ఎన్నడూ ‘యెహోవా మీద కోపగించుకోకండి’
“ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును, అట్టివాడు హృదయమున యెహోవామీద కోపించును.”—సామె. 19:2, 3.
1, 2. మానవాళి సమస్యలకు మనం యెహోవాను ఎందుకు నిందించకూడదు? ఉదాహరణతో చెప్పండి.
మీరు ఎన్నో సంవత్సరాలుగా సంతోషకరమైన వివాహ జీవితాన్ని గడుపుతున్నారనుకుందాం. అయితే, ఒక రోజు మీరు ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇళ్లంతా చిందరవందరగా ఉంది. కుర్చీలు, టేబుల్లు అన్నీ విరిగిపోయాయి, మీరు అందంగా అలంకరించుకున్న వస్తువులన్నీ పగిలిపోయాయి, తివాచి బాగుచేయలేనంతగా చిరిగిపోయింది. మీరు ఎంతో అపురూపంగా చూసుకుంటున్న ఇల్లు విపత్తు బాధిత ప్రాంతంలా తయారైంది. అప్పుడు మీరు, “నా భార్య ఎందుకిలా చేసింది?” అని అరుస్తారా? లేక “ఇదంతా ఎవరు చేశారు?” అని అడుగుతారా? నిస్సందేహంగా ఆ రెండవ ప్రశ్నే మీ మనసులో వస్తుంది. ఎందుకు? ఎందుకంటే, మీ ప్రియమైన భార్య అలాంటి విధ్వంసాన్ని సృష్టించదని మీకు తెలుసు.
2 మానవాళి గృహమైన ఈ భూమి ఇప్పుడు కాలుష్యంతో, దౌర్జన్యంతో, అనైతికతతో పాడైపోయింది. ఆ సమస్యలన్నిటికీ కారణం యెహోవా కాదని బైబిలు విద్యార్థులమైన మనకు తెలుసు. ఆయన ఈ భూగ్రహాన్ని ఓ అందమైన పరదైసుగా సృష్టించాడు. (ఆది. 2:8, 15) యెహోవా ప్రేమాస్వరూపి. (1 యోహా. 4:8) లేఖనాలను అధ్యయనం చేయడం వల్ల, లోకంలోని ఎన్నో కష్టాలకు అసలు కారణం “ఈ లోకాధికారి” అయిన అపవాదియగు సాతానే అని మనం గుర్తించగలిగాం.—యోహా. 14:30; 2 కొరిం. 4:4.
3. మన ఆలోచనా తీరు ఎలా పాడుకావచ్చు?
3 అలాగని మనకు వచ్చే ప్రతీ కష్టానికి సాతానును నిందించలేం. ఎందుకు? ఎందుకంటే, కొన్ని కష్టాలకు మన సొంత తప్పులే కారణం కావచ్చు. (ద్వితీయోపదేశకాండము 32:4-6 చదవండి.) ఒకవేళ మనం ఆ వాస్తవాన్ని ఒప్పుకున్నా, మన అపరిపూర్ణత మన ఆలోచనా తీరును పాడుచేసి, మనల్ని చివరకు విపత్కర పరిస్థితికి నడిపించవచ్చు. (సామె. 14:12) ఎలా? ఒకానొక సమస్యకు మనల్ని మనం నిందించుకోవడమో, సాతానును నిందించడమో చేసే బదులు మనం యెహోవాను నిందించడం మొదలుపెట్టే ప్రమాదం ఉంది. ఆఖరికి మనం, ‘యెహోవా మీదే కోపగించుకుంటామేమో.’—సామె. 19:3.
4, 5. ఓ క్రైస్తవుడు ఎలా ‘యెహోవా మీద కోపించే’ ప్రమాదం ఉంది?
4 మనం నిజంగానే ‘యెహోవా మీద కోపగించుకునే’ ప్రమాదం ఉందా? అదే గనుక చేస్తే, అంతకంటే ఘోరమైన విషయం మరొకటి ఉండదు. (యెష. 41:11) ఒకవేళ అలా చేసినా మనం ఏమి సాధిస్తాం? ఒకసారి ఓ కవి ఇలా అన్నాడు: “దేవునితో బాక్సింగ్ చేయడానికి మన చేతులు సరిపోవు.” మనం ఎన్నడూ యెహోవాకు విరుద్ధంగా ఫిర్యాదు చేసేంత దూరం వెళ్లకపోవచ్చు. కానీ, సామెతలు 19:2, 3 చెబుతున్నట్లు “ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును, అట్టివాడు హృదయమున యెహోవామీద కోపించును.” అవును, ఓ వ్యక్తి తన హృదయంలో యెహోవాపై కోపించే ప్రమాదం ఉంది. మనకు తెలియని విధానాల్లో ఆ వైఖరి మనల్ని ప్రభావితం చేయవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే, ఓ వ్యక్తి యెహోవా మీదే పగ పెట్టుకునే ప్రమాదం ఉంది. దాని ఫలితంగా, ఆ వ్యక్తి సంఘం వదిలివెళ్లడమో, లేదా సంఘంలో ఉన్నా యెహోవా ఆరాధనా ఏర్పాట్లకు పూర్తిగా మద్దతునివ్వకపోవడమో జరగవచ్చు.
5 ‘యెహోవా మీద కోపించే’ పరిస్థితికి ఏది దారితీయవచ్చు? ఆ ఉరిని మనం ఎలా తప్పించుకోవచ్చు? మనం ఆ ప్రశ్నలకు జవాబు తెలుసుకోవడం ఎంతో అవసరం. ఎందుకంటే, అవి యెహోవాతో మనకున్న సంబంధంపై నేరుగా ప్రభావం చూపిస్తాయి.
‘యెహోవా మీద కోపించే’ పరిస్థితికి ఏది దారితీయవచ్చు?
6, 7. మోషే కాలంలోని ఇశ్రాయేలీయులు యెహోవా మీద ఎందుకు ఫిర్యాదు చేయడం మొదలుపెట్టారు?
6 తన దేవునికి విరుద్ధంగా ఫిర్యాదు చేయాలనే ఆలోచన ఓ నమ్మకమైన సేవకుని హృదయంలో ఎలా మొలకెత్తుతుంది? దానికి సంబంధించిన ఐదు కారణాలు పరిశీలించి, గతంలో కొంతమంది ఆ ఉరిలో ఎలా చిక్కుకున్నారో తెలియజేసే బైబిలు ఉదాహరణలను విశ్లేషిద్దాం.—1 కొరిం. 10:11, 12.
ఇతరులు చెప్పే ప్రతికూలమైన మాటలు వింటే యెహోవాతో మనకున్న సంబంధం బీటలువారుతుంది (7వ పేరా చూడండి)
7 ఇతరుల ప్రతికూల మాటల వల్ల మనం ఆ ఉరిలో చిక్కుకోవచ్చు. (ద్వితీయోపదేశకాండము 1:26-28 చదవండి.) ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి విడుదలై అప్పుడే వచ్చారు. తమను అణచివేసిన ఐగుప్తీయుల మీదకు యెహోవా అద్భుతరీతిలో పది తెగుళ్లు తీసుకొచ్చి ఫరోను, అతని సైన్యాన్ని ఎర్ర సముద్రంలో నాశనం చేశాడు. (నిర్గ. 12:29-32, 51; 14:29-31; కీర్త. 136:15) దేవుని ప్రజలు వాగ్దాన దేశంలోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ, ప్రాముఖ్యమైన ఆ సమయంలో ఇశ్రాయేలీయులు యెహోవా గురించి ఫిర్యాదు చేయడం మొదలుపెట్టారు. వాళ్ల అవిశ్వాసానికి కారణం ఏమిటి? వాగ్దాన దేశాన్ని చూడడానికి యెహోషువ పంపించిన వేగులవాళ్లలో కొందరు ప్రతికూలంగా మాట్లాడినందువల్ల ఇశ్రాయేలీయుల ధైర్యం చెడింది. (సంఖ్యా. 14:1-4) ఫలితం? ఓ తరం మొత్తాన్ని యెహోవా వాగ్దాన దేశంలోకి అడుగుపెట్టనివ్వలేదు. (ద్వితీ. 1:34-36) ఇశ్రాయేలీయుల్లానే, మనం కూడా ఇతరుల ప్రతికూలమైన మాటల్ని బట్టి మన విశ్వాసాన్ని నీరుగార్చుకొని, యెహోవా వ్యవహారాల గురించి సణిగే ప్రమాదం ఉందా?
8. యెషయా కాలంలోని దేవుని ప్రజలు తమ స్థితిని బట్టి ఎందుకు యెహోవాను నిందించడం మొదలుపెట్టారు?
8 కష్టాలు, ఒడిదుడుకులు మనల్ని నిరుత్సాహపర్చవచ్చు. (యెషయా 8:21, 22 చదవండి.) యెషయా కాలంలో యూదా జనాంగం తీవ్రమైన ఇబ్బందుల్లో చిక్కుకుంది. శత్రువులు చుట్టుముట్టారు. ఆహార కొరత వచ్చింది. ఎంతోమంది ఆకలితో అలమటించారు. అంతకంటే ప్రాముఖ్యంగా అక్కడ ఆధ్యాత్మిక కరువు ఏర్పడింది. (ఆమో. 8:11) ఆ కష్టకాలంలో సహాయం కోసం యెహోవా వైపు చూసే బదులు వాళ్లు తమ రాజును, తమ దేవుణ్ణి ‘శపించడం’ మొదలుపెట్టారు. అవును, వాళ్లు తమ సమస్యలకు యెహోవాను నిందించారు. ఏదైనా దుర్ఘటన లేదా వ్యక్తిగత సమస్యలు ఎదురైనప్పుడు వాళ్లలాగే మనం కూడా, ‘నాకు సహాయం అవసరమైనప్పుడు యెహోవా ఎక్కడ ఉన్నాడు?’ అని మన హృదయంలో అనుకుంటామా?
9. యెహెజ్కేలు కాలంలోని ఇశ్రాయేలీయులు తప్పుడు దృక్పథాన్ని ఎందుకు పెంపొందించుకున్నారు?
9 మనకు పూర్తి వాస్తవాలు తెలియవు. పూర్తి వాస్తవాలు తెలియక యెహెజ్కేలు కాలంలోని ఇశ్రాయేలీయులు “యెహోవా మార్గము న్యాయముకాదని” భావించారు. (యెహె. 18:29) అదెలా ఉందంటే, వాళ్లు యెహోవా న్యాయ ప్రమాణాలకన్నా తమ న్యాయ ప్రమాణాలే గొప్పవని ఎంచి, తమను తాము దేవుని మీద తీర్పరులుగా చేసుకొని, పరిస్థితుల మీద తమకున్న పరిమిత అవగాహనతో యెహోవాకే తీర్పుతీర్చినట్టుగా ఉంది. మనం కూడా ఒకానొక బైబిలు వృత్తాంతం అర్థంకాకపోవడం వల్ల లేదా మన జీవితంలో చోటుచేసుకుంటున్న సంఘటనల వెనకున్న కారణం తెలియకపోవడం వల్ల మన హృదయంలో “యెహోవా మార్గము న్యాయముకాదని” భావిస్తామా?—యోబు 35:2.
10. కొందరు ఎలా ఆదాము చేసినలాంటి తప్పే చేస్తున్నారు?
10 మన సొంత పాపాలకు, తప్పులకు ఇతరులను నిందిస్తుంటాం. మానవ చరిత్ర ఆరంభంలోనే, ఆదాము తాను చేసిన తప్పుకు దేవుణ్ణి నిందించాడు. (ఆది. 3:12) పర్యవసానాలన్నీ తెలిసి కూడా ఆదాము కావాలనే దేవుని ఆజ్ఞను అతిక్రమించి, దానికి దేవుణ్ణి నిందించాడు. ఒక విధంగా, యెహోవా తనకు మంచి భార్యను ఇవ్వలేదని ఆదాము అన్నాడు. అప్పటినుండి, ప్రజలు ఆదాములా తమ సొంత తప్పులకు దేవుణ్ణి నిందిస్తున్నారు. మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవాలి: ‘నా తప్పుల వల్ల కలిగిన నిరాశను బట్టి, చికాకును బట్టి యెహోవా ప్రమాణాల విషయంలో అసంతృప్తి చెందుతానా?’
11. యోనా నుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు?
11 మనం మన గురించి మాత్రమే ఆలోచించడం మొదలుపెడతాం. నీనెవె వాసుల విషయంలో యెహోవా కనికరంతో తీసుకున్న నిర్ణయం యోనాకు నచ్చలేదు. (యోనా 4:1-3) ఎందుకు? నీనెవె నాశనం గురించి తాను చేసిన ప్రకటన నెరవేరనప్పుడు, బహుశా ఆయన తన పరువు గురించే ఎక్కువగా ఆలోచించాడు. యోనా తన పేరుప్రతిష్ఠల గురించి ఎంతగా చింతించాడంటే, పశ్చాత్తాపపడిన నీనెవె వాసుల పట్ల తను చూపించాల్సిన కనికరాన్ని చూపించలేకపోయాడు. యోనాలా మనం కూడా, దేవుడు అంతాన్ని త్వరగా తీసుకురావడం లేదని ‘ఆయన మీద కోపగించుకునేంతగా’ మనగురించి మనం ఆలోచిస్తామా? యెహోవా దినము త్వరలో రానుందని బహుశా కొన్ని దశాబ్దాలుగా మనం ప్రకటిస్తుండవచ్చు. మనం ప్రకటిస్తున్న ఆ బైబిలు సందేశాన్ని బట్టి ఇతరులు మనల్ని కించపర్చినప్పుడు మనం యెహోవా మీద అసహనాన్ని ప్రదర్శిస్తామా?—2 పేతు. 3:3, 4, 9.
‘యెహోవా మీద కోపగించుకునే’ పరిస్థితి రాకుండా ఎలా చూసుకోవచ్చు?
12, 13. యెహోవా చేసే కొన్ని పనులను మన హృదయంలో ప్రశ్నించడం మొదలుపెట్టే పరిస్థితి వస్తే, మనం దేన్ని నిర్లక్ష్యం చేయకూడదు?
12 మన పాపభరిత హృదయం, యెహోవా చేసే కొన్ని పనులను ప్రశ్నించడం మొదలుపెడితే మనమేమి చేయవచ్చు? అలా ప్రశ్నించడం తెలివితక్కువ పనే అవుతుందని గుర్తుంచుకోండి. సామెతలు 19:3 మరో అనువాదంలో ఇలా ఉంది: “మనిషి మూర్ఖం అతడి నడతను తారుమారు చేస్తుంది. అప్పుడతడి హృదయం యెహోవాకు వ్యతిరేకంగా రెచ్చిపోతుంది.” (పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం) ఆ విషయాన్ని మనసులో ఉంచుకుని, మన జీవితంలో ఎదురయ్యే చికాకుల వల్ల మనం యెహోవాను నిందించకుండా ఉండేందుకు సహాయం చేసే ఐదు అంశాలను ఇప్పుడు చూద్దాం.
13 యెహోవాతో మీకున్న సంబంధాన్ని నిర్లక్ష్యం చేయకండి. మనం దేవునితో సన్నిహిత సంబంధాన్ని కలిగివుంటే, ఆయన మీద కోపం ప్రదర్శించేందుకు మొగ్గుచూపం. (సామెతలు 3:5, 6 చదవండి.) మనం యెహోవా మీద నమ్మకం ఉంచాలి. అంతేకాకుండా, మనమే జ్ఞానులమని అనుకుంటూ, కేవలం మన గురించే ఆలోచించేవాళ్లంగా ఉండకూడదు. (సామె. 3:7; ప్రసం. 7:16) అలాగైతేనే, కీడు జరిగినప్పుడు మనం యెహోవాను నిందించకుండా ఉండగలుగుతాం.
14, 15. ఇతరుల ప్రతికూల మాటల వల్ల తప్పుదోవ పట్టకుండా ఉండాలంటే మనమేమి చేయాలి?
14 ఇతరుల ప్రతికూల మాటల వల్ల తప్పుదోవ పట్టకండి. వాగ్దాన దేశంలోకి యెహోవా తప్పకుండా తీసుకెళ్తాడని నమ్మేందుకు మోషే కాలంలోని ఇశ్రాయేలీయులకు కావాల్సినన్ని రుజువులు ఉన్నాయి. (కీర్త. 78:43-53) విశ్వాసం కొరవడిన పదిమంది వేగులవాళ్లు తెచ్చిన ప్రతికూల నివేదికను విన్నప్పుడు ఇశ్రాయేలీయులు ‘ఆయన బాహుబలమును స్మరణకు తెచ్చుకొనలేదు.’ (కీర్త. 78:42) యెహోవా మనకు చేసిన మేలంతటిని గుర్తుచేసుకుంటూ, ఆయన చేసిన కార్యాలను ధ్యానిస్తే, ఆయనతో మన సంబంధం మరింత బలపడుతుంది. అప్పుడే, మనం ఇతరుల ప్రతికూల అభిప్రాయాలను బట్టి యెహోవాతో మనకున్న సంబంధాన్ని బీటలువారనియ్యం.—కీర్త. 77:11, 12.
15 తోటి విశ్వాసుల పట్ల మనకు ప్రతికూల వైఖరి ఉంటే అప్పుడేంటి? అలాంటి పరిస్థితుల్లో యెహోవాతో మనకున్న సంబంధం పాడైపోయే ప్రమాదం ఉంది. (1 యోహా. 4:20) ఇశ్రాయేలీయులు అహరోను నియామకాన్ని, స్థానాన్ని ప్రశ్నించినప్పుడు, వాళ్ల నిర్వాకాన్ని చూసి వాళ్లు తనమీదే సణిగినట్లు యెహోవా భావించాడు. (సంఖ్యా. 17:10) అదే విధంగా, భూసంబంధమైన సంస్థను నడిపించడానికి యెహోవా ఉపయోగించుకుంటున్న వాళ్ల మీద సణిగితే మనం యెహోవాకు విరుద్ధంగా ఫిర్యాదు చేసినట్లే.—హెబ్రీ. 13:7, 17.
16, 17. సమస్యలు వచ్చినప్పుడు మనం ఏమి గుర్తుంచుకోవాలి?
16 మన సమస్యలకు కారణం యెహోవా కాదని గుర్తుంచుకోండి. యెషయా కాలంలోని ఇశ్రాయేలీయులు యెహోవాను విడిచిపెట్టినా, ఆయన మాత్రం వాళ్లకు సహాయం చేయాలనుకున్నాడు. (యెష. 1:16-19) మనం ఎలాంటి సమస్యను ఎదుర్కొన్నా, యెహోవా మనపై శ్రద్ధ చూపిస్తాడనే, సహాయం చేస్తాడనే విషయం మనకు ఓదార్పును ఇస్తుంది. (1 పేతు. 5:7) నిజానికి, సమస్యలను తట్టుకుని నిలబడేందుకు కావాల్సిన బలాన్ని ఇస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు.—1 కొరిం. 10:13.
17 నమ్మకమైన యోబులా మనం కూడా ఏదో ఒకరకమైన అన్యాయానికి గురైతే, దానికి యెహోవా బాధ్యుడు కాడని మనం గుర్తుచేసుకోవాలి. యెహోవా అన్యాయాన్ని ద్వేషిస్తాడు; నీతిని ప్రేమిస్తాడు. (కీర్త. 33:5) యోబు స్నేహితుడైన ఎలీహులా మనం కూడా ఇలా ఒప్పుకుందాం: “దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము.” (యోబు 34:10) యెహోవా మనకు సమస్యలను తీసుకురాడు కానీ, “శ్రేష్ఠమైన ప్రతి యీవియు సంపూర్ణమైన ప్రతి వరమును” అనుగ్రహిస్తాడు.—యాకో. 1:13, 17.
18, 19. మనం ఎందుకు యెహోవాను ఎన్నడూ అనుమానించకూడదు? ఉదాహరణతో చెప్పండి.
18 ఎన్నడూ యెహోవాను అనుమానించకండి. దేవుడు పరిపూర్ణుడు, ఆయన ఆలోచనలు మన ఆలోచనల కంటే ఎంతో గొప్పవి. (యెష. 55:8, 9) కాబట్టి మనం వినయంతో, అణకువతో మన అవగాహన పరిమితమైనదని గుర్తించాలి. (రోమా. 9:20) ఒకానొక పరిస్థితికి సంబంధించి మన దగ్గర అన్ని వాస్తవాలు ఉండవు. నిస్సందేహంగా మీరు ఈ సామెత నిజమేనని అనుభవపూర్వకంగా తెలుసుకొని ఉంటారు: “వ్యాజ్యెమందు వాది పక్షము న్యాయముగా కనబడును, అయితే ఎదుటివాడు వచ్చినమీదట వాని సంగతి తేటపడును.”—సామె. 18:17.
19 మీ నమ్మకమైన స్నేహితుడు చేసిన ఒక పని మొదట్లో మీకు అర్థంకాకపోవచ్చు లేదా విచిత్రంగా అనిపించవచ్చు. వెంటనే, అతడు తప్పు చేశాడని మీరు నిందిస్తారా? లేక అతడు అలా చేసి ఉండడని నమ్మకాన్ని వ్యక్తం చేస్తారా? ముఖ్యంగా ఆ వ్యక్తి గురించి ఎంతో కాలంగా తెలిసి ఉంటే మీరు అతణ్ణి తప్పకుండా నమ్ముతారు. అపరిపూర్ణుడైన స్నేహితుణ్ణే మనం అంతగా నమ్మితే, మన మార్గాల కంటే, తలంపుల కంటే ఎంతో ఉన్నతమైన మార్గాలు, తలంపులు ఉన్న మన పరలోక తండ్రిని ఇంకెంత నమ్మాలి!
20, 21. మన సమస్యలకు అసలు కారణాన్ని మనం ఎందుకు గుర్తుంచుకోవాలి?
20 మన సమస్యలకు అసలు కారణాన్ని గుర్తుంచుకోండి. మనకు వచ్చే కొన్ని సమస్యలకు మనమే బాధ్యులం కావచ్చు. అదే నిజమైతే, మనం దాన్ని ఒప్పుకోవాలి. (గల. 6:7) మన సమస్యలకు యెహోవాను నిందించకూడదు. అలా నిందించడం ఎందుకు భావ్యం కాదు? ఒక ఉదాహరణను పరిశీలిద్దాం: ఒక కారుకు చాలా వేగంతో దూసుకెళ్లే సామర్థ్యం ఉండవచ్చు. అయితే, డ్రైవరు ఓ మలుపు దగ్గర నిర్దేశిత వేగం కన్నా ఎక్కువ వేగంతో దూసుకెళ్లి కారు బోల్తాపడి నుజ్జునుజ్జు అయ్యిందే అనుకోండి. జరిగిన ప్రమాదానికి కారు ఉత్పత్తిదారుణ్ణి బాధ్యునిగా చేయడం భావ్యమేనా? కానేకాదు! అలాగే, యెహోవా మనల్ని సృష్టించినప్పుడు ఆయన మనకు స్వేచ్ఛాచిత్తాన్ని ఇచ్చాడు. తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి కావాల్సిన నిర్దేశాలు కూడా ఆయన మనకు ఇచ్చాడు. కాబట్టి, మన తప్పులకు ఆయనను నిందించడం దేనికి?
21 నిజానికి మన సమస్యలన్నిటికీ మన పొరపాట్లే, తప్పుడు నిర్ణయాలే కారణం కాకపోవచ్చు. కొన్ని సంఘటనలు “అనూహ్యంగా, కాలవశము చేత” జరుగుతాయి. (ప్రసం. 9:11, NW) అన్నిటికన్నా ముఖ్యంగా, దుష్టత్వానికి అసలు కారకుడు అపవాదియైన సాతానే అన్న వాస్తవాన్ని మనం ఎన్నడూ మర్చిపోవద్దు. (1 యోహా. 5:19; ప్రక. 12:9) అసలైన శత్రువు అతడే, యెహోవా కాదు!—1 పేతు. 5:8.
యెహోవాతో ఉన్న అమూల్యమైన బంధాన్ని విలువైనదిగా ఎంచండి
యెహోవా మీద నమ్మకం ఉంచినందుకు యెహోషువ, కాలేబులు దీవెనలు పొందారు (22వ పేరా చూడండి)
22, 23. సమస్యల వల్ల మనం నిరుత్సాహపడినప్పుడు, మనమేమి గుర్తుంచుకోవాలి?
22 మీరు కష్టాలతో, సమస్యలతో బాధపడుతున్నప్పుడు యెహోషువ, కాలేబుల ఉదాహరణను గుర్తుచేసుకోండి. పదిమంది ఇతర వేగులవాళ్లలా కాకుండా, నమ్మకమైన ఆ ఇద్దరు వ్యక్తులు సానుకూలమైన వార్తను మోసుకొచ్చారు. (సంఖ్యా. 14:6-9) వాళ్లు యెహోవా మీద విశ్వాసం చూపించారు. అయినా గానీ, వాళ్లు మిగతా ఇశ్రాయేలు జనాంగంతో పాటు 40 సంవత్సరాలు అరణ్యంలో తిరగాల్సి వచ్చింది. అది అన్యాయమని భావించి యెహోషువ, కాలేబులు యెహోవా మీద ఫిర్యాదు చేశారా? కోప్పడ్డారా? లేదు. వాళ్లు యెహోవా మీద నమ్మకం ఉంచారు. మరి దానికి యెహోవా వాళ్లను దీవించాడా? అందులో సందేహమే లేదు! ఓ తరంలోని వాళ్లంతా అరణ్యంలో చనిపోయినా, వీళ్లిద్దరు మాత్రం వాగ్దానదేశంలో అడుగుపెట్టారు. (సంఖ్యా. 14:30) అలాగే, మనం కూడా యెహోవా చిత్తం చేయడంలో ‘విసుగు’ చెందకుండా ముందుకు సాగితే యెహోవా ఆశీస్సులు పొందుతాం.—గల. 6:9; హెబ్రీ. 6:10.
23 సమస్యల వల్ల, ఇతరుల అపరిపూర్ణతల వల్ల లేదా సొంత అపరిపూర్ణతల వల్ల మనం నిరుత్సాహపడితే ఏం చేయాలి? యెహోవా అద్భుతమైన లక్షణాల మీద దృష్టి నిలపండి. యెహోవా మీకు ఇచ్చిన నిరీక్షణ నిజమైనట్లు ఊహించుకోండి. ‘యెహోవా సహాయం లేకపోతే నా పరిస్థితి ఎలా ఉండేది?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఎల్లప్పుడూ ఆయనకు సన్నిహితంగా ఉండండి, మీ హృదయంలో ఎన్నడూ యెహోవా మీద కోపగించుకోకండి!