ఉపవాసం దేవునికి దగ్గరవడానికి సహాయం చేస్తుందా?
‘దేవునితో ఉన్న సంబంధం గురించి లోతుగా ఆలోచించడానికి ఉపవాసం సహాయం చేస్తుంది. అంతేకాదు ఆహారపానీయాలు, ధనసంపదలు జీవితంలో అంత ప్రాముఖ్యమైనవికావని గుర్తుచేస్తుంది.’—ఒక క్యాథలిక్ స్త్రీ.
‘ఉపవాసం, దేవునితో సంబంధం ఏర్పర్చుకోవడానికి సహాయం చేస్తుంది.’ —యూదామత బోధకుడు.
‘నా మత విశ్వాసం ప్రకారం ఖచ్చితంగా ఉపవాసం ఉండాల్సిందే. దేవునికి నా భక్తిని, కృతజ్ఞతను వ్యక్తం చేయడానికి అదొక మార్గం. నేను దేవున్ని ప్రేమిస్తున్నాను కాబట్టి ఉపవాసం ఉంటాను.’ —బహాయ్ విశ్వాసురాలు.
ఇస్లాం, జైన, బౌద్ధ, యూదా, హిందూ మతాలతోసహా ప్రపంచంలోని చాలా మతాలవాళ్లు ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉంటే దేవునికి దగ్గరౌతామని చాలామంది నమ్ముతారు.
మీరు ఏమనుకుంటున్నారు? ఉపవాసం ఉండాలా? ఈ విషయంలో దేవుని వాక్యమైన బైబిలు ఏమి చెప్తోంది?
బైబిలు కాలాల్లో ఉపవాసాలు
పూర్వం, దేవుడు అంగీకరించిన వివిధ కారణాలనుబట్టి ప్రజలు ఉపవాసం ఉండేవారు. కొంతమంది తామెంతో దుఃఖిస్తున్నామని చూపించడానికి లేదా తాము చేసిన పాపాలకు పశ్చాత్తాపపడుతున్నామని చూపించడానికి ఉపవాసం ఉండేవాళ్లు. (1 సమూయేలు 7:4-6) మరికొంతమంది, దేవుని అనుగ్రహాన్ని లేదా మార్గనిర్దేశాన్ని పొందడానికి ఉపవాసం ఉండేవాళ్లు. (న్యాయాధిపతులు 20:26-28; లూకా 2:36, 37) ఇంకొంతమంది, ధ్యానించేటప్పుడు ఏకాగ్రతను పెంచుకోవడం కోసం ఉపవాసం ఉండేవాళ్లు.—మత్తయి 4:1, 2.
అయితే, దేవుడు అంగీకరించని ఉపవాసాల గురించి కూడా బైబిలు ప్రస్తావిస్తోంది. కర్ణపిశాచిగల స్త్రీని సంప్రదించే ముందు సౌలు రాజు ఉపవాసం ఉన్నాడు. (లేవీయకాండము 20:6; 1 సమూయేలు 28:20) యెజెబెలు వంటి దుష్ట ప్రజలేకాక, అపొస్తలుడైన పౌలును చంపడానికి పన్నాగం పన్నిన మతోన్మాదులు కూడా ప్రజలు ఉపవాసం ఉండాలని చాటించారు. (1 రాజులు 21:7-12; అపొస్తలుల కార్యములు 23:12-14) పరిసయ్యులకు కూడా క్రమంగా ఉపవాసం ఉంటారనే పేరు ఉండేది. (మార్కు 2:18) అయినా, యేసు వారిని ఖండించాడు అంతేకాదు, వాళ్ళు దేవుని మెప్పునూ పొందలేకపోయారు. (మత్తయి 6:16; లూకా 18:12) అలాగే, కొంతమంది ఇశ్రాయేలీయుల చెడు ప్రవర్తన, చెడు ఉద్దేశాలవల్ల యెహోవా వాళ్ళ ఉపవాసాలను అంగీకరించలేదు.—యిర్మీయా 14:12.
