వాళ్లలా విశ్వాసం చూపించండి | దెబోరా
‘నేను ఇశ్రాయేలులో ఒక తల్లిగా లేచాను’
దెబోరా తాబోరు కొండపైకి చేరుకున్న బారాకు సైన్యాన్ని చూసినప్పుడు ఆమెకు చాలా సంతోషంగా అనిపించింది. తెల్లవారుజాము వెలుగులో ఆమె కొన్ని క్షణాలపాటు వాళ్ల గుండె ధైర్యం గురించి, వాళ్ల నాయకుడైన బారాకు విశ్వాసం గురించి ఆలోచించింది. ఆ సైన్యంలో 10,000 మంది ఉన్నా వాళ్ల విశ్వాసానికి, ధైర్యానికి ఆ రోజు పెద్ద పరీక్షే ఎదురు కాబోతుంది. వాళ్లు ఒక భయంకరమైన శత్రువుతో పోరాడాలి. శత్రు సైన్యంతో పోలిస్తే వీళ్ల సైన్యం నలుసంతే. పైగా వీళ్ల దగ్గర సరిపడా ఆయుధాలు కూడా లేవు. అయినాసరే వాళ్లు అక్కడికి వచ్చారు. దానికి కారణం, ఈ ఒక్క స్త్రీ వాళ్లలో నూరిపోసిన ధైర్యం.
దెబోరా, బారాకు ఆ కొండ పైనుండి చూస్తున్నట్టు ఒక్కసారి ఊహించుకోండి. తాబోరు కొండ పైభాగం చదునుగా ఉంటుంది, అక్కడినుండి చూస్తే 400 మీటర్ల దిగువన ఎస్ద్రాయెలోను (యెజ్రెయేలు) మైదానం కనిపిస్తుంది. కీషోను నది ఆ చదునైన మైదానం గుండా ప్రవహించి కర్మెలు పర్వతం దాటి మహా సముద్రంలో కలుస్తుంది. ఆ ఉదయం బహుశా నదిలో నీళ్లు లేకపోయుండొచ్చు, కానీ ఆ విశాల మైదానంలో ఇంకేవో మెరుస్తూ కనిపించాయి. సీసెరా సైన్యం దగ్గరున్న ఇనుప ఆయుధాల మీద సూర్యకాంతి పడి మెరుస్తున్నాయి. చక్రాలకు ఇనుప కత్తులున్న దాదాపు 900 యుద్ధ రథాలు ఇశ్రాయేలు సైన్యం వైపు దూసుకొస్తున్నాయి. సీసెరా సైనిక దళంలో వాటికి తిరుగులేదు. ఆయుధాలు కూడా సరిగ్గాలేని ఇశ్రాయేలీయుల్ని బార్లీ కోత కోసినంత తేలిగ్గా నాశనం చేస్తానని సీసెరా అనుకున్నాడు.
బారాకు, అతని సైనికులు తన మాట లేదా సైగ కోసం ఎదురుచూస్తున్నారని దెబోరాకు తెలుసు. అక్కడున్న ఒకేఒక్క స్త్రీ తను మాత్రమేనా? అలాంటి పరిస్థితిలో అంత పెద్ద బాధ్యత భుజాల మీద వేసుకోవడం ఆమెకు ఎలా అనిపించి ఉంటుంది? అసలు ఇక్కడ నేనేం చేస్తున్నాను అని ఆమె అనుకుందా? లేదు! ఆమె దేవుడైన యెహోవా, యుద్ధం మొదలుపెట్టమని ఆమెకు చెప్పాడు, ఆ యుద్ధం ఒక స్త్రీ చేతిలో ముగుస్తుందని కూడా చెప్పాడు. (న్యాయాధిపతులు 4:9) దెబోరా అలాగే ధైర్యవంతులైన ఈ యోధులు చూపించిన విశ్వాసం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?
“నువ్వు తాబోరు కొండకు బయల్దేరు”
బైబిలు దెబోరాను “ఒక ప్రవక్త్రి” అంటూ పరిచయం చేస్తుంది. బైబిల్లో కొంతమంది ప్రవక్త్రిల గురించే ఉంది, వాళ్లలో ఒకామె దెబోరా.a దెబోరాకు ఇంకో బాధ్యత కూడా ఉంది. ప్రజలు తమ సమస్యల్ని చెప్పడానికి ఆమె దగ్గరికి వచ్చేవాళ్లు, ఆమె యెహోవా ఇచ్చే జవాబు వాళ్లకు చెప్పేది.—న్యాయాధిపతులు 4:4, 5.
దెబోరా బేతేలు-రామా పట్టణాల మధ్య ఎఫ్రాయిము పర్వత ప్రాంతంలో నివసించేది. అక్కడ ఆమె ఒక ఖర్జూర చెట్టు కింద కూర్చుని యెహోవా నిర్దేశం ప్రకారం ప్రజలకు సహాయం చేసేది. ఆమె చేయాల్సిన పని అంత తేలికేమీ కాదు, కానీ ఆమె భయపడలేదు. అప్పట్లో ప్రజలకు ఆమె అవసరం చాలా ఉంది. ఎందుకంటే, ఆ తర్వాత ఆమె దేవుని ప్రేరణతో పాడిన పాటలో, దేవునికి నమ్మకంగాలేని తన ప్రజల గురించి ఇలా అంది: “వాళ్లు కొత్త దేవుళ్లను ఎంచుకున్నారు; అప్పుడు ద్వారాల దగ్గర యుద్ధం జరిగింది.” (న్యాయాధిపతులు 5:8) ఇశ్రాయేలీయులు యెహోవాను విడిచిపెట్టి వేరే దేవుళ్లను ఆరాధించారు కాబట్టి, యెహోవా వాళ్లను శత్రువులకు వదిలేశాడు. సీసెరా అనే శక్తివంతుడైన సైన్యాధిపతి ద్వారా కనానీయుల రాజైన యాబీను వాళ్లమీద అధికారం చెలాయించాడు.
సీసెరా! ఆ పేరు వింటేనే ఇశ్రాయేలీయులకు గుండెల్లో గుబులు పుట్టేది. కనానీయుల మతం, సంస్కృతి ఎంత నీచాతినీచంగా ఉండేవంటే, వాళ్లు పసిపిల్లల్ని బలి ఇచ్చేవాళ్లు, ఆలయంలో వ్యభిచారం చేసేవాళ్లు. అలాంటి ప్రజలకు చెందిన ఒక అధిపతి, అతని సైన్యం ఒక దేశాన్ని గుప్పిట్లో పెట్టుకుంటే దాని పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి? వాళ్ల హయాంలో ప్రయాణం చేయడం కత్తి మీద సాము లాంటిదని, గ్రామాలైతే ఎవరూ లేక బోసిపోయాయని దెబోరా పాడిన పాటను బట్టి అర్థమౌతుంది. (న్యాయాధిపతులు 5:6, 7) వాళ్లు దాడిచేస్తారేమో, పిల్లల్ని ఎత్తుకెళ్లిపోతారేమో, స్త్రీలను పాడుచేస్తారేమో అనే భయం ప్రజల్ని వెంటాడేది. అందుకే ప్రజలు కొండల్లో-గుహల్లో దాక్కునేవాళ్లు, పొలం పనులు చేసుకోవడానికి జంకేవాళ్లు, ప్రాకారం లేని గ్రామాల్లో నివసించడానికి, రోడ్ల మీద ప్రయాణాలు చేయడానికి గజగజ వణికేవాళ్లు.b
20 సంవత్సరాల పాటు భయం రాజ్యమేలింది. మొండిగా ఉన్న ఇశ్రాయేలీయులు మారనంతవరకు యెహోవా పరిస్థితిని అలాగే ఉండనిచ్చాడు. ఇంకో మాటలో చెప్పాలంటే దెబోరా, బారాకు పవిత్రశక్తితో పాడిన పాట ప్రకారం “దెబోరానైన నేను బయల్దేరే వరకు, నేను ఇశ్రాయేలులో ఒక తల్లిగా లేచే వరకు” పరిస్థితి అలాగే ఉంది. లప్పీదోతు భార్య అయిన దెబోరా నిజంగా ఒక తల్లో కాదో మనకు తెలీదు, కానీ పాటలో తల్లి అనే మాట ఒక పోలిక మాత్రమే. ఒక తల్లిలా దేశాన్ని కాపాడే బాధ్యతను యెహోవా దెబోరాకు ఇచ్చాడని తెలుస్తుంది. యెహోవా మాట ప్రకారం ఆమె న్యాయాధిపతైన బారాకును పిలిపించి, బలమైన విశ్వాసం ఉన్న ఆయన్ని సీసెరాతో పోరాడడానికి వెళ్లమని చెప్పింది.—న్యాయాధిపతులు 4:3, 6, 7; 5:7.
దేవుని ప్రజల కోసం పోరాడమని దెబోరా బారాకును ప్రోత్సహించింది
“నువ్వు తాబోరు కొండకు బయల్దేరు” అని దెబోరా ద్వారా యెహోవా ఆజ్ఞాపించాడు. బారాకు, ఇశ్రాయేలులోని రెండు గోత్రాల నుండి 10,000 మందిని పోగుచేయాలి. వాళ్లు శక్తిమంతుడైన సీసెరాను, అతని 900 రథాలను ఓడిస్తారని దేవుడు మాట ఇచ్చాడని దెబోరా చెప్పింది! ఆ మాట విని బారాకు ఖచ్చితంగా ఆశ్చర్యపోయి ఉంటాడు. ఎందుకంటే ఇశ్రాయేలుకు సైన్యం గానీ, ఎక్కువ ఆయుధాలు గానీ లేవు. అయినాసరే బారాకు యుద్ధానికి వెళ్లడానికి ముందుకొచ్చాడు, కానీ దెబోరా కూడా తమతోపాటు తాబోరు కొండకు వస్తేనే వెళ్తాను అని అన్నాడు.—న్యాయాధిపతులు 4:6-8; 5:6-8.
అలా అడిగాడంటే బారాకుకు విశ్వాసం లేదని కొంతమంది అనుకుంటారు, కానీ అది నిజం కాదు. ఎందుకంటే, అతను దేవుణ్ణి ఎక్కువ ఆయుధాలు కావాలని అడగలేదు. బదులుగా విశ్వాసం ఉంది కాబట్టే తనను, తన మనుషుల్ని బలపర్చడానికి యెహోవా ప్రతినిధి తమతో ఉంటే బాగుంటుందని ఆలోచించాడు. (హెబ్రీయులు 11:32, 33) దానికి యెహోవా కూడా ఒప్పుకున్నాడు. బారాకు కోరినట్టే, దెబోరాను వాళ్లతో వెళ్లనిచ్చాడు. అయితే, యుద్ధంలోని కీలక ఘట్టాన్ని ముగించేది మాత్రం ఒక పురుషుడు కాదని ప్రవచించేలా కూడా యెహోవా ఆమెను ప్రేరేపించాడు. (న్యాయాధిపతులు 4:9) దుష్టుడైన సీసెరా ఒక స్త్రీ చేతిలో చస్తాడని యెహోవా నిర్ణయించాడు!
ఈ రోజుల్లో స్త్రీలపై జరిగే దౌర్జన్యాలకు, అరాచకాలకు, అన్యాయాలకు అడ్డేలేదు. ఎక్కడో ఒకరిద్దరు మాత్రమే దేవుడు కోరుకున్నట్టు వాళ్లను గౌరవిస్తున్నారు. దేవుడు మాత్రం స్త్రీలను, పురుషుల్ని సమానంగా చూస్తాడు, ఆమోదిస్తాడు. (రోమీయులు 2:11; గలతీయులు 3:28) ఆయన స్త్రీలకు బాధ్యతలు అప్పగించి వాళ్లపై తనకు ఎంతో నమ్మకం ఉందని చూపిస్తాడు. అందుకు దెబోరా ఒక మంచి ఉదాహరణ. కాబట్టి మనం లోకంలోని ప్రజల్లా స్త్రీలను చిన్నచూపు చూడకుండా ఉండడం ప్రాముఖ్యం.
“భూమి వణికింది, ఆకాశం నీటిని కుమ్మరించింది”
బారాకు తన సైన్యాన్ని సిద్ధం చేసుకోవడానికి వెళ్లాడు. భయంకరమైన సీసెరా సైన్యంతో పోరాడే ధైర్యం ఉన్న 10,000 మందిని పోగుచేశాడు. బారాకు వాళ్లను తాబోరు కొండ మీదికి తీసుకెళ్తున్నప్పుడు, తమలో ధైర్యం నింపడానికి దెబోరా పక్కనే ఉండడం చూసి సంతోషించాడు. బైబిలు ఇలా చెప్తుంది: “దెబోరా కూడా అతనితోపాటు వెళ్లింది.” (న్యాయాధిపతులు 4:10) యెహోవా దేవుని మీదున్న విశ్వాసం వల్ల ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి తమతోపాటు వస్తున్న ఆ ధైర్యవంతురాలిని చూసి సైనికులు ఎంత బలం పొందివుంటారో కదా!
ఇశ్రాయేలీయులు తనతో పోరాడడానికి సైన్యాన్ని పోగుచేసేంత సాహసం చేశారని సీసెరాకు తెలిసినప్పుడు అతను ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. చాలామంది కనాను రాజులు యాబీను రాజుతో చేతులు కలిపారు. అతను వాళ్లందరిలో అత్యంత శక్తిమంతుడు అయ్యుంటాడు. సీసెరా సైన్యం వందల రథాలతో యుద్ధ భూమిలోకి దూసుకొస్తుండగా భూమి కంపించింది. ఆ కనానీయులు, బలహీనమైన ఇశ్రాయేలు సైన్యాన్ని ఇట్టే చిత్తు చేస్తామని అనుకున్నారు.—న్యాయాధిపతులు 4:12, 13; 5:19.
శత్రు సైన్యం సమీపిస్తోంది! మరి బారాకు, దెబోరా ఏం చేస్తారు? ఒకవేళ వాళ్లు తాబోరు కొండ ఏటవాలు ప్రాంతంలోనే ఉండిపోతే, ముందుకొస్తున్న కనాను సైన్యాల మీద పైచేయి సాధించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే, రథాలు చదునైన నేల మీద మాత్రమే తిరుగులేని విధంగా పనిచేస్తాయి. కానీ బారాకు యెహోవా చెప్పినట్టు యుద్ధం చేస్తాడు, అందుకే దెబోరా మాట కోసం వేచివున్నాడు. చివరికి ఆ క్షణం రానేవచ్చింది. దెబోరా ఇలా అంది: “లే, యెహోవా సీసెరాను నీ చేతికి అప్పగించేది ఈ రోజే. యెహోవా నీకు ముందుగా వెళ్తున్నాడు కదా.” తర్వాత, “బారాకు తాబోరు కొండ దిగాడు, అతని వెనక 10,000 మంది దిగారు” అని బైబిలు చెప్తుంది.—న్యాయాధిపతులు 4:14.c
ఇశ్రాయేలు సైన్యం కొండ దిగి, కిందున్న చదునైన స్థలంలోని భీకర రథాల వైపుకు దూసుకొస్తుంది. మరి దెబోరా చెప్పినట్టు, యెహోవా వాళ్లకు ముందుగా వెళ్లాడా? కాసేపటికే జవాబు దొరికింది, బైబిలు ఇలా చెప్తుంది: “భూమి వణికింది, ఆకాశం నీటిని కుమ్మరించింది.” దాంతో సీసెరా సైనికులు అయోమయంలో పడిపోయారు. వర్షం ఎంత జోరుగా కురిసిందంటే, చూస్తుండగానే అంతా బురదబురద అయింది. బరువైన ఇనుప రథాలు బురదలో కూరుకుపోయి కదల్లేదు, వాటివల్ల ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది.—న్యాయాధిపతులు 4:14, 15; 5:4.
ఆ భారీ వర్షం చూసి బారాకు, అతని సైన్యం భయపడలేదు. ఎందుకంటే, దాన్ని ఎవరు కురిపించారో వాళ్లకు తెలుసు. దాంతో వాళ్లు నేరుగా కనాను సైన్యాల వైపుకు పరుగెత్తారు. ఇశ్రాయేలీయులు సీసెరా సైన్యంలో ఒక్కర్ని కూడా వదలకుండా అందర్నీ చంపేశారు, అలా దేవుని తీర్పును అమలుచేశారు. కీషోను నది ఉప్పొంగి వరదలా ప్రవహించి, వాళ్ల శవాల్ని మహా సముద్రం వైపుకి కొట్టుకుపోయింది.—న్యాయాధిపతులు 4:16; 5:21.
దెబోరా ముందే చెప్పినట్టు, యెహోవా తన ప్రజల కోసం పోరాడి సీసెరా సైన్యాల్ని ఓడించాడు
ఇప్పుడైతే యెహోవా తన సేవకుల్ని అలాంటి యుద్ధాలకు పంపించడం లేదు. కానీ తన ప్రజలు సాతానుతో, అతని గుప్పిట్లో ఉన్న లోకంతో పోరాడాలని చెప్తున్నాడు. (మత్తయి 26:52; 2 కొరింథీయులు 10:4) ఈ లోకంలో మనం దేవునికి లోబడడానికి శాయశక్తులా ప్రయత్నిస్తుంటే, ఆ యుద్ధంలో పాల్గొన్నట్టే. అలా చేయడానికి ధైర్యం కావాలి, ఎందుకంటే ఈ రోజుల్లో దేవుని వైపు ఉండేవాళ్లకు తీవ్రమైన వ్యతిరేకత రావచ్చు. కానీ యెహోవా మారలేదు. దెబోరా, బారాకు, ఇశ్రాయేలు సైనికుల్లాగే తన మీద విశ్వాసం, నమ్మకం ఉంచేవాళ్లకు ఆయన ఎప్పుడూ అండగా ఉంటాడు.
“స్త్రీలందరిలో ఆమె ఎక్కువగా ఆశీర్వదించబడినది”
కానీ ఆ కనానీయుల్లో అందరికన్నా ఘోరమైన శత్రువు తప్పించుకున్నాడు! అతనే సీసెరా. దేవుని ప్రజల్ని రాచి రంపాన పెట్టిన సీసెరా, తన రథాన్ని వదిలేసి యుద్ధభూమి నుండి పారిపోయాడు. తన సైనికుల్ని చావుకు వదిలేసి, ఇశ్రాయేలు సైనికుల కళ్లుగప్పి చదునైన నేల వైపు పరుగులు తీశాడు. దగ్గర్లో ఉన్న తన స్నేహితుల దగ్గరికి వెళ్లి ప్రాణాలు కాపాడుకోవాలని అనుకున్నాడు. ఎక్కడ ఇశ్రాయేలు సైనికుల చేతికి చిక్కుతానో అని భయపడుతూ, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మైళ్ల దూరంలో ఉన్న హెబెరు డేరాల వైపుకు పరుగెత్తాడు. ఈ హెబెరు, ఒక కేనీయుడు, దక్షిణాన నివసిస్తున్న తన తోటి కేనీయుల నుండి వేరుగా ఉంటున్నాడు. అతను యాబీను రాజుతో స్నేహం కుదుర్చుకున్నాడు.—న్యాయాధిపతులు 4:11, 17.
సీసెరా చెమటలు కక్కుతూ ఎలాగోలా హెబెరు డేరా దగ్గరికి చేరుకున్నాడు. కానీ ఆ సమయానికి హెబెరు అక్కడ లేడు, కానీ అతని భార్య యాయేలు ఉంది. యాబీను రాజుతో తన భర్త హెబెరుకు ఉన్న స్నేహాన్ని ఆమె గౌరవిస్తుందని సీసెరా అనుకునివుంటాడు. ఒక స్త్రీ తన భర్తకు వేరుగా ఆలోచిస్తుందని గానీ, పనిచేస్తుందని గానీ అతను అస్సలు ఊహించలేకపోయాడు. సీసెరాకు యాయేలు గురించి బొత్తిగా తెలీదు! దేశంలో కనానీయులు చేస్తున్న అరాచకాల్ని ఆమె కళ్లారా చూసింది కాబట్టి తను ఎటువైపు ఉండాలో తేల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆమెకు అర్థమై ఉంటుంది. ఆమె కావాలనుకుంటే, దుష్టుడైన సీసెరాకు సహాయం చేయవచ్చు, లేదా యెహోవా పక్షాన ఉండి ఆయన ప్రజల శత్రువైన సీసెరాను చంపేయవచ్చు. కానీ ఆమె ఏం చేయగలదు? యుద్ధంలో రాటుదేలిన వీరుడిని ఒక స్త్రీ ఎలా చంపగలదు?
ఆలోచించడానికి యాయేలుకు ఎక్కువ సమయం లేదు. సీసెరా పడుకోవడానికి ఆమె ఒక చోటును చూపించింది. ఎవరైనా తనను వెతుక్కుంటూ వస్తే చెప్పొద్దని అతను ఆమెకు ఆజ్ఞాపించాడు. అతను తల వాల్చగానే ఆమె దుప్పటి కప్పింది, తాగడానికి నీళ్లు అడిగితే మీగడ పాలు ఇచ్చింది. కాసేపటికే సీసెరా గాఢ నిద్రలోకి జారుకున్నాడు. అప్పుడు యాయేలు డేరాల్లో నివసించే స్త్రీలకు వాడడం బాగా తెలిసిన రెండు పనిముట్లను, అంటే డేరా మేకును, చెక్క సుత్తిని తీసుకుంది. మెల్లగా సీసెరా తల దగ్గరికి వెళ్లి నిలబడింది. ఇప్పుడు ఆమె వాటితో యెహోవా శత్రువును చంపాలి. యాయేలు గుండె దడదడ కొట్టుకొని ఉంటుంది. ఒక్క క్షణం ఏమరపాటుగా ఉన్నా, సంకోచించినా అంతా తలకిందులౌతుంది. సీసెరా దశాబ్దాల పాటు దేవుని ప్రజల్ని ఘోరంగా హింసించడాన్ని ఆమె గుర్తుచేసుకుందా? యెహోవా పక్షాన నిలబడే గొప్ప గౌరవం గురించి ఆమె ఆలోచించిందా? దాని గురించి బైబిలు ఏమీ చెప్పట్లేదు. కానీ ఆమె చేయాల్సింది చేసిందని మాత్రం మనకు తెలుసు. సీసెరా చనిపోయాడు!—న్యాయాధిపతులు 4:18-21; 5:24-27.
తర్వాత, బారాకు తన శత్రువును వెతుక్కుంటూ వచ్చాడు. యాయేలు తను చంపిన సీసెరాను ఆయనకు చూపించింది. అప్పుడు బారాకుకు దెబోరా చెప్పిన ప్రవచనం నెరవేరిందని అర్థమైంది. సీసెరా అనే శక్తివంతమైన యోధుడిని ఒక స్త్రీ చంపేసింది! కొంతమంది విమర్శకులు యాయేలును ఒక కిరాతకురాలు అని అంటారు. కానీ బారాకు, దెబోరా మాత్రం ఆమెను అలా చూడలేదు. వాళ్లు పవిత్రశక్తితో పాడిన పాటలో, యాయేలు ధైర్యంగా చేసిన పనిని బట్టి ఆమెను పొగుడుతూ ఇలా పాడారు: “స్త్రీలందరిలో ఆమె ఎక్కువగా ఆశీర్వదించబడినది.” (న్యాయాధిపతులు 4:22; 5:24) దెబోరాకు ఎంత మంచి మనసు ఉందో ఆమె పాడిన పాటను బట్టి తెలుస్తుంది; యాయేలుకు ఘనత దక్కుతుందని ఆమె ఈర్ష్యపడలేదు. బదులుగా యెహోవా మాట నిజమైనందుకు సంతోషించింది.
సీసెరా లేడు కాబట్టి యాబీను రాజు బలం తగ్గింది, అతను ఇక ఇశ్రాయేలీయుల్ని అణచివేయలేకపోయాడు. చివరికి కనానీయుల దారుణాలకు అడ్డుకట్ట పడింది. 40 సంవత్సరాల పాటు అంతా ప్రశాంతంగా ఉంది. (న్యాయాధిపతులు 4:24; 5:31) యెహోవా దేవుని మీద విశ్వాసం చూపించినందుకు దెబోరా, బారాకు, యాయేలు ఎంత దీవించబడ్డారో కదా! మనం కూడా దెబోరా లాంటి విశ్వాసం చూపించి ధైర్యంగా యెహోవా పక్షాన నిలబడితే, ఇతరుల్ని కూడా అలా చేయమని ప్రోత్సహిస్తూ ఉంటే యెహోవా మనల్ని కూడా దీవిస్తాడు. ఎన్నో విజయాల్ని, అంతులేని శాంతిని సొంతం చేసుకుంటాం!
a ఇతర ప్రవక్త్రిలలో మిర్యాము, హుల్దా, యెషయా భార్య ఉన్నారు.—నిర్గమకాండం 15:20; 2 రాజులు 22:14; యెషయా 8:3.
b దెబోరా పాడిన పాటను బట్టి ఈ విషయాలు తెలుస్తున్నాయి: సీసెరా యుద్ధం చేసి తిరిగి వచ్చినప్పుడల్లా తనతోపాటు దోపుడుసొమ్మును తెచ్చుకునేవాడు, అందులో అమ్మాయిలు కూడా ఉండేవాళ్లు. కొన్నిసార్లు ఒక్కో సైనికుడు ఒకరికంటే ఎక్కువమంది అమ్మాయిల్ని తెచ్చుకునేవాడు. (న్యాయాధిపతులు 5:30) ఆ వచనంలో “అమ్మాయి” అని ఉపయోగించిన పదానికి అక్షరార్థంగా “గర్భం” అనే అర్థం వస్తుంది. ఆ పదాన్ని బట్టి, ఆ స్త్రీలను పిల్లల్ని కనడానికి పనికొచ్చేవాళ్లుగా మాత్రమే చూసేవాళ్లని తెలుస్తుంది. బహుశా అందుకే స్త్రీలను పాడుచేయడం అప్పట్లో సర్వసాధారణమైన విషయం.
c ఆ యుద్ధం గురించి న్యాయాధిపతులు 4, 5 అధ్యాయాలు రెండూ వివరిస్తున్నాయి. 4వ అధ్యాయంలో జరిగిన సంఘటనలు ఉన్నాయి. 5వ అధ్యాయంలో దెబోరా, బారాకు పాడిన ఒక విజయగీతం ఉంది. ఒక అధ్యాయంలో లేని విషయాలు ఇంకో అధ్యాయంలో ఉన్నాయి కాబట్టి, రెండూ కలిపి చదివితే అసలు అక్కడ ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోవచ్చు.