కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w14 9/15 పేజీలు 17-21
  • తల్లిదండ్రులారా​—⁠మీ పిల్లల్ని సంరక్షించండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • తల్లిదండ్రులారా​—⁠మీ పిల్లల్ని సంరక్షించండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీ పిల్లల గురించి తెలుసుకోండి
  • మీ పిల్లల్ని పోషించండి
  • మీ పిల్లలకు నిర్దేశం ఇవ్వండి
  • తల్లిదండ్రులారా, యెహోవాను ప్రేమించేలా మీ పిల్లలకు సహాయం చేయండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
  • ఆధ్యాత్మికంగా బలమైన కుటుంబాన్ని నిర్మించుకోవడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • మీ కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఏం చేయవచ్చు?—2వ భాగం
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • తల్లిదండ్రులారా—మీ పిల్లలకు ప్రేమతో శిక్షణనివ్వండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
w14 9/15 పేజీలు 17-21
యౌవనురాలైన తమ కూతురు కావలికోట పత్రికను చూస్తుడగా ఆమె వైపు చూస్తున్న తల్లిదడ్రులు

తల్లిదండ్రులారా మీ పిల్లల్ని సంరక్షించండి

“నీ గొర్రెల మందలను జాగ్రత్తగా చూచుకొనుము.”—సామె. 27:23, పవిత్ర గ్రంథము, కతోలిక అనువాదము.

మీరెలా జవాబిస్తారు?

  • తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎలా కాపరులుగా ఉండవచ్చు?

  • తల్లిదండ్రులు తమ పిల్లలను ఆధ్యాత్మికంగా ఎలా పోషించాలి?

  • కుటుంబ ఆరాధన ద్వారా చాలామంది యౌవనులు ఎలా ప్రయోజనం పొందారు?

1, 2. (ఎ) ఇశ్రాయేలు కాపరులకుండే కొన్ని బాధ్యతలు ఏమిటి? (బి) తల్లిదండ్రులు ఏయే విధాలుగా కాపరులుగా ఉన్నారు?

ప్రాచీన ఇశ్రాయేలులోని గొర్రెల కాపరులు ఎంతో కష్టపడేవాళ్లు. వాళ్లు ఎండ వేడిని, చలిని భరించడంతో పాటు, తమ మందను క్రూరజంతువుల నుండి దొంగలనుండి రక్షించేవాళ్లు. తమ గొర్రెల్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, జబ్బుతో ఉన్నవాటికి లేదా గాయపడిన వాటికి చికిత్స చేసేవాళ్లు. వాళ్లు గొర్రె పిల్లల్ని ప్రత్యేకంగా సంరక్షించేవాళ్లు, ఎందుకంటే అవి బలహీనంగా ఉంటాయి, ఎదిగిన గొర్రెలకున్నంత బలం వాటికి ఉండదు.—ఆది. 33:13.

2 క్రైస్తవ తల్లిదండ్రులు కూడా గొర్రెల కాపరులకు ఉన్నటువంటి లక్షణాలను చూపించాలి. తమ పిల్లల్ని “ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను” పెంచే బాధ్యత వాళ్లకు ఉంది. (ఎఫె. 6:4) అది తేలికైన పనేనా? కాదు! ఎందుకంటే పిల్లలు సాతాను చెప్పే మాయమాటలతో పాటు, తమ అపరిపూర్ణ కోరికలతో కూడా పోరాడుతున్నారు. (2 తిమో. 2:22; 1 యోహా. 2:16) ఈ పరిస్థితుల్లో మీ పిల్లలకు మీరెలా సహాయం చేయవచ్చు? మీ పిల్లల్ని సంరక్షించడానికి మీరు చేయాల్సిన మూడు పనులను ఇప్పుడు పరిశీలిద్దాం. అవి, వాళ్ల గురించి తెలుసుకోవాలి, వాళ్లను పోషించాలి, వాళ్లకు నిర్దేశం ఇవ్వాలి.

మీ పిల్లల గురించి తెలుసుకోండి

3. తల్లిదండ్రులు తమ పిల్లలను ఎలా ‘జాగ్రత్తగా చూసుకోవచ్చు’?

3 మంచి కాపరి తన మందలోని ప్రతీ గొర్రెను జాగ్రత్తగా పరిశీలించి అది ఆరోగ్యంగా ఉందో లేదో చూసుకుంటాడు. ఒకరకంగా మీరు కూడా మీ పిల్లల విషయంలో అదే చేయవచ్చు. బైబిలు ఇలా చెబుతుంది: “నీ గొర్రెల మందలను జాగ్రత్తగా చూచుకొనుము.” (సామె. 27:23, పవిత్ర గ్రంథము, కతోలిక అనువాదము) అలా చేయాలంటే మీ పిల్లల పనులను గమనించడంతోపాటు వాళ్ల ఆలోచనలను, భావాలను కూడా అర్థం చేసుకోవాలి. మీరు ఆ పని ఎలా చేయవచ్చు? అందుకు ఒక చక్కని మార్గం, వాళ్లతో తరచూ మాట్లాడడమే.

4, 5. (ఎ) పిల్లలు తమ మనసులోని విషయాలను చెప్పాలంటే తల్లిదండ్రులు ఏ సలహాలు పాటించాలి? (ప్రారంభ చిత్రం చూడండి.) (బి) మీ పిల్లలు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీతో మాట్లాడడానికి మీరు ఏమి చేశారు?

4 అయితే, పిల్లలు టీనేజీలోకి అడుగుపెట్టినప్పుడు వాళ్లతో మాట్లాడడం చాలా కష్టంగా ఉందని కొంతమంది తల్లిదండ్రులు గమనించారు. ఆ వయసులో పిల్లలు తల్లిదండ్రుల నుండి దూరంగా ఉండడానికి ప్రయత్నించవచ్చు, తమ ఆలోచనలను, భావాలను వాళ్లకు చెప్పడానికి ఇష్టపడకపోవచ్చు. మీ పిల్లలు కూడా అలాగే ఉంటే, మీరేమి చేయవచ్చు? మీ పిల్లలను బలవంతంగా కూర్చోబెట్టి విసుకుకలిగేలా గంటలకొద్దీ మాట్లాడే బదులు, వాళ్లు మాట్లాడడానికి ఇష్టపడే సందర్భాల కోసం చూడండి. (ద్వితీ. 6:6, 7) వాళ్లతో సమయం గడపడానికి మీరు కాస్త కష్టపడాల్సి ఉంటుంది. మీరు కాసేపు అలా సరదాగా మీ పిల్లలతో నడవవచ్చు, ఆటలు ఆడవచ్చు లేదా ఇంట్లోని ఏదైనా పనిని కలిసి చేయవచ్చు. అలాంటి సరదా వాతావరణంలోనైతే, మీ పిల్లలు ఇబ్బందిపడకుండా తమ మనసులోని ఆలోచనలను మీతో చెబుతారు.

5 మీరు అలా చేసినా, మీ పిల్లలు మాట్లాడడానికి ఇష్టపడకపోతుంటే అప్పుడెలా? మీరు బహుశా మరో విధంగా ప్రయత్నించాల్సి ఉంటుంది. ఉదాహరణకు, ‘ఈ రోజు ఏం చేశావు?’ అని మీ అమ్మాయిని అడిగే బదులు మీరు ఆ రోజు ఏమి చేశారో మీ అమ్మాయికి చెప్పవచ్చు. అప్పుడు ఆమె, తాను ఆ రోజు ఏమేమి చేసిందో చెప్పడానికి ఇష్టపడవచ్చు. లేదా ఒకానొక విషయంమీద మీ అమ్మాయి అభిప్రాయం ఏమిటో తెలుసుకోవడానికి ప్రశ్నలు అడగండి, కానీ అది మీ అమ్మాయిని ప్రశ్నిస్తున్నట్లు ఉండకూడదు. ఆ విషయం గురించి తన ఫ్రెండ్స్‌ ఏమనుకుంటారో మీరు అడగవచ్చు. అప్పుడు, ‘నువ్వైతే వాళ్లకు ఏ సలహా ఇస్తావు’ అని మీ అమ్మాయిని అడగవచ్చు.

6. మీరు అందుబాటులో ఉన్నారని, మీతో ఏదైనా చెప్పుకోవచ్చని మీ పిల్లలు అనుకోవాలంటే మీరు ఎలా ఉండాలి?

6 అయితే మీ పిల్లలు మీతో మనసువిప్పి మాట్లాడాలంటే, మీరు అందుబాటులో ఉన్నారని, మీతో ఏదైనా చెప్పుకోవచ్చని వాళ్లు మీ గురించి అనుకోవాలి. మాట్లాడడానికి తీరిక లేనంత బిజీగా తల్లిదండ్రులు ఉంటే, యౌవనులు తమ సమస్యల గురించి వాళ్లతో చెప్పకపోవచ్చు. మీతో ఏదైనా చెప్పుకోవచ్చని మీ పిల్లలు అనుకోవాలంటే మీరేమి చేయాలి? “నీకే సమస్య వచ్చినా, నా దగ్గరికి రా” వంటి మాటలు చెప్పడం కన్నా ఎక్కువే చేయాలి. మీరు వాళ్ల సమస్యలను తేలిగ్గా కొట్టిపారేయరని లేదా అతిగా స్పందించరని మీ పిల్లలకు అర్థమవ్వాలి. ఈ విషయంలో చాలామంది తల్లిదండ్రులు మంచి ఆదర్శాన్ని ఉంచుతున్నారు. 19 ఏళ్ల కేలా ఏమంటుందంటే, “నేను మా డాడీతో ఏ విషయం గురించైనా మాట్లాడగలను. మాట్లాడేటప్పుడు ఆయన మధ్యలో కలుగజేసుకోడు లేదా తప్పుబట్టడు, ఓపిగ్గా వింటాడంతే. అందుకే, ఆయన ఎప్పుడూ చాలామంచి సలహానే ఇస్తాడు.”

7. (ఎ) సున్నితమైన విషయాలు మాట్లాడేటప్పుడు తల్లిదండ్రులు సమతుల్యంగా ఎలా ఉండవచ్చు? (బి) తల్లిదండ్రులు పిల్లలకు ఎలా చిరాకు పుట్టించే అవకాశం ఉంది?

7 కొన్నిసార్లు పిల్లలతో సున్నితమైన విషయాలు కూడా మాట్లాడాల్సి ఉంటుంది. ఉదాహరణకు, మీ అబ్బాయికైతే అమ్మాయిలతో ఎలా ప్రవర్తించాలో మీ అమ్మాయికైతే అబ్బాయిలతో ఎలా ప్రవర్తించాలో చెప్పే సందర్భాల్లో మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. వాటిలోని ప్రమాదాల గురించే ఎక్కువగా చెప్పకుండా, సరైన విధంగా ఎలా ప్రవర్తించాలో చెప్పాలి. ఉదాహరణకు, మీరు ఒక హోటల్‌కు వెళ్లారు. వెయిటర్‌ వచ్చి హాటల్‌లో ఏమేమి ఉన్నాయో చెప్పకుండా, ఆహారం పాడైతే వచ్చే ప్రమాదాల గురించే చెబుతున్నాడనుకోండి. మీరేం చేస్తారు? బహుశా అక్కడి నుండి వేరే హోటల్‌కు వెళ్తారు. అదేవిధంగా సలహా కోసం మీ పిల్లలు మీ దగ్గరికి వచ్చినప్పుడు, మీరు కఠినమైన హెచ్చరికలు మాత్రమే చెబుతుంటే, మీ పిల్లలు కూడా అలాగే స్పందిస్తారు. (కొలొస్సయులు 3:21 చదవండి.) అందుకే, మాట్లాడేటప్పుడు సమతుల్యంగా ఉండండి. ఎమలీ అనే ఓ యౌవన సహోదరి, తన తల్లిదండ్రులు ఏదైనా విషయం గురించి మాట్లాడేటప్పుడు అది తప్పన్నట్లుగా మాట్లాడరని చెబుతుంది. వాళ్లు చాలా సమతుల్యంగా ఉంటారని, అందుకే ఏ విషయాన్నీ వాళ్లకు తెలియకుండా దాచాలనుకోనని ఆమె చెబుతుంది.

8, 9. (ఎ) పిల్లలు మాట్లాడేటప్పుడు మధ్యలో కలుగజేసుకోకుండా వినడంవల్ల ఎలాంటి ప్రయోజనాలు వస్తాయి? (బి) మీ పిల్లలు చెప్పేది వినడంలో మీరు ఎంతవరకు విజయం సాధించారు?

8 కేలా చెప్పినట్లుగా, మీ పిల్లలు మాట్లాడేటప్పుడు ఓపిగ్గా వినడం ద్వారా, మీరు వినడానికి ఇష్టపడుతున్నారని చూపించవచ్చు. (యాకోబు 1:19 చదవండి.) కట్యా అనే ఒంటరి తల్లి ఏమి చెబుతుందో వినండి, “ఇదివరకైతే, నా కూతురు మాట్లాడేటప్పుడు చాలా చిరాకుపడేదాన్ని. తను మాట్లాడే విషయాన్ని పూర్తిగా చెప్పనిచ్చేదాన్నికాదు. కొన్నిసార్లు అలసిపోయి తను చెప్పేది వినేదాన్ని కాదు, లేదా నాకెందుకులే అనుకునేదాన్ని. అయితే ఇప్పుడు నా పద్ధతి మార్చుకున్నాను, దాంతో నా కూతురు కూడా ప్రవర్తనను మార్చుకుంది. తన మనసులోని విషయాల్ని దాచుకోకుండా చెబుతుంది.”

యౌవనురాలైన తమ కూతురు మాట్లాడుతుడగా విటున్న ఒక తడ్రి

వాళ్ల గురించి తెలుసుకోవడానికి వినండి (3-9 పేరాలు చూడండి)

9 రొనాల్డ్‌ అనే తండ్రికి తన టీనేజీ కూతురి విషయంలో కూడా అలాంటి అనుభవమే ఎదురైంది. ఆయన ఏమి చెబుతున్నాడంటే, “తను స్కూల్లో ఓ అబ్బాయిని ప్రేమించిందని చెప్పినప్పుడు ముందు చాలా కోపం వచ్చింది. అయితే యెహోవా తన సేవకులతో ఎలా సహనంగా, సమంజసంగా ఉంటాడో ఆలోచించినప్పుడు, నా కూతుర్ని కూడా సరిదిద్దే ముందు తన మనసులోని భావాలను పూర్తిగా చెప్పనిస్తే మంచిదని అనుకున్నాను. అదే చేశాను! నేను మొదటిసారిగా నా కూతురి మనసును అర్థం చేసుకున్నాను. ఆమెను పూర్తిగా చెప్పనిచ్చాక, ఆమెతో ప్రేమగా మాట్లాడడం నాకు మరింత సులభమైంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆమె నా సలహాను స్వీకరించింది, అంతేకాదు తన ప్రవర్తనను మార్చుకోవాలనే కోరికను కూడా వ్యక్తం చేసింది.” మీ పిల్లలతో తరచూ మాట్లాడడంవల్ల వాళ్లు ఎలా ఆలోచిస్తున్నారో, ఎలా భావిస్తున్నారో మీరు తెలుసుకోగలుగుతారు. అలా తెలుసుకోవడం వల్ల, వాళ్లు తమ జీవితంలో తీసుకోబోయే నిర్ణయాలను మీరు చాలావరకు ప్రభావితం చేయగలుగుతారు.a

మీ పిల్లల్ని పోషించండి

10, 11. మీ పిల్లలు సత్యంలో స్థిరంగా ఉండేలా మీరెలా సహాయం చేయవచ్చు?

10 మందలోని ఏ గొర్రె అయినా తప్పిపోయే అవకాశం ఉందని మంచి కాపరికి తెలుసు. ఒక గొర్రె బహుశా కొంత దూరంలోని పచ్చగడ్డిని చూసి అక్కడికి వెళ్లి, తర్వాత మరికొంత దూరం వెళ్లి, అలా అది మందనుండి దూరమవ్వవచ్చు. అలాగే ఒక అబ్బాయి/అమ్మాయి చెడు సహవాసంవల్ల లేదా దిగజారిపోయిన వినోదంవల్ల శోధనకు గురై మెల్లమెల్లగా తప్పిపోయి, ఆధ్యాత్మికంగా ప్రమాదకరమైన దారిలోకి వెళ్లవచ్చు. (సామె. 13:20) అయితే, అలాంటి పరిస్థితి రాకుండా మీ పిల్లల్ని ఎలా కాపాడవచ్చు?

11 మీ పిల్లలకు బోధించేటప్పుడు, వాళ్లు ఫలానా విషయాల్లో బలహీనంగా ఉన్నారని గుర్తిస్తే వెంటనే సహాయం చేయండి. వాళ్లలోని క్రైస్తవ లక్షణాలను మరింత మెరుగుపర్చుకోవడానికి చేయూతనివ్వండి. (2 పేతు. 1:5-8) అలా చేయడానికి కుటుంబ ఆరాధన చక్కని సమయం. ఈ ఏర్పాటు గురించి 2008, అక్టోబరు మన రాజ్య పరిచర్య ఇలా వివరించింది, “కుటుంబ బైబిలు అధ్యయనాన్ని నిర్వహించాల్సిన బాధ్యతను యెహోవా కుటుంబ శిరస్సులకు ఇచ్చాడు. అది క్రమంగా, ప్రయోజనకరంగా జరిగేలా చూడమని వారిని ప్రోత్సహిస్తున్నాము.” మీ పిల్లలను సంరక్షించడానికి ఈ ప్రేమపూర్వక ఏర్పాటును మీరు పూర్తిగా వినియోగించుకుంటున్నారా? మీ పిల్లల ఆధ్యాత్మిక అవసరాలు తీర్చడానికి మీరు పడుతున్న కష్టాన్ని మీ పిల్లలు ఎంతో విలువైనదిగా ఎంచుతారనే నమ్మకంతో ఉండండి.—మత్త. 5:3; ఫిలి. 1:9-11.

సతోషగా కుటుబ ఆరాధన చేసుకుటున్న తల్లిదడ్రులు, వాళ్ల కూతురు

వాళ్లను చక్కగా పోషించండి (10-12 పేరాలు చూడండి)

12. (ఎ) క్రమమైన కుటుంబ ఆరాధన ద్వారా యౌవనులు ఎలా ప్రయోజనం పొందారు? (“వాళ్లకు బాగా నచ్చింది” బాక్సుపై కూడా వ్యాఖ్యానించండి.) (బి) కుటుంబ ఆరాధన నుండి మీరు ఎలా ప్రయోజనం పొందారు?

12 కుటుంబ ఆరాధన వల్ల తమ కుటుంబం ఎలా ప్రయోజనం పొందిందో చెబుతూ కారీసా అనే యువతి ఇలా అంటోంది, “మేమందరం కలిసి కూర్చొని, మాట్లాడుకోవడం నాకు నచ్చింది. మేమలా చేస్తుండగా ఒకరికొకరం దగ్గరౌతున్నాం, తీపి జ్ఞాపకాలను సొంతం చేసుకుంటున్నాం. మా డాడీ కుటుంబ ఆరాధనను క్రమం తప్పకుండా నిర్వహిస్తాడు. ఆయన దాన్ని ప్రాముఖ్యంగా ఎంచడం చూస్తుంటే ప్రోత్సాహంగా అనిపిస్తుంది, నేనూ దాన్ని ప్రాముఖ్యంగానే చూడాలనే కోరికను అది నాలో పెంచింది. కుటుంబ ఆరాధన వల్ల నేను ఆయన్ను ఒక తండ్రిగా, ఆధ్యాత్మిక శిరస్సుగా గౌరవించగలుగుతున్నాను.” బ్రిటనీ అనే యువ సహోదరి ఇలా చెబుతోంది, “కుటుంబ ఆరాధనవల్ల నేను మా అమ్మానాన్నలకు మరింత దగ్గరయ్యాను. వాళ్లు నా సమస్యల్ని నిజంగా వినాలనుకుంటున్నారని, నా మీద నిజంగా శ్రద్ధ తీసుకుంటున్నారని నాకు అర్థమైంది. కుటుంబ ఆరాధనవల్ల మేము బలమైన ఐక్య కుటుంబంగా తయారయ్యాము.” అవును, మీరు ఒక మంచి కాపరిగా ఉండాలంటే చేయాల్సిన ముఖ్యమైన పని, కుటుంబ ఆరాధన ద్వారా మీ పిల్లల్ని ఆధ్యాత్మికంగా పోషించడమే.b

మీ పిల్లలకు నిర్దేశం ఇవ్వండి

13. యెహోవాను సేవించేలా పిల్లల్ని పురికొల్పాలంటే తల్లిదండ్రులు ఏమి చేయవచ్చు?

13 ఓ మంచి కాపరి తన మందను నడిపించడానికి, కాపాడడానికి దుడ్డుకర్రను ఉపయోగిస్తాడు. ‘మంచి మేతగల చోటుకు’ తన మందను నడిపించాలన్నదే ఆయన ముఖ్య ఉద్దేశం. (యెహె. 34:13, 14) తల్లిదండ్రులుగా మీకూ అలాంటి లక్ష్యమే ఉంది. మీ పిల్లలు యెహోవా సేవ చేసేలా వాళ్లకు నిర్దేశం ఇవ్వాలని మీరు కోరుకుంటారు. “నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది” అని రాసిన కీర్తనకర్తలాగే మీ పిల్లలు భావించాలని మీరు కోరుకుంటారు. (కీర్త. 40:8) అలాంటి కృతజ్ఞతను పెంచుకునే యౌవనులు తమ జీవితాన్ని యెహోవాకు సమర్పించుకుని బాప్తిస్మం పొందుతారు. అయితే వాళ్లు తగినంత పరిణతి సాధించి, యెహోవాను సేవించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నప్పుడే అలాంటి నిర్ణయం తీసుకోవాలి.

14, 15. (ఎ) క్రైస్తవ తల్లిదండ్రులకు ఏ లక్ష్యం ఉండాలి? (బి) సత్యం విషయంలో ఓ యౌవనునికి ఎందుకు సందేహాలు ఉండే అవకాశం ఉంది?

14 అయితే మీ పిల్లలు, ఆధ్యాత్మిక ప్రగతి సాధించకపోతుంటే, తమ నమ్మకాల గురించి సందేహాలు వ్యక్తం చేస్తుంటే అప్పుడెలా? వాళ్ల మనసులో యెహోవా మీద ప్రేమను, ఆయన మనకోసం చేసిన వాటన్నిటి విషయంలో కృతజ్ఞతను నాటడానికి కృషి చేయండి. (ప్రక. 4:10, 11) అలా చేస్తే, యెహోవాను ఆరాధించాలనే వ్యక్తిగత నిర్ణయం తీసుకునే స్థాయికి వాళ్లు చేరుకున్నప్పుడు, ఆ నిర్ణయం తీసుకోగలుగుతారు.

15 మీ పిల్లలకు సత్యం విషయంలో సందేహాలు ఉంటే, సహనంగా వాళ్లకు మార్గనిర్దేశం ఇవ్వడానికి ప్రయత్నించండి. యెహోవాను సేవించడం ఒక్కటే అత్యుత్తమ జీవన విధానమని, దానివల్లే శాశ్వత ప్రయోజనాలు వస్తాయని వాళ్లకు అర్థమయ్యేలా చెప్పండి. దానితోపాటు, వాళ్ల సందేహాల వెనకున్న అసలు కారణాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఉదాహరణకు, మీ అబ్బాయి బైబిలు చెప్పేదాన్ని నిజంగానే ఒప్పుకోవడం లేదా, లేక కేవలం తోటి పిల్లలకు ప్రకటించాలంటే భయపడుతున్నాడా? మీ అమ్మాయి, దేవుని ప్రమాణాలను నిజంగానే సందేహిస్తుందా లేక కేవలం ఒంటరి అయిపోయినట్లు, ఇతరులు దూరంగా ఉంచుతున్నట్లు భావిస్తుందా?

క్షేత్రసేవలో ఒక కుటుబ

వాళ్లకు నిర్దేశం ఇవ్వండి (13-18 పేరాలు చూడండి)

16, 17. పిల్లలు సత్యాన్ని తమ సొంతం చేసుకునేలా తల్లిదండ్రులు ఏయే విధాలుగా సహాయం చేయవచ్చు?

16 కారణం ఏదైనా, సత్యం విషయంలో ఉన్న సందేహాల నుండి మీ పిల్లలు బయటపడేందుకు మీరు సహాయం చేయవచ్చు. ఎలా? చాలామంది తల్లిదండ్రులు ఈ ప్రశ్నలు అడగడం ద్వారా తమ పిల్లలకు సహాయం చేశారు, “క్రైస్తవునిగా ఉండడం నీకు సులభంగా ఉందా లేక కష్టంగా ఉందా? క్రైస్తవునిగా ఉండడంవల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయని నీకనిపిస్తుంది? యెహోవా సేవ కోసం ఎలాంటి త్యాగాలు చేయాల్సివుంటుంది? మనం ఇప్పుడూ భవిష్యత్తులోనూ పొందే ప్రయోజనాల గురించి నీకేమనిపిస్తుంది? అవి మనం చేసే త్యాగాలకంటే విలువైనవేనా?” అయితే ఈ ప్రశ్నలను మీరు మీ సొంతమాటల్లో ప్రేమగా, పిల్లలకు నచ్చేలా అడగాలి. అంతేగానీ వాళ్లనేదో ప్రశ్నిస్తున్నట్లు అడగకూడదు. అలాంటి సందర్భాల్లో, మార్కు 10:29, 30 వచనాలను కూడా చర్చించవచ్చు. కొంతమంది యౌవనులు తమ ఆలోచనలను ఓ పేపరు మీద రాయాలనుకోవచ్చు, ఒకపక్క వాళ్లు చేస్తున్న త్యాగాలు, మరోపక్క పొందుతున్న ప్రయోజనాలు రాయవచ్చు. వాటిని అలా రాసుకోవడం వల్ల, వాళ్లు తమ సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించుకోగలుగుతారు. మనం ఆసక్తిగలవాళ్లతో బైబిలు బోధిస్తోంది, “దేవుని ప్రేమ” పుస్తకాలతో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందంటే, మరి మన పిల్లలతో వాటిని అధ్యయనం చేయాల్సిన అవసరం ఇంకెంత ఉందో ఆలోచించండి! మీరలా చేస్తున్నారా?

17 కాలం గడుస్తుండగా, తాము ఎవర్ని సేవించాలో మీ పిల్లలే స్వయంగా నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. మీకున్న విశ్వాసం మీ పిల్లలకు కూడా ఏదో విధంగా సంక్రమిస్తుందని అనుకోకండి. వాళ్లు సత్యాన్ని సొంతం చేసుకోవాలి. (సామె. 3:1, 2) మీ అబ్బాయి/అమ్మాయి దేవునికి దగ్గరవ్వలేకపోతుంటే అప్పుడెలా? ఇక్కడున్న ప్రశ్నల గురించి ఆలోచించి, తన నమ్మకాల్ని పరిశీలించుకోమని ప్రోత్సహించండి, ‘దేవుడు ఉన్నాడని నాకు ఎలా తెలుసు? యెహోవాకు నిజంగా నా మీద శ్రద్ధ ఉందని నాకెలా తెలుసు? దేవుని ఆజ్ఞలను పాటిస్తే నేను ప్రయోజనం పొందుతానని నిజంగా నమ్ముతున్నానా?’ తల్లిదండ్రులారా, మంచి కాపరులుగా ఉంటూ సహనంతో మీ పిల్లల్ని నడిపించండి. యెహోవాను సేవించడమే అత్యుత్తమ జీవన విధానమని వాళ్లంతటవాళ్లే అర్థం చేసుకునేలా సహాయం చేయండి.c—రోమా. 12:2.

18. సర్వోన్నత కాపరియైన యెహోవాను తల్లిదండ్రులు ఎలా అనుకరించవచ్చు?

18 నిజ క్రైస్తవులందరూ సర్వోన్నత కాపరిని అనుకరించాలి. (ఎఫె. 5:1; 1 పేతు. 2:25) ముఖ్యంగా తల్లిదండ్రులు తమ గొర్రెల స్థితిని అంటే అమూల్యమైన తమ పిల్లల స్థితిని జాగ్రత్తగా తెలుసుకోవాలి. యెహోవా వాగ్దానం చేసిన శాశ్వత ప్రయోజనాలు పొందేలా పిల్లలకు వాళ్లు నిర్దేశం ఇవ్వాలి. కాబట్టి మీ పిల్లల్ని సంరక్షిస్తూ, యెహోవాను ప్రేమించేలా వాళ్లను పెంచడానికి చేయగలిగినదంతా చేయండి!

a మరిన్ని సలహాల కోసం, కావలికోట అక్టోబరు 1, 2008 సంచికలోని 18-20 పేజీలు చూడండి.

b మరింత సమాచారం కోసం కావలికోట అక్టోబరు 15, 2009 సంచికలోని “కుటుంబ ఆరాధన రక్షణకు చాలా ప్రాముఖ్యం!” ఆర్టికల్‌లోని 29-31 పేజీలు చూడండి.

c కావలికోట జూలై 1, 2012 సంచికలోని 22-25 పేజీల్లో ఈ విషయం గురించి మరింత సమాచారం ఉంది.

వాళ్లకు బాగా నచ్చింది

కుటుంబ ఆరాధననుండి ప్రయోజనం పొందిన ఇద్దరు యౌవనులు ఏమంటున్నారో చూడండి.

“కుటుంబ ఆరాధనవల్ల మీరు యెహోవాకు దగ్గరౌతూనే, కుటుంబంలోని వాళ్లకు కూడా దగ్గరవ్వగలుగుతారు. మీరు ఎలాంటి వాళ్లో, దేవునితో మీ సంబంధం ఎలా ఉందో నేర్చుకుంటారు. ఏయే విషయాల్లో మెరుగవ్వాలో కూడా అర్థం చేసుకుంటారు.”

“ప్రశాంతమైన వాతావరణంలో మన మనసులోని విషయాలను చెప్పుకునే అవకాశం కుటుంబ ఆరాధనలో ఉంటుంది. రోజూ ఉండే ఒత్తిళ్లను కాసేపు పక్కనపెట్టి, దేవునితో ఉన్న సంబంధంపై మనసుపెట్టడానికి అది సమయం. ఒకప్పుడు మేమలా చేసేవాళ్లం కాదు, కానీ ఇప్పుడు చేస్తున్నాం. కుటుంబ ఆరాధన నిజంగా ఒక ఆశీర్వాదం.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి