మీరు పొందిన వాటిపట్ల మీకు కృతజ్ఞత ఉందా?
“దేవునివలన మనకు దయచేయబడినవాటిని తెలిసికొనుటకై మనము . . . దేవుని యొద్దనుండి వచ్చు ఆత్మను పొందియున్నాము.”—1 కొరిం. 2:12.
1. చాలామంది తమ దగ్గరున్నవాటిని ఎలా చూస్తారు?
‘ఉన్నది పోగొట్టుకునేవరకు మీకు దాని విలువ తెలీదు’ అని ప్రజలు అనడం మీరెప్పుడైనా విన్నారా? మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా? కొంతమంది చిన్నప్పటినుండి తమదగ్గరున్న వాటికి అంతగా విలువివ్వరు. ఉదాహరణకు, డబ్బున్న కుటుంబంలో పెరిగినవాళ్లు తమ దగ్గరున్న చాలా వస్తువులను అంత విలువైనవిగా చూడకపోవచ్చు. అనుభవం లేకపోవడంవల్ల కొంతమంది యౌవనులు జీవితంలో నిజంగా ఏవి విలువైనవో అర్థం చేసుకోలేకపోవచ్చు.
2, 3. (ఎ) క్రైస్తవ యౌవనులు ఏ విషయంలో జాగ్రత్తపడాలి? (బి) ఆధ్యాత్మిక స్వాస్థ్యంపట్ల కృతజ్ఞత చూపించడానికి మనకేది సహాయం చేస్తుంది?
2 యౌవనులారా, మీరు దేనికి ప్రాముఖ్యత ఇస్తారు? లోకంలో చాలామంది మంచి ఉద్యోగం, మంచి ఇల్లు లేదా కొత్తకొత్త ఫోన్లు, ట్యాబ్‌లు వంటివాటి కోసం ఎక్కువగా ప్రాకులాడుతుంటారు. కానీ, వాళ్లు అంతకంటే ముఖ్యమైన ఆధ్యాత్మిక సంపదకు అంటే దేవునితో తమ సంబంధానికి విలువివ్వడం లేదు. ఎంతోమంది, దానికోసం కనీసం ప్రయత్నం కూడా చేయట్లేదు. మీరు యెహోవాసాక్షుల కుటుంబంలో పెరిగివుంటే, మీకు ఇప్పటికే అమూల్యమైన ఆధ్యాత్మిక స్వాస్థ్యం ఉంది.a (మత్త. 5:3) దాన్ని విలువైనదిగా ఎంచకపోతే మీరు ముందుముందు ఎన్నో బాధలు పడాల్సివస్తుంది.
3 కానీ అలా జరగకుండా మీరు జాగ్రత్తపడొచ్చు. మీరు పొందిన ఆధ్యాత్మిక స్వాస్థ్యాన్ని విలువైనదిగా ఎంచడానికి మీకేది సహాయం చేస్తుంది? మీకు సహాయపడే కొన్ని బైబిలు ఉదాహరణలు ఇప్పుడు పరిశీలిద్దాం. తాము పొందిన ఆధ్యాత్మిక స్వాస్థ్యాన్ని అమూల్యంగా ఎంచడానికి యౌవనులతో సహా క్రైస్తవులందరికీ ఆ ఉదాహరణలు సహాయం చేస్తాయి.
వాళ్లు కృతజ్ఞత చూపించలేదు
4. సమూయేలు కుమారుల గురించి 1 సమూయేలు 8:1-5 వచనాలు ఏమి చెబుతున్నాయి?
4 విలువైన ఆధ్యాత్మిక స్వాస్థ్యాన్ని పొందినా, దానిపట్ల కృతజ్ఞత చూపించని కొంతమంది గురించి మనం బైబిల్లో చూస్తాం. సమూయేలు ప్రవక్త కుటుంబంలో అదే జరిగింది. ఆయన చిన్నప్పటినుండి యెహోవాను సేవిస్తూ, దేవుని దగ్గర మంచి పేరు సంపాదించుకున్నాడు. (1 సమూ. 12:1-5) సమూయేలు తన కుమారులైన యోవేలు, అబీయాలకు మంచి ఆదర్శం ఉంచాడు. అయితే వాళ్లు ఆయన బాటలో నడవకుండా చెడ్డవాళ్లుగా తయారయ్యారు. వాళ్లు తమ తండ్రిలా కాకుండా ‘న్యాయాన్ని త్రిప్పివేశారు’ అని బైబిలు చెబుతుంది.—1 సమూయేలు 8:1-5 చదవండి.
5, 6. యోషీయా కుమారులు, మనుమడు ఎలా ప్రవర్తించారు?
5 రాజైన యోషీయా కుమారుల విషయంలో కూడా అలాగే జరిగింది. యెహోవాను ఆరాధించే విషయంలో ఆయన చక్కని ఆదర్శం ఉంచాడు. దేవుని ఆలయంలో దొరికిన ధర్మశాస్త్ర గ్రంథాన్ని యోషీయాకు చదివి వినిపించినప్పుడు, అందులో ఉన్న యెహోవా నిర్దేశాలను పాటించడానికి ఆయన తీవ్రంగా కృషి చేశాడు. దేశంలోని విగ్రహాలను, మంత్రతంత్రాలకు సంబంధించిన వాటిని తీసేశాడు. అలాగే యెహోవాకు లోబడమని ప్రజలను ప్రోత్సహించాడు. (2 రాజు. 22:8; 23:2, 3, 12-15, 24, 25) యోషీయా కుమారులు ఎంత గొప్ప ఆధ్యాత్మిక స్వాస్థ్యం పొందారో! ఆ తర్వాతి కాలాల్లో ఆయన కుమారుల్లో ముగ్గురు, ఒక మనుమడు రాజులయ్యారు. కానీ వాళ్లలో ఒక్కరు కూడా తాము పొందిన దానిపట్ల కృతజ్ఞత చూపించలేదు.
6 యోషీయా తర్వాత ఆయన కుమారుడు యెహోయాహాజు రాజయ్యాడు కానీ ఆయన ‘యెహోవా దృష్టికి చెడునడత నడిచాడు.’ ఆయన మూడు నెలలు మాత్రమే పరిపాలించాడు. ఆ తర్వాత ఫరో ఆయనను ఐగుప్తుకు బంధీగా తీసుకెళ్లాడు, ఆయన అక్కడే చనిపోయాడు. (2 రాజు. 23:31-34) తర్వాత, ఆయన తమ్ముడైన యెహోయాకీము 11 సంవత్సరాలు రాజుగా పరిపాలించాడు. ఆయన కూడా తన తండ్రి నుండి పొందిన దానిపట్ల కృతజ్ఞత చూపించలేదు. యెహోయాకీము ఎంత చెడుగా ప్రవర్తించాడంటే, “అతడు . . . గాడిద పాతిపెట్టబడు రీతిగా పాతిపెట్టబడును” అని యిర్మీయా ఆయన గురించి ప్రవచించాడు. (యిర్మీ. 22:17-19) యోషీయా కుమారుడైన సిద్కియా, మనుమడైన యెహోయాకీను కూడా యోషీయా అడుగుజాడల్లో నడవలేదు.—2 రాజు. 24:8, 9, 18, 19.
7, 8. (ఎ) సొలొమోను తన ఆధ్యాత్మిక స్వాస్థ్యాన్ని ఎలా చేజార్చుకున్నాడు? (బి) తమ ఆధ్యాత్మిక స్వాస్థ్యాన్ని చేజార్చుకున్న వాళ్లనుండి మనమే పాఠం నేర్చుకోవచ్చు?
7 రాజైన సొలొమోను కూడా తన తండ్రి దావీదు నుండి యెహోవాను ఎలా సేవించాలో నేర్చుకున్నాడు. అయితే ఆ తర్వాత, తాను పొందిన ఆధ్యాత్మిక స్వాస్థ్యంపట్ల కృతజ్ఞతను కోల్పోయాడు. “సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలతట్టు త్రిప్పగా అతని తండ్రియైన దావీదు హృదయమువలె అతని హృదయము దేవుడైన యెహోవాయెడల యథార్థము కాకపోయెను.” (1 రాజు. 11:4) చివరికి సొలొమోను యెహోవాకు దూరం అయ్యాడు.
8 మనం ఇప్పటివరకు పరిశీలించిన వాళ్లందరికీ యెహోవా గురించి తెలుసుకుని, సరైనది చేసే అవకాశం దొరికినా వాళ్లు దాన్ని చేజార్చుకున్నారు. కానీ, తాము పొందిన వాటిపట్ల కృతజ్ఞత చూపించిన వాళ్లు బైబిలు కాలాల్లో అలాగే ఇప్పుడూ ఉన్నారు. అలాంటి వాళ్ల గురించి ఇప్పుడు పరిశీలించి, వాళ్లను నేటి యౌవనులు ఎలా అనుకరించవచ్చో చూద్దాం.
తాము పొందిన వాటిపట్ల కృతజ్ఞత చూపించారు
9. నోవహు కుమారులు ఏవిధంగా చక్కని ఆదర్శం ఉంచారు? (ప్రారంభ చిత్రం చూడండి.)
9 తాము పొందిన వాటిపట్ల కృతజ్ఞత చూపించే విషయంలో నోవహు కుమారులు చక్కని మాదిరి ఉంచారు. ఒక ఓడను కట్టి, తన ఇంటివాళ్లందర్నీ దానిలోకి తీసుకెళ్లమని నోవహుకు యెహోవా ఆజ్ఞాపించాడు. యెహోవా చిత్తం చేయాల్సిన అవసరాన్ని నోవహు కుమారులు గుర్తించారు. అందుకే వాళ్లు తమ తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ, ఓడ కట్టేటప్పుడు తప్పకుండా సహాయం చేసుంటారు. ఆ తర్వాత వాళ్లు అందులోకి వెళ్లారు. (ఆది. 7:1, 7) దానివల్ల వచ్చిన ఫలితం? ఆదికాండము 7:3 చెబుతున్నట్లుగా, “భూమి అంతటిమీద సంతతిని జీవముతో కాపాడునట్లు” వాళ్లు జంతువులను ఓడలోకి తీసుకెళ్లారు. కొంతమంది మనుష్యులు కూడా జలప్రళయాన్ని తప్పించుకున్నారు. నోవహు కుమారులు తమ తండ్రి నుండి పొందినదాన్ని ఎంతో విలువైనదిగా ఎంచారు. కాబట్టే మానవజాతిని కాపాడే పనిలో భాగం వహించే అవకాశం వాళ్లకు దొరికింది. అంతేకాదు పరిశుభ్రమైన భూమ్మీద సత్యారాధనను తిరిగి స్థాపించే గొప్ప అవకాశం కూడా పొందారు.—ఆది. 8:20; 9:18, 19.
10. బబులోనులో ఉన్నప్పుడు, నలుగురు హెబ్రీ యువకులు తమ ఆధ్యాత్మిక స్వాస్థ్యం పట్ల ఎలా కృతజ్ఞత చూపించారు?
10 కొన్ని శతాబ్దాల తర్వాత, నలుగురు హెబ్రీ యువకులు నిజంగా ప్రాముఖ్యమైనది ఏమిటో గుర్తించామని చూపించారు. సా.శ.పూ. 617లో హనన్యాను, మిషాయేలును, అజర్యాను, దానియేలును బబులోనుకు చెరగా తీసుకెళ్లారు. అందం, తెలివితేటలు ఉన్న ఈ యౌవనులు బబులోనీయుల జీవన విధానానికి చాలా త్వరగా అలవాటుపడేవాళ్లే, కానీ వాళ్లలా చేయలేదు. వాళ్లు పొందిన స్వాస్థ్యాన్ని అంటే తల్లిదండ్రుల నుండి నేర్చుకున్న విషయాల్ని గుర్తుంచుకున్నారని వాళ్ల ప్రవర్తన ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. చిన్నప్పుడు దేవుని గురించి నేర్చుకున్న విషయాలను అంటిపెట్టుకుని ఉన్నందుకు వాళ్లు గొప్ప ఆశీర్వాదాలు పొందారు.—దానియేలు 1:8, 11-15, 20 చదవండి.
11. యేసు పొందిన ఆధ్యాత్మిక స్వాస్థ్యం నుండి ఇతరులు ఎలా ప్రయోజనం పొందారు?
11 ఆధ్యాత్మిక స్వాస్థ్యం పట్ల కృతజ్ఞత చూపించిన వాళ్లలో యేసు అత్యుత్తమ మాదిరి. తన తండ్రి దగ్గర నేర్చుకున్న విషయాలను ఆయన ఎంతో విలువైనవిగా ఎంచాడు. నేర్చుకున్న వాటిపట్ల యేసుకున్న కృతజ్ఞత ఈ మాటల్లో తెలుస్తుంది, “తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాటలాడుచున్నాను.” (యోహా. 8:28) తాను పొందిన దానినుండి ఇతరులు ప్రయోజనం పొందాలని యేసు కోరుకున్నాడు. అందుకే, ఆయన “నేనితర పట్టణములలోను దేవుని రాజ్యసువార్తను ప్రకటింపవలెను; ఇందునిమిత్తమే నేను పంపబడితిని” అని జనసమూహాలతో చెప్పాడు. (లూకా 4:18, 43) అంతేకాక, ఆధ్యాత్మిక స్వాస్థ్యానికి ఏమాత్రం విలువివ్వని ‘లోకసంబంధుల్లా ఉండకండి’ అని యేసు తన శిష్యులను హెచ్చరించాడు.—యోహా. 15:19.
మీరు పొందిన దానిపట్ల కృతజ్ఞత చూపించండి
12. (ఎ) రెండవ తిమోతి 3:14-17 లో ఉన్న విషయాలు ఇప్పుడున్న యౌవనులకు ఎలా వర్తిస్తాయి? (బి) క్రైస్తవ యౌవనులు ఏ ప్రశ్నల గురించి ఆలోచించాలి?
12 మనం ఇప్పటిదాకా పరిశీలించిన యౌవనుల్లాగే మీరు కూడా యెహోవాను ప్రేమించే తల్లిదండ్రుల పెంపకంలో పెరిగివుంటారు. అయితే, బైబిలు తిమోతి గురించి చెప్తున్న విషయాలు మీకూ వర్తించవచ్చు. (2 తిమోతి 3:14-17 చదవండి.) యెహోవా ఎవరో, ఆయనను ఎలా సంతోషపెట్టాలో మీ తల్లిదండ్రుల నుండే ‘మీరు నేర్చుకున్నారు.’ మీరు పసిపిల్లలుగా ఉన్నప్పటినుండే వాళ్లు మీకు బోధించడం ప్రారంభించి ఉండవచ్చు. అది మీరు “క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసముద్వారా రక్షణార్థమైన జ్ఞానం” పొందడానికి, దేవుని సేవకు ‘పూర్ణంగా సిద్ధపడి ఉండడానికి’ తప్పకుండా సహాయం చేసివుంటుంది. అయితే, మీరు పొందిన వాటిని విలువైనవిగా చూస్తున్నారా? ఈ ప్రశ్నల గురించి ఆలోచిస్తూ మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి, ‘నమ్మకమైన సాక్షుల సమూహంలో ఒకరిగా ఉండడం గురించి నేనెలా భావిస్తున్నాను? యెహోవాసాక్షిగా ఉన్నందుకు నేను గర్వపడుతున్నానా? తన స్నేహితులని యెహోవా పిలిచే కొంతమందిలో నేను కూడా ఉన్నందుకు సంతోషిస్తున్నానా? నాకు ఎంత ప్రత్యేకమైన, అద్భుతమైన అవకాశం దొరికిందో గుర్తిస్తున్నానా?’
నమ్మకమైన సాక్షుల్లో ఒకరిగా ఉండడం గురించి మీరెలా భావిస్తున్నారు? (9, 10, 12 పేరాలు చూడండి)
13, 14. సత్యంలో పెరిగిన కొంతమందికి ఏ శోధన ఎదురుకావచ్చు? దానికి లొంగిపోవడం ఎందుకు తెలివైన పని కాదో ఉదాహరణతో చెప్పండి.
13 క్రైస్తవ కుటుంబంలో పెరిగిన కొంతమంది యౌవనులు, మన ఆధ్యాత్మిక పరదైసుకీ కటిక చీకటిగా ఉండే సాతాను లోకానికీ మధ్యవున్న స్పష్టమైన తేడాను చూడలేకపోవచ్చు. మరికొంతమందైతే, ఈ లోకంలో జీవితం ఎలా ఉంటుందో చూడాలని ఆశపడ్డారు కూడా. అయితే, వేగంగా వెళ్తున్న కారు ముందు పరిగెడుతూ, దెబ్బలు తగులుతాయో లేదో చనిపోతామో లేదో చూద్దామని అనుకుంటామా? అలా అనుకోవడం ఎంత మూర్ఖత్వం! అదేవిధంగా, ఈ లోకంలోని చెడు విషయాలు ఎంత బాధ కలిగిస్తాయో తెలుసుకోవడానికి వాటిని చేయాల్సిన అవసరం లేదు.—1 పేతు. 4:4.
14 ఆసియాకు చెందిన జెనెర్, సాక్షుల కుటుంబంలో పెరిగాడు. ఆయన 12వ ఏట బాప్తిస్మం తీసుకున్నాడు. అయినా టీనేజీలో ఉన్నప్పుడు ఈ లోకంపట్ల ఆకర్షితుడయ్యాడు. ఆయన ఇలా చెబుతున్నాడు, “ఈ లోకం అందించే ‘స్వేచ్ఛను’ అనుభవించాలని నేను కోరుకున్నాను.” అలా జెనెర్ ద్వంద్వ జీవితాన్ని గడపడం మొదలుపెట్టాడు. 15 ఏళ్లు వచ్చేసరికి తన చెడు స్నేహితుల్లాగే త్రాగడం, తిట్టడం అతనికి అలవాటైంది. వాళ్లతో హింసాత్మక వీడియో గేమ్‌లు ఆడి తరచూ ఇంటికి లేటుగా వచ్చేవాడు. అయితే, ఈ లోకంలోని తళుకుబెళుకులు నిజమైన సంతోషాన్ని ఇవ్వవని కొంతకాలానికి అర్థమైంది. ఆయనకు జీవితం శూన్యంగా అనిపించింది. జెనెర్ సంఘానికి తిరిగొచ్చిన తర్వాత ఇలా అంటున్నాడు, “నేను ఇప్పటికీ ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటున్నాను, కానీ వాటికన్నా యెహోవా నాకు ఇస్తున్న ఆశీర్వాదాలే చాలా ఎక్కువ.”
15. క్రైస్తవ తల్లిదండ్రుల పెంపకంలో పెరగని యౌవనులు కూడా ఏ విషయం గురించి ఆలోచించాలి?
15 ఒకవేళ మీ తల్లిదండ్రులు సత్యంలో లేకపోయినా, సృష్టికర్తను తెలుసుకుని ఆయనను సేవించే గొప్ప అవకాశం మీకుందని గుర్తుంచుకోండి. భూమ్మీద కొన్ని కోట్లమంది ప్రజలు ఉన్నారు. అయినా వాళ్లందరిలో యెహోవా మిమ్మల్ని తన వైపుకు ఆకర్షించుకుని, బైబిలు సత్యాలను తెలియజేయడం మీకు నిజంగా ఒక గొప్ప ఆశీర్వాదం. (యోహా. 6:44, 45) ఇప్పుడు జీవిస్తున్న ప్రతీ 1000 మందిలో కేవలం ఒక్కరికి మాత్రమే సత్యం తెలుసు, వాళ్లలో మీరూ ఒకరు. మనం సత్యాన్ని తల్లిదండ్రుల నుండి నేర్చుకున్నా లేక మరోవిధంగా నేర్చుకున్నా, అసలు సత్యం తెలుసుకోగలిగినందుకు ఎంతో సంతోషిస్తున్నాం. (1 కొరింథీయులు 2:12 చదవండి.) జెనెర్ ఇలా అంటున్నాడు, “ఈ విశ్వానికి అధిపతైన యెహోవా నన్ను గుర్తించడానికి నేను ఎంతటివాణ్ణి? ఈ విషయం గురించి ఆలోచించిన ప్రతీసారి నా ఒళ్లు పులకరిస్తుంది.” (కీర్త. 8:4) ఆసియాకు చెందిన ఓ సహోదరి ఇలా అంటోంది, “టీచర్ తమను గుర్తించినందుకే పిల్లలు చాలా గొప్పగా అనుకుంటారు. అలాంటిది గొప్ప బోధకుడు అయిన యెహోవా మనల్ని గుర్తించడం ఇంకెంత గొప్ప విషయం!”
యౌవనులారా, మీరేమి చేస్తారు?
16. ఇప్పుడున్న యౌవనులు ఏ లక్ష్యాన్ని పెట్టుకోవాలి?
16 మీకున్న అమూల్యమైన ఆధ్యాత్మిక స్వాస్థ్యం గురించి ఆలోచిస్తూ, యెహోవాను సేవించాలనే లక్ష్యం పెట్టుకోండి. యెహోవాను నమ్మకంగా సేవించినవాళ్లను ఆదర్శంగా తీసుకోండి. ఈ లోకంలోని యువతీయువకులు ఇష్టమొచ్చినట్లు జీవిస్తూ, భవిష్యత్తును పాడుచేసుకుంటున్నారు. మీరు వాళ్లలా ఉండకండి.—2 కొరిం. 4:3, 4.
17-19. లోకానికి వేరుగా ఉండడం ఎందుకు తెలివైన పని?
17 అయితే, లోకానికి వేరుగా ఉండడం ప్రతీసారి అంత తేలిక కాదు. కానీ అలా వేరుగా ఉండడమే తెలివైన పని. ఉదాహరణకు, ఒలంపిక్స్‌లో పాల్గొనాలని కోరుకునే ఓ క్రీడాకారుడి గురించి ఆలోచించండి. ఆ స్థాయికి చేరుకోవాలంటే ఆయన తన తోటివాళ్లలా ఉండకుండా, తన సమయాన్ని వృథా చేసేవాటికి, తన దృష్టిని మళ్లించే వాటికి దూరంగా ఉండాలి. అలా ఉండడానికి ఇష్టపడితేనే ఆయన ఇంకా బాగా శిక్షణ పొంది, తన లక్ష్యాన్ని చేరుకుంటాడు.
18 ఈ లోకంలోని చాలామంది ప్రజలు, తమ పనులవల్ల ఎలాంటి చెడు ఫలితాలు వస్తాయో ఆలోచించరు. కానీ యెహోవా సేవకులమైన మనం వాళ్లలా ఉండం. మనం లోకానికి వేరుగా ఉంటూ, యెహోవాతో మన స్నేహాన్ని పాడుచేసే వాటికి దూరంగా ఉన్నప్పుడే ‘వాస్తవమైన జీవాన్ని సంపాదించుకుంటాం.’ (1 తిమో. 6:18, 19) ఆసియాకు చెందిన ఆ సహోదరి ఇంకా ఇలా అంటోంది, “మీరు నమ్మిన వాటికి కట్టుబడివుంటే, ఆరోజు చివర్లో మీకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. సాతాను లోకంలో ఎదురీదడానికి కావాల్సిన బలం మీకుందని రుజువౌతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా, యెహోవా మిమ్మల్ని చూస్తూ గర్వంగా చిరునవ్వు చిందించడం మీరు కళ్లారా చూస్తున్నట్లు అనిపిస్తుంది. లోకానికి వేరుగా ఉన్నందుకు ఆ క్షణం మీరు ఎంతో సంతోషిస్తారు.”
19 మీరు కేవలం ఇప్పుడు పొందే వాటిమీదే మనసు పెడుతూ జీవితాన్ని వృథా చేసుకోకండి. (ప్రసం. 9:2, 10) మీ జీవితానికో అర్థం ఉందని, మీకు నిత్యం జీవించే అవకాశం ఉందని మీరు అర్థంచేసుకున్నారు. మంచి నిర్ణయాలు తీసుకోవడానికి, లోకంలోని ప్రజల్లా ప్రవర్తించకుండా ఉండడానికి అది మీకు సహాయపడుతుంది. అవును, మీ జీవితానికి నిజమైన అర్థం ఉంది.—ఎఫె. 4:17; మలా. 3:18.
20, 21. సరైన నిర్ణయాలు తీసుకుంటే మనం ఎలాంటి భవిష్యత్తును సొంతం చేసుకుంటాం? దాన్ని పొందడం కోసం మనం ఏమి చేయాలి?
20 మనం సరైన నిర్ణయాలు తీసుకుంటే ఇప్పుడు సంతృప్తిగా జీవిస్తాం. అంతేకాదు, ‘భూలోకాన్ని స్వతంత్రించుకుని’ నిత్యం జీవిస్తాం. మనం ఊహించలేనన్ని అద్భుతమైన ఆశీర్వాదాలు మనకోసం వేచి ఉన్నాయి. (మత్త. 5:5; 19:29; 25:34) అయితే యెహోవా వాటిని అందరికీ ఇవ్వడు. మనం వాటిని పొందాలంటే ఆయనకు విధేయత చూపించాలి. (1 యోహాను 5:3, 4 చదవండి.) ఆయన్ను నమ్మకంగా సేవించడం కోసం ఇప్పుడు మనం చేస్తున్న కృషి వృథాగా పోదు.
21 యెహోవా ఇప్పటికే మనకు ఎన్నో ఇచ్చాడు. తన వాక్యం గురించిన ఖచ్చితమైన జ్ఞానాన్ని ఇచ్చాడు, తన గురించీ తన సంకల్పాల గురించీ ఎన్నో విషయాలు స్పష్టంగా తెలియజేశాడు. యెహోవాసాక్షులుగా ఆయన నామాన్ని ధరించే గొప్ప అవకాశం మనకు ఉంది. మనకు తోడుగా ఉంటానని కూడా మాటిస్తున్నాడు. (కీర్త. 118:7) కాబట్టి యౌవనులమైనా పెద్దవాళ్లమైనా మనమందరం, యెహోవా మనకిచ్చిన ఆధ్యాత్మిక స్వాస్థ్యం పట్ల కృతజ్ఞత ఉందనీ, ఎల్లప్పుడూ ‘ఆయనకు మహిమ’ ఇవ్వాలని కోరుకుంటున్నామనీ చూపిద్దాం.—రోమా. 11:33-36; కీర్త. 33:12.
a యెహోవా గురించి తెలుసుకుని, ఆయనను ఎలా సేవించాలో నేర్చుకోవడం; దేవుని పేరు ధరించడం, ఆయనకు స్నేహితులుగా ఉండడం; ఆయన వాక్యంలో ఉన్న ఖచ్చితమైన జ్ఞానం తెలుసుకోవడం; నమ్మకంగా సేవచేసిన మన తల్లిదండ్రులను చూసి నేర్చుకోవడం; మనకు ముందు జీవించిన ఎంతోమంది సాక్షుల్లా నమ్మకంగా దేవుణ్ణి సేవించడం వంటివి మన ఆధ్యాత్మిక స్వాస్థ్యంలో ఉన్నాయి.