దేవునికి దగ్గరవ్వండి
ఏదైనా ‘దేవుని ప్రేమనుండి మనల్ని ఎడబాపగలదా’?
ప్రేమించబడాలని మనలో ఎవరం మాత్రం కోరుకోము? నిజానికి, మన కుటుంబ సభ్యులు, స్నేహితులు మనల్ని ప్రేమించినప్పుడు మనమెంతో సంతోషాన్ని, సంతృప్తిని పొందుతాం. అయితే, విచారకరంగా మానవ సంబంధాలు ఎంతో సున్నితంగా, అనిశ్చయంగా ఉంటాయి. మనల్ని ప్రేమించేవారు మనల్ని బాధపెట్టవచ్చు, విడిచిపెట్టవచ్చు, తిరస్కరించవచ్చు కూడా. కానీ, ఒకే ఒక్క వ్యక్తి ప్రేమలో అంటే దేవుని ప్రేమలో మాత్రం ఎలాంటి మార్పూ ఉండదు. యెహోవా దేవునికి తన ఆరాధకులపట్ల ఉన్న ప్రేమ రోమీయులు 8:38, 39లో ఎంతో రమ్యంగా వర్ణించబడింది.
ఈ వచనాల చివర్లో, అపొస్తలుడైన పౌలు “రూఢిగా నమ్ముచున్నాను” అని అన్నాడు. దేనిని ఆయన రూఢిగా నమ్మాడు? ‘దేవుని ప్రేమనుండి మనల్ని ఏదీ ఎడబాపలేదు’ అంటే వేరుచేయలేదు అని నమ్మాడు. పౌలు కేవలం తన తరఫునే కాదు ‘మన’ తరఫున అంటే దేవుణ్ణి యథార్థంగా సేవించేవారందరి తరఫున మాట్లాడాడు. ఆయన తాను చెబుతున్న విషయాన్ని నొక్కిచెప్పడానికి, యెహోవా తన సమర్పిత సేవకులను ప్రేమించకుండా చేయలేని అనేక అంశాలను పేర్కొన్నాడు.
“మరణమైనను జీవమైనను.” యెహోవా తన ప్రజలు చనిపోయినా వారిని ప్రేమించడం మానుకోడు. దేవుడు తన ప్రేమకు రుజువుగా అలాంటివారిని జ్ఞాపకముంచుకుని, రాబోయే నీతియుక్తమైన నూతనలోకంలో వారిని తిరిగి బ్రదికిస్తాడు. (యోహాను 5:28, 29; ప్రకటన 21:3, 4) ఈలోగా, తనను యథార్థంగా ఆరాధించేవారికి ఈ లోక విధానంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దేవుడు వారిని ప్రేమిస్తూనే ఉంటాడు.
“దేవదూతలైనను ప్రధానులైనను.” మానవులు పలుకుబడివున్న వ్యక్తుల లేదా అధికారుల ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉంది, కానీ యెహోవా విషయంలో అలా జరగదు. బలమైన ఆత్మప్రాణులు అంటే సాతానుగా మారిన దేవదూతలాంటివారు, దేవుడు తన ఆరాధకులను ప్రేమించకుండా ఆపలేరు. (ప్రకటన 12:10) నిజ క్రైస్తవులను వ్యతిరేకించే ప్రభుత్వాలు కూడా, దేవునికి తన సేవకుల విషయంలో ఉన్న దృక్కోణాన్ని మార్చలేవు.—1 కొరింథీయులు 4:13.
“ఉన్నవియైనను రాబోవునవియైనను.” కాలంగడిచే కొద్దీ దేవుని ప్రేమ తగ్గిపోదు. దేవుడు తన సేవకులను ప్రేమించడం మానుకునేలా చేసేదేదీ వారికి ఇప్పుడు గానీ, భవిష్యత్తులో గానీ జరగదు.
“అధికారులైనను.” పౌలు పరలోకంలోనూ, భూమిపైనా ఉన్న శక్తిమంతులైనవారి గురించి అంటే “దేవదూతల” గురించి, “ప్రధానుల” గురించి ప్రస్తావించాడు, కానీ ఇప్పుడు ఆయన “అధికారుల” గురించి ప్రస్తావిస్తున్నాడు. ఇక్కడ ఉపయోగించబడిన గ్రీకు పదానికి విస్తృతభావం ఉంది. దాని ఖచ్చితమైన భావమేదైనప్పటికీ ఒక విషయం మాత్రం నిశ్చయం: పరలోకంలో, భూమిపై ఉన్న అధికారమేదీ యెహోవా తన ప్రజలను ప్రేమించకుండా ఆపలేదు.
“ఎత్తయినను లోతైనను.” యెహోవా తన ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లోవున్నా అంటే మంచిస్థితిలోవున్నా, దీనస్థితిలోవున్నా వారిని ప్రేమిస్తాడు.
“సృష్టింపబడిన మరి ఏదైనను.” సమస్త సృష్టిని ఉద్దేశించే ఈ మాటలతో పౌలు, యెహోవా ప్రేమనుండి యథార్థవంతులైన ఆరాధకులను ఏదీ వేరుచేయలేదని చెప్పాడు.
మారిపోగల లేదా తగ్గిపోగల మానవ ప్రేమలాకాక, విశ్వాసంతో తనకోసం ఎదురుచూసేవారిపట్ల దేవునికున్న ప్రేమ మార్పులేనిది; అది నిరంతరం నిలిచివుంటుంది. ఈ విషయం తెలుసుకోవడం, మనం యెహోవాకు దగ్గరయ్యేలా చేసి ఆయనపై మనకున్న ప్రేమను నిరూపించుకోవడానికి శాయశక్తులా కృషిచేసేలా మనల్ని పురికొల్పుతుంది. (w08 8/1)