ఉపవాసం ఉన్నంత మాత్రాన దేవుని అంగీకారం పొందవచ్చని అనుకోవడం సరైనది కాదని ఈ ఉదాహరణలు చూపిస్తున్నాయి. అయితే, నమ్మకస్థులైన చాలామంది దేవుని సేవకులు ఉపవాసం ఉండి, దేవుని అంగీకారం పొందారు. మరైతే క్రైస్తవులు ఉపవాసం ఉండాలా?
క్రైస్తవులు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలా?
దేవుడు మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రం, యూదులు ‘తమను దుఃఖపరచుకోవాలి’ అంటే సంవత్సరానికి ఒకసారి ప్రాయశ్చిత్తార్థ దినాన ఉపవాసం ఉండాలని ఆజ్ఞాపించింది. (లేవీయకాండము 16:29-31; కీర్తన 35:13) ఈ ఒక్క సందర్భంలోనే ఉపవాసం ఉండాలని యెహోవా తన ప్రజలకు ఆజ్ఞాపించాడు.a మోషే ధర్మశాస్త్రాన్ని పాటించిన యూదులు ఆ ఆజ్ఞకు లోబడేవుంటారు. కానీ, క్రైస్తవులు మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిన అవసరం లేదు.—రోమీయులు 10:4; కొలొస్సయులు 2:14.
ధర్మశాస్త్రం చెప్పినదాని ప్రకారం యేసు ఉపవాసం ఉన్నా, ఉపవాసం ఉండేవాడనే పేరు మాత్రం ఆయనకు లేదు. ఆయన తన శిష్యులు ఉపవాసం ఉండాలనుకుంటే ఎలా ఉండాలో చెప్పాడేగానీ ఉపవాసం ఉండమనైతే వాళ్ళకు ఎప్పుడూ ఆజ్ఞాపించలేదు. (మత్తయి 6:16-18; 9:14) మరైతే తను చనిపోయిన తర్వాత శిష్యులు ఉపవాసం ఉంటారని ఆయన ఎందుకు చెప్పాడు? (మత్తయి 9:15) అది ఒక ఆజ్ఞ కాదు. తను చనిపోతే శిష్యులు ఎంతో దుఃఖిస్తారు కాబట్టి వాళ్ళకేమీ తినాలనిపించదని యేసు మాటలు చూపిస్తున్నాయి.
ఒక వ్యక్తి సదుద్దేశంతో ఉపవాసం ఉంటే దేవుడు దాన్ని అంగీకరిస్తాడని ఉపవాసమున్న తొలి క్రైస్తవుల గురించి చెప్పే రెండు బైబిలు వృత్తాంతాలు తెలియజేస్తున్నాయి. (అపొస్తలుల కార్యములు 13:2, 3; 14:23)b క్రైస్తవులు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలనే నియమమేమీ లేదు. అయినా, ఒకవేళ ఒక వ్యక్తి ఉపవాసం ఉండాలనుకుంటే కొన్ని ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా ఉండండి
ఉపవాసం ఉన్నప్పుడు మేమే నీతిమంతులం అనుకునే ప్రమాదం ఉంది, అలాంటి ప్రమాదంలో చిక్కుకోకుండా జాగ్రత్తపడాలి. బైబిలు “దొంగవినయం” చూపించడం గురించి హెచ్చరిస్తోంది. (కొలొస్సయులు 2:20-23, ఈజీ-టు-రీడ్ వర్షన్) క్రమంగా తను ఉంటున్న ఉపవాసాలవల్ల ఇతరులకంటే తను చాలా మంచివాడినని అనుకున్న గర్విష్ఠి పరిసయ్యుని గురించి యేసు చెప్పిన ఉపమానం, దేవుడు గర్విష్ఠి పరిసయ్యునిలాంటి వైఖరిని తిరస్కరిస్తాడని చూపిస్తోందనడంలో సందేహం లేదు.—లూకా 18:9-14.
మీరు ఉపవాసం ఉన్నారన్న విషయం పదిమందికీ తెలిసేటట్టు చేయడం లేదా ఇతరులు చెప్పారని ఉపవాసం ఉండడం కూడా పొరపాటే. మత్తయి 6:16-18 ప్రకారం, ఉపవాసమనేది దేవునికి, మీకు మధ్య ఉన్న వ్యక్తిగత విషయమనీ దాని గురించి అందరికీ చెప్పుకోకూడదనీ యేసు ఉపదేశించాడు.
ఉపవాసం ఉన్నంతమాత్రాన పాపాలకు ఏదోవిధంగా పరిహారం కలుగుతుందని అనుకోకూడదు. ఉపవాసాన్ని దేవుడు అంగీకరించాలంటే మనం ఉపవాసం ఉండడమేకాక ఆయనిచ్చిన నియమాలకు లోబడాలి. (యెషయా 58:3-7) ఉపవాసం ఉంటే కాదుగానీ, నిజమైన పశ్చాత్తాపం చూపిస్తేనే పాపాలు క్షమించబడతాయి. (యోవేలు 2:12, 13) క్రీస్తు బలి ద్వారా యెహోవా చూపించిన కృప వల్లే మన పాపాలకు క్షమాపణ దొరుకుతుందని బైబిలు నొక్కిచెప్తోంది. అయితే ఉపవాసంతోసహా, మనం చేసే ఏ పనులవల్ల కూడా మన పాపాలకు క్షమాపణను సంపాదించుకోలేము.—రోమీయులు 3:24, 27, 28; గలతీయులు 2:16; ఎఫెసీయులు 2:8, 9.
యెషయా 58:3 మరో సాధారణమైన పొరపాటు గురించి తెలియజేస్తోంది. ఉపవాసం ఉండి దేవునికి తామేదో మేలు చేస్తున్నట్టు, తాము ఉపవాసం ఉన్నందుకు యెహోవా తమకు ఏదైనా ప్రతిఫలం ఇవ్వాలని ఇశ్రాయేలీయులు అనుకున్నారు. వాళ్ళు ఇలా అడిగారు: “మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్యపెట్టవు?” ఇశ్రాయేలీయుల్లాగే నేడు కూడా చాలామంది తాము ఉపవాసం ఉన్నందుకు ప్రతిఫలంగా దేవుడు తమ కోసం ఏదైనా చేస్తాడని ఎదురుచూడవచ్చు అనుకుంటారు. అలాంటి అమర్యాదకరమైన, లేఖన విరుద్ధమైన వైఖరిని మనం ఎన్నడూ అనుసరించకూడదు.
ఉపవాసం ఉండడం, తమను తాము కొరడాలతో కొట్టుకోవడం లేదా అలాంటిది మరేదైనా చేసి శరీరాన్ని బాధపర్చుకుంటే దేవుని అంగీకారం పొందవచ్చని మరికొంతమంది అనుకుంటారు. ‘దేహాన్ని కఠినంగా శిక్షించుకోవడం,’ చెడు కోరికలను ‘అదుపులో పెట్టుకోవడానికి పనికిరాదు’ అని చూపిస్తూ దేవుని వాక్యం ఈ ఆలోచనను ఖండిస్తోంది.—కొలొస్సయులు 2:20-23, ఈజీ-టు-రీడ్ వర్షన్.
సరైన దృక్పథం
ఖచ్చితంగా ఉపవాసం ఉండాలనేమీ లేదు. అయితే, ఉపవాసం ఉన్నా తప్పు లేదు. పైన పేర్కొన్న ప్రమాదాలను నివారిస్తే ఉపవాసం ఉండడం కొన్ని సందర్భాల్లో ప్రయోజనకరంగానే ఉండవచ్చు. దేవుడు మన ఆరాధనను అంగీకరించాలంటే ఉపవాసం ఉండడమే ప్రాముఖ్యమైన విషయం కాదు. యెహోవా ‘సంతోషంగల దేవుడు’ కాబట్టి, తన సేవకులు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాడు. (1 తిమోతి 1:11, NW) ఆయన వాక్యం ఇలా చెప్తోంది: ‘ప్రతీ ఒక్కరు అన్నపానములు పుచ్చుకొంటూ తమ కష్టార్జితంవల్ల సుఖం అనుభవించడం కంటే నరులకు శ్రేష్ఠమైనది ఏదీ లేదు. అది దేవుడిచ్చే బహుమానమే.’—ప్రసంగి 3:12, 13.
మనం సంతోషంగా దేవున్ని ఆరాధించాలి. అయితే బైబిలు, ఉపవాసాన్ని సంతోషంతో ముడిపెట్టడంలేదు. అంతేకాదు, తినకుండా ఉండడంవల్ల మన ఆరోగ్యం తీవ్రంగా పాడవుతే లేదా మన సృష్టికర్త నిజ క్రైస్తవులకిచ్చిన సంతోషకరమైన పనిని అంటే రాజ్యసువార్త ప్రకటనాపనిని చేయలేనంతగా మన శక్తిని హరించివేస్తే ఉపవాసం ఉండడంవల్ల ప్రయోజనమేమీ ఉండదు.
మనం ఉపవాసం ఉండాలనుకున్నా, ఉండకూడదనుకున్నా ఈ విషయంలో ఇతరులను విమర్శించకుండా జాగ్రత్తపడాలి. దీని గురించి నిజక్రైస్తవుల మధ్య ఎలాంటి విభేదాలు ఉండకూడదు. ఎందుకంటే, ‘దేవుని రాజ్యం అంటే తినటం, తాగటం కాదు. అది పవిత్రాత్మ ద్వారా లభించే నీతికి, శాంతికి, ఆనందానికి సంబంధించింది.’—రోమీయులు 14:17, ఈజీ-టు-రీడ్ వర్షన్. (w09 4/1)
[అధస్సూచీలు]
a ఉపవాసం ఉండమని దేవుడు ఎస్తేరుకు ఆజ్ఞాపించలేదు, కానీ ఆమె ఉపవాసాన్ని ఆయన అంగీకరించాడని తెలుస్తుంది. నేడు యూదులు, ఎస్తేరు ఉపవాసాన్ని అనుసరిస్తూ పూరీము అనే యూదుల పండుగకు ముందు ఉపవాసం ఉంటారు. యూదులు ఈ ఆచారాన్ని ఎంతోకాలంగా పాటిస్తున్నారు.
b కొన్ని బైబిళ్ళు ఉపవాసం అనే పదాన్ని ఉపయోగించాయి. కానీ ఆ పదం ప్రాచీన గ్రీకు రాతప్రతుల్లో లేదు.—మార్కు 9:29, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.
[26వ పేజీలోని బ్లర్బ్]
పరిసయ్యులు ఉపవాసం ఉంటున్నప్పుడు దొంగవినయం చూపించారు
[27వ పేజీలోని బ్లర్బ్]
‘దేవుని రాజ్యం అంటే తినటం, తాగటం కాదు. అది పవిత్రాత్మ ద్వారా లభించే నీతికి, శాంతికి, ఆనందానికి సంబంధించింది’
[27వ పేజీలోని బాక్సు]
నలభై రోజుల ఉపవాసం విషయమేమిటి?
చర్చీకెళ్ళే క్రైస్తవులు క్రీస్తు 40 రోజుల ఉపవాసాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి తాము 40 రోజులు ఉపవాసం ఉంటామని చెప్పుకుంటారు. కానీ యేసు తన ఉపవాసాన్ని జ్ఞాపకార్థంగా ఆచరించాలని తన శిష్యులకు ఎప్పుడూ ఆజ్ఞాపించలేదు, శిష్యులు అలా చేసినట్లు ఏ రుజువులు కూడా లేవు. ఈస్టర్ ముందు చేసే 40 రోజుల ఉపవాసం గురించిన మొట్టమొదటి నమ్మదగిన ప్రస్తావన సా.శ. 330లో అథనేసియస్ అనే వ్యక్తి రాసిన ఉత్తరాల్లో ఉందని తలంచబడుతోంది.
యేసు తను చనిపోయే ముందు కాదుగానీ తను బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఉపవాసం ఉన్నాడు కాబట్టి, కొన్నిమతాలు ఈస్టర్‌కు ముందు వారాల్లో 40 రోజులపాటు ఉపవాసం ఉండడం వింతగా అనిపించవచ్చు. అయితే, ప్రాచీన బబులోనీయులు, ఐగుప్తీయులు, గ్రీసు దేశస్థులు సంవత్సరంలోని ప్రారంభ నెలల్లో 40 రోజులు ఉపవాసం ఉండేవారు. “క్రైస్తవ” ఆచరణగా చెప్పబడుతున్న ఈ ఆచరణ వాళ్ళనుండే వచ్చిందని తెలుస్తోంది.