తప్పుడు ఆలోచనా విధానంతో మిమ్మల్ని మీరు మోసగించుకోకండి
తి నొద్దన్న చెట్టు పండ్లను హవ్వ తిన్న తర్వాత, “నీవు చేసినది యేమిటి?” అని దేవుడు ఆమెను అడిగాడు. అప్పుడు ఆమె, “సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిని” అని జవాబిచ్చింది. (ఆది. 3:13) దేవునికి ఆమె అవిధేయత చూపించేలా చేసిన జిత్తులమారి సర్పమైన సాతానుకే ఆ తర్వాత, ‘సర్వలోకమును మోసం చేస్తున్న ఆది సర్పం’ అనే పేరు వచ్చింది.—ప్రక. 12:9.
ఆదికాండములోని ఈ వృత్తాంతం సాతానును కుయుక్తిపరునిగా, అజాగ్రత్తపరులను మోసగించడానికి అబద్దాలు అల్లేవానిగా చిత్రీకరిస్తుంది. హవ్వ వాడి ఉచ్చులో పడిపోయింది. అయితే మనల్ని మోసపరచగలిగేది సాతానొక్కడే అని మనం అనుకోకూడదు. ‘తప్పుడు ఆలోచనా విధానంతో మనలను మనమే మోసగించుకునే’ ప్రమాదం కూడా ఉందని బైబిలు హెచ్చరిస్తోంది.—యాకో. 1:22, NW.
మనల్ని మనం మోసగించుకునే పరిస్థితి అసలు రాదని మనకనిపించవచ్చు. కానీ, మన ప్రయోజనం కోసమే దేవుడు ఆ హెచ్చరికను ఇచ్చాడు. కాబట్టి, మనల్ని మనం ఎలా మోసగించుకుంటామో, ఎలాంటి తప్పుడు ఆలోచనా విధానం మనల్ని తప్పుదారి పట్టిస్తుందో పరిశీలించడం మంచిది. దీనికోసం, బైబిల్లోని ఒక ఉదాహరణ చూద్దాం.
తమను తాము మోసగించుకున్నవారి నుండి మనమేమి నేర్చుకోవచ్చు?
దాదాపు సా.శ.పూ. 537లో, బబులోను చెరలో ఉన్న యూదులు యెరూషలేముకు తిరిగి వెళ్లి దేవాలయాన్ని మళ్లీ నిర్మించాలని పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించాడు. (ఎజ్రా 1:1, 2) యెహోవా ఉద్దేశించినట్లే, తిరిగి వచ్చిన వారు ఆ తర్వాతి సంవత్సరం కొత్త ఆలయానికి పునాదులు వేశారు. ఆ ప్రాముఖ్యమైన పనికి సంబంధించిన తొలిదశను యెహోవా ఆశీర్వదించినందుకు వారంతా ఎంతో సంతోషించి ఆయనను స్తుతించారు. (ఎజ్రా 3:8, 10, 11) కానీ త్వరలోనే ఆ నిర్మాణ పనికి వ్యతిరేకత ఎదురవడం వల్ల ప్రజలు నిరుత్సాహపడ్డారు. (ఎజ్రా 4:4) వారు తిరిగి వచ్చిన దాదాపు 15 సంవత్సరాల తర్వాత, యెరూషలేములో జరుగుతున్న నిర్మాణ పనిని పారసీక దేశపు అధికారులు నిషేధించారు. ఆ నిషేధాన్ని అమలు చేయడానికి స్థానిక అధికారులు యెరూషలేముకు వచ్చి “బలవంతముచేతను, అధికారముచేతను” యూదుల పనిని ఆపేశారు.—ఎజ్రా 4:21-24.
అలా తీవ్రమైన వ్యతిరేకత ఎదురవడం వల్ల యూదులు తప్పుడు ఆలోచనా విధానంతో తమను తాము మోసగించుకున్నారు. “సమయమింకరాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయమింక రాలేదు” అని వారనుకున్నారు. (హగ్గ. 1:2) అంటే, ఆలయాన్ని అప్పుడే నిర్మించాలని దేవుడు కోరుకోవడం లేదని వారనుకున్నారు. వారు ఆయన ఇష్టాన్ని ఎలా నెరవేర్చాలని ఆలోచించే బదులు, తమకివ్వబడిన పవిత్రమైన నియామకాన్ని విడిచిపెట్టి తమ ఇళ్లను బాగుచేసుకోవడంలో మునిగిపోయారు. దేవుని ప్రవక్తయైన హగ్గయి వారిని సూటిగా ఇలా అడిగాడు: “[యెహోవా] మందిరము పాడైయుండగా మీరు సరంబీవేసిన యిండ్లలో నివసించుటకు ఇది సమయమా?”—హగ్గ. 1:4.
ఈ ఉదాహరణ నుండి మనమేమి నేర్చుకోవచ్చు? దేవుని సంకల్పం నెరవేరే సమయం గురించి సరైన అభిప్రాయం లేకపోతే ఆధ్యాత్మిక కార్యకలాపాలు ఎంత ప్రాముఖ్యమైనవో మర్చిపోయి, మనం వ్యక్తిగత పనుల్లో మునిగిపోతాం. అదెలాగో అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చూద్దాం. మీ ఇంటికి అతిథులు వస్తున్నారనుకోండి. మీరు హడావిడిగా వారికి అవసరమైన ఏర్పాట్లు చేయడంలో మునిగిపోతారు. కానీ, వారు ఆలస్యంగా వస్తున్నారని మీకు తెలిస్తే, మీరు చేస్తున్న ఏర్పాట్లను ఆపేస్తారా?
అయితే, వ్యతిరేకత ఎదురైనా ఆలస్యం చేయకుండా ఆలయాన్ని తిరిగి నిర్మించాలన్నదే యెహోవా కోరిక అని యూదులు అర్థంచేసుకోవడానికి హగ్గయి జెకర్యాలు సహాయం చేశారని గుర్తుచేసుకోండి. “దేశములోనున్న సమస్తజనులారా, ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి” అని హగ్గయి ప్రోత్సహించాడు. (హగ్గ. 2:4) కాబట్టి, దేవుని ఆత్మ తమకు సహాయం చేస్తుందనే నమ్మకంతో వారు ఆ పని కొనసాగించాలి. (జెక. 4:6, 7) యెహోవా దినం గురించి తప్పుడు అభిప్రాయానికి రాకుండా ఉండేందుకు ఈ ఉదాహరణ మనకు సహాయం చేస్తుంది.—1 కొరిం. 10:11.
తప్పుడు ఆలోచనను విడిచిపెట్టి సరిగ్గా ఆలోచించండి
అపొస్తలుడైన పేతురు తాను రాసిన రెండవ పత్రికలో ‘క్రొత్త ఆకాశములను, క్రొత్త భూమిని’ స్థాపించేందుకు యెహోవాకు ఉన్న కాలపట్టిక గురించి మాట్లాడాడు. (2 పేతు. 3:13) మానవుల వ్యవహారాల్లో దేవుడు ఎప్పుడైనా కలుగజేసుకుంటాడా అని కొంతమంది అపహాసకులు సందేహాలను వ్యక్తం చేశారని పేతురు రాశాడు. ఏమీ జరగదని, “సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచి యున్నది” అని వారు తప్పుగా వాదించారు. (2 పేతు. 3:4) ఆ తప్పుడు వాదనను పేతురు తిప్పికొట్టాలనుకున్నాడు. ఆయనిలా రాశాడు: “మీకు జ్ఞాపకముచేసి, నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను.” ఆ అపహాసకులు పొరబడ్డారనే విషయాన్ని తోటి క్రైస్తవులకు ఆయన జ్ఞాపకం చేశాడు. నిజానికి, గతంలో దేవుడు భూవ్యాప్తంగా జలప్రళయాన్ని తీసుకురావడం ద్వారా మానవజాతి వ్యవహారాల్లో కలుగజేసుకున్నాడు.—2 పేతు. 3:1, 2, 5-7.
సా.శ.పూ. 520లో, ధైర్యంచెడి నిర్మాణ పనిని ఆపేసిన యూదులను హగ్గయి అదేవిధంగా ప్రోత్సహించాడు. “మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి” అని ఆయన అన్నాడు. (హగ్గ. 1:5) హగ్గయి తన తోటి ఆరాధికులను ఆలోచింపజేయడానికి, దేవుడు తన ప్రజల విషయంలో చేసిన వాగ్దానాలను, సంకల్పాలను వారికి జ్ఞాపకం చేశాడు. (హగ్గ. 1:8; 2:4, 5) అలా ప్రోత్సహించిన కొంతకాలానికే, అధికారిక నిషేధం ఉన్నప్పటికీ యూదులు నిర్మాణ పనిని తిరిగి ప్రారంభించారు. శత్రువులు మళ్లీ వారి పనిని ఆపుజేయడానికి ప్రయత్నించారు కానీ అలా చేయలేకపోయారు. ఆ తర్వాత నిషేధం ఎత్తివేయబడడంతో 5 సంవత్సరాల్లో ఆలయ నిర్మాణం పూర్తయ్యింది.—ఎజ్రా 6:14, 15; హగ్గ. 1:14, 15.
మన ప్రవర్తన గురించి ఆలోచించుకోవాలి
కష్టాలు ఎదురైనప్పుడు, హగ్గయి కాలంలోని యూదుల్లాగే మనం కూడా నిరుత్సాహపడే అవకాశం ఉందా? అలా జరిగితే, సువార్త ప్రకటనా పనిలో మనకున్న ఉత్సాహాన్ని కాపాడుకోవడం కష్టమనిపించవచ్చు. ఇంతకీ, వేటివల్ల మనం నిరుత్సాహపడే అవకాశం ఉంది? లోకంలో ఉన్న అన్యాయం వల్ల బహుశా మనం కొన్నిసార్లు బాధపడుతుండవచ్చు. “యెహోవా, నేను మొఱ్ఱపెట్టినను నీవెన్నాళ్లు ఆలకింపకుందువు? బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొఱ్ఱపెట్టినను నీవు రక్షింపక యున్నావు” అని ప్రార్థించిన హబక్కూకు గురించి ఆలోచించండి. (హబ. 1:2) అంతం ఆలస్యంగా వస్తుందనుకొనే కొందరిని చూసి ఒక క్రైస్తవుడు కూడా వారిలాగే ఆలోచిస్తూ, సుఖంగా జీవించడానికి ప్రాధాన్యతనిచ్చే ప్రమాదం ఉంది. మీ విషయంలో కూడా అలాగే జరుగుతోందా? అలాగైతే మనల్ని మనం మోసం చేసుకున్నట్లే. కాబట్టి, ‘మన ప్రవర్తన గురించి ఆలోచించుకోవాలి,’ ‘మన మనస్సులను రేపుకోవాలి’ అనే లేఖనాధార ఉపదేశాల్ని పాటించడం ఎంత ప్రాముఖ్యం! మనమిలా ప్రశ్నించుకోవచ్చు: ‘ఈ దుష్టలోకం నేను ఊహించినదానికన్నా ఎక్కువ కాలం నిలిచి ఉన్నందుకు నేను ఆశ్చర్యపోవాలా?’
వేచి ఉండాల్సి వస్తుందని బైబిలు ముందే చెప్పింది
ఈ విధానాంతం విషయంలో యేసు చెప్పిన మాటల గురించి ఒకసారి ఆలోచించండి. అంత్యదినాలకు సంబంధించి యేసు చెప్పిన ప్రవచనం గురించి మార్కు రాసిన వృత్తాంతంలో మెలకువగా ఉండమని యేసు పదేపదే హెచ్చరించడాన్ని మనం చూస్తాం. (మార్కు 13:33-37) హార్మెగిద్దోను రూపంలో వచ్చే యెహోవా మహాదినం గురించిన ప్రవచనంలో కూడా అలాంటి హెచ్చరికనే చూస్తాం. (ప్రక. 16:14-16) అలాంటి హెచ్చరికలు పదేపదే ఎందుకు ఇవ్వబడ్డాయి? ఎందుకంటే, ఎప్పటినుండో వేచిచూస్తున్నామని అనిపించినప్పుడు ప్రజలు అంతం దగ్గర్లో ఉందనే విషయాన్ని మరచిపోయే ప్రమాదముంది.
అంతం గురించి ఎదురు చూస్తున్నప్పుడు మనమెందుకు మెలకువగా ఉండాలో తెలియజేయడానికి ఇంట్లో దొంగతనం జరిగిన ఒక వ్యక్తి ఉదాహరణను యేసు చెప్పాడు. ఆ గృహస్థుడు దొంగతనాన్ని ఎలా ఆపగలిగివుండేవాడు? ఆయన రాత్రంతా మెలకువగా ఉంటే అలా ఆపవచ్చు. “మీరనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి” అనే ఉపదేశంతో యేసు ఆ ఉదాహరణను ముగించాడు.—మత్త. 24:43, 44.
ఎక్కువ కాలమైనా సరే వేచివుండడానికి సిద్ధంగా ఉండాలని ఆ ఉదాహరణను బట్టి తెలుస్తోంది. ఈ దుష్టలోకం మనం అనుకున్న దానికన్నా ఎక్కువ కాలం నిలిచివుందని అతిగా ఆందోళనపడకూడదు. యెహోవా చర్య తీసుకోవడానికి “సమయమింక రాలేదు” అని తప్పుగా ఆలోచిస్తూ మనల్ని మనం మోసగించుకోకూడదు. అలా ఆలోచిస్తే రాజ్యసువార్త ప్రకటించాలనే మన కోరిక బలహీనమౌతుంది.—రోమా. 12:11.
తప్పుడు ఆలోచనా విధానాన్ని తీసేసుకోండి
తప్పుడు ఆలోచనా విధానం గురించి గలతీయులు 6:7లో పాటించదగిన ఓ సూత్రం ఉంది. ఆ లేఖనం ఇలా చెబుతోంది: “మోసపోకుడి . . . మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును.” నేలను విత్తకుండా వదిలేస్తే, కలుపు మొక్కలు ఇట్టే పెరుగుతాయి. అలాగే, మన ఆలోచనా సామర్థ్యాలను పురికొల్పుకోకపోతే తప్పుడు ఆలోచనలు మన మనస్సుల్లో నాటుకుపోవచ్చు. ఉదాహరణకు, ‘యెహోవా దినం తప్పకుండా వస్తుంది, కానీ ఇప్పుడే కాదు’ అని మనం అనుకునే ప్రమాదం ఉంది. అలా ఆలోచిస్తే, మనం దైవపరిపాలనా కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనకపోవచ్చు, వాటిని మెల్లమెల్లగా పక్కనబెట్టే పరిస్థితి రావచ్చు. అప్పుడు, మనం ఊహించని సమయంలో అకస్మాత్తుగా యెహోవా దినం మన మీదకు రావచ్చు.—2 పేతు. 3:10.
“ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో” ఎప్పుడూ పరీక్షించి తెలుసుకుంటున్నట్లైతే, తప్పుడు ఆలోచనా విధానాన్ని మన మనస్సుల్లోకి రానివ్వం. (రోమా. 12:2) ప్రతీరోజు బైబిలు చదవడం ఈ విషయంలో ఎంతో సహాయకరంగా ఉంటుంది. లేఖనాలను చదవడం వల్ల యెహోవా తాను అనుకున్న సమయంలో తప్పకుండా చర్య తీసుకుంటాడనే మన నమ్మకం బలపడుతుంది.—హబ. 2:3.
ప్రేమతో, దయతో మనం చేసే పనుల వల్ల, అలాగే అధ్యయనం చేయడం, ప్రార్థించడం, కూటాలకు క్రమంగా హాజరవడం, పరిచర్యలో పాల్గొనడం వంటి వాటి వల్ల ‘దేవుని దినపు రాకడను ఆశతో అపేక్షిస్తూ’ ఉండగలుగుతాం. (2 పేతు. 3:11, 12) అవన్నీ క్రమంగా చేయడాన్ని యెహోవా తప్పక గమనిస్తాడు. “మనము మేలుచేయుట యందు విసుకక యుందము. మనము అలయక మేలు చేసితిమేని తగినకాలమందు పంటకోతుము” అని అపొస్తలుడైన పౌలు గుర్తుచేస్తున్నాడు.—గల. 6:9.
యెహోవా దినం వాయిదా వేయబడిందనే తప్పుడు ఆలోచనతో మనల్ని మనం మోసం చేసుకోవడానికి ఇది సమయం కానేకాదు. బదులుగా, యెహోవా దినం సమీపించింది కాబట్టి ఈ సమయంలో మన హృదయాలను స్థిరపరచుకోవాలి.
[4వ పేజీలోని చిత్రం]
ఆలయాన్ని నిర్మించమని హగ్గయి జెకర్యాలు యూదులను ప్రోత్సహించారు
[5వ పేజీలోని చిత్రం]
దొంగ వస్తాడని తెలిస్తే గృహస్థుడు ఏమి చేసివుండేవాడు?