర్తించదు. భవిష్యత్తులో కూడా ఎన్నడూ వర్తించదని అనుకుంటున్నాను.” ఇంతకీ ఒక క్రైస్తవుడు అణకువగా ఉండడం ఎందుకు ప్రాముఖ్యం? అణకువగా ఉండడం అంటే ఏమిటి? అణకువగా ఉండడం అంటే ఏమి కాదు? వీటికి ఈ ఆర్టికల్‌లో జవాబులు తెలుసుకుంటాం. తర్వాతి ఆర్టికల్‌లో, అణకువగా ఉండడం కష్టంగా ఉండే సందర్భాల్లో కూడా మనమెలా అణకువగా ఉండవచ్చో తెలుసుకుంటాం.
అణకువగా ఉండడం ఎందుకు ప్రాముఖ్యం?
4. అహంకారంతో ప్రవర్తించడం అంటే ఏమిటి?
4 అహంకారం అణకువకు లేదా వినయానికి వ్యతిరేకమని బైబిలు చెప్తుంది. (సామెతలు 11:2 చదవండి.) “దురభిమాన [అహంకార, NW] పాపములలో పడకుండ నీ సేవకుని ఆపుము” అని దావీదు యెహోవాను వేడుకున్నాడు. (కీర్త. 19:13) అహంకారంతో ప్రవర్తించడం అంటే ఏమిటి? బహుశా సహనాన్ని కోల్పోవడం వల్ల లేదా గర్వం వల్ల, ఏదైనా పని చేసే హక్కు లేదా అధికారం మనకు లేకపోయినా దాన్ని చేస్తే అహంకారంతో ప్రవర్తించినట్లు అవుతుంది. మనమందరం అపరిపూర్ణులం కాబట్టి ఏదోక సందర్భంలో అహంకారంగా ప్రవర్తించి ఉంటాం. కానీ రాజైన సౌలు నుండి నేర్చుకున్నట్టుగా, ఒకవేళ అలా ప్రవర్తించడం అలవాటుగా తయారైతే మాత్రం యెహోవా సంతోషించడు. “గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు” అని కీర్తన 119:21 యెహోవా గురించి చెప్తుంది. ఆయన ఎందుకు వాళ్లను గద్దిస్తున్నాడు?
5. అహంకారంతో ప్రవర్తించడం ఘోరమైన తప్పని ఎందుకు చెప్పవచ్చు?
5 మనం అహంకారంతో ఏదైన చేస్తే, మొదటిగా మన దేవుడు, పరిపాలకుడైన యెహోవా మీద గౌరవం లేదని చూపిస్తాం. రెండవదిగా, మనకు ఫలానా పని చేసే అధికారం లేకపోయినా దాన్ని చేస్తే ఇతరులతో వాదనలు, అభిప్రాయభేదాలు రావచ్చు. (సామె. 13:10) మూడవదిగా, మనం అహంకారంతో ఏదైన చేశామని ఇతరులు గుర్తించినప్పుడు మనల్ని వెర్రివాళ్లలా చూస్తారు. (లూకా 14:8, 9) కాబట్టి, మనం ఎందుకు అణకువగా ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడో దీన్నిబట్టి స్పష్టంగా అర్థంచేసుకోవచ్చు.
అణకువగా ఉండడం అంటే ఏమిటి?
6, 7. అణకువకు, వినయానికి ఉన్న సంబంధం ఏమిటి?
6 అణకువకు, వినయానికి దగ్గరి సంబంధం ఉంది. వినయంగా ఉండే వ్యక్తి గర్వం చూపించడుగానీ ఇతరుల్ని తనకన్నా గొప్పవాళ్లుగా ఎంచుతాడు. దాన్నే “దీనమనస్సు” అని బైబిలు వర్ణిస్తుంది. (ఫిలి. 2:3, అధస్సూచి) వినయంగల వ్యక్తి సాధారణంగా అణకువగా కూడా ఉంటాడు. అతను తన పరిమితుల్ని గుర్తిస్తాడు, తన పొరపాట్లను వినయంగా ఒప్పుకుంటాడు. ఇతరులు చెప్పేది వినడానికి ఇష్టపడతాడు, వాళ్లను చూసి నేర్చుకుంటాడు. అలాంటి వ్యక్తిని చూసి యెహోవా చాలా సంతోషిస్తాడు.
7 అణకువగల వ్యక్తికి తన గురించి తనకు తెలుసని, తాను చేయలేనివి లేదా చేయకూడనివి కొన్ని ఉన్నాయని గుర్తిస్తాడని బైబిలు చెప్తోంది. దానివల్ల అతను ఇతరులతో గౌరవంగా, దయగా ప్రవర్తించగలుగుతాడు.
8. మనం ఎప్పుడూ అణకువగా ఉండాలంటే ఎలాంటి ఆలోచనలకు దూరంగా ఉండాలి?
8 అయినా, మనకు తెలియకుండానే మనం అహంకారంగా ఆలోచించడం మొదలుపెట్టే అవకాశం ఉంది. అదెలా? మనకో లేదా మనకు బాగా తెలిసినవాళ్లకో సంఘంలో కొన్ని బాధ్యతలు ఉండడంవల్ల మనం ఇతరులకన్నా చాలా ప్రాముఖ్యమైన వాళ్లమని అనుకోవడం మొదలుపెట్టవచ్చు. (రోమా. 12:16) లేదా మన గురించి మనం అతిగా ఆలోచించడం మొదలుపెట్టవచ్చు. (1 తిమో. 2:9, 10) అంతేకాదు ఇతరులు ఏమి చేయాలో, ఏమి చేయకూడదో కూడా మనం చెప్పడం మొదలుపెట్టే అవకాశం ఉంది.—1 కొరిం. 4:6.
9. కొంతమంది ఎందుకు అహంకారులుగా మారారు? బైబిల్లో ఉన్న ఒక ఉదాహరణ చెప్పండి.
9 మన తప్పుడు కోరికలను అదుపు చేసుకోకపోతే అహంకారంగా ప్రవర్తించడం మొదలుపెట్టే ప్రమాదం ఉంది. చాలామంది గొప్ప పేరు ఆశించడం వల్ల, ఇతరుల మీద ఈర్ష్యపడడం వల్ల లేదా తమ కోపాన్ని అదుపు చేసుకోకపోవడం వల్ల అహంకారులుగా మారారు. బైబిల్లో చెప్పబడిన అబ్షాలోము, ఉజ్జియా, నెబుకద్నెజరు లాంటి కొంతమందికి అలాగే జరిగింది. అయితే, వాళ్లకు వినయం అవసరమని గుర్తించేలా యెహోవా చేశాడు.—2 సమూ. 15:1-6; 18:9-17; 2 దిన. 26:16-21; దాని. 5:18-21.
10. ఇతరుల ఉద్దేశాల గురించి మనమెందుకు ఓ అభిప్రాయానికి రాకూడదు? బైబిల్లో ఉన్న ఓ ఉదాహరణ చెప్పండి.
10 ప్రజలు కొన్నిసార్లు అణకువగా ఉండకపోవడానికి వేరే కారణాలు ఉండవచ్చు. అబీమెలెకు, పేతురుల విషయాన్నే తీసుకోండి. (ఆది. 20:2-7; మత్త. 26:31-35) వాళ్లు అహంకారులా? లేదా వాస్తవాలన్నీ తెలియకపోవడం వల్లనో, అనాలోచితంగానో వాళ్లు అలా ప్రవర్తించారా? మనకు హృదయాలను చదివే సామర్థ్యం లేదు కాబట్టి ఇతరుల ఉద్దేశాల గురించి మనం ఓ అభిప్రాయానికి రాకూడదు.—యాకోబు 4:12 చదవండి.
దేవుని ఏర్పాటులో మీ స్థానం
11. మనం ఏ విషయాన్ని అర్థంచేసుకోవాలి?
11 అణకువగల వ్యక్తి దేవుని ఏర్పాటులో తన స్థానం ఏమిటో అర్థంచేసుకుంటాడు. యెహోవా క్రమముగల దేవుడు. ఆయన సంఘంలోని ప్రతీఒక్కరికి ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చాడు. కాబట్టి మనందరం ప్రాముఖ్యమైనవాళ్లమే. యెహోవా తన అపారదయతో మనలో ప్రతీఒక్కరికి వేర్వేరు వరాలను, నైపుణ్యాలను, తెలివితేటలను లేదా సామర్థ్యాలను ఇచ్చాడు. మనకు అణకువ ఉంటే, యెహోవా కోరే విధంగా మన వరాలను ఉపయోగిస్తాం. (రోమా. 12:4-8) మనం వాటిని తనను ఘనపర్చడానికి, ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగించాలనేదే యెహోవా కోరికని అర్థంచేసుకుంటాం.—1 పేతురు 4:10 చదవండి.
మన నియామకం మారినప్పుడు, యేసు నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? (12-14 పేరాలు చూడండి)
12, 13. యెహోవా సేవలో మనం మార్పులను ఎదుర్కొన్నప్పుడు ఏమి గుర్తుంచుకోవాలి?
12 రోజులు గడుస్తుండగా దేవుని ఏర్పాటులో మన స్థానం మారవచ్చు. ఉదాహరణకు, యేసు జీవితంలో వచ్చిన చాలా మార్పుల గురించి ఆలోచించండి. మొదటిగా, ఆయన ఒక్కడే తన తండ్రితో ఉన్నాడు. (సామె. 8:22) తర్వాత దేవదూతల్ని, విశ్వాన్ని, మనుషుల్ని చేయడానికి యెహోవాతో కలిసి పనిచేశాడు. (కొలొ. 1:16) కొంతకాలానికి దేవుడు ఆయన్ని భూమ్మీదకు పంపించాడు. అప్పుడు ఆయన ఓ శిశువుగా పుట్టి, పెరిగి పెద్దవాడయ్యాడు. (ఫిలి. 2:7) తన మరణం తర్వాత యేసు మళ్లీ పరలోకానికి వెళ్లిపోయాడు. 1914లో ఆయన దేవుని రాజ్యానికి రాజయ్యాడు. (హెబ్రీ. 2:9) భవిష్యత్తులో, యేసు వెయ్యి సంవత్సరాలు రాజుగా పరిపాలించిన తర్వాత “దేవుడే అన్నిటికీ అధికారిగా” ఉండేలా రాజ్యాన్ని తిరిగి యెహోవాకు అప్పగిస్తాడు.—1 కొరిం. 15:28.
13 మన జీవితంలో కూడా చాలా మార్పులు జరగడం మనం చూడవచ్చు. మన సొంత నిర్ణయాల వల్ల కొన్నిసార్లు మన బాధ్యతలు మారవచ్చు. ఉదాహరణకు, బహుశా ఒకప్పుడు ఒంటరిగా ఉన్న మనం, తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని ఉండవచ్చు. లేదా పిల్లలు పుట్టి ఉండవచ్చు. కొంతకాలానికి, పూర్తికాల సేవ చేసేందుకు వీలుగా కొన్ని మార్పులు చేసుకోవాలని నిర్ణయించుకొని ఉండవచ్చు. ఇంకొన్నిసార్లు మన పరిస్థితుల వల్ల మన బాధ్యతలు మారవచ్చు. దానివల్ల మనం ఎక్కువ సేవ చేయవచ్చు లేదా తక్కువ సేవ చేయాల్సి రావచ్చు. మనం యౌవనులమైనా-వృద్ధులమైనా, మన ఆరోగ్యం బాగున్నా-బాగోకపోయినా మనలో ప్రతీఒక్కరం యెహోవాకు ఎంత సేవ చేయగలమో ఆయనకు తెలుసు. అంతకన్నా ఎక్కువ చేయమని ఆయన మనల్ని అడగడు. అంతేకాదు మనం యెహోవా కోసం ఏమి చేసినా ఆయన చాలా సంతోషిస్తాడు.—హెబ్రీ. 6:10.
14. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సంతోషంగా ఉండేందుకు అణకువ ఎలా సహాయం చేస్తుంది?
14 యెహోవా ఏ నియామకం ఇచ్చినా యేసు సంతోషంగా చేశాడు. మనం కూడా అలాగే చేయవచ్చు. (సామె. 8:30, 31) అణకువగల వ్యక్తి సంఘంలో తనకున్న నియామకాలతో, బాధ్యతలతో తృప్తిపడతాడు. ఇతరులు ఏమి చేస్తున్నారనే దానిగురించి అతను ఎక్కువగా ఆలోచించడు. బదులుగా, దేవుని సంస్థలో తన స్థానాన్ని బట్టి తృప్తిపడతాడు. ఆ స్థానం యెహోవా నుండి వచ్చినదని అతను భావిస్తాడు. అణకువగల వ్యక్తి ఇతరులను గౌరవిస్తాడు, వాళ్లకు సంతోషంగా మద్దతిస్తాడు కూడా. యెహోవా ఇతరులకు కూడా ఒక స్థానాన్ని ఇచ్చాడని అతను గుర్తిస్తాడు.—రోమా. 12:10.
అణకువగా ఉండడం అంటే ఏమి కాదు?
15. గిద్యోను నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?
15 అణకువ చూపించడంలో గిద్యోను ఓ చక్కని ఆదర్శాన్ని ఉంచాడు. ఇశ్రాయేలీయుల్ని మిద్యానీయుల నుండి కాపాడే నియామకాన్ని యెహోవా గిద్యోనుకు ఇచ్చినప్పుడు అతను, “నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నికలేనిదే. నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై యున్నాను” అని అన్నాడు. (న్యాయా. 6:15) కానీ గిద్యోను యెహోవా మీద నమ్మకం ఉంచి తనకిచ్చిన నియామకాన్ని అంగీకరించాడు. తర్వాత యెహోవా తన నుండి ఏమి కోరుతున్నాడో అతను పూర్తిగా అర్థం చేసుకున్నాడు. నిర్దేశం కోసం యెహోవాకు ప్రార్థన కూడా చేశాడు. (న్యాయా. 6:36-40) గిద్యోనుకు చాలా బలం, ధైర్యం మాత్రమే కాదు తెలివి, జాగ్రత్త కూడా ఉన్నాయి. (న్యాయా. 6:11, 27) దాని తర్వాత, ప్రజలు అతన్ని తమ పరిపాలకునిగా ఉండమని అడిగినప్పుడు అతను దానికి ఒప్పుకోలేదు. యెహోవా చెప్పిన పని చేసిన తర్వాత అతను తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు.—న్యాయా. 8:22, 23, 29.
16, 17. అణకువగల వ్యక్తి ఎలా ప్రగతి సాధించవచ్చు?
16 అణకువ కలిగివుండడం అంటే కొత్త నియామకాల కోసం కృషి చేయకూడదని లేదా వాటిని అంగీకరించకూడదని కాదు. యెహోవా సేవకుడు, తన సహోదరులకు ఇంకా ఎక్కువ సేవ చేయాలని కోరుకోవడం, అభివృద్ధి లేదా ప్రగతి సాధించడం మంచిదని బైబిలు చెప్తోంది. (1 తిమో. 4:13-15) కానీ మనం ప్రగతి సాధించాలంటే ఓ కొత్త నియామకం అవసరమా? అవసరం లేదు. యెహోవాను మరింత బాగా సేవించడానికి, ఇతరులకు సహాయం చేయడానికి వీలుగా మనందరం క్రైస్తవ వ్యక్తిత్వాన్ని, మన సామర్థ్యాల్ని మెరుగుపర్చుకుంటూ ఉండవచ్చు.
17 ఒక నియామకాన్ని ఒప్పుకునే ముందు, అణకువగల వ్యక్తి తాను చేయాల్సినవి ఏమిటో తెలుసుకుంటాడు. అతను దాని గురించి ప్రార్థిస్తాడు, అలాగే తనకిచ్చిన పనిని చేయగలడో లేడో పరిశీలించుకుంటాడు. ఉదాహరణకు తన నియామకాన్ని చేస్తూనే, ప్రాముఖ్యమైన వేరే పనులు కూడా చేయడానికి సరిపడా సమయం, శక్తి ఉంటాయా? ఒకవేళ సమయం, శక్తి లేకపోతే ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న బాధ్యతల్లో కొన్నింటిని వేరే వాళ్లకు అప్పగించవచ్చా? అని ఆలోచించవచ్చు. ఒకవేళ వాటికి లేదు అనే జవాబు వస్తే అణకువగల వ్యక్తి కొత్త నియామకాన్ని సరిగ్గా చేయలేననే ముగింపుకు రావచ్చు. మనలో అణకువ ఉంటే, మనకు అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు కొత్త నియామకాన్ని చేయలేమని చెప్తాం.
18. (ఎ) తనకు ఓ కొత్త నియామకం ఇచ్చినప్పుడు, అణకువగల వ్యక్తి ఏమి చేస్తాడు? (బి) మనం అణకువగా ఉండడానికి రోమీయులు 12:3 ఎలా సహాయం చేస్తుంది?
18 మనం తనతో కలిసి ‘దీనమనస్సుతో’ లేదా అణకువ కలిగి నడవాలని యెహోవా కోరుకుంటున్నాడు. (మీకా 6:8) మనకు ఓ కొత్త నియామకం ఇచ్చినప్పుడు, మనం కూడా గిద్యోనులాగే యెహోవా నిర్దేశం కోసం చూస్తూ, ఆయన సహాయాన్ని అడుగుతాం. తన బైబిలు ద్వారా, సంస్థ ద్వారా యెహోవా మనకు ఏమి చెప్తున్నాడో లోతుగా ఆలోచించాలి. మనం యెహోవా సేవలో ఏదైన చేయగలుగుతున్నామంటే అది మన సొంత సామర్థ్యాన్నిబట్టి కాదుగానీ యెహోవా వినయంగా మనకు చేస్తున్న సహాయం వల్లేనని మనం గుర్తుంచుకోవాలి. (కీర్త. 18:35) అణకువగల వ్యక్తి “తన గురించి తాను ఎక్కువగా అంచనా” వేసుకోడు.—రోమీయులు 12:3 చదవండి.
19. మనం ఎందుకు అణకువగా ఉండాలి?
19 యెహోవా సృష్టికర్త, విశ్వంలోనే మహోన్నతుడు కాబట్టి ఆయనే సమస్త మహిమను పొందడానికి అర్హుడని అణకువగల వ్యక్తికి తెలుసు. (ప్రక. 4:11) మనకు అణకువ ఉంటే, యెహోవా సేవలో మనం చేయగలిగే దాన్నిబట్టి సంతోషిస్తాం. మన సహోదరసహోదరీల భావాలను, అభిప్రాయాలను గౌరవిస్తాం. దానివల్ల అందరం ఐక్యంగా ఉంటాం. అణకువగల వ్యక్తి ఏదైన చేసే ముందు ఆలోచిస్తాడు, దానివల్ల ఘోరమైన తప్పులు చేయకుండా ఉంటాడు. అణకువగా ఉండేవాళ్లను చూసి యెహోవా చాలా సంతోషిస్తాడు. ఈ కారణాలను బట్టి, దేవుని ప్రజలకు అణకువ ఉండడం చాలా ప్రాముఖ్యమని చెప్పవచ్చు. అణకువ చూపించడం కష్టంగా ఉన్న సందర్భాల్లో కూడా ఎలా అణకువగా ఉండవచ్చో తర్వాతి ఆర్టికల్‌లో తెలుసుకుంటాం.