అంతటా ఉన్న సమస్యలు వాటికి పరిష్కారం
కష్టాలు పడుతున్నవారు మనకు అన్నిచోట్లా కనిపిస్తునేవుంటారు, వాళ్లమీద ఎంతోమంది కనికరం చూపిస్తుంటారు. ఉదాహరణకు, ఆసుపత్రుల్లో సేవ చేసేవారు రోగులకు, దెబ్బలు తగిలి బాధపడుతున్నవారికి సహాయం చేయడానికి ఎన్నో గంటలు పనిచేస్తుంటారు. అగ్నిమాపక సిబ్బంది, ప్రమాదాలు జరిగినప్పుడు అక్కడికివెళ్లి కాపాడేవారు ఇతరుల కష్టాలను తగ్గించడానికి కృషిచేస్తారు. అలాగే పోలీసులు, చట్టాలను రూపొందించేవారు ఇతరులు క్షేమంగా ఉండడానికి తాము చేయగలిగింది చేస్తారు. వాళ్లు చేసే ప్రయత్నాలు ప్రజలకు మంచి చేస్తున్నాయి కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కష్టాలను తీసివేయడం ఏ మనిషికీ లేదా ఏ సంస్థకూ సాధ్యం కాదు. అయితే, దేవునికది సాధ్యమే, తప్పకుండా ఆయన దాన్ని చేస్తాడు.
బైబిల్లోని చివరి పుస్తకం, ‘దేవుడు వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేస్తాడు, మరణం ఇక ఉండదు, దుఃఖం, ఏడ్పు, వేదన ఇక ఉండవు, మొదటి సంగతులు గతించిపోయాయి’ అని హామీ ఇస్తోంది. (ప్రకటన 21:4) దానివల్ల ఎంతమందికి మేలు జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. కష్టాలన్నిటినీ తీసివేయాలని దేవుడు కోరుకుంటున్నాడని అది చూపిస్తుంది. ఆయన భూమ్మీద నుండి దుర్మార్గులతో సహా యుద్ధాలు, ఆకలి, రోగాలు, అన్యాయం లేకుండా తీసివేస్తాడు. మనుషులెవ్వరికీ ఇది సాధ్యం కాదు.
దేవుని రాజ్యం ఏం చేస్తుంది?
దేవుడు తాను చేస్తానని చెప్పిన వాటన్నిటినీ విశ్వంలో తన తర్వాత అంత గొప్పవాడైన వ్యక్తి ద్వారా నెరవేరుస్తాడు. చనిపోయి తిరిగి బ్రతికించబడిన యేసుక్రీస్తే ఆ వ్యక్తి. యేసు ఎదురులేని రాజుగా భూమంతటినీ పరిపాలించే రోజు వస్తుంది. మనుషులను ఇకమీదట రాజులు, అధ్యక్షులు లేదా రాజకీయ నాయకులు పరిపాలించరు, ఒకే ఒక్క రాజు పరిపాలిస్తాడు, ఒకే రాజ్యం ఉంటుంది. అదే దేవుని రాజ్యం.
ఆ రాజ్యం, మానవ ప్రభుత్వాలన్నిటినీ తొలగిస్తుంది. ఎంతోకాలం క్రితమే బైబిలు ఇలా చెప్పింది: ‘పరలోకంలోని దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. దానికి ఎన్నటికి నాశనం కలుగదు, ఆ రాజ్యం దాని పొందినవారికి గాక మరెవరికీ చెందదు; అది ముందు చెప్పిన రాజ్యాలన్నిటిని పగులగొట్టి నిర్మూలం చేస్తుంది గాని అది యుగముల వరకు నిలుస్తుంది.’ (దానియేలు 2:44) భూమ్మీద ఉండే ప్రజలందరూ నీతిన్యాయాలు విలసిల్లే దేవుని రాజ్యంలో ఐకమత్యంగా జీవిస్తారు.
యేసు భూమ్మీద మనిషిగా జీవించిన కాలంలో ఆ రాజ్యం గురించి అనేక సందర్భాల్లో మాట్లాడాడు. ఆయన దానిని మాదిరి ప్రార్థనలో ప్రస్తావించి, ‘నీ రాజ్యం వచ్చుగాక; నీ చిత్తం పరలోకంలో నెరవేరుతున్నట్లు భూమియందు నెరవేరును గాక’ అని ప్రార్థించమని తన శిష్యులకు చెప్పాడు. (మత్తయి 6:9, 10) ఆ రాజ్యానికీ దేవుని చిత్తం భూమ్మీద నెరవేరడానికీ సంబంధమున్నట్లు యేసు చూపించాడని గమనించండి. అవును, లోకంలోని కష్టాలన్నిటినీ తొలగించాలన్నదే దేవుని చిత్తం.
ఏ మానవ ప్రభుత్వమూ ఎన్నటికీ తీసుకురాలేని ఆశీర్వాదాల్ని, నీతిన్యాయాలుండే దేవుని ప్రభుత్వం తీసుకొస్తుంది. మానవులు నిత్యం జీవించగలిగేలా యెహోవా తన కుమారుణ్ణి విమోచన క్రయధనంగా ఇచ్చాడనే విషయం గుర్తుచేసుకోండి. అందరి అవసరాల్ని తీర్చే ఆ రాజ్య పరిపాలనలో ప్రజలు అంతకంతకు పరిపూర్ణులవుతారు. అప్పుడు ఏం జరుగుతుంది? ‘మరెన్నడూ ఉండకుండా మరణాన్ని ఆయన మ్రింగివేస్తాడు. ప్రభువైన యెహోవా ప్రతివారి ముఖముమీది బాష్ప బిందువులను తుడిచివేస్తాడు.’—యెషయా 25:8.
మరి ‘దేవుడు ముందే ఎందుకు అలా చేయలేదు? ఆయనెందుకు ఆలస్యం చేస్తున్నాడు?’ అని కొందరు అడగవచ్చు. యెహోవా ఈ కష్టాలన్నిటినీ ఎప్పుడో తొలగించగలిగేవాడే, అవి అసలు రాకుండా అడ్డుకోగలిగేవాడే. అయితే ఆయన తన స్వార్థం కోసం కాదుగానీ భూమ్మీది తన పిల్లల శాశ్వత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వాటిని ఉండనిచ్చాడు. తమ పిల్లలు కష్టాలు పడడంవల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందుతారని తల్లిదండ్రులకు తెలిస్తే తల్లిదండ్రులు వారిని కష్టాలు పడేందుకు అనుమతిస్తారు. అదేవిధంగా, మానవులు తాత్కాలికంగా కష్టాలు అనుభవించేందుకు యెహోవా అనుమతించడానికి మంచి కారణాలే ఉన్నాయి. వాటి గురించి బైబిలు వివరిస్తోంది. సొంతగా నిర్ణయించుకునే స్వేచ్ఛ, వారసత్వంగా వచ్చిన పాపం, యెహోవాకు పరిపాలించే హక్కు ఉందా అనే వివాదం వీటిలో కొన్ని. కొంతకాలంపాటు ఓ దుష్ట ఆత్మప్రాణి ఈ లోకాన్ని పరిపాలించేందుకు అనుమతించబడ్డాడని కూడా బైబిలు వివరిస్తోంది.a
ఈ కొన్ని పేజీల్లో ఆ కారణాలన్నిటినీ చర్చించే వీలు లేకపోయినా, మనకు భవిష్యత్తు గురించిన ఆశను, ప్రోత్సాహాన్ని ఇచ్చే రెండు విషయాలను పరిశీలిద్దాం. మొదటిది: మనం అనుభవించిన ఎలాంటి కష్టాలనైనా యెహోవా తొలగించగలడు. అంతేకాదు, ‘మునుపటివి మరువబడును, జ్ఞాపకానికి రావు’ అని దేవుడు మనకు హామీ ఇస్తున్నాడు. (యెషయా 65:17) తాత్కాలికంగా దుష్టత్వాన్ని తాను అనుమతించినందువల్ల కలిగే సమస్త దుఃఖాన్ని, బాధను దేవుడు పూర్తిగా, శాశ్వతంగా తొలగిస్తాడు.
రెండవది: బాధను తొలగించడానికి దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడు, అందులో మార్పు ఉండదు. యెహోవా బలత్కారాన్ని, కలహాన్ని ఎంతకాలం చూస్తూ ఉంటాడని హబక్కూకు ప్రవక్త అడిగిన ప్రశ్నను గుర్తుచేసుకోండి. యెహోవా దానికి, ‘ఆ దర్శన విషయం నిర్ణయకాలంలో జరుగుతుంది, జాగుచేయక వస్తుంది’ అని జవాబిచ్చాడు. (హబక్కూకు 2:3) తర్వాతి ఆర్టికల్లో మనం చూడబోతున్నట్లుగా, ఆ ‘నిర్ణయకాలం’ సమీపించింది. (w09-E 12/01)
[అధస్సూచి]
a దేవుడు కష్టాలను ఎందుకు అనుమతించాడో సవివరంగా తెలుసుకునేందుకు, యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలో 11వ అధ్యాయం చూడండి.
[7వ పేజీలోని బాక్సు]
బంగారు భవిష్యత్తు గురించి తెలియజేస్తున్న బైబిలు వచనాలు
యుద్ధాలు ఉండవు:
‘యెహోవా చేసే మహత్తర కార్యాలు చూడండి. ఆ కార్యాలు భూమి మీద యెహోవాను ప్రసిద్ధి చేస్తాయి. భూమి మీద ఎక్కడైనా సరే యుద్ధాలను యెహోవా ఆపివేయగలడు.’—కీర్తన 46:8, 9, ఈజీ-టు-రీడ్ వర్షన్.
చనిపోయినవాళ్ళు మళ్ళీ బ్రతుకుతారు:
‘నీతిమంతులకు అనీతిమంతులకు పునరుత్థానం కలుగబోతోంది.’—అపొస్తలుల కార్యములు 24:14.
అందరికీ ఆహారం:
‘దేశంలో [భూమ్మీద], పర్వత శిఖరాల మీద సస్య సమృద్ధి కలుగుతుంది.’—కీర్తన 72:16.
వ్యాధులు ఉండవు:
‘నాకు దేహంలో బాగోలేదని అందులో నివసించే వాళ్లెవరూ అనరు.’—యెషయా 33:24.
భక్తిహీనులు ఇక ఉండరు:
‘భక్తిహీనులు దేశంలో [భూమ్మీద] ఉండకుండా నిర్మూలమవుతారు. విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికివేయబడతారు.’ —సామెతలు 2:22.
న్యాయం వర్థిల్లుతుంది:
‘ఆలకించండి, రాజు [యేసుక్రీస్తు] నీతితో రాజ్య పరిపాలన చేస్తాడు. అధికారులు న్యాయాన్ని అనుసరించి ఏలుతారు.’—యెషయా 32:1.
[7వ పేజీలోని చిత్రాలు]
మనం అనుభవించిన అన్నిరకాల బాధల్ని దేవుని రాజ్యం తొలగిస్తుంది