భార్యాభర్తలుగా సంతోషంగా ఉంటూ, మీ బంధాన్ని బలపర్చుకోండి
“యెహోవా ఇల్లు కట్టించనియెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే.”—కీర్త. 127:1.
1-3. భార్యాభర్తలకు ఎలాంటి సమస్యలు వస్తాయి? (ప్రారంభ చిత్రం చూడండి.)
“భార్యాభర్తలుగా మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, దానికోసం నిజంగా కృషి చేస్తుంటే యెహోవా మిమ్మల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు.” గత 38 ఏళ్లుగా సంతోషంగా వివాహ జీవితాన్ని గడుపుతున్న ఓ భర్త అన్న మాటలవి. అవును, భార్యాభర్తలు సంతోషంగా జీవించడం, కష్టాలు వచ్చినప్పుడు ఒకరికొకరు తోడుగా ఉండడం సాధ్యమే.—సామె. 18:22.
2 భార్యాభర్తలకు కొన్ని సమస్యలు రావడం సహజమే. వాళ్లకు “శరీరసంబంధమైన శ్రమలు” వస్తాయని బైబిలు కూడా చెప్తుంది. (1 కొరిం. 7:28) ప్రతిరోజూ ఉండే ఒత్తిళ్లవల్ల వాళ్ల మధ్య సమస్యలు రావచ్చు. వాళ్లిద్దరిలోనూ లోపాలు ఉంటాయి కాబట్టి, వాళ్లు కొన్నిసార్లు ఒకరి మనసు ఒకరు గాయపర్చుకోవచ్చు, లేదా సరిగ్గా మాట్లాడుకోకపోవడం వల్ల వాళ్లమధ్య అపార్థాలు తలెత్తవచ్చు. (యాకో. 3:2, 5, 8) ఒకవైపు పిల్లల ఆలనాపాలనా చూసుకుంటూ, మరోవైపు ఉద్యోగాలు చేయడం చాలామంది దంపతులకు కష్టంగా ఉండవచ్చు. భార్యాభర్తల బంధం బలంగా ఉండాలంటే వాళ్లు కలిసి సమయం గడపాలి, కానీ ఒత్తిడి వల్ల, అలసట వల్ల వాళ్లు అలా చేయలేకపోతుండవచ్చు. డబ్బు విషయంలో సమస్యలు, ఒంట్లో బాలేకపోవడం, మరితర ఇబ్బందుల వల్ల వాళ్ల మధ్యవున్న ప్రేమ, గౌరవం అంతకంతకూ తగ్గిపోవచ్చు. ఆఖరికి, ఎంతో ప్రేమగా ఉన్నట్లు కనిపించే భార్యాభర్తల మధ్యకూడా వ్యభిచారం, విచ్చలవిడితనం, ద్వేషం, గొడవలు, అసూయ, విపరీతమైన కోపం, అపార్థాలు వంటి ‘శరీర కార్యాలు’ చిచ్చుపెట్టగలవు.—గల. 5:19-21.
3 అవి చాలవన్నట్లు, ఈ ‘అంత్యదినాల్లో’ స్వార్థం, దేవుడంటే లెక్కలేనితనం ఎక్కువైపోయాయి. వాటివల్ల భార్యాభర్తల బంధం బలహీనపడవచ్చు. (2 తిమో. 3:1-4) వీటికి తోడు, ఓ భయంకరమైన శత్రువు భార్యాభర్తలను విడదీయడమే పనిగా పెట్టుకున్నాడు. ‘మీ శత్రువైన సాతాను సింహంలా గర్జిస్తూ, మిమ్మల్ని మింగేయాలని మీ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు’ అని అపొస్తలుడైన పేతురు హెచ్చరించాడు.—1 పేతు. 5:8, పరిశుద్ధ బైబల్, ఈజీ-టు-రీడ్ వర్షన్; ప్రక. 12:12.
4. భార్యాభర్తలు సంతోషంగా ఉంటూ, తమ బంధాన్ని బలపర్చుకోవాలంటే ఏం చేయాలి?
4 జపాన్‌కు చెందిన ఓ వ్యక్తి ఏమంటున్నాడంటే, “నేను తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాను. నేను నా భార్యతో అంతగా మాట్లాడేవాణ్ణి కాదు, దాంతో ఆమె కూడా చాలా ఒత్తిడికి గురైంది. అంతేకాక, ఈమధ్యే ఆమె ఆరోగ్యం బాగా పాడైంది. ఆ ఒత్తిళ్లవల్ల మేము అప్పుడప్పుడూ గొడవలు పడేవాళ్లం.” భార్యాభర్తలన్నాక చిన్నచిన్న సమస్యలు రావడం మామూలే, కానీ వాటిని పరిష్కరించుకోవచ్చు. యెహోవా సహాయంతో దంపతులు సంతోషంగా ఉంటూ, తమ బంధాన్ని బలపర్చుకోవచ్చు. (కీర్తన 127:1 చదవండి.) అలా ఉండడానికి సహాయం చేసే ఐదు సలహాలను ఇప్పుడు చూద్దాం. అంతేకాక, వివాహబంధం బలంగా ఉండాలంటే ప్రేమ ఎంత ముఖ్యమో కూడా చూద్దాం.
మీ బంధంలో యెహోవాకు చోటివ్వండి
5, 6. భార్యాభర్తలు తమ బంధంలో యెహోవాకు ఎలా చోటివ్వవచ్చు?
5 భార్యాభర్తలు యెహోవాకు నమ్మకంగా ఉంటూ, ఆయన మాట వింటే వాళ్ల బంధం బలంగా ఉంటుంది. (ప్రసంగి 4:12 చదవండి.) దేవుడు ప్రేమతో ఇస్తున్న సలహాలు పాటించినప్పుడు, వాళ్లు తమ బంధంలో యెహోవాకు చోటిస్తారు. ‘మీరు కుడికి వెళ్లినా, ఎడమకు వెళ్లినా, “ఇదే సరైన మార్గం, మీరు ఇలా వెళ్లాలి” అని ఒక స్వరం మీ వెనకనుండి చెప్పడం మీరు వింటారు’ అని బైబిలు చెప్తుంది. (యెష. 30:20, 21, పరిశుద్ధ బైబల్, ఈజీ-టు-రీడ్ వర్షన్) భార్యాభర్తలు కలిసి బైబిలు చదివినప్పుడు యెహోవా స్వరం ‘వింటారు.’ (కీర్త. 1:1-3) అలాగే ప్రతీవారం కుటుంబ ఆరాధనను చేసుకుంటూ, తమ బంధాన్ని మరింత బలపర్చుకుంటారు. అది ఇద్దరికీ సంతోషాన్ని, ప్రయోజనాన్ని ఇచ్చేవిధంగా ఉండాలి. అంతేకాకుండా, వాళ్లు ప్రతీరోజు కలిసి ప్రార్థిస్తే, సాతాను లోకం తీసుకొచ్చే ఒత్తిళ్లకు లొంగిపోకుండా ఉంటారు.
భార్యాభర్తలు యెహోవాకు నమ్మకంగా ఉంటూ, ఆయన మాట వింటే, వాళ్ల బంధం బలంగా ఉంటుంది. (5, 6 పేరాలు చూడండి)
6 జర్మనీలోని గేర్హార్ట్ అనే ఓ భర్త ఇలా చెప్తున్నాడు, “సమస్యలు, అపార్థాల వల్ల మా ఆనందం కోల్పోయిన ప్రతీసారి మేము దేవుని వాక్యంలోని సలహాలను పాటిస్తూ సహనం చూపించడం, క్షమించడం నేర్చుకున్నాం.” భార్యాభర్తలు సంతోషంగా ఉండాలంటే ఈ లక్షణాలు చాలా అవసరమని కూడా ఆయన చెప్తున్నాడు. భార్యాభర్తలు కలిసి యెహోవా సేవ చేస్తూ తమ వివాహ బంధంలో ఆయనకు చోటివ్వడానికి కృషి చేయాలి. అలాచేస్తే వాళ్లు దేవునితో స్నేహాన్ని, తమ అనుబంధాన్ని మరింత పెంచుకుంటారు.
ప్రేమతో కుటుంబాన్ని నడిపించే భర్త
7. భర్త తన భార్యను ఎలా చూసుకోవాలి?
7 భర్త తన శిరస్సత్వాన్ని లేదా అధికారాన్ని ఎలా చూపిస్తాడనే దానిమీదే ఆ కుటుంబ సంతోషం ఆధారపడి ఉంటుంది. ‘ప్రతీ పురుషునికి శిరస్సు క్రీస్తని, స్త్రీకి శిరస్సు పురుషుడు’ అని బైబిలు చెప్తుంది. (1 కొరిం. 11:3) అంటే, యేసు తన శిష్యులను ఎలా చూసుకున్నాడో, భర్త కూడా తన భార్యను అలానే చూసుకోవాలి. యేసు ఏనాడూ తన శిష్యులతో క్రూరంగా లేదా కఠినంగా ప్రవర్తించలేదు కానీ వాళ్లను అర్థం చేసుకుంటూ ప్రేమగా, దయగా, మృదువుగా, వినయంగా ఉండేవాడు.—మత్త. 11:28-30.
8. భర్త తన భార్య ప్రేమను, గౌరవాన్ని ఎలా సంపాదించుకుంటాడు?
8 క్రీస్తు అడుగుజాడల్లో నడిచే భర్త, తనకు గౌరవం ఇవ్వమని భార్యను పదేపదే అడగాల్సిన అవసరం లేదు. “తమ భార్యలు తమకన్నా శారీరకంగా తక్కువ శక్తి కలవాళ్లని గుర్తిస్తూ” గౌరవించమని, వాళ్లను అర్థం చేసుకుంటూ కాపురం చేయమని బైబిలు భర్తలకు చెప్తుంది. (1 పేతు. 3:7, పరిశుద్ధ బైబల్, ఈజీ-టు-రీడ్ వర్షన్) ఇంట్లో ఉన్నా, నలుగురిలో ఉన్నా భర్త తన భార్యతో మర్యాదగా మాట్లాడుతూ, దయగా ప్రవర్తిస్తూ ఆమె తనకెంత అమూల్యమైనదో చూపిస్తాడు. (సామె. 31:29) భర్త అలా ప్రేమగా చూసుకున్నప్పుడు, భార్య కూడా ఆయన్ను ప్రేమిస్తుంది, గౌరవిస్తుంది. అప్పుడు యెహోవా వాళ్లిద్దర్నీ ఆశీర్వదిస్తాడు.
వినయంగా ఉంటూ, భర్త మాట వినే భార్య
9. భార్య తన భర్తకు ఎలా లోబడవచ్చు?
9 బైబిలు సూత్రాలపై ఆధారపడిన నిస్వార్థమైన ప్రేమ మనకు యెహోవామీద ఉన్నప్పుడే మనం “ఆయన బలిష్ఠమైన చేతిక్రింద” వినయంగా ఉంటాం. (1 పేతు. 5:6) వినయంగల భార్య తన భర్తకు సహకరిస్తూ యెహోవా అధికారాన్ని గౌరవిస్తున్నానని చూపిస్తుంది. “భార్యలారా, మీ భర్తలకు విధేయులై యుండుడి; ఇది ప్రభువునుబట్టి యుక్తమైయున్నది” అని బైబిలు చెప్తుంది. (కొలొ. 3:18) తన భర్త తీసుకునే ప్రతీ నిర్ణయం భార్యకు నచ్చకపోవచ్చు. అయినా, అవి దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకం కానంతవరకూ భార్య తన భర్తకు లోబడుతూ సహకరిస్తుంది.—1 పేతు. 3:1, 2.
10. ప్రేమతో లోబడడం ఎందుకు ముఖ్యం?
10 దేవుడు, కుటుంబంలో భార్యకు గౌరవమైన స్థానం ఇచ్చాడు. భార్య తన భర్తకు “స్నేహితురాలు” అని బైబిలు చెప్తుంది. (మలా. 2:14, పరిశుద్ధ బైబల్, ఈజీ-టు-రీడ్ వర్షన్) భర్త కుటుంబానికి సంబంధించిన కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు, భార్య తన అభిప్రాయాల్ని, ఆలోచనల్ని గౌరవపూర్వకంగా చెప్తుంది. కానీ ఆయనకు లోబడే ఉంటుంది. తెలివైన భర్త తన భార్య చెప్పేది జాగ్రత్తగా వింటాడు. (సామె. 31:10-31) భార్య ప్రేమతో భర్తకు లోబడినప్పుడు ఆ కుటుంబంలో సంతోషం, ప్రశాంతత, సఖ్యత ఉంటాయి. అంతేకాక, తాము యెహోవాను సంతోషపెడుతున్నామనే సంతృప్తి వాళ్లకుంటుంది.—ఎఫె. 5:22.
ఒకరినొకరు మనస్ఫూర్తిగా క్షమించుకుంటూ ఉండండి
11. భార్యాభర్తలు ఒకరినొకరు క్షమించుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?
11 భార్యాభర్తల బంధం బలంగా ఉండాలంటే, వాళ్లు ఒకరినొకరు క్షమించుకోవడం నేర్చుకోవాలి. దంపతులు ‘ఒకరినొకరు సహించుకుంటూ, క్షమించుకుంటూ’ ఉన్నప్పుడే వాళ్ల బంధం బలంగా ఉంటుంది. (కొలొ. 3:13) అయితే, గతంలో చేసిన పొరపాట్లను మనసులో పెట్టుకుని, వాటిని గుర్తుచేస్తూ దెప్పిపొడవడం వల్ల వాళ్ల సంబంధం దెబ్బతింటుంది. గోడలపై పగుళ్లు ఏర్పడితే ఆ ఇల్లు ఎంతోకాలం నిలవదు, అలాగే మనసుకు అయ్యే గాయాలవల్ల, కోపంవల్ల ఒకరినొకరు క్షమించుకోవడం భార్యాభర్తలకు మరింత కష్టమౌతుంది. అయితే, వాళ్ల అనుబంధం బలంగా ఉండాలంటే, యెహోవా తమను క్షమించినట్లే భార్యాభర్తలు కూడా ఒకరినొకరు క్షమించుకోవాలి.—మీకా 7:18, 19.
12. “ప్రేమ అనేక పాపములను కప్పును” అంటే అర్థమేమిటి?
12 నిజమైన ప్రేమ ‘అపకారాన్ని మనసులో ఉంచుకోదు.’ నిజానికి ప్రేమ “అనేక పాపములను కప్పును.” (1 కొరిం. 13:4, 5; 1 పేతురు 4:8 చదవండి.) కాబట్టి మనకు ఇతరుల మీద ప్రేమ ఉంటే వాళ్లను ఎన్నిసార్లయినా క్షమిస్తాం. ఒక వ్యక్తిని ఎన్నిసార్లు క్షమించాలని పేతురు అడిగినప్పుడు, ‘డెబ్బది ఏడు సార్లు’ అని యేసు చెప్పాడు. (మత్త. 18:21, 22) అంటే ఒక క్రైస్తవుడు ఇతరులను ఎన్నిసార్లయినా క్షమించాలని యేసు చెప్పాడు.—సామె. 10:12.a
13. క్షమించేగుణాన్ని మనం ఎలా వృద్ధి చేసుకోవచ్చు?
13 జర్మనీకి చెందిన ఆనెట అనే మహిళ ఇలా చెప్తుంది, “దంపతులు ఒకరినొకరు క్షమించుకోవడానికి ఇష్టపడకపోతే, వాళ్ల మధ్య కోపం, అపనమ్మకం పెరుగుతాయి. దాంతో వాళ్ల అనుబంధం బీటలువారుతుంది. మీకు క్షమించే మనసుంటే మీ వివాహ బంధం బలపడుతుంది, మీరు ఒకరికొకరు మరింత దగ్గరవుతారు.” మీ భర్త/భార్య పట్ల కృతజ్ఞతతో ఉండండి, వాళ్లను పొగడండి. వాళ్లను మెచ్చుకునే అవకాశాల కోసం చూడండి. అలా చేస్తే మీరు క్షమించే గుణాన్ని వృద్ధి చేసుకుంటారు. (కొలొ. 3:15) దానివల్ల మీరు మనశ్శాంతితో, సఖ్యతతో ఉంటారు, దేవుని ఆశీర్వాదాలు పొందుతారు.—రోమా. 14:19.
బంగారు సూత్రాన్ని పాటించండి
14, 15. బంగారు సూత్రం అంటే ఏమిటి? దాన్ని పాటిస్తే దంపతులు ఎలా మరింత దగ్గరవుతారు?
14 ఇతరులు మీకు గౌరవమర్యాదలు ఇవ్వాలని మీరు కోరుకుంటారు. వాళ్లు మీరు చెప్పేది వింటూ మీ భావాలకు విలువిస్తే మీరు సంతోషిస్తారు. కానీ కొంతమంది, ‘అతను నాకు చేసినట్లే, నేను అతనికి చేస్తాను’ అని అనడం మీరు ఎప్పుడైనా విన్నారా? కొన్నిసార్లు అలా అనిపించడం సహజమే. కానీ ‘“వాడి క్రియకు ప్రతిక్రియ చేసితీరుతాను” అనుకోవద్దు’ అని బైబిలు మనకు చెప్తుంది. (సామె. 24:29, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) ఇబ్బందుల్ని చక్కగా ఎలా పరిష్కరించుకోవాలో యేసు నేర్పించాడు. “మనుష్యులు మీకేలాగు చేయవలెనని మీరు కోరుదురో ఆలాగు మీరును వారికి చేయుడి” అని యేసు చెప్పిన ఆ సలహానే బంగారు సూత్రం అని పిలుస్తారు. (లూకా 6:31) కాబట్టి, ప్రజలు మనతో ఎలా ప్రవర్తించినా, మనం మాత్రం వాళ్లు మనతో ఎలా ప్రవర్తించాలని కోరుకుంటామో అలాగే ప్రవర్తించాలి. అందుకే, మన వివాహ భాగస్వామి నుండి ఆశించేదాన్ని ముందు మనం చేయాలి.
15 భార్యాభర్తలు ఒకరి భావాలకు ఒకరు నిజంగా విలువిచ్చినప్పుడు, వాళ్లు మరింత దగ్గరవుతారు. దక్షిణ ఆఫ్రికాలోని ఒక భర్త ఇలా చెప్తున్నాడు, “బంగారు సూత్రం ప్రకారం జీవించడానికి మేమిద్దరం కృషి చేశాం. అయితే, మేము ఒకరినొకరం నొప్పించుకున్న సందర్భాలున్నాయి, అలాంటి పరిస్థితుల్లో కూడా ఒకరికొకరం గౌరవమర్యాదలు ఇచ్చిపుచ్చుకోవడం కోసం కృషి చేశాం.”
16. భార్యాభర్తలు వేటిని అస్సలు చేయకూడదు?
16 మీ భర్తలో/భార్యలో ఉన్న లోపాల్ని వేరేవాళ్లతో చెప్పకండి. లేదా వాళ్లలో మీకు నచ్చని లక్షణాల గురించి పదేపదే సరదాకైనా మాట్లాడకండి. భార్యాభర్తలంటే ఎవరికి ఎక్కువ బలముందో, ఎవరు గట్టిగా అరవగలరో, ఎవరు తోటివ్యక్తి మనసును ఎక్కువగా గాయపర్చగలరో నిరూపించుకునే పోటీదారులు కాదు. నిజమే, మనందరిలో లోపాలు ఉన్నాయి, కొన్నిసార్లు ఇతరులను బాధపెడతాం కూడా. అయితే భార్యాభర్తలు ఒకరినొకరు చులకన చేసుకోవడం, మనసు నొప్పించేలా మాట్లాడుకోవడం, అంతకంటే ఘోరంగా ఒకరు మరొకర్ని తోయడం లేదా కొట్టడం వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు.—సామెతలు 17:27; 31:26 చదవండి.
17. భర్తలు బంగారు సూత్రాన్ని ఎలా పాటించవచ్చు?
17 కొంతమంది భర్తలు, తమ గొప్పని చూపించుకోవడం కోసం భార్యలను కొడతారు లేదా దౌర్జన్యం చేస్తారు. అయితే, ‘పరాక్రమశాలి కన్నా దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు, పట్టణాన్ని పట్టుకొనే వాడికన్నా తన మనస్సును స్వాధీనపర్చుకొనేవాడు శ్రేష్ఠుడు’ అని బైబిలు చెప్తుంది. (సామె. 16:32) అవును, కోపాన్ని అదుపులో ఉంచుకునేవాళ్లే నిజమైన బలవంతులు, ఎందుకంటే వాళ్లు భూమ్మీద జీవించిన వాళ్లందరిలో గొప్పవాడైన యేసుక్రీస్తును అనుకరిస్తున్నారు. తన భార్యను మాటలతో, చేతలతో హింసించే భర్త బలహీనుడు. అలాంటి వ్యక్తిని యెహోవా ఏమాత్రం ఇష్టపడడు. అందుకే బైబిలు ఇలా చెప్తుంది, “కోపపడుడిగాని పాపము చేయకుడి.”—ఎఫె. 4:26.
‘ప్రేమను ధరించుకోండి’
18. భార్యాభర్తలు ఎందుకు ప్రేమ చూపించుకుంటూనే ఉండాలి?
18 1 కొరింథీయులు 13:4-7 చదవండి. భార్యాభర్తల మధ్య ముఖ్యంగా ఉండాల్సింది ప్రేమే. “మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి.” (కొలొ. 3:12, 14) దంపతులు ఒకరిపట్ల ఒకరు నిస్వార్థమైన ప్రేమను చూపిస్తూ, ఇతరులకోసం తనను తాను అర్పించుకున్న క్రీస్తును అనుకరించాలి. అలాంటి ప్రేమ ఉన్నప్పుడు చిన్నచిన్న లోపాలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు లేదా అత్త ఇంటివాళ్లతో విభేదాలు ఉన్నా భార్యాభర్తల బంధం చెక్కుచెదరదు.
19, 20. (ఎ) భార్యాభర్తలు సంతోషంగా జీవిస్తూ, తమ బంధాన్ని బలపర్చుకోవాలంటే వాళ్లు ఏమి చేయాలి? (బి) తర్వాతి ఆర్టికల్‌లో ఏమి పరిశీలిస్తాం?
19 వివాహ బంధం చిరకాలం నిలవాలంటే ప్రేమ, నమ్మకం, కృషి అవసరం. కష్టాలు వచ్చినంత మాత్రాన భార్యాభర్తలు విడిపోవాలని చూడకూడదు కానీ, ఒకరికొకరు మరింత దగ్గరవ్వడం కోసం గట్టిగా కృషి చేయాలి. యెహోవాను, తమ భాగస్వామిని ప్రేమించేవాళ్లు ఎన్ని సమస్యలొచ్చినా వాటిని పరిష్కరించుకోవాలనే కోరుకుంటారు, ఎందుకంటే ‘ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది.’—1 కొరిం. 13:8; మత్త. 19:5, 6; హెబ్రీ. 13:4.
20 భార్యాభర్తలు సంతోషంగా ఉంటూ, తమ బంధాన్ని బలపర్చుకోవడం ఈ “అపాయకరమైన” రోజుల్లో కష్టమే. (2 తిమో. 3:1) కానీ యెహోవా సహాయంతో అలా చేయడం సాధ్యమే. అయితే, ఈ లోకంలో ఉన్న విచ్చలవిడితనం విషయంలో కూడా దంపతులు జాగ్రత్తగా ఉండాలి. నైతిక విషయాల్లో పవిత్రంగా ఉంటూ భార్యాభర్తలు తమ బంధాన్ని ఎలా కాపాడుకోవచ్చో తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలిద్దాం.
a దంపతులు ఒకరినొకరు క్షమించుకుంటూ, సమస్యల్ని పరిష్కరించుకుంటారు. అయితే, వ్యభిచారం చేసిన భర్తను/భార్యను క్షమించాలా లేక విడాకులు ఇవ్వాలా అని నిర్ణయించుకునే హక్కు భాగస్వామికి ఉంటుందని బైబిలు చెప్తుంది. (మత్త. 19:9) సెప్టెంబరు 8, 1995 తేజరిల్లు! సంచికలోని “బైబిలు ఉద్దేశము: జారత్వాన్ని క్షమించాలా వద్దా?” అనే ఆర్టికల్ చూడండి.