కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w07 10/1 పేజీలు 21-25
  • నేడు దేవుని సంకల్పానికి అనుగుణంగా జీవించడం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నేడు దేవుని సంకల్పానికి అనుగుణంగా జీవించడం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రగతిశీల, ఆచరణాత్మక చర్యలు తీసుకోవడం
  • సమతుల్యంగా ఉండడాన్ని నేర్చుకోండి
  • దేవుని సంకల్పానికి అనుగుణంగా జీవించడాన్ని ధ్యేయంగా చేసుకోవడం
  • నిజంగా అర్థవంతమైన జీవితం
  • అర్థవంతమైన సంకల్పంతో జీవించడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • యౌవనస్థులారా—మీ జీవితంలో మీరేమి చేస్తారు?
    యౌవనస్థులారా—మీ జీవితంలో మీరేమి చేస్తారు?
  • పూర్తికాల సేవలో ఉన్నవాళ్లను గుర్తుపెట్టుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
  • కొత్త నియామకానికి ఎలా అలవాటుపడవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
w07 10/1 పేజీలు 21-25

నేడు దేవుని సంకల్పానికి అనుగుణంగా జీవించడం

‘జీవించువారికమీదట తమకొరకు కాక, తమ నిమిత్తము మృతిపొంది తిరిగి లేచినవానికొరకే జీవించుటకు ఆయన అందరికొరకు మృతిపొందెను.’—2 కొరింథీయులు 5:15.

1. ఒక మిషనరీకి తన నియామకంలో ఎదురైన అనుభవాన్ని వివరించండి.

“అంతర్యుద్ధం ముగిసిన తర్వాత ఆఫ్రికాలోని మారుమూల గ్రామంలోకి ప్రవేశించిన మొదటి పౌరవాహనం మాదే. అక్కడున్న చిన్న సంఘంతో సంబంధాలు తెగిపోయాయి, కాబట్టి అక్కడి సహోదరుల అవసరాలపట్ల మేము శ్రద్ధ చూపించాలి. ఆహారం, వస్త్రాలు, బైబిలు సాహిత్యాలతోపాటు యెహోవాసాక్షులు—ఆ పేరు వెనుకనున్న సంస్థ (ఆంగ్లం) అనే వీడియోను కూడా మేము తీసుకెళ్లాం.a దానిని చూసేందుకు ఆ గ్రామ ‘థియేటర్‌కు’ అంటే విసిఆర్‌, టీవీ ఏర్పాటుచేసిన ఓ పెద్ద గుడిసె దగ్గరకు ఆసక్తిపరులు ఎంతోమంది రావడంతో, మేము దానిని రెండుసార్లు చూపించాల్సివచ్చింది. ప్రదర్శించిన ప్రతీసారీ అనేకమంది బైబిలు అధ్యయనాల కోసం అడిగారు. స్పష్టంగా మా ప్రయత్నాలకు తగిన ఫలితాలు మెండుగా లభించాయి” అని ఏరన్‌ అనే మిషనరీ గుర్తు చేసుకుంటున్నాడు.b

2. (ఎ) క్రైస్తవులు తమ జీవితాలను దేవుని సేవలో ఉపయోగించాలని ఎందుకు తీర్మానించుకుంటారు? (బి) మనమిప్పుడు ఏ ప్రశ్నలు పరిశీలిస్తాం?

2 ఏరన్‌ ఆయన సహవాసులు అంత కష్టపడి అక్కడికి ఎందుకెళ్లారు? ఎందుకంటే, యేసు విమోచన క్రయధన బలిపట్ల తమకున్న కృతజ్ఞతనుబట్టి వారు తమ జీవితాలను దేవునికి సమర్పించుకుని, అలా సమర్పించుకున్న తమ జీవితాలను దేవుని సంకల్పానికి అనుగుణంగా ఉపయోగించాలని కోరుకున్నారు. వారిలాగే సమర్పిత క్రైస్తవులందరూ ‘తమకొరకు జీవించడానికి’ కాదుగానీ ‘సువార్తకొరకు’ తాము చేయగలిగినదంతా చేసేందుకు తీర్మానించుకున్నారు. (2 కొరింథీయులు 5:15; 1 కొరింథీయులు 9:23) ఈ విధానానికి సమయం ముగిసినప్పుడు, లోకంలోని సమస్త ధనానికి, హోదాకు ఎలాంటి విలువా ఉండదని వారికి తెలుసు. కాబట్టి జీవం, ఒక మోస్తరు ఆరోగ్యం ఉన్న వీరు, తమకున్న వాటిని దేవుని సంకల్పానికి అనుగుణంగా ఉపయోగించాలని కోరుకుంటున్నారు. (ప్రసంగి 12:1) ఇలా మనమెలా చేయగలం? అలా చేసేందుకు అవసరమైన ధైర్యాన్ని, బలాన్ని మనం ఎక్కడ కనుగొనగలం? మనకు ఎలాంటి సేవారంగాలు అందుబాటులో ఉన్నాయి?

ప్రగతిశీల, ఆచరణాత్మక చర్యలు తీసుకోవడం

3. దేవుని చిత్తం చేయడంలో ఏ ప్రాథమిక చర్యలు ఇమిడివున్నాయి?

3 నిజ క్రైస్తవులకు దేవుని చిత్తం చేయడం ఓ జీవిత ప్రణాళిక. అది సాధారణంగా దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో చేరడం, ప్రతీరోజు బైబిలు చదవడం, ప్రకటనాపనిలో పాల్గొనడం, బాప్తిస్మం తీసుకునే దిశగా ప్రగతి సాధించడం వంటి ప్రాథమిక చర్యలతో ఆరంభమౌతుంది. అలా మనం ప్రగతి సాధిస్తుండగా అపొస్తలుడైన పౌలు చెప్పిన ఈ మాటలను గుర్తుపెట్టుకుంటాం: “నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటియందే సాధకము చేసికొనుము.” (1 తిమోతి 4:15) అలాంటి ప్రగతి స్వీయ ఘనతను కాదుగానీ నిస్వార్థంగా దేవుని చిత్తం చేయాలనే మన దృఢసంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది. అలాంటి విధానాన్ని అవలంబించడం, మన జీవిత చర్యలన్నింటిలో దేవుడు మన మార్గాన్ని నిర్దేశించేందుకు మనం అనుమతిస్తున్నామని చూపిస్తుంది, ఆయన మనల్ని మనం నిర్దేశించుకోగలిగిన దానికన్నా మరెంతో మిన్నగా నిర్దేశిస్తాడు.—కీర్తన 32:8.

4. అనవసర భయాల్ని మనమెలా ప్రక్కనబెట్టవచ్చు?

4 అయితే సంశయం, మనకు మనం అధిక ప్రాధాన్యతనిచ్చుకోవడం దేవుని సేవలో ప్రగతి సాధించేందుకు మనకు అడ్డంకులుగా ఉంటాయి. (ప్రసంగి 11:4) కాబట్టి, దేవునికి, ఇతరులకు సేవ చేయడంలో నిజమైన ఆనందాన్ని కనుగొనడానికి ముందు మనం మనసొంత భయాలను అధిగమించాలి. ఉదాహరణకు, ఎరిక్‌ వేరేభాషా సంఘంలో సేవచేయాలని ఆలోచిస్తున్నాడు. కానీ ఆయన ఇలా ఆందోళన చెందాడు: ‘నేను సంఘంతో కలిసిపోగలనా? నేను సహోదరులను ఇష్టపడతానా? వారు నన్ను ఇష్టపడతారా?’ ఆయనిలా వివరిస్తున్నాడు: “చివరకు నేను నా గురించి కాక సహోదరుల గురించే ఎక్కువ శ్రద్ధ కలిగివుండాలని గ్రహించాను. ఆందోళనపడడం మానేసి నేను చేయగలిగినది నిస్వార్థంగా చేయాలని తీర్మానించుకున్నాను. సహాయం కోసం ప్రార్థించి ముందుకుసాగాను. అక్కడ నేనిప్పుడు నా సేవనెంతో ఆనందిస్తున్నాను.” (రోమీయులు 4:20) అవును, మనం నిస్వార్థంగా ఎంతెక్కువగా దేవునికి, ఇతరులకు సేవచేస్తామో అంతెక్కువగా ఆనందాన్ని, సంతృప్తిని కనుగొంటాం.

5. దేవుని సంకల్పానికి అనుగుణంగా జీవించేందుకు జాగ్రత్తగా ప్రణాళిక వేసుకోవడం ఎందుకవసరం? ఉదాహరించండి.

5 దేవుని సంకల్పానికి అనుగుణంగా విజయవంతంగా జీవించేందుకు మనం మన చర్యల్ని జాగ్రత్తగా ప్రణాళిక వేసుకోవడం కూడా అవసరం. ఈ విధానానికి మనల్ని దాసోహం చేసి, దేవుని సేవచేసే మన స్వేచ్ఛను పరిమితం చేయగల అధిక అప్పులకు మనం జ్ఞానయుక్తంగా దూరంగా ఉంటాం. బైబిలు మనకిలా జ్ఞాపకం చేస్తోంది: “అప్పు చేయువాడు అప్పిచ్చినవానికి దాసుడు.” (సామెతలు 22:7) యెహోవాపై నమ్మకముంచి, ఆధ్యాత్మిక విషయాలకు ప్రథమ స్థానమివ్వడం మనం సరైనవాటిపై దృష్టి నిలిపేందుకు సహాయం చేస్తాయి. ఉదాహరణకు, గౌమింగ్‌ ఆయన అక్కా, చెల్లెలు ఇల్లు కొనడానికైనా, అద్దెకైనా ఎక్కువ డబ్బు అవసరమవడమే కాక, స్థిరమైన ఉద్యోగం లభించడం కష్టంగావున్న ప్రాంతంలో నివసిస్తున్నారు. ఒకరిద్దరికి ఉద్యోగాలులేని సమయంలో కూడా ఉన్న డబ్బును జాగ్రత్తగా ఉపయోగిస్తూ, ఖర్చులు పంచుకుంటూ వారు జీవనం సాగిస్తున్నారు. గౌమింగ్‌ ఇలా అంటున్నాడు: “కొన్నిసార్లు ఒకరిద్దరికి జీతం రాదు. అయినా మేము పయినీరు పరిచర్యలో కొనసాగుతూ మా అమ్మను శ్రద్ధగా చూసుకుంటున్నాం. మా అమ్మ తాను సుఖంగా జీవించడానికి అవసరమైనవి సమకూర్చేలా మేము మా ఆధ్యాత్మిక కార్యకలాపాలను విడిచిపెట్టాలని కోరనందుకు ఆమెపట్ల మేము కృతజ్ఞత కలిగివున్నాం.”—2 కొరింథీయులు 12:14; హెబ్రీయులు 13:5.

6. మన జీవితాన్ని దేవుని సంకల్పానికి అనుగుణంగా ఎలా మార్చుకోవచ్చో ఏ ఉదాహరణ చూపిస్తోంది?

6 మీరు లౌకిక విషయాల్లో అంటే ఆర్థిక లేదా మరితర విషయాల్లో పూర్తిగా మునిగిపోయివుంటే, దేవుని సంకల్పానికి ప్రథమ స్థానమిచ్చేందుకు పెద్దయెత్తున సర్దుబాట్లు చేసుకోవాల్సి రావచ్చు. సాధారణంగా అలాంటి మార్పుల్ని ఒక్కరాత్రిలోనే చేసుకోవడం కుదరదు, అలాగే మీ మొదటి ప్రయత్నాల్లో జరిగే పొరపాట్లను వైఫల్యాలుగా పరిగణించకూడదు. ఉదాహరణకు, వినోదానికి ఎక్కువ సమయం వెచ్చించే సమస్యవున్న కొయిచీ విషయమే తీసుకోండి. కొయిచీ టీనేజరుగా ఉన్నప్పుడే బైబిలు అధ్యయనం చేశాడు, కానీ చాలా సంవత్సరాల వరకు వీడియో గేములు ఆయన జీవితంలో ప్రధానాంశంగా ఉన్నాయి. ఒకరోజు కొయిచీ తననుతానిలా ప్రశ్నించుకున్నాడు: ‘నేనేం చేస్తున్నాను? నాకిప్పుడు 30 సంవత్సరాలు దాటాయి, నా జీవితంలో సంకల్పవంతమైనదేదీ నేను చేయడం లేదు!’ కొయిచీ తన బైబిలు అధ్యయనాన్ని పునఃప్రారంభించి సంఘ సహాయాన్ని అంగీకరించాడు. మార్పు నెమ్మదిగానే వచ్చినా, ఆయన తన ప్రయత్నం మానుకోలేదు. ప్రార్థన, ఇతరుల ప్రేమపూర్వక ప్రోత్సాహంతో ఆయన తన అలవాటును మానుకున్నాడు. (లూకా 11:9) కొయిచీ ఇప్పుడు సంతోషంగా పరిచర్య సేవకునిగా సేవచేస్తున్నాడు.

సమతుల్యంగా ఉండడాన్ని నేర్చుకోండి

7. దేవుని సేవ చేయడంలో మనమెందుకు సమతుల్యంగా ఉండాలి?

7 దేవుని సంకల్పానికి అనుగుణంగా జీవించడం మన పూర్ణాత్మ ప్రయత్నానికి యోగ్యమైనది. అలా చేయడంలో మనమెన్నటికీ వెనుకంజ వేయకూడదు లేదా సోమరిగా ఉండకూడదు. (హెబ్రీయులు 6:11-12) అలాగని, మనం శారీరకంగా, మానసికంగా లేదా భావోద్రేకంగా పూర్తిగా అలసిపోవాలని యెహోవా కోరడం లేదు. మన సొంత శక్తితో దేవుని పనిని నెరవేర్చలేమని వినయంతో గుర్తించడం ఆయనను మహిమపర్చడమే కాక, మనం సమతుల్యంగా ఉన్నామని కూడా చూపిస్తుంది. (1 పేతురు 4:11) తన చిత్తం చేసేందుకు అవసరమైన శక్తిని ఇస్తానని యెహోవా వాగ్దానం చేస్తున్నాడు, అయితే ఆయన మననుండి ఆశించని వాటిని చేసేందుకు ప్రయత్నిస్తూ మన పరిమితుల్ని మించి చేసేందుకు మనల్నిమనం బలవంతపెట్టుకోకూడదు. (2 కొరింథీయులు 4:7) పూర్తిగా అలసిపోకుండా దేవుని సేవలో కొనసాగడానికి మన శక్తిని జ్ఞానయుక్తంగా ఉపయోగించుకోవాలి.

8. ఓ క్రైస్తవ యువతి ఇటు యెహోవాకు అటు ఉద్యోగానికి తన శక్తినంతా వెచ్చించేందుకు ప్రయత్నించినప్పుడు ఏమి జరిగింది, ఆమె ఎలాంటి సర్దుబాటు చేసుకుంది?

8 ఉదాహరణకు, తూర్పు ఆసియాలో నివసిస్తున్న జీహె పయినీరు సేవచేస్తూనే రెండు సంవత్సరాలపాటు ఎంతో ఒత్తిడిగల ఉద్యోగం చేసింది. ఆమె ఇలా చెబుతోంది: “నేను ఇటు యెహోవాకు అటు ఉద్యోగానికి నా యావచ్ఛక్తిని వెచ్చించేందుకు ప్రయత్నించాను, అందుకని నేను రాత్రిళ్లు ఐదు గంటలు మాత్రమే నిద్రపోయేదాన్ని. చివరకు సత్యం కోసం నాలో ఇక మానసిక శక్తి లేకుండాపోయింది, ఆధ్యాత్మిక విషయాలను నేనెక్కువగా ఆనందించలేకపోయాను.” యెహోవాను తన ‘పూర్ణహృదయంతో, ఆత్మతో, మనసుతో, బలంతో’ సేవించడానికి జీహె అంత ఒత్తిడిలేని ఉద్యోగం కోసం వెదికింది. (మార్కు 12:30) “ఎక్కువ డబ్బు సంపాదించాలని నా కుటుంబం ఒత్తిడిచేసినా, దేవుని సంకల్పానికే ప్రథమ స్థానమిచ్చేందుకు నేను కృషిచేశాను. అయినా నేను యోగ్యమైన దుస్తులవంటి కనీస అవసరాలకు సరిపడా డబ్బు సంపాదించుకుంటున్నాను. మంచిగా నిద్రపోవడంవల్ల ఉత్సాహంగా ఉండగలుగుతున్నాను! నేను నా పరిచర్యలో ఆనందాన్ని పొందుతున్నాను, నేనిప్పుడు ఆధ్యాత్మికంగా బలంగా ఉన్నాను. ఎందుకంటే నేను లోక సంబంధ ఆకర్షణలకు, అవరోధాలకు గురికావడం లేదు” అని ఆమె చెబుతోంది.—ప్రసంగి 4:6; మత్తయి 6:24, 28-30.

9. మన ప్రయత్నాలు క్షేత్రంలోని ప్రజలపై ఎలా ప్రభావం చూపించవచ్చు?

9 ప్రతీ ఒక్కరూ పూర్తికాల సువార్తికులుగా దేవుని సేవచేయలేరు. మీరొకవేళ వృద్ధాప్యంతో, అనారోగ్యంతో లేదా ఇతర పరిమితులతో పోరాడుతుంటే, మీ విశ్వాస్యతను, మీరు పూర్ణహృదయంతో చేయగల సేవను యెహోవా సంతోషంగా గుర్తుంచుకుంటాడని తెలుసుకోండి. (లూకా 21:2, 3) ఆ విషయానికొస్తే, మన ప్రయత్నాలు పరిమితంగా ఉన్నప్పటికీ అవి ఇతరులపై చూపించగల ప్రభావాన్ని మనలో ఎవరమూ తక్కువ అంచనా వేయకూడదు. ఉదాహరణకు, మనం కొన్ని గృహాలు సందర్శించినా మన సందేశంపట్ల ఎవరూ ఆసక్తి కనబర్చనట్లు అనిపించిందనుకుందాం. ఎవరూ మన కోసం తలుపు తెరవకపోయినా, మనం వెళ్లిన తర్వాత గృహస్థులు మన సందర్శనం గురించి చాలా గంటలు లేదా రోజులు మాట్లాడుకోవచ్చు! సువార్త వినే ప్రతీ ఒక్కరూ సానుకూలంగా ప్రతిస్పందిస్తారని మనమాశించము, కానీ కొందరు ప్రతిస్పందిస్తారు. (మత్తయి 13:19-23) ఇతరులు, ప్రపంచంలో లేదా తమ జీవితంలో పరిస్థితులు మారినప్పుడు ప్రతిస్పందించవచ్చు. ఏదేమైనా, పరిచర్యలో మనం చేయగలిగింది చేయడం ద్వారా దేవుని సేవ చేస్తున్నాం. మనం “దేవుని జతపనివారమైయున్నాము.”—1 కొరింథీయులు 3:9.

10. సంఘంలోని వారందరికీ ఎలాంటి అవకాశాలు ఉన్నాయి?

10 అంతేకాక, మనమందరం మన కుటుంబ సభ్యులకు, మన ఆధ్యాత్మిక సహోదర సహోదరీలకు సహాయం చేయవచ్చు. (గలతీయులు 6:10) మనం ఇతరులపై చూపించే మంచి ప్రభావం ప్రగాఢంగా ఉంటుంది, ఎక్కువకాలం నిలిచివుంటుంది. (ప్రసంగి 11:1, 6) పెద్దలు, పరిచర్య సేవకులు తమ విధుల్ని శ్రద్ధగా నిర్వహించినప్పుడు, సంఘ ఆధ్యాత్మిక ఆరోగ్యానికి, స్థిరత్వానికి దోహదపడతారు, క్రైస్తవ కార్యకలాపాలు వృద్ధిచెందుతాయి. మనం ‘ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులుగా’ ఉన్నప్పుడు, మన ప్రయాసము “వ్యర్థముకాదు.”—1 కొరింథీయులు 15:58.

దేవుని సంకల్పానికి అనుగుణంగా జీవించడాన్ని ధ్యేయంగా చేసుకోవడం

11. స్థానిక సంఘంలో సేవచేయడానికి తోడుగా మనకు ఇంకా ఎలాంటి అవకాశాలు లభించవచ్చు?

11 క్రైస్తవులుగా మనం జీవాన్ని ప్రేమిస్తూ, మనం చేసే ప్రతీపనిలో దేవుణ్ణి మహిమపర్చాలని కోరుకుంటాం. (1 కొరింథీయులు 10:31) మనం నమ్మకంగా రాజ్య సువార్తను ప్రకటిస్తూ, యేసు ఆజ్ఞాపించిన వాటన్నింటినీ గైకొనేందుకు ఇతరులకు బోధించినప్పుడు, మనకెన్నో ప్రతిఫలదాయకమైన సేవావకాశాలు లభిస్తాయి. (మత్తయి 24:14; 28:19, 20) స్థానిక సంఘంతో కలిసి పనిచేయడంతోపాటు, అవసరం ఎక్కువగావున్న ప్రాంతంలో బహుశా వేరే క్షేత్రంలో, భాషా ప్రాంతంలో, లేదా దేశంలో సేవచేసే అవకాశాలు ఉండవచ్చు. వివాహం కాని అర్హులైన పెద్దలు, పరిచర్య సేవకులు పరిచర్య శిక్షణా పాఠశాలకు హాజరయ్యేందుకు, పట్టభద్రులైన తర్వాత తమ దేశంలో లేదా విదేశాల్లో పరిణతిగల క్రైస్తవుల సహాయం అవసరమైన సంఘాల్లో సేవచేసేందుకు ఆహ్వానించబడవచ్చు. పూర్తికాల పరిచర్యలోవున్న దంపతులు గిలియడ్‌ శిక్షణ పొంది, విదేశీ నియామకంలో సేవచేసేందుకు అర్హులు కావచ్చు. బెతెల్‌లో సేవచేసేందుకు, రాజ్యమందిరాలను, బ్రాంచి కార్యాలయాలను నిర్మించి, వాటి బాగోగులు చూసుకోవడంలో, వివిధ రకాల పనులు చేసేందుకు స్వచ్ఛంద సేవకుల అవసరం ఎల్లప్పుడూ ఉంటుంది.

12, 13. (ఎ) ఏ సేవారంగాలను అన్వేషించాలో మీరెలా నిర్ణయించుకోవచ్చు? (బి) ఒక నియామకంలో గడించిన అనుభవం ఇతర నియామకాల్లో ఎలా ఉపయోగపడగలదో ఉదాహరించండి.

12 ఎలాంటి సేవారంగాలను మీరు అన్వేషించాలి? యెహోవా సమర్పిత సేవకునిగా నిర్దేశం కోసం ఎల్లప్పుడూ ఆయనవైపు, ఆయన సంస్థవైపు చూడండి. సరైన నిర్ణయం తీసుకునేందుకు ఆయన ‘ఉపకారాత్మ’ మీకు సహాయం చేస్తుంది. (నెహెమ్యా 9:20) ఒక నియామకం తరచూ మరో నియామకానికి నడిపిస్తుంది, ఒక సేవారంగంలో గడించిన అనుభవం, నైపుణ్యం ఆ తర్వాత మరో నియామకంలో ఉపయోగపడవచ్చు.

13 ఉదాహరణకు, డెనీస్‌ ఆయన భార్య జెన్నీ క్రమంగా రాజ్యమందిర నిర్మాణ ప్రణాళికల్లో పనిచేస్తారు. కత్రీనా తుఫాను అమెరికా దక్షిణ రాష్ట్రాలను కకావికలం చేసిన తర్వాత, వారు సహాయ కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పనిచేశారు. డెనీస్‌ ఇలా నివేదిస్తున్నాడు: “రాజ్యమందిర నిర్మాణ పనుల్లో మేము వృద్ధిచేసుకున్న నైపుణ్యాలను సహోదరులకు సహాయం చేసేందుకు ఉపయోగించడం మాకెంతో సంతోషం కలిగించింది. మేము సహాయం చేసినవారు వ్యక్తపర్చిన కృతజ్ఞత మమ్మల్ని నిజంగా ఉత్తేజపర్చింది. పునర్నిర్మాణ పనుల్లో అనేక ఇతర సహాయ గుంపులవారు కొంతవరకే సఫలులయ్యారు. యెహోవాసాక్షులు అప్పటికే 5,300 కన్నా ఎక్కువ ఇళ్లను, అనేక రాజ్యమందిరాలను బాగుచేశారు లేదా పునర్నిర్మించారు. ప్రజలు దీనిని గమనించి, మన సందేశంపట్ల ఇప్పుడు మరింత ఆసక్తిని కనబరుస్తున్నారు.”

14. పూర్తికాల పరిచర్యను అన్వేషించాలని మీరు కోరుకుంటే మీరేమి చేయవచ్చు?

14 పూర్తికాల పరిచర్యను జీవిత ధ్యేయంగా చేసుకోవడం ద్వారా మీరు దేవుని సంకల్పానికి అనుగుణంగా జీవించగలరా? అలా చేసినప్పుడు మీరనేక ఆశీర్వాదాలు తప్పక పొందుతారు. మీ ప్రస్తుత పరిస్థితులు అలా చేసేందుకు అనుమతించకపోతే, బహుశా ఏదైనా మార్పుచేసుకునే అవకాశం ఉండవచ్చు. ఓ ప్రాముఖ్యమైన నియామకాన్ని చేపట్టాలని కోరుకున్నప్పుడు, ‘యెహోవా చెవియొగ్గి నీ దాసుని ఆలోచన సఫలపరచుము’ అని నెహెమ్యా ప్రార్థించినట్లే మీరూ ప్రార్థించండి. (నెహెమ్యా 1:11) ఆ తర్వాత, “ప్రార్థన ఆలకించువా[నిపై]” నమ్మకముంచి మీ ప్రార్థనకు అనుగుణంగా పనిచేయండి. (కీర్తన 65:2) యెహోవా సేవ మరింతగా చేసేందుకు మీరు చేస్తున్న ప్రయత్నాలను ఆయన ఆశీర్వదించాలంటే, మొదట మీరుచేసే ప్రయత్నాలు మీరు చేయాలి. పూర్తికాల పరిచర్య చేపట్టాలని మీరు నిర్ణయించుకున్నప్పుడు, మీ నిర్ణయానికి కట్టుబడి ఉండండి. కాలం గడిచేకొద్దీ మీ అనుభవం పెరుగుతుంది, మీ ఆనందం రెట్టింపు అవుతుంది.

నిజంగా అర్థవంతమైన జీవితం

15. (ఎ) దేవుని దీర్ఘకాల సేవకులతో మాట్లాడడంవల్ల, వారి గురించి చదవడంవల్ల మనమెలా ప్రయోజనం పొందుతాం? (బి) మీకు ప్రత్యేకంగా ప్రోత్సాహకరంగా అనిపించిన ఓ జీవిత కథను ఉదాహరించండి.

15 దేవుని సంకల్పానికి అనుగుణంగా జీవించడంవల్ల మీరు ఏ ఫలితాలు ఆశించవచ్చు? యెహోవా దీర్ఘకాల సేవకులతో ప్రత్యేకంగా పూర్తికాల పరిచర్యలో అనేక సంవత్సరాలు గడిపినవారితో మాట్లాడండి. వారెంత ప్రతిఫలదాయకమైన సంకల్పభరిత జీవితాలు జీవించారో కదా! (సామెతలు 10:22) కష్టభరిత సమయాల్లో కూడా వారికి నిజంగా అవసరమైనది సమృద్ధిగా లభించేలా సహాయం చేయడంలో యెహోవా ఎన్నడూ విఫలం కాలేదని వారు మీకు చెబుతారు. (ఫిలిప్పీయులు 4:11-13) నమ్మకస్థుల జీవిత కథల పరంపరను, కావలికోట (ఆంగ్లం) 1955 నుండి 1961 వరకు “నా జీవిత సంకల్పానికి అనుగుణంగా జీవించడం” అనే శీర్షిక క్రింద ప్రచురించింది. అప్పటినుండి, వందలాది ఇతర జీవిత కథలు ప్రచురించబడ్డాయి. ప్రతీ జీవిత కథ, మనకు అపొస్తలుల కార్యముల పుస్తకంలో కనిపించే ఉత్సాహస్ఫూర్తిని, ఆనందాన్ని గుర్తుచేస్తుంది. అలాంటి ఉత్తేజకరమైన జీవిత కథలు చదవడం, ‘నేను కూడా అలాంటి జీవితమే జీవించాలి!’ అని చెప్పేందుకు మిమ్మల్ని పురికొల్పుతుంది.

16. క్రైస్తవుని జీవితాన్ని ఏది సంకల్పవంతంగా, ఆనందదాయకంగా చేస్తుంది?

16 ముందు పేర్కొనబడిన ఏరన్‌ ఇలా గుర్తు చేసుకుంటున్నాడు: “ఆఫ్రికాలో నేను, జీవిత సంకల్పమేమిటో తెలుసుకునేందుకు దేశమంతా తిరుగుతున్న యౌవనులను తరచూ కలిశాను. వారిలో చాలామందికి ఆ సంకల్పమేమిటో తెలియలేదు. కానీ మేము రాజ్యసువార్తను ప్రకటిస్తూ దేవుని సంకల్పానికి అనుగుణంగా జీవిస్తూ, సవాళ్లెదురైనా, అర్థవంతమైన జీవితాన్ని ఆనందించాం. పుచ్చుకోవడంలో కాదుగానీ ఇవ్వడంలోనే ఎక్కువ ఆనందముందని మేము అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం.”—అపొస్తలుల కార్యములు 20:35.

17. మనమిప్పుడు దేవుని సంకల్పానికి అనుగుణంగా ఎందుకు జీవించాలి?

17 మీ విషయమేమిటి? మీరు ఏ సంకల్పానికి అనుగుణంగా జీవిస్తున్నారు? దేవుని సంకల్పానికి అనుగుణంగా జీవించేందుకు సహాయపడే ప్రత్యేక లక్ష్యాలు మీకు లేకపోతే ఇతర విషయాలు సత్వరమే మీ శక్తిని, సమయాన్ని హరించివేస్తాయి. సాతాను విధానానికి సంబంధించిన బూటకపు లోకంలో మీ విలువైన జీవితాన్ని వ్యర్థం చేసుకోవడం ఎందుకు? సమీప భవిష్యత్తులో ‘మహాశ్రమలు’ విరుచుకుపడినప్పుడు, వస్తుసంపదలు, ప్రాపంచిక హోదాలు ఎందుకూ పనికిరావు. యెహోవాతో మనకున్న సంబంధమే అత్యంత ప్రాముఖ్యమైనది. దేవునికి, ఇతరులకు సేవ చేయడమే కాక, మనం సంపూర్ణంగా దేవుని సంకల్పానికి అనుగుణంగా జీవించినందుకు మనమెంత కృతజ్ఞులమై ఉంటామో కదా!—మత్తయి 24:21; ప్రకటన 7:14, 15.

[అధస్సూచీలు]

a యెహోవాసాక్షులు ప్రచురించినది.

b కొన్నిపేర్లు మార్చబడ్డాయి.

మీరు వివరించగలరా?

• యెహోవా మనం తనకు చేసే సేవను ఎలా దృష్టిస్తాడు?

• దేవునికి, ఇతరులకు సేవ చేసేందుకు ఆచరణాత్మకత, సమతుల్యత మనకెలా సహాయం చేస్తాయి?

• మనకెలాంటి సేవావకాశాలు అందుబాటులో ఉన్నాయి?

• మనమిప్పుడు నిజంగా సంకల్పవంతమైన జీవితాన్ని ఎలా జీవించవచ్చు?

[23వ పేజీలోని చిత్రాలు]

పూర్ణాత్మతో యెహోవాను సేవిస్తూ ఉండేందుకు మనకు సమతుల్యం అవసరం

[24వ పేజీలోని చిత్రాలు]

అనేకవిధాలుగా పవిత్రసేవ చేయవచ్చు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి