మనం ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి?
“మీరు పరిశుద్ధులు కావలెను.”—లేవీ. 11:45.
1. లేవీయకాండము పుస్తకం మనకెలా ప్రయోజనకరం?
పరిశుద్ధత గురించిన ప్రస్తావన బైబిల్లోని మరే పుస్తకంలో కన్నా లేవీయకాండము పుస్తకంలోనే ఎక్కువసార్లు ఉంది. యెహోవా సత్యారాధకులందరూ పరిశుద్ధంగా ఉండాలి కాబట్టి లేవీయకాండము పుస్తకాన్ని అర్థంచేసుకుని, దాని విలువను గుర్తిస్తే మనం ఎలా పరిశుద్ధంగా ఉండగలమో తెలుసుకుంటాం.
2. లేవీయకాండములోని కొన్ని ప్రత్యేకతలు ఏమిటి?
2 ‘ప్రతిలేఖనములో’ భాగమైన లేవీయకాండము పుస్తకాన్ని మోషే రాశాడు. అది ‘ఉపదేశించడానికి ప్రయోజనకరమైనది.’ (2 తిమో. 3:16, 17) ఆ పుస్తకంలో యెహోవా పేరు సగటున ప్రతీ అధ్యాయంలో పదిసార్లు కనిపిస్తుంది. లేవీయకాండము పుస్తకాన్ని అర్థంచేసుకుంటే, యెహోవా నామానికి కళంకం తెచ్చే ఏ పనీ చేయకుండా ఉండగలుగుతాం. (లేవీ. 22:32) ఆ పుస్తకంలో, “నేను యెహోవాను” అనే మాట తరచూ కనిపిస్తుంది. మనం దేవునికి విధేయత చూపించాలని అది గుర్తుచేయాలి. లేవీయకాండములోని కొన్ని ఆణిముత్యాలను మనం ఈ ఆర్టికల్‌లో, తర్వాతి ఆర్టికల్‌లో చూస్తాం. దేవుని ఆరాధనలో పరిశుద్ధంగా ఉండడానికి అవి మనకు సహాయం చేస్తాయి.
పరిశుద్ధత ప్రాముఖ్యం
3, 4. అహరోనుకు, ఆయన కుమారులకు ‘స్నానం చేయించడం’ దేన్ని సూచిస్తుంది? (ప్రారంభ చిత్రం చూడండి.)
3 లేవీయకాండము 8:5, 6 చదవండి. ఇశ్రాయేలీయుల ప్రధాన యాజకునిగా సేవచేయడానికి యెహోవా అహరోనును నియమించాడు. అహరోను కుమారులు జనాంగం తరఫున యాజకులుగా సేవ చేయాలి. అహరోను యేసుక్రీస్తును సూచిస్తున్నాడు, అహరోను కుమారులు యేసు అభిషిక్త అనుచరులను సూచిస్తున్నారు. మరైతే, అహరోనుకు ‘స్నానం చేయించడం’ యేసును శుద్ధీకరించడాన్ని సూచిస్తుందా? కాదు. యేసులో పాపం లేదు, ఆయన “నిర్దోషి” కాబట్టి ఆయనకు శుద్ధీకరణ అవసరం లేదు. (హెబ్రీ. 7:26; 9:14) అయితే అహరోను స్నానం తర్వాత, పవిత్రుడూ నీతిమంతుడైన యేసుకు సూచనగా ఉన్నాడు. మరి, అహరోను కుమారులకు ‘స్నానం చేయించడం’ దేన్ని సూచిస్తుంది?
4 అహరోను కుమారులకు స్నానం చేయించడం, పరలోకంలో యాజకులుగా సేవ చేయబోయేవాళ్లను శుద్ధి చేయడాన్ని సూచిస్తుంది. అయితే, అహరోను కుమారుల స్నానానికీ అభిషిక్తుల బాప్తిస్మానికీ సంబంధం ఉందా? లేదు. బాప్తిస్మం పాపాలను కడగదు, బదులుగా ఒక వ్యక్తి ఎలాంటి షరతులు లేకుండా యెహోవా దేవునికి సమర్పించుకున్నాడని అది సూచిస్తుంది. అభిషిక్తులు “వాక్యముతో” శుద్ధి అవుతారు, అందుకే వాళ్లు క్రీస్తు బోధల్ని తమ జీవితంలో హృదయపూర్వకంగా పాటించాలి. (ఎఫె. 5:25-27) ఆ విధంగా వాళ్లు పరిశుద్ధులు, పవిత్రులు అవుతారు. మరి “వేరే గొఱ్ఱెల” సంగతేంటి?—యోహా. 10:16.
5. వేరేగొర్రెలు దేవుని వాక్యం ద్వారా శుద్ధి అవుతారని ఎందుకు చెప్పవచ్చు?
5 అహరోను కుమారులు వేరేగొర్రెలకు చెందిన ‘గొప్ప సమూహానికి’ సూచనగా లేరు. (ప్రక. 7:9) అయినా వేరేగొర్రెలకు చెందినవాళ్లు కూడా దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధులు, పవిత్రులు అవుతారు. భూనిరీక్షణ గలవాళ్లు యేసు ఇచ్చిన బలి గురించి, దానివల్ల వచ్చే ప్రయోజనాల గురించి బైబిల్లో చదివినప్పుడు, వాటిమీద విశ్వాసం ఉంచి “రాత్రింబగళ్లు” యెహోవాను ఆరాధించాలనే పురికొల్పు పొందుతారు. (ప్రక. 7:13-15) అభిషిక్తుల, వేరేగొర్రెల శుద్ధీకరణ కొనసాగుతూనే ఉంటుంది. అందుకే వాళ్ల ప్రవర్తన అన్ని సమయాల్లో పరిశుద్ధంగా ఉంటుంది. (1 పేతు. 2:12) అభిషిక్తులు, వేరేగొర్రెలు తమ కాపరియైన యేసును యథార్థంగా అనుసరిస్తూ, ఆయన చెప్పేది వింటూ పరిశుభ్రంగా, ఐక్యంగా ఉండడం చూసి యెహోవా ఎంత సంతోషిస్తాడో!
6. మనల్ని మనం ఎందుకు పరిశీలించుకోవాలి?
6 ఇశ్రాయేలులోని యాజకులు భౌతికంగా పరిశుభ్రంగా ఉండాలనే నియమం నుండి నేడు యెహోవా ప్రజలు ఎంతో నేర్చుకోవచ్చు. మన ఆరాధనా స్థలాలు ఎంత పరిశుభ్రంగా ఉన్నాయో, మనం పద్ధతిగా బట్టలు ధరిస్తూ ఎంత శుభ్రంగా ఉన్నామో మన బైబిలు విద్యార్థులు తరచూ గమనిస్తారు. వాటితోపాటు, యెహోవాను ఆరాధించాలనుకునే వాళ్లకు “శుద్ధమైన హృదయము” కూడా ఉండాలి. (కీర్తన 24:3, 4 చదవండి; యెష. 2:2, 3) మనం నిర్మలమైన మనసుతో హృదయంతో, పరిశుభ్రమైన శరీరంతో యెహోవాకు పరిశుద్ధ సేవచేయాలి. అందుకోసం మనల్ని మనం ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ, పరిశుద్ధంగా ఉండేలా ముఖ్యమైన మార్పులు చేసుకోవాలి. (2 కొరిం. 13:5) ఉదాహరణకు, ఉద్దేశపూర్వకంగా అశ్లీల చిత్రాలు చూసే సహోదరుడు ఇలా ప్రశ్నించుకోవాలి: ‘నేను పరిశుద్ధంగా ఉన్నానని చూపిస్తున్నానా?’ తర్వాత, ఆ చెడ్డ అలవాటును మానుకోవడానికి సహాయం తీసుకోవాలి.—యాకో. 5:14.
విధేయత చూపిస్తూ పరిశుద్ధంగా ఉన్నారని నిరూపించుకోండి
7. లేవీయకాండము 8:22-24 ప్రకారం యేసు ఎలాంటి ఆదర్శం ఉంచాడు?
7 ఇశ్రాయేలులో యాజకత్వం ఏర్పాటైనప్పుడు అహరోను, ఆయన కుమారుల కుడి చెవిమీద, కుడిచేతి బొటనవేలు మీద, కుడికాలి బొటనవేలు మీద పొట్టేలు రక్తాన్ని మోషే పూశాడు. (లేవీయకాండము 8:22-24 చదవండి.) రక్తాన్ని ఆ విధంగా పూయడం, యాజకులు తమ బాధ్యతలను నమ్మకంగా నిర్వర్తిస్తారని సూచించింది. అదేవిధంగా ప్రధాన యాజకుడైన యేసు, అభిషిక్తులకూ వేరే గొర్రెలకూ పరిపూర్ణ ఆదర్శం ఉంచాడు. ఆయన చెవులు దేవుని నిర్దేశాన్ని ఆలకించాయి, ఆయన చేతులు దేవుని చిత్తాన్ని చేశాయి, ఆయన కాళ్లు పరిశుద్ధ మార్గం నుండి ఎన్నడూ తొలగిపోలేదు.—యోహా. 4:31-34.
8. యెహోవా ఆరాధకులందరూ ఏమి చేయాలి?
8 అభిషిక్తులు, వేరే గొర్రెలు యథార్థంగా ఉండే విషయంలో తమ ప్రధాన యాజకుణ్ణి అనుసరించాలి. యెహోవా ఆరాధకులందరూ ఆయన వాక్యంలోని నిర్దేశాలకు తప్పకుండా విధేయత చూపించాలి. అప్పుడే వాళ్లు దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా ఉంటారు. (ఎఫె. 4:30) వాళ్లు తమ ‘పాదములకు మార్గములను సరళం’ చేసుకోవాలి.—హెబ్రీ. 12:13.
9. పరిపాలక సభ సభ్యులతో కలిసి పనిచేస్తున్న ముగ్గురు సహోదరులు ఏమి చెప్పారు? మనం పరిశుద్ధంగా ఉండడానికి వాళ్ల మాటలు ఎలా సహాయం చేస్తాయి?
9 పరిపాలక సభ సభ్యులతో దశాబ్దాలుగా కలిసి పనిచేస్తున్న ముగ్గురు భూనిరీక్షణగల సహోదరులు ఏమంటున్నారో పరిశీలించండి. వాళ్లలో ఒకాయన ఇలా అంటున్నాడు, “అది నిజంగా ఓ ప్రత్యేక సేవావకాశమే. అయితే ఆత్మాభిషిక్తులైనా వాళ్లుకూడా అపరిపూర్ణులేనని, వాళ్లకు దగ్గరగా పనిచేయడంవల్ల అప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది. అయినా ఎప్పుడూ నా లక్ష్యం మాత్రం, నాయకత్వం వహించేవాళ్లకు లోబడడమే.” మరో సహోదరుడు ఏమంటున్నాడంటే, “‘క్రీస్తుకు లోబడండి’ అని చెబుతున్న 2 కొరింథీయులు 10:5 వంటి వచనాలు, నాయకత్వం వహించేవాళ్లకు లోబడుతూ సహకరించేలా నాకు సహాయం చేశాయి. నేను ఎప్పుడూ హృదయపూర్వకంగా లోబడతాను.” మూడవ సహోదరుడు ఇలా అంటున్నాడు, ‘యెహోవా ప్రేమించేవాటిని ప్రేమించడం, ద్వేషించేవాటిని ద్వేషించడం; ఆయన నిర్దేశం కోసం ఎల్లప్పుడూ వెదకడం, ఆయనను సంతోషపెట్టే పనులు చేయడం చాలా ముఖ్యం. అలా చేసినప్పుడు యెహోవా సంస్థకు, భూమి విషయంలో తన సంకల్పాన్ని నెరవేర్చడానికి ఆయన ఉపయోగిస్తున్న వాళ్లకు విధేయత చూపిస్తాం.’ ఈ సహోదరుడు, బ్రదర్ నేథన్ నార్ ఉదాహరణను గుర్తుచేసుకుంటున్నాడు. 1925 కావలికోటలో (ఇంగ్లీషు) వచ్చిన ‘జనాంగపు పుట్టుక’ అనే ఆర్టికల్‌లోని విషయాలను కొంతమంది ప్రశ్నించారు. కానీ, నేథన్ నార్ మాత్రం ఆ విషయాలను వెంటనే అంగీకరించాడు. తర్వాత పరిపాలక సభ సభ్యునిగా సేవచేసిన బ్రదర్ నార్ చూపించిన అలాంటి విధేయత ఈ సహోదరుని మనసులో చెరగని ముద్ర వేసింది. ఈ ముగ్గురు సహోదరులు చెప్పిన మాటల గురించి ఆలోచించడం, దేవునికి విధేయత చూపిస్తూ పరిశుద్ధంగా ఉండడానికి మీకు సహాయం చేస్తుంది.
రక్తం విషయంలో దేవుని నియమానికి సంపూర్ణ విధేయత చూపించండి
10. రక్తం విషయంలో దేవుని నియమానికి విధేయత చూపించడం ఎంత ప్రాముఖ్యం?
10 లేవీయకాండము 17:10 చదవండి. “దేని రక్తమును” తినకూడదని యెహోవా ఇశ్రాయేలీయులను ఆజ్ఞాపించాడు. మనుషుల, జంతువుల రక్తాన్ని విసర్జించాలని క్రైస్తవులను కూడా బైబిలు ఆజ్ఞాపిస్తుంది. (అపొ. 15:28, 29) యెహోవా మనకు విముఖుడై, మనల్ని తన సంఘం నుండి కొట్టివేస్తాడనే ఆలోచనను కూడా మనం భరించలేం. మనం ఆయనను ప్రేమిస్తాం, ఆయనకు విధేయత చూపించాలని కోరుకుంటాం. మన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నా, దేవుని గురించి తెలియనివాళ్లూ ఆయనకు విధేయత చూపించాల్సిన అవసరం లేదనుకునేవాళ్లూ తీసుకొచ్చే ఒత్తిళ్లకు తలొగ్గం. రక్తాన్ని తిరస్కరిస్తున్నందుకు ఇతరులు మనల్ని ఎగతాళి చేస్తారని తెలిసినా, యెహోవాకు విధేయత చూపించాలనే నిర్ణయించుకున్నాం. (యూదా 17, 18) రక్తాన్ని తినకూడదని, ఎక్కించుకోకూడదని నిశ్చయించుకోవడానికి మనకేది సహాయం చేస్తుంది?—ద్వితీ. 12:23.
11. ప్రాయశ్చిత్త దినం కేవలం ఓ ఆచారం కాదని ఎందుకు చెప్పవచ్చు?
11 ప్రాయశ్చిత్త దినాన ఇశ్రాయేలీయుల ప్రధాన యాజకుడు జంతు రక్తాన్ని ఎలా ఉపయోగించేవాడో తెలుసుకుంటే, రక్తం విషయంలో దేవుని అభిప్రాయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఓ ప్రత్యేకమైన ఉద్దేశం కోసమే అంటే, పాపాల ప్రాయశ్చిత్తం కోసమే రక్తాన్ని ఉపయోగించేవాళ్లు. అలా ఇశ్రాయేలీయులు యెహోవాతో మంచి సంబంధం కలిగివుండగలిగేవాళ్లు. ఎద్దు లేదా మేక రక్తాన్ని నిబంధన మందసపు కరుణాపీఠం ఎదురుగా చిలకరించాలి. (లేవీ. 16:14, 15, 19) ఆ రక్తం ఆధారంగా యెహోవా ఇశ్రాయేలీయుల పాపాల్ని క్షమించేవాడు. అంతేకాదు, ఆహారం కోసం ఓ జంతువును చంపితే, దాని రక్తాన్ని ఒలికించి మట్టితో కప్పాలని యెహోవా ఆజ్ఞాపించాడు. ఎందుకంటే “అది సమస్త దేహములకు ప్రాణాధారము.” (లేవీ. 17:11-14) ఇవన్నీ అనవసరమైన ఆచారాలా? కాదు. ప్రాయశ్చిత్త దినాన రక్తాన్ని ఉపయోగించడం, రక్తాన్ని నేలమీద పారబోయడం వంటివి అంతకుముందు యెహోవా నోవహుకు, ఆయన సంతానానికి రక్తం గురించి ఇచ్చిన ఆజ్ఞకు అనుగుణంగా ఉన్నాయి. (ఆది. 9:3-6) క్రైస్తవులు దానినుండి ఏమి నేర్చుకోవచ్చు?
12. రక్తానికీ పాపక్షమాపణకూ ఉన్న సంబంధాన్ని పౌలు ఎలా వివరించాడు?
12 రక్తానికి శుద్ధిచేసే శక్తి ఉందని అపొస్తలుడైన పౌలు హెబ్రీ క్రైస్తవులకు వివరించాడు. “ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులును రక్తముచేత శుద్ధిచేయబడుననియు, రక్తము చిందింపకుండ పాపక్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును” అని ఆయన అన్నాడు. (హెబ్రీ. 9:22) తాము పాపులమనీ తమ పాపాలు పూర్తిగా ప్రాయశ్చిత్తం అవ్వాలంటే మరింత గొప్ప బలి అవసరమనీ ఇశ్రాయేలీయులకు జంతు బలులు గుర్తుచేశాయని పౌలు వివరించాడు. అవును, “ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలదికాదు.” (హెబ్రీ. 10:1-4) మరి పాపక్షమాపణ ఎలా సాధ్యమౌతుంది?
13. యేసు తన రక్తపు విలువను యెహోవాకు ఇవ్వడంవల్ల మనం ఏ ప్రయోజనం పొందుతున్నాం?
13 ఎఫెసీయులు 1:7 చదవండి. యేసు మనకోసం ఇష్టపూర్వకంగా ‘తనను తాను అప్పగించుకున్నాడు.’ ఆ బలి ఆయననూ ఆయన తండ్రినీ ప్రేమించేవాళ్లకు గొప్ప ప్రయోజనాలు తెచ్చింది. (గల. 2:20) అయితే, యేసు చనిపోయి పునరుత్థానమైన తర్వాత చేసిన పని పాపక్షమాపణను సాధ్యం చేసి, నిజానికి మనల్ని విడిపించింది. మోషే ధర్మశాస్త్రం ప్రకారం ప్రాయశ్చిత్త దినాన జరిగేదాన్ని యేసు చేశాడు. ఆ దినాన ప్రధాన యాజకుడు బలిగా అర్పించిన జంతువుల రక్తాన్ని తీసుకుని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్లేవాడు. అలా వెళ్లడం దేవుని సన్నిధిలోకి ప్రవేశించడంతో సమానం. (లేవీ. 16:11-15) అదేవిధంగా, యేసుక్రీస్తు కూడా పరలోకానికి వెళ్లి తన మానవ రక్తపు విలువను యెహోవాకు ఇచ్చాడు. (హెబ్రీ. 9:6, 7, 11-14, 24-28) యేసు చిందించిన రక్తంలో మనం విశ్వాసం ఉంచుతున్నాం కాబట్టి పాపక్షమాపణ దొరుకుతున్నందుకు, నిర్మలమైన మనస్సాక్షితో ఉంటున్నందుకు మనం ఎంత రుణపడివున్నామో కదా!
14, 15. రక్తం విషయంలో దేవుని నియమాన్ని అర్థం చేసుకోవడం, దానికి లోబడడం ఎందుకు ముఖ్యం?
14 ఏ ప్రాణి రక్తాన్నీ తినకూడదని యెహోవా ఎందుకు ఆజ్ఞాపించాడో ఇప్పుడు మీకు బాగా అర్థమైందా? (లేవీ. 17:10) దేవుడు రక్తాన్ని ఎందుకు పవిత్రంగా చూస్తున్నాడో మీరు గ్రహించారా? యెహోవా, రక్తాన్ని ప్రాణంతో సమానంగా చూస్తున్నాడు. (ఆది. 9:4) రక్తం విషయంలో దేవునికున్న అభిప్రాయమే మనకూ ఉండాలని, రక్తాన్ని విసర్జించాలనే ఆయన ఆజ్ఞకు లోబడాలని మీరు ఒప్పుకోరా? యేసు విమోచన క్రయధనంగా అర్పించిన బలిమీద విశ్వాసం ఉంచుతూ, రక్తాన్ని సృష్టికర్త అమూల్యంగా ఎంచుతాడని అర్థం చేసుకుంటేనే మనం దేవునితో సమాధానంగా ఉండగలం.—కొలొ. 1:19, 20.
15 మనలో ఎవరికైనా హఠాత్తుగా రక్తం విషయంలో పరీక్ష ఎదురుకావచ్చు. లేదా రక్తం ఎక్కించుకోవాలా వద్దా అనే విషయంలో మీ కుటుంబ సభ్యునికో మిత్రునికో ఊహించని పరిస్థితి తలెత్తవచ్చు. అలాంటి గడ్డు పరిస్థితి వచ్చినప్పుడు, రక్తంలోని సూక్ష్మభాగాలకు, కొన్ని చికిత్సా విధానాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అత్యవసర పరిస్థితి రాకముందే బాగా పరిశోధించి, సిద్ధపడడం ప్రాముఖ్యం. యెహోవాకు ప్రార్థించడంతోపాటు, అలాంటి పనులు చేయడం ద్వారా మనం రక్తం విషయంలో ఏమాత్రం రాజీపడకుండా స్థిరంగా ఉండగలుగుతాం. యెహోవా ఖండిస్తున్న దాన్ని చేసి ఆయన్ను బాధపెట్టాలని మనం అస్సలు కోరుకోం. చాలామంది డాక్టర్లు, మరితరులు రక్తదానం చేయమనీ దానివల్ల ఇతరుల ప్రాణాల్ని కాపాడొచ్చనీ ప్రోత్సహిస్తుంటారు. అయితే రక్తాన్ని ఎలా ఉపయోగించాలో చెప్పే హక్కు సృష్టికర్తకు ఉందని, యెహోవా పరిశుద్ధ ప్రజలమైన మనకు తెలుసు. ఆయన దృష్టిలో ఏ జీవి రక్తమైనా పవిత్రమైనదే. రక్తం విషయంలో ఆయన నియమాన్ని పాటించాలని మనం నిశ్చయించుకోవాలి. యేసు బలిగా అర్పించిన రక్తాన్ని అమూల్యంగా ఎంచుతున్నామని మన పరిశుద్ధ ప్రవర్తన ద్వారా చూపిస్తాం. ఆ రక్తం ద్వారానే పాపక్షమాపణ, నిత్యజీవం సాధ్యమౌతాయి.—యోహా. 3:16.
రక్తం విషయంలో యెహోవా నియమానికి విధేయత చూపించాలని మీరు నిశ్చయించుకున్నారా? (14, 15 పేరాలు చూడండి)
మనం పరిశుద్ధంగా ఉండాలని యెహోవా ఎందుకు కోరుకుంటున్నాడు?
16. యెహోవా ప్రజలు ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి?
16 ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపిస్తున్నప్పుడు దేవుడు వాళ్లకిలా చెప్పాడు, “నేను మీకు దేవుడనైయుండుటకు ఐగుప్తుదేశములోనుండి మిమ్మును రప్పించిన యెహోవాను; నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను.” (లేవీ. 11:45) యెహోవా పరిశుద్ధుడు కాబట్టి ఇశ్రాయేలీయులు కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. యెహోవాసాక్షులమైన మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఆ విషయాన్ని లేవీయకాండము పుస్తకం చాలా స్పష్టంగా చెబుతోంది.
17. బైబిలు పుస్తకమైన లేవీయకాండము గురించి ఇప్పుడు మీరెలా భావిస్తున్నారు?
17 లేవీయకాండము పుస్తకంలోని కొన్ని విషయాలు పరిశీలించి మనం నిస్సందేహంగా ప్రయోజనం పొందాం. బైబిల్లోని ఈ పుస్తకం పట్ల మీ కృతజ్ఞత కూడా తప్పకుండా పెరిగివుంటుంది. లేవీయకాండములోని కొన్ని అమూల్యమైన విషయాలను ధ్యానించడం వల్ల, మనం పరిశుద్ధంగా ఎందుకు ఉండాలో మీరు బాగా అర్థంచేసుకున్నారు. ఈ ప్రేరేపిత పుస్తకంలో ఇంకా ఎలాంటి ఆధ్యాత్మిక ఆణిముత్యాలు ఉన్నాయి? యెహోవాకు పరిశుద్ధ సేవ చేసే విషయంలో ఈ పుస్తకం నుండి ఇంకా ఏమి నేర్చుకోవచ్చు? వీటి గురించి తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలిద్దాం.