కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w13 6/15 పేజీలు 7-11
  • యెహోవా లక్షణాల పూర్తి విలువను గుర్తించండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా లక్షణాల పూర్తి విలువను గుర్తించండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా స్నేహశీలి
  • అందరూ విలువిచ్చే లక్షణం
  • అందుబాటులో ఉండాలి
  • యెహోవా నిష్పక్షపాతి
  • మనం యెహోవాను అనుకరించవచ్చు
  • మన నిష్పక్షపాత దేవున్ని మీరు అనుకరిస్తున్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • యెహోవాలా నిష్పక్షపాతంగా ఉండండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • యెహోవాలా వినయం చూపించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • యెహోవా నిష్పక్షపాతాన్ని అనుకరించండి
    మన రాజ్య పరిచర్య—1999
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
w13 6/15 పేజీలు 7-11

యెహోవా లక్షణాల పూర్తి విలువను గుర్తించండి

“మీరు ప్రియులైన పిల్లలవలె దేవునిపోలి నడుచుకొనుడి.”—ఎఫె. 5:1.

మీ జవాబు ఏమిటి?

  • యెహోవా లక్షణాల పట్ల మన అభిమానాన్ని ఎలా పెంచుకోవచ్చు?

  • ఒక వ్యక్తి స్నేహశీలిగా తయారుకావాలంటే ఏమి చేయాలి?

  • యెహోవా నిష్పక్షపాత వైఖరిని మనమెలా అనుకరించవచ్చు?

1. (ఎ) యెహోవాకున్న ఏ లక్షణాల గురించి ఒక క్రైస్తవుడు పరిశీలించవచ్చు? (బి) దేవుని లక్షణాలను పరిశీలించడం వల్ల మనం ఎలా ప్రయోజనం పొందవచ్చు?

యెహోవా వ్యక్తిత్వం గురించి ఆలోచించినప్పుడు, మీకు ముందుగా ఏ లక్షణాలు గుర్తుకొస్తాయి? చాలామందికి వెంటనే గుర్తుకొచ్చేవి ఆయన ప్రేమ, న్యాయం, జ్ఞానం, శక్తి. అయితే, యెహోవాకు ఇంకెన్నో ఆకర్షణీయమైన లక్షణాలు ఉన్నాయని మనకు తెలుసు. నిజానికి, యెహోవా లక్షణాల జాబితాను తయారుచేస్తే అవి 40 పైచిలుకే ఉంటాయి. ఆ వేర్వేరు లక్షణాల్లో ఒక్కోదాని గురించి మన ప్రచురణల్లో చర్చించుకున్నాం కూడా. మన వ్యక్తిగత లేదా కుటుంబ అధ్యయనంలో యెహోవా వ్యక్తిత్వం గురించి ఎన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవచ్చో ఒకసారి ఆలోచించండి! అలాంటి అధ్యయనం నుండి మనం ఏయే రకాలుగా ప్రయోజనం పొందవచ్చు? అది మన పరలోక తండ్రి పట్ల మనకున్న అభిమానాన్ని అధికం చేస్తుంది. యెహోవా పట్ల మనకు ఎంత ఎక్కువ అభిమానం ఉంటే, అంత ఎక్కువగా ఆయనకు సన్నిహితం అవ్వాలని, ఆయనను అనుకరించాలని కోరుకుంటాం.—యెహో. 23:8; కీర్త. 73:28.

2. (ఎ) యెహోవా లక్షణాల పట్ల అభిమానం పెంచుకోవడం ఎలాగో ఉదాహరణతో చెప్పండి. (బి) మనం ఏమి పరిశీలిస్తాం?

2 ఏదైనా ఒకదాన్ని అభిమానించడం అంటే దాని సరైన విలువను గుర్తించడం. అయితే, అది మెల్లమెల్లగా జరిగే ప్రక్రియ. ఉదాహరణకు, ఓ కొత్త వంటకం పట్ల మన ఇష్టం అంతకంతకూ ఎలా పెరుగుతుందో ఆలోచించండి. ముందుగా దాని ఘుమఘుమలకు మైమరచిపోతాం. ఆ తర్వాత ఆ వంటకంలోని ప్రతీ ముద్దను ఆస్వాదిస్తాం. చివరికి మనమే దాన్ని వండడం మొదలుపెడతాం. అదేవిధంగా యెహోవా లక్షణాల పట్ల అభిమానాన్ని పెంచుకోవాలంటే మనం ఆయన లక్షణాలను తెలుసుకోవాలి, ధ్యానించాలి, అలవర్చుకోవాలి. (ఎఫె. 5:1) ఆయన ప్రధాన లక్షణాల గురించి కాకుండా మనం చాలా అరుదుగా జ్ఞాపకం చేసుకునే ఇతర లక్షణాల పట్ల మన అభిమానాన్ని పెంచేందుకే ఈ ఆర్టికల్‌ను, అలాగే తర్వాతి రెండు ఆర్టికల్స్‌ను రూపొందించారు. ఒక్కో లక్షణం గురించి ఈ విషయాలు పరిశీలిస్తాం: ఆ లక్షణానికున్న అర్థం ఏమిటి? యెహోవా దాన్ని ఎలా చూపిస్తున్నాడు? దాన్ని చూపించే విషయంలో మనం ఆయనను ఎలా అనుకరించవచ్చు?

యెహోవా స్నేహశీలి

3, 4. (ఎ) ఎలాంటి వాళ్లను స్నేహశీలురు అంటారు? (బి) తాను స్నేహశీలినని యెహోవా మనకెలా అభయమిస్తున్నాడు?

3 ముందుగా మనం స్నేహశీలత గురించి చూద్దాం. ఎలాంటి వాళ్లను స్నేహశీలురు అంటారు? ‘అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ, అందరికి అందుబాటులో ఉంటూ, కలుపుగోలుగా ఉండే వాళ్లను’ స్నేహశీలురు అంటామని మీరు చెప్పవచ్చు. ఒక వ్యక్తి మాట తీరును బట్టి, అలాగే ఆయన శరీర భాషలోని హావభావాలను, ముఖకవళికలను, సంజ్ఞలను బట్టి ఆయన స్నేహశీలుడో కాడో చెప్పవచ్చు.

4 తాను స్నేహశీలినని యెహోవా ఎలా చూపిస్తున్నాడు? అనంత విశ్వాన్ని సృష్టించిన యెహోవా సర్వశక్తిమంతుడే అయినా, మన ప్రార్థనలు వినేందుకు, వాటికి జవాబిచ్చేందుకు ఆయన ఎంతో సుముఖంగా, సంసిద్ధంగా ఉంటానని అభయమిస్తున్నాడు. (కీర్తన 145:18; యెషయా 30:18, 19 చదవండి.) మనం యెహోవాతో ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎంతసేపైనా మాట్లాడవచ్చు. ఆయన మనల్ని గద్దించడని మనకు తెలుసు కాబట్టి ఆయనతో ఎప్పుడైనా భయం-బెరుకు లేకుండా మాట్లాడవచ్చు. (కీర్త. 65:2; యాకో. 1:5) సహాయం కోసం మనం యెహోవా దగ్గరకు వెళ్లొచ్చని చూపించడానికి బైబిలు ఆయనకు మానవ రూపం ఉన్నట్టు వర్ణిస్తోంది. ఉదాహరణకు, ‘యెహోవా దృష్టి నీతిమంతులమీద ఉన్నది,’ “నీ కుడిచేయి నన్ను ఆదుకొనుచున్నది” అని కీర్తనకర్త దావీదు రాశాడు. (కీర్త. 34:15; 63:8) “తన బాహువుతో గొఱ్ఱెపిల్లలను కూర్చి, రొమ్మున ఆనించుకొని మోయును” అని అంటూ యెషయా ప్రవక్త యెహోవాను గొర్రెల కాపరితో పోల్చాడు. (యెష. 40:11) ఒకసారి ఊహించుకోండి! శ్రద్ధగల గొర్రెలకాపరి గుండెలకు ఆనుకొని వెచ్చగా సేదదీరే చిన్న గొర్రెపిల్లలా మనం కూడా తనకు అత్యంత సమీపంగా ఉండాలని యెహోవా కోరుకుంటాడు. ఎంతటి స్నేహశీలుడైన తండ్రి మనకున్నాడో కదా! ఈ విషయంలో మనం ఆయనను ఎలా అనుకరించవచ్చు?

అందరూ విలువిచ్చే లక్షణం

5. సంఘ పెద్దలు స్నేహశీలురుగా ఉండడం ఎందుకు ప్రాముఖ్యం?

5 కొంతకాలం కిందట, వేర్వేరు ఖండాల్లో జీవిస్తున్న ఉత్సాహవంతులైన సాక్షులను ఈ ప్రశ్న అడిగారు: “సంఘ పెద్దల్లో మీకు బాగా నచ్చే లక్షణం ఏమిటి?” వాళ్లలో అత్యధికులు, “స్నేహశీలత” అని జవాబిచ్చారు. ప్రతీ క్రైస్తవుడు సాధ్యమైనంత పూర్తిగా ఆ లక్షణాన్ని అలవర్చుకోవాలి. అయితే, సంఘ పెద్దలకు అది ఇంకా ప్రాముఖ్యం. (యెష. 32:1, 2) ఈ లక్షణం ఎంతో ప్రాముఖ్యమని తనకు అనిపించడానికి గల ఒక కారణాన్ని చెబుతూ ఓ సహోదరి ఇలా అంది: “ఒక సంఘపెద్ద స్నేహశీలిగా ఉంటేనే ఆయనకున్న ఇతర సుగుణాల నుండి మనం ప్రయోజనం పొందుతాం.” ఆమె మాటల్లోని తాత్పర్యమేంటో గమనించారా? ఇంతకీ ఒక వ్యక్తిని స్నేహశీలిగా చేసేది ఏమిటి?

6. ఇతరులు మనల్ని స్నేహశీలురుగా చూడాలంటే మనం ఏమి చేయాలి?

6 ఇతరులు మనల్ని స్నేహశీలురుగా చూడాలంటే మనం వాళ్ల పట్ల నిజమైన శ్రద్ధాసక్తులను కనబర్చాలి. ఒక సంఘ పెద్ద ఇతరుల పట్ల శ్రద్ధను కనబరుస్తూ, వాళ్ల కోసం స్వయంత్యాగ స్ఫూర్తిని చూపించినప్పుడు, పిల్లలతో సహా సంఘంలోని వాళ్లందరూ ఆయనలోని ఈ మంచి లక్షణాన్ని గమనిస్తారు. (మార్కు 10:13-16) పన్నెండేళ్ల కార్లోస్‌ చెప్పిన మాటను గమనించండి: “రాజ్యమందిరంలో సంఘ పెద్దలు ఆప్యాయంగా పలకరిస్తూ చిరునవ్వుతో కనిపిస్తారు. వాళ్లలో నాకు నచ్చేది అదే.” ఓ సంఘపెద్ద తాను స్నేహశీలినని చెప్పుకుంటే సరిపోదు కానీ, తన క్రియల్లో ఆ లక్షణాన్ని చూపించాలి. (1 యోహా. 3:18) ఎలా?

7. మన సమావేశపు బ్యాడ్జి తరచూ సంభాషణ మొదలు కావడానికి ఎందుకు తోడ్పడుతుంది? దాని నుండి ఏ పాఠం నేర్చుకోవచ్చు?

7 దాన్ని అర్థంచేసుకోవడానికి ఓ పోలిక చూద్దాం. కొన్నాళ్ల క్రితం, విదేశంలో ఓ సమావేశానికి హాజరై విమానంలో ఇంటికి వెళ్తున్న ఒక సహోదరుడు తాను పెట్టుకున్న సమావేశపు బ్యాడ్జిని అలాగే ఉంచుకున్నాడు. “దేవుని రాజ్యము వచ్చుగాక!” అని ఆ బ్యాడ్జి మీద రాసివుండడాన్ని చూసిన ఫ్లైట్‌ అటెండెంట్‌ మన సహోదరునితో “అవును, అది వచ్చుగాక. దాని గురించి మనం ఇంకాస్త మాట్లాడుకోవాలి” అని అన్నాడు. తర్వాత, వాళ్లిద్దరి మధ్య సంభాషణ సాగి, చివరకు ఫ్లైట్‌ అటెండెంట్‌ సంతోషంగా మన పత్రికలను తీసుకున్నాడు. మనలో చాలామందికి అలాంటి అనుభవాలే ఉన్నాయి. ఇప్పుడు ఆలోచించండి, అసలు మన సమావేశపు బ్యాడ్జి తరచూ సంభాషణ మొదలవ్వడానికి ఎందుకు తోడ్పడుతుంది? ఎందుకంటే అది, “నాతో మాట్లాడడానికి సంకోచించకండి. నేనెక్కడికి వెళ్తున్నానో అడగండి” అని ప్రజలను ఆహ్వానిస్తుంది. మన నమ్మకాల గురించి మాట్లాడడానికి సుముఖంగా ఉన్నామని ప్రజలకు చూపించేందుకు ఆ బ్యాడ్జి ఓ దృశ్య సంకేతంగా పనిచేస్తుంది. అదే విధంగా, “నాతో మాట్లాడడానికి సంకోచించకండి” అని తమ తోటి విశ్వాసులను ఆహ్వానించే దృశ్య సంకేతాల్ని క్రైస్తవ పెద్దలు ధరించాలి. వాటిలో కొన్ని ఏమిటి?

8. సహోదరసహోదరీల పట్ల నిజమైన శ్రద్ధ ఉందని సంఘపెద్దలు ఎలా చూపిస్తారు? దానివల్ల సంఘానికి ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది?

8 దేశ సంస్కృతులు వేరైనా, సాధారణంగా ఓ చల్లని చిరునవ్వు, ఆత్మీయత ఉట్టిపడే కరచాలనం, ప్రశాంతమైన పలకరింపు వంటివి చేసినప్పుడు మనకు సహోదరసహోదరీల పట్ల నిజమైన శ్రద్ధ ఉందని చెప్పకనే చెబుతాం. అవి చేయడానికి చొరవ తీసుకోవాల్సింది ఎవరు? యేసు చేసిన దాన్ని గమనించండి. శిష్యులతో జరిపిన ఓ సమావేశం గురించి నివేదిస్తూ, “యేసు వారియొద్దకు వచ్చి” మాట్లాడాడని మత్తయి రాశాడు. (మత్త. 28:18) యేసులాగే, పెద్దలు కూడా చొరవ తీసుకుని తోటి విశ్వాసుల దగ్గరకు వెళ్లి వాళ్లతో మాట్లాడతారు. అలా చొరవ తీసుకోవడం వల్ల సంఘానికి ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది? 88 ఏళ్ల ఓ పయినీరు సహోదరి ఇలా అంది: “రాజ్యమందిరంలో అడుగుపెడుతుండగా సంఘపెద్దలు నన్ను చిరునవ్వుతో పలకరించి ప్రోత్సాహకరంగా మాట్లాడినప్పుడు, అది నన్ను వాళ్లకు మరింత చేరువ చేస్తుంది.” మరో నమ్మకమైన సహోదరి ఇలా అంది: “చూడడానికి ఇది చాలా చిన్న విషయంగా కనిపించవచ్చు కానీ, కూటాలకు వచ్చినప్పుడు ఓ సంఘపెద్ద చిరునవ్వుతో సాదరంగా లోపలికి ఆహ్వానించడం నాకు చాలా గొప్ప విషయం.”

అందుబాటులో ఉండాలి

9, 10. (ఎ) యెహోవా ఏ అత్యుత్తమ మాదిరి ఉంచాడు? (బి) సంఘపెద్దలు ఇతరులకు ఎలా అందుబాటులో ఉండవచ్చు?

9 మనం అందుబాటులో లేకుండా స్నేహశీలురుగా ఉండలేము. ఈ విషయంలో యెహోవా అత్యుత్తమ మాదిరి. “ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు.” (అపొ. 17:26, 27) సంఘపెద్దలు కూటాలకు ముందు, తర్వాత అన్ని వయసుల సహోదరసహోదరీలతో మాట్లాడడానికి సమయం తీసుకున్నప్పుడు తాము అందరికి అందుబాటులో ఉన్నామని చూపించగలుగుతారు. ఓ పయినీరు సహోదరుడు ఇలా అన్నాడు: “ఓ సంఘపెద్ద నా బాగోగులు అడిగి, నా జవాబు కోసం ఆగినప్పుడు ఆయన నాకెంతో విలువిస్తున్నాడని నాకు అనిపిస్తుంది.” దాదాపు 50 ఏళ్లుగా యెహోవా సేవ చేస్తున్న ఓ సహోదరి ఇలా అంది: “కూటాల తర్వాత, సంఘపెద్దలు కొంత సమయం తీసుకొని నాతో మాట్లాడినప్పుడు, వాళ్లు నన్ను విలువైన దానిగా ఎంచుతున్నారనిపిస్తుంది.”

10 క్రైస్తవ కాపరులకు వేరే బాధ్యతలు కూడా ఉంటాయన్నది వాస్తవమే. అయినా, వాళ్లు కూటాలప్పుడు గొర్రెలపై శ్రద్ధ చూపించడమే ప్రథమ లక్ష్యంగా పెట్టుకోవాలి.

యెహోవా నిష్పక్షపాతి

11, 12. (ఎ) నిష్పక్షపాతంగా ఉండడం అంటే ఏమిటి? (బి) నిష్పక్షపాతంగా వ్యవహరించడంలో యెహోవా మనకు ఎలా ఆదర్శంగా ఉన్నాడు?

11 యెహోవాకున్న మరో ఆకర్షణీయమైన లక్షణం నిష్పక్షపాతం. నిష్పక్షపాతంగా ఉండడం అంటే ఏమిటి? వివక్ష చూపకుండా, తరతమ భేదం లేకుండా నిజాయితీగా వ్యవహరించడం. సిసలైన నిష్పక్షపాతంలో రెండు అంశాలు ఉంటాయి: మనోవైఖరి, చర్యలు. ఆ రెండు ఎందుకు అవసరం? ఒక వ్యక్తి మనోవైఖరి నిష్పక్షపాతంగా ఉంటేనే ఆయన అందరితో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాడు. క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో, “నిష్పక్షపాతి” అనే పదబంధానికి “ముఖమును లక్ష్యపెట్టనివాడు” అనే అర్థం ఉంది. (అపొ. 10:34, కింగ్డమ్‌ ఇంటర్లీనియర్‌) నిష్పక్షపాతంగా వ్యవహరించే వ్యక్తి, ఒకరి బాహ్య రూపాన్ని బట్టి లేదా వాళ్ల పరిస్థితులను బట్టి కాదుగానీ, వాళ్ల వ్యక్తిత్వాల్ని బట్టి తగిన గౌరవాన్ని ఇస్తాడు.

12 నిష్పక్షపాతంగా వ్యవహరించే విషయంలో యెహోవాకు ఎవ్వరూ సాటిరారు. “దేవుడు పక్షపాతి కాడు,” “ఆయన నరులముఖమును లక్ష్యపెట్టనివాడు” అని బైబిలు చెబుతోంది. (అపొస్తలుల కార్యములు 10:34, 35; ద్వితీయోపదేశకాండము 10:17 చదవండి.) మోషే కాలంలో తలెత్తిన ఓ పరిస్థితిని చూస్తే అది తేటతెల్లమౌతుంది.

దేవుని నిష్పక్షపాత వైఖరికి ఉన్న విలువను సెలోపెహాదు కూతుళ్లు గుర్తించారు (13, 14 పేరాలు చూడండి)

13, 14. (ఎ) సెలోపెహాదు ఐదుగురు కూతుళ్లకు ఎలాంటి చిక్కొచ్చి పడింది? (బి) యెహోవా నిష్పక్షపాతంగా ఎలా వ్యవహరించాడు?

13 ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలోకి అడుగుపెట్టే ముందు, అవివాహితులైన ఐదుగురు అక్కాచెల్లెళ్లకు ఓ చిక్కొచ్చి పడింది. ఏమిటది? ఇతర ఇశ్రాయేలీయుల కుటుంబాలకు వచ్చినట్టే, తమ కుటుంబానికి కూడా తమ తండ్రి పేరున ఉన్న భూమి వస్తుందని ఆ అక్కాచెల్లెళ్లకు తెలుసు. (సంఖ్యా. 26:52-55) అయితే, మనష్షే గోత్రానికి చెందిన తమ తండ్రి సెలోపెహాదు మరణించాడు. పద్ధతి ప్రకారం, ఆస్తిని పొందే హక్కు సెలోపెహాదు కొడుకులకే రావాలి. కానీ ఆయనకు అందరూ కూతుళ్లే. (సంఖ్యా. 26:33) మరి వారసత్వ ఆస్తిని పొందే మగ సంతానం లేనందుకు, ఆ కుటుంబ స్వాస్థ్యం బంధువులకు పోవాల్సిందేనా? కూతుళ్లకు మొండి చెయ్యేనా?

14 ఆ ఐదుగురు అక్కాచెల్లెళ్లు మోషే దగ్గరకు వెళ్లి, “అతనికి కుమారులు లేనంత మాత్రముచేత మా తండ్రిపేరు అతని వంశములోనుండి మాసిపోనేల?” అని అడిగారు. “మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయుమని” అర్థించారు. ‘యెహోవా నియమానికి మినహాయింపులేమీ లేవు’ అని మోషే వాళ్లకు చెప్పాడా? లేదు కానీ, “మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి” చేశాడు. (సంఖ్యా. 27:2-5) అప్పుడు యెహోవా ఎలా స్పందించాడు? “సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము. నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి అధీనముచేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెందచేయవలెను” అని అన్నాడు. అంతేకాదు, ఆ మినహాయింపునే నియమంగా మారుస్తూ మోషేకు ఇలా చెప్పాడు: “ఒకడు కుమారుడు లేక మృతి బొందినయెడల మీరు వాని భూస్వాస్థ్యమును వాని కుమార్తెలకు చెందచేయవలెను.” (సంఖ్యా. 27:6-8; యెహో. 17:1-6) అప్పటినుండి, అదే సమస్య వచ్చిన ఇశ్రాయేలు స్త్రీలందరికీ ఆ నియమం స్వాస్థ్యాన్ని పొందే హక్కును కల్పించింది.

15. (ఎ) యెహోవా తన ప్రజలతో, ముఖ్యంగా నిస్సహాయ స్థితిలో ఉన్నవాళ్లతో ఎలా వ్యవహరిస్తాడు? (బి) యెహోవా నిష్పక్షపాతి అని బైబిల్లో ఉన్న ఏ ఇతర వృత్తాంతాలు చూపిస్తున్నాయి?

15 అది ఎంతటి నిష్పక్షపాతమైన, దయగల తీర్పో కదా! మెరుగైన పరిస్థితులు ఉన్న ఇతర ఇశ్రాయేలీయులతో వ్యవహరించినట్లే, నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ స్త్రీలతో కూడా యెహోవా గౌరవంగా వ్యవహరించాడు. (కీర్త. 68:5) యెహోవా తన సేవకులందరితో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాడని చూపించేందుకు ఇది మచ్చుకు ఒకటి మాత్రమే.—1 సమూ. 16:1-13; అపొ. 10:30-35, 44-48.

మనం యెహోవాను అనుకరించవచ్చు

16. నిష్పక్షపాత వైఖరిని ఎలా పెంపొందించుకోవచ్చు?

16 మనం యెహోవాను ఎలా అనుకరించవచ్చు? నిష్పక్షపాతంగా వ్యవహరించడంలో రెండు అంశాలు ఉన్నాయని గుర్తుంచుకోండి. మనం నిష్పక్షపాతంగా ఉంటేనే మనం ఇతరులతో పక్షపాతం లేకుండా వ్యవహరిస్తాం. మనంపెద్దమనసుతో, నిష్పక్షపాతంగా ఉంటామని మన గురించి మనం అనుకోవచ్చు. కానీ, మన స్వభావాన్ని ఉన్నదున్నట్టుగా మనకై మనం అంచనా వేసుకోలేమని మీకూ తెలుసు. కాబట్టి, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తామనే పేరు మనకు ఉందో లేదో ఎలా తెలుసుకోవచ్చు? తన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని అనిపించినప్పుడు యేసు తన నమ్మకమైన స్నేహితుల్ని ఇలా అడిగాడు: “మనుష్యకుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారు?” (మత్త. 16:13, 14) కాబట్టి, ఈ విషయంలో మనం యేసును అనుసరిస్తే బాగుంటుంది కదా? నిష్పక్షపాతంగా వ్యవహరిస్తామనే పేరు మనకు ఉందో లేదో తెలుసుకోవడానికి, నిర్మొహమాటంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేసే స్నేహితుణ్ణి అడగవచ్చు. మనలో ఏ మూలనో జాతి, కుల, ఆర్థిక తారతమ్యాలు ఇంకా పొడచూపుతున్నాయని ఆయన చెబితే మీరేమి చేయాలి? మీ భావోద్వేగాలను యెహోవా ముందు కుమ్మరించండి, తనలా పూర్తిస్థాయిలో నిష్పక్షపాతంగా వ్యవహరించడానికి మీ ఆలోచనావిధానంలో కావాల్సిన మార్పు చేసుకోవడానికి సహాయం చేయమని యెహోవాను అభ్యర్థించండి.—మత్త. 7:7, 8; కొలొ. 3:9-11.

17. ఇతరులతో మనమెలా నిష్పక్షపాతంగా వ్యవహరించవచ్చు?

17 క్రైస్తవ సంఘంలో గౌరవంతో, ప్రేమపూర్వక దయతో వ్యవహరించినప్పుడు యెహోవాలా నిష్పక్షపాతంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చూపిస్తాం. ఉదాహరణకు, ఆతిథ్యం ఇచ్చే విషయమే తీసుకోండి. బీదలు, అనాథలు, విధవరాళ్లు అనే భేదం లేకుండా తోటి విశ్వాసుల్లో అన్నిరకాల ప్రజలకు, అలాగే ఇతర నేపథ్యాల వాళ్లకు మనం ఆతిథ్యం ఇవ్వాలనుకుంటాం. (గలతీయులు 2:10; యాకోబు 1:27 చదవండి.) అంతేకాక, రాజ్య ప్రకటనా పని చేస్తున్నప్పుడు మనం విదేశీయులతో సహా అన్ని రకాల నేపథ్యాల వాళ్లతో నిష్పక్షపాతంగా సువార్తను పంచుకుంటాం. దాదాపు 600 భాషల్లో బైబిలు సాహిత్యం అందుబాటులో ఉన్నందుకు మనమెంత సంతోషిస్తున్నాం! అది నిష్పక్షపాతానికి నిలువెత్తు సాక్ష్యం కాదంటారా?

18. యెహోవా స్నేహశీలతను, నిష్పక్షపాత వైఖరిని అభిమానిస్తున్నామని మీరెలా చూపిస్తారు?

18 నిజానికి, యెహోవా ఎంత స్నేహశీలుడో, ఎంత నిష్పక్షపాతో సమయం తీసుకొని ధ్యానిస్తే, ఆయనపట్ల మన అభిమానం రెట్టింపౌతుంది. అప్పుడు, యెహోవా లక్షణాల్ని పూర్తిగా అనుకరించాలనే, అలాగే తోటి విశ్వాసులతో, మన సువార్తను వినే ప్రజలతో వ్యవహరిస్తున్నప్పుడు వాటిని చూపించాలనే ప్రేరణ మనలో కలుగుతుంది.

“తనకు మొఱ్ఱపెట్టువారికందరికి . . . యెహోవా సమీపముగా ఉన్నాడు.”—కీర్త. 145:18. (9వ పేరా చూడండి)

“ఆయన నరులముఖమును లక్ష్యపెట్టనివాడు.”—ద్వితీ. 10:17. (17వ పేరా చూడండి)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి