కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w15 1/15 పేజీలు 8-12
  • యెహోవాకు కృతజ్ఞతలు చెప్పండి, దీవెనలు పొందండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవాకు కృతజ్ఞతలు చెప్పండి, దీవెనలు పొందండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘యెహోవా, మా దేవా, నీవు ఎన్నో అద్భుతకార్యాలు చేశావు’
  • ధ్యానించడం, ప్రార్థించడం చాలా ముఖ్యం
  • కష్టాల్లో ఉన్నప్పుడు
  • ‘నేను యెహోవాను బట్టి ఆనందిస్తాను’
  • ‘ప్రతీ విషయంలో కృతజ్ఞతలు చెప్పండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
  • ప్రార్థన—దాన్ని మీరు ఇంకా బాగా చేయవచ్చు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
  • “కృతజ్ఞులై యుండుడి”
    మన రాజ్య పరిచర్య—1997
  • మీరు పొందిన ఆశీర్వాదాల పట్ల నిజంగా కృతజ్ఞత చూపిస్తున్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
w15 1/15 పేజీలు 8-12
యెహోవాకు కృతజ్ఞతలు చెప్తూ ఆయన్ను స్తుతిస్తున్న ఇశ్రాయేలీయులు

యెహోవాకు కృతజ్ఞతలు చెప్పండి, దీవెనలు పొందండి

“యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి.” —కీర్త. 106:1.

మీరు జవాబివ్వగలరా?

  • కృతజ్ఞత చూపించే విషయంలో అపొస్తలుడైన పౌలు నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

  • కృతజ్ఞతతో జీవించడానికి ధ్యానించడం, ప్రార్థించడం ఎలా సహాయం చేస్తాయి?

  • మనం పొందిన ఆశీర్వాదాల గురించి ధ్యానించడం వల్ల కష్టాలను ఎలా సహించగలుగుతాం?

1. యెహోవా మన హృదయపూర్వక కృతజ్ఞతకు ఎందుకు అర్హుడు?

యెహోవా మనకు “శ్రేష్ఠమైన ప్రతి యీవియు సంపూర్ణమైన ప్రతి వరమును” ఇస్తున్నాడు. అందుకే ఆయన మన హృదయపూర్వక కృతజ్ఞతకు అర్హుడు. (యాకో. 1:17) ఆయన ప్రేమగల కాపరిలా మన అవసరాలన్నిటినీ దయతో తీరుస్తున్నాడు. (కీర్త. 23:1-3) ఆయన మన ‘ఆశ్రయం, దుర్గం.’ మరిముఖ్యంగా కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన మనకు తోడుగా ఉంటాడు. (కీర్త. 46:1) అందుకే, “యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును” అని రాసిన కీర్తనకర్తలాగే మనం కూడా భావిస్తాం.—కీర్త. 106:1.

2015 వార్షిక వచనం: “యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి.”—కీర్తన 106:1

2, 3. (ఎ) మనం కృతజ్ఞతను కోల్పోతే ఏం జరిగే ప్రమాదం ఉంది? (బి) ఈ ఆర్టికల్‌లో మనం ఏ ప్రశ్నలకు జవాబులు చూస్తాం?

2 మనం యెహోవాకు కృతజ్ఞతలు చెప్పడం ఎందుకు ప్రాముఖ్యం? బైబిలు ముందే చెప్పినట్లు, ఈ చివరి రోజుల్లోని ప్రజలకు ఏమాత్రం కృతజ్ఞత లేదు. (2 తిమో. 3:2) యెహోవా తమకోసం చేసిన మంచి విషయాల పట్ల చాలామంది కృతజ్ఞత చూపించట్లేదు. మనం జీవిస్తున్న ఈ లోకం వస్తుసంపదలకు ప్రాముఖ్యత ఇస్తూ, అవసరమైన వాటికన్నా ఎక్కువ కొనమని ప్రజల్ని ప్రోత్సహిస్తుంది. దాంతో చాలామంది తమకు ఉన్నవాటితో సంతృప్తిగా జీవించలేకపోతున్నారు. మనం కూడా ప్రాచీన ఇశ్రాయేలీయుల్లా కృతజ్ఞతను కోల్పోయి, యెహోవాతో మనకున్న అమూల్యమైన స్నేహాన్ని, ఆయనిచ్చిన ఆశీర్వాదాలను పట్టించుకోకపోవచ్చు.—కీర్త. 106:7, 11-13.

3 మనకు పెద్దపెద్ద కష్టాలు వచ్చినప్పుడు ఏమి జరిగే అవకాశం ఉందో ఆలోచించండి. అలాంటి సమయాల్లో, మనం వాటిగురించే ఎక్కువగా ఆలోచిస్తూ, మనకున్న ఆశీర్వాదాలను పట్టించుకోకపోవచ్చు. (కీర్త. 116:3) మరి, యెహోవా పట్ల మన కృతజ్ఞతను కాపాడుకోవాలంటే ఏమి చేయాలి? తీవ్రమైన కష్టాలు వచ్చినా మనకున్న ఆశీర్వాదాల మీదే ఎలా మనసు నిలపవచ్చు? వీటికి జవాబులు ఇప్పుడు చూద్దాం.

‘యెహోవా, మా దేవా, నీవు ఎన్నో అద్భుతకార్యాలు చేశావు’

4. యెహోవా పట్ల మన కృతజ్ఞతను కాపాడుకోవాలంటే ఏమి చేయాలి?

4 యెహోవా పట్ల కృతజ్ఞతను కాపాడుకోవాలంటే మనం చాలా కృషి చేయాలి. మొదటిగా, యెహోవా మనకు ఏయే ఆశీర్వాదాలు ఇచ్చాడో ఆలోచించాలి. రెండవదిగా, అవి మనమీద యెహోవాకున్న గొప్ప ప్రేమకు ఎలా రుజువులుగా ఉన్నాయో ధ్యానించాలి. కీర్తనకర్త అలా చేసినప్పుడు, యెహోవా తనకోసం చేసిన అద్భుతకార్యాలను చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు!—కీర్తన 40:5; 107:43 చదవండి.

5. కృతజ్ఞత చూపించే విషయంలో అపొస్తలుడైన పౌలు నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

5 కృతజ్ఞత ఎలా చూపించాలో అపొస్తలుడైన పౌలు నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు. పౌలు తాను పొందిన ఆశీర్వాదాల గురించి ధ్యానిస్తూ, ఎల్లప్పుడూ యెహోవాకు కృతజ్ఞతలు చెప్పేవాడు. ఒకప్పుడు ‘దూషకునిగా, హింసకునిగా, హానికరునిగా’ ఉన్న తనను యెహోవా, యేసుక్రీస్తు కనికరించి, ఇతరులకు సువార్త ప్రకటించే గొప్ప అవకాశం ఇచ్చినందుకు పౌలు ఎంతో కృతజ్ఞత చూపించాడు. (1 తిమోతి 1:12-14 చదవండి.) ఆయన తోటి సహోదరసహోదరీల పట్ల కూడా కృతజ్ఞత చూపించాడు. వాళ్లకున్న మంచి లక్షణాలను, నమ్మకంగా చేస్తున్న సేవను గుర్తుచేసుకుంటూ తరచూ యెహోవాకు కృతజ్ఞతలు తెలిపేవాడు. (ఫిలి. 1:3-7; 1 థెస్స. 1:2, 3) కష్టాల్లో తనకు సహోదరులు సహాయం చేసినప్పుడు వెంటనే ప్రార్థనలో కృతజ్ఞతలు చెప్పేవాడు. (అపొ. 28:15; 2 కొరిం. 7:5-7) అందుకే, ‘కృతజ్ఞతతో ఉంటూ సంగీతములతో కీర్తనలతో ఆత్మసంబంధమైన పద్యములతో ఒకనినొకడు’ ప్రోత్సహించుకోమని పౌలు క్రైస్తవులకు సలహా ఇచ్చాడు.—కొలొ. 3:15-17.

ధ్యానించడం, ప్రార్థించడం చాలా ముఖ్యం

6. మీరు ఏ విషయంలో యెహోవా పట్ల కృతజ్ఞతతో ఉన్నారు?

6 పౌలును మనమెలా అనుకరించవచ్చు? మనం కూడా, యెహోవా మనకోసం చేసిన వాటిగురించి ధ్యానించాలి. (కీర్త. 116:12) ‘యెహోవా ఇచ్చిన ఏ ఆశీర్వాదాల విషయంలో మీరు ఆయనకు కృతజ్ఞతలు చెప్తారు?’ అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఏమి చెప్తారు? యెహోవాతో మీకున్న అమూల్యమైన స్నేహం గురించి చెప్తారా? లేక, యేసు బలి ద్వారా మీరు పొందిన పాపక్షమాపణ గురించి చెప్తారా? కష్టాల్లో మీకు సహాయం చేసిన సహోదరసహోదరీల గురించి చెప్తారా? మంచి భర్తను/భార్యను లేదా పిల్లల్ని ఇచ్చినందుకు చెప్తారా? కాబట్టి సమయం తీసుకుని, యెహోవా మిమ్మల్ని ఎన్ని విధాలుగా ఆశీర్వదించాడో ఆలోచించండి. అలాచేస్తే మీరు ప్రతీరోజు ఆయనకు తప్పకుండా కృతజ్ఞతలు చెప్తారు.—కీర్తన 92:1-3 చదవండి.

7. (ఎ) మనం ప్రార్థనలో యెహోవాకు ఎందుకు కృతజ్ఞతలు చెప్పాలి? (బి) అలా చేస్తే మనం ఎలాంటి ప్రయోజనాలు పొందుతాం?

7 యెహోవా మనకిచ్చిన ఆశీర్వాదాలన్నిటి గురించి ఆలోచించినప్పుడు మనం ప్రార్థనలో యెహోవాకు కృతజ్ఞతలు చెప్తాం. (కీర్త. 95:2; 100:4, 5) కొంతమంది తమ కోరికలు తీర్చమని అడగడానికే దేవునికి ప్రార్థిస్తారు. కానీ మనం చేసే ప్రార్థనల్లో, యెహోవా మనకిప్పటికే ఇచ్చిన వాటిగురించి కృతజ్ఞతలు చెప్తే ఆయనెంతో సంతోషిస్తాడు. హన్నా, హిజ్కియా వంటి ఎంతోమంది దేవుని సేవకులు యెహోవాకు కృతజ్ఞతలు చెప్తూ చేసిన ప్రార్థనలు బైబిల్లో ఉన్నాయి. (1 సమూ. 2:1-10; యెష. 38:9-20) వాళ్లలాగే మీరు కూడా యెహోవా మీకోసం చేసినవాటి గురించి ఆయనకు కృతజ్ఞతలు చెప్పండి. (1 థెస్స. 5:16-18) అలా చేస్తే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది, దేవుని పట్ల మీ ప్రేమ పెరుగుతుంది. అంతేకాదు మీరు యెహోవాకు మరింత దగ్గరౌతారు.—యాకో. 4:8.

విమోచన క్రయధనాన్ని, పిల్లల్ని, భార్యను, మంచి స్నేహితులను ఇచ్చి ఆశీర్వదించినందుకు యెహోవాకు ప్రార్థనలో కృతజ్ఞతలు చెప్తున్న ఓ వ్యక్తి

యెహోవా ఇచ్చిన ఏ ఆశీర్వాదాల విషయంలో మీరు ఆయనకు కృతజ్ఞతలు చెప్తారు?

(6, 7 పేరాలు చూడండి)

8. మనం ఎందుకు కృతజ్ఞతను కోల్పోయే ప్రమాదముంది?

8 మనం జాగ్రత్తగా లేకపోతే, యెహోవా మంచితనం పట్ల కృతజ్ఞత కోల్పోయే ప్రమాదముంది. ఎందుకంటే మనం అపరిపూర్ణులం, పైగా ఏమాత్రం కృతజ్ఞతలేని ఆదాము హవ్వల పిల్లలం. యెహోవా ఆదాముహవ్వలను ఒక అందమైన తోటలో ఉంచి వాళ్లకు కావాల్సిన వాటన్నిటిని ఇచ్చాడు. వాళ్లు నిత్యం సంతోషంగా జీవించగలిగేవాళ్లే. (ఆది. 1:28) కానీ యెహోవా తమకిచ్చిన ఆశీర్వాదాలను వాళ్లు విలువైనవిగా చూడలేదు. అత్యాశతో ఇంకా కావాలని కోరుకుని, చివరికి అంతా పోగొట్టుకున్నారు. (ఆది. 3:6, 7, 17-19) అంతేకాక, మనం ఏమాత్రం కృతజ్ఞతలేని ప్రజల మధ్య జీవిస్తున్నాం. కాబట్టి మనం కూడా వాళ్లలా తయారై, యెహోవా మన కోసం చేసిన వాటన్నిటిపట్ల కృతజ్ఞతను కోల్పోవచ్చు. ఆయనతో మన స్నేహాన్ని, ప్రపంచవ్యాప్త సహోదరసహోదరీల్లో ఒకరిగా ఉండే అవకాశాన్ని విలువైనవిగా చూడకపోవచ్చు. లేదా, ఈ లోకంలో ఉన్నవాటి మీదకు మన దృష్టి మళ్లవచ్చు. (1 యోహా. 2:15-17) ఈ ప్రమాదంలో పడకూడదంటే, మనకున్న అంతులేని ఆశీర్వాదాల గురించి ధ్యానిస్తూ, తన ప్రజల్లో ఒకరిగా ఉండే అవకాశం ఇచ్చినందుకు మనం ప్రతీరోజు కృతజ్ఞతలు చెప్పాలి.—కీర్తన 27:4 చదవండి.

కష్టాల్లో ఉన్నప్పుడు

9. మనం తీవ్రమైన కష్టాల్లో ఉన్నప్పుడు, మనకున్న ఆశీర్వాదాల గురించి ఎందుకు ధ్యానించాలి?

9 యెహోవాపట్ల కృతజ్ఞత ఉంటే తీవ్రమైన కష్టాలను కూడా సహిస్తాం. కొన్ని కష్టాలు మన జీవితాన్ని తలక్రిందులు చేసి, మనల్ని బాగా కృంగదీస్తాయి. ముఖ్యంగా భర్త/భార్య నమ్మకద్రోహం చేసినప్పుడు, మనం తీవ్రమైన అనారోగ్యానికి గురైనప్పుడు, ఇష్టమైనవాళ్లు చనిపోయినప్పుడు లేదా ఏదైనా ప్రకృతి విపత్తు వల్ల బాగా నష్టపోయినప్పుడు మనకు అలా అనిపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో, మనకున్న ఆశీర్వాదాల గురించి ధ్యానిస్తే ఎంతో ఓదార్పును, కష్టాల్ని తట్టుకునే శక్తిని పొందుతాం. అలాంటి కొన్ని అనుభవాలు ఇప్పుడు చూద్దాం.

10. యెహోవా ఇచ్చిన ఆశీర్వాదాల గురించి ధ్యానించడం వల్ల ఓ సహోదరి ఎలా ప్రయోజనం పొందింది?

10 ఉత్తర అమెరికాలో క్రమ పయినీరుగా సేవ చేస్తున్న ఐరీనa అనే సహోదరి విషయమే తీసుకోండి. ఆమె ఒక సంఘపెద్దను పెళ్లి చేసుకుంది, కానీ కొంతకాలానికి ఆయన వేరే స్త్రీతో సంబంధం పెట్టుకుని ఆమెను, పిల్లల్ని వదిలేసి వెళ్లిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా యెహోవా సేవలో నమ్మకంగా కొనసాగడానికి ఆమెకు ఏది సహాయం చేసింది? ఆమె ఇలా చెప్తుంది, ‘యెహోవా నామీద ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తున్నందుకు నేను ఆయనకు చాలా రుణపడి ఉన్నాను. ఆయన నాకిచ్చిన ఆశీర్వాదాల గురించి ప్రతీరోజు ఆలోచించడం వల్ల, మనల్ని శ్రద్ధగా చూసుకునే పరలోక తండ్రికి నేను తెలియడం, ఆయన నన్ను ప్రేమించడం ఎంత గొప్ప విషయమో నాకు అర్థమౌతుంది. ఆయన నన్ను ఎప్పటికీ విడిచిపెట్టడని నాకు తెలుసు.’ ఐరీన జీవితంలో ఎన్నో కష్టాలు పడినా, ఆమె తన సంతోషాన్ని కాపాడుకోవడం వల్ల వాటన్నిటినీ తట్టుకుంది. ఆమెను చూసి ఇతరులు కూడా ప్రోత్సాహం పొందుతున్నారు.

11. తీవ్రమైన అనారోగ్య సమస్యను ఓ సహోదరి ఎలా తట్టుకోగలిగింది?

11 ఆసియాలోని క్యాంగ్‌-సూక్‌ అనే సహోదరి తన భర్తతో కలిసి 20 కన్నా ఎక్కువ సంవత్సరాలు పయినీరు సేవ చేసింది. ఒక రోజు, వైద్యపరీక్షల్లో ఆమెకు ఊపిరితిత్తుల క్యాన్సర్‌ ఉందని తేలింది. అది బాగా ముదిరిపోవడంతో ఆమె 3 నుండి 6 నెలలు మాత్రమే బతుకుతుందని డాక్టర్లు చెప్పారు. ఇంతకుముందు ఆమె, ఆమె భర్త ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు కానీ వాళ్లు ఎప్పుడూ ఆరోగ్యంగానే ఉండేవాళ్లు. ఆమె ఇలా అంటోంది, “నాకు క్యాన్సర్‌ ఉందని తెలియగానే బాగా కృంగిపోయాను. ఇక అంతా అయిపోయింది అనుకున్నాను. నాకు చాలా భయమేసింది.” ఆ పరిస్థితిని ఆమె ఎలా తట్టుకోగలిగింది? ఆమె ఇంకా ఇలా అంటోంది, “ప్రతీరోజు పడుకునే ముందు మా ఇంటి మేడ మీదకు వెళ్లి గట్టిగా ప్రార్థన చేస్తూ, ఆ రోజు నాకు సంతోషాన్నిచ్చిన ఐదు విషయాల గురించి యెహోవాకు కృతజ్ఞతలు చెప్తాను. అప్పుడు నాకు ధైర్యంగా అనిపిస్తుంది. అంతేకాక, యెహోవాను నేనెంతగా ప్రేమిస్తున్నానో చెప్పేదాన్ని.” అలా ప్రార్థన చేయడం వల్ల క్యాంగ్‌-సూక్‌ ఎలా ప్రయోజనం పొందింది? ఆమె ఇలా చెప్తుంది, “కష్టాలు వచ్చినప్పుడు తట్టుకోవడానికి కావాల్సిన బలాన్ని యెహోవా ఇస్తాడనీ, మనకున్న సమస్యల కన్నా ఆశీర్వాదాలే చాలా ఎక్కువనీ నేను అర్థం చేసుకున్నాను.”

తన తమ్ముడు జాన్‌తో షెరిల్‌

తన తమ్ముడు జాన్‌తో (13వ పేరా చూడండి)

12. భార్య చనిపోయిన బాధ నుండి జేసన్‌ ఎలా బయటపడగలిగాడు?

12 ఆఫ్రికా బ్రాంచి కార్యాలయంలో ఉన్న జేసన్‌ 30 కన్నా ఎక్కువ ఏళ్లుగా పూర్తికాల సేవ చేస్తున్నాడు. ఆయనిలా అంటున్నాడు, “ఏడు సంవత్సరాల క్రితం నా భార్య చనిపోయినప్పుడు, ఆ బాధను అస్సలు తట్టుకోలేకపోయాను. క్యాన్సర్‌తో పోరాడుతున్నప్పుడు ఆమె పడిన బాధ గుర్తొచ్చినప్పుడల్లా బాగా కృంగిపోయేవాణ్ణి.” ఆ బాధనుండి జేసన్‌ ఎలా బయటపడగలిగాడు? ఆయన ఏమంటున్నాడంటే, “నేనూ నా భార్యా కలిసి ఆనందంగా గడిపిన క్షణాల్ని ఒకరోజు గుర్తుచేసుకున్నాను. అవి గుర్తొచ్చినందుకు ప్రార్థనలో యెహోవాకు కృతజ్ఞతలు చెప్పాను. దానివల్ల నాకు ఆ రోజు కాస్త ప్రశాంతంగా అనిపించడంతో, అలాంటి మధుర క్షణాల్ని ఇచ్చినందుకు ప్రతీరోజు యెహోవాకు కృతజ్ఞతలు చెప్పడం అలవాటు చేసుకున్నాను. అలా చేయడం నా ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసింది. నా భార్య లేనందుకు ఇప్పటికీ బాధగానే ఉంది. కానీ యెహోవాను ఎంతో ప్రేమించే మంచి భార్యను, ఆమెతో కలిసి ఆయనకు సేవ చేసే అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రార్థనలో కృతజ్ఞతలు చెప్పడం వల్ల నేను ఆ బాధను తట్టుకోగలుగుతున్నాను.”

“యెహోవా నాకు దేవుడుగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది.” —షెరిల్‌

13. కుటుంబ సభ్యుల్లో చాలామందిని పోగొట్టుకున్న బాధను షెరిల్‌ ఎలా తట్టుకుంది?

13 హైయాన్‌ అనే అతిపెద్ద తుఫాను 2013లో సెంట్రల్‌ ఫిలిప్పీన్స్‌ను అతలాకుతలం చేసింది. ఆ విపత్తునుండి బయటపడ్డ 13 ఏళ్ల షెరిల్‌ ఇలా చెప్తోంది, “మా ఇల్లు పూర్తిగా పాడైపోయింది, మా ఇంట్లోవాళ్లు చాలామంది చనిపోయారు.” షెరిల్‌ వాళ్ల అమ్మానాన్నలు, ముగ్గురు తోబుట్టువులు వరదలో కొట్టుకొనిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా షెరిల్‌ కృంగిపోకుండా ఎలా ఉండగలిగింది? యెహోవా ఇచ్చిన ఆశీర్వాదాలను ధ్యానించడం వల్ల తన కృతజ్ఞతను కాపాడుకోగలిగింది. ఆ అమ్మాయి ఇంకా ఏమంటుందంటే, “అవసరంలో ఉన్నవాళ్లకు సహోదరసహోదరీలు ఎలా సహాయం చేశారో, ఎలా ప్రోత్సహించారో నేను చూశాను. అన్ని దేశాల్లోని సహోదరులు నా కోసం ప్రార్థిస్తున్నారని నాకు తెలుసు. యెహోవా నాకు దేవుడుగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. మనకు కావాల్సిన వాటిని ఆయన ఎప్పుడూ ఇస్తాడు.” అవును, యెహోవా ఇచ్చిన ఆశీర్వాదాల విషయంలో మనకు కృతజ్ఞత ఉంటే, కష్టాలొచ్చినప్పుడు కృంగిపోకుండా ఉంటాం. అంతేకాదు, ఎలాంటి బాధలు వచ్చినా తట్టుకుంటాం.—ఎఫె. 5:20; ఫిలిప్పీయులు 4:6, 7 చదవండి.

‘నేను యెహోవాను బట్టి ఆనందిస్తాను’

14. త్వరలోనే మనం ఎలాంటి అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుతాం? (ప్రారంభ చిత్రం చూడండి.)

14 చరిత్రంతటిలో యెహోవా ప్రజలు, ఆయనిచ్చిన దీవెనలను బట్టి కృతజ్ఞత చూపించారు. ఎర్ర సముద్రం దగ్గర ఫరో నుండి, అతని సైన్యం నుండి రక్షించినందుకు ఇశ్రాయేలీయులు యెహోవాను స్తుతిస్తూ, కృతజ్ఞతలు చెప్తూ ఆనందంగా పాటలు పాడారు. (నిర్గ. 15:1-21) అలాగే, మనకు బాధ కలిగించే ప్రతీదాని నుండి యెహోవా త్వరలోనే విడిపిస్తాడని తెలుసుకోవడం మనకు ఒక పెద్ద ఆశీర్వాదం. (కీర్త. 37:9-11; యెష. 25:8; 33:24) యెహోవా తన శత్రువులందర్నీ నాశనం చేసి, సమాధానం, నీతి ఉండే కొత్త లోకంలోకి మనల్ని ఆహ్వానించినప్పుడు మనకెలా అనిపిస్తుందో ఒక్కసారి ఊహించుకోండి. నిజంగా ఆ రోజు యెహోవా మీద కృతజ్ఞతతో మన హృదయాలు ఉప్పొంగుతాయి.—ప్రక. 20:1-3; 21:3, 4.

15. ఈ సంవత్సరమంతా ఏం చేయాలని మీరు నిర్ణయించుకున్నారు?

15 యెహోవా మనకివ్వబోయే లెక్కలేనన్ని ఆశీర్వాదాల కోసం మనం ఈ 2015 సంవత్సరంలో ఎదురుచూస్తాం. అయితే మనకు కొన్ని కష్టాలు కూడా రావచ్చు. కానీ ఏం జరిగినా యెహోవా మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టడనే నమ్మకం మనకుంది. (ద్వితీ. 31:8; కీర్త. 9:9, 10) తనను నమ్మకంగా సేవించడానికి అవసరమైనవన్నీ యెహోవా మనకు ఇస్తూనే ఉంటాడు. మనం హబక్కూకు ప్రవక్తను ఆదర్శంగా తీసుకుందాం. ఆయనిలా అన్నాడు, ‘అంజూరపుచెట్లు పూయకపోయినా, ద్రాక్షచెట్లు ఫలించకపోయినా, ఒలీవచెట్లు కాపుకాయకపోయినా, చేనులోని పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా నేను యెహోవాయందు ఆనందిస్తాను నా రక్షణకర్తయైన నా దేవునియందు నేను సంతోషిస్తాను.’ (హబ. 3:17, 18) కాబట్టి, యెహోవా ఇచ్చిన ఆశీర్వాదాలన్నిటి గురించి ఈ సంవత్సరమంతా ధ్యానిస్తూ, 2015 వార్షిక వచనంలోని ఈ సలహాను పాటిద్దాం: “యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి.”—కీర్త. 106:1.

a ఈ ఆర్టికల్‌లోని కొన్ని పేర్లు అసలు పేర్లు కావు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి