చెడు అనేదే లేకుండా పోతుంది!
ఎవరైనా అసలెందుకు చెడ్డ పనులు చేస్తారో, దేవుడు మనకిచ్చిన బైబిలు వివరిస్తోంది. ఆయన మనకు నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను, ఆత్మ నిగ్రహంతో ఉండే సామర్థ్యాన్ని కూడా ఇచ్చాడు కాబట్టి, మనం చెడ్డ పనులు చేయకుండా ఉండడం సాధ్యమే. (ద్వితీయోపదేశకాండము 30:15, 16, 19) మనకు ఇవన్నీ ఇవ్వబడ్డాయి కాబట్టి వీటి సహాయంతో, మన మనసులోకి వచ్చే ఎలాంటి చెడ్డ ఆలోచనలనైనా పసిగట్టి, వాటిని సరిదిద్దుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోగలుగుతాం. చెడ్డ పనులకు దూరంగా ఉంటే మనం సంతోషంగా ఉండగలుగుతాం, అలాగే మన చుట్టూ ఉన్నవాళ్లు కూడా సంతోషంగా ఉండగలుగుతారు.—కీర్తన 1:1, 2.
చెడ్డ పనులు చేయకుండా ఉండడానికి మనమెంత తీవ్రంగా ప్రయత్నించినా, మన చుట్టూ ఉన్నవాళ్లు మాత్రం అలాంటి పనులు చేస్తూనే ఉంటారు కాబట్టి లోకంలో చెడు ఉంది. ‘అంత్యదినాల్లో అపాయకరమైన కాలాలు వస్తాయని తెలుసుకోండి’ అని బైబిలు హెచ్చరిస్తోంది. కాలాలు ఎందుకు ‘అపాయకరంగా’ ఉంటాయో వివరిస్తూ బైబిలు ఇలా చెప్తోంది, ‘అంత్యదినాల్లో స్వార్థప్రియులు, ధనాపేక్షగలవాళ్లు, బింకములాడేవాళ్లు, అహంకారులు, దూషకులు, తలిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివాళ్లు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవునికంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవాళ్లు, పైకి భక్తిగలవాళ్లలా ఉండి దాని శక్తిని ఆశ్రయించనివాళ్లు ఉంటారు. ఇలాంటి వాళ్లకు విముఖులై ఉండండి.’—2 తిమోతి 3:1-5.
ఇక్కడ ప్రస్తావించిన ప్రవచనంలో ‘అంత్యదినాలు’ అనే మాటను మీరు గమనించే ఉంటారు. దాని అర్థమేమిటి? సాధారణంగా అందరూ అనుకునేలా, ‘అంత్యదినాలు’ అనే మాటలోనే దేనికో అంతం దగ్గరపడిందనే అర్థం స్ఫురిస్తుంది. అయితే దేని అంతం దగ్గరపడింది? దేవుడు ఏమని వాగ్దానం చేశాడని బైబిల్లో ఉందో గమనించండి.
చెడ్డవాళ్లు పూర్తిగా లేకుండా పోతారు.
‘ఇక కొంతకాలానికి భక్తిహీనులు ఉండరు; వాళ్ల స్థలాన్ని జాగ్రత్తగా పరిశీలించినా వాళ్లు కనిపించరు. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. బహు క్షేమం కలిగి సుఖిస్తారు.’—కీర్తన 37:10, 11.
‘యెహోవా తనను ప్రేమించే వాళ్లందర్నీ కాపాడతాడు, అయితే భక్తిహీనులందర్నీ ఆయన నాశనం చేస్తాడు.’—కీర్తన 145:20.
అణిచివేసేవాళ్లు ఉండరు.
‘దరిద్రులు మొఱ్ఱపెట్టగా ఆయన వాళ్లను విడిపిస్తాడు. దీనులను, నిరాధారులను ఆయన విడిపిస్తాడు. కపట బలాత్కారాల నుండి ఆయన వాళ్ల ప్రాణాన్ని విమోచిస్తాడు.’—కీర్తన 72:12, 14.
‘సృష్టి నాశనానికిలోనైన దాస్యం నుండి విడిపించబడి, దేవుని పిల్లలు పొందబోయే మహిమగల స్వాతంత్ర్యం పొందుతుంది.’—రోమీయులు 8:20, 21.
ప్రజల భౌతిక అవసరాలు తీరతాయి.
‘ఎవరి భయం లేకుండా ప్రతీ ఒక్కరు తమ ద్రాక్ష చెట్టు కింద, తమ అంజూరం చెట్టు కింద కూర్చుంటారు.’—మీకా 4:4.
‘వాళ్లు ఇళ్లు కట్టుకుని వాటిలో కాపురముంటారు. ద్రాక్షతోటలు నాటుకుని వాటి ఫలాలను అనుభవిస్తారు. వాళ్లు కట్టుకున్న ఇళ్లలో వేరేవాళ్లు కాపురం ఉండరు. వాళ్లు నాటుకున్న వాటిని వేరేవాళ్లు అనుభవించరు. నా జనుల ఆయుష్షు వృక్ష ఆయుష్షంత అవుతుంది. నేను ఏర్పర్చుకున్నవాళ్లు తాము చేసుకున్నదాని ఫలాన్ని పూర్తిగా అనుభవిస్తారు.’—యెషయా 65:21, 22.
న్యాయం రాజ్యమేలుతుంది.
‘దేవుడు తను ఏర్పర్చుకున్న వాళ్లు దివారాత్రులు తనకు మొఱ్ఱపెట్టుకుంటుంటే వాళ్లకు న్యాయం తీర్చడా? ఆయన వాళ్లకు త్వరగా న్యాయం తీరుస్తాడు.’—లూకా 18:7, 8.
‘యెహోవా న్యాయాన్ని ప్రేమించేవాడు. ఆయన తన భక్తులను విడువడు. వాళ్లు ఎన్నటెన్నటికీ కాపాడబడతారు.’—కీర్తన 37:28.
నీతి విలసిల్లుతుంది.
‘లోక నివాసులు నీతిని నేర్చుకుంటారు.’—యెషయా 26:9.
‘మనం ఆయన వాగ్దానాన్ని బట్టి కొత్త ఆకాశాల కోసం, కొత్త భూమి కోసం కనిపెట్టుకుని ఉన్నాం. వాటిలో నీతి నివసిస్తుంది.’—2 పేతురు 3:13.
ఇప్పుడు కూడా ప్రజలు మారుతున్నారు
అలాంటి వాగ్దానాలు విన్నప్పుడు మనందరం నిజంగానే ఎంతో సంతోషిస్తాం. అయితే, ఆ వాగ్దానాలు తప్పక నెరవేరతాయని ఎలా చెప్పవచ్చు? దేవుని వాగ్దానాలు తప్పక నెరవేరతాయని చెప్పడానికి మన దగ్గర ఇప్పటికే రుజువుంది. అదేమిటి? ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు లక్షలాదిమంది స్వార్థపూరిత, అనైతిక లేదా దౌర్జన్యపూరిత లక్షణాలను విడిచిపెట్టి, నిజాయితీగా, సమాధానంగా, దయగా ఉండడం నేర్చుకుంటున్నారన్న వాస్తవమే ఆ రుజువు. ఇప్పుడు డెబ్భై లక్షలకంటే ఎక్కువమంది యెహోవాసాక్షులు ఉన్నారు. చరిత్ర అంతటిలో ఎంతో ద్వేషానికి, దౌర్జన్యానికి, రక్తపాతానికి కారణమైన జాతి, వర్గ, దేశ, రాజకీయ, ఆర్థిక తేడాలు వాళ్ల మధ్య లేవు.a ఇప్పుడు ఇలాంటి మార్పులు జరుగుతున్నాయి కాబట్టి, దేవుని వాగ్దానాలు పెద్ద ఎత్తున తప్పక నెరవేరతాయని నమ్మడానికి అదే గట్టి రుజువు.
ఏది అలాంటి మార్పులు తీసుకువస్తుంది? దానికి జవాబు బైబిల్లోని మరో వాగ్దానంలో ఉంది. దాన్ని యెషయా అనే ప్రవక్త రాశాడు. అదిలా ఉంది:
“అప్పుడు తోడేళ్ళు, గొర్రెపిల్లలు కలిసిమెలిసి ఉంటాయి. చిరుత పులులు మేకపిల్లల దగ్గర పడుకొంటాయి. దూడలు, కొదమ సింహాలు, కొవ్విన కోడెలు దగ్గర దగ్గరగా ఉంటాయి. చిన్నపిల్లవాడు వాటిని తోలుకుపోతాడు. . . . సింహం ఎద్దులాగా గడ్డి మేస్తుంది. చంటిపిల్ల నాగుబాము పుట్టదగ్గర ఆటలాడుతుంది. పాలు విడిచిన చిన్నపిల్ల కట్లపాము పుట్టమీద చెయ్యి ఉంచుతుంది. నా పవిత్రమైన కొండ అంతట్లో ఏదీ హాని చేయదు, నాశనం చేయదు. సముద్రం నీళ్ళతో నిండివున్నట్టు లోకం యెహోవాను గురించిన జ్ఞానంతో నిండివుంటుంది.”—యెషయా 11:6-9, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.
ఈ ప్రవచనం జంతువులు మనుషులతో సామరస్యంగా జీవించే కాలం గురించే చెప్తోందా? కాదు, అంతకంటే ఎక్కువే చెప్తోంది. మార్పుకు కారణమేమిటో చివరి వాక్యం వివరిస్తోంది. అదేమిటంటే, “లోకం యెహోవాను గురించిన జ్ఞానంతో నిండివుంటుంది.” దేవుని గురించిన జ్ఞానం జంతువుల ప్రవర్తనను మారుస్తుందా? ఎంతమాత్రం మార్చలేదు. కానీ అది మనుషుల ప్రవర్తనను మార్చగలదు, మార్చింది కూడా! ఎవరికైనా జంతువుల్లాంటి క్రూరమైన లక్షణాలుంటే అలాంటివాళ్లు, బైబిలు చెప్తున్నవాటిని తెలుసుకుని, వాటిని పాటించడం వల్ల క్రీస్తులాంటి వ్యక్తిత్వాన్ని అలవర్చుకుని ఆ లక్షణాలను మార్చుకుంటారని ఈ ప్రవచనం చెప్తోంది.
జగన్ విషయమే తీసుకోండి.b ఉగ్రవాద సంస్థలో చేరి తను న్యాయం కోసం పోరాడుతున్నానని ఆయన అనుకున్నాడు. శిక్షణ పూర్తయ్యాక ఒక పోలీసు స్థావరాన్ని పేల్చేయమనే ఆదేశాలు ఆయనకు అందాయి. ఆయన దానికి సిద్ధపడుతున్నప్పుడు పోలీసులకు దొరికిపోయి 18 నెలలు జైల్లో గడిపాడు. అక్కడ కూడా ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తూనే ఉన్నాడు. ఈ మధ్యలో జగన్ భార్య యెహోవాసాక్షుల దగ్గర బైబిలు అధ్యయనం చేయడం మొదలుపెట్టింది. విడుదలైన తర్వాత జగన్ కూడా బైబిలు అధ్యయనం చేయడం మొదలుపెట్టాడు. యెహోవా దేవుని గురించి నేర్చుకున్నదాన్నిబట్టి ఆయన ప్రవర్తనలో గొప్ప మార్పులు చేసుకోగలిగాడు. జీవితం గురించి ఆయనకున్న అభిప్రాయం కూడా మారింది. “ఉగ్రవాదిగా ఉన్నప్పుడు ఎవ్వరినీ చంపనందుకు యెహోవాకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇప్పుడు నేను నిజమైన శాంతికి, న్యాయానికి సంబంధించిన సందేశాన్ని అంటే దేవుని రాజ్య సువార్తను చెప్పడానికి దేవుని ఆత్మ ఖడ్గమైన బైబిలును ఉపయోగిస్తున్నాను” అని జగన్ చెప్తున్నాడు. శాంతి సందేశం గురించి, హింస లేని ఒక లోకం గురించి చెప్పడానికి, తను ఒకప్పుడు నాశనం చేయాలని పథకం వేసిన పోలీసు స్థావరానికి కూడా ఆయన వెళ్లాడు.
దేవుని వాక్యం ప్రజల జీవితాల్లో ఎంత చక్కని మార్పు తీసుకురాగలదో గమనిస్తే, చెడు అనేదే లేకుండా పోతుందని దేవుడు చేసిన వాగ్ధానాన్ని మనం పూర్తిగా నమ్మగలుగుతాం. ప్రజలు ఎప్పటికీ చెడ్డ పనులు చేస్తూనే ఉండరుగానీ వాళ్లు మారి మంచి వాళ్లవుతారు. చెడుకు ఆరంభకుడు, తెర వెనుక ఉంటూ లోకాన్ని మోసం చేస్తున్న అపవాది అయిన సాతానును యెహోవా త్వరలోనే నాశనం చేస్తాడు. ‘లోకమంతా దుష్టునియందున్నది’ అని బైబిలు చెప్తోంది. (1 యోహాను 5:19) కానీ త్వరలో అతడే లేకుండా పోతాడు. దుష్ట పనులను విడిచిపెట్టకుండా మొండిగా చేసేవాళ్లు కూడా అతడితోపాటే పోతారు. అలాంటి మంచి సమయంలో జీవించడం ఎంత బావుంటుందో కదా!
అలాంటి పరిస్థితుల్లో జీవించాలంటే ఏమిచేయాలి? ప్రజల్లో మార్పు తీసుకువచ్చేది “యెహోవాను గురించిన జ్ఞానం” అని గుర్తు తెచ్చుకోండి. అదే రాబోయే కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఆ మార్పు తీసుకువస్తుంది. జగన్‌లాగే మీరు కూడా సరైన బైబిలు జ్ఞానాన్ని సంపాదించుకుని దాన్ని మీ జీవితంలో పాటిస్తే, మీరు కూడా ‘నీతి నివసించే’ లోకంలో జీవించాలని ఎదురుచూడవచ్చు. (2 పేతురు 3:13) దేవుని గురించిన, యేసుక్రీస్తు గురించిన జ్ఞానాన్ని పొందడానికి ఇప్పటికీ అందుబాటులో ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకోమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం. ఎందుకంటే అలా చేస్తే మీరు నిత్యం జీవించగలుగుతారు.—యోహాను 17:3. (w10-E 09/01)
[అధస్సూచీలు]
a ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి, యెహోవాసాక్షులు ప్రచురించిన యెహోవాసాక్షులు—వారు ఎవరు? వారి నమ్మకాలు ఏమిటి? అనే బ్రోషుర్ చూడండి.
b అసలు పేరు కాదు.
[9వ పేజీలోని బ్లర్బ్]
మీరు కూడా ‘నీతి నివసించే’ లోకంలో జీవించాలని ఎదురుచూడవచ్చు—2 పేతురు 3:13