ఉజ్జ్వలమైన భవిష్యత్తు ఎలా సాధ్యం?
భవిష్యత్తు ఉజ్జ్వలంగా ఉండాలంటే ఏమి చేయాలి? ప్రస్తుతం మీరు తీసుకునే నిర్ణయాల వల్ల భవిష్యత్తులో ఎలాంటి పర్యవసానాలు ఉంటాయో గ్రహించగల మీ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడం దానికొక మార్గం.
నిజమే, జీవితాంతం ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలు తీసుకోవడం మీకు కష్టమనిపించవచ్చు. ఎందుకలా అనిపించవచ్చు? ఎందుకంటే మన చుట్టూ ఉన్నవాళ్ళలో చాలామంది ఏదైనా కోరుకోగానే అది దొరకాలి అనుకుంటారు. ఉదాహరణకు, బైబిలు సలహాను పాటిస్తే కుటుంబ సంబంధాలు దృఢంగా ఉంటాయని మీరు గ్రహించవచ్చు. (ఎఫెసీయులు 5:22–6:4) అలా దృఢంగా ఉండాలంటే పనిలో, ఉల్లాస కార్యకలాపాల్లో, వినోదంలో మునిగిపోకుండా మీ కుటుంబంతో మీరు ప్రతీరోజు సమయం గడపాలి. జీవితంలోని అనేక రంగాల్లో, అనుకున్న వెంటనే వచ్చేసే సంతృప్తి ముఖ్యమా, చాలాకాలం తర్వాత వచ్చే విజయం ముఖ్యమా అనేది మీరు నిర్ణయించుకోవాలి. ఈ విషయంలో మీరు జ్ఞానయుక్తమైన నిర్ణయం ఎలా తీసుకోవచ్చు? ఈ నాలుగు సూత్రాలను పాటించండి.
1 మీ నిర్ణయాల వల్ల రాగల ఫలితాల్ని ముందే ఊహించండి
ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు, దాని వల్ల రాగల అన్ని ఫలితాల గురించి ముందే ఊహించడానికి ప్రయత్నించండి. “బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును” అని బైబిలు చెబుతోంది. (సామెతలు 22:3) ఒకవేళ మీరు రాగల పరిణామాల్ని నిజాయితీగా పరిశీలిస్తే, మీకు హాని కలిగించగల నిర్ణయం తీసుకోకూడదని మీరు గ్రహిస్తారు. జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల వచ్చే దీర్ఘకాల ప్రయోజనాల గురించి ఆలోచిస్తే, సరైన నిర్ణయాలు తీసుకోవాలనే మీ కృతనిశ్చయం బలపడుతుంది.
ఇలా ప్రశ్నించుకోండి: ‘నా నిర్ణయం వల్ల ఒక సంవత్సరం తర్వాత లేదా 10, 20 సంవత్సరాల తర్వాత ఎలాంటి ఫలితాలు వస్తాయి? అది నా మానసిక, శారీరక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? అది నా కుటుంబ సభ్యుల మీద, నాకు కావాల్సిన వాళ్ళమీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?’ అన్నింటికన్నా ముఖ్యంగా, ‘నా నిర్ణయం దేవునికి సంతోషం కలిగిస్తుందా? ఆయనతో నాకున్న స్నేహంపై అది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?’ అని ప్రశ్నించుకోండి. బైబిలు దేవుని ప్రేరేపణతో రాయబడింది కాబట్టి, ఆయనకు సంతోషం కలిగించే విషయాలేమిటో గ్రహించడానికి, మీ దృష్టికి రాకుండా పోగల ఉరులను తప్పించుకోవడానికి అది సహాయం చేస్తుంది.—సామెతలు 14:12; 2 తిమోతి 3:16, 17.
2 ఉన్న అవకాశాలను స్వయంగా పరిశీలించండి
చాలామంది సొంతగా నిర్ణయించుకునే బదులు, నలుగురూ ఏమి చేస్తే అదే చేసేస్తారు. కానీ ఏదైనా ఒక జీవన విధానాన్ని అందరూ అనుసరిస్తున్నంత మాత్రాన అది విజయాన్ని చేకూరుస్తుందని చెప్పలేం. ఉన్న అవకాశాలను స్వయంగా పరిశీలించండి. ఉదాహరణకు, నమిత విషయమే తీసుకోండి.a ఆమె ఇలా చెబుతోంది, “నేను పెళ్ళి చేసుకొని సంతోషంగా ఉండాలనుకున్నాను. కానీ, నా జీవన విధానాన్ని బట్టి చూస్తే మంచి భర్త దొరకడని నాకు అర్థమైంది. కాలేజీలో నా స్నేహితులందరూ చాలా తెలివైనవాళ్ళు. కానీ వాళ్ళు తమ జీవితంలో అన్నీ చెడు నిర్ణయాలే తీసుకున్నారు. వాళ్ళు పదేపదే బాయ్‌ఫ్రెండ్స్‌ని, గర్ల్‌ఫ్రెండ్స్‌ని మార్చేసేవాళ్ళు. వాళ్ళలాగే నాకు కూడా చాలామంది బాయ్‌ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఇలాంటి జీవన విధానం వల్ల నేను మానసికంగా ఎంతో వేదన అనుభవించాను.”
నమిత యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేయడం మొదలుపెట్టింది. ఆమె ఇలా చెబుతోంది, “యెహోవాసాక్షుల్లో యౌవనస్థులు ఎంతో సంతోషంగా ఉంటారు, వాళ్ళ వివాహ బంధాలు చాలా దృఢంగా ఉంటాయి. ఎంతో కష్టమైనప్పటికీ నేను మెల్లగా నా ప్రమాణాల్ని, జీవన విధానాన్ని మార్చుకున్నాను.” దాని వల్ల ఎలాంటి ఫలితం వచ్చింది? నమిత ఇలా చెబుతోంది, “నాకు నచ్చిన లక్షణాలున్న వ్యక్తిని పెళ్ళి చేసుకోవాలని నేనెంతో కోరుకునేదాన్ని. కొంతకాలానికి, నా మతనమ్మకాలే ఉన్న వ్యక్తిని పెళ్ళి చేసుకున్నాను. నేను కలలు కన్న దాని కన్నా శ్రేష్ఠమైన వివాహ జీవితాన్ని యెహోవా నాకు ఇచ్చాడని నమ్ముతున్నాను.”
3 మీ నిర్ణయాలు మీ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో ఆలోచించండి
స్వల్పకాలిక ప్రయోజనాల గురించి ఆలోచించకుండా ఉండాలంటే, మీ భవిష్యత్తు ఎలా ఉండాలి, దాన్నెలా పొందాలి అనే విషయాల గురించి మీకు పూర్తి అవగాహన ఉండాలి. (సామెతలు 21:5) మానవుల ఆయుష్షు 70 లేక 80 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి మీ భవిష్యత్తు గురించి అంతవరకే ఆలోచించే బదులు, బైబిలు వర్ణిస్తున్న నిరంతర జీవితాన్ని మీరు అనుభవిస్తున్నట్లు ఊహించుకోండి.
క్రీస్తు యేసు మానవుల కోసం తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు, దాని ఆధారంగా మానవులు నిత్యజీవం పొందేలా దేవుడు ఏర్పాటు చేశాడని బైబిలు బోధిస్తోంది. (మత్తయి 20:28; రోమీయులు 6:23) మానవుల విషయంలో, భూమి విషయంలో తాను కోరుకున్నది త్వరలో నెరవేరుతుందని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుణ్ణి ప్రేమించేవాళ్ళకు, తిరిగి అందంగా మారిన భూమిపై నిరంతర జీవితాన్ని అనుభవించే అవకాశం దొరుకుతుంది. (కీర్తన 37:11; ప్రకటన 21:3-5) మీ నిర్ణయాలు మీ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో ఆలోచిస్తే అలాంటి భవిష్యత్తు మీ సొంతమౌతుంది.
4 మీ లక్ష్యాలను చేరుకోవడానికి కృషిచేయండి
దేవుడు వాగ్దానం చేసిన అలాంటి భవిష్యత్తు మీ సొంతమవ్వాలంటే మీరేమి చేయాలి? ముందుగా, దేవుని గురించిన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. (యోహాను 17:3) ఖచ్చితమైన జ్ఞానం సంపాదించుకోవడం వల్ల, భవిష్యత్తు గురించి దేవుడు చేసిన వాగ్దానాలు తప్పకుండా నెరవేరతాయనే మీ నమ్మకం బలపడుతుంది. అలాంటి నమ్మకం, దేవుని అనుగ్రహం పొందడానికి అవసరమైన ఎలాంటి మార్పులైనా చేసుకోవడానికి మీకు సహాయం చేస్తుంది.
మనోజ్ ఉదాహరణ పరిశీలించండి. ఆయనిలా చెబుతున్నాడు, “12 ఏళ్ళ వయసులో మత్తుపానీయాలు, మత్తుపదార్థాలు తీసుకోవడం మొదలుపెట్టాను. ఒక ముఠాలో సభ్యునిగా ఉండేవాణ్ణి, నాకు 30 ఏళ్ళు రాకముందే చనిపోతాననుకున్నాను. నా కోపం వల్ల, నాకు కలిగిన ఆశాభంగం వల్ల ఎన్నోసార్లు ఆత్మహత్యకు పాల్పడ్డాను. జీవితమంటే ఇంతేకాదని నాకు అనిపించేది, కానీ ఇంకేముందో తెలిసేది కాదు.” మనోజ్ ఉన్నత పాఠశాలలో ఉన్నప్పుడు, ముఠా సభ్యుల్లో ఒక వ్యక్తి యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేయడం మొదలుపెట్టాడు. మనోజ్ కూడా అధ్యయనం చేయడానికి అంగీకరించాడు.
మనోజ్ బైబిలు నుండి నేర్చుకుంటున్నదాని వల్ల భవిష్యత్తు విషయంలో ఆయన ఆలోచన మారిపోయింది. “భవిష్యత్తులో భూమి మళ్ళీ అందమైన తోటలా మారుతుందని, ప్రజలు ఎలాంటి చింతలూ లేకుండా ప్రశాంతంగా జీవిస్తారని నేను తెలుసుకున్నాను. దాన్నే నా భవిష్యత్తుగా ఊహించుకోసాగాను. యెహోవాతో మంచి స్నేహాన్ని పెంచుకోవడమే నా లక్ష్యంగా మారింది. కానీ ఒక్కోసారి యెహోవాకు బాధకలిగేలా ప్రవర్తించేవాణ్ణి. నేను బైబిలు అధ్యయనం మొదలుపెట్టిన తర్వాత కూడా కొన్నిసార్లు విపరీతంగా తాగాను. అంతేగాక, ఒక అమ్మాయితో శృంగారంలో పాల్గొన్నాను.”
మనోజ్ ఇలాంటి అవరోధాల్ని అధిగమించి, తన జీవన విధానాన్ని ఎలా మార్చుకోగలిగాడు? ఆయనిలా చెబుతున్నాడు, “నాతో బైబిలు అధ్యయనం చేస్తున్న సహోదరుడు ప్రతీరోజు బైబిలు చదవమని, దేవుణ్ణి సంతోషపెట్టాలని కోరుకునే ప్రజలతో సహవసించమని నన్ను ప్రోత్సహించాడు. ముఠాలో ఉన్నవాళ్ళ చెడు ప్రభావం నాపై ఇంకా పడుతోందని గ్రహించాను. వాళ్ళంతా నా కుటుంబ సభ్యుల్లా ఉన్నప్పటికీ వాళ్ళందరితో తెగతెంపులు చేసుకొని వచ్చేశాను.”
మనోజ్ తన జీవితాన్ని దేవుని ప్రమాణాలకు అనుగుణంగా మలచుకోవాలనే పెద్ద లక్ష్యాన్ని చేరుకోవడానికి చిన్నచిన్న లక్ష్యాలను, ప్రాధాన్యతలను ఏర్పర్చుకున్నాడు. మీరు కూడా అలాగే చేయవచ్చు. మీ దీర్ఘకాలిక లక్ష్యాన్ని, దాన్ని చేరుకోవడానికి మీకు సహాయం చేసే చిన్నచిన్న లక్ష్యాలను రాసిపెట్టుకోండి. మీకు మద్దతిచ్చే వాళ్ళతో మీ లక్ష్యాల గురించి చెప్పి, ఈ విషయంలో మీరు ఎంతవరకు అభివృద్ధి సాధించారో చూసుకోవడానికి సహాయం చేయమని అడగండి.
దేవుని గురించి నేర్చుకోవడాన్ని, మీ జీవితంలో ఆయన నిర్దేశాన్ని పాటించడాన్ని వాయిదా వేయకండి. దేవుని పట్ల, ఆయన వాక్యమైన బైబిలు పట్ల ప్రేమను పెంపొందించుకోవడానికి ఇప్పుడే చర్యలు తీసుకోండి. బైబిలు సూత్రాలను అన్వయించుకునే వ్యక్తిని వర్ణిస్తూ, “అతడు చేయునదంతయు సఫలమగును” అని దేవుని వాక్యం చెబుతోంది.—కీర్తన 1:1-3. (w12-E 05/01)
[అధస్సూచి]
a అసలు పేర్లు కావు.