“అసాధ్యం!” అంటే ఏమిటి?
పంతొమ్మిది వందల పన్నెండులో ప్రయాణం ప్రారంభించిన టైటానిక్ ఆ కాలంలో అతిపెద్ద, విలాసవంతమైన ఓడ. అత్యాధునిక శాస్త్ర పరిజ్ఞానంతో రూపొందించడం వల్ల అది ఎట్టి పరిస్థితుల్లోనూ “మునిగిపోదు” అనుకున్నారు. కానీ, ఆ తర్వాత ఏమి జరిగిందో మొత్తం ప్రపంచానికి తెలుసు. దాని మొదటి ప్రయాణంలోనే అది ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో ఒక మంచు పర్వతాన్ని ఢీకొని, దానిలో ప్రయాణిస్తున్న దాదాపు 1,500 మందితో సహా మునిగిపోయింది. మునిగిపోవడం అసాధ్యం అనుకున్న ఓడ సముద్ర గర్భంలో కలిసిపోవడానికి ఎంతో సమయం పట్టలేదు.
“అసాధ్యం” అనే మాటను మనం రకరకాలుగా వాడుతూ ఉంటాం. మనం తట్టుకోలేని పరిస్థితి గురించి, మనం చేయలేని పని గురించి లేదా మనకు అర్థంకాని దాని గురించి చెప్పేటప్పుడు అసాధ్యం అనే పదాన్ని ఉపయోగిస్తాం. ఆధునిక సాంకేతిక ఆవిష్కరణల్లో అనేకం ఒకప్పుడు అసాధ్యం అనిపించినవే, ఎందుకంటే ఆ రోజుల్లో మనిషికి వాటిని సాధించేంత సామర్థ్యం లేదు, కనీసం వాటి గురించి తెలుసుకునేంత సామర్థ్యం కూడా లేదు. అంతెందుకు, కేవలం 50 సంవత్సరాలు వెనక్కి వెళ్తే, మనిషి చంద్రుని మీద అడుగు పెట్టడం, అంగారక గ్రహం మీదికి ఒక యంత్రాన్ని పంపించి భూమ్మీది నుండే దాన్ని నియంత్రించడం, మానవ జన్యు రహస్యాలను వెలికితీయడం, మన ఊర్లోనైనా సప్త సముద్రాల అవతలైనా ఏదైనా సంఘటన జరుగుతుండగానే దాన్ని చూడడం వంటివన్నీ అప్పుడు అసాధ్యాలే, కానీ అవన్నీ ఇప్పుడు జగమెరిగిన సత్యాలు. అమెరికా మాజీ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ విజ్ఞానశాస్త్రంలోని వేర్వేరు రంగాల్లో ప్రసిద్ధులైన కొంతమందితో మాట్లాడుతూ ఆ విషయాన్నే క్లుప్తంగా ఇలా చెప్పాడు: “మీరు సాంకేతిక పరిజ్ఞానాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ నిన్న అసాధ్యం అనిపించినవాటిని నేడు సాధారణ వాస్తవాలుగా మార్చేశారు.”
మనిషి సాధిస్తున్న ఆశ్చర్యకరమైన అనేక అంశాలకు సంబంధించి ప్రొఫెసర్ జాన్ బ్రోబెక్ ఇలా అన్నాడు: “ఇకపై ఏ శాస్త్రవేత్తా ఫలానాది జరగడం అసాధ్యమని ఖచ్చితంగా చెప్పలేడు. అలా జరగకపోవచ్చు అని మాత్రమే చెప్పగలడు. కానీ మన ప్రస్తుత జ్ఞానానికి అంతుబట్టే మాటల్లో దాన్ని వివరించడం అసాధ్యమని మాత్రం చెప్పవచ్చు.” జరిగింది ఏదైనా మనకు అసాధ్యం అనిపిస్తే, “జీవశాస్త్రంలో గానీ, శరీర ధర్మశాస్త్రంలో గానీ ప్రస్తావించబడని ఒక శక్తి వల్ల జరిగిందని చెప్పవచ్చు. దాన్నే మన లేఖనాలు దేవుని శక్తి అంటున్నాయి” అని ఆ ప్రొఫెసర్ అన్నాడు.
దేవునికి సమస్తం సాధ్యమే
ప్రొఫెసర్ బ్రోబెక్ ఈ విషయం చెప్పడానికి చాలాకాలం ముందే, ఇప్పటివరకు జీవించినవాళ్లలో అందరి కన్నా మహాగొప్ప మనిషిగా పేరొందిన నజరేయుడైన యేసు, “మనుష్యులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములు” అన్నాడు. (లూకా 18:27) దేవుని పరిశుద్ధాత్మ ఈ విశ్వంలోనే అత్యంత బలమైన శక్తి. దాన్ని ఏ సాంకేతిక పద్ధతుల్లోనూ కొలవలేము. మనకు అసాధ్యమైన పనుల్ని చేసే శక్తిని పరిశుద్ధాత్మ ద్వారా మనం పొందవచ్చు.
అధిగమించడం అసాధ్యం అనిపించే కష్టాలు మానవులమైన మనకు సాధారణంగా ఎదురౌతుంటాయి. ఉదాహరణకు, మనకు ఇష్టమైన వ్యక్తి చనిపోవచ్చు లేదా కలిసి జీవించడం కష్టమనిపించేంతగా వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఎదురవ్వవచ్చు. బహుశా మన జీవితంలోని పరిస్థితులు మనల్ని తీవ్ర నిరాశానిస్పృహలకు గురిచేయవచ్చు. మనం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామనిపించవచ్చు. అలాంటప్పుడు మనం ఏమి చేయవచ్చు?
ఒక వ్యక్తి సర్వశక్తిగల దేవుణ్ణి సంతోషపెట్టడానికి తాను చేయగలిగినదంతా చేస్తూ ఆయనపై విశ్వాసముంచి, ఆయన పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేస్తే అధిగమించడం అసాధ్యం అనిపించేలాంటి ఆటంకాలను కూడా అధిగమించడానికి కావలసిన సహాయం పొందుతాడని బైబిలు చెబుతోంది. యేసు ఇలా భరోసా ఇచ్చాడు: “ఎవడైనను ఈ కొండను చూచి—నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి, తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినయెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.” (మార్కు 11:23) దేవుని వాక్యంలోని శక్తి, ఆయన పరిశుద్ధాత్మ మన జీవితంపై ప్రభావం చూపేలా మనం ప్రవర్తిస్తే, తట్టుకోవడం లేదా అధిగమించడం అసాధ్యమయ్యే పరిస్థితి ఏదీ ఉండదు.
ఒక వ్యక్తి ఉదాహరణ చూడండి, పెళ్లైన 38 ఏళ్లకు ఆయన భార్య క్యాన్సర్‌తో చనిపోయింది. ఆయన తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. భార్య లేకుండా బ్రతకడం అసాధ్యమని ఆయన అనుకున్నాడు. ఆమె లేకుండా జీవించడం కంటే చనిపోవడం మేలు అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అంధకారంగా ఉన్న లోయలో సంచరిస్తున్నట్లు అనిపించిందని ఆయన అన్నాడు. ఆయన కన్నీళ్ళతో దేవుణ్ణి ప్రార్థించి, ప్రతీరోజు బైబిలు చదివి, పరిశుద్ధాత్మ నిర్దేశం కోసం పట్టుదలతో ప్రయత్నించడం వల్ల అసాధ్యం అనిపించిన సమస్యను అధిగమించగలిగానని ఆయన నమ్ముతున్నాడు.
ఒక జంటకు విడిపోయే పరిస్థితి వచ్చింది. భర్త క్రూరుడు, ఆయనకు ఎన్నో చెడు అలవాట్లు కూడా ఉండేవి. ఆయనతో జీవించడం అసాధ్యం అనిపించి భార్య ఆత్మహత్యకు పాల్పడింది. ఆ తర్వాత భర్త యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేయడం ఆరంభించాడు. ఆయన తాను నేర్చుకుంటున్న దానిబట్టి చెడు అలవాట్లను విడిచిపెట్టి, కోపాన్ని తగ్గించుకున్నాడు. ఆయనలో వచ్చిన మార్పు చూసి ఆమె ఆశ్చర్యపోయింది, ఆయనలో అలాంటి మార్పులు రావడం “అసాధ్యం” అని ఆమె ఒకప్పుడు అనుకుంది.
మాదకద్రవ్యాలకు బానిసై, అనైతికతకు పాల్పడిన మరో వ్యక్తి తన దయనీయ స్థితి గురించి చెబుతూ, “నాకున్న గౌరవం అంతా పోయింది” అన్నాడు. ఆయన దేవునికి పట్టుదలతో ఇలా ప్రార్థించాడు: “ప్రభువా, నువ్వున్నావని నాకు తెలుసు. దయచేసి నాకు సహాయం చెయ్యి.” ఆయన అలా ప్రార్థించడం వల్ల యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేసే అవకాశం దొరికింది, దానితో ఆయన నమ్మశక్యంకాని మార్పులు చేసుకున్నాడు. “తప్పు చేశాననే, ఎందుకూ పనికిరానివాణ్ణనే భావాలతో తరచూ సతమతమౌతుండేవాణ్ణి. కొన్నిసార్లు ఎంతో నిరాశ చెందేవాణ్ణి. అయినప్పటికీ ఇలాంటి భావాలతో పోరాడడానికి దేవుని వాక్యం నాకు సహాయం చేసింది. రాత్రుళ్ళు నిద్రపట్టకపోతే, నేను నేర్చుకున్న లేఖన భాగాల్ని మననం చేసుకుంటూ ఉండేవాణ్ణి. అలా నన్ను నేను శుద్ధి చేసుకోవడం వల్ల నా మనసు ప్రశాంతంగా ఉండేది” అని ఆయన చెబుతున్నాడు. ఇప్పుడు ఆయన పెళ్ళి చేసుకొని సంతోషంగా జీవిస్తున్నాడు. ఆయన, ఆయన భార్య దేవుని వాక్య శక్తిపై విశ్వాసం ఉంచేలా ప్రజలకు సహాయం చేయడంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఆయన గడుపుతున్న జీవితం, కలతలతో నిండిన యౌవన ప్రాయంలో ఆయనకు అసాధ్యం అనిపించి ఉండవచ్చు.
వీళ్ల అనుభవాలు చూసిన తర్వాత దేవుని వాక్యానికి నిజంగానే ఎంతో శక్తి ఉందని, మనం “అసాధ్యం” అనుకున్నవాటిని కూడా ఆయన ఆత్మ సుసాధ్యం చేయగలదని అర్థమౌతోంది. కానీ “దానికి చాలా విశ్వాసం అవసరం” అని మీరనవచ్చు. అది నిజమే. “విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము” అని బైబిలు చెబుతోంది. (హెబ్రీయులు 11:6) దీని గురించి ఆలోచించండి: ఒక బ్యాంకు మేనేజరు గానీ అధికారంలో ఉన్న ఒక వ్యక్తి గానీ మీకు మంచి స్నేహితుడు అనుకోండి, ఆయన మీతో “మీరేమీ కంగారుపడకండి. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నన్ను అడగండి” అన్నాడనుకోండి. మీకు ఎంతో ధైర్యంగా అనిపిస్తుంది. కానీ విచారకరమైన విషయం ఏమిటంటే మనుషులు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేరు. మీ స్నేహితుడు మీకు నిజంగా సహాయపడాలనే ఉద్దేశంతోనే మాటిచ్చి ఉండవచ్చు, కానీ కొంతకాలానికి ఆయన పరిస్థితి మారిపోవచ్చు, దానివల్ల మీకిచ్చిన మాట నిలబెట్టుకోవడం ఆయనకు అసాధ్యమైపోవచ్చు. ఒకవేళ ఆయన చనిపోతే, మీకు సహాయం చేయాలన్న ఉద్దేశం గానీ సామర్థ్యం గానీ ఆయనకిక ఉండవు. కానీ దేవుని విషయంలో అలా జరగదు. “దేవునికి అసాధ్యమైనది అంటూ ఏదీ ఉండదు” అని బైబిలు హామీ ఇస్తోంది.—లూకా 1:37, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.
“ఈ మాట నమ్ముచున్నావా?”
పై పేరాలోని చివరి వాక్యం నిజమని చూపించే అనేక సంఘటనలు బైబిలులో ఉన్నాయి. కొన్ని ఉదాహరణలు చూడండి.
తొంభై ఏళ్ల శారా ఒక కొడుకును కంటుందని దేవుడు చెప్పినప్పుడు ఆమె నవ్వింది, కానీ ఆమెకు కొడుకు పుట్టాడనడానికి ఇశ్రాయేలు జనాంగమే ఒక నిదర్శనం. ఒక పెద్ద చేప ఒక మనిషిని మింగేసినప్పుడు ఆయన దాని కడుపులో నుండి మూడు రోజుల తర్వాత బయటపడి తన కథను రాశాడు. ఆయన పేరు యోనా. ఐతుకు అనే యౌవనుడు మూడవ అంతస్తు కిటికీలో నుండి జారిపడి చనిపోయి తిరిగి బ్రతికిన విధం గురించి స్పృహలో లేకపోవడానికి, మరణానికి తేడా తెలిసిన లూకా అనే ఒక వైద్యుడు రాశాడు. ఇవి కట్టు కథలు కాదు. ఆ వృత్తాంతాలన్నింటినీ జాగ్రత్తగా పరిశీలిస్తే అవి ఎంత ప్రామాణికమైనవో తెలుస్తుంది.—ఆదికాండము 18:10-14; 21:1, 2; యోనా 1:17; 2:1, 10; అపొస్తలుల కార్యములు 20:9-12.
యేసు తన స్నేహితురాలైన మార్తతో ఆశ్చర్యకరమైన ఈ మాట చెప్పాడు: “బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు.” అసాధ్యం అనిపించే ఈ వాగ్దానం చేసిన తర్వాత యేసు ఆమెను, “ఈ మాట నమ్ముచున్నావా?” అని అడిగాడు. దాని గురించి మనం కూడా జాగ్రత్తగా ఆలోచించాలి, అది ఇప్పటికీ ఎంతో ప్రాముఖ్యమైన ప్రశ్న.—యోహాను 11:26.
భూమిపై నిరంతర జీవితం—అసాధ్యమా?
దీర్ఘాయుష్షు వల్ల వచ్చే చట్టబద్ధ పరిణామాల గురించిన ఒక పత్రికలో ఇలా రాశారు, “మనమిప్పుడు జీవిస్తున్నదానికంటే ఎక్కువ సంవత్సరాలు జీవించే లేదా నిరంతరం జీవించే కాలం ఇంకెంతో దూరంలో లేదు.” మనిషి మరణించడానికి కారణం కణాలు పాడైపోవడం, నశించిపోవడం లేదా ఇతర ప్రక్రియలు కాదుగానీ శరీర ప్రక్రియలను విఫలం చేసి, పూర్తిగా ఆగిపోయేలా చేసే తెలియని మరేదో కారణం ఉన్నట్లుగా అనిపిస్తోందని ద న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా వివరిస్తోంది. అసాధ్యం అనిపిస్తున్న ఈ సమస్యను పరిష్కరించడానికి శాస్త్రజ్ఞులు ప్రయత్నిస్తున్నారు, కానీ దీన్ని దేవుడే పరిష్కరించగలడని చివరికి ఆ ఎన్‌సైక్లోపీడియా తేల్చింది.
ఇదంతా ఆసక్తికరంగానే ఉన్నప్పటికీ, నిరంతర జీవితం సాధ్యమౌతుందని నమ్మడానికి తర్కశాస్త్రం, విజ్ఞానశాస్త్రం ఇవ్వగల దానికంటే మరింత బలమైన కారణాన్ని బైబిలు ఇస్తోంది. మన సృష్టికర్త, జీవానికి మూలం అయిన యెహోవా దేవుడు, ‘మరెన్నడూ ఉండకుండా మరణాన్ని మ్రింగివేస్తాను’ అని వాగ్దానం చేశాడు. (కీర్తన 36:9; యెషయా 25:8) మీరు దాన్ని నమ్ముతారా? ఆ వాగ్దానం చేసింది యెహోవా, ఆయనకు అబద్దమాడడం అసాధ్యం.—తీతు 1:1-4. (w12-E 06/01)
[11వ పేజీలోని బ్లర్బ్]
‘నిన్న అసాధ్యం అనిపించినవి నేడు సాధారణ వాస్తవాలయ్యాయి.’—రొనాల్డ్ రీగన్
[12వ పేజీలోని బ్లర్బ్]
జీవించడం అసాధ్యం అనిపించినప్పుడు, మీరు ఎవరిని ఆశ్రయిస్తారు?
[11వ పేజీలోని చిత్రసౌజన్యం]
NASA photo