నేడు ఏడుగురు కాపరులు, ఎనిమిదిమంది ప్రధానులు ఎవరు?
“వాని నెదిరించుటకు మేము ఏడుగురు గొఱ్ఱెలకాపరులను ఎనమండుగురు ప్రధానులను నియమింతుము.”—మీకా 5:5.
1. సిరియా, ఇశ్రాయేలు రాజ్యాలు చేసిన కుట్ర ఎందుకు సఫలం కాదు?
సా.శ.పూ. 762-759 మధ్య కాలంలో ఓసారి ఇశ్రాయేలు రాజు, సిరియా రాజు కలిసి యూదా రాజ్యం మీద యుద్ధం ప్రకటించారు. వాళ్ల లక్ష్యం? యెరూషలేమును ముట్టడించి, రాజైన ఆహాజును గద్దె దింపి ఆయన స్థానంలో బహుశా దావీదు వంశస్థుడు కాని మరో వ్యక్తిని సింహాసనం మీద కూర్చోబెట్టడం. (యెష. 7:5, 6) కానీ ఇశ్రాయేలు రాజు మర్చిపోయిన సంగతేమిటంటే, దావీదు వంశస్థుల్లో ఒకరు ఎప్పటికీ రాజుగా పరిపాలిస్తారని యెహోవా ముందే మాటిచ్చాడు. ఆయన మాట ఎల్లప్పుడూ నెరవేరుతుంది.—యెహో. 23:14; 2 సమూ. 7:16.
2-4. యెషయా 7:14, 16 వచనాలు (ఎ) సా.శ.పూ. 8వ శతాబ్దంలో (బి) సా.శ. మొదటి శతాబ్దంలో ఎలా నెరవేరాయో వివరించండి.
2 మొదట్లో, ఆ రెండు రాజ్యాలు పైచేయి సాధించినట్లే కనిపించింది. ఒక్క యుద్ధంలోనే ఆహాజు సైన్యంలోని 1,20,000 మంది యోధులు చనిపోయారు. “రాజసంతతివాడైన మయశేయా” కూడా చనిపోయాడు. (2 దిన. 28:6, 7) అయితే జరుగుతున్నదంతా యెహోవా చూస్తున్నాడు. దావీదుకు తానిచ్చిన మాటను ఆయన గుర్తుతెచ్చుకున్నాడు, దాంతో ఆయన ప్రవక్తయైన యెషయాతో ఎంతో ప్రోత్సాహానిచ్చే ఒక సందేశాన్ని పంపించాడు.
3 యెషయా ఇలా చెప్పాడు: “ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. . . . కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును ఆ బాలునికి తెలివిరాక మునుపు నిన్ను భయపెట్టు ఆ యిద్దరు రాజుల [సిరియా, ఇశ్రాయేలు] దేశము పాడుచేయబడును.” (యెష. 7:14, 16) ఆ ప్రవచనంలోని మొదటి భాగాన్ని తరచుగా మెస్సీయ పుట్టుకతో ముడిపెడతారు, అలా అన్వయించడం సరైనదే. (మత్త. 1:23) అయితే సా.శ. మొదటి శతాబ్దంలో, “ఇద్దరు రాజుల” వల్ల అంటే సిరియారాజు వల్లగానీ, ఇశ్రాయేలురాజు వల్లగానీ యూదాకు ఎలాంటి ప్రమాదమూ లేదు. కాబట్టి, ఇమ్మానుయేలుకు సంబంధించిన ఆ ప్రవచనం తొలిసారిగా యెషయా కాలంలోనే నెరవేరివుండాలి.
4 యెషయా ఆ ప్రాముఖ్యమైన మాటలు చెప్పిన కొంత కాలానికి ఆయన భార్య గర్భం దాల్చి మగబిడ్డకు జన్మనిచ్చింది, ఆ బిడ్డకు మహేరు షాలాల్హాష్బజ్ అనే పేరు పెట్టారు. యెషయా ప్రవచించిన “ఇమ్మానుయేలు” బహుశా ఈ బిడ్డే అయ్యుంటాడు.a బైబిలు కాలాల్లో ఒక బిడ్డ పుట్టినప్పుడు ఓ ప్రత్యేక సందర్భాన్ని గుర్తుచేసుకోవడానికి ఆ బిడ్డకు ఒక పేరు పెట్టేవాళ్లు, కానీ ఆ తర్వాత తల్లిదండ్రులు, బంధువులు బహుశా మరో పేరు పెట్టి పిలవవచ్చు. (2 సమూ. 12:24, 25) యేసును ఎవరైనా “ఇమ్మానుయేలు” అని పిలిచినట్లు ఎలాంటి దాఖలాలు లేవు.—యెషయా 7:14; 8:3, 4 చదవండి.
5. ఆహాజు రాజు ఎలాంటి తెలివితక్కువ నిర్ణయం తీసుకున్నాడు?
5 ఇశ్రాయేలు, సిరియా రాజ్యాలు యూదా మీద దాడికి సిద్ధమౌతుంటే, మరోవైపు తమ సైనికబలం చూసుకుని విర్రవీగే మరో రాజ్యం ఆ ప్రాంతం మీద కన్నేసింది. అదే, అప్పుడప్పుడే ప్రపంచశక్తిగా ఎదుగుతున్న అష్షూరు. యూదా రాజ్యం మీద దాడి చేసేముందు అష్షూరు, “దమస్కు యొక్క ఐశ్వర్యమును షోమ్రోను దోపుడు సొమ్మును ఎత్తికొని” పోతుందని యెషయా 8:3, 4 వచనాలు చూపిస్తున్నాయి. యెషయా ద్వారా యెహోవా పలికిన మాటలపై నమ్మకం ఉంచకుండా ఆహాజు రాజు అవిశ్వాసంతో అష్షూరుతో తెలివితక్కువ ఒప్పందం కుదుర్చుకున్నాడు, అయితే అది చివరికి అష్షూరు చేతిలో యూదా అణిచివేయబడడానికే దారితీసింది. (2 రాజు. 16:7-10) యూదాకు ఓ నాయకుడిగా, కాపరిగా ఆహాజు తన ప్రజల్ని సరక్షించాల్సివుంది, కానీ అలా చేయడంలో ఆయన ఘోరంగా విఫలమయ్యాడు. మనం ఇలా ప్రశ్నించుకోవచ్చు: ‘ఏదైనా ప్రాముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సివస్తే నేను ఎవరి మీద నమ్మకం పెట్టుకుంటాను? దేవుని మీదా, మనుషుల మీదా?’—సామె. 3:5, 6.
విభిన్న మార్గంలో నడిచే ఓ కొత్త కాపరి
6. ఆహాజుతో పోలిస్తే హిజ్కియా పాలన ఎలా భిన్నంగా ఉంది?
6 సా.శ.పూ. 746లో ఆహాజు చనిపోయిన తర్వాత ఆయన కొడుకైన హిజ్కియా రాజయ్యాడు. అప్పటికే యూదా రాజ్యం ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా దివాలాతీసింది. మరి కొత్తరాజు ప్రథమ కర్తవ్యం ఏమిటి? యూదా ఆర్థికస్థితిని మళ్లీ గాడిలో పెట్టడమా? కాదు. హిజ్కియా దైవభయం గల వ్యక్తి, యూదా దేశానికి సరైన కాపరి. ఆయన చేపట్టిన మొట్టమొదటి పని సత్యారాధనను పునఃస్థాపించి, యెహోవాతో యూదా జనాంగానికున్న బలహీన సంబంధాన్ని పటిష్ఠపర్చడం. తన విషయంలో దేవుని చిత్తమేమిటో అర్థంచేసుకున్నాక హిజ్కియా అసలు వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆయన మనకెంత చక్కని ఆదర్శాన్ని ఉంచాడో కదా!—2 దిన. 29:1-19.
7. హిజ్కియా భరోసా లేవీయులకు ఎందుకు అవసరమైంది?
7 సత్యారాధనను పునఃస్థాపించడంలో లేవీయులది కీలక పాత్ర. అందుకే హిజ్కియా వాళ్ల దగ్గరికి వెళ్లి తన మద్దతు వాళ్లకెప్పుడూ ఉంటుందనే భరోసా ఇచ్చాడు. ఆ సందర్భంలో హిజ్కియా, ‘తనకు పరిచారకులైయుండి, తన సన్నిధిని నిలుచుటకు యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను’ అని నమ్మకస్థులైన ఆ లేవీయులతో అన్నప్పుడు వాళ్లు ఆనందబాష్పాలు రాల్చడాన్ని ఒక్కసారి ఊహించుకోండి. (2 దిన. 29:11) అవును, సత్యారాధనను ప్రోత్సహించాల్సిన బాధ్యత లేవీయులకు ఉంది.
8. యూదా జనాంగాన్ని ఆధ్యాత్మికంగా బలపర్చడానికి హిజ్కియా ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టాడు? వాటి ఫలితం ఏమిటి?
8 హిజ్కియా, పస్కా పండుగను పెద్ద ఎత్తున ఆచరించడం కోసం యూదా, ఇశ్రాయేలు ప్రజలందరినీ ఆహ్వానించాడు. దాని తర్వాత ప్రజలు ఏడు రోజుల పాటు పులియని రొట్టెల పండుగ జరుపుకున్నారు. ప్రజలు ఆ పండుగ సందర్భంగా ఎంతగా ఆనందించారంటే వాళ్లు దాన్ని మరో ఏడు రోజులపాటు జరుపుకున్నారు. బైబిలు ఇలా చెబుతోంది: “యెరూషలేము కాపురస్థులకు మిక్కిలి ఆనందము కలిగెను. ఇశ్రాయేలురాజును దావీదు కుమారుడునైన సొలొమోను కాలమునకు తరువాత ఈలాగున జరిగియుండలేదు.” (2 దిన. 30:25, 26) ఆ ఆధ్యాత్మిక విందు ప్రజలను ఎంతగా కదిలించిందంటే, “ఇదంతయు సమాప్తమైన తరువాత అక్కడనున్న ఇశ్రాయేలువారందరును . . . విగ్రహములను నిర్మూలముచేసి, దేవతాస్తంభములను ముక్కలుగా నరికి, ఉన్నతస్థలములను బలిపీఠములను పడగొట్టిరి” అని 2 దినవృత్తాంతములు 31:1 వచనం చెబుతోంది. అలా యూదా జనాంగం యెహోవాకు మళ్లీ దగ్గరవ్వడం మొదలుపెట్టింది. పైగా త్వరలోనే వాళ్లకు జరగబోయేదాని దృష్ట్యా, అలాంటి ఆధ్యాత్మిక పరిశుభ్రత చాలా ప్రాముఖ్యం.
విపత్తును ఎదుర్కొనేందుకు రాజు సిద్ధపడ్డాడు
9. (ఎ) ఇశ్రాయేలు రాజు పన్నాగం ఎలా బెడిసికొట్టింది? (బి) యూదా విషయంలో సన్హెరీబు మొదట్లో ఎలా విజయం సాధించాడు?
9 యెషయా ముందే చెప్పినట్లుగా అష్షూరీయులు ఉత్తర ఇశ్రాయేలు రాజ్యాన్ని జయించి, దాని ప్రజలను వేరే ప్రాంతాలకు తరలించారు. అలా, దావీదు సింహాసనం మీద వేరే వ్యక్తిని కూర్చోబెట్టాలన్న ఇశ్రాయేలు రాజు పన్నిన పన్నాగం బెడిసికొట్టింది. మరి అష్షూరీయుల పథకం ఏమిటి? అష్షూరీయుల చూపు ఆ తర్వాత యూదాపై పడింది. “రాజైన హిజ్కియా యేలుబడిలో పదునాలుగవ సంవత్సరమందు అష్షూరురాజైన సన్హెరీబు యూదా దేశమందున్న ప్రాకారములుగల పట్టణములన్నిటిమీదికి వచ్చి వాటిని” పట్టుకున్నాడు. సన్హెరీబు 46 యూదా పట్టణాలను స్వాధీనపర్చుకున్నాడు. ఆ కాలంలో మీరు యెరూషలేములో జీవించివుంటే మీకెలా అనిపించివుండేదో ఓసారి ఊహించుకోండి. కదం తొక్కుతున్న అష్షూరు సైన్యం యూదా పట్టణాలను ఒక్కొక్కటిగా చేజిక్కించుకుంటుంది!—2 రాజు. 18:13.
10. మీకా 5:5, 6 వచనాల్లోని మాటలు హిజ్కియాను ఎందుకు ప్రోత్సహించివుంటాయి?
10 అయితే ముంచుకువస్తోన్న విపత్తు గురించి హిజ్కియాకు తెలుసు. కానీ భ్రష్టుడైన తన తండ్రి ఆహాజులా అన్యదేశాల సహాయం కోసం ప్రాకులాడకుండా హిజ్కియా యెహోవా మీద అచంచల విశ్వాసం ఉంచాడు. (2 దిన. 28:20, 21) అష్షూరు గురించి తన సమకాలీనుడైన మీకా ప్రవక్త ప్రవచించిన ఈ మాటలు కూడా హిజ్కియాకు తెలిసుండవచ్చు: ‘వాని [అష్షూరును] నెదిరించుటకు మేము ఏడుగురు గొఱ్ఱెలకాపరులను ఎనమండుగురు ప్రధానులను నియమింతుము. వారు అష్షూరు దేశమును, ఖడ్గముచేత మేపుదురు.’ (మీకా 5:5, 6) ఈ ప్రేరేపిత మాటలు హిజ్కియాను తప్పకుండా ప్రోత్సహించివుంటాయి, ఎందుకంటే అష్షూరీయులను ఎదిరించడానికి అసాధారణమైన ఓ కొత్త సైన్యం వస్తుందని, అది క్రూరులైన అష్షూరీయులను ఓడిస్తుందని ఆ మాటలు చూపిస్తున్నాయి.
11. ఏడుగురు గొఱ్ఱెలకాపరులు, ఎనిమిదిమంది ప్రధానులకు సంబంధించిన ప్రవచనం అత్యంత ప్రాముఖ్యమైన రీతిలో ఎప్పుడు నెరవేరనుంది?
11 ఏడుగురు గొఱ్ఱెలకాపరులు, ఎనిమిదిమంది ప్రధానులకు సంబంధించిన ప్రవచనం, ‘ఇశ్రాయేలీయులను ఏలబోవువాడును, పురాతన కాలము నుండి ఉన్న’ యేసు పుట్టిన చాలాకాలం తర్వాత అత్యంత ప్రాముఖ్యమైన రీతిలో నెరవేరనుంది. (మీకా 5:1, 2 చదవండి.) ఆధునిక కాల “అష్షూరు” వల్ల యెహోవా సేవకుల ఉనికే ప్రశ్నార్థకంగా మారే సమయంలో ఆ ప్రవచనం నెరవేరాల్సివుంది. భయం గొలిపే ఆ శత్రువును ఎదిరించడానికి యేసు ఆధ్వర్యంలోని ఏ సైన్యాన్ని యెహోవా ఉపయోగిస్తాడు? సమాధానం మరికాసేపట్లో తెలుసుకుంటాం. కానీ ముందుగా, అష్షూరీయులు బెదిరించినప్పుడు హిజ్కియా చేసిన పనులను నుండి మనమేమి నేర్చుకోవచ్చో పరిశీలిద్దాం.
హిజ్కియా అవసరమైన చర్యలు చేపట్టాడు
12. దేవుని ప్రజలను కాపాడడానికి హిజ్కియా, ఆయనతో ఉన్నవాళ్లు ఏయే చర్యలు చేపట్టారు?
12 పరిష్కరించడం మనవల్ల కాదని అనిపించే సమస్యలు ఎదురైనప్పుడు అవసరమైన సహాయం చేయడానికి యెహోవా ఎల్లప్పుడూ ముందుంటాడు. అయితే పరిష్కారానికి మనం చేయగలిగినంత చేయాలని ఆయన ఆశిస్తాడు. హిజ్కియా “తన అధిపతులతోను పరాక్రమశాలులతోను” మాట్లాడి, అందరూ కలిసి “పట్టణము బయటనున్న ఊటల నీళ్లను అడ్డవలెనని” ఆలోచన చేశారు. దానితోపాటు హిజ్కియా రాజు ‘ధైర్యము తెచ్చుకొని, పాడైన గోడ యావత్తు కట్టించి, గోపురములవరకు దానిని ఎత్తు చేయించి, బయట మరియొక గోడను కట్టించెను, మరియు ఈటెలను డాళ్లను విస్తారముగా చేయించెను.’ (2 దిన. 32:3-5) అప్పుడున్న తన ప్రజలను కాపాడి, సంరక్షించడం కోసం యెహోవా దేవుడు ఎంతోమంది ధైర్యశాలులను ఉపయోగించాడు. వాళ్లలో హిజ్కియా, ఆయన అధిపతులు, నమ్మకస్థులైన ప్రవక్తలు ఉన్నారు.
13. రాబోయే దాడికి తన ప్రజలను సిద్ధం చేయడానికి హిజ్కియా చేసిన అతి ప్రాముఖ్యమైన పని ఏమిటి? వివరించండి.
13 అయితే నీళ్లను అడ్డగించడం, పట్టణపు గోడలను బలపర్చడం కన్నా ఎంతో ప్రాముఖ్యమైన పనిని హిజ్కియా ఆ తర్వాత చేశాడు. ఒక శ్రద్ధగల కాపరిగా హిజ్కియా ప్రజలందరినీ సమకూర్చి, ఈ మాటలను చెప్పి వాళ్లను ఆధ్యాత్మికంగా బలపర్చాడు: “మీరు దిగులుపడకుడి, ధైర్యము విడువకుడి; అష్షూరు రాజుకు మీరు భయపడవద్దు, విస్మయమొందవద్దు, అతనికి కలిగియున్న సహాయముకంటె ఎక్కువ సహాయము మనకు కలదు. మాంససంబంధమైన బాహువే అతనికి అండ; మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు.” యెహోవా తన ప్రజల తరఫున పోరాడతాడు, ఆ మాటే విశ్వాసాన్ని ఎంతగా బలపరుస్తుందో కదా! ఆ మాటలు విన్న యూదులు “యూదారాజైన హిజ్కియా చెప్పిన మాటలయందు నమ్మికయుంచిరి.” యెహోవా తన ప్రజల కోసం పోరాడతాడని హిజ్కియా వాళ్లకు గుర్తుచేశాడు. దానివల్లే ప్రజలు దేవుని మీద విశ్వాసం పెంచుకుని, ధైర్యంగా ఉండగలిగారు. యెహోవా తన ప్రవక్త ద్వారా ముందే తెలియజేసినట్లుగా, హిజ్కియా, ఆయన అధిపతులు, మరితర శూరులు అలాగే మీకా, యెషయా ప్రవక్తలు ఆ సందర్భంలో మంచి కాపరులుగా సేవ చేశారు.—2 దిన. 32:7, 8; మీకా 5:5, 6 చదవండి.
ప్రజలను విశ్వాసంతో, ధైర్యంతో ఉండమని హిజ్కియా ప్రోత్సహించాడు (12, 13 పేరాలు చూడండి)
14. రబ్షాకే ఏం చేశాడు? దానికి ప్రజలు ఎలా స్పందించారు?
14 అష్షూరు రాజు, యెరూషలేముకు నైరుతిదిశలో ఉన్న లాకీషు పట్టణంలో దిగాడు. అక్కడి నుండి తన ముగ్గురు రాయబారులను పంపించి యెరూషలేము ప్రజలను లొంగిపొమ్మని ఆజ్ఞ జారీచేశాడు. వాళ్లలో ముఖ్యుడైన రబ్షాకే రకరకాలైన కుయుక్తుల్ని ఉపయోగించాడు. అతను హెబ్రీ భాషలో మాట్లాడుతూ, హిజ్కియా మాటలను పట్టించుకోకుండా అష్షూరీయులకు లోబడమని ప్రజలను ప్రోత్సహించాడు, అలాచేస్తే వాళ్లు సుఖంగా జీవించేలా మరో దేశానికి తీసుకెళ్తానని అబద్ధపు ప్రమాణం చేశాడు. (2 రాజులు 18:31, 32 చదవండి.) ఇతర దేశాల దేవుళ్లు తమ ఆరాధకులను ఎలాగైతే కాపాడలేకపోయారో అలాగే యెహోవా కూడా అష్షూరీయుల కబందహస్తాల నుండి యూదుల్ని విడిపించలేడని అతను వాదించాడు. అయితే ప్రజలు మాత్రం తెలివిగా అతని తప్పుడు ఆరోపణలకు బదులివ్వడానికి చూడలేదు, నేటి యెహోవా సేవకులు కూడా అలాగే చేస్తారు.—2 రాజులు 18:35, 36 చదవండి.
15. యెరూషలేము నివాసులు ఏమి చేయాల్సివుంది? యెహోవా ఆ పట్టణాన్ని ఎలా రక్షించాడు?
15 హిజ్కియా ఈ విషయం గురించి ఆందోళన పడినా, వేరేదేశాల సాయం అర్థించకుండా ప్రవక్తయైన యెషయా వద్దకు మనుషులను పంపించాడు. యెషయా హిజ్కియాకు ఇలా చెప్పాడు: “అతడు [సన్హెరీబు] ఈ పట్టణములోనికి రాడు; దానిమీద ఒక బాణమైన ప్రయోగింపడు.” (2 రాజు. 19:32) యెరూషలేము నివాసులు చేయాల్సిందల్లా ధైర్యంగా ఉండడమే. యూదా తరఫున యెహోవాయే పోరాడతాడు. పోరాడాడు కూడా! “ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండు పేటలో జొచ్చి లక్ష యెనుబది యయిదు వేలమందిని హతముచేసెను.” (2 రాజు. 19:35) అలా హిజ్కియా, పట్టణం బయట నీళ్లను అడ్డగించడంవల్లో, పట్టణపు గోడలను ఎత్తు చేయించడంవల్లో కాదుగానీ యెహోవా సహాయం వల్లే యూదాకు రక్షణ వచ్చింది.
నేడు మనకు పాఠాలు
16. నేడు (ఎ) యెరూషలేము నివాసులు (బి) “అష్షూరు” (సి) ‘ఏడుగురు గొఱ్ఱెలకాపరులు, ఎనిమిదిమంది ప్రధానులు’ ఎవరిని సూచిస్తున్నారు?
16 ఏడుగురు గొఱ్ఱెలకాపరులు, ఎనిమిదిమంది ప్రధానులకు సంబంధించిన ప్రవచనం నేడు మనకాలంలో మరింత గొప్పగా నెరవేరనుంది. అప్పుడు యెరూషలేము నివాసులమీద అష్షూరు దాడి చేసింది. సమీప భవిష్యత్తులో యెహోవా ప్రజల మీద ఆధునిక కాల “అష్షూరు” దాడి చేయనుంది. వాళ్ల లక్ష్యం యెహోవా ప్రజలను పూర్తిగా తుడిచిపెట్టేయడమే. లేఖనాలు ఆ దాడిని అలాగే “మాగోగు దేశపువాడగు గోగు” దాడిని, “ఉత్తరదేశపు రాజు” చేసే దాడిగా, “భూరాజులు” చేసే దాడిగా వర్ణిస్తున్నాయి. (యెహె. 38:2, 10-13; దాని. 11:40, 44, 45; ప్రక. 17:14; 19:19) ఇవి వేర్వేరు దాడులని ఆ మాటలకర్థమా? కాకపోవచ్చు. బైబిలు కొన్నిసార్లు ఒకే దాడిని వేర్వేరు పేర్లతో పిలుస్తుంది. క్రూర శత్రువైన “అష్షూరు” మీదకు యెహోవా ఏ సైన్యాన్ని రేపుతాడని మీకా ప్రవచనం సూచిస్తుంది? చాలా అసాధారణమైన సైన్యాన్ని అంటే ‘ఏడుగురు గొఱ్ఱెలకాపరులను, ఎనిమిదిమంది ప్రధానులను’ ఆయన ఉపయోగిస్తాడు. (మీకా 5:5) శత్రుదుర్భేద్యమైన ఈ సైన్యంలోని ‘గొఱ్ఱెలకాపరులు, ప్రధానులు’ సంఘపెద్దలే. (1 పేతు. 5:2) తన అమూల్యమైన గొర్రెలను కాయడానికీ, ఆధునిక కాల “అష్షూరు” చేసే దాడులను తట్టుకునేలా తన ప్రజలను బలపర్చడానికీ యెహోవా ఆధ్యాత్మిక పురుషులను నేడు సమృద్ధిగా దయచేశాడు.b ‘వారు అష్షూరు దేశాన్ని ఖడ్గముచేత మేపుతారు’ అని మీకా ప్రవచనం చెబుతుంది. (మీకా 5:6) అవును వాళ్ల దగ్గరున్న ‘యుద్ధోపకరణాల్లో’ దేవుని వాక్యమనే ‘ఆత్మ ఖడ్గం’ ఉంది.—2 కొరిం. 10:4; ఎఫె. 6:17.
17. మనం పరిశీలించిన వృత్తాంతం నుండి పెద్దలు ఏ నాలుగు విషయాలు నేర్చుకోవచ్చు?
17 పెద్దలారా, ఇప్పటివరకూ పరిశీలించిన వృత్తాంతం నుండి మీరు కొన్ని ఉపయోగపడే పాఠాలు నేర్చుకోవచ్చు, అవి: (1) రాబోయే “అష్షూరు” దాడిని తట్టుకునేలా సిద్ధపడడానికి మీరు చేయాల్సిన అతి ముఖ్యమైన పని మీ విశ్వాసాన్ని బలపర్చుకోవడం, అలాగే తోటి సహోదరులకు కూడా తమ విశ్వాసాన్ని బలపర్చుకునేలా సహాయం చేయడం. (2) “అష్షూరు” దాడి చేసినప్పుడు, యెహోవా మనల్ని రక్షిస్తాడనే అచంచల విశ్వాసం మీకు ఉండాలి. (3) ఆ సమయంలో యెహోవా సంస్థ మీకిచ్చే కొన్ని నిర్దేశాలు ఆచరణాత్మకమైనవిగా కనిపించకపోవచ్చు. మనుషుల దృష్టిలో ఆచరణాత్మకంగా ఉన్నా లేకపోయినా, సంస్థ ఇచ్చే ఎలాంటి నిర్దేశాలనైనా పాటించడానికి మనమందరం సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే వాటికి లోబడడం వల్ల మనం ప్రాణాల్ని రక్షించుకుంటాం. (4) లోకం అందించే విద్యపై, ఆస్తిపాస్తులపై, లేక మానవ సంస్థలపై నమ్మకం పెట్టుకునే ప్రతీ ఒక్కరు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవడానికి ఇదే సమయం. విశ్వాసంలో అటూఇటూ ఊగుతున్న ప్రతి ఒక్కరికీ సహాయం చేయడానికి మీరు సంసిద్ధంగా ఉండాలి.
18. ఈ వృత్తాంతాన్ని ధ్యానించడం వల్ల భవిష్యత్తులో మనం ఎలా ప్రయోజనం పొందవచ్చు?
18 హిజ్కియా కాలంలో యెరూషలేము పట్టణంలో చిక్కుకున్న యూదుల్లా మనం కూడా నిస్సహాయులంగా కనిపించే సమయం రానుంది. హిజ్కియా చెప్పిన మాటల నుండి ఆ సమయంలో మనందరం ప్రోత్సాహాన్ని పొందుదాం. “మాంససంబంధమైన బాహువే” మన శత్రువులకు ఉంది, అయితే “మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు” అనే విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుందాం.—2 దిన. 32:8.
a యెషయా 7:14లోని “కన్యక” అని అనువదించిన హెబ్రీ పదం పెళ్లయిన స్త్రీని లేదా పెళ్లికాని కన్యను సూచించవచ్చు. అలా ఆ పదం యెషయా భార్యకూ అలాగే యూదా కన్యకయైన మరియకు కూడా వర్తిస్తుంది.
b లేఖనాల్లో 7 అనే సంఖ్య తరచుగా సంపూర్ణతను సూచిస్తుంది. 8 అనే సంఖ్య (7 కంటే ఒకటి ఎక్కువ) కొన్నిసార్లు సమృద్ధిని సూచిస్తుంది.