యెహోవా మనల్ని శ్రద్ధగా ఎందుకు గమనిస్తున్నాడో అర్థంచేసుకున్నారా?
“యెహోవా కన్నులు ప్రతి స్థలముమీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును.”—సామె. 15:3.
1, 2. నిఘా కెమెరాలు చూసే విధానానికి, యెహోవా చూసే విధానానికి తేడా ఏమిటి?
ఈ మధ్య చాలా దేశాల్లో, ట్రాఫిక్‌ను పర్యవేక్షించడానికి, రోడ్డు ప్రమాదాల దృశ్యాలను రికార్డు చేయడానికి నిఘా కెమెరాలను విరివిగా వాడుతున్నారు. ఎవరైనా యాక్సిడెంట్ చేసి పరారయితే ఈ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా నిందితుణ్ణి గుర్తించి, అరెస్టు చేయడం పోలీసులకు వీలౌతుంది. నిజంగా, ప్రతీచోట ఉన్న ఈ కెమెరా కళ్ల వల్ల నేరస్తులు తప్పించుకోలేకపోతున్నారు.
2 ఈ నిఘా కెమెరాలు ప్రతీచోట ఉన్నట్లే మన ప్రేమగల తండ్రి యెహోవా కళ్లు కూడా “ప్రతి స్థలముమీద” ఉన్నాయి. (సామె. 15:3) అయితే, మనం చేసే ప్రతీ పనిలో తప్పులు వెదకాలనే ఆయన మనల్ని చూస్తున్నాడా? తన నియమాలను పాటించకపోతే శిక్షించాలనే ఉద్దేశంతోనే యెహోవా మనల్ని గమనిస్తున్నాడా? (యిర్మీ. 16:17; హెబ్రీ. 4:13) ఎంతమాత్రం కాదు! యెహోవా మనలో ప్రతీ ఒక్కరిని ప్రేమిస్తూ, మన శ్రేయస్సు కోరుకుంటున్నాడు. అందుకే మనల్ని గమనిస్తున్నాడు.—1 పేతు. 3:12.
3. యెహోవా మనల్ని ప్రేమతో గమనిస్తున్నాడని ఎలా చెప్పవచ్చు?
3 అయితే, దేవుడు మన మీదున్న ప్రేమతోనే మనల్ని గమనిస్తున్నాడని ఎలా చెప్పవచ్చు? ఇప్పుడు మనం చూడబోయే ఐదు విషయాలే దానికి రుజువు. యెహోవా, (1) మనం తప్పుడు ఆలోచనలవైపు మొగ్గు చూపుతున్నప్పుడు హెచ్చరిస్తాడు, (2) తప్పటడుగులు వేస్తున్నప్పుడు సరిదిద్దుతాడు, (3) తన వాక్యంలోని సూత్రాల ద్వారా నడిపిస్తాడు, (4) వివిధ పరీక్షలు ఎదురైనప్పుడు సహాయం చేస్తాడు, (5) మనలో మంచిని చూసినప్పుడు ప్రతిఫలం దయచేస్తాడు.
దేవుడు మనల్ని గమనిస్తూ హెచ్చరిస్తాడు
4. కయీను “వాకిట పాపము పొంచియుండును” అని యెహోవా అతన్ని ఎందుకు హెచ్చరించాడు?
4 మొదటిగా, మనం తప్పుడు ఆలోచనలవైపు మొగ్గు చూపుతున్నప్పుడు దేవుడు ఎలా హెచ్చరిస్తాడో చూద్దాం. (1 దిన. 28:9) ఈ విషయాన్ని అర్థంచేసుకోవడానికి దేవుడు కయీనుతో వ్యవహరించిన తీరును పరిశీలించండి. తన అర్పణను దేవుడు అంగీకరించనప్పుడు కయీనుకు “మిక్కిలి కోపము” వచ్చింది. (ఆదికాండము 4:3-7 చదవండి.) “సత్క్రియ” చేయమని యెహోవా కయీనుకు సలహా ఇచ్చాడు. అలా చేయకపోతే అతని “వాకిట పాపము పొంచియుండును” అని యెహోవా కయీనును హెచ్చరించాడు. అతడు దాన్ని లోబరుచుకోవాలని ఆయన చెప్పాడు. కయీను ఆ హెచ్చరికను లక్ష్యపెట్టి, మళ్లీ తన అనుగ్రహం సంపాదించుకుని ‘తలెత్తుకోవాలని’ దేవుడు కోరుకున్నాడు. కయీను ఆ మాటల్ని పాటించివుంటే, యెహోవాతో ఉన్న మంచి సంబంధాన్ని కాపాడుకుని ఉండేవాడు.
5. చెడు ఆలోచనల విషయంలో యెహోవా మనల్ని ఏయే మార్గాల్లో హెచ్చరిస్తున్నాడు?
5 నేడు మన సంగతేంటి? యెహోవా మన హృదయంలో ఏముందో చూస్తాడు, మన నిజమైన ఆలోచనలు, ఉద్దేశాలు ఆయనకు కనబడకుండా దాచలేము. మనం నీతి మార్గంలో నడవాలని మన ప్రేమగల తండ్రి కోరుకుంటున్నాడు. అయితే, మన జీవన విధానం మార్చుకోమని ఆయన బలవంతం చేయడు. మనం తప్పుడు మార్గం వైపు వెళ్తున్నప్పుడు ఆయన బైబిలును ఉపయోగించి హెచ్చరిస్తాడు. ఎలా? మన చెడు ఆలోచనలను, ఉద్దేశాలను తీసేసుకోవడానికి సహాయం చేసే బైబిలు వృత్తాంతాలను మన రోజువారీ బైబిలు అధ్యయనంలో చూస్తాం. అంతేకాదు, మనల్ని ఉక్కిరిబిక్కిరి చేసే ఓ సమస్యను అధిగమించేందుకు తోడ్పడే సమాచారాన్ని మన ప్రచురణల్లో కనుగొంటాం. దానితోపాటు, మన సంఘ కూటాల్లో సరిగ్గా అవసరమైన సమయంలోనే చక్కని సలహాలు అందుకుంటాం!
6, 7. (ఎ) లక్షలమంది కోసం తయారుచేసిన సమాచారం, మనలో ప్రతీ ఒక్కరి మీద దేవునికున్న ప్రేమకు, శ్రద్ధకు నిదర్శనమని ఎలా చెప్పవచ్చు? (బి) మనలో ప్రతీ ఒక్కరి పట్ల యెహోవా చూపిస్తున్న శ్రద్ధ నుండి మీరు ఎలా ప్రయోజనం పొందవచ్చు?
6 అలాంటి హెచ్చరికలన్నీ మనలో ప్రతీ ఒక్కరి మీద యెహోవాకున్న ప్రేమకు, శ్రద్ధకు నిలువెత్తు నిదర్శనాలు. నిజమే, బైబిలు కొన్ని శతాబ్దాలుగా అందుబాటులో ఉంది, దేవుని సంస్థ లక్షలమందిని దృష్టిలో పెట్టుకుని ప్రచురణలను తయారుచేస్తుంది, కూటాల్లో సలహాలు సంఘమంతటినీ ఉద్దేశించి ఇస్తారు. అయితే, ఈ మూడు విషయాల ద్వారా యెహోవా మనలో ప్రతీ ఒక్కరి అవధానాన్ని తన వాక్యం వైపు మళ్లించి, మన ఆలోచనల్ని సరిచేసుకునే అవకాశమిచ్చాడు. అది యెహోవా ప్రేమతో మనపై చూపించే వ్యక్తిగత శ్రద్ధకు నిదర్శనం కాదంటారా!
బైబిలు శిక్షిత మనస్సాక్షి, చుట్టూ ఉన్న ప్రమాదాల నుండి మనల్ని కాపాడుతుంది (6, 7 పేరాలు చూడండి)
7 దేవుని హెచ్చరికల నుండి ప్రయోజనం పొందాలంటే, ఆయనకు మనమీద నిజంగా శ్రద్ధ ఉందనే విషయాన్ని గ్రహించాలి. ఆ తర్వాత, ఆయన వాక్య నిర్దేశానికి సానుకూలంగా స్పందిస్తూ, దేవుణ్ణి నొప్పించే ఎలాంటి ఆలోచనలనైనా తీసేసుకోవడానికి కృషిచేయాలి. (యెషయా 55:6, 7 చదవండి.) హెచ్చరికల్ని వెంటనే లక్ష్యపెడితే ఎంతో మనోవేదనను తప్పించుకోవచ్చు. అయితే, మనం ఒకవేళ చెడు ఆలోచనలకు తలొగ్గితే, మన ప్రేమగల తండ్రి అప్పటికీ సహాయం అందిస్తాడా?
శ్రద్ధగల తండ్రి మనల్ని సరిదిద్దుతాడు
8, 9. యెహోవా తన సేవకుల ద్వారా ఇచ్చే సలహాల్లో ఆయన గొప్ప శ్రద్ధ ఎలా కనిపిస్తుంది? ఉదాహరణ చెప్పండి.
8 యెహోవాకు మనమీద శ్రద్ధ ఉంది కాబట్టే మనల్ని సరిదిద్దుతాడని మనకు తెలుసు. (హెబ్రీయులు 12:5, 6 చదవండి.) నిజమే, మనం సలహాలను, క్రమశిక్షణను సాధారణంగా ఇష్టపడం. (హెబ్రీ. 12:11) అయినా, మనకు సలహాలు ఇచ్చే వ్యక్తి ఏమేమి చేయాలో ఒక్కసారి ఆలోచించండి. మనం చేస్తున్న ఏ పనులు మనల్ని యెహోవాకు దూరం చేయగలవో ఆయన తెలుసుకోవాలి. ఆయన మన భావోద్వేగాలను పట్టించుకోవాలి. అంతేకాకుండా, దేవునికి నచ్చేలా మనల్ని మనం సరిచేసుకోవడానికి సహాయం చేసే బైబిలు సూత్రాల్ని మనకు చూపించేందుకు అవసరమైన సమయాన్ని, శ్రమను ధారపోయడానికి ఆయన ఇష్టపడాలి. మరైతే ఇలాంటి చక్కని సలహాలకు మూలమైన యెహోవా వీటన్నిటినీ తప్పకుండా పాటించడా?
9 ఈ ఉదాహరణ చూడండి. అశ్లీల చిత్రాలు చూసే అలవాటు ఉన్న ఓ వ్యక్తి సత్యం తెలుసుకున్నాక దాన్ని మానేశాడు. కానీ, ఆ సహోదరునిలో పాత కోరికలు పూర్తిగా చల్లారిపోలేదు. ఆయన ఓ కొత్త సెల్‌ఫోన్ కొన్న తర్వాత ఆ చెడు కోరికలు మళ్లీ చెలరేగాయి. (యాకో. 1:14, 15) ఆయన ఆ ఫోన్లో అశ్లీల చిత్రాల వెబ్సైట్లు చూడడం మొదలుపెట్టాడు. అయితే, ఒకరోజు టెలిఫోన్ సాక్ష్యంలో పాల్గొంటున్నప్పుడు ఆయన తన ఫోన్‌ను ఓ సంఘ పెద్దకు ఇచ్చాడు. ఆ ఫోన్లో కొన్ని అసభ్యకరమైన సైట్లు ఉండడం ఆ సంఘపెద్ద గమనించాడు. వెంటనే ఆయన, ఆధ్యాత్మిక ప్రమాదంలో ఉన్న ఆ సహోదరునికి సలహా ఇచ్చాడు. సరిగ్గా సమయానికి అందిన సలహా వల్ల ఆ సహోదరుడు ప్రయోజనం పొంది చివరికి ఆ చెడు అలవాటు నుండి బయటపడ్డాడు. మన శ్రద్ధగల పరలోక తండ్రి, మనం రహస్యంగా చేసే పాపాలను కూడా గమనిస్తూ, పరిస్థితి చెయ్యిదాటిపోక ముందే మనల్ని సరిచేస్తున్నందుకు ఎంత రుణపడివున్నాం!
బైబిలు సూత్రాల్ని పాటిస్తే ప్రయోజనం పొందుతాం
10, 11. (ఎ) మనం దేవుడిచ్చే నడిపింపును ఎలా పొందవచ్చు? (బి) యెహోవా నిర్దేశాన్ని పాటించడం ప్రయోజనకరమని ఓ కుటుంబం ఎలా తెలుసుకుంది?
10 కీర్తనకర్త యెహోవా గురించి ఇలా పాడాడు, “నీ ఆలోచనచేత నన్ను నడిపించెదవు.” (కీర్త. 73:24) మనకు నడిపింపు అవసరమైనప్పుడు, యెహోవా అభిప్రాయం కోసం ఆయన వాక్యాన్ని పరిశీలించడం ద్వారా మనం ఆయన “వైపు చూస్తూ” ఉంటాం. బైబిలు సూత్రాల్ని పాటించడం, ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఇవ్వడంతోపాటు, కొన్నిసార్లు మన భౌతిక అవసరాలను తీర్చుకోవడానికి కూడా సహాయం చేస్తుంది.—సామె. 3:6, పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం.
11 యెహోవా తన సేవకుల్ని ఎలా నడిపిస్తాడో అర్థంచేసుకోవడానికి, ఫిలిప్పీన్స్ దేశం, మాస్బాటేలోని పర్వత ప్రాంతంలో నివసిస్తున్న ఓ దంపతుల అనుభవం పరిశీలించండి. వాళ్లిద్దరూ క్రమ పయినీర్లు. ఓ పొలాన్ని కౌలు చేసుకుంటూ పెద్ద కుటుంబాన్ని పోషిస్తున్నారు. అయితే ఉన్నట్టుండి ఓ రోజు, వాళ్ల కౌలును రద్దు చేస్తున్నట్లుగా పొలం యజమాని వాళ్లకు ఓ నోటీసు పంపించాడు. ఎందుకు? వాళ్లు తనను మోసం చేస్తున్నారని ఆ యజమాని అనుకున్నాడు. తమ పరిస్థితి ఉన్నట్టుండి రోడ్డున పడినట్లు అనిపించినా, ఆ సహోదరుడు మాత్రం “యెహోవా మనల్ని చూసుకుంటాడు. ఏదేమైనా సరే ఆయన మన అవసరాలు తీరుస్తాడు” అని అన్నాడు. ఆ సహోదరుని నమ్మకం వమ్ముకాలేదు. ఎందుకంటే కొన్నిరోజులు గడిచాక, పొలం విడిచిపెట్టి వెళ్లనవసరం లేదనే తీపి కబురు వాళ్లకు అందింది. అసలేం జరిగింది? ఆ కుటుంబం మీద నిందపడినా, వాళ్లు బైబిలు సూత్రాలు పాటిస్తూ తనతో చాలా మర్యాదగా, సమాధానంగా వ్యవహరించడం యజమాని గమనించాడు. అది యజమానిని ఎంతగా ఆకట్టుకుందంటే వాళ్లను అక్కడ ఉండనివ్వడమే కాకుండా వాళ్లు కౌలు చేసుకోవడానికి మరికొంత భూమిని కూడా ఇచ్చాడు. (1 పేతురు 2:12 చదవండి.) అవును, మన జీవన చింతలను తట్టుకోవడానికి యెహోవా తన వాక్యమైన బైబిలు ద్వారా సహాయం చేస్తాడు.
సమస్యల్ని తట్టుకోవడానికి సహాయం చేసే ఓ స్నేహితుడు
12, 13. తాము పడుతున్న బాధల్ని దేవుడు పట్టించుకోవడం లేదేమోనని కొందరికి ఎలాంటి సందర్భాల్లో అనిపిస్తుంది?
12 అయితే కొన్నిసార్లు, ఒకానొక సమస్య ఎక్కువ కాలం వెంటాడవచ్చు. తీవ్రమైన అనారోగ్యం మనల్ని పట్టిపీడిస్తుండవచ్చు, సొంత కుటుంబ సభ్యులు ఎంతో కాలంగా వ్యతిరేకిస్తుండవచ్చు లేదా మనం ఎడతెరిపి లేకుండా హింసలకు గురౌతుండవచ్చు. వాటితోపాటు, అప్పుడప్పుడు సంఘంలోని వాళ్లతో వచ్చే తీవ్రమైన అభిప్రాయభేదాల విషయమేమిటి?
13 ఉదాహరణకు, సంఘంలోని ఓ వ్యక్తి మాటలు కటువుగా అనిపించి మీరు నొచ్చుకునివుంటారు. ‘దేవుని సంస్థలో ఇలాంటివి జరగకూడదు!’ అని మీరు అనుకోవచ్చు. అయితే, అలా కటువుగా మాట్లాడిన వ్యక్తి సంఘంలో కొన్ని సేవావకాశాలు పొందుతుండవచ్చు, నలుగురిలో ఆయనకు మంచి పేరు కూడా ఉండవచ్చు. ‘అదెలా సాధ్యం? యెహోవా ఇదంతా చూడట్లేదా? ఆయన చర్య తీసుకోడా?’ అని మీరు ఆశ్చర్యపోవచ్చు.—కీర్త. 13:1, 2; హబ. 1:2, 3.
14. మన వ్యక్తిగత సమస్యల్లో యెహోవా కలుగజేసుకోకపోవడానికి ఒక కారణం ఏమైవుండవచ్చు?
14 యెహోవా కలుగజేసుకోకపోవడానికి సరైన కారణాలే ఉండవచ్చు. ఉదాహరణకు, జరిగినదాంట్లో ఎదుటివాళ్ల తప్పే ఎక్కువ ఉందని మీకు అనిపించవచ్చు, కానీ దేవుడు పరిస్థితిని మరోలా చూస్తుండవచ్చు. ఆయన దృష్టిలో మీ తప్పే ఎక్కువ ఉండవచ్చు. బహుశా మీకు కటువుగా అనిపించిన ఆ మాట, నిజానికి మీరు తప్పకుండా సరిచేసుకోవాల్సిన విషయం గురించిన సరైన సలహా అయ్యిండవచ్చు. పరిపాలక సభ సభ్యునిగా సేవచేసిన సహోదరుడు కార్ల్ క్లేన్ తన జీవిత కథలో ఓ సందర్భం గురించి ప్రస్తావించాడు. ఆయనను ఓసారి సహోదరుడు జే. ఎఫ్. రూథర్‌ఫర్డ్ నిర్మొహమాటంగా గద్దించాడు. తర్వాత ఓ రోజు సహోదరుడు రూథర్‌ఫర్డ్ ఆయనను “హలో, కార్ల్!” అని పలకరించాడు, కానీ సహోదరుడు క్లేన్ ఇంకా ఆ గద్దింపు గురించే ఆలోచిస్తూ, తప్పదన్నట్లు ముభావంగా పలకరించాడు. క్లేన్ మనసులో ఇంకా కోపం ఉందని రూథర్‌ఫర్డ్ గమనించి, సాతాను ఉచ్చులో చిక్కుకోవద్దని ఆయనను హెచ్చరించాడు. క్లేన్ ఆ తర్వాత ఇలా రాశాడు, “ఒక సహోదరుని మీద కోపాన్ని మనసులో ఉంచుకుంటే, ముఖ్యంగా ఆయనకున్న బాధ్యతలతో వచ్చిన అధికారం వల్ల ఏదైనా సలహా ఇచ్చినందుకు అలా చేస్తే, మనం సాతానుకు అవకాశం ఇచ్చినవాళ్లం అవుతాం.”a
15. సమస్యల్లో యెహోవా సహాయం కోసం వేచి చూస్తున్నప్పుడు అసహనానికి గురికాకుండా మీకు ఏది సహాయం చేస్తుంది?
15 అయితే, ఒక సమస్య మరీ ఎక్కువకాలం కొనసాగుతున్నట్లు అనిపించినప్పుడు మనం సహనం కోల్పోయే అవకాశం ఉంది. మనం ఆ పరిస్థితిని ఎలా తట్టుకోవచ్చు? ఉదాహరణకు, మీరు కారులో ప్రయాణిస్తూ ట్రాఫిక్‌లో చిక్కుకున్నారనుకోండి. దాన్నుండి బయటపడడానికి ఎంత సమయం పడుతుందో మీకు తెలియదు. అప్పుడు మీరు చిరాకుపడి మీకు తెలియని మరో దారిలో వెళ్లడానికి ప్రయత్నిస్తే, దారి తప్పిపోయి గమ్యాన్ని ఇంకా ఆలస్యంగా చేరుకునే ప్రమాదం ఉంది. అలాకాకుండా ట్రాఫిక్‌లోనే వేచివుంటే కాస్త ముందుగానే గమ్యాన్ని చేరుకునేవారేమో. అదేవిధంగా, దేవుని వాక్యం చూపించే మార్గంలోనే ఉంటే, ఎప్పటికైనా మీ గమ్యాన్ని చేరుకుంటారు.
16. యెహోవా మన సమస్యల్లో కలుగజేసుకోకపోవడానికి మరో కారణం ఏమైవుండవచ్చు?
16 కొన్నిసార్లు, మనకు ప్రాముఖ్యమైన శిక్షణ ఇవ్వడానికే యెహోవా మన సమస్యల్లో కలుగజేసుకోకపోవచ్చు. (1 పేతురు 5:6-10 చదవండి.) అంతమాత్రాన దేవుడే మన సమస్యలకు కారణం కాదు. (యాకో. 1:13) సమస్యలకు చాలావరకు మన ‘విరోధియైన అపవాదే’ కారణం. అయితే, మనం ఆధ్యాత్మికంగా ఎదిగేలా సహాయం చేయడానికి దేవుడు ఆ కష్టకాలాన్ని ఉపయోగించుకోగలడు. మనం పడే వేదనను ఆయన గమనిస్తున్నాడు, “ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు” కాబట్టి ఆ వేదనను ‘కొంచెము కాలమే’ ఉండనిస్తాడు. మీరు సమస్యల్లో ఉన్నప్పుడు, మిమ్మల్ని శ్రద్ధగా గమనిస్తున్న యెహోవా మీరు బయటపడే మార్గాన్ని చూపిస్తాడనే నమ్మకంతో ఉండండి.—2 కొరిం. 4:7-9.
యెహోవా ప్రతిఫలం దయచేస్తాడు
17. యెహోవా ఎవరి కోసం వెదుకుతున్నాడు? ఎందుకు?
17 దేవుడు మనల్ని పరిశీలించడానికి, ప్రోత్సాహకరమైన మరో కారణం కూడా ఉంది. దీర్ఘదర్శియైన హనానీ ద్వారా రాజైన ఆసాకు యెహోవా ఇలా చెప్పాడు, “తనయెడల యథార్థ హృదయముగలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది.” (2 దిన. 16:9) యెహోవా మిమ్మల్ని ‘బలపరుస్తాడు,’ అంటే మిమ్మల్ని కాపాడుతూ, ప్రతిఫలం దయచేస్తాడని అర్థం.
18. మీరు చేస్తున్న మంచిని ఎవరూ పట్టించుకోవడం లేదని అనిపించినప్పుడు యెహోవా గురించి ఏమని గుర్తుంచుకోవాలి? (ప్రారంభ చిత్రం చూడండి.)
18 మనం ‘మేలును వెదకాలని,’ ‘మేలును ప్రేమించాలని,’ ‘మేలును చేయాలని’ యెహోవా కోరుకుంటున్నాడు. అలా చేస్తేనే, మనం ఆయన ‘కనికరాన్ని’ పొందుతాం. (ఆమో. 5:14, 15; 1 పేతు. 3:11, 12) యెహోవా నీతిమంతులను గమనిస్తూ, వాళ్లను ఆశీర్వదిస్తాడు. (కీర్త. 34:15) హెబ్రీ మంత్రసానులైన షిఫ్రా, పూయాలకు ఏమి జరిగిందో ఆలోచించండి. ఐగుప్తు బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలీయులకు పుట్టే మగ పిల్లల్ని పురిట్లోనే చంపేయమని ఫరో వాళ్లకు ఆజ్ఞాపించాడు. అయితే, ఆ ఇద్దరు స్త్రీలు మాత్రం ఫరోకన్నా దేవునికే ఎక్కువగా భయపడి, పిల్లల్ని కాపాడారు. దేవుడు ఆ తర్వాత షిఫ్రా, పూయాలకు “వంశాభివృద్ధి కలుగజేసెను.” (నిర్గ. 1:15-17, 20, 21) లోకమంతటా సంచరించే యెహోవా కళ్లకు వీళ్లు చేసిన మంచి పనులు కనబడకుండా పోలేదు. మనం చేసే మంచి పనులను ఎవరూ పట్టించుకోవడం లేదని అప్పుడప్పుడు మనకు అనిపించవచ్చు. కానీ, యెహోవా పట్టించుకుంటున్నాడు. మనం చేసే ప్రతీ మంచి పనిని యెహోవా గమనిస్తాడు, ప్రతిఫలం కూడా ఇస్తాడు.—మత్త. 6:4, 6; 1 తిమో. 5:25; హెబ్రీ. 6:10.
19. మన కష్టాన్ని యెహోవా తప్పకుండా చూస్తాడని ఓ సహోదరి అనుభవపూర్వకంగా ఎలా తెలుసుకుంది?
19 ఆస్ట్రియాలో ఉన్న ఓ సహోదరి తాను పడిన కష్టాన్ని యెహోవా చూశాడని అనుభవపూర్వకంగా తెలుసుకుంది. హంగరీ సంతతికి చెందిన ఆమె, హంగేరియన్ భాష మాట్లాడే ఓ స్త్రీ ఇంటి చిరునామాను అందుకుంది. ఆమె వెంటనే ఆ ఇంటికి వెళ్లింది, కానీ అక్కడ ఎవరూ లేరు. ఆమె చాలాసార్లు అలా వెళ్తూనే ఉంది. కొన్నిసార్లు ఆమెకు ఆ ఇంట్లో ఎవరో ఉన్నట్లు అనిపించేది, కానీ ఎవరూ పలికేవాళ్లుకాదు. ఆమె అక్కడ సాహిత్యాన్ని, ఉత్తరాలను, తన చిరునామాను, ఇతర సమాచారాన్ని విడిచిపెట్టేది. అలా ఒకటిన్నర సంవత్సరం పాటు ఎన్నోసార్లు సందర్శించిన తర్వాత ఓ రోజు ఆ ఇంటి తలుపులు తెరుచుకున్నాయి! తలుపు తెరిచిన స్త్రీ, సహోదరిని స్నేహపూర్వకంగా పలకరిస్తూ, “లోపలికి రండి. మీరు తెచ్చిన ప్రతీదాన్ని చదివాను, మీ కోసమే ఎదురుచూస్తున్నాను” అంది. ఆ మహిళకు కీమోథెరపి చికిత్స జరుగుతుండడం వల్ల అప్పటివరకు ఎవ్వరినీ కలవలేకపోయింది. ఆమెతో బైబిలు అధ్యయనం మొదలైంది. నిస్సందేహంగా, ఆ సహోదరి కష్టానికి దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు!
20. యెహోవా శ్రద్ధగా గమనిస్తున్నందుకు మీకేమనిపిస్తుంది?
20 యెహోవా మనం చేసే ప్రతీ మంచిపనిని చూసి తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు. దేవుని కళ్లు మనల్ని చూస్తున్నాయని గుర్తుచేసుకున్నప్పుడు, ఎలాంటి భావోద్వేగాలు లేని నిఘా కెమెరాల కింద ఉన్నట్లు మనం భావించం. దానికి బదులు, నిజంగా మనకు సహాయం చేయాలనుకునే ప్రేమగల దేవునికి మరింత దగ్గరవుతాం!
a సహోదరుడు కార్ల్ క్లేన్ జీవిత కథ, అక్టోబరు 1, 1984 కావలికోట (ఇంగ్లీషు) సంచికలో వచ్చింది.