కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w11 3/15 పేజీలు 12-16
  • అంతం సమీపిస్తుండగా యెహోవాపై నమ్మకముంచండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అంతం సమీపిస్తుండగా యెహోవాపై నమ్మకముంచండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • తప్పు చేయాలనే శోధన ఎదురైనప్పుడు . . .
  • ప్రజలు సువార్తను పట్టించుకోనప్పుడు, మనల్ని వ్యతిరేకించినప్పుడు . . .
  • జీవిత చింతలతో వ్యవహరిస్తున్నప్పుడు . . .
  • “దేవుని సమాధానము” మీ హృదయాలకు కావలిగా ఉండనివ్వండి
  • యెహోవా మీద మీ నమ్మకాన్ని బలపరచుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • సంతోషకరమైన జీవితానికి నమ్మకం ఆవశ్యం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • సహోదర సహోదరీల్ని మీరు నమ్మవచ్చు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
  • మీ పూర్ణహృదయంతో యెహోవాపై నమ్మకం ఉంచండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
w11 3/15 పేజీలు 12-16

అంతం సమీపిస్తుండగా యెహోవాపై నమ్మకముంచండి

“యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి.”—యెష. 26:4.

1. లోకంలోని ప్రజలకు, దేవుని సేవకులకు మధ్య ఏ తేడా ఉంది?

నేటి ప్రపంచంలో చాలామందికి ఎవరిని నమ్మాలో, దేన్ని నమ్మాలో తెలియట్లేదు. ఎందుకంటే, వారికి ఎన్నోసార్లు నిరాశే ఎదురైంది. వారికి, యెహోవా సేవకులకు మధ్య ఎంత తేడా! యెహోవా సేవకులు దైవిక జ్ఞానంతో నడుచుకుంటున్నారు కాబట్టి, “రాజుల” మీద నమ్మకముంచకూడదని వారికి తెలుసు. (కీర్త. 146:3) యెహోవా తమను ప్రేమిస్తున్నాడనే, తన వాగ్దానాలను నెరవేరుస్తాడనే నమ్మకంతో వారు తమ జీవితాలను, తమ భవిష్యత్తును యెహోవా చేతుల్లో పెడతారు.—రోమా. 3:4; 8:38, 39.

2. యెహోవా నమ్మదగినవాడనే విషయం గురించి మాట్లాడుతూ యెహోషువ ఏమన్నాడు?

2 యెహోవా నమ్మదగినవాడనే విషయం గురించి యెహోషువ మాట్లాడాడు. తన జీవితపు చివరి రోజుల్లో, తోటి ఇశ్రాయేలీయులతో ఆయన ఇలా అన్నాడు: “మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటియైనను తప్పియుండలేదని మీరు అనుభవపూర్వకముగా ఎరుగుదురు; అవి అన్నియు మీకు కలిగెను.”—యెహో. 23:14.

3. దేవుని నామం ఆయన గురించి ఏమి తెలియజేస్తుంది?

3 యెహోవా మనల్ని ప్రేమిస్తున్నందువల్ల మాత్రమే కాదుగానీ, ముఖ్యంగా తన నామం నిమిత్తం తన వాగ్దానాలను నెరవేరుస్తాడు. (నిర్గ. 3:14; 1 సమూ. 12:22) జే. బి. రోథర్‌హామ్‌ రాసిన ది ఎంఫసైజ్డ్‌ బైబిల్‌ పరిచయ మాటల్లో దేవుని నామం గురించి ఇలా ఉంది: “[అది] అత్యంత దయాపూర్వకమైన ఓ వాగ్దానం; ఎలాంటి పరిస్థితులకైనా, కష్టాలకైనా, అవసరాలకైనా తగిన విధంగా మారే దేవుని సామర్థ్యం . . . [అది] ఒక వాగ్దానం, . . . ప్రకటన, జ్ఞాపకార్థం, ప్రతిజ్ఞ. దేవుడు ఎల్లప్పుడూ ఆ నామానికి కట్టుబడివుంటాడు. దాని విషయంలో ఆయన ఎన్నడూ సిగ్గుపడడు.”

4. (ఎ) యెషయా 26:4లో మనకు ఏ ప్రోత్సాహం ఉంది? (బి) మనం ఈ ఆర్టికల్‌లో ఏమి పరిశీలిస్తాం?

4 ఈ ప్రశ్నలు వేసుకోండి: ‘దేవునిపై పూర్తి నమ్మకముంచేంతగా ఆయన గురించి నాకు తెలుసా? దేవుడు పరిస్థితులన్నిటినీ అదుపు చేయగలడనే నమ్మకంతో నేను భవిష్యత్తువైపు చూస్తానా?’ యెషయా 26:4 ఇలా చెబుతోంది: “యెహోవా యెహోవాయే నిత్యాశ్రయదుర్గము యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి.” అయితే, పూర్వంలా ఇప్పుడు ప్రజల జీవితాల్లో యెహోవా అద్భుతరీతిలో జోక్యం చేసుకోడు. అయినా, “నిత్యాశ్రయదుర్గము[గా]” ఆయనపై మనం “యుగయుగములు” నమ్మకముంచవచ్చు. నమ్మదగిన దేవుడైన యెహోవా ఇప్పుడు తనపట్ల విశ్వాసం కలిగి నడుచుకుంటున్న సేవకులకు ఎలా సహాయం చేస్తున్నాడు? మనమిప్పుడు మూడు రంగాలను పరిశీలిద్దాం. (1) శోధనను ఎదుర్కొనేందుకు సహాయం చేయమని ప్రార్థించినప్పుడు, (2) మనం ప్రకటించే సువార్తను ప్రజలు పట్టించుకోనప్పుడు, మనల్ని వ్యతిరేకించినప్పుడు, (3) జీవిత చింతలు మనల్ని ముంచెత్తినప్పుడు, యెహోవా మనల్ని బలపరుస్తాడు. వీటిని పరిశీలిస్తుండగా, యెహోవాపై మీ నమ్మకాన్ని ఎలా బలపరచుకోవచ్చో ఆలోచించండి.

తప్పు చేయాలనే శోధన ఎదురైనప్పుడు . . .

5. ఏ విషయంలో యెహోవాపై నమ్మకముంచడం కష్టంగా ఉండవచ్చు?

5 మనం ఎంతగానో ఎదురుచూసే పరదైసు, పునరుత్థానం గురించిన వాగ్దానాల్ని యెహోవా నెరవేరుస్తాడని నమ్మడం సులభమే. కానీ, యెహోవా ఏర్పరచిన నైతిక ప్రమాణాలను పాటించాలో వద్దో నిర్ణయించుకునేటప్పుడు ఆయనపై నమ్మకముంచడం, అంటే ఆయన ఏర్పరచిన ప్రమాణాలను పాటించడమే సరైనదని, అది గొప్ప సంతోషాన్నిస్తుందని నమ్మడం కష్టంగా ఉండవచ్చు. సొలొమోను రాజు ఈ ఉపదేశాన్నిచ్చాడు: “నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.” (సామె. 3:5, 6) ఇక్కడ మన “ప్రవర్తన” గురించి, “త్రోవల” గురించి ప్రస్తావించబడడాన్ని గమనించండి. కేవలం మన క్రైస్తవ నిరీక్షణ విషయంలోనే కాక, మన ప్రవర్తనంతటిలో యెహోవాపై నమ్మకం ఉంచుతున్నామని చూపించాలి. అయితే, శోధనలు ఎదురైనప్పుడు మనం యెహోవాపై నమ్మకముంచుతున్నామని ఎలా చూపించవచ్చు?

6. చెడు ఆలోచనలను తిరస్కరించాలనే మన కృతనిశ్చయాన్ని ఎలా బలపరచుకోవచ్చు?

6 చెడ్డ వాటికి దూరంగా ఉండడమనేది మన ఆలోచనతోనే మొదలౌతుంది. (రోమీయులు 8:5; ఎఫెసీయులు 2:3 చదవండి.) అయితే, చెడు ఆలోచనలను తిరస్కరించాలనే మీ కృతనిశ్చయాన్ని ఎలా బలపరచుకోవచ్చు? ఈ ఐదు విధానాలను పరిశీలించండి: (1) దేవుని సహాయం కోసం ప్రార్థించండి. (మత్త. 6:9, 13) (2) యెహోవా చెప్పినట్లు నడుచుకున్నవారి గురించి, నడుచుకోనివారి గురించి బైబిల్లో ఉన్న ఉదాహరణలను ధ్యానించండి, వారు ఎలాంటి ఫలితాలను పొందారో గమనించండి.a (1 కొరిం. 10:8-11) (3) పాపం చేయడం వల్ల మీకు, మీ ప్రియమైన వారికి కలిగే మానసిక, భావోద్వేగ హాని గురించి ఆలోచించండి. (4) తన సేవకుల్లో ఒకరు గంభీరమైన పాపం చేస్తే యెహోవా ఎలా భావిస్తాడో ఆలోచించండి. (కీర్తన 78:40, 41 చదవండి.) (5) ఒంటరిగా ఉన్నప్పుడైనా నలుగురిలో ఉన్నప్పుడైనా, ఓ యథార్థ సేవకుడు చెడును తిరస్కరించి మంచిని చేసినప్పుడు యెహోవా ఎంత సంతోషిస్తాడో ఒక్కసారి ఊహించండి! (కీర్త. 15:1, 2; సామె. 27:11) సరైనది చేయడం ద్వారా మీరు కూడా యెహోవాపై నమ్మకముంచుతున్నారని చూపించవచ్చు.

ప్రజలు సువార్తను పట్టించుకోనప్పుడు, మనల్ని వ్యతిరేకించినప్పుడు . . .

7. యిర్మీయాకు ఏ పరీక్షలు ఎదురయ్యాయి? కొన్నిసార్లు ఆయనకు ఏమి అనిపించింది?

7 చాలామంది సహోదరులు ప్రకటించడం కష్టంగా ఉన్న ప్రాంతాల్లో సేవచేస్తున్నారు. యిర్మీయా ప్రవక్త కూడా అలాంటి పరిస్థితుల మధ్య అంటే, యూదా రాజ్యం నాశనమయ్యే సమయం దగ్గరపడిన అల్లకల్లోల పరిస్థితుల మధ్య సేవ చేశాడు. ఆయన దేవుని తీర్పు సందేశాలను నమ్మకంగా ప్రకటించాడు కాబట్టి ఆయన విశ్వాసానికి ప్రతీరోజు పరీక్షలు ఎదురయ్యాయి. చివరికి, యిర్మీయా నమ్మకమైన సహాయకుడు బారూకు కూడా తాను అలసిపోయానని ఒకానొక సమయంలో అసంతృప్తిని వ్యక్తం చేశాడు. (యిర్మీ. 45:2, 3) అప్పుడు యిర్మీయా నిరుత్సాహపడ్డాడా? నిజమే, ఓ సందర్భంలో ఆయన కృంగిపోయాడు. ఆయనిలా అన్నాడు: “నేను పుట్టినదినము శపింపబడును గాక . . . కష్టమును దుఃఖమును చూచుటకై నా దినములు అవమానముతో గతించిపోవునట్లు నేనేల గర్భములోనుండి వెడలితిని?”—యిర్మీ. 20:14, 15, 18.

8, 9. యిర్మీయా 17:7, 8 మరియు కీర్తన 1:1-3 ప్రకారం, మనం మంచి ఫలాల్ని ఫలిస్తూ ఉండాలంటే ఏమి చేయాలి?

8 యిర్మీయా పట్టువిడువకుండా ఎల్లప్పుడూ యెహోవాపై నమ్మకముంచాడు. ఫలితంగా, యిర్మీయా 17:7, 8లో ఉన్న యెహోవా మాటలు ఈ నమ్మకమైన ప్రవక్త జీవితంలో నిజమయ్యాయి. అక్కడిలా ఉంది: “యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలములయొద్ద నాటబడిన చెట్టువలె నుండును; అది కాలువల ఓరను దాని వేళ్లు తన్నును; వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగానుండును, వర్షములేని సంవత్సరమున చింతనొందదు కాపు మానదు.”

9 “జలములయొద్ద” లేదా నీటి సరఫరా బాగా ఉన్న చోట “నాటబడి,” పుష్కలంగా పండ్లను ఇస్తున్న చెట్టులా యిర్మీయా ఎన్నడూ ‘కాపు మానలేదు.’ తనను అపహాస్యం చేస్తున్న దుష్టుల ప్రభావానికి ఆయన లోనుకాలేదు కానీ, జీవదాయకమైన ‘నీళ్లకు’ మూలమైన యెహోవాను హత్తుకొని ఆయన చెప్పిన ప్రతీ విషయాన్ని పాటించాడు. (కీర్తన 1:1-3 చదవండి; యిర్మీ. 20:9) మనకు, ముఖ్యంగా ప్రకటించడం కష్టంగా ఉన్న ప్రాంతాల్లో సేవచేస్తున్న సహోదరులకు యిర్మీయా ఎంత చక్కని మాదిరి! మీరు కూడా అలాంటి పరిస్థితుల మధ్య ఉన్నట్లైతే యెహోవాపై ఎక్కువగా ఆధారపడండి. మీరు ‘బహిరంగంగా తన నామాన్ని ఒప్పుకుంటుండగా’ ఆయన మీకు సహనాన్ని దయచేస్తాడు.—హెబ్రీ. 13:15.

10. యెహోవా మనకు ఏ ఆశీర్వాదాలను ఇచ్చాడు? మనం ఏమని ప్రశ్నించుకోవాలి?

10 ఈ అంత్యదినాల్లో మనకు ఎదురయ్యే కష్టాలను సహించడానికి సహాయం చేసేందుకు యెహోవా ఎన్నో ఏర్పాట్లు చేశాడు. దేవుని సంపూర్ణ వాక్యమైన బైబిలు వాటిలో ఒకటి. అది ఇప్పుడు ఎన్నో భాషల్లోకి ఉన్నదున్నట్లుగా అనువదించబడుతోంది. నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని తరగతి ద్వారా యెహోవా సమయానుకూలంగా ఆధ్యాత్మిక ఆహారాన్ని దయచేస్తున్నాడు. అంతేకాక కూటాల ద్వారా, సమావేశాల ద్వారా పెద్ద సంఖ్యలో ఉన్న తోటి విశ్వాసుల సహవాసాన్ని మనకు ఇచ్చాడు. మీరు ఈ ఏర్పాట్లన్నిటినీ పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారా? అలా చేసేవారందరూ “హృదయానందముచేత కేకలు వేసెదరు.” అయితే, దేవుని మాట విననివారు “చింతాక్రాంతులై యేడ్చెదరు, మనో దుఃఖముచేత ప్రలాపించెదరు.”—యెష. 65:13, 14.

జీవిత చింతలతో వ్యవహరిస్తున్నప్పుడు . . .

11, 12. ప్రపంచంలోని సమస్యలను బట్టి చూస్తే, ఏమి చేయడం జ్ఞానయుక్తం?

11 ప్రవచింపబడినట్లుగానే మానవుల కష్టాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. (మత్త. 24:6-8; ప్రక. 12:12) వరదలు వచ్చినప్పుడు ప్రజలు సాధారణంగా ఏదైనా ఓ ఎత్తు ప్రాంతానికి పరుగులు తీస్తారు లేదా ఇంటి పైకప్పు మీదకు ఎక్కుతారు. అలాగే, లోకంలో సమస్యలు వరదల్లా ముంచెత్తుతున్నప్పుడు చాలామంది ప్రజలు ఎత్తు ప్రాంతాలుగా కనిపించే ఆర్థిక, రాజకీయ, మత సంస్థలను, విజ్ఞాన శాస్త్రాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆశ్రయిస్తారు. కానీ ఇవేవీ నిజమైన భద్రతను ఇవ్వలేవు. (యిర్మీ. 17:5, 6) మరోవైపున, యెహోవా సేవకులకు నమ్మదగిన “నిత్యాశ్రయదుర్గము” ఉంది. (యెష. 26:4) కీర్తనకర్త ఇలా రాశాడు: “[యెహోవా] నా ఆశ్రయదుర్గము నా రక్షణాధారము నా ఎత్తయిన కోట.” (కీర్తన 62:6-9 చదవండి.) ఈ దుర్గాన్ని మనమెలా ఆశ్రయించవచ్చు?

12 మానవ జ్ఞానానికి విరుద్ధంగా ఉన్న యెహోవా వాక్యాన్ని పాటించినప్పుడు మనమాయనను హత్తుకుంటాం. (కీర్త. 73:23, 24) ఉదాహరణకు మానవ జ్ఞానాన్ని అనుసరించేవారు, ‘జీవితం చాలా చిన్నది, దాన్ని పూర్తిగా అనుభవించాలి’ ‘మంచి ఉద్యోగం చేయి’ ‘బాగా డబ్బు సంపాదించు’ ‘అది కొను, ఇది కొను’ ‘ప్రపంచాన్ని చుట్టేసి రా, లోకాన్ని అనుభవించు’ అని అనవచ్చు. కానీ దైవిక జ్ఞానం ఈ సలహాకు అనుగుణంగా ఉంది: “ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను; ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది.” (1 కొరిం. 7:31) అంతేకాక, యెహోవా ఆరాధనకు ప్రథమస్థానం ఇవ్వడం ద్వారా ‘పరలోకంలో ధనాన్ని’ సమకూర్చుకోమని యేసు కూడా ప్రోత్సహించాడు, అక్కడ ధనం సురక్షితంగా ఉంటుంది.—మత్త. 6:19, 20.

13. మొదటి యోహాను 2:15-17ను మనసులో ఉంచుకొని మనం ఏ ప్రశ్నలు వేసుకోవాలి?

13 ‘లోకం పట్ల, లోకంలో ఉన్నవాటి పట్ల’ మీ వైఖరి మీరు యెహోవాపై పూర్తిగా ఆధారపడుతున్నారని చూపిస్తోందా? (1 యోహా. 2:15-17) లోకం అందించే వాటికన్నా ఆధ్యాత్మిక సంపదలను, రాజ్య సేవలో ఉన్న గొప్ప అవకాశాలను ఇష్టపడుతూ మీరు వాటిని ప్రాముఖ్యమైనవిగా ఎంచుతున్నారా? (ఫిలి. 3:8) మీ ‘కంటిని తేటగా’ ఉంచుకోవడానికి కృషి చేస్తున్నారా? (మత్త. 6:22) మీరు వివేకులుగా, బాధ్యత గలవారిగా ఉండాలని మరిముఖ్యంగా మీకు కుటుంబం ఉన్నట్లైతే మీరలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. (1 తిమో. 5:8) అంతేకాక తన సేవకులు, నశించిపోతున్న సాతాను లోకంపై కాక తనపై పూర్తి నమ్మకముంచాలని ఆయన ఆశిస్తున్నాడు.—హెబ్రీ. 13:5.

14-16. కొంతమంది తమ ‘కంటిని తేటగా’ ఉంచుకొని, రాజ్య సంబంధ విషయాలకు ప్రథమ స్థానమివ్వడం వల్ల ఎలా ప్రయోజనం పొందారు?

14 ముగ్గురు పిల్లలున్న రిచర్డ్‌, రూత్‌ అనే దంపతుల ఉదాహరణను పరిశీలించండి. రిచర్డ్‌ ఇలా అన్నాడు: “యెహోవా సేవలో ఇంకా ఎక్కువ చేయగలనని నాకు బలంగా అనిపించింది. నేను సౌకర్యవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ సమయం మిగిలినప్పుడు మాత్రమే దేవుని సేవ చేస్తున్నాననిపించింది. అందుకే నేను, నా భార్య కలిసి ఆ విషయం గురించి ప్రార్థించి, మా ఖర్చులను లెక్కచూసుకున్న తర్వాత, వారానికి నాలుగు రోజులు మాత్రమే పనిచేసేందుకు నన్ను అనుమతించమని సూపర్‌వైజర్‌ను అడగాలనే నిర్ణయానికి వచ్చాం. అప్పటికే దేశంలో ఆర్థిక సంక్షోభం ఉన్నా అలా చేయాలనుకున్నాం. నేను అడిగిన దానికి మా సూపర్‌వైజర్‌ ఒప్పుకోవడంతో నేను వారానికి నాలుగు రోజులు మాత్రమే పనిచేయడం మొదలుపెట్టాను.” రిచర్డ్‌కు ఇప్పుడు ఏమనిపిస్తుంది?

15 “ఇప్పుడు నా జీతం ముందుకన్నా 20 శాతం తక్కువ. అయినా కుటుంబంతో గడపడానికి, పిల్లలకు శిక్షణనివ్వడానికి నాకిప్పుడు సంవత్సరంలో అదనంగా 50 రోజులు ఉన్నాయి. అంతేకాక, నేను పరిచర్యలో గడిపే సమయం రెండింతలు పెరిగింది, బైబిలు అధ్యయనాలు మూడింతలు పెరిగాయి, అలాగే సంఘానికి సంబంధించిన పనుల్లో కూడా మరింత ముందు ఉండగలుగుతున్నాను. నేను పిల్లలను చూసుకోవడానికి ఎక్కువగా అందుబాటులో ఉంటున్నాను కాబట్టి, వీలైనప్పుడల్లా రూత్‌ సహాయ పయినీరు సేవ చేయగలుగుతోంది. నేను సాధ్యమైనంత ఎక్కువ కాలం ఇలాగే కొనసాగాలనే కృతనిశ్చయంతో ఉన్నాను.”

16 రాయ్‌, పటీన అనే దంపతులకు ఇంకా తమ సంరక్షణలోనే ఉన్న ఓ కూతురు ఉంది. అయినా, వారు పూర్తికాల పరిచర్య చేసేందుకు వీలుగా ఉద్యోగ సమయాన్ని తగ్గించుకున్నారు. రాయ్‌ ఇలా అన్నాడు: “నేను వారానికి మూడు రోజులు పనిచేస్తాను, నా భార్య రెండు రోజులు పనిచేస్తుంది. అంతేగాక, మేము ఓ చిన్న అపార్ట్‌మెంటులోకి మారాం. మా అబ్బాయి, అమ్మాయి పుట్టకముందు మేము పయినీర్లుగా సేవ చేసేవాళ్లం. కానీ, పయినీరు సేవ చేయాలనే మా కోరికను ఎన్నడూ వదులుకోలేదు. మా పిల్లలు పెద్దవారైన తర్వాత మళ్లీ పూర్తికాల పరిచర్యలో అడుగుపెట్టాం. మేము పొందిన ఆశీర్వాదాలను మరే సంపదలతోనూ పోల్చలేం.”

“దేవుని సమాధానము” మీ హృదయాలకు కావలిగా ఉండనివ్వండి

17. జీవితంలో ఒడిదుడుకులు ఎదురైనప్పుడు లేఖనాలు మిమ్మల్ని ఎలా ఓదార్చాయి?

17 “అదృష్టవశముచేతనే [‘అనూహ్యంగా,’ NW] కాలవశము చేతనే” చాలా సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి రేపేమి సంభవిస్తుందో మనకెవ్వరికీ తెలియదు. (ప్రసం. 9:11) రేపేమి జరుగుతుందో తెలియనంత మాత్రాన ఈరోజు మనకున్న మనశ్శాంతిని పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. దేవునితో సన్నిహిత సంబంధం లేని ప్రజలే అలా చేస్తారు. (మత్త. 6:34) అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును.”—ఫిలి. 4:6, 7.

18, 19. దేవుడు మనల్ని ఏయేవిధాలుగా ఓదారుస్తాడు? ఒక ఉదాహరణ ఇవ్వండి.

18 క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న చాలామంది సహోదర సహోదరీలు యెహోవా సహాయంతో మనశ్శాంతిని, సమాధానాన్ని అనుభవించారు. ఓ సహోదరి ఇలా చెప్పింది: “రక్తం ఎక్కించుకోమని ఓ డాక్టరు నన్ను పదేపదే భయపెట్టడానికి ప్రయత్నించాడు. ఆయన ఒకసారి వచ్చీరాగానే, ‘ఈ రక్తం ఎక్కించుకోకపోవడం ఏంటో?’ అని వ్యంగ్యంగా అన్నాడు. ఆ సమయంలో, మరితర సమయాల్లో నేను మౌనంగా యెహోవాకు ప్రార్థించాను, ఆయన నాకు మనశ్శాంతిని అనుగ్రహించాడు. నేను రాయిలా బలంగా ఉన్నానని అనిపించింది. కాబట్టి రక్తం తక్కువగా ఉండడం వల్ల నేను బలహీనంగా ఉన్నా, నా నిర్ణయానికి సంబంధించిన లేఖనాధారిత కారణాలను స్పష్టంగా వివరించగలిగాను.”

19 కొన్నిసార్లు, మనల్ని ఓదార్చే తోటి విశ్వాసి ద్వారా లేదా సమయానుకూలమైన ఆధ్యాత్మిక ఆహారం ద్వారా యెహోవా మనకు కావాల్సిన సహాయం చేయవచ్చు. “నాకు అవసరమైనదే ఈ ఆర్టికల్‌లో వచ్చింది. ఇది నా కోసమే రాయబడింది!” అని ఎవరైనా ఒక సహోదరుడు/సహోదరి అనడాన్ని మీరు బహుశా వినేవుంటారు. మన పరిస్థితులు, అవసరాలు ఏవైనా మనం యెహోవాపై నమ్మకముంచితే ఆయన మనపై తనకున్న ప్రేమను నిరూపించుకుంటాడు. ఎందుకంటే, మనం ఆయన ‘గొర్రెలం,’ ఆయన పేరు పెట్టబడిన ప్రజలం.—కీర్త. 100:3; యోహా. 10:16; అపొ. 15:14, 16.

20. సాతాను లోకం అంతమైనప్పుడు యెహోవా సేవకులు ఎందుకు సురక్షితంగా ఉంటారు?

20 అతి త్వరలో రాబోతున్న “యెహోవా ఉగ్రత దినము[లో]” సాతాను లోకంలోని ప్రజల ఆశ్రయాలన్నీ కుప్పకూలిపోతాయి. బంగారం, వెండి మరితర విలువైన వస్తువులేవైనా ఎలాంటి భద్రతనూ ఇవ్వలేవు. (జెఫ. 1:18; సామె. 11:4) మనకు భద్రతను ఇవ్వగలిగేది కేవలం మన “నిత్యాశ్రయదుర్గము” మాత్రమే. (యెష. 26:4) కాబట్టి, యెహోవా నీతి మార్గాల్లో నమ్మకంగా నడవడం ద్వారా, ప్రజలు పట్టించుకోకపోయినా లేదా మనల్ని వ్యతిరేకించినా రాజ్య సువార్తను ప్రకటించడం ద్వారా, మన చింతల్ని యెహోవాపై మోపడం ద్వారా ఆయనపై మనకు పూర్తి నమ్మకం ఉందని చూపిద్దాం. ఇవన్నీ చేస్తే మనం ‘సురక్షితంగా నివసిస్తాం, కీడు వస్తుందన్న భయం లేకుండా నెమ్మదిగా ఉంటాం.’—సామె. 1:33.

[అధస్సూచి]

a ‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’ అనే పుస్తకంలో 115-121 పేజీలు చూడండి.

మీరు వివరించగలరా?

ఈ కింది మూడు పరిస్థితుల్లో మనమెలా దేవునిపై నమ్మకముంచవచ్చు?

• తప్పు చేయాలనే శోధన ఎదురైనప్పుడు . . .

• ప్రజలు సువార్తను పట్టించుకోనప్పుడు, మనల్ని వ్యతిరేకించినప్పుడు . . .

• జీవిత చింతలతో వ్యవహరిస్తున్నప్పుడు . . .

[13వ పేజీలోని చిత్రం]

దేవుని ప్రమాణాలను పాటిస్తే సంతోషంగా ఉంటాం

[15వ పేజీలోని చిత్రం]

“యెహోవాయే నిత్యాశ్రయదుర్గము”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి