సకల యుగముల రాజైన యెహోవాను ఆరాధించండి
‘సకల యుగముల రాజుకు ఘనతయు మహిమయు యుగయుగములు కలుగును గాక.’—1 తిమో. 1:17.
1, 2. (ఎ) ‘సకల యుగముల రాజు’ ఎవరు, ఆ బిరుదు ఆయనకు ఎందుకు సరిపోతుంది? (ప్రారంభ చిత్రం చూడండి.) (బి) యెహోవా పరిపాలనకు సంబంధించిన ఏ విషయం మనల్ని ఆయనకు సన్నిహితం చేస్తుంది?
రెండవ సోభూజ రాజు, స్వాజీలాండ్‌ను దాదాపు 61 ఏళ్లు పరిపాలించాడు. ఆధునిక కాలంలో ఓ రాజు అంతకాలం పాలించడం గొప్ప విషయమే. అయితే మరో రాజు ఉన్నాడు, ఆయన పరిపాలనకు ముగింపే లేదు. బైబిలు ఆయనను ‘సకల యుగములలో రాజు’ అని పిలుస్తుంది. (1 తిమో. 1:17) ఆ సర్వాధిపతి ఎవరో చెబుతూ ఓ కీర్తనకర్త ఇలా పాడాడు: “యెహోవా నిరంతరము రాజై యున్నాడు.”—కీర్త. 10:16.
2 అవును, ఏ మనిషికీ సాధ్యం కానంత ఎక్కువకాలంగా యెహోవా పరిపాలిస్తున్నాడు. అయితే మనల్ని ఆయనకు సన్నిహితం చేసేది ఆ పరిపాలనా కాలం కాదుగానీ ఆయన పరిపాలనా విధానమే. ప్రాచీన ఇశ్రాయేలును 40 ఏళ్లు పాలించిన ఓ రాజు, దేవుణ్ణి ఈ మాటలతో స్తుతించాడు: “యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపాసమృద్ధిగలవాడు. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరచియున్నాడు. ఆయన అన్నిటిమీద రాజ్యపరిపాలన చేయుచున్నాడు.” (కీర్త. 103:8, 19) యెహోవా మన రాజు మాత్రమే కాదు, ప్రేమగల పరలోక తండ్రి కూడా. ఈ విషయంలో మనకు రెండు ప్రశ్నలు రావచ్చు, అవి: యెహోవా ఒక తండ్రిలా ఎలా వ్యవహరించాడు? ఏదెనులో తిరుగుబాటు జరిగినప్పటి నుండి ఆయన తన రాచరికాన్ని ఎలా చూపిస్తున్నాడు? ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవడం వల్ల మనం యెహోవాకు మరింత దగ్గరౌతాం, ఆయనను హృదయపూర్వకంగా ఆరాధిస్తాం.
సకల యుగముల రాజు ఓ విశ్వవ్యాప్త కుటుంబాన్ని సృష్టించాడు
3. యెహోవా విశ్వవ్యాప్త కుటుంబంలో మొదటి సభ్యుడు ఎవరు? ఇంకా ఎవరెవరు ఉన్నారు?
3 తన అద్వితీయ కుమారుణ్ణి సృష్టించినప్పుడు యెహోవా ఎంత సంతోషించి ఉంటాడో ఊహించండి! దేవుడు తన ఆదిసంభూతుణ్ణి అల్పునిగా చూడలేదు కానీ ఓ కొడుకులా ప్రేమించి, ఇతర పరిపూర్ణ ప్రాణులను సృష్టించడంలోని ఆనందాన్ని ఆయనతో పంచుకున్నాడు. (కొలొ. 1:15-17) ఆ ప్రాణుల్లో కోట్లకొలది దేవదూతలు ఉన్నారు. వాళ్లు ‘దేవుని చిత్తాన్ని నెరవేర్చే పరిచారకులుగా’ ఆయనను ఆనందంగా సేవిస్తున్నారని బైబిలు చెబుతుంది. యెహోవా వాళ్లను ‘కుమారులని’ పిలుస్తూ గౌరవిస్తున్నాడు. ఆయన విశ్వవ్యాప్త కుటుంబంలో వాళ్లు కూడా ఉన్నారు.—కీర్త. 103:20-22; యోబు 38:7, అథఃస్సూచి.
4. దేవుని విశ్వవ్యాప్త కుటుంబంలో మానవులు ఎలా భాగమయ్యారు?
4 యెహోవా భూమ్యాకాశాలను సృష్టించిన తర్వాత తన విశ్వవ్యాప్త కుటుంబాన్ని విస్తరించాడు. ఎలా? ఆయన భూమిని ఒక సుందరమైన గృహంలా తయారుచేసి, తన స్వరూపంలో మొదటి మనిషైన ఆదామును సృష్టించాడు. (ఆది. 1:26-28) ఆదాము తనకు లోబడి ఉండాలని సృష్టికర్తగా యెహోవా ఆశించడం సరైనదే. యెహోవా ఒక తండ్రిగా తన నిర్దేశాలన్నీ ప్రేమతో, దయతో తెలియజేశాడు. ఆ నిర్దేశాలు ఏ విధంగానూ ఆదాము స్వేచ్ఛకు అనవసరమైన అడ్డుగోడలుగా లేవు.—ఆదికాండము 2:15-17 చదవండి.
5. భూమిని మనుషులతో నింపడానికి దేవుడు ఏ ఏర్పాటు చేశాడు?
5 చాలామంది మానవ పరిపాలకుల్లా కాకుండా యెహోవా తన సృష్టి ప్రాణులను నమ్మకస్థులైన కుటుంబ సభ్యులుగా పరిగణిస్తూ, వాళ్లకు కొన్ని బాధ్యతలను సంతోషంగా అప్పగిస్తాడు. ఉదాహరణకు, ఆయన ఆదాముకు ఇతర ప్రాణుల మీద అధికారమిచ్చి, జంతువులకు పేర్లు పెట్టే పనిని అప్పగించాడు. అది సవాళ్లు, సరదా కలగలిసిన పని. (ఆది. 1:26; 2:19, 20) దేవుడు భూమిని నింపడానికి లక్షలమంది పరిపూర్ణ మానవులను సృష్టించలేదు. బదులుగా, ఆయన పరిపూర్ణ సహకారిని అంటే హవ్వను సృష్టించి ఆదాముకు ఇచ్చాడు. (ఆది. 2:21, 22) తమ పిల్లలతో భూమిని నింపే అవకాశాన్ని దేవుడు ఆదాముహవ్వలకు ఇచ్చాడు. లోపంలేని పరిస్థితుల్లో జీవిస్తూ మనుషులు ఈ భూమంతటినీ పరదైసుగా మార్చివుండేవాళ్లే. పరలోకంలోని దూతలతో కలిసి, వాళ్లు యెహోవా విశ్వవ్యాప్త కుటుంబంలో సభ్యులుగా ఆయనను ఎల్లప్పుడూ ఆరాధించగలిగేవాళ్లే. అది ఎంత అద్భుతమైన అవకాశమో కదా! ఓ తండ్రిలా యెహోవా చూపించే ప్రేమకు ఎంత చక్కని నిదర్శనమో కదా!
తిరుగుబాటుదారులైన కుమారులు దేవుని రాచరికాన్ని తిరస్కరించారు
6. (ఎ) దేవుని కుటుంబంలో తిరుగుబాటు ఎలా మొదలైంది? (బి) అప్పటికీ పరిస్థితులు యెహోవా నియంత్రణలోనే ఉన్నాయని ఎలా చెప్పవచ్చు?
6 విచారకరంగా, యెహోవా తమ సర్వాధిపతిగా ఉండడాన్ని ఆదాముహవ్వలు ఇష్టపడలేదు. బదులుగా, వాళ్లు తిరుగుబాటు చేసిన ఒక దేవదూతతో అంటే సాతానుతో చేతులు కలిపారు. (ఆది. 3:1-6) దేవుని పరిపాలనకు దూరమైన జీవితం వాళ్లకూ వాళ్ల సంతానానికీ దుఃఖాన్ని, బాధను, మరణాన్ని తీసుకొచ్చింది. (ఆది. 3:16-19; రోమా. 5:12) దాంతో, భూమ్మీద దేవునికి విధేయులైనవాళ్లు కనుమరుగైపోయారు. అంటే, యెహోవా భూమ్మీదా దానిమీదున్న ప్రజల మీదా నియంత్రణ కోల్పోయాడనా? తన సర్వాధిపత్యాన్ని వదిలేసుకున్నాడనా? ఎంతమాత్రం కాదు! ఆదాముహవ్వలను ఏదెను తోటనుండి బయటకు పంపించి, వాళ్లు మళ్లీ దానిలోకి రాకుండా ఆ తోట ప్రవేశం దగ్గర కెరూబులను కాపలా ఉంచి ఆయన తన అధికారాన్ని చూపించాడు. (ఆది. 3:23, 24) అదే సమయంలో ఆయన తండ్రిలా ప్రేమను చూపించాడు. నమ్మకస్థులైన దేవదూతలతో, మానవులతో ఒక విశ్వవ్యాప్త కుటుంబాన్ని ఏర్పాటు చేయాలనే తన సంకల్పం నెరవేరుతుందని, ఆదాము ‘సంతానంలో’ ఒకరు సాతానును నాశనం చేసి, ఆదాము పాపం వల్ల వచ్చిన నష్టాన్ని పూరిస్తాడని ఆయన వాగ్దానం చేశాడు.—ఆదికాండము 3:15 చదవండి.
7, 8. (ఎ) నోవహు కాలానికల్లా పరిస్థితులు ఎంత చెడ్డగా తయారయ్యాయి? (బి) భూమిని శుభ్రం చేయడానికి, మానవులను కాపాడడానికి యెహోవా ఏ ఏర్పాటు చేశాడు?
7 ఆ తర్వాతి శతాబ్దాల్లో హేబెలు, హనోకు వంటి కొంతమంది యెహోవాకు యథార్థంగా ఉన్నారు. అయినా, మానవుల్లో అధికశాతం మాత్రం యెహోవాను తమ తండ్రిగా, రాజుగా వద్దనుకున్నారు. నోవహు కాలం వచ్చేసరికి, భూమంతా “బలాత్కారముతో నిండియుండెను.” (ఆది. 6:11) అంటే భూవ్యవహారాలపై యెహోవా పట్టు కోల్పోయాడని అర్థమా? బైబిలు ఏమి చెబుతుంది?
8 నోవహు వృత్తాంతాన్ని పరిశీలించండి. నోవహును, ఆయన కుటుంబాన్ని రక్షించే పెద్ద ఓడను ఎలా నిర్మించాలో యెహోవా నోవహుకు సవివరంగా తెలియజేసి, కావలసిన నిర్దేశాలను ఇచ్చాడు. అంతేకాక, “నీతిని ప్రకటించే” పనిని నోవహుకు అప్పగించి, దేవుడు తన మానవ కుటుంబమంతటి మీద గొప్ప ప్రేమ చూపించాడు. (2 పేతు. 2:5) నోవహు ప్రకటించిన సందేశంలో పశ్చాత్తాపపడమనే పిలుపుతో పాటు, రాబోయే నాశనం గురించిన హెచ్చరికలు కూడా ఉన్నాయి, కానీ ప్రజలు వాటిని పెడచెవినబెట్టారు. నోవహు ఆయన కుటుంబం హింస, ఘోరమైన అనైతికత ఉన్న లోకంలో దశాబ్దాలపాటు జీవించారు. అయితే యెహోవా ఓ శ్రద్ధగల తండ్రిగా, ఆ ఎనిమిదిమంది యథార్థవంతులను కాపాడాడు, ఆశీర్వదించాడు. భూవ్యాప్తంగా జలప్రళయం తీసుకొచ్చి తిరుగుబాటుదారులైన మానవుల మీద, దుష్ట దూతల మీద ఆయన తన అధికారాన్ని చూపించాడు. అవును, పరిస్థితులు అప్పటికీ యెహోవా అదుపులోనే ఉన్నాయి.—ఆది. 7:17-24.
యెహోవా ఎల్లప్పుడూ తన రాచరికాన్ని చూపిస్తూనే ఉన్నాడు (6, 8, 10, 12, 17 పేరాలు చూడండి)
జలప్రళయం తర్వాత యెహోవా రాచరికం
9. యెహోవా జలప్రళయం తర్వాత మనుషులకు ఏ అవకాశం ఇచ్చాడు?
9 పరిశుభ్రమైన భూమ్మీద కాలుమోపిన నోవహు, ఆయన కుటుంబ సభ్యుల హృదయాలు, యెహోవా చూపించిన శ్రద్ధకు, కాపుదలకు తప్పకుండా కృతజ్ఞతతో నిండివుంటాయి. నోవహు వెంటనే, యెహోవాను ఆరాధించడానికి ఓ బలిపీఠాన్ని కట్టి, బలులు అర్పించాడు. దేవుడు నోవహును ఆయన కుటుంబాన్ని ఆశీర్వదించి, “మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి” అని చెప్పాడు. (ఆది. 8:20–9:1) అలా యెహోవా సత్యారాధనలో ఐక్యమవ్వడానికి, భూమిని నింపడానికి మనుషులకు మరో అవకాశం దొరికింది.
10. (ఎ) జలప్రళయం తర్వాత యెహోవాపై తిరుగుబాటు ఎక్కడ, ఎలా మొదలైంది? (బి) తన చిత్తం నెరవేరేలా చూడడానికి యెహోవా ఏమి చేశాడు?
10 అయితే జలప్రళయం మనుషుల్లోని అపరిపూర్ణతను తీసివేయలేదు, వాళ్లు సాతాను, అతని దూతల అదృశ్య ప్రభావంతో ఇంకా పోరాడాల్సిందే. యెహోవా ప్రేమపూర్వక పాలనపై తిరుగుబాటు జరిగి ఎంతోకాలం గడవకముందే మరో తిరుగుబాటు చెలరేగింది. ఉదాహరణకు, నోవహు మునిమనమడైన నిమ్రోదు తీవ్రంగా యెహోవా పరిపాలనను వ్యతిరేకించాడు. నిమ్రోదు, “యెహోవా యెదుట పరాక్రమముగల వేటగాడు” అని బైబిలు వర్ణించింది. అతను బాబెలు వంటి గొప్ప పట్టణాలను నిర్మించి, “షీనారు దేశములో” తనను రాజుగా చేసుకున్నాడు. (ఆది. 10:8-12) మరి, ఈ తిరుగుబాటుదారుడైన రాజుపై యెహోవా ఏ చర్య తీసుకుంటాడు? తన చిత్తానికి వ్యతిరేకంగా అతను చేసే ప్రయత్నాలకు దేవుడు ఎలా స్పందిస్తాడు? దేవుడు ప్రజల భాషలను తారుమారు చేసి నిమ్రోదు అనుచరులను భూమంతటా చెదరగొట్టాడు. వాళ్లు అలా వెళ్తూ తమ అబద్ధ ఆరాధనను, మానవ పరిపాలనా పద్ధతుల్ని తమవెంట తీసుకెళ్లారు.—ఆది. 11:1-9.
11. యెహోవా తన స్నేహితుడైన అబ్రాహాము పట్ల యథార్థత ఎలా చూపించాడు?
11 జలప్రళయం తర్వాత చాలామంది ప్రజలు అబద్ధ దేవుళ్లను ఆరాధించినా, కొంతమంది నమ్మకస్థులు మాత్రం యెహోవాను ఘనపరుస్తూనే వచ్చారు. వాళ్లలో ఒకరు అబ్రాహాము. ఆయన దేవుని మాటకు లోబడి, తన సొంత పట్టణమైన ఊరులోని సౌకర్యాలను విడిచిపెట్టి, చాలా సంవత్సరాలపాటు గుడారాల్లో నివసించాడు. (ఆది. 11:31; హెబ్రీ. 11:8, 9) అలా ప్రయాణిస్తున్నప్పుడు అబ్రాహాము తరచూ ఇతర మానవరాజులు పాలించే పెద్దపెద్ద ప్రాకారాలుగల పట్టణాల సమీపంలో నివసించాడు. అయినా యెహోవా అబ్రాహామును, ఆయన కుటుంబాన్ని కాపాడాడు. యెహోవా ఓ తండ్రిలా సంరక్షించిన విధానం గురించి కీర్తనకర్త ఇలా పాడాడు: “[దేవుడు] ఎవరినైనను వారికి హింస చేయనియ్యలేదు, ఆయన వారికొరకు రాజులను గద్దించెను.” (కీర్త. 105:13-15) యెహోవా తన స్నేహితుడైన అబ్రాహాము పట్ల ఉన్న యథార్థతను బట్టి, ఆయనకు ‘రాజులు నీలోనుండి వస్తారు’ అని వాగ్దానం చేశాడు.—ఆది. 17:6; యాకో. 2:23.
12. ఐగుప్తుపై యెహోవా తన సర్వాధిపత్యాన్ని ఎలా చూపించాడు? దానివల్ల ఆయన ప్రజలు ఏ ప్రయోజనం పొందారు?
12 దేవుడు అబ్రాహాము కుమారుడైన ఇస్సాకుకు, మనమడైన యాకోబుకు కూడా వాగ్దానం చేసి, వాళ్లను ఆశీర్వదిస్తానని, వాళ్ల సంతతి నుండి రాజుల్ని రప్పిస్తానని చెప్పాడు. (ఆది. 26:3-5; 35:11) అయితే యాకోబు సంతతి నుండి రాజులు రావడానికి ముందే వాళ్లు ఐగుప్తులో బానిసలయ్యారు. అంటే, యెహోవా తన వాగ్దానాన్ని నెరవేర్చడని, భూమిపై తన సర్వాధిపత్యాన్ని వదులుకున్నాడని దానర్థమా? కానేకాదు! తాను అనుకున్న సమయంలో యెహోవా తన గొప్ప శక్తిని ప్రదర్శించి మొండివాడైన ఫరో మీద తన సర్వాధిపత్యాన్ని చూపించాడు. బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలీయులు యెహోవా మీద విశ్వాసం ఉంచారు, ఆయన వాళ్లను ఎర్ర సముద్రం గుండా నడిపించి, అద్భుతరీతిలో విడిపించాడు. అవును, యెహోవా అప్పటికీ విశ్వసర్వాధిపతిగానే ఉన్నాడు, ఒక శ్రద్ధగల తండ్రిలా తన ప్రజలను కాపాడడానికి తన గొప్ప శక్తిని ఉపయోగించాడు.—నిర్గమకాండము 14:13, 14 చదవండి.
యెహోవా ఇశ్రాయేలీయుల రాజయ్యాడు
13, 14. (ఎ) ఇశ్రాయేలీయులు యెహోవా రాచరికం గురించి ఏమని పాడారు? (బి) రాచరికానికి సంబంధించి యెహోవా దావీదుకు ఏ వాగ్దానం చేశాడు?
13 ఐగుప్తునుండి అద్భుతరీతిలో విడుదలైన వెంటనే ఇశ్రాయేలీయులు యెహోవాను స్తుతిస్తూ ఓ విజయగీతం పాడారు. ఆ గీతం నిర్గమకాండము 15వ అధ్యాయంలో ఉంది. ఆ అధ్యాయంలోని 18వ వచనంలో ప్రజలు ఇలా కీర్తించారు: “యెహోవా నిరంతరమును ఏలువాడు.” అవును, ఆ కొత్త జనాంగానికి యెహోవా నిజంగా రాజయ్యాడు. (ద్వితీ. 33:5) అయితే యెహోవా తమ అదృశ్య పాలకునిగా ఉండడం ఆ జనాంగాన్ని సంతృప్తిపర్చలేదు. ఐగుప్తు నుండి వచ్చిన దాదాపు 400 సంవత్సరాల తర్వాత వాళ్లు, తమ చూట్టూవున్న అన్యులకు ఉన్నట్లే తమకు కూడా ఓ మానవరాజు కావాలని దేవుణ్ణి అడిగారు. (1 సమూ. 8:5) అయితే, యెహోవా అప్పటికీ రాజేనన్న విషయం ఇశ్రాయేలీయుల రెండవ రాజైన దావీదు పరిపాలన కాలంలో స్పష్టంగా వెల్లడైంది.
14 దావీదు, పరిశుద్ధ నిబంధన మందసాన్ని యెరూషలేముకు తీసుకొచ్చిన సంతోషకరమైన సందర్భంలో లేవీయులు ఓ స్తుతి గీతాన్ని పాడారు. ఆ గీతంలోని ఓ ప్రాముఖ్యమైన విషయం గురించి 1 దినవృత్తాంతములు 16:31 వచనం ఇలా చెబుతుంది: “యెహోవా ఏలుచున్నాడని [“రాజయ్యాడని,” NW] జనములలో చాటించుడి.” ‘యెహోవా సకల యుగములలో రాజు కదా, మరైతే ఆయన ఆ కాలంలో ఎలా రాజయ్యాడు?’ అనే ప్రశ్న కొంతమందికి రావచ్చు. యెహోవా తన అధికారాన్ని ఉపయోగించినప్పుడు లేదా తనకు ప్రాతినిధ్యం వహించడానికి ఒకరిని నియమించినప్పుడు రాజవుతాడు. యెహోవా ఎలా రాజవుతాడో అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. దావీదు రాచరికం నిరంతరం నిలిచేవుంటుందని చెబుతూ ఆయన చనిపోవడానికి ముందు యెహోవా ఇలా వాగ్దానం చేశాడు: “నీ గర్భములోనుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి, రాజ్యమును అతనికి స్థిరపరచెదను.” (2 సమూ. 7:12, 13) వెయ్యి కంటె ఎక్కువ సంవత్సరాల తర్వాత దావీదు “సంతతి” లేదా కుమారుడు కనిపించినప్పుడు ఆ వాగ్దానం నిజమైంది. ఇంతకీ ఆయన ఎవరు? ఎప్పుడు రాజయ్యాడు?
యెహోవా ఒక కొత్త రాజును నియమించాడు
15, 16. యేసును రాజుగా దేవుడు ఎప్పుడు అభిషేకించాడు? భూమ్మీదున్నప్పుడు యేసు తన పరిపాలన కోసం ఎలాంటి ఏర్పాట్లు చేసుకున్నాడు?
15 సా.శ. 29వ సంవత్సరంలో బాప్తిస్మమిచ్చు యోహాను, “పరలోకరాజ్యము సమీపించియున్నది” అని ప్రకటించడం మొదలుపెట్టాడు. (మత్త. 3:2) యోహాను యేసుకు బాప్తిస్మం ఇచ్చినప్పుడు, యెహోవా యేసును వాగ్దత్త మెస్సీయగా, తన రాజ్యానికి రాజుగా అభిషేకించాడు. యెహోవా ఒక తండ్రిగా యేసుమీద తనకున్న ఆప్యాయతను వ్యక్తం చేస్తూ, “ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నాను” అని అన్నాడు.—మత్త. 3:17.
16 యేసు తన పరిచర్య అంతటిలో యెహోవాను ఘనపర్చాడు. (యోహా. 17:4) దేవుని రాజ్యం గురించి ప్రకటించడం ద్వారా యేసు ఆ పనిని చేశాడు. (లూకా 4:43) ఆ రాజ్యం రావాలని ప్రార్థించమని కూడా తన శిష్యులకు నేర్పించాడు. (మత్త. 6:9, 10) భవిష్యత్తు రాజుగా యేసు, తన వ్యతిరేకులతో “దేవుని రాజ్యము మీ మధ్యనే యున్నది” అని చెప్పగలిగాడు. (లూకా 17:21) చనిపోవడానికి ముందురోజు రాత్రి యేసు తన అనుచరులతో ‘రాజ్య నిబంధన’ చేశాడు. అలా ఆయన, తన నమ్మకమైన శిష్యుల్లో కొందరికి తనతోపాటు దేవుని రాజ్యంలో రాజులుగా పరిపాలించే గొప్ప అవకాశం ఇచ్చాడు.—లూకా 22:28-30 చదవండి.
17. యేసు ఏ భావంలో మొదటి శతాబ్దంలో పరిపాలించడం మొదలుపెట్టాడు? కానీ ఆయన దేనికోసం వేచివుండాల్సి వచ్చింది?
17 అయితే దేవుని రాజ్యానికి రాజుగా యేసు తన పరిపాలనను ఆ వెంటనే మొదలుపెట్టాడా? లేదు. తర్వాతి రోజు మధ్యాహ్నమే ఆయన చనిపోయాడు, శిష్యులు చెల్లాచెదురైపోయారు. (యోహా. 16:32) అయితే గతంలోలాగే అప్పుడు కూడా పరిస్థితులు యెహోవా నియంత్రణలోనే ఉన్నాయి. మూడవ రోజు ఆయన తన కుమారుణ్ణి పునరుత్థానం చేశాడు. సా.శ. 33 పెంతెకొస్తు రోజున, యేసు తన అభిషిక్త సహోదరులున్న క్రైస్తవ సంఘం మీద ఓ ఆధ్యాత్మిక రాజ్యాన్ని స్థాపించాడు. (కొలొ. 1:13) అయితే వాగ్దాన ‘సంతానంగా’ యేసు ఈ భూమ్మీద పూర్తి అధికారం పొందడానికి వేచివుండాల్సి వచ్చింది. యెహోవా తన కుమారునితో ఇలా అన్నాడు: “నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయువరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము.”—కీర్త. 110:1.
సకల యుగముల రాజును ఆరాధించండి
18, 19. యెహోవా గురించి ఆలోచించడం మనల్ని ఏమి చేసేలా కదిలిస్తుంది? తర్వాతి ఆర్టికల్‌లో మనం ఏమి నేర్చుకుంటాం?
18 వేల సంవత్సరాలుగా యెహోవా రాచరికాన్ని ఆయన శత్రువులు పరలోకంలోనూ భూమ్మీదా సవాలు చేస్తున్నా ఆయనెప్పుడూ తన సర్వాధిపత్యాన్ని వదులుకోలేదు, పరిస్థితులు ఎప్పుడూ ఆయన నియంత్రణలోనే ఉన్నాయి. ఒక ప్రేమగల తండ్రిలా ఆయన నోవహు, అబ్రాహాము, దావీదు వంటి యథార్థవంతులను కాపాడాడు, సంరక్షించాడు. మన రాజుకు లోబడేలా, ఆయనకు మరింత దగ్గరయ్యేలా అది మనల్ని కదిలించడం లేదా?
19 అయితే మనకు ఈ ప్రశ్నలు తలెత్తవచ్చు: యెహోవా మన కాలంలో ఎలా రాజయ్యాడు? యెహోవా రాజ్యానికి నమ్మకస్థులైన పౌరులమని మనం ఎలా నిరూపించుకోవచ్చు? ఆయన విశ్వవ్యాప్త కుటుంబంలో పరిపూర్ణమైన పిల్లలం ఎలా కావచ్చు? దేవుని రాజ్యం రావాలని మనం ప్రార్థిస్తున్నామంటే దానర్థం ఏమిటి? తర్వాతి ఆర్టికల్‌లో వీటికి జవాబులు చూస్తాం.