కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w15 5/15 పేజీలు 31-32
  • భోజన ఏర్పాట్ల వెనకున్న ప్రేమను ఆయన చూశాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • భోజన ఏర్పాట్ల వెనకున్న ప్రేమను ఆయన చూశాడు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
  • ఉపశీర్షికలు
  • “నిలబడే భోంచేస్తున్నారు”
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
w15 5/15 పేజీలు 31-32
సమావేశ భోజన ఏర్పాట్లలో సంతోషంగా కలిసి పనిచేస్తున్న స్వచ్ఛంద సేవకులు

ఆనాటి జ్ఞాపకాలు

భోజన ఏర్పాట్ల వెనకున్న ప్రేమను ఆయన చూశాడు

సమావేశాలకు హాజరై, మన సహోదరసహోదరీలతో కలిసి ఆధ్యాత్మిక విందును ఆరగించడం ఎంతో సంతోషాన్నిస్తుంది. దానికితోడు, హాజరైనవాళ్లు తమ దగ్గరున్న ఆహారాన్ని ఒకరితోఒకరు పంచుకున్నప్పుడు ఆ ఆనందం రెట్టింపు అవుతుంది.

బైబిలు విద్యార్థులు 1919, సెప్టెంబరులో అమెరికా, ఒహాయోలోని సీడార్‌ పాయింట్‌లో 8 రోజులపాటు సమావేశాన్ని జరుపుకున్నారు. వేరే ప్రాంతాల నుండి ఆ సమావేశానికి వచ్చేవాళ్ల కోసం అక్కడున్న హోటళ్లలో వసతి, భోజనం ఏర్పాటు చేశారు. అయితే అనుకున్నదానికన్నా వేలమంది ఎక్కువ రావడంతో, ఆ హోటళ్లలో వెయిటర్లందరూ పనిచేయలేక చేతులెత్తేశారు. దాంతో ఏమి చేయాలో తెలీక ఒక హోటల్‌ మేనేజర్‌, ఆ హోటల్‌లో ఉన్న బైబిలు విద్యార్థుల్లోని యౌవనుల సహాయం అడిగాడు. అప్పుడు చాలామంది ముందుకొచ్చారు. వాళ్లలో ఒకరైన సాడీ గ్రీన్‌ అనే సహోదరి ఇలా గుర్తుచేసుకుంది, ‘వెయిటర్‌గా పని చేయడం నాకదే మొదటిసారి, కానీ మేము ఎంతో సరదాగా గడిపాం.’

సియెర్రా లియోన్‌లో వంటపాత్రలోని ఆహారాన్ని కలుపుతున్న ఓ సహోదరి

సియెర్రా లియోన్‌లో, 1982

ఆ తర్వాతి సంవత్సరాల్లో, సమావేశానికి హాజరయ్యే వాళ్లకోసం సహోదరులే భోజన ఏర్పాట్లు చేశారు. ఆ ఏర్పాట్లలో సహాయం చేయడానికి ఎంతోమంది సంతోషంగా ముందుకొచ్చారు. తోటి సహోదరసహోదరీలతో కలిసి పనిచేయడం వల్ల చాలామంది యౌవనులు ఆధ్యాత్మిక లక్ష్యాలు పెట్టుకోగలిగారు. 1937లో జరిగిన సమావేశంలో, భోజన ఏర్పాట్లలో సహాయం చేసిన గ్లాడెస్‌ బోల్టన్‌ అనే సహోదరి ఇలా చెప్పింది, ‘వేరే ప్రాంతాల నుండి వచ్చిన వాళ్లను నేను కలుసుకున్నాను. వాళ్లు సమస్యల్ని ఎలా అధిగమిస్తున్నారో విన్న తర్వాత, నేను కూడా పయినీరు సేవ చేయగలనని నాకు మొదటిసారి అనిపించింది.’

బ్యూలా కోవీ అనే ఓ సహోదరి ఇలా చెప్పింది, ‘వాలంటీర్లు కష్టపడి పనిచేయడంవల్ల పనులన్నీ సరిగ్గా సమయానికి అయిపోయేవి.’ అయితే ఆ పనిలో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. 1969లో కాలీఫోర్నియాలో, లాస్‌ ఏంజెల్స్‌లోని డాడ్జర్‌ స్టేడియంలో ఓ సమావేశం జరిగింది. దానిలో భోజన ఏర్పాట్లు చూసుకునే బాధ్యతను తనకు అప్పగించారని, ఆంజిలూ మెనిరా అనే సహోదరునికి అక్కడికి వచ్చాకే తెలిసింది. ఆయనిలా అన్నాడు, ‘విషయం తెలిసి అవాక్కయ్యాను!’ ఆ ఏర్పాట్లలో భాగంగా కిచెన్‌కు గ్యాస్‌లైన్‌ ఏర్పాటు చేయడం కోసం 400 మీటర్ల పొడవున్న గొయ్యి తవ్వాల్సి వచ్చింది!

జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో వంట పాత్రలు

జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో, 1951

సియెర్రా లియోన్‌లో 1982లో ఓ సమావేశం కోసం, స్వచ్ఛంద సేవకులు ముందుగా పొలాల్ని చదును చేసి, ఆ స్థలాన్ని బాగుచేసి, అక్కడున్న వస్తువులతోనే ఎంతో కష్టపడి ఒక భోజనశాలను ఏర్పాటు చేశారు. 1951లో జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో సమావేశ భోజన ఏర్పాట్ల కోసం, సమయస్ఫూర్తిగల కొంతమంది సహోదరులు ఓ రైలు ఇంజన్‌ను అద్దెకు తెచ్చారు. దానినుండి వచ్చే ఆవిరితో ఒకేసారి 40 పాత్రల్లో వంటచేశారు. గంటకు 30,000 మందికి ఆహారం వడ్డించగలిగారు. 576 మంది స్వచ్ఛంద సేవకులు అంట్లు కడగడంలో సహాయం చేశారు. వాళ్లకు పని తగ్గించడం కోసం, సమావేశానికి హాజరైనవాళ్లు తమ సొంత స్పూన్లు, ఫోర్క్‌లు వంటివి తెచ్చుకున్నారు. మియన్మార్‌లోని యాంగన్‌లో సమావేశం జరిగినప్పుడు, వేరే దేశాల నుండి వచ్చేవాళ్లను మనసులో పెట్టుకుని తక్కువ మిరపకాయలు వేసి వంట వేశారు.

“నిలబడే భోంచేస్తున్నారు”

అనీ పోగెన్సీ అనే సహోదరి 1950లో అమెరికాలోని ఓ సమావేశానికి హాజరైంది. ఆమె మధ్యాహ్నం మండుటెండలో భోజనం లైన్‌లో నిలబడినప్పుడు విన్న ఓ సంభాషణ ఆమెకు ప్రోత్సాహాన్ని ఇచ్చింది. దానిగురించి ఆమె ఇలా చెప్పింది, ‘యూరప్‌ నుండి ఓడలో వచ్చిన ఇద్దరు సహోదరీలు ప్రోత్సాహకరంగా మాట్లాడుకుంటున్నారు. నేను వాళ్ల మాటలు వింటూ ఉండిపోయాను.’ అక్కడికి రావడానికి యెహోవా ఎలా సహాయం చేశాడో వాళ్లిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ‘అక్కడున్న వాళ్లందరిలో వీళ్లే ఎక్కువ సంతోషంగా ఉన్నారు. చాలాసేపు లైన్‌లో నిలబడాల్సిరావడం, ఎండా ఇవేవీ వాళ్లు పట్టించుకోలేదు’ అని పోగెన్సీ చెప్పింది.

కొరియాలోని సియోల్‌లో నిలబడి భోంచేస్తున్నవాళ్లు

కొరియాలోని సియోల్‌లో, 1963

ఎన్నో పెద్దపెద్ద సమావేశాల్లో, భోజనం చేయడం కోసం పెద్ద టెంట్‌లనూ, వాటిలో వరుసగా టేబుళ్లనూ ఏర్పాటు చేశారు. దాంతో ఎక్కువమంది నిలబడి త్వరగా భోంచేయడం వీలైంది. కాబట్టి మధ్యాహ్న విరామం కొద్దిసేపైనా, వేలమంది భోంచేయగలిగారు. దీన్ని చూసి, సాక్షికాని ఒకతను ఇలా అన్నాడు, ‘వీళ్ల మతం వింతగా ఉంది. వీళ్లందరూ నిలబడే భోంచేస్తున్నారు.’

మన భోజన ఏర్పాట్లు ఎంతో చక్కగా, పద్ధతిగా జరగడం చూసి కొంతమంది సైనికాధికారులు, ప్రభుత్వాధికారులు ఆశ్చర్యపోయారు. న్యూయార్క్‌లోని యాంకీ స్టేడియంలో జరిగిన సమావేశపు భోజన ఏర్పాట్లను కొంతమంది అమెరికా సైనికులు పరిశీలించారు. ఆ తర్వాత, బ్రిటీష్‌ యుద్ధ విభాగానికి చెందిన మేజర్‌ ఫోక్నర్‌ను కూడా వెళ్లి చూడమని సలహా ఇచ్చారు. దాంతో ఆయన తన భార్యతో కలిసి, “విజయవంతమైన రాజ్యం” అనే అంశంపై 1955లో ఇంగ్లాండ్‌లోని ట్వికెన్‌హామ్‌లో జరిగిన సమావేశానికి హాజరయ్యాడు. అక్కడి భోజన ఏర్పాట్లను పరిశీలించిన తర్వాత, వాటి వెనకున్న ప్రేమను తాను చూడగలిగానని ఆయన మెచ్చుకున్నాడు.

ఎన్నో దశాబ్దాలపాటు ప్రేమగల స్వచ్ఛంద సేవకులు, సమావేశాలకు వచ్చేవాళ్లకోసం తక్కువ ఖర్చుతో పోషకాహారాన్ని వండి, వడ్డించారు. కానీ అందుకోసం ఎంతో మంది స్వచ్ఛంద సేవకులు గంటలు తరబడి పని చేయాల్సి వచ్చేది. కొన్నిసార్లైతే వాళ్లు సమావేశంలోని కొన్ని ప్రసంగాల్ని లేదా పూర్తి కార్యక్రమాన్ని వినలేకపోయేవాళ్లు. అందుకే, 1970వ దశాబ్దం చివర్లో చాలా సమావేశాల్లో, భోజన ఏర్పాట్లలో కొన్ని మార్పులు వచ్చాయి. 1995 నుండి, సమావేశాలకు వచ్చేవాళ్లు తమవెంట భోజనం తెచ్చుకోవడం మొదలుపెట్టారు. భోజన ఏర్పాట్లలో సహాయం చేసిన స్వచ్ఛంద సేవకులు ఇక అప్పటినుండి సమావేశాల్లోని ఆధ్యాత్మిక ఆహారాన్ని, సహోదరసహోదరీల సహవాసాన్ని ఆనందించగలుగుతున్నారు.a

తోటి విశ్వాసుల కోసం చాలా కష్టపడి పనిచేసిన ఆ స్వచ్ఛంద సేవకులు యెహోవా దృష్టిలో ఎంతో విలువైనవాళ్లు. అయితే, ఒకప్పుడు భోజన ఏర్పాట్లలో సంతోషంగా పాల్గొన్న కొంతమంది, ఇప్పుడు అలాంటి అవకాశం లేదని బాధపడుతుండవచ్చు. కానీ ఒకటి మాత్రం నిజం. అదేమిటంటే, ఇప్పటికీ మన సమావేశాల్లో ముఖ్యంగా కనిపించేది ప్రేమే.—యోహా. 13:34, 35.

a అయితే, సమావేశాల్లోని ఇతర విభాగాల్లో స్వచ్ఛందంగా పనిచేసే అవకాశాలు ఇప్పటికీ ఎన్నో ఉన్నాయి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి