దేవుని పరిశుద్ధాత్మచేత నడిపించబడుతున్న రాజు ద్వారా ఆశీర్వాదాలు పొందండి
“యెహోవా ఆత్మ . . . అతనిమీద నిలుచును.”—యెష. 11:2.
1. ప్రపంచ సమస్యల గురించి తమకున్న చింతను కొంతమంది ఎలా వ్యక్తంచేశారు?
“రాజకీయంగా, సామాజికంగా, పర్యావరణ సంబంధంగా అల్లకల్లోలంగావున్న ఈ ప్రపంచంలో మానవాళి మరో వందేళ్లు ఎలా కొనసాగగలదు?” అని 2006లో ఖగోళ శాస్త్రవేత్త అయిన స్టీఫెన్ హాకింగ్ అడిగాడు. న్యూ స్టేట్స్‌మన్ పత్రికలోని ఓ వ్యాసంలో ఇలా ఉంది: “మనం పేదరికాన్ని రూపుమాపలేదు, ప్రపంచ శాంతిని తీసుకురానూలేదు. బదులుగా మనం పేదరికాన్ని, అశాంతిని మరింత ఎక్కువ చేసినట్లు అనిపిస్తోంది. మనం ప్రయత్నించలేదని కాదు. అందరికీ సమాన హక్కులు ఉండాలని కోరుకునే సామ్యవాదం నుండి పెట్టుబడిదారీ విధానం వరకు అన్ని పద్ధతులనూ ప్రయత్నించి చూశాం. యుద్ధాన్ని రూపుమాపేందుకు నానాజాతి సమితిని స్థాపించడం నుండి అణ్వాయుధాల్ని కుప్పలుతెప్పలుగా కూడగట్టుకునే పద్ధతి వరకూ ప్రయత్నించి చూశాం. ‘యుద్ధాన్ని మాన్పడం’ మనకు తెలుసని చూపించేందుకు ఎన్నో ‘యుద్ధాలు’ చేశాం.”
2. భూమిపై తనకున్న సర్వాధిపత్యాన్ని యెహోవా త్వరలో ఇంకా ఎలా ఉపయోగిస్తాడు?
2 అలాంటి మాటలు విన్నప్పుడు యెహోవా సేవకులు ఆశ్చర్యపోరు. ఎందుకంటే, మానవులు తమను తాము పరిపాలించుకునేలా సృష్టించబడలేదని బైబిలు చెబుతోంది. (యిర్మీ. 10:23) మనల్ని పరిపాలించే హక్కు యెహోవాకు మాత్రమే ఉంది. మనకు ప్రమాణాలను ఏర్పరచే హక్కూ మన జీవిత ఉద్దేశమేమిటో తెలియజేసి దానివైపు మనల్ని నడిపించే అధికారమూ ఆయనకు మాత్రమే ఉన్నాయి. అంతేకాక, తమను తాము పరిపాలించుకోవడానికి మానవులు చేసిన వృథా ప్రయత్నాలను అంతం చేసేందుకు త్వరలోనే ఆయన తనకున్న అధికారాన్ని ఉపయోగిస్తాడు. అదే సమయంలో, తన సర్వాధిపత్యాన్ని తిరస్కరిస్తూ ఇతరులను అపరిపూర్ణతకు, పాపానికి, “ఈ యుగ సంబంధమైన దేవత” అయిన సాతానుకు దాసులుగా ఉండేలా చేసే వారందరినీ ఆయన నాశనం చేస్తాడు.—2 కొరిం. 4:4.
3. మెస్సీయ గురించి యెషయా ఏమి ప్రవచించాడు?
3 నూతన లోకంలో మెస్సీయ రాజ్యం ద్వారా యెహోవా మానవులపై తన ప్రేమపూర్వక సర్వాధిపత్యాన్ని ఉపయోగిస్తాడు. (దాని. 7:13, 14) మెస్సీయ రాజు గురించి యెషయా ఇలా ప్రవచించాడు: “యెష్షయి మొద్దునుండి చిగురు పుట్టును వాని వేరులనుండి అంకురము ఎదిగి ఫలించును యెహోవా ఆత్మ జ్ఞానవివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యెహోవాయెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతనిమీద నిలుచును.” (యెష. 11:1, 2) మానవజాతిని పరిపాలించేలా, ‘యెష్షయి మొద్దునుండి పుట్టిన చిగురును’ అంటే యేసుక్రీస్తును దేవుని పరిశుద్ధాత్మ ఏ ప్రత్యేకమైన విధానాల్లో అర్హుణ్ణి చేసింది? ఆయన పరిపాలన వల్ల ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయి? ఆ ఆశీర్వాదాలు పొందాలంటే మనమేమి చేయాలి?
పరిపాలించేందుకు దేవుని చేత అర్హునిగా చేయబడ్డాడు
4-6. యేసు ఏ జ్ఞానం వల్ల తెలివిగల, దయగల రాజుగా, ప్రధాన యాజకునిగా, న్యాయాధిపతిగా సేవ చేయగలుగుతాడు?
4 తెలివిగల, దయగల రాజూ ప్రధాన యాజకుడూ న్యాయాధిపతీ అయిన వ్యక్తి నిర్దేశంలో మానవులు పరిపూర్ణతకు ఎదగాలని యెహోవా కోరుకుంటున్నాడు. అందుకే దేవుడు యేసును ఎంపిక చేసి, అత్యంత ప్రాముఖ్యమైన ఆ బాధ్యతలను నెరవేర్చడానికి పరిశుద్ధాత్మ ద్వారా ఆయనను అర్హునిగా చేశాడు. యెహోవా తనకు నియమించిన పాత్రలను యేసు సంపూర్ణంగా నిర్వర్తిస్తాడని ఎందుకు చెప్పవచ్చో పరిశీలించండి.
5 దేవుని గురించిన అత్యంత లోతైన జ్ఞానం యేసుకు ఉంది. అద్వితీయ కుమారునికి తండ్రి గురించి ఎవ్వరికీ తెలియనంత ముందు నుండి బహుశా వందల కోట్ల సంవత్సరాల నుండి తెలుసు. యేసు ఆ సమయంలో యెహోవా గురించి ఎంతో తెలుసుకున్నాడు కాబట్టే ఆయన “అదృశ్యదేవుని స్వరూపి” అని వర్ణించబడ్డాడు. (కొలొ. 1:15) యేసే స్వయంగా ఇలా చెప్పాడు: “నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు.”—యోహా. 14:9.
6 మానవులతో సహా సృష్టి అంతటి గురించిన సంపూర్ణ జ్ఞానం యెహోవా తర్వాత యేసుకే ఉంది. కొలొస్సయులు 1:16, 17లో ఇలా ఉంది: “ఆకాశమందున్నవియు భూమియందున్నవియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని . . . సర్వమును ఆయనయందు [దేవుని కుమారునియందు] సృజింపబడెను . . . ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్నవాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు.” దాని గురించి ఒక్కసారి ఆలోచించండి! దేవుని “ప్రధానశిల్పి[గా]” యేసు మిగతా వాటన్నిటిని సృష్టించడంలో భాగం వహించాడు. కాబట్టి ఆశ్చర్యం కలిగించే మానవ మెదడుతో సహా విశ్వంలోవున్న వాటన్నిటి గురించిన ప్రతీ వివరం ఆయనకు తెలుసు. అందుకే ఆయన, జ్ఞానానికి ప్రతిరూపం అని చెప్పవచ్చు.—సామె. 8:12, 22, 30, 31.
7, 8. పరిచర్యలో యేసుకు దేవుని పరిశుద్ధాత్మ ఎలా సహాయం చేసింది?
7 దేవుని పరిశుద్ధాత్మ చేత యేసు అభిషేకించబడ్డాడు. యేసు ఇలా అన్నాడు: “ప్రభువు [యెహోవా] ఆత్మ నామీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును, (కలుగునని) ప్రకటించుటకును నలిగినవారిని విడిపించుటకును ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు.” (లూకా 4:18, 19) యేసు బాప్తిస్మం పొందినప్పుడు, తన మానవపూర్వ ఉనికిలో నేర్చుకున్న విషయాలను పరిశుద్ధాత్మ ఆయనకు జ్ఞాపకం చేసి ఉంటుంది. అంతేగాక, మెస్సీయగా తన భూపరిచర్యలో తాను ఏమి చేయాలని దేవుడు కోరుకున్నాడో కూడా ఆ పరిశుద్ధాత్మ గుర్తుచేసి ఉంటుంది.—యెషయా 42:1; లూకా 3:21, 22; యోహాను 12:50 చదవండి.
8 యేసుకు పరిశుద్ధాత్మ సహాయం ఉంది. అంతేకాక, ఆయన పరిపూర్ణమైన శరీరాన్ని, మెదడును కలిగివున్నాడు కాబట్టి ఆయన భూమిపై జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి మాత్రమే కాదుగానీ మహాగొప్ప బోధకుడు కూడా. నిజానికి, ఆయన శ్రోతలు “ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి.” (మత్త. 7:28) ముఖ్యంగా పాపం వల్ల, అపరిపూర్ణత వల్ల, దేవుని గురించిన జ్ఞానం లేకపోవడం వల్ల మానవులు సమస్యలను ఎదుర్కొంటున్నారని యేసు అర్థం చేసుకున్నాడు. అంతేకాక ఆయన ప్రజల హృదయాల్లో ఏముందో గ్రహించగలిగేవాడు, దాని ప్రకారం వారితో వ్యవహరించేవాడు.—మత్త. 9:4; యోహా. 1:47.
9. యేసు మానవ జీవితాన్ని గురించి ఆలోచించడం, పరిపాలకునిగా ఆయనపై మీకున్న నమ్మకాన్ని ఎలా పెంచింది?
9 యేసు మానవునిగా జీవించాడు. మానవునిగా జీవించడం, అపరిపూర్ణ మానవులతో సన్నిహితంగా సహవసించడం రాజుగా అర్హత పొందడానికి యేసుకు ఎంతగానో తోడ్పడ్డాయి. అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై, దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమునుగల ప్రధానయాజకుడగు నిమిత్తము, అన్ని విషయములలో ఆయన [యేసు] తన సహోదరులవంటివాడు కావలసివచ్చెను. తాను శోధింపబడి శ్రమపొందెను గనుక శోధింపబడువారికిని సహాయము చేయగలవాడై యున్నాడు.” (హెబ్రీ. 2:17, 18) యేసు ‘శోధింపబడ్డాడు’ కాబట్టి శ్రమలను ఎదుర్కొంటున్న వారిపట్ల సానుభూతి చూపించగలడు. ఆయనెంత దయగలవాడో ఆయన భూపరిచర్య సమయంలో స్పష్టంగా రుజువైంది. రోగులు, అంగవైకల్యం గలవారు, అణచివేయబడినవారే కాక, పిల్లలు కూడా ఏమాత్రం సంకోచించకుండా ఆయనను సమీపించేవారు. (మార్కు 5:22-24, 38-42; 10:14-16) అంతేకాక దీనులు, దేవుని గురించి తెలుసుకోవాలని కోరుకునేవారు ఆయన దగ్గరకు వచ్చేవారు. మరోవైపు గర్విష్ఠులు, పొగరుబోతులు, తమలో ‘దేవుని ప్రేమలేనివారు’ ఆయనను తృణీకరించారు, ద్వేషించారు, వ్యతిరేకించారు.—యోహా. 5:40-42; 11:47-53.
10. మనపట్ల తనకున్న ప్రేమను యేసు ఏ గొప్ప రీతిలో రుజువు చేశాడు?
10 మనకోసం యేసు తన ప్రాణాన్ని పెట్టాడు. యేసు మనకోసం ఇష్టపూర్వకంగా చనిపోవడం, ఆయనే శ్రేష్ఠమైన పరిపాలకుడు అనడానికి అత్యంత గొప్ప రుజువునిస్తుంది. (కీర్తన 40:6-10 చదవండి.) “తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటె ఎక్కువైన ప్రేమగల వాడెవడును లేడు” అని క్రీస్తు చెప్పాడు. (యోహా. 15:13) అపరిపూర్ణ మానవ పాలకులు తరచూ ప్రజల డబ్బుతో విలాసవంతంగా జీవిస్తారు. అయితే, యేసు వారిలా కాక మానవుల కోసం తన ప్రాణాన్ని పెట్టాడు.—మత్త. 20:28.
విమోచన క్రయధనాన్ని అన్వయించే అధికారాన్ని పొందాడు
11. విమోచకునిగా యేసుపై మనమెందుకు పూర్తి నమ్మకాన్ని ఉంచవచ్చు?
11 ప్రధాన యాజకునిగా యేసే తన విమోచన క్రయధన బలి ప్రయోజనాలను మనకు అన్వయించడంలో నాయకత్వం వహించడం ఎంత సముచితం! వెయ్యేండ్ల పరిపాలనలో విమోచకునిగా తాను ఏమి చేస్తాడనేది యేసు తన భూపరిచర్యలోనే చూపించాడు. మనం నమ్మకంగా ఉంటే ఆ ప్రయోజనాలను పొందగలుగుతాం. యేసు రోగులను, అంగవైకల్యంగలవారిని స్వస్థపర్చాడు, చనిపోయినవారిని తిరిగి లేపాడు, వేలాదిమందికి ఆహారం పెట్టాడు, ప్రకృతి శక్తులను సహితం అదుపు చేశాడు. (మత్త. 8:26; 14:14-21; లూకా 7:14, 15) అయితే ఇతరులముందు తన అధికారాన్ని, శక్తిని ప్రదర్శించేందుకు కాదు కానీ, ప్రజలపట్ల తనకున్న దయను, ప్రేమను చూపించేందుకే ఆయన అలా చేశాడు. తనను శుద్ధునిగా చేయమని ఒక కుష్ఠరోగి యేసును వేడుకున్నప్పుడు ఆయన, “నాకిష్టమే” అని అన్నాడు. (మార్కు 1:40, 41) యేసు తన వెయ్యేండ్ల పరిపాలనలో అలాంటి దయను భూమ్మీదున్న ప్రజలందరిపై చూపిస్తాడు.
12. యెషయా 11:9 ఎలా నెరవేరుతుంది?
12 దాదాపు రెండువేల సంవత్సరాల క్రితం యేసు ప్రారంభించిన ఆధ్యాత్మిక బోధనా కార్యక్రమాన్ని ఆయన, ఆయన తోటి పరిపాలకులు కొనసాగిస్తారు. అలా యెషయా 11:9లో ఉన్న ఈ మాటలు నెరవేరతాయి: “సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి యుండును.” ఆ దైవిక బోధలో భూమిపట్ల, దానిలోని అసంఖ్యాక ప్రాణులపట్ల శ్రద్ధ చూపించడానికి సంబంధించిన సూచనలు కూడా ఉంటాయి. మొదట్లో ఆదాముకు ఇవ్వబడిన నియామకం కూడా అదే. వెయ్యేళ్లు ముగిసేసరికి ఆదికాండము 1:28లో చెప్పబడిన దేవుని ఆది సంకల్పం నెరవేరుతుంది. విమోచన క్రయధన బలి విలువ పూర్తిగా అన్వయించబడుతుంది.
తీర్పుతీర్చే అధికారాన్ని పొందాడు
13. నీతి పట్ల తనకున్న ప్రేమను యేసు ఎలా చూపించాడు?
13 “దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతి[గా]” క్రీస్తును నియమించాడు. (అపొ. 10:42) యేసు ఎన్నడూ తప్పు చేయడనీ నీతి, సత్యం ఆయనకు నడికట్టులా ఉంటాయనీ తెలుసుకోవడం ఎంత ఓదార్పునిస్తుంది! (యెష. 11:5) దురాశ, వేషధారణ, ఇతర చెడ్డ పనులను ఆయన ద్వేషించాడు, ఇతరుల బాధను పట్టించుకోని వారిని గద్దించాడు. (మత్త. 23:1-8, 25-28; మార్కు 3:5) అంతేకాక, “ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు” కాబట్టి, పైరూపాన్ని చూసి తాను మోసపోలేదని చూపించాడు.—యోహా. 2:24, 25.
14. నీతి, న్యాయం పట్ల తనకున్న ప్రేమను యేసు నేడు ఎలా చూపిస్తున్నాడు? మనం ఏ ప్రశ్నలు వేసుకోవాలి?
14 ప్రపంచ చరిత్రలో మునుపెన్నడూ జరగని స్థాయిలో జరుగుతున్న ప్రకటించే, బోధించే పనిని పర్యవేక్షించడం ద్వారా నీతి, న్యాయం పట్ల తనకున్న ప్రేమను యేసు చూపిస్తున్నాడు. దేవునికి పూర్తిగా సంతృప్తి కలిగేంత మేరకు ఈ పని జరుగుతుంది. దాన్ని ఆపడం ఏ మానవునికి, మానవ ప్రభుత్వానికి, దుష్టాత్మకు సాధ్యం కాదు. కాబట్టి, హార్‌మెగిద్దోను ముగిసే సమయానికి భూమి అంతటా దేవుని న్యాయమే ఉంటుందని మనం పూర్తిగా నమ్మవచ్చు. (యెషయా 11:3, 4; మత్తయి 16:27 చదవండి.) మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి: ‘పరిచర్యలో ప్రజలపట్ల యేసు చూపించిన వైఖరినే నేను చూపిస్తున్నానా? నా ఆరోగ్యం, వ్యక్తిగత పరిస్థితులు నా సేవను పరిమితం చేసినప్పటికీ యెహోవా సేవలో నేను చేయగలిగినదంతా చేస్తున్నానా?’
15. దేన్ని గుర్తుంచుకుంటే మనం దేవుణ్ణి పూర్ణాత్మతో సేవించగలుగుతాం?
15 ప్రకటనా పని యెహోవా దేవునికి సంబంధించిన పని అనే విషయాన్ని గుర్తుంచుకుంటే మనం పూర్ణాత్మతో ఆయనను సేవించగలుగుతాం. ఆ పనిచేయమని ఆయనే ఆజ్ఞాపించాడు, తన కుమారుని ద్వారా ఆయనే దాన్ని నిర్దేశిస్తున్నాడు, దానిలో భాగంవహించే వారిని తన పరిశుద్ధాత్మ ద్వారా ఆయనే బలపరుస్తున్నాడు. దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న ఆయన కుమారునితో పాటు దేవుని జతపనివారిగా సేవచేసే గొప్ప అవకాశాన్ని మీరు విలువైనదిగా ఎంచుతున్నారా? డెబ్బై లక్షలకన్నా ఎక్కువమంది ప్రజలు 236 దేశాల్లో రాజ్య సందేశాన్ని పంచుకునేలా యెహోవా మాత్రమే చేయగలడు. వారిలో చాలామంది “విద్యలేని పామరులని” ఎంచబడినవారే.—అపొ. 4:13.
క్రీస్తు ద్వారా వచ్చే ఆశీర్వాదాలను సంపాదించుకోండి
16. ఆదికాండము 22:18లోని మాటలను బట్టి దేవుని ఆశీర్వాదాల గురించి ఏమి తెలుస్తోంది?
16 యెహోవా అబ్రాహాముతో ఇలా అన్నాడు: ‘నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నియు నీ సంతానమువలన ఆశీర్వాదాలను సంపాదించుకుంటారు.’ (ఆది. 22:18, NW) దేవుణ్ణి, ఆయన కుమారుణ్ణి సేవించడం ఓ గొప్ప అవకాశమని ఎంచేవారు వాగ్దత్త సంతానమైన మెస్సీయ తీసుకొచ్చే ఆశీర్వాదాల కోసం నమ్మకంతో ఎదురుచూడవచ్చని ఆ మాటలను బట్టి తెలుస్తోంది. ఆ ఆశీర్వాదాలను మనసులో ఉంచుకొని వారు నేడు చురుకుగా దేవుని సేవ చేస్తున్నారు.
17, 18. యెహోవా చేసిన ఏ వాగ్దానాన్ని ద్వితీయోపదేశకాండము 28:2లో చదువుతాం? ఆ మాటలు మనకు ఏ అర్థాన్నిస్తాయి?
17 అబ్రాహాము సంతానమైన ఇశ్రాయేలు జనాంగంతో దేవుడు ఒకసారి ఇలా అన్నాడు: “నీవు నీ దేవుడైన యెహోవా మాట వినినయెడల ఈ [ధర్మశాస్త్ర నిబంధనలో పేర్కొనబడిన] దీవెనలన్నియు నీమీదికి వచ్చి నీకు ప్రాప్తించును.” (ద్వితీ. 28:2) నేటి దేవుని సేవకులకు కూడా ఆ మాటలు వర్తిస్తాయి. మీకు దేవుని ఆశీర్వాదాలు కావాలంటే, మీరు ఆయన మాట ‘వింటూ ఉండాలి.’ అప్పుడు ఆయన ఆశీర్వాదాలు ‘మీమీదికి వచ్చి మీకు ప్రాప్తిస్తాయి.’ ఇంతకీ ‘వినడం’ అంటే ఏమిటి?
18 వినడంలో ఎన్నో విషయాలు చేరివున్నాయి. మొదటిగా, దేవుని వాక్యం ద్వారా, ఆయన ఇచ్చే ఆధ్యాత్మిక ఆహారం ద్వారా ఆయన చెప్పేదాన్ని పాటించాలి. (మత్త. 24:45) అంతేకాక దేవునికి, ఆయన కుమారునికి విధేయత చూపించాలి. యేసు ఇలా అన్నాడు: “ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును.” (మత్త. 7:21) అలాగే దేవుడు ఏర్పాటు చేసిన సంఘానికి ఇష్టపూర్వకంగా లోబడాలి. అందులో ‘మనుష్యులకు ఈవులైన’ నియమిత సంఘ పెద్దలు ఉంటారు.—ఎఫె. 4:8.
19. మనమెలా ఆశీర్వాదాన్ని పొందవచ్చు?
19 ‘మనుష్యుల్లోని ఈవుల్లో’ క్రైస్తవ సంఘమంతటికీ ప్రాతినిధ్యం వహించే పరిపాలక సభ సభ్యులు కూడా ఉన్నారు. (అపొ. 15:2, 6) నిజానికి, మహాశ్రమలప్పుడు మనమెలాంటి తీర్పు పొందుతామనేది, క్రీస్తు ఆధ్యాత్మిక సహోదరుల పట్ల మనకున్న వైఖరిపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. (మత్త. 25:34-40) కాబట్టి, మనం ఆశీర్వాదాన్ని పొందాలంటే దేవుని అభిషిక్తులకు నమ్మకంగా మద్దతివ్వడం కూడా అవసరం.
20. (ఎ) ‘మనుష్యుల్లోని ఈవులకు’ ఉన్న ఒక ముఖ్యమైన బాధ్యత ఏమిటి? (బి) ఈ సహోదరులను విలువైనవారిగా ఎంచుతున్నామని మనం ఎలా చూపించవచ్చు?
20 ‘మనుష్యుల్లోని ఈవుల్లో’ పరిశుద్ధాత్మ చేత నియమించబడిన బ్రాంచి కమిటీ సభ్యులు, ప్రయాణ పైవిచారణకర్తలు, సంఘ పెద్దలు కూడా ఉన్నారు. (అపొ. 20:28) దేవుని ప్రజలందరు, ‘విశ్వాసవిషయములోను దేవుని కుమారునిగూర్చిన జ్ఞానవిషయములోను ఏకత్వముపొంది, సంపూర్ణ పురుషులగువరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారగువరకు’ క్షేమాభివృద్ధి పొందేలా చేయడమే ఈ సహోదరుల ముఖ్యమైన బాధ్యత. (ఎఫె. 4:11, 12) మనందరిలా వారు కూడా అపరిపూర్ణులే. అయితే, వారు మనల్ని ప్రేమతో కాస్తున్నందుకు వారిపట్ల మనం కృతజ్ఞత కలిగివుండి, తగిన రీతిలో స్పందిస్తే ఆశీర్వదించబడతాం.—హెబ్రీ. 13:7, 17.
21. దేవుని కుమారునికి లోబడడం మనకెందుకు అత్యవసరం?
21 త్వరలోనే, సాతాను దుష్ట విధానానికి వ్యతిరేకంగా క్రీస్తు చర్య తీసుకుంటాడు. అప్పుడు మన ప్రాణాలు యేసు తీర్చే తీర్పుపైనే ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే, ప్రవచించబడిన “గొప్ప సమూహము[ను]” “జీవజలముల బుగ్గల యొద్దకు” నడిపించే అధికారాన్ని దేవుడు ఆయనకే ఇచ్చాడు. (ప్రక. 7:9, 16, 17) కాబట్టి, యెహోవా ఆత్మచేత నడిపించబడుతున్న రాజు పట్ల కృతజ్ఞతతో ఆయనకు ఇష్టపూర్వకంగా లోబడేందుకు ఇప్పుడే శాయశక్తులా కృషిచేద్దాం.
ఈ లేఖనాల నుండి మీరేమి నేర్చుకున్నారు?
[17వ పేజీలోని చిత్రం]
యాయీరు కుమార్తెను పునరుత్థానం చేసినప్పుడు యేసుకున్న కనికరం స్పష్టంగా కనిపించింది
[18వ పేజీలోని చిత్రాలు]
చరిత్రలో మునుపెన్నడూ జరగని స్థాయిలో జరుగుతున్న ప్రకటించే, బోధించే పనిని యేసుక్రీస్తు పర్యవేక్షిస్తున్నాడు