కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w10 12/15 పేజీలు 2-30
  • బైబిలు సత్యానికి ఎంత శక్తివుందో చూశాను

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • బైబిలు సత్యానికి ఎంత శక్తివుందో చూశాను
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మిషనరీ సేవ
  • ప్రకటనా పనికి వ్యతిరేకత వచ్చింది
  • ఫ్లోరెన్స్‌—ఓ అద్భుతమైన నగరం
  • ఆఫ్రికాలో సేవచేయడం
  • తిరిగి ఇటలీకి వెళ్లాం
  • మేము సరైన నిర్ణయాలే తీసుకున్నాం
  • ‘మేము చేయవలసినవే చేశాము’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • దృష్టిని హృదయాన్ని ప్రతిఫలంపై కేంద్రీకరించడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • భూవ్యాప్త బైబిలు విద్యాపనిలో నా వంతు నేను చేయగలిగినందుకు సంతోషిస్తున్నాను
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • నా సృష్టికర్తను సేవిస్తూ ఉండాలని నిశ్చయించుకున్నాను
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
w10 12/15 పేజీలు 2-30

బైబిలు సత్యానికి ఎంత శక్తివుందో చూశాను

వీటో ఫ్రాయేజ్‌ చెప్పినది

ట్రెంటీనార్రా అనే పేరును బహుశా మీరెప్పుడూ వినుండరు. అది ఇటలీలోని నేపుల్స్‌కు దక్షిణాన ఉన్న ఓ చిన్న పట్టణం. మా అమ్మానాన్నలు, మా అన్న ఆంజేలో అక్కడే పుట్టారు. ఆంజేలో పుట్టిన తర్వాత, మా అమ్మానాన్నలు అమెరికాకు వెళ్లి న్యూయార్క్‌లోని రోచెస్టర్‌లో స్థిరపడ్డారు. 1926లో నేను అక్కడే పుట్టాను. 1922లో మా నాన్నగారు మొదటిసారి బైబిలు విద్యార్థులను కలుసుకున్నారు. అప్పట్లో యెహోవాసాక్షులను అలాగే పిలిచేవారు. ఆ తర్వాత కొంతకాలానికి మా అమ్మానాన్నలు బైబిలు విద్యార్థులయ్యారు.

నాన్న నెమ్మదస్థుడూ, ఆలోచనాపరుడూ అయినా అన్యాయాన్ని సహించేవాడుకాదు. మతనాయకులు ప్రజలను అజ్ఞానంలో ఉంచడాన్ని ఆయన సహించలేకపోయేవాడు కాబట్టి, అవకాశం దొరికినప్పుడెల్లా బైబిలు సత్యాలను ఇతరులతో పంచుకునేవాడు. ఉద్యోగ విరమణ తర్వాత ఆయన పూర్తికాల సేవను చేపట్టి పట్టుదలతో దానిలో కొనసాగాడు. కానీ అనారోగ్యం వల్ల, విపరీతమైన చలిగాలుల వల్ల తన 74వ ఏట ఆ సేవను ఆపేయాల్సి వచ్చింది. అయినా తన 90వ పడిలో కూడా నెలకు 40 నుండి 60 గంటలు ప్రకటనా పనిలో గడిపేవాడు. మా నాన్న మాదిరి నాపై చెరగని ముద్ర వేసింది. నాన్న కొన్నిసార్లు సరదాగా ఉన్నప్పటికీ, ఆయన గంభీరమైన వ్యక్తి. “సత్యాన్ని గంభీరంగా తీసుకోవాలి” అని ఆయన అంటుండేవాడు.

ఐదుగురు పిల్లలమైన మాకు దేవుని వాక్యాన్ని బోధించడానికి మా అమ్మానాన్నలు కృషిచేశారు. నేను 1943, ఆగస్టు 23న బాప్తిస్మం తీసుకొని, 1944 జూన్‌లో పయినీరు సేవ ఆరంభించాను. మా అక్క కార్మెల్లా ఉత్సాహవంతురాలైన ఫర్న్‌తో కలిసి న్యూయార్క్‌లోని జెనీవాలో పయినీరుగా సేవ చేసేది. నా తర్వాతి జీవితాన్ని ఫర్న్‌తోనే గడపాలనుకుంటున్నానని కొంతకాలానికే అర్థం చేసుకున్నాను. మేము 1946 ఆగస్టులో పెళ్లిచేసుకున్నాం.

మిషనరీ సేవ

మేము మొదట న్యూయార్క్‌లోని జెనీవాలో, తర్వాత నార్‌విచ్‌లో ప్రత్యేక పయినీర్లుగా సేవచేసే నియామకాలను అందుకున్నాం. 1948 ఆగస్టులో గిలియడ్‌ పాఠశాల 12వ తరగతికి హాజరయ్యే గొప్ప అవకాశం మాకు దొరికింది. ఆ తర్వాత కార్ల్‌, జోయన్‌ రిడ్జ్‌వే అనే మిషనరీ జంటతోపాటు మేము ఇటలీలోని నేపుల్స్‌కు పంపించబడ్డాం. యుద్ధంవల్ల కలిగిన నష్టం నుండి నేపుల్స్‌ అప్పుడప్పుడే అతికష్టం మీద కోలుకుంటోంది. ఇల్లు దొరకడం కష్టమైంది కాబట్టి మేము కొన్ని నెలలపాటు రెండు గదులున్న ఓ చిన్న అపార్ట్‌మెంట్లో ఉన్నాం.

మా అమ్మానాన్నలు నియాపోలిటన్‌ అనే ఇటలీ భాషను మాట్లాడుకోవడాన్ని నేను చిన్నప్పటినుండి వింటూ వచ్చాను కాబట్టి, నేను ఇటాలియన్‌ భాషను అమెరికన్‌ ఉచ్చారణలో మాట్లాడినా అక్కడి ప్రజలు అర్థం చేసుకునేవారు. ఫర్న్‌కు ఆ భాష వచ్చేది కాదుకానీ త్వరలోనే దాన్ని నేర్చుకుని, నాకన్నా బాగా మాట్లాడడం మొదలుపెట్టింది.

నేపుల్స్‌లో మొదటిగా మేము నలుగురు సభ్యులున్న ఓ ఆసక్తిగల కుటుంబాన్ని మాత్రమే కనుగొన్నాం. వారు చట్టవిరుద్ధమైన సిగరెట్లను అమ్మేవారు. పనిరోజుల్లో ఆ కుటుంబంలోని టేరెజ్జా ఆకారంలో చాలా తేడా కనిపించేది. ఉదయం ఆమె తన జేబుల్లో సిగరెట్లను నింపుకునేది కాబట్టి లావుగా కనిపించేది. సాయంత్రం అయ్యేసరికి సన్నగా కట్టెపుల్లలా కనిపించేది. అయితే, సత్యం వల్ల ఈ కుటుంబంలో పూర్తిగా మార్పు వచ్చింది. కొంతకాలానికి ఈ కుటుంబానికి చెందిన 16 మంది సాక్షులయ్యారు. ఇప్పుడు నేపుల్స్‌లో దాదాపు 3,700 మంది సాక్షులున్నారు.

ప్రకటనా పనికి వ్యతిరేకత వచ్చింది

మేము నేపుల్స్‌కు వెళ్లిన తొమ్మిది నెలలకే ఆ నగరాన్ని విడిచి వెళ్లిపొమ్మని మా నలుగురిని అధికారులు ఒత్తిడి చేశారు. ఒక నెల రోజుల కోసం మేము స్విట్జర్లాండ్‌కు వెళ్లాం. ఆ తర్వాత టూరిస్ట్‌ వీసాతో మేము తిరిగి ఇటలీకి వెళ్లాం. నేను, ఫర్న్‌ అప్పుడు టూరిన్‌లో సేవ చేయడానికి నియమించబడ్డాం. మొదట్లో ఒకామె మాకు ఓ గదిని అద్దెకిచ్చింది, మేము ఆమె బాత్‌రూమ్‌ను, వంటగదిని వాడుకునేవాళ్లం. రిడ్జ్‌వే దంపతులు టూరిన్‌కు వచ్చినప్పుడు మేమంతా కలిసి ఒక అపార్ట్‌మెంటును అద్దెకు తీసుకున్నాం. కొంతకాలానికి అదే ఇంట్లో ఐదు మిషనరీ దంపతులు నివసించేవారు.

1955లో, టూరిన్‌ను విడిచి వెళ్లిపొమ్మని అధికారులు మమ్మల్ని అడిగే సమయానికల్లా నాలుగు కొత్త సంఘాల కోసం పునాది వేయబడింది. వాటిని చూసుకునేందుకు సమర్థులైన సహోదరులు అక్కడ ఉన్నారు. ఆ అధికారులు మాతో ఇలా అన్నారు, “మీ అమెరికన్లు ఒకసారి ఇక్కడ నుండి వెళ్లిపోయారంటే మీరు సాధించినవన్నీ తప్పక మరువబడతాయని మాకు తెలుసు.” కానీ ఆ తర్వాత జరిగిన అభివృద్ధి ఆ పని దేవుని వల్లే సఫలమౌతుందని చూపించింది. నేడు టూరిన్‌లో 4,600 కన్నా ఎక్కువమంది సాక్షులున్నారు, 56 సంఘాలున్నాయి.

ఫ్లోరెన్స్‌—ఓ అద్భుతమైన నగరం

మేము ఆ తర్వాత ఫ్లోరెన్స్‌లో సేవచేసే నియామకాన్ని అందుకున్నాం. మేము ఈ నగరం గురించి ఎప్పుడూ వినేవాళ్లం, ఎందుకంటే మా అక్క కార్మెల్లా, తన భర్త మర్లన్‌ హార్ట్‌జ్లర్‌ అక్కడే మిషనరీలుగా సేవచేసేవారు. అక్కడ ఉండడాన్ని ఒక్కసారి ఊహించండి! పీయాట్సా డెల్లా సీన్యోరీయా, పొన్టె వెక్యో, ప్యాట్సాల్లె మీకెలాన్జలో, పాలాట్సో పీట్టీ వంటి ప్రాంతాల వల్ల ఆ నగరం ఎంతో అద్భుతంగా ఉండేది. ఫ్లోరెన్స్‌ ప్రజలు సువార్తకు స్పందించడాన్ని చూడడం ఎంతో సంతోషాన్నిచ్చింది.

మేము ఒక కుటుంబంతో అధ్యయనం చేశాం. తల్లిదండ్రులు బాప్తిస్మం తీసుకున్నారు. అయితే భర్తకు పొగ తాగే అలవాటుండేది. 1973లో కావలికోట పత్రిక, పొగ తాగడం చెడ్డ అలవాటనీ దాన్ని మానేయాలనీ పాఠకులను ప్రోత్సహించింది. ఆ అలవాటును మానుకోమని వాళ్ల పెద్ద పిల్లలిద్దరు తండ్రిని కోరారు. అలాగే చేస్తానని ఆయన చెప్పాడు కానీ చేయలేదు. అయితే ఓ రోజు సాయంత్రం భార్య తమ 9 ఏళ్ల కవల పిల్లలతో కలిసి ప్రార్థించకుండానే, వాళ్లను వెళ్లి పడుకోమని చెప్పింది. తర్వాత ఆమె బాధపడి వాళ్ల గదికి వెళ్లింది. అయితే వాళ్లు అప్పటికే ప్రార్థన చేసుకున్నారు. “మీరు దేనికోసం ప్రార్థించారు?” అని ఆమె వాళ్లను అడిగింది. “యెహోవా, మా నాన్న పొగ తాగడం మానుకునేలా దయచేసి సహాయం చేయి” అని ప్రార్థించామని ఆ పిల్లలు చెప్పారు. ఆమె తన భర్తను పిలిచి, “మీ పిల్లల ప్రార్థన వినండి” అని చెప్పింది. పిల్లల ప్రార్థన విన్న తర్వాత భర్త కళ్లల్లో నీళ్లు తిరిగాయి. “ఇంకెప్పుడూ పొగ తాగను” అని ఆయన చెప్పాడు. ఆయన తన మాటను నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ కుటుంబంలోని 15 కన్నా ఎక్కువమంది సాక్షులుగా ఉన్నారు.

ఆఫ్రికాలో సేవచేయడం

1959లో మేము, మరో ఇద్దరు మిషనరీలు అంటే ఆర్టూరో లెవర్రస్‌, మా అన్న ఆంజేలో సొమాలియాలోని మాగడిషుకు బదిలీ అయ్యాం. మేము అక్కడకు చేరుకున్నప్పుడు రాజకీయ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఐక్య రాజ్య సమితి ఆదేశం ప్రకారం ఇటలీ ప్రభుత్వం సొమాలియాకు స్వాతంత్ర్యం కలుగజేయాల్సివుంది, కానీ పరిస్థితి మరింత దిగజారినట్లు కనిపించింది. మేము అధ్యయనం చేసిన కొంతమంది ఇటాలియన్లు ఆ దేశాన్ని విడిచి వెళ్లిపోయారు కాబట్టి, అక్కడ సంఘాన్ని స్థాపించడం వీలుకాలేదు.

ఆ సమయంలో, జోన్‌ పైవిచారణకర్త తనకు సహాయకునిగా ఉండమని నన్ను కోరాడు. కాబట్టి మేము చుట్టుప్రక్కల దేశాలను సందర్శించడం ప్రారంభించాం. మేము బైబిలు అధ్యయనం చేసిన కొందరు మంచి అభివృద్ధిని సాధించారు, కానీ వ్యతిరేకత వల్ల వారు తమ స్వదేశాలను విడిచి వెళ్లాల్సివచ్చింది. మరికొంతమంది ఎంతో బాధను సహించాల్సివచ్చినా అక్కడే ఉండిపోయారు.a యెహోవాపట్ల వారికున్న ప్రేమ గురించి, నమ్మకస్థులుగా ఉండేందుకు వారు సహించినవాటి గురించి ఆలోచిస్తే ఇప్పటికీ కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి.

సొమాలియా, ఎరిట్రియా ప్రాంతాల్లో వేడి, తేమ చాలా అధికంగా ఉండేవి. వాతావరణ వేడితోపాటు కొన్ని స్థానిక వంటకాలు కూడా చాలా ఘాటుగా, వేడిగా ఉండేవి. మేము అలాంటి వంటకాలను మొదటిసారి ఒక బైబిలు విద్యార్థి ఇంట్లో తిన్నప్పుడు, ‘నా చెవులు ఎర్రని ట్రాఫిక్‌ లైట్లలా వెలుగుతున్నాయి!’ అని నా భార్య నవ్వుతూ అంది.

ఆంజేలో, ఆర్టూరో వేరే నియామకాన్ని అందుకున్నప్పుడు మేము ఒంటరివాళ్లం అయిపోయాం. ప్రోత్సహించేవాళ్లు ఎవరూ లేకపోతే కష్టమే. అయినా దానివల్ల మేము యెహోవాకు దగ్గరవ్వగలిగాం, ఆయనపై పూర్తిగా నమ్మకముంచగలిగాం. ప్రకటనా పని నిషేధించబడిన దేశాలను సందర్శించడం వల్ల మేము నిజానికి చాలా ప్రోత్సాహాన్ని పొందాం.

మేము సొమాలియాలో వివిధరకాల ఇబ్బందులను ఎదుర్కొన్నాం. మా దగ్గర ఫ్రిజ్‌ లేదు కాబట్టి ఏది కొన్నా, అది సొరచేప ముక్కలు కానివ్వండి లేదా అక్కడ దొరికే కొబ్బరికాయలు, మామిడి, బొప్పాయి, నారింజ, అరటి వంటి పండ్లు కానివ్వండి మేము ఆ రోజుకు సరిపడా మాత్రమే కొనుక్కునేవాళ్లం. మేము తరచూ ఎగిరే కీటకాలతో ఇబ్బందిపడాల్సి వచ్చేది. కొన్నిసార్లు గృహ బైబిలు అధ్యయనాలను నిర్వహిస్తున్నప్పుడు అవి వచ్చి మా మెడలమీద వాలేవి. అప్పట్లో కనీసం మా దగ్గర స్కూటరైనా ఉంది, లేకపోతే మేము మండుటెండలో ఎన్నో గంటలపాటు నడవాల్సివచ్చేది.

తిరిగి ఇటలీకి వెళ్లాం

స్నేహితులు సహాయం చేయడంవల్ల 1961వ సంవత్సరం, టూరిన్‌లో జరిగే అంతర్జాతీయ సమావేశానికి హాజరయ్యేందుకు అరటిపండ్లను రవాణా చేసే ఒక ఓడలో ప్రయాణించి ఇటలీకి చేరుకున్నాం. అక్కడ, మేము వేరే నియామకాన్ని అందుకుంటామని తెలుసుకున్నాం. 1962 సెప్టెంబరులో మేము ఇటలీకి తిరిగి వెళ్లాం. అక్కడ నేను ప్రాంతీయ పైవిచారణకర్తగా సేవచేయడం ఆరంభించాను. మేము ఓ చిన్న కారు కొనుక్కొని, దానిని ఐదు సంవత్సరాలపాటు రెండు సర్క్యూట్లలో ప్రయాణించడానికి మేము ఉపయోగించాం.

ఆఫ్రికాలో విపరీతమైన వేడివుంటే ఇటలీలో చాలా చలి ఉండేది. అక్కడకు వెళ్లిన మొదటి సంవత్సరం చలికాలంలో ఆల్ఫ్స్‌ పర్వతాల అడుగుభాగాన ఉన్న ఓ సంఘాన్ని సందర్శించినప్పుడు మేము గడ్డిదాచే గదిలో పడుకున్నాం. ఆ గదిని వేడిగా ఉంచడానికి ఎలాంటి సదుపాయం లేదు. అప్పుడు ఎంత చలేసిందంటే మేము మా కోట్లు వేసుకునే పడుకున్నాం. చలికి తట్టుకోలేక ఆ రోజు రాత్రి దగ్గర్లోవున్న నాలుగు కోళ్లు, రెండు కుక్కలు చచ్చిపోయాయి.

తర్వాత, నేను జిల్లా పైవిచారణకర్తగా కూడా సేవచేశాను. ఆ రోజుల్లో మేము ఇటలీ అంతటా ప్రయాణించాం. కెలాబ్రియా, సిసిలీ వంటి కొన్ని ప్రాంతాలను చాలాసార్లు సందర్శించాం. ఆధ్యాత్మికంగా ఎదిగి సంఘ పెద్దలుగా, ప్రయాణ పైవిచారణకర్తలుగా, లేదా బెతెల్‌ సభ్యులుగా సేవచేసేందుకు అర్హతలను సంపాదించుకోమని మేము యౌవనస్థులను ప్రోత్సహించాం.

పూర్ణ హృదయంతో యెహోవాకు సేవచేసిన నమ్మకమైన స్నేహితుల నుండి మేము ఎంతో నేర్చుకున్నాం. వారికున్న లక్షణాలను అంటే, యెహోవా పట్ల వారికున్న సంపూర్ణ యథార్థత, ఉదార స్వభావం, సహోదరుల పట్ల ప్రేమ, పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోయే తత్వం, స్వయంత్యాగ స్ఫూర్తి వంటి వాటిని మేము విలువైనవిగా ఎంచుతున్నాం. కొన్ని సంవత్సరాల క్రితం, ఆ దేశంలో సాక్షులు చట్టబద్ధమైన మత పరిచారకులుగా గుర్తించబడడం అసాధ్యమని అనిపించేది. అలాంటిది ఇప్పుడు వారు చట్టబద్ధంగా గుర్తించబడ్డారు. అంతేకాక, వారు రాజ్యమందిరాల్లో జరిపించిన వివాహాలకు మేము హాజరయ్యాం కూడా. టూరిన్‌లోని సహోదరుల్లా ఇక్కడివారు చెక్కలమీద కూర్చోవాల్సిన లేక సహోదరుల వంటగదుల్లో కూటాలను జరుపుకోవాల్సిన అవసరంలేదు. ఎందుకంటే, చాలా సంఘాలు యెహోవాకు మహిమను తెచ్చే అందమైన రాజ్యమందిరాలను కలిగివున్నాయి. ఇప్పుడు మేము చాలీచాలని హాళ్లలో కాక విశాలమైన అసెంబ్లీ హాళ్లలో సమావేశాలను జరుపుకుంటున్నాం. మేము ఇటలీకి వచ్చినప్పుడు 490 మంది ప్రచారకులు మాత్రమే ఉండేవారు. కానీ, ఇప్పుడు ఆ సంఖ్య 2,43,000కు పెరగడాన్ని చూసి మేము ఎంతో సంతోషిస్తున్నాం.

మేము సరైన నిర్ణయాలే తీసుకున్నాం

ఇంటి మీద బెంగపెట్టుకోవడం, అనారోగ్యానికి గురవ్వడం వంటి కొన్ని సమస్యలను మేము ఎదుర్కొన్నాం. సముద్రాన్ని చూసినప్పుడెల్లా ఫర్న్‌కు తన ఇంటివాళ్లు గుర్తుకొచ్చేవారు. అంతేకాక, ఆమెకు మూడుసార్లు పెద్దపెద్ద ఆపరేషన్‌లు జరిగాయి. ఒకసారి ఆమె బైబిలు అధ్యయనం చేయడానికి వెళ్తున్నప్పుడు ఒక విరోధి, గడ్డి ఎత్తడానికి వాడే పరికరంతో తనపై దాడిచేశాడు. అప్పుడు కూడా ఆమె ఆసుపత్రి పాలైంది.

మేము కొన్నిసార్లు నిరుత్సాహానికి గురైనా, విలాపవాక్యములు 3:24లో చెప్పబడినట్లు మేము ‘యెహోవాపై నమ్మకముంచాం.’ ఆయన ఆదరణనిచ్చే దేవుడు. మేము నిరుత్సాహంలో ఉన్న ఒక సందర్భంలో, సహోదరుడు నేథన్‌ నార్‌ నుండి ప్రోత్సాహకరమైన ఒక ఉత్తరాన్ని ఫర్న్‌ అందుకుంది. ఫర్న్‌ పయినీరు సేవ ఆరంభించిన ప్రాంతంలో అంటే పెన్సిల్వేనియాలోని బేత్లెహేముకు దగ్గర్లో ఆయన పుట్టాడు కాబట్టి పెన్సిల్వేనియా డచ్‌ స్త్రీలు ఆమెలాగే దృఢంగా, పట్టుదలతో ఉంటారన్న విషయం ఆయనకు బాగా తెలుసని సహోదరుడు నార్‌ ఆ ఉత్తరంలో రాశాడు. ఆయన చెప్పింది నిజమే. గడిచిన సంవత్సరాల్లో మేము ఎన్నో విధాలుగా, ఎంతోమంది నుండి ప్రోత్సాహాన్ని పొందాం.

సమస్యలున్నా మేము పరిచర్యలో ఎల్లప్పుడూ ఆసక్తిని కనబరచడానికి కృషి చేశాం. పరిచర్యలో కనబరిచే ఆసక్తిని లాంబ్రుస్కో అనే తళతళలాడే ఇటాలియన్‌ ద్రాక్షారసంతో పోలుస్తూ ఫర్న్‌ సరదాగా “మన ఉత్సాహం ఎప్పుడూ తళతళలాడుతూ ఉండాలి” అని చెబుతుండేది. 40 కన్నా ఎక్కువ సంవత్సరాలు ప్రాంతీయ పైవిచారణకర్తగా, జిల్లా పైవిచారణకర్తగా సేవ చేసిన తర్వాత ఇటాలియన్‌ భాష కాక ఇతర భాషా గుంపులను, సంఘాలను సందర్శించే, వాటిని ఏర్పాటుచేసే కొత్త నియామకాన్ని అందుకున్నాం. అలాంటి గుంపులు బంగ్లాదేశ్‌, చైనా, ఎరిట్రియా, ఇతియోపియా, ఘానా, ఇండియా, నైజీరియా, ఫిలిప్పీన్స్‌, శ్రీలంక, మరితర దేశాల నుండి వచ్చిన ప్రజలకు సువార్తను ప్రకటిస్తాయి. యెహోవా కనికరాన్ని రుచి చూసినవారి జీవితాలను ఆయన వాక్యానికున్న శక్తి ఎంత అద్భుతంగా మార్చేసిందో రాయాలంటే ఒక పుస్తకం సరిపోదు!—మీకా 7:18, 19.

మా పరిచర్యను జరిగించేందుకు కావాల్సిన భావోద్వేగ బలాన్ని, శారీరక బలాన్ని ఇవ్వమని మేము ప్రతీరోజు యెహోవాకు ప్రార్థిస్తాం. ప్రభువు సేవలో ఆనందించడమే మా బలం. అది మా కళ్లకు ప్రకాశాన్నిచ్చి, బైబిలు సత్యాలను వ్యాప్తి చేస్తుండగా మా జీవితంలో సరైన నిర్ణయాలే తీసుకున్నామన్న నమ్మకాన్ని కలుగజేస్తుంది.—ఎఫె. 3:7; కొలొ. 1:29.

[అధస్సూచి]

a 1992 యెహోవాసాక్షుల వార్షిక పుస్తకంలోని (ఆంగ్లం) 95-184 పేజీలు చూడండి.

[27-29వ పేజీలోని చార్టు/ చిత్రాలు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

న్యూయార్క్‌లోని రోచెస్టర్‌లో మా అమ్మానాన్నలు

1948

గిలియడ్‌ 12వ తరగతి కోసం సౌత్‌ లాన్సింగ్‌లో

1949

ఇటలీకి వెళ్లే ముందు ఫర్న్‌తో

ఇటలీలోని కెప్రీ

1952

ఇతర మిషనరీలతో పాటు టూరిన్‌లో, నేపుల్స్‌లో

1963

తన బైబిలు విద్యార్థుల్లో కొంతమందితో ఫర్న్‌

“మన ఉత్సాహం ఎప్పుడూ తళతళలాడుతూ ఉండాలి”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి