కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w15 9/15 పేజీలు 13-17
  • ‘విశ్వాసంలో నిలకడగా ఉండండి’

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ‘విశ్వాసంలో నిలకడగా ఉండండి’
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా సహాయం చేస్తాడని విశ్వాసం ఉంచండి
  • దృష్టి మళ్లితే విశ్వాసం బలహీనపడవచ్చు
  • యేసువైపే చూస్తూ మీ విశ్వాసాన్ని బలపర్చుకోండి
  • “మా విశ్వాసము వృద్ధి పొందించు”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
  • మీకు సువార్తలో నిజంగా విశ్వాసం ఉందా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • యెహోవా వాగ్దానాలపై విశ్వాసం ఉంచండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • విశ్వాసం​—మనల్ని బలపర్చే లక్షణం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
w15 9/15 పేజీలు 13-17
కొంతమంది శిష్యులు కష్టంగా పడవ నడుపుతుండగా, పేతురు పడవలో నుంచి దిగి నీళ్లమీద నడవడం మొదలుపెట్టాడు

‘విశ్వాసంలో నిలకడగా ఉండండి’

‘విశ్వాసంలో నిలకడగా ఉండండి, బలవంతులై ఉండండి.’ —1 కొరిం. 16:13.

పాటలు: 23, 34

మీరెలా జవాబిస్తారు?

  • విశ్వాసం ఎందుకు అమూల్యమైనది?

  • మన విశ్వాసం బలహీనంగా ఉందని ఎలా గుర్తించవచ్చు?

  • మనం యేసువైపు ఎందుకు చూస్తూ ఉండాలి?

1. (ఎ) గలిలయ సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు పేతురుకు ఎలాంటి అనుభవం ఎదురైంది? (ప్రారంభ చిత్రం చూడండి.) (బి) పేతురు ఎందుకు మునిగిపోసాగాడు?

ఓ రోజు రాత్రి పేతురు, మరికొంతమంది శిష్యులు గలిలయ సముద్రంలో ప్రయాణిస్తున్నారు. గాలి బలంగా వీస్తుండడంతో వాళ్లు చాలా కష్టంగా పడవ నడుపుతున్నారు. ఉన్నట్టుండి యేసు సముద్రంమీద నడుస్తూ తమ దగ్గరికి రావడం వాళ్లు చూశారు. అప్పుడు పేతురు, తాను కూడా నీళ్లమీద నడుస్తానని యేసును అడిగాడు. ఆయన రమ్మని చెప్పగానే పేతురు పడవ దిగి నీళ్లమీద నడవడం మొదలుపెట్టాడు. కానీ కాస్త దూరం నడిచాక నీళ్లలో మునిగిపోసాగాడు. ఎందుకు? ఆయన బలమైన గాలుల్ని, అలల్ని చూసి భయపడ్డాడు. దాంతో రక్షించమంటూ కేకలు వేశాడు, యేసు వెంటనే ఆయన చేయి పట్టుకుని, ‘అల్పవిశ్వాసీ, ఎందుకు సందేహించావు?’ అని అన్నాడు.—మత్త. 14:24-32.

2. ఈ ఆర్టికల్‌లో వేటి గురించి చర్చిస్తాం?

2 పేతురు విశ్వాసానికి సంబంధించి మనం మూడు ప్రశ్నల్ని ఈ ఆర్టికల్‌లో చర్చిద్దాం. అవి, (1) యెహోవా తనకు సహాయం చేస్తాడనే విశ్వాసాన్ని పేతురు మొదట్లో ఎలా చూపించాడు? (2) తర్వాత ఆయన విశ్వాసం ఎందుకు బలహీనపడింది? (3) ఆయన తన విశ్వాసాన్ని మళ్లీ ఎలా బలపర్చుకున్నాడు? వీటిని పరిశీలించడం వల్ల మనం ఎలా ‘విశ్వాసంలో నిలకడగా’ ఉండవచ్చో తెలుసుకుంటాం.—1 కొరిం. 16:13.

యెహోవా సహాయం చేస్తాడని విశ్వాసం ఉంచండి

3. పేతురు ఏ నమ్మకంతో పడవ దిగి నీళ్లమీద నడిచాడు? పేతురులాగే మనం కూడా ఏమి చేశాం?

3 పేతురుకు బలమైన విశ్వాసం ఉంది. ఆ విషయం మనకెలా తెలుసు? యేసు రమ్మనగానే ఆయన పడవ దిగి నీళ్లమీద నడవడం మొదలుపెట్టాడు. నీళ్లమీద నడిచేలా యేసుకు శక్తినిచ్చిన యెహోవా తనకు కూడా శక్తినిస్తాడని పేతురు నమ్మాడు. అదేవిధంగా, తనను అనుసరించమని యేసు మనల్ని ఆహ్వానించినప్పుడు, మనం యెహోవాకు సమర్పించుకుని బాప్తిస్మం తీసుకున్నాం. ఎందుకు? ఎందుకంటే మనకు యెహోవాపై, యేసుపై విశ్వాసం ఉంది, వాళ్లు సహాయం చేస్తారనే నమ్మకం కూడా ఉంది.—యోహా. 14:1; 1 పేతురు 2:21 చదవండి.

4, 5. విశ్వాసం అమూల్యమైనదని ఎందుకు చెప్పవచ్చు?

4 విశ్వాసం చాలా అమూల్యమైనది. విశ్వాసం వల్ల పేతురు మనుషుల దృష్టిలో అసాధ్యమైన దాన్ని చేశాడు అంటే నీళ్లమీద నడిచాడు. విశ్వాసం ఉంటే మనం కూడా అసాధ్యంగా అనిపించేవాటిని చేయగలం. (మత్త. 21:21, 22) ఉదాహరణకు, మన గురించి తెలిసినవాళ్లు ఆశ్చర్యపోయేంతగా మన ఆలోచనా తీరును, ప్రవర్తనను మార్చుకున్నాం. మనం యెహోవా మీద విశ్వాసంతోనే ఆ మార్పులు చేసుకున్నాం, అలా చేసుకునేలా ఆయనే మనకు సహాయం చేశాడు. (కొలొస్సయులు 3:5-10 చదవండి.) విశ్వాసం వల్లే మనం యెహోవాకు సమర్పించుకుని, ఆయన స్నేహితులం అయ్యాం. ఆయన సహాయమే లేకపోతే మనం ఎప్పటికీ ఆయనకు దగ్గరయ్యేవాళ్లం కాదు.—ఎఫె. 2:8.

5 విశ్వాసం మనకు బలాన్నిస్తుంది. ఉదాహరణకు, మన ప్రధాన శత్రువైన సాతాను దాడుల్ని ఎదిరించడానికి అది మనకు సహాయం చేస్తుంది. (ఎఫె. 6:16) అంతేకాదు, యెహోవామీద విశ్వాసం ఉంది కాబట్టి మనం కష్టాలొచ్చినప్పుడు ఎక్కువగా దిగులుపడం. మనం తనమీద విశ్వాసం ఉంచి రాజ్యానికి మొదటి స్థానం ఇస్తే, మన అవసరాల్ని తీరుస్తానని యెహోవా మాటిచ్చాడు. (మత్త. 6:30-34) అన్నిటికన్నా ముఖ్యంగా, మన విశ్వాసాన్ని బట్టి ఆయన మనకు నిత్యజీవమనే అద్భుతమైన బహుమానాన్ని ఇస్తాడు.—యోహా. 3:16.

దృష్టి మళ్లితే విశ్వాసం బలహీనపడవచ్చు

6, 7. (ఎ) బలమైన గాలుల్ని, అలల్ని వేటితో పోల్చవచ్చు? (బి) మన విశ్వాసం బలహీనపడే ప్రమాదం ఉందని ఎందుకు అర్థం చేసుకోవాలి?

6 పేతురు నీళ్లమీద నడుస్తున్నప్పుడు బలమైన గాలుల్ని, అలల్ని చూసి భయపడ్డాడు. నేడు క్రైస్తవులు ఎదుర్కొనే కష్టాలు, శోధనలు కూడా ఆ గాలులు, అలల్లాంటివే. అవి ఎంత తీవ్రంగా ఉన్నా యెహోవా సహాయంతో వాటిని తట్టుకోగలం. అయితే పేతురుకు ఏమి జరిగిందో గుర్తుతెచ్చుకోండి. ఆయన బలమైన గాలులు, అలలు తగలడం వల్ల మునిగిపోలేదు కానీ ‘గాలిని చూసి భయపడి మునిగిపోసాగాడు’ అని బైబిలు చెప్తుంది. (మత్త. 14:30) పేతురు యేసును చూడకుండా గాలిని, అలల్ని చూడడం మొదలుపెట్టాడు. దాంతో ఆయన విశ్వాసం బలహీనపడింది. అలాగే మనం సమస్యల మీదే దృష్టి పెడితే, యెహోవా సహాయం చేస్తాడనే నమ్మకం సన్నగిల్లవచ్చు.

7 మన విశ్వాసం బలహీనపడే అవకాశం ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు? ఎందుకంటే విశ్వాసం లేకపోవడాన్ని “సుళువుగా చిక్కులబెట్టు పాపము” అని బైబిలు వర్ణిస్తుంది. (హెబ్రీ. 12:1, 2) పేతురులాగే మనం కూడా అనవసరమైన విషయాల మీద దృష్టి పెడితే, మన విశ్వాసం ఇట్టే బలహీనపడవచ్చు. అయితే మన విశ్వాసం బలహీనపడితే ఎలా గుర్తించవచ్చు? అందుకు సహాయంచేసే కొన్ని ప్రశ్నలు ఇప్పుడు పరిశీలిద్దాం.

8. దేవుని వాగ్దానాలపై మనకున్న నమ్మకం ఎందుకు తగ్గిపోయే అవకాశం ఉంది?

8 దేవుని వాగ్దానాలపై నాకు ఒకప్పుడున్న నమ్మకం ఇప్పుడు ఉందా? ఉదాహరణకు, సాతాను లోకాన్ని నాశనం చేస్తానని యెహోవా వాగ్దానం చేశాడు. అయితే లోకం అందించే రకరకాల వినోదంవల్ల మన దృష్టి మళ్లితే, ఆ వాగ్దానం మీద మన నమ్మకం తగ్గిపోవచ్చు. అంతం ఇప్పట్లో రాదని మనం అనుకోవచ్చు. (హబ. 2:3) ఇంకో ఉదాహరణ పరిశీలించండి. విమోచనా క్రయధనం ద్వారా మన పాపాల్ని క్షమిస్తానని యెహోవా మాటిచ్చాడు. కానీ మనం గతంలో చేసిన తప్పుల గురించే ఆలోచిస్తుంటే, యెహోవా మన పాపాల్ని నిజంగా క్షమించాడో లేదో అనే సందేహం మనకు రావచ్చు. (అపొ. 3:19, 20) దానివల్ల దేవుని సేవలో ఆనందాన్ని కోల్పోయి, చివరికి పరిచర్యకు వెళ్లడం మానేస్తాం.

9. మన సొంత విషయాల మీదే దృష్టిపెడితే ఏమి జరగవచ్చు?

9 ఒకప్పటిలా యెహోవా సేవలో చేయగలిగినదంతా చేస్తున్నానా? మనం యెహోవా సేవలో కష్టపడి పనిచేసినప్పుడు మన భవిష్యత్తు నిరీక్షణపై దృష్టిపెడతాం. ఒకవేళ మన సొంత విషయాలమీదే దృష్టిపెడితే ఏమి జరగవచ్చు? ఉదాహరణకు మనం ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగంలో చేరడంవల్ల సంఘ కూటాలకు, పరిచర్యకు సరిగ్గా వెళ్లలేకపోతుండవచ్చు. దానివల్ల మన విశ్వాసం సన్నగిల్లి, యెహోవా సేవలో “మందులుగా” లేదా సోమరులుగా తయారై, చేయగలిగిన దానికన్నా తక్కువ చేస్తాం.—హెబ్రీ. 6:10-12.

10. మనం ఇతరుల్ని క్షమించినప్పుడు యెహోవామీద విశ్వాసాన్ని ఎలా చూపిస్తాం?

10 ఇతరుల్ని క్షమించడం నాకు కష్టంగా ఉందా? మనల్ని ఎవరైనా నొప్పిస్తే, వాళ్లమీద కోపం పెట్టుకుని వాళ్లతో మాట్లాడడం మానేస్తామా? అలాచేస్తే మనం మన గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నట్లు అర్థం. అలాకాకుండా, మనం వాళ్లను క్షమిస్తే యెహోవామీద విశ్వాసం ఉందని చూపిస్తాం. అదెలా? మనం పాపం చేసినప్పుడు ఎలాగైతే యెహోవాకు అప్పుపడతామో అలాగే వేరేవాళ్లు మన విషయంలో పాపం చేసినప్పుడు వాళ్లు మనకు అప్పుపడతారు. (లూకా 11:4) కాబట్టి వాళ్లను క్షమించినప్పుడు మనం యెహోవాపై విశ్వాసం చూపిస్తాం. ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడని నమ్ముతాం. మనల్ని బాధపెట్టినవాళ్లను తిరిగి బాధపెట్టడంకన్నా యెహోవా ఇచ్చే ఆశీర్వాదాలు చాలా విలువైనవి. ఇతరుల్ని క్షమించాలంటే విశ్వాసం అవసరమని యేసు శిష్యులు కూడా అర్థం చేసుకున్నారు. అందుకే యేసు వాళ్లతో, ఇతరుల్ని ఎన్నిసార్లైనా క్షమించాలని చెప్పినప్పుడు వాళ్లు “మా విశ్వాసము వృద్ధిపొందించుము” అని ఆయన్ను వేడుకున్నారు.—లూకా 17:1-5.

11. సంఘపెద్దలు ఏదైనా సలహా ఇస్తే మనం ఏం చేయకూడదు?

11 పెద్దలు ఏదైనా సలహా ఇస్తే చిరాకుపడతానా? సంఘపెద్దలు ఏదైనా సలహా ఇస్తే, దాన్ని ఎలా పాటించాలో ఆలోచించాలి. అంతేకానీ ఆ సలహాను తప్పుపట్టకూడదు లేదా వాళ్లలోని లోపాలను చూడకూడదు. (సామె. 19:20) అప్పుడే మనం యెహోవాలా ఆలోచించడం మరింతగా నేర్చుకుంటాం.

12. ఓ వ్యక్తి పెద్దలమీద పదేపదే ఫిర్యాదు చేస్తుంటే దానర్థం ఏమిటి?

12 పెద్దల మీద ఫిర్యాదు చేసే స్వభావం నాకుందా? పదిమంది వేగులవాళ్లు చెప్పినదాన్ని నమ్మి ఇశ్రాయేలీయులు మోషే, అహరోనుల మీద సణిగారు. అప్పుడు యెహోవా మోషేను ఇలా అడిగాడు, ‘ఎన్నాళ్లవరకు ఈ ప్రజలు నన్ను నమ్మకయుందురు?’ (సంఖ్యా. 14:2-4, 11) ఇశ్రాయేలీయులు, యెహోవా నియమించిన మోషే అహరోనుల మీద సణగడం ద్వారా నిజానికి యెహోవామీద నమ్మకం లేదని చూపించారు. అదేవిధంగా, నేడు యెహోవా సంఘపెద్దల ద్వారా తన ప్రజల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి, మనం వాళ్లమీద పదేపదే ఫిర్యాదు చేస్తుంటే దేవుని మీద మనకున్న విశ్వాసం బలహీనపడిందని అర్థం.

13. మన విశ్వాసం బలహీనపడిందని మనకనిపిస్తే ఎందుకు నిరుత్సాహపడకూడదు?

13 ఈ ప్రశ్నల్ని పరిశీలించాక, ఒకవేళ మీ విశ్వాసం బలహీనపడిందని మీకనిపిస్తే నిరుత్సాహపడకండి. అపొస్తలుడైన పేతురు కూడా భయపడ్డాడని, సందేహపడ్డాడని గుర్తుంచుకోండి. కొన్నిసార్లు అపొస్తలులందరి విశ్వాసం కూడా బలహీనపడింది. (మత్త. 16:8) అయితే, విశ్వాసం సన్నగిల్లడం వల్ల పేతురు మొదట నీళ్లలో మునిగిపోబోయినా, ఆ తర్వాత ఆయన చేసిన దానినుండి మనం ఓ ముఖ్యమైన పాఠం నేర్చుకోవచ్చు.

యేసువైపే చూస్తూ మీ విశ్వాసాన్ని బలపర్చుకోండి

14, 15. (ఎ) నీళ్లలో మునిగిపోతున్న సమయంలో పేతురు ఏమి చేశాడు? (బి) మనం ఎలా ‘యేసువైపు చూస్తూ’ ఉండవచ్చు?

14 పేతురు మునిగిపోతున్న సమయంలో ఏమి చేశాడు? ఆయనకు ఈత బాగా వచ్చు కాబట్టి ఈదుకుంటూ మళ్లీ పడవ దగ్గరకు వెళ్లిపోలేదు. (యోహా. 21:7) ఎందుకు? ఎందుకంటే పేతురు తన శక్తి సామర్థ్యాల్ని నమ్ముకునే బదులు మళ్లీ యేసువైపే చూస్తూ, ఆయన సహాయం తీసుకున్నాడు. మన విశ్వాసం బలహీనపడిందని అనిపిస్తే మనం కూడా పేతురులాగే చేయాలి. ఎలా?

15 పేతురు సహాయం కోసం మళ్లీ యేసువైపు చూసినట్లే మనం కూడా ‘యేసువైపు చూస్తూ’ ఉండాలి. (హెబ్రీయులు 12:1-3 చదవండి.) కానీ యేసు ఇప్పుడు భూమ్మీద లేడు కాబట్టి మనం ఆయన్ను చూడలేం. అయినప్పటికీ ఆయన బోధల్ని, పనుల్ని అధ్యయనం చేస్తూ ఆయన్ను అనుకరించడం ద్వారా మనం ‘యేసువైపు చూస్తూ’ ఉండవచ్చు. అలాచేస్తే మన విశ్వాసం బలపడుతుంది. మనం యేసును ఏయే విధాలుగా అనుకరించవచ్చో ఇప్పుడు చూద్దాం.

పేతురు నీళ్లమీద నడుస్తున్నాడు; ఓ మహిళ విశ్వాసం బలపడింది

యేసువైపే చూస్తూ, ఆయన్ను అనుకరిస్తే మన విశ్వాసం బలపడుతుంది (15వ పేరా చూడండి)

16. మన విశ్వాసాన్ని బలపర్చుకోవడానికి బైబిలు ఎలా సహాయం చేస్తుంది?

16 బైబిలు మీద మీకున్న విశ్వాసాన్ని బలపర్చుకోండి. బైబిలు దేవుని వాక్యమనీ దానిలోని సలహాలు శ్రేష్ఠమైనవనీ యేసు నమ్మాడు. (యోహా. 17:17) మనకు కూడా అలాంటి నమ్మకమే ఉండాలంటే ప్రతీరోజు బైబిలు చదవాలి, అధ్యయనం చేయాలి, నేర్చుకున్న విషయాల్ని ధ్యానించాలి. అంతేకాదు, మనకున్న నమ్మకాల్ని బలపర్చుకోవడానికి పరిశోధన చేయాలి. ఉదాహరణకు, మనం అంత్యదినాల్లో ఉన్నామని చూపించే బైబిలు రుజువులను లోతుగా పరిశీలిస్తే, అంతం చాలా దగ్గర్లో ఉందనే మన నమ్మకం మరింత బలపడుతుంది. అలాగే ఇప్పటికే నెరవేరిన ఎన్నో ప్రవచనాలను పరిశీలించినప్పుడు, భవిష్యత్తులో దేవుని వాగ్దానాలు నిజమౌతాయనే నమ్మకం ఇంకా బలపడుతుంది. బైబిలు జీవితాల్ని ఎలా మారుస్తుందో తెలియజేసే అనుభవాల్ని పరిశీలిస్తే, బైబిలు సలహాలు ఎంతో ఉపయోగపడతాయనే మన నమ్మకం బలపడుతుంది.a—1 థెస్స. 2:13.

17. యేసు తీవ్రమైన కష్టాల్ని ఎలా సహించగలిగాడు? మీరు ఆయన్ను ఎలా అనుకరించవచ్చు?

17 యెహోవా వాగ్దానం చేసిన ఆశీర్వాదాలపై దృష్టిపెట్టండి. యేసు తాను పొందబోయే ఆశీర్వాదాలపై మనసుపెట్టడం వల్ల తీవ్రమైన కష్టాల్ని కూడా సహించగలిగాడు. (హెబ్రీ. 12:1, 2) ఈ లోకంలో ఉన్నవాటివల్ల ఆయన దృష్టి ఎన్నడూ పక్కకు మళ్లలేదు. (మత్త. 4:8-10) మనం కూడా యెహోవా చేసిన అద్భుతమైన వాగ్దానాల గురించి లోతుగా ఆలోచించాలి. ఉదాహరణకు, మీరు కొత్తలోకంలో ఏమేమి చేయాలనుకుంటున్నారో ఓ పేపరు మీద రాసుకోండి లేదా ఓ బొమ్మ రూపంలో గీయండి. లేదా పునరుత్థానమయ్యే వాళ్లలో ఎవరెవర్ని కలవాలనుకుంటున్నారో, వాళ్లతో ఏమి మాట్లాడాలనుకుంటున్నారో లిస్టు రాసుకోండి. దేవుని వాగ్దానాలు మనుషులందరి కోసం అని కాకుండా మీకోసమే అన్నట్లు భావించండి.

18. ప్రార్థించడంవల్ల విశ్వాసం ఎలా బలపడుతుంది?

18 మరింత విశ్వాసం ఇవ్వమని ప్రార్థించండి. పరిశుద్ధాత్మ కోసం ప్రార్థించమని యేసు నేర్పించాడు. (లూకా 11:9, 13) విశ్వాసం ఆత్మఫలంలో ఓ భాగం కాబట్టి, మరింత విశ్వాసం ఇవ్వమని కూడా యెహోవాను వేడుకోండి. అంతేకాకుండా మీరు మార్చుకోవాలనుకుంటున్న ఓ విషయం గురించి ప్రార్థనలో ప్రత్యేకంగా ప్రస్తావించండి. ఉదాహరణకు, ఇతరుల్ని క్షమించడం మీకు కష్టంగా ఉంటే మీ విశ్వాసాన్ని బలపర్చి, ఇతరుల్ని క్షమించడానికి సహాయం చేయమని యెహోవాకు ప్రార్థించండి.

19. మనం ఎలాంటి వాళ్లతో స్నేహం చేయాలి?

19 బలమైన విశ్వాసం ఉన్నవాళ్లతో స్నేహం చేయండి. యేసు తన సన్నిహిత స్నేహితులను జాగ్రత్తగా ఎంపిక చేసుకున్నాడు. తన ఆజ్ఞల్ని పాటిస్తూ తనపట్ల విశ్వాసం, యథార్థత చూపించిన అపొస్తలుల్నే ఆయన స్నేహితులుగా చేసుకున్నాడు. (యోహాను 15:14, 15 చదవండి.) మీరు కూడా బలమైన విశ్వాసం ఉన్నవాళ్లను, యేసుకు లోబడేవాళ్లను స్నేహితులుగా చేసుకోండి. నిజమైన స్నేహితులు దాపరికం లేకుండా మాట్లాడుకుంటారు, సలహా ఇవ్వాల్సి వచ్చినా, తీసుకోవాల్సి వచ్చినా వెనుకాడరు.—సామె. 27:9.

20. ఇతరుల విశ్వాసాన్ని బలపర్చినప్పుడు మనం ఎలాంటి ప్రయోజనం పొందుతాం?

20 ఇతరుల విశ్వాసాన్ని బలపర్చండి. యేసు తన మాటల ద్వారా, పనుల ద్వారా శిష్యుల విశ్వాసాన్ని బలపర్చాడు. (మార్కు 11:20-24) మనం కూడా ఇతరుల విశ్వాసాన్ని బలపర్చాలి, అలాచేస్తే మన విశ్వాసం కూడా బలపడుతుంది. (సామె. 11:25) మీ ప్రాంతంలోని ప్రజలకు మీరెలా సహాయం చేయవచ్చు? వాళ్లకు ప్రకటించేటప్పుడు దేవుడు ఉన్నాడనీ ఆయనకు మనమీద శ్రద్ధ ఉందనీ బైబిలు నిజంగా దేవుని వాక్యమనీ నిరూపించే రుజువుల్ని చూపించండి. తోటి సహోదరసహోదరీల విశ్వాసాన్ని మీరెలా బలపర్చవచ్చు? వాళ్లలో ఎవరైనా, సంఘపెద్దల మీద ఫిర్యాదు చేస్తున్నారని తెలిస్తే, తొందరపడి ఆయన్ను లేదా ఆమెను దూరం పెట్టకండి. నేర్పుగా వాళ్ల విశ్వాసాన్ని బలపర్చడానికి ప్రయత్నించండి. (యూదా 22, 23) మీరు విద్యార్థులైతే, మీ టీచరు పరిణామ సిద్ధాంతాన్ని బోధిస్తున్నప్పుడు సృష్టి గురించి ధైర్యంగా మాట్లాడండి. అప్పుడు మీ టీచరు, మిగతా పిల్లలు చక్కగా స్పందించడం చూసి మీరే ఆశ్చర్యపోతారు.

21. యెహోవా మనందరికీ ఏ విషయంలో సహాయం చేస్తాడు?

21 పేతురు తన భయాల్ని, సందేహాల్ని తీసేసుకునేలా యెహోవా, యేసు సహాయం చేశారు. దానివల్ల పేతురు ఆ తర్వాత తన విశ్వాసాన్ని బలపర్చుకుని ఇతరులకు ఆదర్శంగా నిలిచాడు. అదేవిధంగా, మనందరం విశ్వాసంలో నిలకడగా ఉండేలా యెహోవా సహాయం చేస్తాడు. (1 పేతురు 5:9, 10 చదవండి.) మన విశ్వాసాన్ని బలపర్చుకోవాలంటే కృషి చేయాలి, అయితే అలా చేసినప్పుడు యెహోవా మనల్ని ఆశీర్వదిస్తాడు.

a ఉదాహరణకు, కావలికోట సార్వజనిక ప్రతిలో వచ్చే “బైబిలు జీవితాల్ని మారుస్తుంది” అనే ఆర్టికల్స్‌ చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి