జీవిత కథ
ఒకప్పటి నన్స్ నిజమైన ఆధ్యాత్మిక సహోదరీలు అయ్యారు
“నాకేమి చెప్పొద్దు. నీ మతం గురించి నేను ఇంకేమీ వినదల్చుకోలేదు. దాని గురించి వింటేనే నాకు చిరాకు వస్తుంది. ఐ హేట్ యు.” చాలా సంవత్సరాల క్రితం నా చిన్న చెల్లెలు కోపంతో నన్ను అన్న మాటలవి. ఆమె మాటలు నాకు చాలా బాధకలిగించాయి. ఇప్పుడు నా వయసు 91, అయినా ఆ మాటలు ఇప్పటికీ నాకు బాగా గుర్తున్నాయి. కానీ ప్రసంగి 7:8 చెప్తున్నట్లు, “కార్యారంభముకంటె కార్యాంతము మేలు.”—ఫేలీసా.
ఫేలీసా: నేను స్పెయిన్‌లో ఓ పేద కుటుంబంలో పెరిగాను. మేము క్యాథలిక్కులం, మాకు దేవుడు మీద భక్తి ఎక్కువ. నిజానికి, మా బంధువుల్లో 13 మంది ప్రీస్టులుగా లేదా చర్చి సేవకులుగా పనిచేసేవాళ్లు. మా అమ్మ దగ్గరిబంధువైన ఒకాయన, ప్రీస్టుగా అలాగే క్యాథలిక్ స్కూల్లో టీచర్‌గా పనిచేశాడు. అతను చనిపోయాక, పోప్ జాన్ పాల్ II అతన్ని పవిత్రునిగా ప్రకటించి సత్కరించాడు. మా నాన్న ఒక కంసాలి, అమ్మ పొలంపని చేసేది. మేం మొత్తం ఎనిమిదిమంది పిల్లలం, నేనే పెద్దదాన్ని.
నాకు 12 ఏళ్లున్నప్పుడు, స్పెయిన్‌లో యుద్ధం మొదలైంది. అయితే, మా నాన్నకున్న రాజకీయ సిద్ధాంతాలు ప్రభుత్వానికి నచ్చలేదు దాంతో యుద్ధం ముగిశాక ఆయన్ని జైల్లో వేశారు. అప్పుడు మా అమ్మకు మమ్మల్ని పోషించడం కష్టమైంది. అందుకే, మా ముగ్గురు చెల్లెళ్లయిన ఆరాసెలీ, లారీ, రామోనీలను నన్స్‌తోపాటు ఉండడానికి బిల్బావ్‌లోని కాన్వెంట్‌కి అమ్మ పంపించేసింది. కనీసం అక్కడైనా వాళ్లకు కడుపునిండా ఆహారం దొరుకుతుందని అమ్మ ఆశ.
ఆరాసెలీ: అప్పుడు నాకు 14 ఏళ్లు, లారీకి 12 ఏళ్లు, రామోనీకి 10 ఏళ్లు. మా ఇంట్లోవాళ్లు మాకు బాగా గుర్తొచ్చేవాళ్లు. ఆ కాన్వెంట్‌లో మాకు శుభ్రం చేసే పని ఇచ్చారు. రెండు సంవత్సరాల తర్వాత, నన్స్ మమ్మల్ని జరగోజ అనే ఊరిలో ముసలివాళ్లను చూసుకునే పెద్ద కాన్వెంట్‌కు పంపించారు. అక్కడ వంటగదిని శుభ్రం చేసే పనిని మాకిచ్చారు. అది చాలా కష్టమైన పని, దానివల్ల బాగా అలసిపోయేవాళ్లం.
ఫేలీసా: మా ముగ్గురు చెల్లెలు జరగోజలోని కాన్వెంట్‌కు వెళ్లినప్పుడు, మా అమ్మ అలాగే మా ఊరిలో ప్రీస్టుగా పనిచేసే మా మామయ్య, నన్ను కూడా అక్కడికి పంపించాలని నిర్ణయించుకున్నారు. నిజానికి, నన్ను ఇష్టపడుతున్న ఒక అబ్బాయికి దూరంగా ఉంచాలనే ఉద్దేశంతోనే వాళ్లు అలా పంపించాలనుకున్నారు. నాకు దేవుడంటే ఇష్టం కాబట్టి, కొంతకాలం కాన్వెంట్‌లో ఉండాలనుకున్నాను. నేను రోజూ చర్చికి వెళ్లేదాన్ని, అంతేకాదు ఆఫ్రికాలో ఉంటున్న మా పెద్దమ్మ కూతురులాగే నేను కూడా క్యాథలిక్ మిషనరీ అవ్వాలనుకున్నాను.
స్పెయిన్‌లోని జరగోజలో ఉన్న కాన్వెంట్, (ఎడమ వైపు) నాకార్‌కోలున్గా బైబిలు అనువాదం (కుడి వైపు)
నేను చేయాలనుకున్న చాలా పనులు కాన్వెంట్‌లో చేయవచ్చు అనుకున్నాను. కానీ నేను ఆశపడినట్టు వేరే దేశంలో దేవున్ని సేవించడానికి నన్స్ నన్ను ప్రోత్సహించలేదు. కాబట్టి ఒక సంవత్సరం తర్వాత ఇంటికి వెళ్లిపోయి, ప్రీస్టుగా ఉన్న మా మామయ్య బాగోగులు చూసుకున్నాను. నేను ఇంటిపని చేసేదాన్ని అలాగే ప్రతీరోజూ సాయంత్రం మేము కలిసి జపమాల ప్రార్థన చేసుకునేవాళ్లం. చర్చిని పూలతో అలంకరించడమన్నా, కన్య మరియ, ‘సెయింట్ల’ విగ్రహాల్ని అలంకరించడమన్నా నాకు చాలా ఇష్టం.
ఆరాసెలీ: నేను జరగోజలో ఉన్నప్పుడు, నన్‌గా అవ్వడానికి చేసే మొదటి ప్రమాణాన్ని చేశాను. దాని తర్వాత నన్స్, నన్నూ మా చెల్లెళ్లనూ విడదీయాలనుకున్నారు. అందుకే, నన్ను మాడ్రిడ్‌లోని కాన్వెంట్‌కు, లారీని వలెన్సియలోని కాన్వెంట్‌కు పంపించేశారు. రామోనీ జరగోజలోనే ఉండిపోయింది. మాడ్రిడ్‌లో, నన్‌గా అవ్వడానికి చేసే మరికొన్ని ప్రమాణాల్ని చేశాను. కాన్వెంట్‌లో ఉండడానికి విద్యార్థులు, పెద్దవాళ్లు ఇలా చాలామంది వచ్చేవాళ్లు. కాబట్టి అక్కడ చేయడానికి చాలా పని ఉండేది. నేను మాత్రం కాన్వెంట్ ఆసుపత్రిలో పని చేసేదాన్ని.
నేను ఎప్పుడు నన్‌గా అవుతానోనని ఎదురుచూశాను. మేం ఎక్కువ సమయం బైబిలు చదవచ్చని, ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని అనుకున్నాను. కానీ నా ఆశ నిరాశ అయ్యింది. అక్కడ ఎవ్వరూ దేవుని గురించిగానీ యేసు గురించిగానీ మాట్లాడేవాళ్లు కాదు, బైబిల్ని ఉపయోగించేవాళ్లు కాదు. నేను లాటిన్ భాష కొంచెం నేర్చుకుని క్యాథలిక్ ‘సెయింట్ల’ జీవిత కథల్ని చదివాను, మరియను ఆరాధించాను. కానీ, ఎక్కువ సమయం మాత్రం కష్టమైన పనులే చేసేదాన్ని.
నాలో ఆందోళన మొదలైంది. నా కుటుంబానికి సహాయపడకుండా, కాన్వెంట్‌లో పనిచేస్తూ ఇతరుల జేబులు నింపడానికి సహాయం చేయడం సరికాదని అనిపించింది. అందుకే, మా మదర్ సుపీరియర్‌తో దీని గురించి మాట్లాడి నేను వెళ్లిపోవాలి అనుకుంటున్నానని చెప్పాను. కానీ ఆమె నన్ను ఒక గదిలో పెట్టి తాళం వేసింది. అప్పుడైనా నేను ఆమె మాట విని వెళ్లకుండా ఉంటానని అనుకుంది.
అయితే నేను నా నిర్ణయం మార్చుకున్నానో లేదో తెలుసుకోవడానికి నన్స్ నన్ను మూడుసార్లు బయటకు రానిచ్చారు. కానీ నేనింకా నా నిర్ణయం మార్చుకోలేదని తెలిసి, మళ్లీ గదిలో పెట్టి తాళం వేశారు. ఈసారి వాళ్లు, “నేను దేవున్ని కాకుండా సాతాన్ని సేవించాలనుకుంటున్నాను అందుకే వెళ్లిపోతున్నాను” అని రాసిస్తే నన్ను వెళ్లనిస్తామని చెప్పారు. నా నోట మాటరాలేదు. నాకు నిజంగానే వెళ్లిపోవాలని ఉంది, కానీ నేను అలా రాయలేను. చివరికి, నేను ప్రీస్టును కలిసి జరిగింది చెప్పాను. నన్ను మళ్లీ జరగోజలోని కాన్వెంట్‌కు పంపించడానికి ఆయన బిషప్ దగ్గర అనుమతి తీసుకున్నాడు. కొన్ని నెలల తర్వాత, నన్ను వెళ్లనిచ్చారు. కొంతకాలానికి, లారీ అలాగే రామోనీ కూడా కాన్వెంట్ నుండి వచ్చేశారు.
మమ్మల్ని విడదీసిన పుస్తకం
ఫేలీసా: కొంతకాలం తర్వాత, నాకు పెళ్లయి స్పెయిన్‌లోని కాంటాబ్రీయాకు వెళ్లిపోయాను. నేను అక్కడ కూడా చర్చికి క్రమంగా వెళ్లేదాన్ని. ఒక ఆదివారం ప్రీస్టు కోపంగా, “ఈ పుస్తకం చూడండి” అని గట్టిగా అరిచాడు. నిత్యజీవమునకు నడుపు సత్యము అనే పుస్తకాన్ని అతను మాకు చూపించి ఇలా అన్నాడు, “ఎవరైనా మీకు ఈ పుస్తకం ఇస్తే దాన్ని నాకు ఇవ్వండి లేదా పారేయండి.”
ఫేలీసా
నా దగ్గర ఆ పుస్తకం లేదు, కానీ దాన్ని చదవాలనిపించింది. కొన్నిరోజుల తర్వాత, ఇద్దరు ఆడవాళ్లు మా ఇంటికి వచ్చి నాకు ఆ పుస్తకం ఇచ్చారు, వాళ్లు యెహోవాసాక్షులు. నేను ఆ రాత్రే పుస్తకమంతా చదివేశాను. వాళ్లు మళ్లీ వచ్చినప్పుడు, నాకు బైబిలు గురించి ఎక్కువ తెలుసుకోవడం ఇష్టమో కాదోనని అడిగారు. నాకు ఇష్టమేనని చెప్పాను.
సత్యము పుస్తకం
నేను దేవున్ని సంతోషపెట్టాలనుకున్నాను. అప్పుడు నేను యెహోవా గురించి సత్యం నేర్చుకున్నాను, ఆయన్ని బాగా ప్రేమించడం మొదలుపెట్టాను. ఆయన గురించి అందరికీ చెప్పాలనుకున్నాను. 1973లో, నేను బాప్తిస్మం తీసుకున్నాను. నాకు వీలైనప్పుడల్లా, నా కుటుంబంతో సత్యం గురించి మాట్లాడేదాన్ని. కానీ మావాళ్లు, ముఖ్యంగా మా చెల్లి ఆరాసెలీ నేను నమ్ముతున్నది తప్పని వాదించేది.
ఆరాసెలీ: కాన్వెంట్‌లో నన్ను చాలా బాధలుపెట్టారు. దాంతో నా మతం మీద నాకు కోపమొచ్చింది, దానిమీద ఇష్టం కూడా పోయింది. కానీ ఆదివారాలు మాత్రం చర్చికి వెళ్తుండేదాన్ని, ప్రతీరోజు జపమాల ప్రార్థనలు చేసుకునేదాన్ని. అయితే బైబిల్లోని విషయాలు అర్థంచేసుకోవాలనే కోరిక మాత్రం పోలేదు. అందుకే సహాయం చేయమని దేవున్ని అడిగేదాన్ని. అప్పుడు ఫేలీసా తాను నేర్చుకున్న విషయాలు నాకు చెప్పేది. తన నమ్మకాల గురించి ఆమె చాలా ఉత్సాహంగా చెప్తుంటే తనకు మతపిచ్చి పట్టిందని అనుకున్నాను. ఆమె చెప్పిన విషయాల్ని నేను ఒప్పుకోలేదు.
ఆరాసెలీ
కొంతకాలానికి, నేను ఉద్యోగం నిమిత్తం మాడ్రిడ్‌కు వెళ్లాను తర్వాత పెళ్లి చేసుకున్నాను. చర్చికి క్రమంగా వెళ్లేవాళ్లు యేసు బోధల ప్రకారం జీవించట్లేదని సంవత్సరాలు గడిచేకొద్దీ నేను తెలుసుకున్నాను. అందుకే చర్చికి వెళ్లడం మానేశాను. ‘సెయింట్లను,’ నరకాగ్నిని ఇక నమ్మలేదు, పాపాలను క్షమించే అధికారం ప్రీస్టులకు లేదని గ్రహించాను. దేవుని విగ్రహాలన్నిటినీ తీసేశాను. నేను చేస్తున్నది సరైనదో కాదో నాకు అప్పుడు తెలీదు. నాకు నిరుత్సాహం కలిగినప్పటికీ, “నీ గురించి తెలుసుకోవాలనుంది, నాకు సహాయం చేయి” అని దేవునికి ప్రార్థిస్తూనే ఉన్నాను. యెహోవాసాక్షులు మా ఇంటికి చాలాసార్లు వచ్చారు, కానీ నేనెప్పుడూ తలుపు తీయలేదు. నాకు మతాలపై ఉన్న నమ్మకం పోయింది.
నా చెల్లెళ్లు లారీ ఫ్రాన్స్‌లో, రామోనీ స్పెయిన్‌లో ఉండేవాళ్లు. దాదాపు 1980లో, వాళ్లు యెహోవాసాక్షుల దగ్గర స్టడీ తీసుకోవడం మొదలుపెట్టారు. ఫేలీసాలాగే తాము కూడా అబద్ధాలు నేర్చుకుంటున్నామనే సంగతి వాళ్లింకా గుర్తించి ఉండరని నాకు ఖచ్చితంగా తెలుసు. కొంతకాలానికి, మా ఇంటిపక్కన ఉండే ఆంజలీనస్ అనే ఆమె నాకు పరిచయమైంది, మేము మంచి స్నేహితులమయ్యాం. ఆమె కూడా ఒక యెహోవాసాక్షి. వాళ్లతో కలిసి బైబిలు స్టడీ చేయడం నాకు ఇష్టమో కాదో ఆంజలీనస్, ఆమె భర్త నన్ను చాలాసార్లు అడిగారు. మతం మీద ఆసక్తి లేదని నేను చెప్పినా, బైబిలు గురించి తెలుసుకోవాలనే కోరిక నాకుందని వాళ్లు అర్థంచేసుకున్నారు. చివరికి నేను, “సరే, స్టడీ తీసుకుంటాను. కానీ ఒక్క షరతు, నేను నా దగ్గరున్న బైబిల్నే ఉపయోగిస్తాను” అని వాళ్లతో అన్నాను. నా దగ్గర నాకార్‌కోలున్గా అనే బైబిలు అనువాదం ఉండేది.
చివరికి బైబిలు మమ్మల్ని కలిపింది
ఫేలీసా: 1973లో నేను బాప్తిస్మం తీసుకున్నప్పుడు, కాంటాబ్రీయా రాజధాని అయిన సాంటాడర్‌లో దాదాపు 70 మంది యెహోవాసాక్షులు ఉన్నారు. ఆ ప్రాంతంలోని కొన్ని వందల పల్లెల్లో ఉండే ప్రజలకు ప్రకటించాలంటే చాలా దూరం ప్రయాణించాల్సి వచ్చేది. అందుకే, మేము ముందు బస్సులో తర్వాత కారులో ఒక పల్లె నుండి మరో పల్లెకు వెళ్లేవాళ్లం.
సంవత్సరాలు గడుస్తుండగా, నేను చాలామందికి బైబిలు స్టడీ ఇచ్చాను, 11 మంది బాప్తిస్మం తీసుకున్నారు. నేను స్టడీ ఇచ్చిన వాళ్లలో చాలామంది క్యాథలిక్కులే. వాళ్ల విషయంలో చాలా ఓర్పు చూపించాల్సి వచ్చింది. తమ నమ్మకాలు తప్పని అర్థంచేసుకోవడానికి వాళ్లకు కూడా నాలాగే సమయం పట్టింది. ఒక వ్యక్తి తన ఆలోచనను మార్చుకొని సత్యాన్ని అర్థంచేసుకోవడానికి బైబిలు, పవిత్రశక్తి మాత్రమే సహాయం చేయగలవని నాకు తెలుసు. (హెబ్రీ. 4:12) పోలీసుగా పనిచేసిన నా భర్త బ్యెన్‌వెనీడో 1979లో బాప్తిస్మం తీసుకున్నాడు. అంతేకాదు మా అమ్మ, చనిపోవడానికి కొంతకాలానికి ముందు స్టడీ తీసుకోవడం మొదలుపెట్టింది.
ఆరాసెలీ: నేను యెహోవాసాక్షుల దగ్గర స్టడీ తీసుకోవడం మొదలుపెట్టినప్పుడు, వాళ్లను నమ్మకూడదని అనిపించింది. కానీ రోజులు గడుస్తుండగా, నా అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. యెహోవాసాక్షులు బైబిల్ని బోధించడమే కాదుగానీ వాటి ప్రకారం జీవించేవాళ్లు కూడా. దాంతో యెహోవాపట్ల, బైబిలుపట్ల నా విశ్వాసం అంతకంతకూ పెరిగింది, నా సంతోషం కూడా ఎక్కువైంది. మా ఇంటిదగ్గర ఉండే కొంతమంది అమ్మాయిలు నాలో వచ్చిన ఈ మార్పును గమనించి, “ఆరాసెలీ, నువ్వు ఎంచుకున్న మార్గాన్ని విడిచిపెట్టకు” అని అన్నారు.
“నేను ఎప్పటినుండో వెదుకుతున్న నిజమైన బైబిలు జ్ఞానాన్ని తెలుసుకునేందుకు నన్ను విడిచిపెట్టకుండా ఎన్నో అవకాశాలు ఇచ్చిన నీకు కృతజ్ఞతలు యెహోవా” అని ప్రార్థించడం నాకు గుర్తుంది. అంతేకాదు, మా అక్క ఫేలీసాను బాధపెట్టే మాటలు అన్నందుకు ఆమెను క్షమాపణ కూడా అడిగాను. అప్పటినుండి, ఒకరితో ఒకరం వాదించుకునే బదులు, బైబిలు గురించి సంతోషంగా మాట్లాడుకునేవాళ్లం. 1989లో నేను బాప్తిస్మం తీసుకున్నాను, అప్పుడు నా వయసు 61.
ఫేలీసా: నాకు ఇప్పుడు 91 ఏళ్లు, నా భర్త చనిపోయాడు పైగా ఇంతకుముందు ఉన్నంత శక్తి నాకిప్పుడు లేదు. అయినాసరే ఇప్పటికీ నేను క్రమంగా బైబిలు చదువుతాను, మీటింగ్స్‌కి వెళ్తాను, చేయగలిగినంత ఎక్కువ సేవ చేస్తున్నాను.
ఆరాసెలీ: నేను ఒకప్పుడు నన్‌ని కాబట్టి, పరిచర్యలో ఎదురుపడే ప్రీస్టులతో, నన్స్‌తో యెహోవా గురించి మాట్లాడడమంటే నాకిష్టం. అలా కలిసినవాళ్లలో కొంతమంది ఆసక్తికరమైన ప్రశ్నలు వేశారు, చాలామంది పుస్తకాలు-పత్రికలు తీసుకున్నారు. ఒక మతగురువు మాత్రం నాకు బాగా గుర్తున్నాడు. నేను అతనితో కొన్నిసార్లు మాట్లాడాక, నేను చెప్తున్నది నిజమని ఒప్పుకున్నాడు. అయితే తర్వాత అతను, “కానీ ఈ వయసులో నేను ఎక్కడికి వెళ్లగలను? మా చర్చివాళ్లు, మా ఇంట్లోవాళ్లు ఏం అనుకుంటారు?” అని అన్నాడు. “మరి దేవుడు ఏం అనుకుంటాడు?” అని నేను అడిగాను. నేను చెప్తున్నది నిజమని అతను అర్థంచేసుకున్నాడు, బాధపడ్డాడు కూడా. కానీ అతనికి మార్పులు చేసుకునే ధైర్యం లేదని నాకనిపించింది.
నా భర్త నాతో మీటింగ్‌కి వస్తానని చెప్పిన రోజును నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన మొదటిసారి మీటింగ్‌కి వచ్చినప్పుడు ఆయనకు 80 ఏళ్లు. ఆ తర్వాత ఆయన ఒక్కసారి కూడా మీటింగ్ మానలేదు. ఆయన బైబిలు స్టడీ తీసుకొని, ప్రీచింగ్ చేయడం మొదలుపెట్టాడు. మేమిద్దరం కలిసి ప్రీచింగ్ చేసిన ఎన్నో తీపి జ్ఞాపకాలు నాకున్నాయి. ఆయన బాప్తిస్మం తీసుకోవడానికి రెండు నెలల ముందు చనిపోయాడు.
ఫేలీసా: నేను యెహోవాను సేవించడం మొదలుపెట్టినప్పుడు, నా ముగ్గురు చెల్లెళ్లు నన్ను వ్యతిరేకించేవాళ్లు. కానీ కొంతకాలానికి వాళ్లు కూడా సత్యాన్ని అంగీకరించారు. నా జీవితంలో అన్నిటికన్నా సంతోషాన్నిచ్చిన విషయం అదే. ఆ తర్వాత నుండి మేము, మన ప్రియమైన యెహోవా దేవుని గురించీ ఆయన వాక్యం గురించీ మాట్లాడుకుంటూ ఆనందంగా సమయం గడుపుతున్నాం. అలా మేమందరం కలిసి యెహోవాను ఆరాధిస్తున్నాం.a
a ఇప్పుడు ఆరాసెలీకి 87 ఏళ్లు, ఫేలీసాకి 91 ఏళ్లు, రామోనీకి 83 ఏళ్లు. వాళ్లు ఇప్పటికీ యెహోవాను ఉత్సాహంగా సేవిస్తున్నారు. లారీ 1990లో నమ్మకమైన యెహోవా సేవకురాలిగా చనిపోయింది.