మా పాఠకుల ప్రశ్న
అద్భుత స్వస్థతలన్నీ దేవుని శక్తితోనే జరుగుతున్నాయా?
యెహోవా దేవునికి స్వస్థపర్చే శక్తి ఉందనడంలో సందేహం లేదు. అంతేకాదు, దాన్ని ఆయన తన ఆరాధకులకు ఇవ్వగలడనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. ఉదాహరణకు, అపొస్తలులు జీవించిన కాలంలో, అద్భుత స్వస్థతలు చేయడమనేది దేవుని పరిశుద్ధాత్మ వరాల్లో ఒకటి. అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: ‘అందరి ప్రయోజనం కోసం ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుతూవుంది. ఏలాగనగా, ఒకరికి ఆ ఆత్మననుసరించిన జ్ఞాన వాక్యం, ఒకరికి ఆ ఒక్క ఆత్మవల్లే స్వస్థపర్చే వరం, ఇంకొకరికి ప్రవచన వరం, మరొకరికి నానావిధ భాషలు అనుగ్రహించబడ్డాయి.’—1 కొరింథీయులు 12:4-11.
అయితే, దేవుని పరిశుద్ధాత్మవల్ల అనుగ్రహించబడిన అద్భుత వరాలు నిలిచిపోతాయని పౌలు కొరింథీయులకు రాసిన అదే పత్రికలో చెప్పాడు. ఆయన ఇలా అన్నాడు: ‘ప్రవచనాలైనా నిరర్థకమవుతాయి; భాషలైనా నిలిచిపోతాయి; జ్ఞానమైనా నిరర్థకమవుతుంది.’—1 కొరింథీయులు 13:8.
మొదటి శతాబ్దంలో, యేసుక్రీస్తు, ఆయన సన్నిహిత అనుచరుల్లో కొంతమంది అద్భుత స్వస్థతలు చేశారు. ఆ కాలంలో, స్వస్థతలు చేయడంతోసహా అన్ని ఆత్మ వరాలు దేవున్ని మహిమపర్చాయి అంతేకాదు, కొత్తగా స్థాపించబడిన క్రైస్తవ సంఘానికి యెహోవా ఆమోదం, ఆశీర్వాదం ఉన్నాయని అవి చూపించాయి. అయితే, క్రైస్తవ సంఘం స్థిరపడిన తర్వాత, ప్రత్యేకమైన వరాలను ఉపయోగించడంవల్ల కాదుగానీ దృఢమైన విశ్వాసాన్ని, నిరీక్షణను, ప్రేమను కనబర్చడంద్వారా సంఘానికి దేవుని ఆమోదం ఉందని వెల్లడయ్యింది. (యోహాను 13:35; 1 కొరింథీయులు 13:13) అయితే, దాదాపు సా.శ. 100వ సంవత్సరానికల్లా, దేవుడు అద్భుత స్వస్థతలు చేసే శక్తినివ్వడం ఆపేశాడు.a
అయితే, ‘అద్భుత స్వస్థతల గురించిన వార్తలు ఇంకా ఎందుకు వినిపిస్తున్నాయి?’ అని మీరు ఆశ్చర్యపోవచ్చు. ఉదాహరణకు, క్యాన్సర్ ఉందని చెప్పబడుతున్న వ్యక్తి గురించిన వార్తను ఒక వార్తాపత్రిక ప్రచురించింది. ఆయనకు తలలో, మూత్రపిండాలలో, ఎముకలలో కంతులు ఉన్నాయనీ దేవుడు ఆయనతో “మాట్లాడిన” రోజు వరకు ఆయనకు తన భవిష్యత్తు శూన్యంగా కనిపించిందనీ ఆ తర్వాత కొద్దిరోజులకు ఆయన క్యాన్సర్ నయమైందనీ ఆ వార్తాపత్రిక నివేదించింది.
అలాంటి కథలు విన్నప్పుడు, మీరు ఇలా ఎందుకు ఆలోచించకూడదు: ‘ఆ వార్త నిజమేనా? అసలు ఆ వ్యక్తి చెప్పిన దాన్ని రుజువు చేసే ఆసుపత్రి డాక్యుమెంట్లు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ నయమైనట్లు కనిపించినా, అద్భుత స్వస్థతలుగా చెప్పబడుతున్నవన్నీ దేవుని శక్తితోనే జరుగుతాయని బైబిలు బోధిస్తోందా?’
పైన అడిగిన వాటిలో చివరి ప్రశ్నకు జవాబు తెలుసుకోవడం ఎంతో ప్రాముఖ్యం. యేసు తన అనుచరులను ఇలా హెచ్చరించాడు: ‘అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తపడండి. ఆ దినమందు అనేకులు నన్ను చూసి—ప్రభువా, ప్రభువా, మేము నీ నామాన ప్రవచించలేదా? నీ నామాన దయ్యాలను వెళ్ళగొట్టలేదా? నీ నామాన అనేక అద్భుతాలు చేయలేదా? అని చెప్తారు. అప్పుడు—నేను మిమ్మల్ని ఎన్నడు ఎరుగను; అక్రమం చేసేవారలారా, నాయొద్దనుండి పొండని వారితో చెప్తాను.’—మత్తయి 7:15, 21-23.
అద్భుత స్వస్థతలు అని పిలువబడుతున్నవి దేవుని శక్తితో కాదుగానీ వేరే శక్తితో జరిగే అవకాశం ఉందని స్పష్టమౌతోంది. దేవుని పేరిట అద్భుతాలు చేస్తున్నామని చెప్పుకునేవాళ్ల చేతుల్లో మోసపోకుండా ఉండాలంటే మనం దేవుని గురించిన ఖచ్చితమైన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, దేవుడు మనకిచ్చిన తర్కించే సామర్థ్యాన్ని ఉపయోగించుకోవాలి, దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్న ప్రజల్ని ఎలా గుర్తించాలో తెలుసుకోవాలి.—మత్తయి 7:16-19; యోహాను 17:3; రోమీయులు 12:1, 2. (w09 5/1)
[అధస్సూచి]
a అపొస్తలుల మరణంతో, అద్భుత వరాలు ఒకరి నుండి మరొకరు పొందడమనేది నిలిచిపోయిందని, వాటిని పొందినవాళ్లు మరణించారు కాబట్టి దేవుని పరిశుద్ధాత్మవల్ల అనుగ్రహించబడే అద్భుత వరాలు నిలిచిపోయాయని తెలుస్తోంది.