దేవునికి దగ్గరవ్వండి
ఆయన యెహోవా హృదయాన్ని మెత్తబర్చాడు
చిన్నప్పుడు నేర్చుకున్న దేవుని ప్రమాణాల ప్రకారం జీవించడం కొంతకాలం మానేసిన ఒకాయన, “నేను క్షమార్హుణ్ణి కాదని అనుకున్నాను” అని చెబుతున్నాడు. ఆయన జీవితంలో మార్పులు చేసుకోవడం మొదలుపెట్టినప్పుడు, దేవుడు తనను ఎప్పటికీ క్షమించడేమోనని భయపడ్డాడు. అయితే, ఒకప్పుడు పాపం చేసి పశ్చాత్తాపపడిన ఈయన, బైబిల్లోవున్న మనష్షే వృత్తాంతం నుండి ఓదార్పు పొందాడు. ఆ వృత్తాంతం గురించి 2 దినవృత్తాంతములు 33:1-17 వచనాల్లో ఉంది. గతంలో మీరు చేసిన పాపాలను బట్టి దేవుడు మిమ్మల్ని క్షమించడేమోనని బాధపడుతుంటే మనష్షే ఉదాహరణ నుండి మీరు కూడా ఓదార్పు పొందవచ్చు.
మనష్షే దైవభక్తిగల కుటుంబంలో పెరిగాడు. ఆయన తండ్రి హిజ్కియా యూదాను పరిపాలించిన అత్యంత విశిష్టమైన రాజుల్లో ఒకరు. దేవుడు హిజ్కియా జీవితాన్ని అద్భుతరీతిలో పొడిగించిన దాదాపు మూడేళ్ల తర్వాత ఆయనకు మనష్షే పుట్టాడు. (2 రాజులు 20:1-11) దేవుని కృప వల్లే తనకు ఈ కుమారుడు పుట్టాడని హిజ్కియా నమ్మాడు కాబట్టి దేవుడు ఆమోదించే ఆరాధన పట్ల తన కుమారుని మనసులో ప్రేమ కలిగించడానికి తప్పక ప్రయత్నించివుంటాడు. అయితే, దైవభక్తిగల తల్లిదండ్రుల పిల్లలు అన్నిసార్లూ తమ తల్లిదండ్రుల్లాగే నడుచుకోరు. మనష్షే అలాగే చేశాడు.
తండ్రి చనిపోయినప్పుడు మనష్షేకు దాదాపు 12 ఏళ్లుంటాయి. విచారకరంగా మనష్షే, ‘యెహోవా దృష్టికి చెడునడత నడిచాడు.’ (1, 2 వచనాలు) దేవుడు ఆమోదించే ఆరాధనంటే గౌరవం లేని సలహాదారుల ప్రభావం యువ రాజైన మనష్షే మీద పడి ఉంటుందా? బైబిలు దాని గురించి ఏమీ చెప్పడంలేదు కానీ మనష్షే ఘోరమైన విగ్రహారాధన, క్రూరమైన పనులు చేసే స్థాయికి దిగజారిపోయాడని మాత్రం చెబుతోంది. అబద్ధ దేవతల కోసం బలిపీఠాలను కట్టించాడు, తన కుమారులను దహనబలి అర్పించాడు, మంత్రతంత్రాలకు సంబంధించిన పనుల్లో నిమగ్నమయ్యాడు, యెరూషలేములోవున్న యెహోవా ఆలయంలో ఒక చెక్కుడు విగ్రహాన్ని నిలబెట్టాడు. యెహోవా అద్భుతరీతిలో హిజ్కియా జీవితాన్ని పొడిగించడం వల్లే పుట్టినా యెహోవా పదేపదే ఇచ్చిన హెచ్చరికలను ఆయన మొండిగా పెడచెవినపెట్టాడు.—3-10 వచనాలు.
చివరకు యెహోవా ఆయనను బబులోనుకు బంధీగా తీసుకుపోనిచ్చాడు. అక్కడ ఉన్నప్పుడు, తను చేసిన పనుల గురించి ఆలోచించే అవకాశం ఆయనకు దొరికింది. తను నమ్ముకున్న శక్తిహీనమైన, నిర్జీవ విగ్రహాలు తనను రక్షించలేకపోయాయని ఆయన గ్రహించివుంటాడా? దైవభక్తిగల తన తండ్రి చిన్నప్పుడు నేర్పించిన విషయాల గురించి ఆలోచించివుంటాడా? ఏదేమైనా, మనష్షే తన మనసు మార్చుకున్నాడు. ‘అతడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, తనను తాను బాగా తగ్గించుకొని ఆయనకు మొరపెట్టుకున్నాడు’ అని బైబిలు చెబుతోంది.a (12, 13 వచనాలు) ఈ వచనాల్లో ‘బతిమాలుకొను’ అని అనువదించబడిన ఆదిమ భాషా పదానికి హృదయాన్ని మెత్తబర్చడం అనే అర్థముంది. అయితే, అంత ఘోరమైన పాపాలు చేసిన వ్యక్తిని దేవుడు నిజంగా క్షమిస్తాడా?
మనష్షే మనస్ఫూర్తిగా పశ్చాత్తాపపడడం చూసి యెహోవా చలించిపోయాడు. దయ చూపించమని ఆయన చేసిన విన్నపాలను విని, ‘యెరూషలేముకు, ఆయన రాజ్యంలోకి ఆయనను తిరిగి తీసుకొచ్చాడు.’ (13వ వచనం) పశ్చాత్తాపపడుతున్నానని చూపించడానికి రుజువుగా తను చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి మనష్షే చేయగలిగినదంతా చేశాడు, అంటే తన రాజ్యంలో విగ్రహారాధనను రూపుమాపాడు, ‘యెహోవాను సేవించాలని’ తన ప్రజలను కోరాడు.—15-17 వచనాలు.
గతంలో చేసిన పాపాల వల్ల మీరు దేవుని క్షమాపణ పొందడానికి అర్హులు కాదని మీకనిపిస్తే మనష్షే ఉదాహరణ నుండి ప్రోత్సాహాన్ని పొందండి. మనష్షే వృత్తాంతం దేవుని ప్రేరేపిత వాక్యంలో ఒక భాగం. (రోమీయులు 15:4) తను ‘క్షమించడానికి సిద్ధంగా’ ఉన్నానన్న విషయం మనం తెలుసుకోవాలని యెహోవా కోరుకుంటున్నట్టు స్పష్టమవుతోంది. (కీర్తన 86:5) వ్యక్తులు చేసిన పాపం కాదుగానీ వాళ్ల హృదయ పరిస్థితి ఎలా ఉందన్నది ఆయనకు ముఖ్యం. పాపం చేసిన వ్యక్తి పశ్చాత్తాపంతో ప్రార్థించి, చెడు మార్గాన్ని విడిచిపెట్టి, సరైనది చేయడానికి కృత నిశ్చయంతో ప్రయత్నిస్తే, మనష్షే చేసినట్లే యెహోవా హృదయాన్ని మెత్తబర్చవచ్చు.—యెషయా 1:18; 55:6, 7. (w11-E 01/01)
[అధస్సూచి]
a ‘అతడు యెహోవాకు మొరపెట్టినప్పుడు యెహోవా మనసు కరిగింది’ అని పవిత్ర గ్రంథము, క్యాతలిక్ అనువాదము చెబుతోంది.