ఇబ్లా మరుగునపడిన ఒక ప్రాచీన నగరం వెలుగులోకి వచ్చింది
1962 వేసవిలో, పౌలో మత్తియ అనే యువ ఇటాలియన్ పురావస్తుశాస్త్రజ్ఞుడు, వాయవ్య సిరియాలోని మైదానాలను అనిశ్చయతతో సర్వే చేశాడు. అప్పటివరకు, సిరియాలోని మారుమూల ప్రాంతాల్లో పురావస్తుశాస్త్రానికి సంబంధించిన స్థలాలు అంతగా లేవని అనుకునేవారు. అయితే, అలెప్పో నగరానికి దక్షిణాన దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న టెల్మర్దేక్లో రెండు సంవత్సరాల తర్వాత తిరిగి ప్రారంభమైన త్రవ్వకాలు, ‘ఈ 20వ శతాబ్దపు అతి ప్రాముఖ్యమైన పురావస్తు పరిశోధన’గా చాలామంది పరిగణించే దానిని వెలుగులోకి తీసుకువచ్చాయి.
ప్రాచీన స్మారక చిహ్నాలు ఇబ్లా అనే నగరం ఉనికిలో ఉండేదని ధృవీకరిస్తున్నాయి. అయితే, మధ్య ప్రాచ్యంలో విస్తరించివున్న అనేక మట్టిదిబ్బల్లో ఆ నగరాన్ని ఎక్కడ కనుగొనవచ్చో ఎవరికీ తెలియదు. అక్కదు రాజైన సర్గోన్, “మారి, యార్మూటీ, ఇబ్లా” నగరాలమీద విజయం సాధించాడని ఒక మూలపాఠం పేర్కొంది. మరో స్మారకచిహ్నంలో, గూడేయ అనే సుమేరియన్ రాజు, “ఈబ్లా [ఇబ్లా] పర్వతాల” నుండి తనకు లభించిన అమూల్యమైన కలప గురించి పేర్కొన్నాడు. ఇబ్లా పేరు ఈజిప్టులోని కార్నాక్ పట్టణంలో కూడా కనిపించింది, ఫరో టుట్మోస్ III జయించిన ప్రాచీన నగరాల పట్టికలో ఇబ్లా పేరు కూడా ప్రస్తావించబడింది. పురావస్తుశాస్త్రజ్ఞులు ఇబ్లా నగరాన్ని కనుగొనేందుకు ఎందుకు ప్రయత్నించారో మీరు దీనినిబట్టి అర్థంచేసుకోవచ్చు.
అయితే, మరిన్ని త్రవ్వకాలవల్ల ఫలితం లభించింది. ఇబ్లా రాజైన ఐబిట్-లిమ్ విగ్రహంలోని కొంతభాగం 1968లో దొరికింది. అక్కేడియన్ భాషలో చెక్కబడిన ప్రమాణం ఆ విగ్రహంమీద ఉంది, ఆ విగ్రహం “ఇబ్లాలో విలసిల్లిన” ఇష్తార్ దేవతకు అంకితం చేయబడినట్లు అది వెల్లడిచేస్తోంది. అవును, పురావస్తు పరిశోధనలు “ఒక క్రొత్త భాషను, ఒక క్రొత్త చరిత్రను, ఒక క్రొత్త సంస్కృతిని” వెలుగులోకి తీసుకురావడం మొదలుపెట్టాయి.
ఆ ప్రాచీన నగరాన్ని పదేపదే ప్రస్తావించిన కీలాకారపు పలకలు లభించడంతో టెల్మర్దేక్, ప్రాచీన ఇబ్లా మధ్య దగ్గరి సంబంధం ఉన్నట్లు రుజువైంది. శిథిలాలు ఉన్న స్థలంలో ఆ నగరం కనీసం రెండుసార్లైనా ఉనికిలో ఉందని కూడా త్రవ్వకాల్లో వెల్లడైంది. అది ప్రారంభంలో కొంతకాలం తన ప్రాబల్యాన్ని చూపించిన తర్వాత నాశనం చేయబడింది. ఆ తర్వాత ఇబ్లా నగర పునర్నిర్మాణం జరిగింది గానీ అది మళ్లీ నాశనం చేయబడి అనేక శతాబ్దాలు మరుగునపడింది.
ఒక నగరం, అనేక చరిత్రలు
భూమిని అనేకసార్లు సాగుచేసేందుకు వీలయ్యే టైగ్రీస్, యూఫ్రటీసు వంటి నదుల మధ్య ఉండే వండ్రుమట్టి ఉన్న మైదానాల్లో అతి ప్రాచీన నగరాలు నిర్మించబడ్డాయి. బైబిల్లో మొదటిగా ప్రస్తావించబడిన నగరాలు మెసొపొతమియా ప్రాంతంలోనే ఉన్నాయి. (ఆదికాండము 10:10) ఇబ్లా అనే పేరుకు “తెల్లని రాయి” అనే అర్థం ఉండవచ్చు, ఆ నగరానికి ఉన్న సున్నపురాయి పునాదిని అది సూచిస్తుండవచ్చు. ప్రధాన నదులకు దూరంగా ఉన్న ప్రాంతంలో నీటివనరులు ప్రాముఖ్యం, సున్నపురాయి పొర ఉంటే సహజ నీటి వనరులు ఉంటాయి కాబట్టి నగర నిర్మాణానికి ఆ స్థలాన్ని ఎన్నుకొనివుండవచ్చు.
ఇబ్లా ప్రాంతంలో వర్షపాతం తక్కువ కాబట్టి, తృణధాన్యాలు, ద్రాక్షతోటలు, ఒలీవ చెట్లు మాత్రమే ఎక్కువగా సాగుచేయబడేవి. ఈ ప్రాంతం పాడిపశువుల పెంపకానికి, ప్రత్యేకంగా గొర్రెల పెంపకానికి కూడా అనువుగా ఉండేది. ఇబ్లా మెసొపొతమియా మైదానానికీ, మధ్యధరా తీరానికీ మధ్య వాణిజ్యపరంగా కీలకమైన ప్రదేశంలో ఉంది కాబట్టి కలప, మామూలు రత్నాల, లోహాల వ్యాపారాలకు కూడా అనుకూలంగా ఉండేది. దాదాపు 2,00,000 మంది పౌరులుగల ప్రాంతంమీద ఈ పట్టణం ఆధిపత్యం చెలాయించేది, వారిలో దాదాపు 10 శాతంమంది రాజధానిలోనే నివసించేవారు.
ఒక పెద్ద రాజభవన శిథిలాలు ఆ కాలపు ఇబ్లా నాగరికత వైభవానికి తార్కాణంగా ఉన్నాయి. దాదాపు 12 నుండి 15 మీటర్ల ఎత్తు ఉన్న ద్వారం గుండా రాజభవనంలోకి ప్రవేశించవచ్చు. అంతకంతకూ బలోపేతమౌతున్న వ్యవహార నిర్వహణలకు సంబంధించి పెరుగుతున్న అవసరాలను తీర్చడానికి కాలం గడిచేకొద్దీ ఆ రాజభవనం విశాలపర్చబడింది. అధికారులు సంక్లిష్టమైన అధికార వ్యవస్థ క్రింద పనిచేసేవారు, ప్రభుత్వాన్ని నడిపించడంలో రాజుకు, రాణికి “ప్రభువులు,” “గవర్నర్లు” చేయూతనిచ్చేవారు.
దాదాపు 17,000 కన్నా ఎక్కువ మట్టిపలకలు, అవశేషాలు లభించాయి. ప్రారంభంలో ఆ దస్తావేజులు చెక్క అరల్లో జాగ్రత్తగా పేర్చబడిన 4,000 కన్నా ఎక్కువగా ఉన్న పలకల రూపంలో ఉండవచ్చు. ఆ దస్తావేజులు ఇబ్లాలో వ్యాపారం ఎంత ఎక్కువగా జరిగేదో రుజువుచేస్తాయి. ఉదాహరణకు, ఇద్దరు ఫరోల రాచరిక చిహ్నాలనుబట్టి ఈ నగరం ఈజిప్టుతో వ్యాపారం చేసేదని అర్థమౌతుంది. ఆ పలకలు సుమేరియన్ కీలాకారపు లిపిలో ఎక్కువగా రాయబడ్డాయి. అయితే కొన్ని దస్తావేజులు ఇబ్లైట్ అనే అతి ప్రాచీన సెమిటిక్ భాషలో రాయబడ్డాయి, ఈ దస్తావేజుల మూలంగా ఆ భాషను అర్థం చేసుకోవడం సాధ్యమైంది. ప్రాచ్యదేశపువారు అంతటి ప్రాచీన సెమిటిక్ భాషను చూసి ఆశ్చర్యపోయారు. కొన్ని పలకల్లో ద్విభాషా సుమేరిన్-ఇబ్లైట్ పట్టికలు ఉండడం మీకు ఆసక్తికరంగా అనిపించవచ్చు. ఇబ్లా—ఆలి ఒరీజీనీ డెలా చీవీల్టా అర్బానా (ఇబ్లా—నగర నాగరికత ప్రారంభంలో) అనే పుస్తకం ఆ పలకలను “మనకు తెలిసిన అతి ప్రాచీన నిఘంటువులు” అని పేర్కొంటోంది.
వెలికితీయబడిన చెక్కబడిన చిత్రాలు ఇబ్లైట్ యోధులు తమ శత్రువులకు మరణశిక్ష విధిస్తున్నట్లు లేక నరకబడిన తలను అందిస్తున్నట్లు చిత్రీకరిస్తున్నాయి కాబట్టి, ఇబ్లా ఒక సైనిక శక్తి అని స్పష్టమౌతుంది. ఇబ్లా చరిత్ర బలోపేతమవుతున్న అష్షూరు, బబులోను శక్తులతో ఢీకొన్నప్పుడు దాని వైభవం ముగిసింది. ఆ సంఘటనలు ఖచ్చితంగా ఎలా ప్రారంభమయ్యాయో తెలుసుకోవడం సులభంకాదు, అయితే మొదటిగా సర్గోన్ I (యెషయా 20:1లో పేర్కొనబడిన సర్గోను కాదు), ఆ తర్వాత అతని మనుమడు నరమ్-సిన్ ఇబ్లామీద దాడిచేశారు. పోరాటాలు క్రూరంగా ఉండేవని, దాడులు భయానకంగా ఉండేవని పురావస్తు రుజువులు చూపిస్తున్నాయి.
అయితే, ముందు పేర్కొనబడినట్లు, కొంతకాలం తర్వాత ఆ నగరం పునర్నిర్మించబడి, ఆ ప్రాంతంలో ప్రాముఖ్యతను కూడా సంతరించుకుంది. క్రొత్త నగరం దాని పాత వైభవాన్ని మించిపోయేలా ఖచ్చితమైన పథకానికి అనుగుణంగా నిర్మించబడింది. దిగువనున్న నగరంలో, బబులోనీయులు కూడా ఫలప్రద దేవతగా పరిగణించే ఇష్తార్ దేవతకు ఒక పవిత్ర స్థలం అంకితం చేయబడింది. బబులోను శిథిలాల్లో నుండి వెలికితీయబడిన ప్రఖ్యాత ఇష్తార్ ద్వారం గురించి మీరు వినుండొచ్చు. ఇబ్లాలోని అసాధారణమైన ఒక భవంతి, ఇష్తార్ దేవతకు పవిత్రమైనవిగా పరిగణించబడే సింహాలు ఉంచబడే చోటుగా ఉపయోగించబడినట్లు అనిపిస్తోంది. ఇది చర్చను ఇబ్లా మతంవైపుకు మళ్లిస్తుంది.
ఇబ్లాలోని మతం
ఇతర ప్రాచీన తూర్పుదేశాల్లో ఆరాధించబడినట్లే ఇబ్లాలో కూడా ఎంతోమంది దేవుళ్లు ఆరాధించబడేవారు. వారిలో బయలు, హాదాద్ (కొంతమంది సిరియా రాజుల పేర్లతోపాటు కనిపించే పేరు) దాగోను వంటి దేవుళ్లు ఉన్నారు. (1 రాజులు 11:23; 15:18; 2 రాజులు 17:16) ఇబ్లావాసులు ఆ దేవుళ్లందరికీ భయపడేవారు. వారు ఇతర ప్రజల దేవుళ్లను కూడా గౌరవించేవారు. ప్రత్యేకంగా సా.శ.పూ. రెండవ సహస్రాబ్దిలో దేవుళ్లుగా పరిగణించబడిన రాజవంశానికి చెందిన పూర్వీకులను కూడా వారు ఆరాధించేవారని పురావస్తు పరిశోధనలు వెల్లడిచేస్తున్నాయి.
ఇబ్లావాసులు తమ దేవుళ్లను పూర్తిగా నమ్మేవారుకాదు. నూతన ఇబ్లా నగరం చుట్టూ ఎలాంటి శత్రువులనైనా ముగ్ధుల్ని చేసే వైభవంగా కనిపించే రెండు వరుసల గోడలు కూడా ఉన్నాయి. వెలుపలి వరుసలో ఉన్న గోడల చుట్టుకొలత దాదాపు మూడు కిలోమీటర్లు ఉంటుంది. వాటిని ఇప్పటికీ స్పష్టంగా చూడవచ్చు.
అయితే పునర్నిర్మిత ఇబ్లా పట్టణం కూడా నాశనమైంది. బహుశా సా.శ.పూ. 1600లో ఒకప్పుడు గొప్ప శక్తిగా ఉన్న ఈ నగరం హిత్తీయుల చేతుల్లో ఆఖరిసారిగా ఓడిపోయింది. ఒక ప్రాచీన కావ్యం ప్రకారం, ఇబ్లా “పింగాణి పాత్రలా తునాతునకలైంది.” అది చరిత్ర పుటల్లో నుండి కనుమరుగవడం మొదలైంది. 1098లో యెరూషలేముపై దండయాత్రకు వెళ్ళిన క్రూసేడర్లు రాసిన దస్తావేజు, ఒకప్పుడు ఇబ్లా ఉన్న స్థలం గురించి ప్రస్తావిస్తోంది, ఆ దస్తావేజు దానిని మర్దేక్ అనే పేరుతో, దేశపు శివార్లలోవున్న స్థావరంగా పేర్కొంది. ఇబ్లాను దాదాపు అందరూ మరచిపోయారు, అనేక శతాబ్దాలు గడిచిన తర్వాతే అది తిరిగి వెలుగులోకి వచ్చింది.
[14వ పేజీలోని బాక్సు]
ఇబ్లా మరియు బైబిలు
బిబ్లికల్ ఆర్కియోలజిస్ట్ అనే పత్రికలో 1976లో ప్రచురించబడిన ఒక ఆర్టికల్ బైబిలు విద్వాంసుల ఆసక్తిని రేకెత్తించింది. ఇబ్లా పలకల్లోని నిగూఢ అర్థాన్ని వివరించిన వ్యక్తి, ఆ పలకల్లో ఇతర అంశాలతో పాటు శతాబ్దాల తర్వాత బైబిల్లో పేర్కొనబడిన ప్రజల, స్థలాల పేర్లు కూడా పేర్కొనబడి ఉండవచ్చనే అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. ప్రచురించబడిన దానికన్నా బహుశా ఎక్కువ ఊహించిన కొందరు విద్వాంసులు, ఆదికాండము వృత్తాంతం నమ్మదగినదని చూపించే పురావస్తు రుజువు ఇబ్లాలో దొరికిందని రాయడం మొదలుపెట్టారు.a జెసూట్ సభ్యుడైన మిట్చెల్ దేహుద్, “[ఇబ్లాకు చెందిన] రాతి పలకలు బైబిల్లోని అస్పష్టంగా ఉన్న అంశాలమీద వెలుగు ప్రసరిస్తున్నాయి” అని వాదించాడు. ఉదాహరణకు, “ఇశ్రాయేలీయుల దేవుని పేరు ఎంతకాలంగా వాడుకలో ఉందనే సమస్యను” పరిష్కరించేందుకు అవి సహాయం చేయగలవని ఆయన నమ్మాడు.
ఇప్పుడు ఆ మూలపాఠాలు ఎంతో నిష్పక్షపాతంగా పరిశీలించబడుతున్నాయి. హీబ్రూ, ఇబ్లైట్ భాషలు రెండూ సెమిటిక్ భాషలు కాబట్టి, ఆ పలకల్లో పేర్కొనబడిన కొన్ని నగరాల లేక వ్యక్తుల పేర్లకూ బైబిల్లో పేర్కొనబడినవాటికీ మధ్య పోలిక ఉండవచ్చు. అంతమాత్రాన, అవి ఒకే స్థలాన్ని లేక వ్యక్తులను సూచిస్తాయని రుజువు చేయవు. ఇబ్లాలో జరిగిన అన్వేషణలు బైబిలు సంబంధ అధ్యయనాలను ఎంతమేరకు ప్రభావితం చేస్తాయో భవిష్యత్తే తేలుస్తుంది. దైవిక నామం విషయానికొస్తే, ఇబ్లా మూలపాఠాల్లో “యావే” అనే పేరు ప్రస్తావించబడినట్లు తానెన్నడూ చెప్పలేదని బిబ్లికల్ ఆర్కియోలజిస్ట్ రచయిత పేర్కొన్నాడు. కీలాకారపు పలక మీద ఉన్న ఒక చిహ్నం జా అని చెప్పబడుతోంది, అది ఇబ్లావాసులు ఆరాధించిన అనేక దేవుళ్లలో కేవలం ఒకరిని సూచిస్తుందని కొందరు విద్వాంసులు భావిస్తున్నారు, అదే సమయంలో అనేకమంది ఇతర నిపుణులు, అది కేవలం ఒక వ్యాకరణ చిహ్నమని భావిస్తున్నారు. ఏదేమైనా, అది ఏకైక సత్యదేవుడైన యెహోవాను సూచించడంలేదు.—ద్వితీయోపదేశకాండము 4:35; యెషయా 45:5.
[అధస్సూచి]
a బైబిలు వృత్తాంతాన్ని పురావస్తుశాస్త్రం ఎలా సమర్థిస్తుందనే అంశం గురించిన చర్చ కోసం యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిలు—దేవుని వాక్యమా లేక మానవునిదా? (ఆంగ్లం) అనే పుస్తకంలోని 4వ అధ్యాయాన్ని చూడండి.
[12వ పేజీలోని మ్యాపు/చిత్రం]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
మహా సముద్రం
కనాను
సిరియా
అలెప్పో
ఇబ్లా (టెల్మర్దేక్)
యూఫ్రటీసు నది
[చిత్రసౌజన్యం]
పురావస్తుశాస్త్రజ్ఞుడు: Missione Archeologica Italiana a Ebla - Università degli Studi di Roma ‘La Sapienza’
[12, 13వ పేజీలోని చిత్రం]
దాదాపు సా.శ.పూ. 1750కు చెందిన బంగారు కంఠహారం
[13వ పేజీలోని చిత్రం]
గొప్ప రాజభవన శిథిలాలు
[13వ పేజీలోని చిత్రం]
మట్టిపలకలు పురాతన పత్ర నిలయంలో భద్రపరచబడినట్లు చూపిస్తున్న, కళాకారుడు గీసిన చిత్రం
[13వ పేజీలోని చిత్రం]
కీలాకారపు పలక
[13వ పేజీలోని చిత్రం]
ఈజిప్టుకు చెందిన రాచరిక దుడ్డుకర్ర, సా.శ.పూ. 1750-1700
[13వ పేజీలోని చిత్రం]
శత్రువుల శిరస్సులతో ఉన్న ఇబ్లైట్ యోధుడు
[14వ పేజీలోని చిత్రం]
ఇష్తార్ దేవతకు అంకితం చేయబడిన రాతిపలక
[చిత్రసౌజన్యం]
Missione Archeologica Italiana a Ebla - Università degli Studi di Roma ‘La Sapienza’
[13వ పేజీలోని చిత్రసౌజన్యం]
చిత్రాలన్నీ (రాజభవన శిథిలాలు కాక): Missione Archeologica Italiana a Ebla - Università degli Studi di Roma ‘La Sapienza’