దేవుని వాక్యం ఏమి చెబుతుందో తెలుసుకోండి
దేవుడు ఎవరు?
ఈ ఆర్టికల్ సాధారణంగా మీకు వచ్చే సందేహాలను ప్రస్తావిస్తుంది. అంతేకాదు, వాటికి జవాబులు మీ బైబిల్లో ఎక్కడ ఉన్నాయో కూడా ఈ ఆర్టికల్ తెలియజేస్తుంది. ఆ జవాబులను మీతో చర్చించడానికి యెహోవాసాక్షులు ఇష్టపడతారు.
1. దేవుడు ఎవరు?
అన్నిటినీ సృష్టించినవాడే నిజమైన దేవుడు. బైబిలు ఆయనను ‘యుగాలకు రాజు’ అని పిలుస్తుంది, అంటే ఆయనకు ఆది లేదు, అంతం కూడా ఎప్పటికీ ఉండదని అర్థం. (ప్రకటన 15:3) జీవానికి మూలం దేవుడే కాబట్టి ఆయనను మాత్రమే మనం ఆరాధించాలి.—ప్రకటన 4:10, 11 చదవండి.
2. దేవుడు ఎలా ఉంటాడు?
దేవుణ్ణి ఇంతవరకు ఎవ్వరూ చూడలేదు, ఎందుకంటే ఆయన ఆత్మ స్వరూపి. అంటే ఆయన భూమ్మీద జీవించే భౌతిక జీవుల కన్నా ఎంతో ఉన్నతమైన జీవంగలవాడు. (యోహాను 1:18; 4:24) దేవుడు సృష్టించిన వాటిని చూస్తే, ఆయనకు ఎలాంటి లక్షణాలు ఉన్నాయో తెలుస్తుంది. ఉదాహరణకు, పండ్లలో, పువ్వులలో ఉన్న రకాల గురించి, వాటిని రూపొందించిన విధానం గురించి ఆలోచిస్తే దేవుని ప్రేమను, జ్ఞానాన్ని అర్థం చేసుకుంటాం. ఎంతో సువిశాలంగావున్న విశ్వాన్ని చూస్తే దేవునికి ఎంత శక్తి ఉందో అర్థమవుతుంది.—రోమీయులు 1:20 చదవండి.
బైబిలు నుండి కూడా మనం దేవుని లక్షణాల గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవచ్చు. ఉదాహరణకు, దేవుడు దేన్ని ఇష్టపడతాడో, దేన్ని ఇష్టపడడో, ఆయన ప్రజలతో ఎలా వ్యవహరిస్తాడో, వివిధ పరిస్థితుల్లో ఆయన ఎలా స్పందిస్తాడో అది తెలియజేస్తుంది.—కీర్తన 103:7-10 చదవండి.
3. దేవునికి ఒక పేరు ఉందా?
యేసు ఇలా అన్నాడు, ‘పరలోకంలోవున్న మా తండ్రీ, నీ పేరు పవిత్రపర్చబడాలి.’ (మత్తయి 6:9, పరిశుద్ధ బైబిల్: తెలుగు ఈజీ-టు-రీడ్ వర్షన్) దేవుణ్ణి ఎన్నో రకాలుగా పిలిచినా ఆయనకు పేరు మాత్రం ఒకే ఒకటి ఉంది. దాన్ని ఒక్కో భాషలో ఒక్కోలా ఉచ్ఛరిస్తారు. సాధారణంగా తెలుగులో “యెహోవా” అంటాం, లేదా కొన్నిసార్లు “యావే” అంటాం.—కీర్తన 83:18 చదవండి.
చాలా బైబిలు అనువాదాల్లో దేవుని పేరు తీసేసి ప్రభువు లేదా దేవుడు అని పెట్టారు. అయితే, బైబిలు రాయబడినప్పుడు అందులో దేవుని పేరు దాదాపు 7,000 సార్లు ఉంది. యేసు ప్రజలకు దేవుని వాక్యం గురించి వివరిస్తున్నప్పుడు దేవుని పేరును ఉపయోగించడం ద్వారా దానిని వాళ్లకు తెలియజేశాడు. దేవుని గురించి తెలుసుకునేలా ఆయన ప్రజలకు సహాయం చేశాడు.—యోహాను 17:26 చదవండి.
4. యెహోవాకు మన మీద శ్రద్ధ ఉందా?
యెహోవా మన ప్రార్థనలను స్వయంగా వినడం ద్వారా మన మీద శ్రద్ధ ఉందని చూపిస్తున్నాడు. (కీర్తన 65:2) మనుషులంతా ఎన్నో బాధలు పడుతున్నారు కాబట్టి దేవునికి మన మీద శ్రద్ధ లేదని అనుకోవాలా? దేవుడు మనల్ని పరీక్షించడానికి మనం బాధపడేలా చేస్తాడని కొంతమంది వాదిస్తారు, కానీ అది నిజం కాదు. బైబిలు ఇలా చెబుతోంది, ‘సర్వశక్తుడు దుష్కార్యం చేయడం అసంభవం.’—యోబు 34:10; యాకోబు 1:13 చదవండి.
దేవుడు మానవులకు సొంతగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛనిచ్చి వాళ్లను ఘనపర్చాడు. దేవుణ్ణి సేవించాలని నిర్ణయించుకునే విషయంలో మనకున్న స్వేచ్ఛను మనం విలువైనదిగా ఎంచుతాం, అవునా? (యెహోషువ 24:15) వేరేవాళ్లకు కీడు చేయాలని చాలామంది అనుకుంటున్నారు కాబట్టే బాధలు ఎక్కువవుతున్నాయి. అలాంటి అన్యాయం చూసి యెహోవా ఎంతో దుఃఖపడతాడు.—ఆదికాండము 6:5, 6 చదవండి.
త్వరలోనే యేసు ద్వారా యెహోవా బాధలను, వాటిని కలిగించే వాళ్లను పూర్తిగా లేకుండా చేస్తాడు. ఈలోపు యెహోవా బాధలను తాత్కాలికంగా అనుమతించడానికి తగిన కారణం ఉంది. ప్రజలు బాధలుపడ్డానికి దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడో, క్రమంగా వచ్చే ఈ శీర్షికలోని మరో పాఠం వివరిస్తుంది.—యెషయా 11:3, 4 చదవండి.
5. మనం ఏమి చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు?
యెహోవా మనల్ని సృష్టించినప్పుడు, తన గురించి తెలుసుకునే సామర్థ్యాన్ని, తనను ప్రేమించే సామర్థ్యాన్ని మనకు ఇచ్చాడు. మనం ఆయన గురించి సత్యం తెలుసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. (1 తిమోతి 2:4) మనం బైబిలు అధ్యయనం చేస్తే దేవుణ్ణి ఒక స్నేహితునిలా తెలుసుకోవచ్చు.—సామెతలు 2:4, 5 చదవండి.
యెహోవా మనకు జీవాన్నిచ్చాడు కాబట్టి అందరికన్నా ఎక్కువగా మనం ఆయనను ప్రేమించాలి. ప్రార్థనలో దేవునితో మాట్లాడడం ద్వారా, ఆయన చెప్పేది చేయడం ద్వారా మనం ఆయనను ప్రేమిస్తున్నామని చూపించవచ్చు. (సామెతలు 15:8) ఇతరులతో ప్రేమగా వ్యవహరించాలని యెహోవా మనల్ని కోరుతున్నాడు.—మార్కు 12:29, 30; 1 యోహాను 5:3 చదవండి. (w11-E 02/01)
ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే, యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? అనే పుస్తకంలోని 1వ అధ్యాయం చూడండి.
[23వ పేజీలోని చిత్రం]
బాధలను తాత్కాలికంగా అనుమతించడానికి తగిన కారణం ఏదైనా ఉండే అవకాశముందా?