మా పాఠకుల ప్రశ్న
యెహోవాసాక్షులు యుద్ధాల్లో ఎందుకు భాగం వహించరు?
యెహోవాసాక్షులు ఎక్కడ నివసిస్తున్నా, రెండు దేశాలకు మధ్య జరుగుతున్న యుద్ధాల్లోగానీ, ఒక దేశంలో జరిగే అంతర్గత యుద్ధాల్లోగానీ భాగం వహించరనే చరిత్ర వారికుంది. “యుద్ధం జరుగుతున్నప్పుడు యెహోవాసాక్షులు ఎవరి పక్షమూ వహించరు” అని ఆస్ట్రేలియన్ ఎన్సైక్లోపీడియా అర్ధశతాబ్దం క్రితమే చెప్పింది.
సాక్షులు యుద్ధాల్లో భాగం వహించకపోవడానికి ప్రధాన కారణమేమిటంటే, అది వారి క్రైస్తవ మనస్సాక్షికి వ్యతిరేకమైనది. ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చిన ఆజ్ఞలతో, మాదిరితో వారి మనస్సాక్షికి శిక్షణ ఇవ్వబడింది. ఆయన తన అనుచరులకు తమ పొరుగువారిని ప్రేమించమని నిర్దేశించాడు. ఆయనింకా ఇలా ఆజ్ఞాపించాడు, “మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించువారికి మేలు చేయుడి.” (లూకా 6:27; మత్తయి 22:39) ఆయన శిష్యులలో ఒకరు కత్తిదూసి ఆయనను తప్పించడానికి ప్రయత్నించినప్పుడు, యేసు ఆయనతో, “నీ కత్తి వరలో తిరిగి పెట్టుము; కత్తి పట్టుకొను వారందరు కత్తిచేతనే నశింతురు” అని చెప్పాడు. (మత్తయి 26:52) అలా ఆయన తన మాట ద్వారా, మాదిరి ద్వారా తన అనుచరులు యుద్ధోపకరణాలు ముట్టుకోరని స్పష్టంగా చూపించాడు.
యెహోవాసాక్షులు యుద్ధం చేయకపోవడానికి మరో కారణమేమిటంటే, వారు ప్రపంచవ్యాప్తంగావున్న సహోదరబృందంలో సభ్యులు. యుద్ధంలో సహోదరునికి వ్యతిరేకంగా సహోదరుడు పోరాడాల్సివస్తుంది, అది ‘ఒకరియెడల ఒకరు ప్రేమగలవారిగా’ ఉండాలని యేసు ఇచ్చిన ఆజ్ఞకు వ్యతిరేకమైనది.—యోహాను 13:35.
ప్రేమకు సంబంధించి పైన పేర్కొనబడిన సూత్రాలను యెహోవాసాక్షులు పాటిస్తారు. ఉదాహరణకు, 1939-1945 వరకు జరిగిన రెండవ ప్రపంచ యుద్ధంలో వారు వహించిన స్థానాన్ని పరిశీలించండి. అమెరికాలో 4,300 కన్నా ఎక్కువమంది యెహోవాసాక్షులు యుద్ధంలో భాగం వహించడానికి తిరస్కరించినందుకు ఫెడరల్ జైళ్ళలో పెట్టబడ్డారు. బ్రిటన్‌లో 300 కన్నా ఎక్కువమంది స్త్రీలతోసహా 1,500 కన్నా ఎక్కువమంది యుద్ధ విధుల్లో పాల్గొనడానికి నిరాకరించినందుకు జైళ్ళలో పెట్టబడ్డారు. నాజీ జర్మనీలో 270 కన్నా ఎక్కువమంది సాక్షులు ఆయుధాలు చేపట్టని కారణంగా వారిని చంపేయమని ప్రభుత్వం ఆజ్ఞ జారీచేసింది. నాజీపరిపాలన క్రింద 10,000 కన్నా ఎక్కువమంది సాక్షులు జైళ్ళలో లేదా నిర్బంధ శిబిరాల్లో పెట్టబడ్డారు. జపాన్‌లోని సాక్షులు కూడా అలాంటి హింసనే ఎదుర్కొన్నారు. రెండవ ప్రపంచ యుద్ధంలోనైనా, ఆ తర్వాత వచ్చిన ఎలాంటి చిన్న యుద్ధాల్లోనైనా తమ ఆప్తులను కోల్పోయినవారు, ఆ యుద్ధాల్లో మరణించినవారి మరణానికి యెహోవాసాక్షులు బాధ్యులు కారని నమ్మవచ్చు.
యుద్ధంపట్ల యెహోవాసాక్షుల దృక్పథం, ఉల్ఫ్‌గాంగ్ కుస్సేరో తుదిపలుకులలో చాలా అర్థవంతంగా వ్యక్తంచేయబడింది. ఈ 20 సంవత్సరాల జర్మన్ దేశీయుడు యుద్ధంలో భాగం వహించనందుకు నాజీలు 1942లో ఆయన తల నరికేశారు. (యెషయా 2:4) మిలటరీ న్యాయస్థానం ముందు ఆయనిలా చెప్పాడు, “పరిశుద్ధ లేఖనాల్లోవున్న దేవుని వాక్యం ప్రకారం నేనొక యెహోవాసాక్షిగా పెంచబడ్డాను. దేవుడు మానవులకిచ్చిన గొప్ప, పరిశుద్ధమైన ఆజ్ఞ ఏమిటంటే ‘అన్నింటికన్నా ఎక్కువగా నీవు నీ దేవుణ్ణి ప్రేమింపవలెను, నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను.’ ఇంకో ఆజ్ఞ ఏమిటంటే, ‘నరహత్య చేయకూడదు.’ మన సృష్టికర్త వీటన్నిటినీ చెట్లకొరకు వ్రాశాడా?”—మార్కు 12:29-31; నిర్గమకాండము 20:13.
సర్వశక్తిమంతుడైన యెహోవా దేవుడు మాత్రమే ఈ భూమిపై శాశ్వత శాంతిని తీసుకువస్తాడని యెహోవాసాక్షులు నమ్ముతున్నారు. ఆయన “భూదిగంతములవరకు యుద్ధములు మాన్పు[తానని]” చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాలని వారు ఎదురుచూస్తున్నారు.—కీర్తన 46:9. (w08 7/1)