ఆనాటి జ్ఞాపకాలు
‘సూర్యుని కింద ఉన్నదేదీ మిమ్మల్ని ఆపలేదు!’
అది, 1931వ సంవత్సరం వసంతకాలం. ప్యారిస్‌లోని సుప్రసిద్ధ ప్లెయెల్ హాలు, 23 దేశాల నుండి వచ్చిన సభ్యులతో సందడిగా ఉంది. అందంగా తయారైన చాలామంది పెద్దపెద్ద టాక్సీలలో వచ్చి ఆ హాలు ముందు దిగుతున్నారు, కాసేపటికే హాలంతా సుమారు 3,000 మందితో కిక్కిరిసిపోయింది. వాళ్లు అక్కడికి ఏదో మ్యూజిక్ ప్రోగ్రాం వినడానికి రాలేదుగానీ, సహోదరుడు జోసెఫ్ ఎఫ్. రూథర్‌ఫర్డ్ ఇచ్చే ప్రసంగాల్ని వినడానికి వచ్చారు. ఆయన అప్పట్లో ప్రకటనా పనికి నాయకత్వం వహిస్తున్నాడు. ఆయన ఇస్తున్న ఉత్తేజకరమైన ప్రసంగాల్ని ఫ్రెంచ్, జర్మన్, పోలిష్ భాషల్లో కూడా అనువదిస్తున్నారు. సహోదరుడు రూథర్‌ఫర్డ్ గంభీరమైన స్వరంతో ఆ హాలంతా మారుమ్రోగిపోతోంది.
ఫ్రాన్స్‌లో జరుగుతున్న రాజ్య ప్రకటనా పని విషయంలో ఈ సమావేశం ఓ మైలురాయిగా నిలిచిపోయింది. ఫ్రాన్స్‌లో కల్‌పోర్చర్లుగా (పయినీర్లను అప్పట్లో అలా పిలిచేవాళ్లు) సేవచేయడానికి ముందుకు రమ్మని సహోదరుడు రూథర్‌ఫర్డ్, సమావేశానికి వచ్చిన వేర్వేరు దేశాల సహోదరసహోదరీల్ని ముఖ్యంగా యౌవనుల్ని ప్రోత్సహించాడు. ఇంగ్లండ్‌కు చెందిన జాన్ కుక్ అనే టీనేజీ సహోదరుడు, రూథర్‌ఫర్డ్ ఇచ్చిన ఈ ప్రోత్సాహాన్ని ఎన్నడూ మర్చిపోలేదు, “సూర్యుని కింద ఉన్నదేదీ కల్‌పోర్చర్ పని చేయకుండా యౌవనులైన మిమ్మల్ని ఆపలేదు!”a
రూథర్‌ఫర్డ్ ఇచ్చిన ఆ ఆహ్వానానికి స్పందించి జాన్ కుక్‌లాగే చాలామంది సహోదరసహోదరీలు కల్‌పోర్చర్లుగా సేవ చేయడానికి ముందుకొచ్చారు. జాన్ కుక్ ఆ తర్వాత మిషనరీగా కూడా సేవ చేశాడు. (అపొ. 16:9, 10) ఫ్రాన్స్‌లో 1930లో 27 మంది కల్‌పోర్చర్లు మాత్రమే ఉండేవాళ్లు, అయితే 1931 కల్లా వాళ్ల సంఖ్య 104కు చేరింది. అది నిజంగా అసాధారణమైన పెరుగుదల. కానీ వాళ్లలో చాలామందికి ఫ్రెంచ్ భాష మాట్లాడడం రాదు. వాళ్లు అరకొర సౌకర్యాలతో బ్రతకాలి, పైగా వాళ్లు తోటి సహోదరసహోదరీలకు దూరంగా ఉన్నారు. మరి ఈ సవాళ్లను వాళ్లు ఎలా ఎదుర్కొన్నారు?
భాష రాకపోయినా ప్రకటించారు
ఫ్రెంచ్‌భాష రాని కల్‌పోర్చర్లు ఎక్కువగా సాక్ష్యపు కార్డుల సహాయంతో ప్రకటించేవాళ్లు. ప్యారిస్‌లో ధైర్యంగా సువార్త ప్రకటించిన జర్మనీకి చెందిన ఓ సహోదరుడు ఇలా గుర్తుచేసుకుంటున్నాడు, ‘మన దేవుడు శక్తిమంతుడని మాకు తెలుసు. పరిచర్య చేస్తున్నప్పుడు కొన్నిసార్లు మా గుండె వేగంగా కొట్టుకునేది. అయితే మనుషుల్ని చూసి భయపడి కాదుగానీ, “దయచేసి ఈ కార్డు చదవండి” అనే నాలుగు ఫ్రెంచ్ మాటల్ని మర్చిపోతామేమో అన్న భయంతో అలా జరిగేది. మేము చేస్తున్న పని చాలా ముఖ్యమైనదని మేము నమ్ముతున్నాం.’
ఫ్రాన్స్‌లో సువార్త ప్రకటించడానికి కల్‌పోర్చర్లు మొదట్లో సైకిళ్లను, మోటర్ సైకిళ్లను ఉపయోగించేవాళ్లు
కల్‌పోర్చర్లు అపార్ట్‌మెంట్లలో ప్రకటిస్తున్నప్పుడు అక్కడి వాచ్‌మెన్‌లు తరచూ అడ్డుకునేవాళ్లు. ఓ రోజు, ఇంగ్లండ్‌కు చెందిన ఇద్దరు సహోదరీలు ఒక అపార్ట్‌మెంట్‌లో పరిచర్య చేస్తున్నారు. వాళ్లకు ఫ్రెంచ్ అంతగా రాదు. అక్కడున్న వాచ్‌మెన్ ‘మీరు ఎవర్ని కలవడానికి వచ్చారు’ అని కోపంగా అడిగాడు. వాళ్లలో ఓ సహోదరి అక్కడ ఓ ఇంటి తలుపు మీద రాసివున్న “Tournez le bouton [కాలింగ్ బెల్ నొక్కండి]” అనే మాటల్ని చూసి అది ఆ ఇంటి యజమాని పేరు అనుకుని ఆ వాచ్‌మెన్‌తో నవ్వుతూ, “మేము ‘Tournez le bouton’ మేడమ్‌ను కలవడానికి వచ్చాం” అని చెప్పింది. అలా సరదాగా ఉండడంవల్ల ఈ కల్‌పోర్చర్లు ఎంతో ప్రయోజనం పొందారు.
చాలీచాలని వసతులు, సహోదరసహోదరీలకు దూరంగా ఉండడం
ఫ్రాన్స్‌లోని చాలామంది ప్రజలు 1930లలో పేదరికంలో బ్రతకాల్సి వచ్చింది. అక్కడ సేవచేస్తున్న విదేశీ కల్‌పోర్చర్లది కూడా అదే పరిస్థితి. తాను, తన తోటి కల్‌పోర్చర్ ఎదుర్కొన్న పరిస్థితుల గురించి ఇంగ్లండ్‌కు చెందిన మోన జోస్కా అనే సహోదరి ఇలా చెప్పింది, “మేము ఉండే చోట కనీస వసతులు మాత్రమే ఉండేవి. చలికాలంలో మా రూమ్‌ను వెచ్చగా ఉంచుకోవడం మాకు ఓ పెద్ద సమస్యగా ఉండేది. రాత్రులు చాలా చల్లగా ఉండడంవల్ల ఉదయంకల్లా జగ్‌లో ఉన్న నీళ్లపైన ఐస్ గడ్డకట్టేది. మేము ఆ ఐస్‌ను పగులగొట్టి దాని కిందవున్న నీళ్లతో ముఖం కడుక్కునేవాళ్లం.” ఇలాంటి ఇబ్బందులు కల్‌పోర్చర్లను నిరుత్సాహపర్చాయా? లేదు. వాళ్ల భావాల గురించి ఓ కల్‌పోర్చర్ ఇలా చెప్పాడు, “మాకంటూ ఏమీ లేకపోయినా మాకు ఏ లోటూ రాలేదు.”—మత్త. 6:33.
1931లో ప్యారిస్‌లో జరిగిన సమావేశానికి హాజరైన ఇంగ్లండ్‌కు చెందిన పయినీర్లు
కల్‌పోర్చర్ల ముందున్న మరో సవాలు, వాళ్లు తోటి సహోదరసహోదరీలకు దూరంగా ఉండడం. 1930 తొలినాళ్లలో ఫ్రాన్స్‌లో 700 మంది ప్రచారకులు కూడా లేరు, వాళ్లలో చాలామంది ఫ్రాన్స్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో ఉండేవాళ్లు. మరి తోటి సహోదరసహోదరీల సహవాసం లేకపోయినా కల్‌పోర్చర్లు ఎలా సంతోషంగా ఉండగలిగారు? తాను, తన తోటి కల్‌పోర్చర్ ఏమి చేసేవాళ్లో మోన ఇలా చెప్పింది, ‘మేమిద్దరం కలిసి సంస్థ ముద్రించిన ప్రచురణల్ని క్రమంగా అధ్యయనం చేసేవాళ్లం. పునర్దర్శనాలు, బైబిలు స్టడీలు వంటివి అప్పట్లో ఉండేవి కావు కాబట్టి సాయంత్రాలు మా కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా తోటి పయినీర్లకు ఉత్తరాలు రాయడానికి చాలా సమయం దొరికేది. ఆ ఉత్తరాల ద్వారా మా అనుభవాల్ని పంచుకుంటూ ఒకరినొకరం ప్రోత్సహించుకునేవాళ్లం.’—1 థెస్స. 5:11.
ఎన్ని ఆటంకాలు ఎదురైనా కల్‌పోర్చర్లు ప్రకటనా పనిలో ఉత్సాహాన్ని కోల్పోలేదు. వాళ్లు బ్రాంచి కార్యాలయానికి రాసిన ఉత్తరాల్లో అది స్పష్టమౌతుంది. కొంతమందైతే ఫ్రాన్స్‌లో పయినీరు సేవ చేసిన కొన్ని దశాబ్దాల తర్వాత ఉత్తరాలు రాశారు. ఆనీ క్రజీన్ అనే ఓ అభిషిక్త సహోదరి తన భర్తతో కలిసి 1931 నుండి 1935 వరకు ఫ్రాన్స్‌లోని చాలా ప్రాంతాల్లో సేవచేసింది. ఆ రోజుల్ని గుర్తుచేసుకుంటూ ఆమె ఇలా రాసింది, “అక్కడ మా జీవితం చాలా సంతోషంగా, ఉత్తేజకరంగా సాగింది. పయినీర్లుగా మేము ఒకే లక్ష్యంతో పని చేసేవాళ్లం. అపొస్తలుడైన పౌలు చెప్పినట్లు ‘నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసినవాడు దేవుడే.’ చాలా సంవత్సరాల క్రితం అలా సహాయం చేసే అవకాశం వచ్చినందుకు మాకెంతో సంతోషంగా ఉంది.”—1 కొరిం. 3:6.
నేడు ఎక్కువగా సేవ చేయాలనుకునే వాళ్లకు ఆ కల్‌పోర్చర్లు సహనం, ఉత్సాహం చూపించే విషయంలో చక్కని ఆదర్శం ఉంచారు. ఇప్పుడు ఫ్రాన్స్‌లో దాదాపు 14,000 మంది పయినీర్లు ఉన్నారు. వాళ్లలో చాలామంది వేరే భాషా గుంపుల్లో లేదా సంఘాల్లో సేవచేస్తున్నారు.b వాళ్లు కూడా అప్పటి కల్‌పోర్చర్లలాగే సూర్యుని కింద ఉన్నదేదీ తమ పరిచర్యను ఆపకుండా చూసుకుంటున్నారు.—ఫ్రాన్స్ నుండి సేకరించినవి.
a ఫ్రాన్స్‌లో స్థిరపడ్డ పోలండ్ సహోదరసహోదరీలు చేసిన సేవ గురించి తెలుసుకోవడానికి, కావలికోట ఆగస్టు 15, 2015 సంచికలో “మీరు సత్యం తెలుసుకోవడం కోసమే యెహోవా మిమ్మల్ని ఫ్రాన్స్‌కు తీసుకొచ్చాడు” అనే ఆర్టికల్ చూడండి.
b ఫ్రాన్స్ బ్రాంచి 2014లో 900కు పైగా వేరే భాషా సంఘాల్ని లేదా గుంపుల్ని పర్యవేక్షిస్తూ, 70 వేర్వేరు భాషల్లో ప్రజలకు సత్యం అందించింది.