దేవునికి ఒక సంస్థ ఉందా?
దేవుని సృష్టంతటినీ గమనిస్తే దానిలో ఒక క్రమముందని స్పష్టంగా తెలుస్తుంది. అత్యంత సూక్ష్మమైన జీవకణం నుండి పెద్దపెద్ద గుంపులుగా ఉన్న భారీ నక్షత్రవీధుల వరకు ప్రతీది చక్కగా వ్యవస్థీకరించబడివుంది.—1 కొరింథీయులు 14:33.
భౌతిక సృష్టి మాత్రమే కాదు పరలోకంలో ఉన్న దేవదూతలు కూడా సృష్టికర్త సంకల్పానికి అనుగుణంగా ఒక క్రమపద్ధతిలో సేవ చేస్తారని బైబిలు చెబుతోంది. పరలోకంలోని దేవుని సభలో దేవదూతల పెద్ద సమూహం ఉండడం దానియేలు ప్రవక్త ఒక దర్శనంలో చూశాడు. దాని గురించి ఆయనిలా రాశాడు: “వేలాది వేలమంది పరిచారకులు ఆయనకు సేవ చేస్తూ ఉన్నారు. కోటాను కోట్లమంది ఆయన ఎదుట నిలుచున్నారు.” (దానియేలు 7:9, 10, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) దేవుడు భూమ్మీదున్న తన సేవకులకు సంబంధించి ఇచ్చే ఆదేశాలను కోటాను కోట్ల దేవదూతలు పాటిస్తున్నారంటే ఆ సంస్థ నిజంగా ఎంత పెద్దదై ఉంటుందో కదా!—కీర్తన 91:11.
సృష్టికర్తయైన యెహోవా తన సృష్టి అంతటినీ చక్కగా సంస్థీకరిస్తున్నా, ఆయన అదేపనిగా నియమాలను పెట్టే కఠినమైన దేవుడు కాదు. కానీ, ఆయన తన సృష్టంతటి పట్ల శ్రద్ధ, ప్రేమ చూపించే ‘సంతోషంగల దేవుడు.’ (1 తిమోతి 1:11, NW; 1 పేతురు 5:7) ఆయన ప్రాచీన ఇశ్రాయేలు ప్రజలతో, మొదటి శతాబ్దంలోని క్రైస్తవులతో వ్యవహరించిన తీరు చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమౌతుంది.
ప్రాచీన ఇశ్రాయేలు చక్కగా సంస్థీకరించబడింది
సరైన విధంగా తనను ఆరాధించేలా ఇశ్రాయేలీయులను సంస్థీకరించడానికి యెహోవా మోషేను ఉపయోగించాడు. సీనాయి అరణ్యంలో ప్రయాణిస్తున్నప్పుడు వాళ్ల బస కోసం చేయబడిన ఏర్పాట్ల విషయమే తీసుకోండి. ప్రతీ కుటుంబం తమకు నచ్చిన చోట గుడారం వేసుకునేందుకు అనుమతిస్తే పరిస్థితి ఎంతో గందరగోళంగా ఉండేది. ప్రతీ గోత్రం తమ గుడారాలు ఎక్కడ వేసుకోవాలనే విషయంలో యెహోవా స్పష్టమైన నిర్దేశాలు ఇచ్చాడు. (సంఖ్యాకాండము 2:1-34) అంతేకాదు, మోషే ద్వారా దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఆరోగ్యానికి, పరిశుభ్రతకు సంబంధించి ఎన్నో స్పష్టమైన నియమాలు ఉన్నాయి. ఎవరైనా బహిర్భూమికి వెళ్లినప్పుడు మలాన్ని మట్టితో కప్పేయాలి అనేది వాటిలో ఒకటి.—ద్వితీయోపదేశకాండము 23:12, 13.
దేవుడు వాగ్దానం చేసిన దేశంలో ప్రవేశించడానికి ముందే ఇశ్రాయేలీయులు ఒక జనాంగంగా ఎన్నో విధాలుగా సంస్థీకరించబడ్డారు. ఆ జనాంగం 12 గోత్రాలుగా విభజించబడడమే కాదు ప్రతీ గోత్రానికి కొంత భూమి ఇవ్వబడింది. మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఆరాధన, వివాహం, కుటుంబం, విద్య, వ్యాపారం, వ్యవసాయం, పశువుల పెంపకం, దేన్ని తినాలి దేన్ని తినకూడదు వంటి జీవితంలోని ప్రతీ విషయానికి సంబంధించిన నియమాలు ఉన్నాయి.a కొన్ని నియమాలు సూటిగా, వివరంగా ఉన్నాయి. అయినా యెహోవా ఇచ్చిన ఆ నియమాలన్నీ తన ప్రజల పట్ల ఆయనకు ఎంత శ్రద్ధవుందో చూపించాయి, వాటివల్ల వాళ్లు సంతోషంగా ఉండగలిగారు. ఆ ప్రేమపూర్వక ఏర్పాట్ల ప్రకారం జీవించడం వల్ల ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రత్యేకమైన, ఇష్టమైన ప్రజలుగా ఉండేవాళ్లు.—కీర్తన 147:19, 20.
నిజానికి, మోషే తెలివైన నాయకుడే. అయినా జయాపజయాలనేవి నాయకుడిగా ఆయనకున్న నైపుణ్యాల మీద కాదుగానీ దేవుని సంస్థ పట్ల నమ్మకంగా ఉండడం మీదే ఆధారపడ్డాయి. ఉదాహరణకు, అరణ్యంలో ఏ మార్గం గుండా వెళ్లాలనేది మోషే ఎలా నిర్ణయించాడు? యెహోవాయే పగలు మేఘ స్తంభం ద్వారా, రాత్రి అగ్ని స్తంభం ద్వారా వాళ్లను నడిపించాడు. (నిర్గమకాండము 13:21, 22) దేవుడు మానవులను ఉపయోగించుకున్నా నిజానికి తన ప్రజలను సంస్థీకరించింది, నడిపించింది ఆయనే. మొదటి శతాబ్దంలోని క్రైస్తవులను కూడా ఆయన అలాగే నడిపించాడు.
మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు చక్కగా సంస్థీకరించబడ్డారు
మొదటి శతాబ్దంలో అపొస్తలులు, శిష్యులు ఉత్సాహంగా ప్రకటించడం వల్ల ఆసియా ఐరోపాల్లోని చాలా ప్రాంతాల్లో క్రైస్తవ సంఘాలు స్థాపించబడ్డాయి. ఆ సంఘాలు ఒకదానికొకటి దూరంలో ఉన్నా అవి ఎలాంటి సంబంధం లేని గుంపులు కావు. అవి చక్కగా సంస్థీకరించబడ్డాయి, అపొస్తలుల ప్రేమపూర్వక పర్యవేక్షణ నుండి ప్రయోజనం పొందాయి. ఉదాహరణకు అపొస్తలుడైన పౌలు, క్రేతులో ఉన్న వాటన్నిటిని ‘క్రమపర్చడానికే’ తీతును అక్కడకు పంపించాడు. (తీతు 1:5, పవిత్ర గ్రంథం, క్యాతలిక్ అనువాదం) కొందరు సహోదరులకు “సంస్థీకరించే సామర్థ్యాలు” ఉన్నాయని లేదా వాళ్లు “సంస్థీకరించేవాళ్లు” అని పౌలు కొరింథు సంఘానికి రాశాడు. (1 కొరింథీయులు 12:28, ద న్యూ టెస్టమెంట్ ఇన్ మాడర్న్ స్పీచ్; ద బైబిల్ ఇన్ కాంటెంపరరీ లాంగ్వేజ్) ఇంతకీ ఆ క్రమం ఎలా సాధ్యమైంది? సంఘాన్ని ‘దేవుడే అమర్చాడు’ లేదా సంస్థీకరించాడు అని పౌలు చెప్పాడు.—1 కొరింథీయులు 12:24.
క్రైస్తవ సంఘంలో పర్యవేక్షకులుగా నియమించబడిన వాళ్లు తోటి విశ్వాసుల మీద ప్రభువులు కాదు. వాళ్లు దేవుని పరిశుద్ధాత్మ నిర్దేశాన్ని పాటించే “సహకారులు” లేదా తోటి పనివాళ్లు, వాళ్లు ‘మందకు ఆదర్శంగా’ ఉండాలి. (2 కొరింథీయులు 1:24; 1 పేతురు 5:2, 3, పరిశుద్ధ బైబిల్: తెలుగు ఈజీ-టు-రీడ్ వర్షన్) ఏ అల్ప మానవుడూ లేదా లోపంతో ఉన్న మానవుల గుంపూ కాదుగానీ పునరుత్థానం చేయబడిన యేసుక్రీస్తే ‘సంఘానికి శిరస్సు.’—ఎఫెసీయులు 5:23.
కొరింథులోని సంఘం కొన్ని విషయాల్లో ఇతర సంఘాల్లా కాక పూర్తి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు పౌలు ఇలా రాశాడు: ‘దేవుని వాక్యం మీ వద్ద నుండే బయలువెళ్లిందా? మీ వద్దకు మాత్రమే వచ్చిందా?’ (1 కొరింథీయులు 14:36) పౌలు వేసిన ఆ ప్రశ్నలు, వాళ్లు తమ ఆలోచనను సరిదిద్దుకోవడానికి, స్వతంత్రంగా ప్రవర్తించకూడదని అర్థంచేసుకోవడానికి వాళ్లకు సహాయం చేశాయి. అపొస్తలుల నిర్దేశాన్ని పాటించినప్పుడు సంఘాలు అంతకంతకూ అభివృద్ధి చెంది, విస్తరించాయి.—అపొస్తలుల కార్యములు 16:4, 5.
దేవుని ప్రేమకు నిదర్శనం
మరి మనకాలం విషయమేమిటి? ఒక మతపరమైన సంస్థలో సభ్యులుగా ఉండడానికి కొంతమంది ఇష్టపడకపోవచ్చు. అయితే దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చడానికి ఎల్లప్పుడూ తన సంస్థను ఉపయోగించాడని బైబిలు రుజువు చేస్తోంది. ఆరాధన విషయంలో ఆయన ప్రాచీన ఇశ్రాయేలీయులను, మొదటి శతాబ్దంలోని క్రైస్తవులను సంస్థీకరించాడు.
ఆ రోజుల్లోలాగే నేడు కూడా యెహోవా తన ప్రజలను నడిపిస్తాడనే ముగింపుకు రావడం సహేతుకం కాదా? తన ఆరాధకులను సంస్థీకరించి, ఐక్యపరచడమనేది వాళ్లమీద ఆయనకున్న ప్రేమకు, శ్రద్ధకు నిదర్శనం. మానవుల పట్ల తన సంకల్పాన్ని నెరవేర్చడానికి నేడు యెహోవా తన సంస్థను ఉపయోగిస్తున్నాడు. ఆ సంస్థను మనమెలా గుర్తుపట్టవచ్చు? కింది ప్రమాణాల ఆధారంగా గుర్తుపట్టవచ్చు.
▪ నిజమైన క్రైస్తవులు ఒక పనిని నెరవేర్చడానికి సంస్థీకరించబడ్డారు. (మత్తయి 24:14; 1 తిమోతి 2:3, 4) అన్ని దేశాలకు రాజ్య సువార్త ప్రకటించమని యేసు తన అనుచరులకు ఆజ్ఞాపించాడు. అయితే, ఒక ప్రపంచవ్యాప్త సంస్థ లేకుండా ఆ పని చేయడం అసాధ్యం. అదెలాగంటే, మీరు ఒక వ్యక్తిని పోషించగలుగుతారేమో కానీ వేలాదిమందిని లేదా లక్షలాదిమందిని పోషించాలంటే మాత్రం అది మీ ఒక్కరి వల్ల కాదు. దానికోసం మీకు ఒకరితో ఒకరు మంచిగా సహకరించుకునే ప్రజలున్న, వ్యవస్థీకరించబడిన ఒక సంస్థ అవసరం. తమ పనిని నెరవేర్చడానికి నిజమైన క్రైస్తవులు ‘ఏకమనస్సుతో’ అంటే ఒకరికొకరు సహకరించుకుంటూ దేవుని సేవచేస్తారు. (జెఫన్యా 3:9) ఐక్యంగా ఉంటూ ఒకరికొకరు సహకరించుకునే సభ్యులున్న సంస్థ లేకుండా వివిధ దేశాల, వివిధ భాషల, వివిధ జాతుల ప్రజలు కలిసి పనిచేయడం సాధ్యమౌతుందా? ఖచ్చితంగా సాధ్యం కాదు.
▪ నిజమైన క్రైస్తవులు ఒకరికొకరు సహకరించుకోవడానికి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి సంస్థీకరించబడ్డారు. నైపుణ్యం గల ఒక ఒంటరి పర్వతారోహకుడు తను ఏ పర్వతం ఎక్కాలో తనే నిర్ణయించుకోవచ్చు. అంతగా అనుభవం లేని ఇతర పర్వతారోహకులను పట్టించుకోవాల్సిన అవసరం కూడా ఆయనకు ఉండదు. కానీ, ఒకవేళ ఆయనకు ఏదైనా ప్రమాదం జరిగినా లేదా కష్టమైన పరిస్థితి ఎదురైనా సహాయం చేసేవాళ్లు ఎవరూ ఉండరు కాబట్టి ఆయనకు తీవ్రమైన హాని జరగవచ్చు. అందుకే ఇతరుల నుండి వేరుగా ఉండడం నిజంగా తెలివితక్కువ పని. (సామెతలు 18:1) క్రైస్తవులు యేసు ఆజ్ఞను పాటించాలంటే వాళ్లు ఒకరికొకరు సహకరించుకోవాలి. (మత్తయి 28:19, 20) వాళ్లందరూ ఆ పనిలో కొనసాగడానికి ఎంతో అవసరమైన బైబిలు ఉపదేశం, తర్ఫీదు, ప్రోత్సాహం క్రైస్తవ సంఘంలో దొరుకుతుంది. ఉపదేశం ఇవ్వడానికి, ఆరాధించడానికి సంస్థీకరించబడిన క్రైస్తవ కూటాలే లేకపోతే యెహోవా మార్గాల గురించి నేర్చుకోవడానికి ఎవరైనా సరే ఎక్కడకు వెళ్తారు?—హెబ్రీయులు 10:24, 25.
▪ నిజమైన క్రైస్తవులు ఐక్యంగా దేవుణ్ణి సేవించడానికి సంస్థీకరించబడ్డారు. యేసు గొర్రెలు అంటే ఆయన శిష్యులు, ఆయన స్వరాన్ని వినే కొద్దీ ఆయన నాయకత్వంలో ‘ఒక్క మందగా’ ఏర్పడతారు. (యోహాను 10:16) వాళ్లు వేర్వేరు చర్చీల్లో లేదా గుంపుల్లో సభ్యులుగా ఉండరు లేదా భిన్నమైన సిద్ధాంతాలను నమ్మరు. కానీ వాళ్లందరూ ‘ఏకభావంతో మాట్లాడతారు.’ (1 కొరింథీయులు 1:10) అందరూ ఐక్యంగా ఉండాలంటే అన్నీ ఒక క్రమపద్ధతిలో జరగాలి, దానికోసం ఒక సంస్థ అవసరం. సహోదరులందరూ ఐక్యంగా ఉండే సంస్థ మాత్రమే దేవుని ఆశీర్వాదాలు పొందుతుంది.—కీర్తన 133:1, 3.
మనం ఇప్పటివరకు చూసిన వాటితోపాటు బైబిల్లోవున్న ఇతర ప్రమాణాలను చేరుకున్న ఒక సంస్థలోకి లక్షలాదిమంది వస్తున్నారు. వాళ్లందరూ దేవుని మీద, బైబిలు సత్యాల మీద నిజమైన ప్రేమతో అలా వస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా యెహోవాసాక్షులు సంస్థీకరించబడిన, ఐక్య గుంపుగా దేవుడు కోరేది చేయడానికి కృషి చేస్తున్నారు. ‘నేను వాళ్లలో నివసించి సంచరిస్తాను, నేను వాళ్ల దేవుడనై ఉంటాను. వాళ్లు నా ప్రజలై ఉంటారు’ అని దేవుడు ఇచ్చిన మాట మీద వాళ్లు నమ్మకముంచుతారు. (2 కొరింథీయులు 6:16-18) యెహోవా దేవుని సంస్థలో సభ్యులుగా ఉంటూ ఆయనను ఆరాధిస్తే, మీరు కూడా ఆ అద్భుతమైన ఆశీర్వాదాన్ని పొందవచ్చు. (w11-E 06/01)
[అధస్సూచి]
a యెహోవాకు సన్నిహితమవండి పుస్తకంలోని 13వ అధ్యాయం చూడండి, దీన్ని యెహోవాసాక్షులు ప్రచురించారు.
[13వ పేజీలోని చిత్రం]
ఇశ్రాయేలీయుల బస ఏర్పాట్లు ఎంతో చక్కగా సంస్థీకరించబడ్డాయి
[14, 15 పేజీల్లోని చిత్రాలు]
ప్రపంచవ్యాప్తంగా ప్రకటనా పని జరగాలంటే ఒక సంస్థ అవసరం
ఇంటింటి ప్రకటనా పని
విపత్తులు వచ్చినప్పుడు సహాయక పనులు
సమావేశాలు
ఆరాధనా స్థలాలను నిర్మించడం