కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w15 1/15 పేజీలు 28-32
  • ఎప్పటికీ చెక్కుచెదరని ప్రేమ నిజంగా ఉంటుందా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఎప్పటికీ చెక్కుచెదరని ప్రేమ నిజంగా ఉంటుందా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • నిజమైన ప్రేమ సాధ్యమే!
  • “నీ ప్రేమ ద్రాక్షరసముకన్న మధురము”
  • ‘ప్రేమ దానంతట అదే మేల్కొనేవరకు దాన్ని లేపవద్దు’
  • నా వధువు ‘మూయబడిన ఉద్యానవనం’
  • పరమగీతము పుస్తకంలోని ముఖ్యాంశాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • పరమగీతం విషయసూచిక
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • దేవుని బహుమానమైన వివాహాన్ని నిజంగా విలువైనదిగా ఎంచుతున్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • అనుకరించడానికి షూలమ్మీతీ ఒక మంచి ఆదర్శం
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
w15 1/15 పేజీలు 28-32
1. సంతోషంగా ఉన్న వృద్ధ దంపతులు; 2. వాళ్లు తమ నిశ్చితార్థం రోజున, పెళ్లి రోజున, ఒక ప్రత్యేకమైన సందర్భంలో, వృద్ధాప్యంలో కలిసి నడుస్తూ

ఎప్పటికీ చెక్కుచెదరని ప్రేమ నిజంగా ఉంటుందా?

“[ప్రేమ] జ్వాలలు అగ్నిజ్వాలా సమములు అది యెహోవా పుట్టించు జ్వాల.”—పరమ. 8:6.

మీరెలా జవాబిస్తారు?

  • స్త్రీపురుషులు నిజమైన ప్రేమ చూపించుకోవడం సాధ్యమేనా?

  • పరమగీతము పుస్తకం నుండి క్రైస్తవ దంపతులు ఏమి నేర్చుకోవచ్చు?

  • పెళ్లి చేసుకోవాలనుకునే క్రైస్తవులు పరమగీతము పుస్తకం నుండి ఏమి నేర్చుకోవచ్చు?

1, 2. పరమగీతము పుస్తకం నుండి ఎవరెవరు ప్రయోజనం పొందవచ్చు? ఎందుకు? (ప్రారంభ చిత్రం చూడండి.)

పెళ్లికొడుకు, పెళ్లికూతురు ప్రేమగా ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ చిరునవ్వు చిందిస్తున్నారు. వాళ్ల మధ్యవున్న ప్రేమను పెళ్లికొచ్చిన వాళ్లందరూ చూస్తున్నారు. పెళ్లి ప్రసంగాన్ని ఇచ్చిన సహోదరుడు, వాళ్లు ఆప్యాయంగా ఒకరి చేతులు ఒకరు పట్టుకోవడం చూసి, ‘వీళ్ల ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉంటుందా? లేక అంతకంతకు తగ్గిపోతుందా?’ అని అనుకుంటున్నాడు. భార్యాభర్తల మధ్య నిజమైన ప్రేమ ఉంటే, ఎన్ని కష్టాలొచ్చినా వాళ్ల అనుబంధం చెక్కుచెదరదు. కానీ విచారకరంగా, పెళ్లైన చాలామంది అసంతృప్తితో జీవిస్తూ, చివరికి విడిపోతున్నారు. ఇలాంటివి చూసినప్పుడు, ‘అసలు ఎప్పటికీ చెక్కుచెదరని ప్రేమ నిజంగా ఉంటుందా?’ అని మీకు అనిపించవచ్చు.

2 రాజైన సొలొమోను కాలంలో కూడా, నిజమైన ప్రేమ అంతగా ఉండేది కాదు. ఎందుకు? సొలొమోను ఇలా వివరించాడు, “వెయ్యిమంది పురుషులలో నేనొకని చూచితిని గాని అంతమంది స్త్రీలలో ఒకతెను చూడలేదు. ఇది యొకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని యున్నారు.” (ప్రసం. 7:26-29) బయలు దేవుణ్ణి ఆరాధిస్తున్న చాలామంది అన్య స్త్రీలు ఇశ్రాయేలీయుల మధ్య ఉండేవాళ్లు. వాళ్లకు ఏమాత్రం నైతిక విలువలు ఉండేవి కావు. వాళ్లవల్ల చాలామంది ఇశ్రాయేలీయుల నైతిక విలువలు కూడా దిగజారిపోయాయి.a అయితే సొలొమోను, ఆ మాటలు రాయడానికి 20 సంవత్సరాల ముందే ఓ కావ్యగీతం రాశాడు. దానిలో గాఢంగా ప్రేమించుకున్న ఒక అబ్బాయి, అమ్మాయి గురించి చెప్పాడు. మనకు పెళ్లైనా కాకపోయినా, నిజమైన ప్రేమ అంటే ఏమిటో, దాన్ని ఎలా చూపించాలో పరమగీతము పుస్తకం నుండి నేర్చుకోవచ్చు.

నిజమైన ప్రేమ సాధ్యమే!

3. స్త్రీపురుషులు నిజమైన ప్రేమ చూపించుకోవడం సాధ్యమేనని ఎందుకు చెప్పవచ్చు?

3 పరమగీతము 8:6 చదవండి. ప్రేమ “యెహోవా పుట్టించు జ్వాల” అని సొలొమోను వర్ణించాడు. ఎందుకంటే ప్రేమ యెహోవాకున్న అతిగొప్ప లక్షణం. అంతేకాదు ఆయనలాగే ఇతరులను ప్రేమించే సామర్థ్యంతో దేవుడు మనల్ని సృష్టించాడు. (ఆది. 1:26, 27) యెహోవా ఆదామును చేసిన తర్వాత ఆయనకు ఒక అందమైన భార్యను ఇచ్చాడు. హవ్వను మొదటిసారి చూడగానే ఆదాము ఎంత సంతోషించాడంటే, ఆమె గురించి ఒక కవిత్వం చెప్పాడు. హవ్వ కూడా తన భర్తను సొంత మనిషిగా భావించింది. ఎంతైనా, యెహోవా హవ్వను ఆదాము నుండే తయారుచేశాడు. (ఆది. 2:21-23) దేవుడు మనుషులకు ప్రేమించే సామర్థ్యాన్ని ఇచ్చాడు కాబట్టి, స్త్రీపురుషులు ఒకరిపట్ల ఒకరు నిజమైన, శాశ్వతమైన ప్రేమను చూపించుకోవడం సాధ్యమే.

4, 5. పరమగీతము పుస్తకంలో ఉన్న కథను క్లుప్తంగా చెప్పండి.

4 స్త్రీపురుషుల మధ్య ఉండే ప్రేమను పరమగీతము పుస్తకం చాలా చక్కగా వర్ణిస్తోంది. షూనేము లేదా షూలేము అనే పల్లెలో జీవించే ఒక అమ్మాయికి అంటే షూలమ్మీతీకి, గొర్రెలు కాసుకునే ఒక అబ్బాయికి మధ్య ఉన్న ప్రేమ గురించి ఆ పుస్తకం చెప్తుంది. అసలు ఏం జరిగిందంటే: షూలమ్మీతీ, తన అన్నల ద్రాక్షతోటలో పనిచేస్తూ ఉంది. ఆ దగ్గర్లో రాజైన సొలొమోను, ఆయన సైనికులు గుడారాలు వేసుకున్నారు. అప్పుడు సొలొమోను ఆ అమ్మాయిని చూసి, ఆమెను తీసుకురమ్మని తన దాసులను ఆజ్ఞాపించాడు. ఆయన ఆమె అందాన్ని వర్ణిస్తూ, ఎన్నో బహుమతులు ఇస్తూ, ఆమె మనసు గెలుచుకోవడానికి ప్రయత్నించాడు. కానీ అప్పటికే ఆ అమ్మాయి ఒక గొర్రెలకాపరిని ప్రేమిస్తోంది కాబట్టి అతనితోనే ఉంటానని తేల్చి చెప్పింది. (పరమ. 1:4-14) అంతలో ఆ గొర్రెలకాపరి ఆమెను వెతుక్కుంటూ ఆ గుడారంలోకి వచ్చాడు. అక్కడ ఒకరినొకరు చూసుకోగానే, వాళ్లిద్దరూ మధురమైన మాటలతో తమ మధ్యవున్న ప్రేమను వ్యక్తం చేసుకున్నారు.—పరమ. 1:15-17.

5 సొలొమోను తిరిగి యెరూషలేముకు వెళ్లేటప్పుడు, ఆమెను తనతో పాటు తీసుకెళ్లాడు. ఆమె వెనకాలే ఆ గొర్రెలకాపరి కూడా వెళ్లాడు. (పరమ. 4:1-5, 8, 9) సొలొమోను ఏమి చెప్పినా, ఎన్ని చేసినా, ఆమెకు గొర్రెలకాపరి మీదున్న ప్రేమ చెక్కుచెదర్లేదు. (పరమ. 6:4-7; 7:1-10) దాంతో సొలొమోను ఆమెను ఇంటికి వెళ్లనిచ్చాడు. చివరికి, తన ప్రియుణ్ణి “జింకలా” పరిగెత్తుకుంటూ తన దగ్గరకు రమ్మని ఆమె పిలవడంతో ఆ కథ ముగుస్తుంది.—పరమ. 8:14, పరిశుద్ధ బైబల్‌, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

6. పరమగీతము పుస్తకంలో ఎవరు మాట్లాడుతున్నారో తెలుసుకోవడం ఎందుకు కష్టం కావచ్చు?

6 పరమగీతము ఒక మధురమైన పాట. నిజానికి, దీన్ని “అత్యద్భుత గీతం” అని కూడా పిలుస్తారు. (పరమ. 1:1, పరిశుద్ధ బైబల్‌, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) కానీ, సొలొమోను ఆ పాటలో ఎవ్వరి పేర్లనూ ఉపయోగించలేదు. ఎందుకంటే వాళ్ల వివరాల కన్నా, ఆ కావ్యగీతంలోని మాధుర్యమే ముఖ్యమని ఆయన అనుకున్నాడు. ఆ పాటలో వాళ్ల పేర్లు లేకపోయినా, వాళ్ల మాటల్ని బట్టి ఎవరు మాట్లాడుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు.

“నీ ప్రేమ ద్రాక్షరసముకన్న మధురము”

7, 8. గొర్రెలకాపరి, షూలమ్మీతీ తమ ప్రేమను ఎలా వ్యక్తం చేసుకున్నారు? ఉదాహరణలు చెప్పండి.

7 షూలమ్మీతీ, గొర్రెలకాపరి ఒకరినొకరు అందమైన మాటలతో ఒకరిపట్ల ఒకరికున్న ప్రేమను వ్యక్తం చేసుకున్నారు. అయితే, వాళ్ల మాటలు మనకు కొంచెం వింతగా అనిపించవచ్చు, ఎందుకంటే సొలొమోను వాటిని 3,000 సంవత్సరాల క్రితం రాశాడు. మన కాలంతో పోలిస్తే అప్పటి పద్ధతులు, పరిస్థితులు వేరుగా ఉన్నా, వాళ్ల భావాల్ని మనం అర్థం చేసుకోగలం. ఉదాహరణకు, తన ప్రేయసి కళ్లు ‘గువ్వ కళ్లలా’ ఉన్నాయని గొర్రెలకాపరి వర్ణించాడు. అంటే దయ చూపించే ఆమె కళ్లంటే తనకు ఇష్టమని అతను చెప్తున్నాడు. (పరమ. 1:15) ఆమె, తన ప్రియుని కళ్లు గువ్వల్లా అందంగా ఉన్నాయని వర్ణించింది. (పరమగీతము 5:12 చదవండి.) అవి, నీలి రంగు-ఊదా రంగు కలగలిసిన పావురాలు పాలలో స్నానం చేస్తున్నట్లు అందంగా ఉన్నాయని ఆమె చెప్తుంది.

8 వాళ్లిద్దరూ కేవలం బయటికి కనిపించే అందాన్ని మాత్రమే వర్ణించుకోలేదు. ఉదాహరణకు, ఆమె ఇతరులతో దయగా మాట్లాడేతీరు తనకు ఇష్టమని అతను చెప్పాడు. (పరమగీతము 4:7, 11 చదవండి.) తన ప్రేయసి పెదవులు తేనెలు ఒలుకుతున్నట్లు ఉన్నాయని, ఆమె నాలుక కింద పాలుతేనెలు ఉన్నాయని ఆ గొర్రెలకాపరి అంటున్నాడు. ఆమె మాటలు పాలులా, మధురమైన తేనెలా తియ్యగా, ఆహ్లాదకరంగా ఉంటాయని అతని ఉద్దేశం. “నీవు అధికసుందరివి నీయందు కళంకమేమియు లేదు” అని అంటున్నప్పుడు ఆ కాపరి ఆ అమ్మాయి అందం గురించి మాత్రమే కాదుగానీ ఆమెకున్న అందమైన లక్షణాల గురించి కూడా చెప్తున్నాడు.

9. (ఎ) భార్యాభర్తల మధ్యవున్న ప్రేమలో ఏమేమి ఉండాలి? (బి) వాళ్లు తమ ప్రేమను వ్యక్తం చేసుకోవడం ఎందుకు ముఖ్యం?

9 క్రైస్తవ దంపతులు పెళ్లిని, ఏమాత్రం ప్రేమానురాగాలు ఉండని ఓ ఒప్పందంలా చూడరు. కానీ వాళ్లు ఒకరినొకరు నిజంగా ప్రేమించుకుంటూ, ఆ ప్రేమను వ్యక్తం చేసుకుంటారు. అయితే, వాళ్ల మధ్య ఎలాంటి ప్రేమ ఉండాలి? అందరిమీదా ఉండాల్సిన నిస్వార్థ ప్రేమా? (1 యోహా. 4:8) లేదా, కుటుంబ సభ్యుల మధ్య సహజంగా ఉండే ప్రేమా? లేదా, మంచి స్నేహితుల మధ్య ఉండేలాంటి ప్రేమా? (యోహా. 11:3) లేదా, స్త్రీపురుషుల మధ్య ఉండేలాంటి ప్రేమా? (సామె. 5:15-20) నిజానికి భార్యాభర్తల మధ్య ఉండాల్సిన నిజమైన ప్రేమలో అవన్నీ ఉన్నాయి. మీరు ఒకరినొకరు ఎంతగా ప్రేమించుకుంటున్నారో మాటల్లో, పనుల్లో చూపిస్తూ ఉండండి, అప్పుడే మీరు భార్యాభర్తలుగా సంతోషంగా ఉంటారు. మీరు ఎంత బిజీగా ఉన్నా అలా చేయడం చాలా ముఖ్యం. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నవాళ్లకు ఒకరి గురించి ఒకరికి ముందే తెలియదు. అయితే, వాళ్లు ఒకరినొకరు తెలుసుకునే కొద్దీ వాళ్ల మధ్య ప్రేమ పెరుగుతుంది. ఆ ప్రేమను మాటల్లో వ్యక్తం చేసుకుంటూ ఉంటే వాళ్లు మరింత దగ్గరౌతారు, వాళ్ల అనుబంధం కూడా బలపడుతుంది.

10. ప్రేమను వ్యక్తం చేసుకున్న మధుర క్షణాలను భార్యాభర్తలు గుర్తుతెచ్చుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?

10 తమ ప్రేమను వ్యక్తం చేసుకోవడం వల్ల భార్యాభర్తలు మరో ప్రయోజనం కూడా పొందుతారు. సొలొమోను రాజు షూలమ్మీతీకి “వెండి పువ్వులుగల” బంగారు నగలు బహుమతిగా ఇచ్చాడు. ఆమె ‘చంద్రబింబమంత అందంగా, సూర్యుడంత స్వచ్ఛంగా’ ఉందని పొగిడాడు కూడా. (పరమ. 1:9-11; 6:10) అయినప్పటికీ, తాను ప్రాణంగా ప్రేమిస్తున్న గొర్రెలకాపరికే ఆ అమ్మాయి ఎలా కట్టుబడి ఉండగలిగింది? అతనికి దూరంగా ఉన్నప్పుడు కూడా ఆమె బాధపడకుండా ఎలా ఉండగలిగింది? (పరమగీతము 1:2, 3 చదవండి.) గొర్రెలకాపరి తన ప్రేమను వ్యక్తం చేస్తూ చెప్పిన మాటలు ఆమెకు ఎంత సంతోషాన్నిచ్చాయో గుర్తుచేసుకుంది, అవి ఆమెకు ‘ద్రాక్షారసం కన్నా మధురంగా’ అనిపించాయి. తన ప్రియునికి దూరంగా రాజభవనంలో ఉన్న ఆమెకు ఆ మాటలు, తలమీద “పరిమళతైలము” పోసినట్లు సేదదీర్పునిచ్చాయి. (కీర్త. 23:5; 104:15) అవును, దంపతులు ఒకరిమీద ఒకరు ప్రేమ చూపించుకున్న మధుర క్షణాలను అప్పుడప్పుడు గుర్తుచేసుకుంటే వాళ్ల మధ్య ప్రేమ మరింత పెరుగుతుంది. కాబట్టి భార్యాభర్తలు తమ ప్రేమను వ్యక్తం చేసుకుంటూ ఉండడం చాలా ముఖ్యం.

‘ప్రేమ దానంతట అదే మేల్కొనేవరకు దాన్ని లేపవద్దు’

11. రాజభవనంలోని స్త్రీలతో షూలమ్మీతీ చెప్పిన మాటల నుండి పెళ్లికాని క్రైస్తవులు ఏమి నేర్చుకోవచ్చు?

11 పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్లుకూడా పరమగీతము పుస్తకం నుండి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. షూలమ్మీతీకి సొలొమోను మీద ఏమాత్రం ప్రేమ కలగలేదు. అందుకే ఆమె రాజభవనంలోని స్త్రీలతో ఇలా చెప్పింది, ‘ప్రేమ దానంతట అదే మేల్కొనేవరకు దాన్ని లేపవద్దు.’ (పరమ. 2:7; 3:5, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) మరి మీరేమంటారు? తొందరపడి ఎవర్నో ఒకరిని ప్రేమించడం సరైనదేనా? కాదు. బదులుగా, మీరు నిజంగా ప్రేమించగలిగే వ్యక్తి దొరికే వరకు ఓపిగ్గా వేచి ఉండడం మంచిది.

12. షూలమ్మీతీ గొర్రెలకాపరిని ఎందుకు ప్రేమించింది?

12 ఇంతకీ ఆ అమ్మాయి గొర్రెలకాపరిని ఎందుకు ప్రేమించింది? అతను “జింకలాంటి వాడు” అని చెప్తూ అతని అందాన్ని ఆమె వర్ణించింది. అతని చేతులు “బంగారు కడ్డీలలా,” కాళ్లు “చలవరాతి స్తంభాల్లా” అందంగా, బలంగా ఉన్నాయని చెప్పింది. అయితే నిజానికి ఆమె అతని బలాన్నీ అందాన్నీ మాత్రమే చూడలేదు. కానీ, యెహోవా మీద అతనికున్న ప్రేమను, అతని మంచి లక్షణాలను చూసింది. అందుకే “అడవి చెట్లమధ్య ఆపిలు వృక్షంలాంటివాడు” అని వర్ణిస్తూ అతడు ఆమెకెంత ప్రత్యేకమైనవాడో చెప్పింది.—పరమ. 2:3, 9; 5:14, 15, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.

13. గొర్రెలకాపరి షూలమ్మీతీని ఎందుకు ప్రేమించాడు?

13 షూలమ్మీతీ చాలా అందమైన అమ్మాయి. అప్పటికి ‘అరవై మంది రాణులు ఎనభై మంది ఉపపత్నులు లెక్కకు మించిన కన్యకలు’ ఉన్న సొలొమోను రాజు కూడా ఆమె అందానికి ముగ్ధుడయ్యాడు. ఆ అందాన్ని చూసే గొర్రెలకాపరి కూడా ఆమెను ప్రేమించాడా? లేదు. కేవలం అందాన్ని చూసి కాదుగానీ ఆమెకు యెహోవా మీద ఉన్న ప్రేమను, ఆమెలోని చక్కని లక్షణాలను చూసి ప్రేమించాడు. ఉదాహరణకు, ఆమెలో వినయం, అణకువ ఉన్నాయి. అందుకే తనను ‘షారోను పొలంలో పూసే పుష్పంతో’ అంటే ఒక సాధారణమైన పువ్వుతో పోల్చుకుంది. కానీ గొర్రెలకాపరికి మాత్రం ఆమె ముళ్లమధ్య పెరిగిన కలువ పువ్వులా ఎంతో ప్రత్యేకమైనది.—పరమ. 2:1, 2; 6:8.

14. పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వాళ్లు గొర్రెలకాపరి, షూలమ్మీతీ నుండి ఏమి నేర్చుకోవచ్చు?

14 “ప్రభువునందు మాత్రమే పెండ్లిచేసికొనవలెను” అని యెహోవా తన సేవకులను ఆజ్ఞాపిస్తున్నాడు. (1 కొరిం. 7:39) అంటే బాప్తిస్మం తీసుకున్న యెహోవా ఆరాధకులను మాత్రమే పెళ్లి చేసుకోవాలని దానర్థం. అది ఎందుకంత ప్రాముఖ్యం? భార్యాభర్తలు ప్రతీరోజు ఎన్నో ఒత్తిళ్లతో పోరాడాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్లిద్దరికీ యెహోవాతో దగ్గరి సంబంధం ఉంటేనే, ఎలాంటి మనస్పర్థలు లేకుండా సంతోషంగా ఉండగలుగుతారు. మీరు పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంటే, గొర్రెలకాపరి షూలమ్మీతీలాగే యెహోవా పట్ల నిజమైన ప్రేమ, చక్కని లక్షణాలు ఉన్న వాళ్లనే ఎంచుకోండి.

ఒక క్రైస్తవ సహోదరి యెహోవాను ఆరాధించని వ్యక్తిని ఇష్టపడడం

క్రైస్తవులు యెహోవాను ఆరాధించని వాళ్లమీద ఇష్టం పెంచుకోరు (14వ పేరా చూడండి)

నా వధువు ‘మూయబడిన ఉద్యానవనం’

15. పెళ్లి చేసుకోవాలనుకునే క్రైస్తవులు షూలమ్మీతీ ఉదాహరణ నుండి ఏమి నేర్చుకోవచ్చు?

15 పరమగీతము 4:12 చదవండి. గొర్రెలకాపరి షూలమ్మీతీని ‘మూయబడిన ఉద్యానవనంతో’ ఎందుకు పోల్చాడు? చుట్టూ గోడ లేదా కంచె ఉన్న ఒక ఉద్యానవనంలోకి ఇతరులు ప్రవేశించలేరు. షూలమ్మీతీ కూడా ఆ ఉద్యానవనం లాంటిదే. ఎందుకంటే ఆమె ప్రేమ, కాబోయే భర్తకు అంటే గొర్రెలకాపరికి మాత్రమే దక్కుతుంది. అందుకే సొలొమోను ఎంత ప్రయత్నించినా ఆమె ప్రేమను పొందలేకపోయాడు. ఆమె తన మనసు మార్చుకోవాలని అస్సలు అనుకోలేదు. అలా ఆమె తేలిగ్గా తీయగల ‘తలుపులా’ కాకుండా, ‘ప్రాకారంలా’ స్థిరంగా ఉంది. (పరమ. 8:8-10) అదేవిధంగా, దైవభక్తిగల క్రైస్తవులు తమ ప్రేమానురాగాలను తమకు కాబోయే భర్త లేదా భార్య కోసం దాచిపెడతారు.

16. పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వాళ్లు పరమగీతము పుస్తకం నుండి ఏమి నేర్చుకోవచ్చు?

16 తనతో కలిసి సరదాగా బయటికి రమ్మని గొర్రెలకాపరి షూలమ్మీతీని అడిగినప్పుడు, ఆమె అన్నలు ఒప్పుకోలేదు. బదులుగా, తమ ద్రాక్షతోటలకు కాపలా కాయమని ఆమెను పంపించారు. అంటే దానర్థం వాళ్లకు తమ చెల్లి మీద నమ్మకం లేదనా? లేక, ఆమె ఏదైనా తప్పు చేస్తుందని భయపడ్డారా? లేదు. తప్పు చేయడానికి దారితీసే పరిస్థితిలో ఆమె చిక్కుకోకూడదని వాళ్లు ముందుజాగ్రత్త తీసుకున్నారు. (పరమ. 1:6; 2:10-15) పెళ్లి చేసుకోవాలనుకుంటున్న క్రైస్తవులు దానినుండి ఏమి నేర్చుకోవచ్చు? ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కలిసి సమయం గడుపుతున్నప్పుడు మీ బంధాన్ని పవిత్రంగా ఉంచుకోండి. మీరిద్దరు ఏకాంతంగా ఉండకండి. ఒకరిపట్ల ఒకరు ప్రేమను వ్యక్తం చేసుకోవడం సరైనదే అయినా, తప్పు చేయాలనిపించే పరిస్థితులకు దూరంగా ఉండండి.

17, 18. పరమగీతము పుస్తకం నుండి మీరెలా ప్రయోజనం పొందారు?

17 వివాహ బంధం చిరకాలం ఉండాలని, భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమించుకోవాలని యెహోవా కోరుకుంటున్నాడు. పెళ్లైన కొత్తలో వాళ్ల మధ్య సహజంగానే ప్రేమ ఉంటుంది. కానీ ఆ ప్రేమ చల్లారిపోకుండా చూసుకుంటూ, దాన్ని మరింతగా పెంచుకుంటేనే వాళ్ల వివాహ బంధం చిరకాలం నిలుస్తుంది.—మార్కు 10:6-9.

18 మీరు పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంటే, మీరు నిజంగా ప్రేమించగల వ్యక్తి కోసం చూడండి. అలాంటి వ్యక్తి మీ జీవితంలోకి వచ్చాక, ఒకరిపట్ల ఒకరికున్న ప్రేమను ఇంకా పెంచుకోవడానికి కలిసి కృషి చేయండి. మనం పరమగీతము పుస్తకంలో నేర్చుకున్నట్లుగా ఎప్పటికీ నిలిచివుండే నిజమైన ప్రేమను చూపించుకోవడం సాధ్యమే, ఎందుకంటే అది “యెహోవా పుట్టించు జ్వాల.”—పరమ. 8:6.

a జనవరి 15, 2007 కావలికోట సంచికలోని 31వ పేజీ చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి