సాతాను పరిపాలన తప్పక విఫలమౌతుంది
‘భక్తిహీనులకు క్షేమము కలుగదు.’—ప్రసం. 8:13.
1. దుష్టులకు శిక్ష అమలు చేయబడుతుందనే వార్త ఎందుకు ఊరటనిస్తుంది?
ఏదో ఒక రోజు దుష్టులు శిక్షించబడతారు. అప్పుడు వారు తాము చేసిన పాపాలకు జవాబు చెప్పాల్సివుంటుంది. (సామె. 5:22; ప్రసం. 8:12, 13) ప్రాముఖ్యంగా నీతిని ప్రేమించేవారికి, దుష్టుల చేతుల్లో అన్యాయాన్ని, కష్టాలను భరించినవారికి ఈ వార్త ఎంతో ఊరటనిస్తుంది. దుష్టులు శిక్షించబడే సమయం వచ్చినప్పుడు ముఖ్యంగా దుష్టత్వానికి కారకుడైన సాతాను శిక్షించబడతాడు.—యోహా. 8:44.
2. ఏదెనులో సాతాను చేసిన సవాలుకు జవాబివ్వడానికి సమయం ఎందుకు అవసరమైంది?
2 సాతాను తన గురించి తాను ఎక్కువగా ఆలోచించుకొని ఏదెను తోటలో యెహోవా పరిపాలనను ధిక్కరించేలా మానవులను ఉసిగొల్పాడు. ఆ కారణంగా, మన మొదటి తల్లిదండ్రులు సాతానుతో చేతులు కలిపి యెహోవా పరిపాలనా హక్కును సవాలు చేశారు. అలా వారు ఆయన దృష్టిలో పాపులయ్యారు. (రోమా. 5:12-14) తనను అగౌరవపర్చి తనమీద తిరుగుబాటు చేసినందుకు వారికి ఎలాంటి పర్యవసానాలు ఎదురౌతాయో యెహోవాకు తెలుసు. అయితే, ఆ పర్యవసానాల గురించి తెలివిగల ప్రాణులందరికీ తెలియాలి. అందుకే, సాతాను చేసిన సవాలుకు జవాబివ్వడానికి, తిరుగుబాటుదారుల వాదన పచ్చి అబద్ధమని బలంగా నిరూపించడానికి సమయం అవసరమైంది.
3. మానవ ప్రభుత్వాల విషయంలో మన వైఖరి ఏమిటి?
3 మానవులు యెహోవా అధికారాన్ని తిరస్కరించారు కాబట్టి, వారు తమ సొంత ప్రభుత్వాలను ఏర్పరచుకోవాల్సి వచ్చింది. అపొస్తలుడైన పౌలు రోమాలోని తోటి క్రైస్తవులకు రాసినప్పుడు అలాంటి ప్రభుత్వాలను “పై అధికారులు” అని పిలిచాడు. పౌలు రోజుల్లో, పై అధికారులు అనే మాట ముఖ్యంగా చక్రవర్తి నీరో ఆధిపత్యంలో ఉన్న రోమా ప్రభుత్వాన్ని సూచించింది. ఆ ప్రభుత్వం సా.శ. 54-68 మధ్యకాలంలో పరిపాలించింది. అలాంటి పై అధికారులు “దేవునివలననే నియమింపబడి” ఉన్నారని పౌలు చెప్పాడు. (రోమీయులు 13:1, 2 చదవండి.) ఇక్కడ పౌలు, దేవుని పరిపాలనకన్నా మానవ పరిపాలన గొప్పదని చెబుతున్నాడా? కానేకాదు. మానవ పరిపాలనను దేవుడు అనుమతించినంత కాలం క్రైస్తవులు “దేవుని నియమమును” గౌరవిస్తూ అలాంటి పరిపాలకులను అంగీకరించాలని ఆయన చెప్పాడంతే.
నాశనానికి దారితీసే మార్గం
4. మానవ పరిపాలన తప్పక విఫలమౌతుందని ఎందుకు చెప్పవచ్చు?
4 సాతాను చెప్పుచేతల్లో నడుస్తున్న మానవ పరిపాలన తప్పక విఫలమౌతుంది. అలాగని ఎందుకు చెప్పవచ్చు? మొదటిగా, మానవ పరిపాలకులు దేవుని జ్ఞానం ఆధారంగా పరిపాలించడంలేదు. యెహోవాకు మాత్రమే పరిపూర్ణ జ్ఞానం ఉంది. కాబట్టి, చక్కగా పరిపాలించడానికి కావాల్సిన సరైన మార్గనిర్దేశాన్ని ఆయన మాత్రమే ఇవ్వగలడు. (యిర్మీ. 8:9; రోమా. 16:25-27) మానవులు తరచూ వివిధ ప్రయోగాలు చేసి నేర్చుకుంటారు గానీ, యెహోవా విషయానికొస్తే ఏ సమయంలో ఏమి చేయాలో ఆయనకు బాగా తెలుసు. ఆయన నిర్దేశం పాటించని ఏ ప్రభుత్వమైనా విఫలమై తీరాల్సిందే. సాతాను దుష్ట ఉద్దేశం మాట పక్కనబెట్టినా, మానవుల ద్వారా సాతాను చేసే పరిపాలన ఆరంభదశ నుండే తప్పక విఫలమౌతుందని చెప్పడానికి పై కారణం ఒక్కటి చాలు.
5, 6. సాతాను ఎందుకు యెహోవాకు ఎదురుతిరిగాడు?
5 ఇంగిత జ్ఞానం ఉన్న ఏ వ్యక్తైనా ఒక పని తప్పక విఫలమౌతుందని తెలిస్తే దాన్ని చేయడు. ఒకవేళ మొండిగా ముందడుగు వేసినా చివరికి తాను వేసిన అడుగు తప్పని గుర్తించాల్సి వస్తుంది. సర్వశక్తిగల సృష్టికర్తకు వ్యతిరేకంగా నిలబడితే అది వృథా ప్రయాసే అవుతుందని చరిత్ర తిరగేసి చూస్తే తెలుస్తుంది. (సామెతలు 21:30 చదవండి.) సాతాను అహంకారంతో, గర్వంతో కళ్లు నెత్తికెక్కి యెహోవాకు ఎదురుతిరిగాడు. అలా, అది చివరకు నాశనానికి నడిపించే మార్గమని తెలిసినా సాతాను దాన్నే ఎంచుకున్నాడు.
6 తర్వాతి కాలంలో, సాతానులాగే బబులోను పరిపాలకుడు కూడా గర్వాన్ని చూపించాడు. ఆ పరిపాలకుడు ఇలా అన్నాడని బైబిలు చెబుతోంది: “నేను ఆకాశమున కెక్కిపోయెదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తరదిక్కుననున్న సభాపర్వతముమీద కూర్చుందును. మేఘమండలముమీది కెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును.” (యెష. 14:13-15) ఆ పరిపాలకుని వెర్రి ప్రణాళికలన్నీ విఫలమయ్యాయి, బబులోను రాజవంశం అవమానకరమైన నాశనాన్ని చవిచూసింది. ఆ విధంగానే సాతానుతోపాటు, అతని లోకం త్వరలో చిత్తుగా ఓడిపోతుంది.
యెహోవా వేరే పరిపాలనను ఎందుకు అనుమతించాడు?
7, 8. కొంతకాలంపాటు దుష్టత్వాన్ని అనుమతించడం వల్ల వచ్చిన కొన్ని ప్రయోజనాలేమిటి?
7 సాతాను ప్రభుత్వం విఫలమౌతుందని తెలిసి కూడ మానవులను అతని పక్షాన చేరకుండా యెహోవా ఎందుకు ఆపలేదని కొందరు అనుకోవచ్చు. సర్వశక్తిగల దేవునిగా యెహోవా వారిని ఆపగలిగి ఉండేవాడే. (నిర్గ. 6:3) అయినా ఆయన అలా చేయలేదు. ఆయన జ్ఞానవంతుడు కాబట్టి, మానవుల తిరుగుబాటును కొంతకాలంపాటు ఆపకుండా ఉండడంవల్ల దీర్ఘకాల ప్రయోజనాలు ఉంటాయని ఆయన గ్రహించాడు. చివరకు, యెహోవాయే నీతిగల, ప్రేమగల పరిపాలకుడనీ, ఆయన నిర్ణయం వల్ల నమ్మకస్థులైన మానవులు ప్రయోజనం పొందుతారనీ నిరూపించబడుతుంది.
8 సాతాను ఎత్తుగడలకు పడిపోకుండా, దేవుని పరిపాలనను తిరస్కరించకుండా ఉంటే మానవులకు ఎన్ని బాధలు తప్పేవి! అయితే, కొంతకాలంపాటు మానవులు తమను తాము పరిపాలించుకోవడానికి అనుమతించాలని యెహోవా తీసుకున్న నిర్ణయం వల్ల మేలు జరిగింది. యెహోవా మాట విని, ఆయనపై నమ్మకం ఉంచడం తెలివైన పని అని యథార్థవంతులు చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలిగారు. శతాబ్దాలపాటు మానవులు ఎన్నో రకాల ప్రభుత్వాలతో ప్రయోగాలు చేశారు, వాటిలో ఏ ఒక్కటీ సఫలం కాలేదు. దానివల్ల కేవలం యెహోవా పరిపాలన మాత్రమే ఉత్తమమైనదనే ఆయన సేవకుల నమ్మకం బలపడింది. అయితే, సాతాను దుష్ట పరిపాలనను యెహోవా అనుమతించడం వల్ల ఆయన నమ్మకస్థులైన సేవకులతోసహా మానవులంతా కష్టాలపాలయ్యారనేది నిజమే. అయినా దుష్టత్వాన్ని కొంతకాలంపాటు అనుమతించడం వల్ల దేవుని నమ్మకమైన ఆరాధకులు ప్రయోజనాలు కూడా పొందారు.
యెహోవా ఘనపర్చబడేందుకు దోహదపడిన తిరుగుబాటు
9, 10. సాతాను పరిపాలన యెహోవా ఘనపర్చబడేందుకు ఎలా దోహదపడిందో వివరించండి.
9 మానవులు సాతాను ప్రలోభంలో పడేందుకు, వారు తమను తాము పరిపాలించుకునేందుకు అనుమతించడం వల్ల యెహోవా పరిపాలనకు అపకీర్తి రాలేదు. బదులుగా అది ఘనపర్చబడింది. ఎందుకంటే, మానవులు తమను తాము పరిపాలించుకోలేరని యిర్మీయా ప్రవక్త దైవప్రేరణతో రాసిన మాటలు ముమ్మాటికీ నిజమని చరిత్ర నిరూపిస్తోంది. (యిర్మీయా 10:23 చదవండి.) అంతేకాక, సాతాను తిరుగుబాటు వల్ల మరింత ఉత్తమమైన విధంగా తన గొప్ప లక్షణాలను కనబరిచే అవకాశం యెహోవాకు దొరికింది. ఎలా?
10 సాతాను పరిపాలన వల్ల వచ్చిన ఘోరమైన ఫలితాలు తేటతెల్లంగా కనిపిస్తున్నాయి కాబట్టే, యెహోవా పరిపూర్ణ లక్షణాల్ని మనం ఇంత స్పష్టంగా చూడగలుగుతున్నాం. ఆ విధంగా, యెహోవా తనను ప్రేమించే వారి దృష్టిలో ఘనపర్చబడ్డాడు. సాతాను పరిపాలన దేవుణ్ణి ఘనపర్చడానికి దోహదపడడమేమిటి అని మీకు అనిపించవచ్చు కానీ నిజానికి జరిగింది మాత్రం అదే. తన సర్వాధిపత్యానికి సంబంధించిన సవాలును పరిష్కరించడానికి యెహోవా ఎంత శ్రేష్ఠమైన మార్గాన్ని ఎంచుకున్నాడో దీన్నిబట్టి తెలుస్తుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి మనం, యెహోవా చూపించిన కొన్ని లక్షణాల గురించి తెలుసుకుని, యెహోవా ఆ లక్షణాలను మరికొన్ని విధాలుగా చూపించడానికి సాతాను దుష్ట పరిపాలన ఎలా దోహదపడిందో చూద్దాం.
11. యెహోవా తన ప్రేమను ఎలా చూపించాడు?
11 ప్రేమ. “దేవుడు ప్రేమాస్వరూపి” అని లేఖనాలు చెబుతున్నాయి. (1 యోహా. 4:8) మొదటిగా, మానవుని సృష్టే దేవుని ప్రేమకు రుజువు. భయం, ఆశ్చర్యం కలిగించే విధంగా దేవుడు మనల్ని సృష్టించడంలో కూడా ఆయన ప్రేమ కనిపిస్తుంది. యెహోవా ప్రేమతో మానవులు సంతోషంగా ఉండడానికి కావాల్సినవన్నీ ఉన్న అందమైన గృహాన్ని వారికిచ్చాడు. (ఆది. 1:29-31; 2:8, 9; కీర్త. 139:14-16) మానవ కుటుంబం పాపం చేసిన తర్వాత, యెహోవా తన ప్రేమను సరికొత్త విధాలుగా చూపించాడు. ఎలా? యేసు ఇలా చెప్పాడని అపొస్తలుడైన యోహాను రాశాడు: “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.” (యోహా. 3:16) యెహోవా పాపులైన మానవులను విమోచించడానికి తన ఏకైక కుమారుణ్ణి భూమ్మీదకు పంపించి ఎంత గొప్ప ప్రేమను చూపించాడు! దీనికన్నా మరింత గొప్ప ప్రేమను ఆయన మానవులపట్ల చూపించివుండేవాడా? (యోహా. 15:13) అంతేకాక, యెహోవా చూపించిన ఈ గొప్ప ప్రేమను మాదిరిగా తీసుకుని మానవులు కూడా తమ అనుదిన జీవితంలో యేసులా స్వయంత్యాగపూరిత ప్రేమను చూపించగలుగుతున్నారు.—యోహా. 17:25, 26.
12. యెహోవా తన శక్తిని ఎలా చూపించాడు?
12 శక్తి. జీవాన్ని సృష్టించే శక్తి “సర్వాధికారి” అయిన యెహోవా దేవునికి మాత్రమే ఉంది. (ప్రక. 11:17; కీర్త. 36:9) మానవుడు పుట్టినప్పుడు ఆయన జీవితం ఖాళీ పేపరులాంటిది. అయితే, ఆయన మరణించినప్పుడు ఆ పేపరు ఖాళీగా ఉండదు. ఆయన వ్యక్తిత్వాన్ని మలచి ఆయనను ఓ ప్రత్యేకమైన వ్యక్తిగా చేసిన నిర్ణయాలతో, పనులతో, జీవితానుభవాలతో అది నిండిపోతుంది. యెహోవా ఆ సమాచారాన్నంతటినీ గుర్తుపెట్టుకోగలడు. యెహోవా సకాలంలో, ఒక వ్యక్తికున్న ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని పూర్తిగా పునరుద్ధరించి మళ్లీ సజీవుణ్ణి చేస్తాడు. (యోహా. 5:28, 29) మానవులు చనిపోవాలన్నది దేవుని అసలు ఉద్దేశం కాకపోయినా మరణం మానవుల్లో ప్రవేశించడం వల్ల, చనిపోయినవారిని తిరిగి లేపే శక్తి తనకుందని చూపించే అవకాశం యెహోవాకు దొరికింది. నిజానికి, యెహోవా దేవుడే “సర్వాధికారి.”
13. యేసు బలి యెహోవా పరిపూర్ణ న్యాయానికి రుజువని ఎలా చెప్పవచ్చు?
13 న్యాయం. యెహోవా అబద్ధమాడడు, అన్యాయం చేయడు. (ద్వితీ. 32:4; తీతు 1:1, 2) సత్యం, న్యాయం వంటి విషయాల్లో ఆయన ఉన్నత ప్రమాణాలు పాటిస్తాడు. తనకు నష్టం జరుగుతుందని అనిపించినా ఆయన ఆ ప్రమాణాలకు కట్టుబడి ఉంటాడు. (రోమా. 8:32) తన ప్రియ కుమారుడు హింసాకొయ్యపై దైవదూషణ చేసిన విశ్వాసఘాతకునిలా మరణించడాన్ని చూసినప్పుడు యెహోవా ఎంత బాధపడివుంటాడు! అయినా, అపరిపూర్ణ మానవులపట్ల ప్రేమ చూపించడానికి, తన పరిపూర్ణ న్యాయానికి కట్టుబడి ఉండడానికి ఆ వేదనకరమైన సంఘటన జరిగేందుకు అనుమతించాడు. (రోమీయులు 5:18-21 చదవండి.) ఈ లోకం అన్యాయంతో నిండి ఉండడంవల్ల ఆయనే అత్యుత్తమ న్యాయవంతుడని నిరూపించే అవకాశం యెహోవాకు దొరికింది.
14, 15. యెహోవా తనకున్న గొప్ప జ్ఞానాన్ని, సహనాన్ని ఏయే విధాలుగా చూపించాడు?
14 జ్ఞానం. ఆదాముహవ్వలు పాపం చేసిన వెంటనే, వారి తిరుగుబాటు వల్ల వచ్చిన చెడు పర్యవసానాలను తానెలా తొలగిస్తాడో యెహోవా తెలియజేశాడు. (ఆది. 3:15) యెహోవా దేవుడు అలా వెంటనే చర్య తీసుకోవడమేకాక, తన ఉద్దేశమేమిటో క్రమ క్రమంగా తెలియజేస్తూ వచ్చాడు. వీటిని బట్టి యెహోవా జ్ఞానం ఎంత గొప్పదో తెలుస్తుంది. (రోమా. 11:33) ఎలాంటి పరిస్థితినైనా చక్కదిద్దే సామర్థ్యం యెహోవాకు ఉంది, ఈ విషయంలో ఆయనను ఎవ్వరూ అడ్డుకోలేరు. అనైతికత, యుద్ధం, అన్యాయం, అవిధేయత, క్రూరత్వం, పక్షపాతం, వేషధారణ వంటివాటితో ఈ లోకం నిండిపోయింది. కాబట్టి, నిజమైన జ్ఞానమంటే ఏమిటో మానవులకు చూపించే అవకాశం యెహోవాకు దొరికింది. అందుకే శిష్యుడైన యాకోబు ఇలా రాశాడు: “అయితే పైనుండివచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణయైనను లేనిదియునై యున్నది.”—యాకో. 3:17.
15 సహనం, దీర్ఘశాంతం. అపరిపూర్ణత, పాపాలు, లోపాలు ఉన్న మానవులతో వ్యవహరించాల్సి రాకపోతే యెహోవా సహనం, దీర్ఘశాంతం ఇంత గొప్ప స్థాయిలో చూపించే అవకాశం ఉండకపోయేది. వేల సంవత్సరాలుగా యెహోవా ఇష్టపూర్వకంగా ఆ లక్షణాలను చూపిస్తున్నాడు కాబట్టి, ఆయనకు ఈ అద్భుత లక్షణాలు పరిపూర్ణ స్థాయిలో ఉన్నాయని రుజువౌతోంది. అలా చూపిస్తున్నందుకు మనం ఆయనకు ఎంతో కృతజ్ఞత కనబరచాలి. అందుకే అపొస్తలుడైన పేతురు, ‘ప్రభువుయొక్క దీర్ఘశాంతము’ లేదా సహనాన్ని ‘రక్షణార్థమైనదిగా’ పరిగణించాలని రాశాడు.—2 పేతు. 3:9, 15.
16. యెహోవా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడని తెలుసుకుని మనం ఎందుకు సంతోషిస్తాం?
16 క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు. మనమందరం పాపులము, అనేక విషయాల్లో తప్పిపోతుంటాం. (యాకో. 3:2; 1 యోహా. 1:8, 9) యెహోవా “బహుగా” క్షమించడానికి సిద్ధంగా ఉన్నందుకు మనం ఆయనకు ఎంత రుణపడివున్నాం! (యెష. 55:7) ఈ విషయం గురించి కూడా ఆలోచించండి: అపరిపూర్ణులముగా, పాపులముగా పుట్టాం కాబట్టి యెహోవా మన తప్పులను క్షమించినప్పుడు కలిగే గొప్ప సంతోషాన్ని చవిచూసే అవకాశం మనకుంది. (కీర్త. 51:5, 9, 17) యెహోవా చూపించే ఆ మంచి లక్షణాన్ని మనం వ్యక్తిగతంగా చవిచూడడం వల్ల ఆయనపట్ల మనకున్న ప్రేమ పెరుగుతుంది. అంతేకాక, ఇతరులతో వ్యవహరిస్తున్నప్పుడు ఆయన మాదిరి అనుకరించాలని మనకు అనిపిస్తుంది.—కొలొస్సయులు 3:13 చదవండి.
లోకం ఎందుకు వ్యాధిగ్రస్తమైపోయింది?
17, 18. సాతాను పరిపాలన ఏయే విధాలుగా విఫలమైపోయింది?
17 సాతాను పరిపాలనకు ప్రతీకగావున్న ఈ లోక వ్యవస్థ ఎన్నో శతాబ్దాలుగా విఫలమౌతూనే వచ్చింది. 1991లో, ది యూరోపియన్ అనే వార్తాపత్రిక ఇలా చెప్పింది: “లోకం వ్యాధిగ్రస్తమైపోయిందా? అవుననే చెప్పాలి. కానీ, . . . దానికి కారణం దేవుడు కాదు, లోక రుగ్మతలకు మానవులే కారణం.” ఆ మాటలు అక్షరాలా నిజం. సాతాను ప్రలోభంలోపడి మన మొదటి తల్లిదండ్రులు యెహోవా పరిపాలనకు బదులు మానవ పరిపాలనను ఎంచుకున్నారు. అలా వారు ఖచ్చితంగా విఫలమయ్యే పరిపాలనా విధానాన్ని స్థాపించారు. మానవ పరిపాలనను ఘోరమైన వ్యాధి పట్టిపీడిస్తుందని ప్రపంచవ్యాప్తంగా మానవులు అనుభవించిన బాధను, దుఃఖాన్ని చూస్తే తెలుస్తుంది.
18 సాతాను పరిపాలన స్వార్థాన్ని పెంచిపోషిస్తోంది. అయితే, యెహోవా పరిపాలనా విధానం మాత్రం ప్రేమపూర్వకమైనది. స్వార్థం ఎన్నడూ ప్రేమను జయించలేదు. సాతాను పరిపాలన స్థిరత్వాన్ని, సంతోషాన్ని, భద్రతను ఇవ్వడంలో విఫలమైంది. యెహోవా పరిపాలన మాత్రమే సరైనదని నిరూపించబడింది! అలా అనడానికి మన కాలంలో ఏమైనా ఉదాహరణలున్నాయా? ఉన్నాయి. అవేమిటో మనం తర్వాతి ఆర్టికల్‌లో చూద్దాం.
పరిపాలన గురించి ఈ లేఖనాలు చదివిన తర్వాత మనమేమి నేర్చుకున్నాం?
[25వ పేజీలోని చిత్రాలు]
సాతాను పరిపాలనవల్ల మానవులకు ఎన్నడూ మేలు జరగలేదు
[క్రెడిట్ లైనులు]
U.S. Army photo
WHO photo by P. Almasy
[26వ పేజీలోని చిత్రం]
చనిపోయినవారిని కూడా తిరిగి లేపే శక్తి యెహోవాకు ఉంది
[27వ పేజీలోని చిత్రం]
యెహోవా తన కుమారుణ్ణి బలి అర్పించి తనకున్న ప్రేమను, న్యాయాన్ని చూపించాడు