కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w14 7/15 పేజీలు 12-16
  • యెహోవా ప్రజలు, ‘దుర్నీతినుండి తొలగిపోతారు’

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా ప్రజలు, ‘దుర్నీతినుండి తొలగిపోతారు’
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • చెడునుండి “తొలగిపోవుడి”
  • ‘మూఢుల వితర్కములను విసర్జించండి’
  • చెడు సాంగత్యానికి దూరంగా ఉండండి!
  • నమ్మకంగా ఉంటే యెహోవా దీవిస్తాడు
  • యెహోవా “తనవారిని ఎరుగును”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
  • ప్రేమను బట్టి నిజ క్రైస్తవులు గుర్తించబడతారు​—⁠సత్యమందు సంతోషించండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • వాళ్లు యెహోవాకు ఎదురు తిరిగారు
    నా బైబిలు పుస్తకం
  • “ప్రేమ . . . అవినీతి విషయంలో సంతోషించదు”
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
w14 7/15 పేజీలు 12-16
భూమి తెరుచుకుని దాతాను, అబీరాములను వాళ్ల కుటుబాలను మిగివేస్తోది

యెహోవా ప్రజలు ‘దుర్నీతినుండి తొలగిపోతారు’

“ప్రభువు [“యెహోవా,” NW] నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతినుండి తొలగిపోవలెను.”—2 తిమో. 2:19.

మీరెలా జవాబిస్తారు?

  • దేనివల్ల “మూఢుల వితర్కములు” కలుగవచ్చు? మనం వాటికి ఎలా దూరంగా ఉండవచ్చు?

  • చెడు సహవాసం విషయంలో మనమెలా ‘దుర్నీతి నుండి తొలగిపోవాలి?’

  • ‘దుర్నీతి నుండి తొలగిపోయే’ విషయంలో మనమెలా ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి?

1. మన ఆరాధనలో దేనికి ప్రత్యేక స్థానం ఉంది?

యెహోవా పేరు ఓ కట్టడం మీదో, మ్యూజియంలోని ఓ రాయి మీదో చెక్కి ఉండడం మీరెప్పుడైనా చూశారా? అలా చూసి ఉంటే ఖచ్చితంగా దాన్ని మీరు ఎంతో ఆసక్తితో, ఉత్సాహంతో గమనించివుంటారు. ఎంతైనా, దేవుని వ్యక్తిగత నామానికి మన ఆరాధనలో ఓ ప్రత్యేక స్థానం ఉంది, మనం యెహోవాసాక్షులం! ఈ భూమ్మీద, దేవుని నామాన్ని మనం ఉపయోగిస్తున్నంత ఎక్కువగా మరే గుంపు ఉపయోగించడం లేదు. అయితే, దేవుని నామాన్ని ధరించే గొప్ప అవకాశంతో పాటు మనకు ఓ బాధ్యత కూడా ఉంది.

2. దేవుని నామాన్ని ధరించే గొప్ప అవకాశంతో పాటు మనకు ఏ బాధ్యత కూడా ఉంది?

2 దేవుని నామాన్ని ఉపయోగించినంత మాత్రాన యెహోవా అనుగ్రహం దొరుకుతుందని అనుకోకూడదు. మనం ఆయన నైతిక ప్రమాణాలకు కట్టుబడి జీవించాలి. అందుకే, యెహోవా ప్రజలు ‘చెడు నుండి వైదొలగాలి’ అని బైబిలు మనకు గుర్తుచేస్తుంది. (కీర్త. 34:14, పవిత్ర గ్రంథము, కతోలిక అనువాదము) ఆ సూత్రాన్నే అపొస్తలుడైన పౌలు ఈ మాటలతో స్పష్టంగా చెప్పాడు, “ప్రభువు [“యెహోవా,” NW] నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతినుండి తొలగిపోవలెను.” (2 తిమోతి 2:19 చదవండి.) ఆయన సాక్షులముగా మనకు, యెహోవా నామాన్ని ఒప్పుకుంటామనే గుర్తింపు ఉంది. అయితే, మనం దుర్నీతి నుండి ఎలా తొలగిపోవాలి?

చెడునుండి “తొలగిపోవుడి”

3, 4. ఏ లేఖనం చాలాకాలంగా బైబిలు విద్వాంసులకు అంతుచిక్కడం లేదు? ఎందుకు?

3 పౌలు 2 తిమోతి 2:19⁠లో చెప్పిన మాటల నేపథ్యాన్ని పరిశీలించండి. ఆ లేఖనం “దేవుని యొక్క స్థిరమైన పునాది” గురించి, దానిమీద ఉన్న రెండు సందేశాల గురించి చెబుతుంది. ‘తనవాడు ఎవడో యెహోవాకు తెలుసు’ అనే మొదటి సందేశం, సంఖ్యాకాండము 16:5⁠లో ఉన్న మాటలని స్పష్టంగా తెలుస్తుంది. (ముందటి ఆర్టికల్‌ చూడండి.) అయితే, “ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతినుండి తొలగిపోవలెను” అనే రెండవ సందేశం ఎప్పటినుండో బైబిలు విద్వాంసులకు అంతుచిక్కడం లేదు. ఎందుకు?

4 పౌలు ఉపయోగించిన ఆ పదాలను చూస్తే ఆయన హీబ్రూ లేఖనాల నుండి ఎత్తి చెబుతున్నాడని తెలుస్తుంది. కానీ, పౌలు చెప్పిన వాక్యం హీబ్రూ లేఖనాల్లో ఎక్కడా కనిపించదు. మరి, “ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతినుండి తొలగిపోవలెను” అని చెప్పినప్పుడు పౌలు దేని గురించి మాట్లాడుతున్నాడు? పౌలు ఈ మాటలు చెప్పడానికి ముందే, కోరహు తిరుగుబాటు గురించి ఉన్న సంఖ్యాకాండము 16వ అధ్యాయంలోని మాటల్ని ఎత్తి చెప్పాడు. కాబట్టి, ఈ రెండవ సందేశం కూడా కోరహు తిరుగుబాటు సమయంలో జరిగిన సంఘటనలకు సంబంధించినదే అయ్యుంటుందా?

5-7. మోషే కాలంలో జరిగిన ఏ సంఘటనలను ఉద్దేశించి 2 తిమోతి 2:19⁠లోని మాటల్ని పౌలు రాశాడు? (ప్రారంభ చిత్రం చూడండి.)

5 ఏలీయాబు కుమారులైన దాతాను, అబీరాములు కోరహుతో చేతులు కలిపి మోషే, అహరోనులపై తిరుగుబాటుకు నాయకత్వం వహించారని బైబిలు చెబుతుంది. (సంఖ్యా. 16:1-5) వాళ్లు మోషేను అందరిముందు దూషించి, దేవుడు ఆయనకిచ్చిన అధికారాన్ని ధిక్కరించారు. ఆ తిరుగుబాటుదారులు యెహోవా ప్రజల మధ్యే ఉంటూ నమ్మకస్థులైన ఇతరుల ఆధ్యాత్మికతకు ముప్పుగా తయారయ్యారు. తన నమ్మకమైన సేవకులను, తిరుగుబాటుదారులను వేరు చేయాల్సిన రోజు వచ్చినప్పుడు యెహోవా ఓ స్పష్టమైన ఆజ్ఞను ఇచ్చాడు.

6 “అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను—కోరహు దాతాను అబీరాములయొక్క నివాసముల చుట్టుపట్లనుండి తొలగిపోవుడని జనసమాజముతో చెప్పుము. అప్పుడు మోషే లేచి దాతాను అబీరాముల యొద్దకు వెళ్లగా ఇశ్రాయేలీయుల పెద్దలు అతని వెంట వెళ్లిరి. అతడు—ఈ దుష్టుల గుడారముల యొద్దనుండి తొలగిపోవుడి; మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపక యుండునట్లు వారికి కలిగినదేదియు ముట్టకుడి అని ఆ సమాజముతో అనెను. కాబట్టి వారు కోరహు దాతాను అబీరాముల నివాసముల యొద్దనుండి ఇటు అటు లేచి” వెళ్లిపోయారని ఆ వృత్తాంతం చెబుతుంది. (సంఖ్యా. 16:23-27) ఆ తర్వాత, తిరుగుబాటు చేసిన వాళ్లందరినీ యెహోవా నాశనం చేశాడు. దుర్నీతి నుండి తొలగిపోయి పక్కకు వెళ్లిన నమ్మకమైన ఆరాధకులు మాత్రం ప్రాణాలు దక్కించుకున్నారు.

7 యెహోవా హృదయాల్ని చదువుతాడు! తనవాళ్ల యథార్థతను ఆయన గమనిస్తాడు. అయితే, ఆయనకు నమ్మకంగా ఉన్నవాళ్లు దుర్నీతిపరులకు దూరంగా ఉండడానికి వెంటనే చర్యలు తీసుకోవాలి. “ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతినుండి తొలగిపోవలెను” అని రాసినప్పుడు, పౌలు బహుశా సంఖ్యాకాండము 16:5, 23-27 వచనాల్లోని వృత్తాంతం గురించే చెబుతుండవచ్చు. అందుకే పాలు ఆ తర్వాత “ప్రభువు తనవారిని ఎరుగును” అని రాశాడు.—2 తిమో. 2:19.

‘మూఢుల వితర్కములను విసర్జించండి’

8. యెహోవా నామం ఉపయోగించడం లేదా సంఘంలో కేవలం సభ్యులుగా ఉండడం మాత్రమే ఎందుకు సరిపోదు?

8 మోషే కాలంలో జరిగిన సంఘటనలను ఉద్దేశించి పౌలు చెబుతూ, యెహోవాతో ఉన్న అమూల్యమైన సంబంధాన్ని కాపాడుకోవడానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని తిమోతికి గుర్తుచేశాడు. మోషే కాలంలో యెహోవా నామం ఉచ్చరించడం కన్నా ఎక్కువే చేయాల్సి వచ్చింది, అలాగే నేడు కూడా క్రైస్తవ సంఘంలో కేవలం సభ్యులుగా ఉండడం మాత్రమే సరిపోదు. నమ్మకమైన ఆరాధకులు వెంటనే ‘దుర్నీతి నుండి తొలగిపోవాలి.’ ఇంతకీ, తిమోతి ఏమి చేయాలని పౌలు కోరుకున్నాడు? పౌలు ఇచ్చిన ఆ సలహా నుండి యెహోవా ప్రజలు నేడు ఏ పాఠాలు నేర్చుకోవచ్చు?

9. తొలి క్రైస్తవ సంఘంలో ‘మూఢుల వితర్కములు’ ఎలాంటి ప్రభావం చూపించాయి?

9 క్రైస్తవులు ఎలాంటి రకాల దుర్నీతి నుండి తొలగిపోవాలో లేదా దూరంగా ఉండాలో బైబిలు నిర్దిష్ట సలహా ఇస్తుంది. ఉదాహరణకు, పౌలు 2 తిమోతి 2:19⁠లోని మాటలు చెప్పిన సందర్భంలోనే, “మాటలనుగూర్చి వాదము పెట్టుకొనవద్దు,” “వట్టి మాటలకు విముఖుడవై యుండుము” అని తిమోతికి చెప్పాడు. (2 తిమోతి 2:14, 16, 23 చదవండి.) అప్పట్లో, సంఘంలోని కొంతమంది మతభ్రష్ట బోధలను వ్యాప్తి చేస్తున్నారు. ఇంకొంతమంది, వివాదాస్పద ఆలోచనలను సంఘంలోకి తీసుకొస్తూ వాదించుకుంటున్నారు. అవి నేరుగా బైబిలు ఖండించేవి కాకపోయినా అలాంటి ఆలోచనలు సంఘ ఐక్యతకు ముప్పుగా పరిణమించాయి. అందుకే, ‘మూఢుల వితర్కములను విసర్జించండి’ అని పౌలు గట్టిగా చెప్పాడు.

10. మతభ్రష్ట బోధలకు మనమెలా స్పందించాలి?

10 నేడు, యెహోవా ప్రజల సంఘంలో మతభ్రష్టులు సాధారణంగా కనిపించకపోవచ్చు. కానీ, మనం లేఖన విరుద్ధ బోధలను విన్నప్పుడు అవి ఎవరినుండి వచ్చినా సరే వాటిని వెంటనే తిరస్కరించాలి. మతభ్రష్టులతో వ్యక్తిగతంగా కానీ, ఇంటర్నెట్‌ లేదా మరే మాధ్యమం ద్వారా కానీ వాదించడం తెలివి తక్కువ పని. ఒకవేళ ఆ వ్యక్తికి సహాయం చేయాలనే ఉద్దేశం మనకున్నా, అలా మాట్లాడడం ఇప్పటివరకు పరిశీలించిన లేఖన నిర్దేశానికి వ్యతిరేకం. దానికి భిన్నంగా యెహోవా ప్రజలముగా మనం మతభ్రష్టత్వానికి దూరంగా ఉండాలి, దాన్ని పూర్తిగా తిరస్కరించాలి.

యెహోవాసాక్షులు వాదానికి దిగేలా రెచ్చగొడుతున్న మతభ్రష్టులు

మతభ్రష్టులతో వాదించకండి (10వ పేరా చూడండి)

11. దేనివల్ల “మూఢుల వితర్కములు” కలుగవచ్చు? క్రైస్తవ పెద్దలు ఎలా మంచి ఆదర్శాన్ని ఉంచవచ్చు?

11 మతభ్రష్టత్వంతో పాటు మరితర విషయాలు కూడా సంఘ శాంతికి భంగం కలిగిస్తాయి. ఉదాహరణకు, వినోదం విషయంలో భిన్న అభిప్రాయాలు ఉండడం వల్ల, “మూఢుల వితర్కములు” కలుగవచ్చు. అయితే, యెహోవా నైతిక ప్రమాణాలను ఉల్లంఘించే వినోదాన్ని సంఘంలో ఎవరైనా ప్రోత్సహిస్తుంటే, క్రైస్తవ పెద్దలు వాళ్లతో వాదించడం ఎందుకనే ఉద్దేశంతో చూసీచూడనట్లు వదిలేయకూడదు. (కీర్త. 11:5; ఎఫె. 5:3-5) అయినప్పటికీ, పెద్దలు తమ వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పకుండా జాగ్రత్తపడతారు. “మీ మధ్యనున్న దేవుని మందను పైవిచారణచేయుచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి” అని క్రైస్తవ పెద్దలకు బైబిలు ఇస్తున్న సలహాకు నమ్మకంగా కట్టుబడివుంటారు.—1 పేతు. 5:2, 3; 2 కొరింథీయులు 1:24 చదవండి.

12, 13. (ఎ) ఎలాంటి వినోదం ఎంచుకోవాలో యెహోవాసాక్షులు ఎలా నిర్ధారించుకుంటారు? ఈ విషయంలో ఏ బైబిలు సూత్రాలు సహాయం చేస్తాయి? (బి) 12వ పేరాలో చర్చించుకున్న సూత్రాలు ఇతర వ్యక్తిగత విషయాల్లో ఎలా అన్వయించుకోవచ్చు?

12 మన సంస్థ ఫలానా సినిమాలు, వీడియో గేములు, పుస్తకాలు లేదా పాటలు చెడ్డవని చెబుతూ వాటికి దూరంగా ఉండమని నియమాలు పెట్టదు. ఎందుకు? ప్రతీ వ్యక్తి “మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు” కలిగివుండాలని బైబిలు ప్రోత్సహిస్తుంది. (హెబ్రీ. 5:14) వినోదాన్ని ఎంచుకునే విషయంలో పరిశీలించాల్సిన కొన్ని ప్రాథమిక సూత్రాల్ని మాత్రం బైబిలు ఇస్తుంది. జీవితంలోని అన్ని రంగాల్లో “ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించి” చూసుకోవాలనేదే మన లక్ష్యం. (ఎఫె. 5:10) తమ కుటుంబంలో ఎలాంటి వినోదం చూడకూడదో నిర్ణయించే అధికారం కుటుంబ పెద్దలకు ఉందని బైబిలు చెబుతుంది.a—1 కొరిం. 11:3; ఎఫె. 6:1-4.

13 పైన చర్చించుకున్న బైబిలు సూత్రాలు వినోదాన్ని ఎంచుకునే విషయంలో మాత్రమే సహాయం చేయవు. కొన్నిసార్లు దుస్తులు, కనబడేతీరు, ఆరోగ్యం, పోషకాహారం, ఇతర వ్యక్తిగత విషయాల్లో ఉండే వివిధ అభిప్రాయాలు కూడా వివాదాలకు దారితీయవచ్చు. అయితే, లేఖన సూత్రాలకు విరుద్ధం కానంత వరకు యెహోవా ప్రజలు ఆ విషయాల గురించి వాదించరు, ఎందుకంటే “ప్రభువుయొక్క దాసుడు . . . జగడమాడక అందరి యెడల సాధువుగా” లేదా యుక్తిగా ప్రవర్తిస్తాడు.—2 తిమో. 2:24-26.

చెడు సాంగత్యానికి దూరంగా ఉండండి!

14. చెడు సహవాసానికి దూరంగా ఉండాలని నొక్కిచెప్పడానికి పౌలు ఏ ఉపమానాన్ని ఉపయోగించాడు?

14 దేవుని సేవకులముగా మనం, “దుర్నీతినుండి తొలగి” పోవాల్సిన మరో విధానం ఏమిటి? చెడు పనులు చేసే ప్రజలతో సన్నిహిత సహవాసాన్ని మానేయడం. “దేవునియొక్క స్థిరమైన పునాది” గురించి చెప్పిన తర్వాత పౌలు మరో ఉపమానం కూడా చెప్పాడు. “గొప్పయింటిలో వెండి పాత్రలును బంగారు పాత్రలును మాత్రమే గాక కఱ్ఱవియు మంటివియు కూడ ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును” అని ఆయన రాశాడు. (2 తిమో. 2:20, 21) ఆయన ఆ తర్వాత, “ఘనహీన” పనులకు వాడే పాత్రలలో ‘చేరకుండా’ దూరంగా ఉండాలని క్రైస్తవులకు ఉపదేశించాడు.

15, 16. ‘గొప్ప ఇంటి’ గురించిన ఉపమానం నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

15 ఈ ఉపమాన భావం ఏమిటి? పౌలు క్రైస్తవ సంఘాన్ని ‘గొప్ప ఇంటితో’ పోలుస్తూ, సంఘంలోని సభ్యులను ‘పాత్రలతో’ లేదా ఇంట్లో ఉండే వస్తువులతో పోల్చాడు. ఇంట్లోని కొన్ని వస్తువులు హానికరమైన పదార్థాల వల్ల లేదా అపరిశుభ్రత వల్ల కలుషితమైపోతాయి. ఇంటివాళ్లు అలాంటి వస్తువులను, శుభ్రమైన పాత్రలకు అంటే వంటకు ఉపయోగించే పాత్రలకు దూరంగా పెడతారు.

16 అదేవిధంగా, శుభ్రమైన జీవితం గడపడానికి కృషిచేస్తున్న యెహోవా ప్రజలు, సంఘంలో యెహోవా సూత్రాలను అదేపనిగా ఉల్లంఘించే వాళ్లతో సహవసించకుండా దూరంగా ఉండాలి. (1 కొరింథీయులు 15:33 చదవండి.) సంఘం లోపలి వాళ్లనుండే అలా ‘తొలగిపోవాలంటే,’ సంఘం బయట ఉండే ‘ధనాపేక్షులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివాళ్లు, దూషకులు, అనురాగరహితులు, ద్రోహులు, దేవునికంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించే వాళ్లందరికి’ ఇంకెంత దూరంగా ఉండాలో ఆలోచించండి!—2 తిమో. 3:1-5.

నమ్మకంగా ఉంటే యెహోవా దీవిస్తాడు

17. నమ్మకస్థులైన ఇశ్రాయేలీయులు ‘దుర్నీతి నుండి తొలగిపోయే’ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నారు?

17 “కోరహు, దాతాను, అబీరాములయొక్క నివాసముల చుట్టుపట్లనుండి తొలగిపోవుడి” అని చెప్పినప్పుడు ఇశ్రాయేలీయులు ఎంత త్వరగా చర్య తీసుకున్నారో బైబిలు నొక్కి చెబుతుంది. వాళ్లు వెంటనే అక్కడి నుండి ‘వెళ్లిపోయారని’ ఆ వృత్తాంతం చెబుతుంది. (సంఖ్యా. 16:23, 24, 27) వాళ్లు ఏమాత్రం సంకోచించలేదు, ఆలస్యం చేయలేదు. వాళ్లు ఎంతగా విధేయత చూపించారో కూడా లేఖనాలు సూచిస్తున్నాయి. వాళ్లు, ‘ఇటు అటు [‘అన్నివైపుల నుండి,’ NW] లేచిపోయారు.’ నమ్మకంగా ఉన్నవాళ్లు పూర్ణహృదయంతో వెంటనే విధేయత చూపించారు. తాము యెహోవాకు మద్దతిస్తున్నామని, దుర్నీతిని తిరస్కరిస్తున్నామని స్పష్టంగా చూపించారు. ఈ ఉదాహరణ నుండి మనం ఎలాంటి పాఠాలు నేర్చుకోవచ్చు?

18. “యౌవనేచ్ఛలనుండి పారిపొమ్ము” అని పౌలు తిమోతికి చెప్పినప్పుడు ఆయన ఉద్దేశం ఏమిటి?

18 యెహోవాతో మనకున్న స్నేహాన్ని కాపాడుకోవడానికి మనం వేగంగా, త్వరగా చర్య తీసుకోవాలి. “యౌవనేచ్ఛలనుండి పారిపొమ్ము” అని పౌలు తిమోతికి చెప్పినప్పుడు ఆయన ఉద్దేశం అదే. (2 తిమో. 2:22) పౌలు తిమోతికి ఆ సలహా ఇచ్చిన సమయానికి తిమోతి పెద్దవాడే. అప్పటికి ఆయన వయసు 30 ఏళ్ల పైనే. అయినా, ఏ వయసు వాళ్లకైనా మూర్ఖపు “యౌవనేచ్ఛలు” కలుగవచ్చు. అలాంటి కోరికలు వచ్చినప్పుడు, తిమోతి వాటినుండి ‘పారిపోవాలి.’ మరో మాటలో చెప్పాలంటే తిమోతి, ‘దుర్నీతి నుండి తొలగిపోవాలి.’ “నీ కన్ను నిన్ను అభ్యంతర పరచిన యెడల దాని పెరికి నీయొద్దనుండి పారవేయుము” అని యేసు చెప్పినప్పుడు ఆయన కూడా అలాంటి సందేశమే ఇచ్చాడు. (మత్త. 18:9) నేడు, ఈ సలహాను లక్ష్యపెట్టే క్రైస్తవులు ఆధ్యాత్మిక ప్రమాదాలను తప్పించుకోవడానికి ఏమాత్రం సంకోచించకుండా, ఆలస్యం చేయకుండా వెంటనే చర్య తీసుకుంటారు.

19. యెహోవాతో తమకున్న స్నేహాన్ని కాపాడుకోవడానికి కొంతమంది ఎలాంటి ఖచ్చితమైన చర్యలు తీసుకున్నారు?

19 యెహోవాసాక్షులు కాకముందు మద్యానికి బానిసలుగా ఉన్నవాళ్లు, ఇప్పుడు అసలు మద్యమే ముట్టకూడదని నిర్ణయించుకున్నారు. మరికొంతమంది, తప్పుడు కోరికలు కలిగించే ఎలాంటి వినోదానికైనా దూరంగా ఉండాలని తీర్మానించుకున్నారు. (కీర్త. 101:3) ఉదాహరణకు యెహోవాసాక్షి కాకముందు, ఓ సహోదరుడు అనైతిక వాతావరణంలో జరిగే డాన్స్‌ పార్టీలకు తరచూ వెళ్లేవాడు. కానీ సత్యం తెలుసుకున్నాక, గతంలోలాగే అనుచితమైన ఆలోచనలు వస్తాయనే భయంతో ఆయన యెహోవాసాక్షుల పార్టీల్లో కూడా అస్సలు డాన్స్‌ చేయడం లేదు. అయితే, క్రైస్తవులు మద్యం, డాన్స్‌ వంటివాటికి పూర్తిగా దూరంగా ఉండాలని కాదు. కానీ, మనమందరం జాగ్రత్తగా ఉంటూ, యెహోవాతో మనకున్న స్నేహాన్ని కాపాడుకోవాలి.

20. ‘దుర్నీతినుండి తొలగిపోవడం’ అంత సులువు కాకపోయినా మనం ఏ విషయంలో ధైర్యం, ఊరట కలిగివుండవచ్చు?

20 మనకు దేవుని నామాన్ని ధరించే గొప్ప అవకాశంతో పాటు ఓ బాధ్యత కూడా ఉంది. మనం, “దుర్నీతినుండి తొలగిపోవాలి,” “కీడు చేయుట” మానేయాలి. (కీర్త. 34:14) నిజమే, అలా చేయడం అన్నివేళలా సులభం కాదు. కానీ, తన నీతిమార్గాలకు అంటిపెట్టుకుని జీవించే “తనవారిని” యెహోవా ఎల్లప్పుడూ ప్రేమిస్తాడని తెలుసుకోవడం ఎంత ఊరటనిస్తుందో!—2 తిమో. 2:19; 2 దినవృత్తాంతములు 16:9ఎ భాగం చదవండి.

a www.jw.org/te వెబ్‌సైట్‌లో, “మా గురించి” కింద “తరచూ అడిగే ప్రశ్నలు” కింద “మీరు కొన్ని సినిమాలను, పుస్తకాలను, పాటలను నిషేధిస్తారా?” అనే ప్రశ్న చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి