కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w11 4/1 పేజీలు 14-22
  • సెక్స్‌ గురించి మీ పిల్లలతో మాట్లాడండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సెక్స్‌ గురించి మీ పిల్లలతో మాట్లాడండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • వాళ్ల వయస్సుకు తగినట్లు చెప్పండి
  • మొహమాటపడడం మానేయండి
  • ఓరల్‌ సెక్స్‌ నిజంగా ఓ రకమైన సెక్స్‌ ఏనా?
    యువత అడిగే ప్రశ్నలు
  • సెక్స్‌లో పాల్గొనమని తోటివాళ్లు ఒత్తిడి చేస్తే నేనేం చేయాలి?
    యువత అడిగే ప్రశ్నలు
  • సెక్స్‌ గురించి మీ పిల్లలకు చెప్పండి
    తేజరిల్లు!—2016
  • తలిదండ్రులారా—మీ పిల్లల్ని కాపాడండి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
w11 4/1 పేజీలు 14-22

కుటుంబ సంతోషానికి తోడ్పడే అంశాలు

సెక్స్‌ గురించి మీ పిల్లలతో మాట్లాడండి

అమృతa అనే అమ్మాయి ఇలా చెబుతోంది, “కొన్నిసార్లు నాకు సెక్స్‌ గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉంటుంది, కానీ దాని గురించి మా అమ్మానాన్నల్ని అడిగితే, నేనేదో చాలా చెడ్డ పని చేస్తున్నానని వాళ్లు అనుకుంటారేమో అనిపిస్తుంది.”

అమృత వాళ్లమ్మ ఇందిర ఇలా చెబుతోంది, “మా అమ్మాయితో సెక్స్‌ గురించి మాట్లాడితే బాగుంటుందని అనుకుంటాను. కానీ తనకేమో క్షణం తీరిక ఉండదు. తనెప్పుడు ఖాళీగా ఉంటుందో చెప్పడం కష్టం.”

ఈ రోజుల్లో టీవీల్లో, సినిమాల్లో, వాణిజ్య ప్రకటనల్లో ఎక్కడబడితే అక్కడ సెక్స్‌ ప్రస్తావనే ఉంటోంది. కానీ, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య జరిగే సంభాషణలో మాత్రం సెక్స్‌ గురించి ప్రస్తావించడం తప్పు అన్నట్టు పరిగణించబడుతోంది. కెనడాలో ఉంటున్న మైఖేల్‌ అనే అబ్బాయి ఇలా చెబుతున్నాడు, “సెక్స్‌ గురించి అమ్మానాన్నలతో మాట్లాడాలంటే మాకెంత ఇబ్బందిగా, సిగ్గుగా ఉంటుందో వాళ్లు అర్థం చేసుకోగలిగితే బావుండు. అదే స్నేహితులతోనైతే సులువుగా మాట్లాడవచ్చు.”

సాధారణంగా సెక్స్‌ గురించి మాట్లాడడానికి పిల్లలు ఎంత ఇబ్బంది పడుతుంటారో తల్లిదండ్రులు కూడా అంతే ఇబ్బంది పడుతుంటారు. డెబ్రా డబ్ల్యు. హాఫ్నర్‌ అనే హెల్త్‌ ఎడ్యుకేటర్‌ బియాండ్‌ ద బిగ్‌ టాక్‌ అనే తన పుస్తకంలో ఇలా చెబుతోంది, “యుక్త వయసులో వచ్చే మార్పుల గురించి తెలియజేసే పుస్తకాలను కొని తమ పిల్లల గదిలో పెట్టామని, మళ్లీ దాని గురించి వాళ్లతో ఎప్పుడూ మాట్లాడలేదని చాలామంది తల్లిదండ్రులు నాతో చెప్పారు.” అలా చేస్తే, “మీరు మీ శరీరం గురించి, సెక్స్‌ గురించి తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాం; కానీ దాని గురించి మీతో మాట్లాడడం మాకు ఇష్టం లేదు” అని తల్లిదండ్రులు చెబుతున్నట్లు పిల్లలు అనుకుంటారని ఆమె చెబుతోంది.

మీరు తల్లిదండ్రులైతే, మీరు మీ ఆలోచనా తీరును మార్చుకోవాలి. నిజానికి, మీరే వ్యక్తిగతంగా మీ పిల్లలతో సెక్స్‌ గురించి మాట్లాడడం చాలా ప్రాముఖ్యం. దానికి మూడు కారణాలను పరిశీలించండి:

  1. సెక్స్‌ గురించి లోకమిచ్చే నిర్వచనం మారిపోయింది. “సెక్స్‌ అంటే భార్యాభర్తల మధ్య ఉండే లైంగిక సంబంధమేనని ఇప్పుడు ఎవ్వరూ అనుకోవడం లేదు. ఈ రోజుల్లో ఓరల్‌ సెక్స్‌ (ముఖరతి), ఆనల్‌ సెక్స్‌ (ఆసన సంభోగం), సైబర్‌ సెక్స్‌ (ఇంటర్‌నెట్‌ చాట్‌ రూమ్‌లలో శృంగార సంబంధమైన చర్చ), చివరకు ‘సెక్ట్సింగ్‌’ (సెక్స్‌ సంబంధిత మెస్సేజ్‌లను, చిత్రాలను మొబైళ్లలో లేదా కంప్యూటర్లలో పంపించడం) వంటివి చేస్తున్నారు” అని 20 ఏళ్ల జేమ్స్‌ చెబుతున్నాడు.

  2. మీ పిల్లలకు చాలా చిన్న వయసులోనే తప్పుడు సమాచారం అందే అవకాశం ఉంది. షీలా అనే ఒక తల్లి ఇలా చెబుతోంది, “వాళ్లు స్కూలుకు వెళ్లడం మొదలు పెట్టినప్పుడే సెక్స్‌ గురించి వింటారు. కానీ సెక్స్‌ గురించి పిల్లలు తెలుసుకోవాలని మనం కోరుకుంటున్న విధంగా వాళ్లు తెలుసుకోరు.”

  3. మీ పిల్లలు సెక్స్‌ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకున్నా, వాటిని మీతో చర్చించడానికి చొరవ తీసుకోకపోవచ్చు. బ్రెజిల్‌లో ఉంటున్న 15 ఏళ్ల ఆనీ ఇలా చెబుతోంది, “సెక్స్‌ గురించి మా అమ్మానాన్నలతో మాట్లాడడం ఎలా మొదలుపెట్టాలో నిజంగా నాకు అస్సలు తెలియదు.”

నిజానికి, మీ పిల్లలతో సెక్స్‌ గురించి మాట్లాడడం తల్లిదండ్రులుగా మీకు దేవుడు ఇచ్చిన బాధ్యతలో ఒక భాగం. (ఎఫెసీయులు 6:4) నిజమే, సెక్స్‌ గురించి మాట్లాడడం మీకూ మీ పిల్లలకూ ఇబ్బందిగానే అనిపించవచ్చు. అయితే మరో విధంగా చూస్తే, చాలామంది యౌవనస్థులు 14 ఏళ్ల టియారాతో ఏకీభవిస్తారు, ఆమె ఇలా చెబుతోంది, “మేము ఏ టీచరో చెప్తే, ఏ టీవీ ప్రోగ్రామో చూసి కాదుగానీ మా తల్లిదండ్రులు చెప్తే సెక్స్‌ గురించి తెలుసుకోవాలని అనుకుంటాం.” అయితే, సెక్స్‌ గురించి మాట్లాడడం ఇబ్బందిగానే అనిపించినా ప్రాముఖ్యమైన ఈ విషయం గురించి మీ పిల్లలతో ఎలా మాట్లాడవచ్చు?

వాళ్ల వయస్సుకు తగినట్లు చెప్పండి

పిల్లలు సమాజంతో ఎలాంటి సంబంధం లేకుండా ఎక్కడో ఒంటరిగా ఉంటే తప్ప, చిన్న వయస్సు నుండే సెక్స్‌ గురించి వినడం ప్రారంభిస్తారు. ఇంకా కలవరపర్చే విషయం ఏమిటంటే, ఈ ‘అంత్యదినాల్లో’ చెడ్డవాళ్లు ‘అంతకంతకు చెడిపోతున్నారు.’ (2 తిమోతి 3:1, 13) విచారకరంగా, చాలామంది పిల్లల మీద పెద్దవాళ్లు లైంగికంగా దాడి చేస్తున్నారు.

కాబట్టి చాలా చిన్న వయసు నుండే మీ పిల్లలకు ఈ విషయాల గురించి బోధించడం మొదలుపెట్టడం ప్రాముఖ్యం. జర్మనీలో ఉంటున్న స్టెల్లా అనే ఒక తల్లి ఇలా చెబుతోంది, “ఒకవేళ మీరు వాళ్లు యుక్తవయసుకు వచ్చిన తర్వాత చెబుదామనుకుంటే, వాళ్లు పెద్దవాళ్లు అయిన తర్వాత సహజంగా సిగ్గుపడుతుంటారు కాబట్టి వాటి గురించి మీతో మాట్లాడడానికి వాళ్లు ఇష్టపడకపోవచ్చు.” అయితే దానికి పరిష్కారమేమిటంటే, ఏ వయసులో చెప్పాల్సిన విషయాలు ఆ వయసులో చెప్పాలి.

బడికి వెళ్లే వయసు రాని పిల్లలకు:

వాళ్ల జననాంగాలను ఎవర్నీ ముట్టుకోనివ్వొద్దని పిల్లలకు నేర్పించండి. మెక్సికోలో ఉంటున్న జూలియా అనే తల్లి ఇలా చెబుతోంది, “మా అబ్బాయికి మూడేళ్లు ఉన్నప్పుడే ఈ విషయాలు చెప్పడం మొదలుపెట్టాను. టీచర్లు, బేబీసిట్టర్లు లేదా పెద్దపిల్లలు వాడికి ఏదైనా హాని చేస్తారేమోనని నేనెంతో ఆందోళనపడేదాన్ని. వాడు తనను తాను ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవాలి.”

ఇలా చేసి చూడండి: ఎవరైనా మీ అమ్మాయి లేదా అబ్బాయి జననాంగాలతో ఆడుకోవడానికి ప్రయత్నిస్తుంటే, అలా చేయొద్దని గట్టిగా చెప్పేలా వాళ్లకు శిక్షణ ఇవ్వండి. ఉదాహరణకు, ఇలా చెప్పమని వాళ్లకు నేర్పించవచ్చు, “ముట్టుకోవద్దు! అలా చేశావంటే నీ మీద చెప్తా!” అవతలి వ్యక్తి మంచి బహుమతులు ఇస్తానని చెప్పినా లేదా భయపెట్టాలని చూసినా సరే అలా చెప్పడం ఎప్పుడూ సరైనదేనని వాళ్లకు ధైర్యాన్నివ్వండి.b

ప్రాథమిక పాఠశాలకు వెళ్లే పిల్లలకు:

మీ పిల్లలకు ఇప్పటికే కొంత తెలుసు కాబట్టి ఈ వయసులో దాని గురించి మెల్లమెల్లగా ఇంకాస్త తెలియజేయడానికి ప్రయత్నించండి. పీటర్‌ అనే ఒక తండ్రి ఇలా చెబుతున్నాడు, “వాళ్లకు ఇప్పటికే ఎంత తెలుసు, వాళ్లు ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారా అనేది అర్థం చేసుకోండి. వాళ్లకు ఆ విషయాల గురించి మాట్లాడడం ఇష్టం లేకపోతే మాట్లాడకండి. మీరు మీ పిల్లలతో ఎక్కువగా సమయాన్ని గడుపుతుంటే ఆ విషయాల గురించి మాట్లాడడానికి వాళ్లే చొరవ తీసుకోవచ్చు.”

ఇలా చేసి చూడండి: అయితే అన్ని విషయాలు ఒకేసారి మాట్లాడకుండా, తరచూ కొన్ని కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉండండి. (ద్వితీయోపదేశకాండము 6:6-9) అలాచేస్తే, మీరు మీ పిల్లల్ని ఎక్కువ విషయాలతో ఉక్కిరిబిక్కిరి చేయరు. అంతేకాకుండా, వాళ్లు పెద్ద వాళ్లవుతున్న కొద్దీ, వాళ్ల వయసుకు తగిన విషయాలు వాళ్లు తెలుసుకుని ఉండే అవకాశం ఉంటుంది.

ఉన్నత పాఠశాలకు వెళ్లే పిల్లలకు:

ఈ వయసు వచ్చేసరికి మీ పిల్లలకు సెక్స్‌కు సంబంధించి శారీరక, మానసిక, నైతిక విషయాలు తెలిసుండేలా మీరు చూసుకోవాలి. ముందు ప్రస్తావించిన 15 ఏళ్ల ఆనీ ఇలా చెబుతోంది, “మా స్కూల్లో అమ్మాయిలు, అబ్బాయిలు ఇప్పటికే సెక్స్‌ సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఒక క్రైస్తవురాలిగా, ఈ విషయం గురించి నాకు సరైన అవగాహన ఉండాలని నేను అనుకుంటున్నాను. సెక్స్‌ గురించి మాట్లాడడం ఎంతో ఇబ్బందిగానే ఉంటుంది, అయినా దాని గురించి నేను తప్పకుండా తెలుసుకోవాలి.”c

ఒక హెచ్చరిక: యౌవనస్థులు తామేదో చెడ్డ పని చేస్తున్నట్టు తమ తల్లిదండ్రులు అనుకుంటారని భయపడతారు కాబట్టి వాళ్లు చొరవ తీసుకుని ప్రశ్నలు అడగకపోవచ్చు. సుధాకర్‌ అనే ఒక తండ్రి అదే గమనించాడు. ఆయనిలా చెబుతున్నాడు, “సెక్స్‌ గురించి మాట్లాడడానికి మా అబ్బాయి ఇష్టపడేవాడు కాదు. కానీ మేము తనను అనుమానిస్తున్నామని వాడు అనుకుంటున్నట్టు ఆ తర్వాత మాకు అర్థమైంది. మేము ఈ విషయాలు మాట్లాడుతున్నది వాడిని అనుమానిస్తున్నందుకు కాదని వాడికి స్పష్టం చేశాం; వాడికి తన చుట్టూ ఉన్న చెడు ప్రభావాలను ఎదిరించే సామర్థ్యం ఉందన్న నమ్మకం మాకు కలగడానికే ఆ విషయాల గురించి మాట్లాడేవాళ్లం.”

ఇలా చేసి చూడండి: మీ అబ్బాయిని లేదా అమ్మాయిని సెక్స్‌కు సంబంధించి ఏదైనా ఒక విషయం గురించి సూటిగా ప్రశ్నలతో ముంచెత్తకుండా దాని గురించి తోటి విద్యార్థులు ఏమనుకుంటున్నారో చెప్పమని అడగండి. ఉదాహరణకు, మీరిలా అనవచ్చు, “ఈ రోజుల్లో చాలామంది ఓరల్‌ సెక్స్‌ చేస్తే నిజంగా సెక్స్‌లో పాల్గొన్నట్టు కాదని అనుకుంటున్నారు. మీ తోటి విద్యార్థులు కూడా అలాగే అనుకుంటున్నారా?” మీ అమ్మాయిని లేదా అబ్బాయిని సూటిగా అడగకుండా ఇలా అడిగితే వాళ్లు ఎలాంటి మొహమాటం లేకుండా మాట్లాడడం మొదలుపెట్టి, తమ అభిప్రాయాలను చెప్పవచ్చు.

మొహమాటపడడం మానేయండి

తల్లిదండ్రులుగా మీరు మీ బాధ్యతను నిర్వర్తిస్తున్నప్పుడు ఎంతో మొహమాటం కలిగించే పరిస్థితులు ఎదురవ్వవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఒకటి మీ పిల్లలతో సెక్స్‌ గురించి మాట్లాడడమని ఒప్పుకోవాల్సిందే. కానీ ఈ విషయంలో మీరు చేసే ప్రయత్నం వృథా కాదు. డయానా అనే ఒక తల్లి ఇలా అంటోంది, “సమయం గడుస్తుండగా మొహమాటం తగ్గుతుంది. నిజానికి సెక్స్‌ గురించి మీ పిల్లలతో మాట్లాడితే మీ మధ్య ఉన్న బంధం బలపడే అవకాశముంది.” ఇంతకుముందు ప్రస్తావించిన సుధాకర్‌ ఈ విషయాన్ని ఒప్పుకుంటున్నాడు. “కుటుంబంలో ఏ విషయం గురించి మాట్లాడే సందర్భం వచ్చినా మీరు మీ అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తం చేస్తుంటే, సెక్స్‌లాంటి మొహమాటం కలిగించే అంశాలు వచ్చినప్పుడు కూడా ఇబ్బందిపడకుండా మాట్లాడవచ్చు. అస్సలు మొహమాటపడకుండా ఉండడమనేది సాధ్యం కాదు. అయితే, నిర్మొహమాటంగా మాట్లాడుకుంటేనే క్రైస్తవ కుటుంబాలు వర్ధిల్లుతాయి.” (w10-E 11/01)

a అసలు పేర్లు కావు.

b గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి అనే పుస్తకం, 171వ పేజీ నుండి తీసుకోబడింది. దీనిని యెహోవాసాక్షులు ప్రచురించారు.

c యుక్త వయసులో ఉన్న మీ పిల్లలతో సెక్స్‌ గురించి మాట్లాడడానికి, యువత అడిగే ప్రశ్నలు—ఆచరణాత్మకమైన సమాధానాలు (ఆంగ్లం) 2వ సంపుటిలోని 1-5, 28, 29, 33 అధ్యాయాలను ఉపయోగించండి. దీనిని యెహోవాసాక్షులు ప్రచురించారు.

వీటికి మీ సమాధానాలేమిటి?

ప్రపంచ నలుమూలల నుండి సేకరించిన యువతీ యువకుల అభిప్రాయాలను చదివి, వాటి కింద ఇవ్వబడిన ప్రశ్నలకు ఎలా సమాధానమిస్తారో ఆలోచించండి.

“మా అమ్మానాన్నలు నన్ను సెక్స్‌కు సంబంధించిన ఆర్టికల్స్‌ చదివి ఏమైనా సందేహాలుంటే తమను అడగమని చెప్తారు. కానీ దాని గురించి వాళ్లు ఇంకా ఎక్కువ మాట్లాడితే బావుంటుందని నాకనిపిస్తుంది.”—ఆనీ, బ్రెజిల్‌.

మీ పిల్లలకు చదవడానికి పుస్తకాలు ఇవ్వడం కన్నా ఇంకా ఎక్కువే చేయడం ముఖ్యమని మీరు ఎందుకు అనుకుంటున్నారు?

“సెక్స్‌ గురించి అసభ్యకరమైన ఎన్నో విషయాలు నాకు తెలుసు. ఆ విషయాల గురించి మా నాన్నకు కొంచెం కూడా తెలీదని నేను అనుకుంటున్నాను. వాటి గురించి ఆయనను అడిగాననుకోండి ఆయన గుండె ఆగిపోతుంది.”—కెన్‌, కెనడా.

మీ అబ్బాయి లేదా అమ్మాయి తమను బాధపెడుతున్న విషయాల గురించి మీతో మాట్లాడడానికి ఎందుకు భయపడుతుండవచ్చు?

“సెక్స్‌ గురించి మా అమ్మానాన్నలను ఒక విషయం అడగడానికి ధైర్యం తెచ్చుకున్నాను. కానీ వాళ్లు ‘దాని గురించి నువ్వు ఎందుకు అడుగుతున్నావు? ఏమైనా జరిగిందా?’ అంటూ నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడారు.”—మసామి, జపాన్‌.

మీ పిల్లలు సెక్స్‌ గురించి ఏదైనా ఒక ప్రశ్న అడిగితే, మీరు ఎలా ప్రతిస్పందిస్తే వాళ్లు భవిష్యత్తులో మళ్లీ మీతో మాట్లాడతారు లేదా అసలు మాట్లాడరు?

“మా అమ్మానాన్నలు నా వయసులో ఉన్నప్పుడు అలాంటి ప్రశ్నలే అడిగే వాళ్లమని, నేను కూడా అలా అడగడం తప్పేమీ కాదని నాకు ధైర్యం చెప్తే బాగుంటుంది.”—లీజట్‌, ఫ్రాన్స్‌.

మీ అమ్మాయి లేదా అబ్బాయి సెక్స్‌ గురించి మీతో మాట్లాడడానికి ఇబ్బంది పడకుండా ఉండాలంటే మీరు వాళ్లకు ఎలా సహాయం చేయవచ్చు?

“సెక్స్‌ గురించి మా అమ్మ నన్ను ప్రశ్నలు అడుగుతుంది, అయితే ఎంతో మృదువుగా అడుగుతుంది. అలా మాట్లాడడం చాలా ప్రాముఖ్యమని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే అలా మాట్లాడితే తమను తప్పుపడుతున్నారని పిల్లలు అనుకోరు.”—జరాల్డ్‌, ఫ్రాన్స్‌.

సెక్స్‌ గురించి మీ పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు మీ మాట తీరు ఎలా ఉంటుంది? ఏమైనా మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉందా?

A mother and daughter talking
    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి