కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w15 4/15 పేజీలు 14-18
  • మంచికాలాల్లోనూ, కష్టకాలాల్లోనూ దీవెనలు పొందాం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మంచికాలాల్లోనూ, కష్టకాలాల్లోనూ దీవెనలు పొందాం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • కష్టకాలాలు
  • యెహోవా మద్దతు చవిచూశాం
  • అరెస్టు, జైలు
  • కష్టకాలాల్లో కూడా పొందిన దీవెనలు
  • మంచికాలాలు మళ్లీ వచ్చాయి
  • యెహోవా ఎల్లప్పుడూ మన గురించి శ్రద్ధ తీసుకుంటాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • యెహోవా చూపించిన దారిలో వెళ్లాలనుకున్నాను
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
w15 4/15 పేజీలు 14-18

జీవిత కథ

మంచికాలాల్లోనూ, కష్టకాలాల్లోనూ దీవెనలు పొందాం

ట్రోఫిం ఆర్‌. సోంబా చెప్పినది

ట్రోఫిం సోంబా

మలావీలోని నామ్కూంబా అనే పల్లెటూర్లో, 1930 మార్చిలో నేను పుట్టాను. మా కుటుంబ సభ్యులు, స్నేహితులు యెహోవా ఆరాధకులే. నేను 1942లో యెహోవాకు సమర్పించుకుని, మా ఊర్లో ఉన్న ఓ అందమైన నదిలో బాప్తిస్మం పొందాను. “వాక్యమును ప్రకటించుము; సమయమందును అసమయమందును ప్రయాసపడుము” అంటే మంచికాలాల్లోనూ కష్టకాలాల్లోనూ ప్రయాసపడాలని పౌలు ఇచ్చిన సలహాను, నేను గత 70 ఏళ్లుగా పాటించడానికి కృషి చేస్తున్నాను.—2 తిమో. 4:2.

నేథన్‌ హెచ్‌. నార్‌, మిల్టన్‌ జి. హెన్షల్‌ 1948లో మొదటిసారి మలావీని సందర్శించినప్పుడు, పూర్తికాల సేవ చేయాలనే కోరిక నాలో కలిగింది. మన ప్రపంచ ప్రధాన కార్యాలయం నుండి వచ్చిన ఆ సహోదరులు చెప్పిన ప్రోత్సాహకరమైన మాటల్ని నేనిప్పటికీ సంతోషంగా గుర్తుచేసుకుంటాను. “అన్ని దేశాలకు శాశ్వత అధిపతి” అనే అంశంపై సహోదరుడు నార్‌ ఇచ్చిన ఉత్తేజకరమైన ప్రసంగాన్ని సుమారు 6,000 మందిమి నిలబడి శ్రద్ధగా విన్నాం.

ఆ తర్వాత, నాలాగే పూర్తికాల సేవ చేయాలనే లక్ష్యం ఉన్న లిడాసీ అనే ఓ అందమైన సహోదరితో పరిచయమైంది. ఆమె కూడా నాలాగే యెహోవాసాక్షుల కుటుంబంలో పెరిగింది. మేము 1950లో పెళ్లి చేసుకున్నాం, 1953కల్లా మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మాకు ఎన్నో కుటుంబ బాధ్యతలున్నా, కనీసం నేనైనా క్రమ పయినీరు సేవ చేయాలని మేము అనుకున్నాం. రెండేళ్ల తర్వాత, నాకు ప్రత్యేక పయినీరు సేవ చేసే అవకాశం వచ్చింది.

మలావీలో జరుగుతున్న ఓ జిల్లా సమావేశం

ముందుముందు రాబోయే హింసల కోసం సమావేశాలు మమ్మల్ని సిద్ధంచేశాయి

ప్రత్యేక పయినీరుగా సేవ చేస్తున్న కొంత కాలానికే, నాకు ప్రాంతీయ పర్యవేక్షకునిగా సేవచేసే గొప్ప అవకాశం వచ్చింది. లిడాసీ బాగా సహకరించడం వల్ల, ఓవైపు మా కుటుంబ అవసరాలన్నిటినీ తీరుస్తూనే నేను పూర్తికాల సేవలో ఉండగలిగాను.a అయితే, మేమిద్దరం పూర్తికాల సేవలో ఉండాలనేది మా కోరిక. దానికోసం మేము జాగ్రత్తగా ప్రణాళిక వేసుకున్నాం, మా పిల్లలు కూడా సహకరించడంతో 1960లో లిడాసీ కూడా పూర్తికాల సేవ మొదలుపెట్టింది.

మేము 1962లో “ధైర్యవంతులైన పరిచారకులు” అనే జిల్లా సమావేశానికి హాజరయ్యాం. తర్వాత సంవత్సరంలో, మలావీలోని బ్లాన్‌టైర్‌ అనే పట్టణం దగ్గర్లో జరిగిన ఓ ప్రత్యేక సమావేశానికి సహోదరుడు హెన్షల్‌ వచ్చాడు. దానికి 10,000 కన్నా ఎక్కువమంది హాజరయ్యారు. మలావీలో ముందుముందు రాబోయే కష్టాల్ని తట్టుకోవడానికి ఆ సమావేశాలు మమ్మల్ని సిద్ధం చేసి, బలపర్చాయి.

కష్టకాలాలు

బ్రాంచి కార్యాలయం గేటుకు తాళం వేస్తున్న ఓ పోలీసు

ప్రభుత్వం మన పనిని నిషేధించి, బ్రాంచి కార్యాలయాన్ని జప్తు చేసింది

మలావీలోని సాక్షులు, రాజకీయాల్లో పాల్గొనడానికి నిరాకరించినందుకు 1964లో ఎన్నో హింసలు అనుభవించారు. అంతేకాదు, 100కి పైగా రాజ్యమందిరాలను, 1,000కి పైగా సాక్షుల ఇళ్లను శత్రువులు నాశనం చేశారు. 1967లో మలావీ ప్రభుత్వం మన పనిని నిషేధించేంత వరకు నేను, లిడాసీ ప్రాంతీయ సేవలోనే ఉన్నాం. మలావీ ప్రభుత్వం బ్లాన్‌టైర్‌లోని మన బ్రాంచి కార్యాలయాన్ని జప్తు చేసి, మిషనరీలను అక్కడినుండి బలవంతంగా పంపించేసింది. నన్నూ లిడాసీనీ ఇంకా చాలామంది సాక్షులను జైల్లో వేశారు. మేము జైలు నుండి విడుదలైన తర్వాత జాగ్రత్తగా ప్రాంతీయ సేవను కొనసాగించాం.

మలావీ యూత్‌ లీగ్‌ అనే రాజకీయ గుంపు సభ్యులు 1972, అక్టోబరులో ఒకరోజు మా ఇంటి మీద దాడిచేశారు. అయితే వాళ్లలో ఒకతను ముందుగానే నా దగ్గరికి పరుగెత్తి వచ్చి, ‘వాళ్లు నిన్ను చంపడానికి వస్తున్నారు, వెళ్లి ఎక్కడైనా దాక్కో’ అని చెప్పాడు. నా భార్యాపిల్లల్ని దగ్గర్లో ఉన్న అరటిచెట్ల మధ్య దాక్కోమని చెప్పి, నేను పరుగెత్తుకుంటూ వెళ్లి ఓ పెద్ద మామిడిచెట్టు ఎక్కాను. వాళ్లు మా ఇంటిని, మాకున్న సమస్తాన్ని పాడుచేయడం ఆ చెట్టు మీద నుండి చూస్తూ ఉండిపోయాను.

కాల్చేసిన ఓ ఇంటి శిథిలాలు

మన సహోదరులు రాజకీయ పార్టీలకు మద్దతివ్వనందుకు వాళ్ల ఇళ్లను తగలబెట్టారు

హింస మరింత చెలరేగడంతో వేలమంది సాక్షులు మలావీ వదిలి వెళ్లిపోయారు, వాళ్లలో మేము కూడా ఉన్నాం. 1974 జూన్‌ వరకు మేము మొజాంబిక్‌లోని శరణార్థుల శిబిరంలో తలదాచుకున్నాం. ఆ సమయంలో, మమ్మల్ని మొజాంబిక్‌లోని డోంవాలో ప్రత్యేక పయినీర్లుగా నియమించారు. కానీ 1975లో, అక్కడి ప్రభుత్వం మమ్మల్ని పంపించేయడంతో, పయినీరు సేవను ఆపేసి మేము మలావీకి తిరిగి రావాల్సి వచ్చింది. అప్పటికి మలావీలో సాక్షులు ఇంకా హింసలు ఎదుర్కొంటూనే ఉన్నారు.

మలావీకి తిరిగొచ్చాక, ఆ దేశ రాజధాని లిలాంగ్వేలోని సంఘాలను సందర్శించేందుకు నన్ను నియమించారు. మేము సేవచేసిన ప్రాంతాల్లో హింసలు, కష్టాలు ఉన్నప్పటికీ సంఘాల సంఖ్య అంతకంతకు పెరిగింది.

యెహోవా మద్దతు చవిచూశాం

ఒక రోజు, మేము ఓ గ్రామానికి వెళ్లేసరికి అక్కడ ఓ రాజకీయ మీటింగ్‌ జరుగుతోంది. వాళ్లలో కొంతమంది, మేము యెహోవాసాక్షులమని తెలుసుకుని మమ్మల్ని మలావీ యంగ్‌ పయినీర్స్‌ అనే ఓ రాజకీయ ఉద్యమ సభ్యులతో పాటు కూర్చోబెట్టారు. ఆ ప్రమాదకరమైన పరిస్థితిలో సహాయం కోసం, నిర్దేశం కోసం మేము యెహోవాకు ప్రార్థిస్తూ ఉన్నాం. మీటింగ్‌ అవ్వగానే వాళ్లు మమ్మల్ని కొట్టడం మొదలుపెట్టారు. అయితే ఉన్నట్టుండి ఓ పెద్దావిడ పరిగెత్తుకుంటూ వచ్చి, “వాళ్లను విడిచిపెట్టండి. ప్లీజ్‌! ఈయన నా మేనల్లుడు, ఇతణ్ణి వెళ్లనివ్వండి” అని గట్టిగా అరిచింది. దాంతో, ఆ మీటింగ్‌ నిర్వహిస్తున్న వ్యక్తి “వాళ్లని వెళ్లనివ్వండి!” అని అన్నాడు. ఆమె అసలు మా బంధువే కాదు, ఆమె ఎందుకలా చెప్పిందో మాకు అర్థం కాలేదు. కానీ యెహోవా మా ప్రార్థన విన్నాడని మాకనిపించింది.

రాజకీయ పార్టీ కార్డు

రాజకీయ పార్టీ కార్డు

మేము 1981లో మళ్లీ మలావీ యంగ్‌ పయినీర్స్‌ కంటబడ్డాం. ఈసారి వాళ్లు మా సైకిళ్లు, లగేజీ, పుస్తకాలు, సర్క్యూట్‌ ఫైళ్లు లాక్కున్నారు. మేము అక్కడినుండి తప్పించుకుని ఓ సంఘపెద్ద ఇంటికి పారిపోయాం. కానీ, మా దిగులంతా వాళ్లు తీసుకెళ్లిన సర్క్యూట్‌ ఫైళ్ల గురించే. ఎందుకంటే అందులో ఆ సర్క్యూట్‌లోని సహోదరసహోదరీల సమాచారం ఉంది. ఆ ఫైళ్లను మలావీ యంగ్‌ పయినీర్స్‌ చూసినప్పుడు, అందులో మలావీ అంతటా ఉన్న సహోదరులు నాకు పంపిన ఉత్తరాలను గమనించారు. దాంతో నేను ఓ ప్రభుత్వ అధికారిననుకొని వాళ్లు చాలా భయపడి, వాటిని వెంటనే స్థానిక సంఘపెద్దలకు ఇచ్చేశారు.

ఓసారి మేము పడవలో ప్రయాణిస్తున్నాం. ఆ పడవ యజమాని ఓ రాజకీయ నాయకుడు, కాబట్టి పడవలో ఉన్నవాళ్లందరి దగ్గర రాజకీయ పార్టీ కార్డులు ఉన్నాయో లేదో ఒక్కొక్కళ్ల దగ్గరకు వచ్చి చూస్తున్నాడు. ఆయన మావైపు రాబోతుండగా, పోలీసులు కొంతకాలంగా వెదుకుతున్న ఓ దొంగను పడవలో చూశాడు. దాంతో కాసేపు అక్కడ గందరగోళం ఏర్పడింది. దానివల్ల, ఆయన పార్టీ కార్డులు చూడడం ఆపేశాడు. అలా మేము యెహోవా మద్దతును మరోసారి చవిచూశాం.

అరెస్టు, జైలు

మలావీలోని యెహోవాసాక్షులపై నిషేధం విధించినట్లు తెలిపిన ఓ వార్తాపత్రిక ముఖ్యాంశం

నేను 1984, ఫిబ్రవరిలో, జాంబియా బ్రాంచి కార్యాలయానికి రిపోర్టులు పంపించడానికి లిలాంగ్వేకు వెళ్తున్నాను. ఓ పోలీసు నన్ను ఆపి నా బ్యాగు వెదికాడు. దాంట్లో ఉన్న బైబిలు సాహిత్యాన్ని చూసి, నన్ను స్టేషన్‌కు తీసుకెళ్లి కొట్టాడు. తర్వాత నన్ను తాడుతో కట్టేసి, దొంగలున్న ఓ సెల్‌లో పడేశాడు.

తర్వాతి రోజు, పోలీసు అధికారి నన్ను వేరే గదికి తీసుకెళ్లి, ఓ పేపరు మీద సంతకం పెట్టమన్నాడు. ఆ పేపరు మీద ఇలా రాసి ఉంది, ‘ట్రోఫిం ఆర్‌. సోంబా అను నేను ఇక యెహోవాసాక్షిని కాను, కాబట్టి నన్ను విడుదల చేయండి.’ అయితే నేను సంతకం పెట్టకుండా, “నేను, జైల్లో ఉండడానికే కాదు, చనిపోవడానికి కూడా సిద్ధమే. నేను ఎప్పటికీ యెహోవాసాక్షినే” అని ఆయనతో అన్నాను. దాంతో ఆ అధికారి కోపంతో ఊగిపోతూ టేబుల్‌ని ఎంత గట్టిగా కొట్టాడంటే, ఆ శబ్దానికి పక్క గదిలో ఉన్న పోలీసు ఏమైందో అని పరిగెత్తుకుంటూ వచ్చాడు. అప్పుడు ఆ అధికారి ఆయనతో ఇలా చెప్పాడు, ‘ఇతను సంతకం చేయట్లేదు. కాబట్టి, తానో యెహోవాసాక్షినని ఒప్పుకుంటున్నట్లు ఇతని చేత సంతకం పెట్టించుకుని, లిలాంగ్వే జైలుకు పంపించండి.’ ఇన్ని రోజులు నేను ఏమైపోయానా అని మా ఆవిడ కంగారుపడింది. నాలుగు రోజుల తర్వాత కొంతమంది సహోదరులు, జరిగిన విషయం ఆమెకు చెప్పారు.

లిలాంగ్వే పోలీస్‌ స్టేషన్‌లో పోలీసులు నాతో దయగా ప్రవర్తించారు. అక్కడి పోలీసు అధికారి ఇలా అన్నాడు, ‘ఇదిగో అన్నం, తిను. నువ్వు దేవుని వాక్యాన్ని పాటించినందుకే జైలుకు వచ్చావు, కానీ ఇక్కడున్న వాళ్లంతా దొంగతనం చేసి వచ్చారు.’ ఆ తర్వాత నన్ను లిలాంగ్వేలోని కాచిరి జైలుకు పంపి, అక్కడ ఐదు నెలలు ఉంచారు.

ఆ జైలు వార్డెన్‌ నేను వచ్చినందుకు సంతోషించాడు, నన్ను జైల్లో ఓ “పాస్టర్‌గా” ఉపయోగించుకోవాలన్నది అతని కోరిక. అప్పటివరకు పాస్టర్‌గా ఉన్న వ్యక్తితో, “నువ్వు ఇక జైల్లో దేవుని వాక్యాన్ని బోధించడానికి వీల్లేదు, నువ్వు మీ చర్చిలో దొంగతనం చేసేకదా ఇక్కడికి వచ్చావు” అని చెప్పి అతన్ని పాస్టర్‌గా తీసేశాడు. దాంతో, ప్రతీవారం అక్కడున్న ఖైదీలకు బైబిలు బోధించే బాధ్యతను నాకు అప్పగించారు.

కానీ ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. మలావీలో ఎంతమంది సాక్షులున్నారో చెప్పమని పోలీసు అధికారులు నన్ను ప్రశ్నించారు. నేను చెప్పిన జవాబు వాళ్లకు నచ్చకపోవడంతో స్పృహ కోల్పోయేదాకా నన్ను కొట్టారు. మరో సందర్భంలో, మీ ప్రధాన కార్యాలయం ఎక్కడుందని నన్ను ప్రశ్నించారు. దానికి నేను, ‘అది చాలా చిన్న ప్రశ్న, నేను చెప్తాను’ అని చెప్పి, ప్రధాన కార్యాలయం గురించి బైబిల్లో ఉందని అన్నాను. అప్పుడు, వాళ్లు ఆశ్చర్యపోయి “బైబిల్లో ఎక్కడ ఉంది?” అని అడిగారు.

యెషయా 43:12⁠లో ఉందని నేను చెప్పాను. వాళ్లు ఆ లేఖనాన్ని తీసి జాగ్రత్తగా చదివారు. “నేనే దేవుడను మీరే నాకు సాక్షులు; ఇదే యెహోవా వాక్కు” అని ఆ లేఖనంలో ఉంది. వాళ్లు దాన్ని మూడు సార్లు చదివి, “యెహోవాసాక్షుల ప్రధాన కార్యాలయం అమెరికాలో కదా ఉంది, మరి బైబిల్లో ఎలా ఉంటుంది?” అని అడిగారు. “అమెరికాలో ఉన్న యెహోవాసాక్షులు కూడా తమ ప్రధాన కార్యాలయం గురించిన వివరణ కోసం ఈ లేఖనాన్నే చూస్తారు” అని చెప్పాను. నా జవాబుతో వాళ్లు సంతృప్తి చెందక, నన్ను లిలాంగ్వేకు ఉత్తరాన ఉన్న జాలికా జైలుకు పంపించారు.

కష్టకాలాల్లో కూడా పొందిన దీవెనలు

నేను 1984 జూలైలో, జాలికా జైలుకు వెళ్లేసరికి అప్పటికే అక్కడ 81 మంది సాక్షులు ఉన్నారు. అక్కడ ఎంత ఇరుకుగా ఉండేదంటే, 300 మంది ఖైదీలు నేలమీద ఒకరినొకరు ఆనుకుని పడుకోవాల్సి వచ్చేది. క్రమక్రమంగా, సాక్షులందరం చిన్న గుంపులుగా కలుసుకొని రోజూ ఓ లేఖనాన్ని చర్చించుకునేవాళ్లం. దానివల్ల మేము చాలా ప్రోత్సాహం పొందాం.

ఆ జైలు వార్డెన్‌ మమ్మల్ని ఇతర ఖైదీల నుండి వేరుగా ఉంచాడు. ఓ గార్డు రహస్యంగా మాతో ఇలా చెప్పాడు, “ప్రభుత్వానికి మీమీద ద్వేషం లేదు. అయితే రెండు కారణాలవల్ల మిమ్మల్ని జైల్లో పెట్టింది. ఒకటి, మలావీ యంగ్‌ పయినీర్స్‌ మిమ్మల్ని చంపేస్తారేమోనని ప్రభుత్వం భయపడుతుంది. ఇక రెండోది, మీరు రాబోయే ఓ యుద్ధం గురించి ప్రకటిస్తున్నారు కాబట్టి, ఆ యుద్ధానికి భయపడి తమ సైనికులు పారిపోతారేమోనని ప్రభుత్వం భయపడుతుంది.”

విచారణ తర్వాత యెహోవాసాక్షులను తీసుకెళ్తున్నారు

విచారణ తర్వాత సహోదరులను జైలుకు తీసుకెళ్తున్నారు

మమ్మల్నందర్నీ 1984 అక్టోబరులో కోర్టుకు తీసుకెళ్లారు, కోర్టు మాకు రెండేళ్ల జైలుశిక్ష విధించింది. మమ్మల్ని ఈసారి కూడా, సాక్షులుకాని వాళ్లున్న సెల్‌లో వేశారు. అయితే, ఆ జైలు వార్డెన్‌ అక్కడున్న గార్డులందరికీ ఇలా చెప్పాడు, “యెహోవాసాక్షులు సిగరెట్‌ తాగరు. వాళ్లను సిగరెట్లు తెమ్మనీ, మీ సిగరెట్‌ను వెలిగించుకోవడానికి నిప్పు తీసుకురమ్మనీ ఇబ్బంది పెట్టకండి. వాళ్లు దేవుని ప్రజలు! ఏదో నేరం చేసినందుకు కాదుగానీ, వాళ్ల నమ్మకాలను బట్టే జైలుకు వచ్చారు, కాబట్టి యెహోవాసాక్షులందరికీ రోజుకు రెండుసార్లు తిండి పెట్టండి.”

మా మంచి ప్రవర్తనవల్ల ఎన్నో ఇతర ప్రయోజనాలు కూడా పొందాం. సాధారణంగా, వర్షం పడేటప్పుడుగానీ చీకటి పడ్డాకగానీ, ఖైదీలను బయటికి వెళ్లనివ్వరు. కానీ, మమ్మల్ని మాత్రం బయటికి వెళ్లనిచ్చేవాళ్లు. ఎందుకంటే గార్డులకు మా మీద నమ్మకం ఉండేది, మేము పారిపోమని వాళ్లకు తెలుసు. ఓరోజు మేము పొలంలో పని చేస్తున్నప్పుడు, మాకు కాపలాగా ఉన్న ఓ గార్డుకు ఒంట్లో బాగోక పడిపోయాడు. అప్పుడు, మేము ఆయన్ని జైలుకు మోసుకెళ్లాం. మేము మంచి ప్రవర్తన చూపిస్తూ ఉండడం వల్ల, మమ్మల్ని కాపలా కాసే గార్డులు కూడా యెహోవాను స్తుతించారు.—1 పేతు. 2:12.b

మంచికాలాలు మళ్లీ వచ్చాయి

చివరికి 1985, మే 11న జాలికా జైలునుండి విడుదలై, ఎంతో సంతోషంతో మళ్లీ నా కుటుంబాన్ని కలుసుకోగలిగాను. ఆ కష్టకాలాలన్నిటిలో మా యథార్థతను కాపాడుకోవడానికి సహాయం చేసినందుకు యెహోవాకు మేమెంతో కృతజ్ఞులం. మేము కూడా పౌలులాగే భావిస్తున్నాం, ఆయనిలా అన్నాడు, ‘మేము అనుభవించిన కష్టాలు మీకు చెప్పకుండా ఉండలేము. జీవిస్తామనే ఆశ కూడా పోయింది. మాకు మరణదండన పొందినట్లు అనిపించింది. మమ్మల్ని మేము నమ్ముకోకూడదని, చనిపోయినవాళ్లను బ్రతికించే దేవుణ్ణి నమ్మాలని ఇలా జరిగింది. దేవుడు మమ్మల్ని ఆ ప్రమాదకరమైన చావునుండి రక్షించాడు.’—2 కొరిం. 1:8-10, పరిశుద్ధ బైబల్‌, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

రాజ్యమందిరం బయట నిలబడ్డ సహోదరుడు సోంబా, ఆయన భార్య లిడాసీ

2004లో, రాజ్యమందిరం బయట నిలబడ్డ సహోదరుడు సోంబా, ఆయన భార్య లిడాసీ

కొన్నిసార్లు, అసలు మేము ప్రాణాలతో బయటపడతామో లేదో అనిపించింది. కానీ, తన గొప్ప నామానికి ఘనత తీసుకొచ్చేలా ధైర్యం, తెలివి, వినయం ఇవ్వమని యెహోవాకు ఎప్పుడూ ప్రార్థించేవాళ్లం.

“సమయమందును అసమయమందును” అంటే మంచికాలాల్లోనూ, కష్టకాలాల్లోనూ మా సేవను యెహోవా ఆశీర్వదించాడు. ఇప్పుడు లిలాంగ్వేలో అందమైన కొత్త బ్రాంచి కార్యాలయం, మలావీలో 1000కి పైగా కొత్త రాజ్యమందిరాలు ఉండడం మాకు చాలా సంతోషంగా ఉంది. యెహోవా ఇచ్చిన ఈ ఆశీర్వాదాలు చూస్తుంటే నాకూ లిడాసీకీ, ఇవన్నీ కలా, నిజమా అన్నట్లు అద్భుతంగా అనిపిస్తుంది!c

a చిన్నపిల్లలున్న సహోదరులకు, ఇప్పుడు ప్రాంతీయ పర్యవేక్షకులుగా సేవచేసే అవకాశం లేదు.

b మలావీలో సాక్షులు ఎదుర్కొన్న హింస గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి, 1999 యెహోవాసాక్షుల వార్షిక పుస్తకం (ఇంగ్లీషు)లోని 171-223 పేజీలు చూడండి.

c 83 ఏళ్ల సహోదరుడు సోంబా, ఈ ఆర్టికల్‌ సిద్ధం చేస్తుండగా చనిపోయాడు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి