మీ జీవవరాన్ని అత్యంత విలువైనదిగా పరిగణించండి
“క్రీస్తుయొక్క రక్తము, నిర్జీవ క్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో యెక్కువగా శుద్ధిచేయును.”—హెబ్రీయులు 9:14.
1. ప్రాణానికి మనం చాలా విలువ ఇస్తామనేందుకు ఏ రుజువుంది?
మీప్రాణానికి వెలకట్టమని మిమ్మల్ని అడిగితే దానికి మీరెంత వెల కడతారు? మనం మన ప్రాణాన్ని, ఇతరుల ప్రాణాన్ని చాలా విలువైనదిగా పరిగణిస్తాం. దానికి రుజువుగా, మనం అస్వస్థతగా ఉన్నప్పుడు బాగుచేయించు కోవడానికి లేదా అప్పుడప్పుడూ ఆరోగ్య పరీక్షలకోసం డాక్టరు దగ్గరకు వెళతాం. మంచి ఆరోగ్యంతో సజీవంగా ఉండాలనే మనం కోరుకుంటాం. వృద్ధులు లేదా వికలాంగుల్లో సైతం ఎక్కువమంది చనిపోవాలని కాదుగానీ బ్రతికుండాలనే కోరుకుంటారు.
2, 3. (ఎ) సామెతలు 23:22 ఏ బాధ్యతను నొక్కిచెబుతోంది? (బి) సామెతలు 23:22లో పేర్కోబడిన బాధ్యతలో దేవుడెలా ఇమిడివున్నాడు?
2 ప్రాణానికి మీరిచ్చే విలువ ఇతరులతో మీకున్న సంబంధాలపై ప్రభావం చూపిస్తుంది. ఉదాహరణకు, దేవుని వాక్యమిలా నిర్దేశిస్తోంది: “నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము.” (సామెతలు 23:22) “అంగీకరించుము” అంటే దానర్థం కేవలం మాట వినడం మాత్రమే కాదు; విని దానికి లోబడడం అని ఈ సామెత భావం. (నిర్గమకాండము 15:26; ద్వితీయోపదేశకాండము 7:12; 13:18; 15:5; యెహోషువ 22:2; కీర్తన 81:13) మాట వినడానికి లేదా అంగీకరించడానికి ఏ కారణముందని దేవుని వాక్యం చెబుతోంది? మీ తల్లిదండ్రులు మీకంటే పెద్దవారనో లేదా మీకంటే వారికి ఎక్కువ అనుభవం ఉందనో కాదుగానీ, మిమ్మల్ని “కనిన” కారణాన్నిబట్టే మీరు వారి మాట వినాలని ఆ వచనం చెబుతోంది. కొన్ని భాషాంతరాలు ఈ వచనాన్ని “నీకు జన్మనిచ్చిన నీ తండ్రి మాట వినుము” అని అనువదిస్తున్నాయి. కాబట్టి, మీరు మీ జీవాన్ని విలువైనదిగా ఎంచినప్పుడు, ఆ జీవానికి ఊటగా ఉన్న వ్యక్తిపట్ల మీకు బాధ్యత ఉన్నట్లు మీరు భావిస్తారు.
3 మీరొక నిజ క్రైస్తవుడైతే, నిస్సందేహంగా యెహోవాయే మీ జీవానికి ఊట అని మీరు గుర్తిస్తారు. ఆయనవల్లే మీరు ‘బ్రదుకుచున్నారు;’ ‘చలిస్తూ’ అనుభూతిగల ప్రాణిగా ప్రవర్తించగలుగుతున్నారు; ఇప్పుడు మీరు ‘ఉనికిలోవుండి’ శాశ్వతకాల జీవితంతోసహా భవిష్యత్తు గురించి ఆలోచించవచ్చు, లేదా పథకం వేసుకోవచ్చు. (అపొస్తలుల కార్యములు 17:28; కీర్తన 36:9; ప్రసంగి 3:11) కాబట్టి, సామెతలు 23:22కు అనుగుణంగా, జీవానికి మరోవిధంగా వెలకట్టాలని కోరుకునే బదులు ఆ జీవం విషయంలో దేవుని దృక్కోణాన్ని అర్థంచేసుకొని తదనుగుణంగా ప్రవర్తించాలనే కోరికతో, ఆయన మాటను విధేయతా పూర్వకంగా ‘అంగీకరించడం’ న్యాయమే.
జీవంపట్ల గౌరవం చూపండి
4. మానవ చరిత్రారంభంలో, ప్రాణంపట్ల గౌరవమెలా ఒక ముఖ్యాంశమైంది?
4 మానవ చరిత్రారంభంలోనే, యెహోవా మానవులు తమ ప్రాణాన్ని ఇష్టమొచ్చినట్లు ఉపయోగించడానికి (లేదా దుర్వినియోగం చేయడానికి) తాను అనుమతించనని స్పష్టంచేశాడు. అసూయనిండిన క్రోధావేశంతో కయీను అమాయకుడైన తన తమ్ముడగు హేబెలు ప్రాణాలు తీశాడు. ప్రాణం విషయంలో అలాంటి నిర్ణయం తీసుకొనే హక్కు కయీనుకు ఉందని మీరనుకుంటారా? దేవుడలా అనుకోలేదు. “నీవు చేసినపని యేమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలోనుండి నాకు మొరపెట్టుచున్నది” అని అంటూ ఆయన కయీనును నిలదీశాడు. (ఆదికాండము 4:10) నేలపడిన హేబెలు రక్తం, క్రూరంగా అంతమొందించబడిన అతని ప్రాణానికి ప్రతీకగా ఉండి, ప్రతీకారం కోసం అది దేవునికి మొరపెట్టిందని గమనించండి.—హెబ్రీయులు 12:24.
5. (ఎ) నోవహు కాలంలో దేవుడెలాంటి హద్దు పెట్టాడు, అది ఎవరికి అన్వయించింది? (బి) ఏ భావంలో ఈ హద్దు ఒక ప్రాముఖ్యమైన చర్యగావుంది?
5 జలప్రళయం తర్వాత, కేవలం ఎనిమిది మందితో మానవాళి కొత్త మనుగడ ఆరంభించింది. మానవులందరికీ అన్వయించే ప్రకటనలో, జీవం మరియు రక్తం విషయంలో తన అభిప్రాయమేమిటో దేవుడు మరింతగా వెల్లడిచేశాడు. మానవులు జంతు మాంసాన్ని తినవచ్చని చెబుతూ, వారికి ఈ హద్దు పెట్టాడు: “ప్రాణముగల సమస్త చరములు మీకు ఆహారమగును; పచ్చని కూర మొక్కలనిచ్చినట్లు వాటిని మీకిచ్చియున్నాను. అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు; రక్తమే దాని ప్రాణము.” (ఆదికాండము 9:3, 4) కొందరు యూదులు, జంతువు ఇంకా ప్రాణంతోనే ఉన్నప్పుడు దాని మాంసం లేదా రక్తం తినకూడదన్నది దీని భావమని వివరించారు. అయితే దేవుడిక్కడ ప్రాణరక్షణ కోసం రక్తం తినడాన్ని నిషేధిస్తున్నాడని కాలమే స్పష్టంగా చూపిస్తుంది. అంతేకాకుండా, నోవహు ద్వారా దేవుడిచ్చిన ఆజ్ఞ, రక్తం కూడా ఒక భాగమైయున్న ఆయన సమున్నత సంకల్ప నెరవేర్పు దిశగా వేయబడిన ఒక ప్రాముఖ్యమైన ముందడుగు, ఆ సంకల్పం మానవులు నిత్యజీవం పొందేలా చేస్తుంది.
6. నోవహు ద్వారా దేవుడు ప్రాణవిలువపట్ల తన దృక్కోణాన్ని ఎలా నొక్కిచెప్పాడు?
6 దేవుడు ఇంకా ఇలా చెప్పాడు: “మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును; దానిగూర్చి ప్రతిజంతువును నరులను విచారణ చేయుదును; ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. నరుని రక్తమును చిందించు వాని రక్తము నరునివలననే చిందింపబడును; ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను.” (ఆదికాండము 9:5, 6) యావత్ మానవ కుటుంబానికి ఇవ్వబడిన ఈ ప్రకటన నుండి దేవుడు ఒక మనుష్యుని రక్తాన్ని అతని ప్రాణానికి ప్రతీకగా ఎంచుతాడని మీరు అర్థం చేసుకోవచ్చు. సృష్టికర్త ఒకవ్యక్తికి ప్రాణమిస్తాడు, రక్తం ప్రతీకగావున్న ఆ ప్రాణాన్ని ఎవరూ తీయకూడదు. ఒకవేళ ఎవరైనా కయీనువలె హత్యచేస్తే, అతని ప్రాణం విషయంలో ఆ హంతకుణ్ణి ‘విచారణచేసే’ హక్కు సృష్టికర్తకు ఉంది.
7. రక్తం విషయంలో దేవుడు నోవహుకు చేసిన ప్రకటనపట్ల మనమెందుకు ఆసక్తికలిగి ఉండాలి?
7 దేవుడు తన ప్రకటన ద్వారా రక్తాన్ని దుర్వినియోగం చేయవద్దని మానవులను ఆజ్ఞాపిస్తున్నాడు. అలా ఎందుకని మీరెప్పుడైనా ఆశ్చర్యపోయారా? అవును, రక్తం విషయంలో దేవుని దృక్కోణం వెనుకవున్న ఉద్దేశమేమిటి? నిజానికి, దానికి జవాబు బైబిల్లోని అతి ప్రాముఖ్యమైన బోధలో లభిస్తుంది. చాలా చర్చీలు ఆ విషయాన్ని ఉపేక్షిస్తున్నా అది క్రైస్తవ సందేశపు ప్రధాన బోధగా ఉంది. ఆ బోధ ఏమిటి, అందులో మీ ప్రాణం, నిర్ణయాలు, క్రియలు ఎలా ఇమిడి ఉన్నాయి?
రక్తం—దానినెలా ఉపయోగించవచ్చు?
8. ధర్మశాస్త్రంలో, రక్తాన్ని ఉపయోగించే విషయంలో యెహోవా ఎలాంటి హద్దు పెట్టాడు?
8 ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు యెహోవా, జీవం మరియు రక్తం విషయంలో మరిన్ని వివరాలు అందించాడు. ఆ ప్రక్రియలో ఆయన తన సంకల్పాన్ని నెరవేర్చడంలో మరింత ముందుకు వెళ్లాడు. ధర్మశాస్త్రం ప్రకారం ధాన్యం, నూనె, ద్రాక్షారసం వంటివి దేవునికి అర్పించే నియమముందని బహుశా మీకు తెలిసే ఉంటుంది. (లేవీయకాండము 2:1-4; 23:13; సంఖ్యాకాండము 15:1-5) అలాగే జంతువులు కూడా బలిగా అర్పించబడేవి. వాటి గురించి దేవుడు ఇలా చెప్పాడు: “రక్తము దేహమునకు ప్రాణము. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠముమీద పోయుటకై దానిని మీకిచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమునుబట్టి ప్రాయశ్చిత్తము చేయును. కాబట్టి మీలో ఎవడును రక్తము తినకూడదని . . . నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించితిని.” అదే విధంగా, ఒక వేటగాడు లేదా వ్యవసాయదారుడు వంటి ఎవరైనా ఆహారం కోసం ఏదైనా జంతువును చంపినట్లయితే అతడు దాని రక్తాన్ని నేలపై ఒలికించి దానిని మట్టితో కప్పివేయాలని కూడా యెహోవా చెప్పాడు. భూమి దేవుని పాదపీఠం కాబట్టి, రక్తాన్ని నేలపై పారబోయడం ద్వారా, ఆ జీవాన్ని తిరిగి జీవదాతకు ఇచ్చివేస్తున్నట్లు ఆ వ్యక్తి ఒప్పుకుంటాడు.—లేవీయకాండము 17:11-13; యెషయా 66:1.
9. ధర్మశాస్త్రంలో రక్తాన్ని దేనికి మాత్రమే ఉపయోగించాలని సూచించబడింది, దాని ఉద్దేశమేమిటి?
9 ఆ నియమం మనకెలాంటి ప్రాధాన్యతలేని ఒక మతాచారం కాదు. ఇశ్రాయేలీయులు రక్తం ఎందుకు తినకూడదో మీరు గమనించారా? దేవుడిలా చెప్పాడు: “కాబట్టి మీలో ఎవడును రక్తము తినకూడదని . . . నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించితిని.” దానికి కారణమేమిటి? “మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠముమీద పోయుటకై దానిని [రక్తమును] మీకిచ్చితిని.” మనుష్యులు రక్తం తినకూడదని దేవుడు నోవహుతో ఎందుకు చెప్పాడనే విషయంలో ఇది అంతర్దృష్టిని ఇవ్వడం మీరు గమనిస్తున్నారా? అనేకుల జీవరక్షణకు రక్తాన్ని ప్రత్యేకంగా ఉపయోగించడానికి కేటాయిస్తూ, సృష్టికర్త దానికి విశేష ప్రాధాన్యత ఉన్నట్లు దృష్టించాలని తీర్మానించాడు. పాపాలను కప్పివేయడానికి (ప్రాయశ్చిత్తం చేయడానికి) అది ఒక అత్యావశ్యక పాత్ర పోషించాలి. కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారం, యెహోవా క్షమాపణ కోరే ఇశ్రాయేలీయుల ప్రాణాల ప్రాయశ్చిత్తార్థం బలిపీఠంపై పోయడానికి మాత్రమే రక్తాన్ని వాడడాన్ని దేవుడు ఆమోదించాడు.
10. జంతువుల రక్తం ఎందుకు పూర్తి క్షమాపణకు దారితీయలేక పోయింది, అయితే ధర్మశాస్త్రం క్రింద ఇవ్వబడిన బలులు ఏ విషయాన్ని గుర్తుచేశాయి?
10 ఈ అవగాహన క్రైస్తవత్వానికి భిన్నంగా లేదు. ధర్మశాస్త్రంలో దేవుడు పెట్టిన ఈ అంశాన్ని పేర్కొంటూ, క్రైస్తవ అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులును రక్తముచేత శుద్ధిచేయబడుననియు, రక్తము చిందింపకుండ పాపక్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును.” (హెబ్రీయులు 9:22) నియమిత బలులు ఇశ్రాయేలీయులను పరిపూర్ణ, పాపరహిత మానవులుగా చేయలేదని పౌలు స్పష్టం చేశాడు. ఆయనిలా వ్రాశాడు: “ఆ బలులు అర్పించుటచేత ఏటేట పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి, ఏలయనగా ఎడ్లయొక్కయు మేకలయొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము.” (హెబ్రీయులు 10:1-4) అయినప్పటికీ, అలాంటి బలులు ఒక ఉద్దేశాన్ని నెరవేర్చాయి. ఆ బలులు, తాము సంపూర్ణ క్షమాపణ పొందడానికిగాను ఇంకా ఎక్కువ సహాయం అవసరమైన పాపులని ఇశ్రాయేలీయులకు గుర్తుచేశాయి. అయితే జంతువుల ప్రాణానికి ప్రతీకగావున్న ఆ రక్తం మానవుల పాపాలను పూర్తిగా పరిహరించ లేకపోతే, మరెవరి రక్తమైనా అలా పాపాలను పూర్తిగా పరిహరించగలదా?
జీవదాత చూపించిన పరిష్కారం
11. జంతు బలులు మరిదేనినో సూచిస్తున్నాయని మనకెలా తెలుసు?
11 నిజానికి ఆ ధర్మశాస్త్రం దేవుని చిత్తం నెరవేర్చడంలో మరింత కార్యసాధకమైన విషయం వైపు శ్రద్ధ మళ్లిస్తోంది. పౌలు ఇలా ప్రశ్నించాడు: “ఆలాగైతే ధర్మశాస్త్రమెందుకు?” దానికి ఆయనే ఇలా సమాధానమిచ్చాడు: “ఎవనికి ఆ వాగ్దానము చేయబడెనో ఆ సంతానము వచ్చువరకు అది అతిక్రమములనుబట్టి దానికి తరువాత ఇయ్యబడెను; అది మధ్యవర్తిచేత [మోషేచేత] దేవదూతల ద్వారా నియమింపబడెను.” (గలతీయులు 3:19) అదే విధంగా, పౌలు ఇంకా ఇలా వ్రాశాడు: “ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలదికాదు.”—హెబ్రీయులు 10:1.
12. రక్తానికి సంబంధించి, దేవుని సంకల్పం క్రమేణా వెల్లడి కావడాన్ని మనమెలా గ్రహించగలం?
12 మనం ఇప్పటి వరకు చూసినదాని ప్రకారం, మనుష్యులు తమ పోషణార్థం జంతు మాంసాన్ని తినవచ్చు గానీ రక్తాన్ని తినకూడదని నోవహు కాలంలో దేవుడు ఆజ్ఞాపించిన విషయం గుర్తుతెచ్చుకోండి. ఆ తర్వాత దేవుడు “రక్తము దేహమునకు ప్రాణము” అని చెప్పాడు. అవును, ఆయన రక్తాన్ని ప్రాణానికి ప్రతీకగా దృష్టించాలని తీర్మానించి ఇలా చెప్పాడు: “మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠముమీద పోయుటకై దానిని [రక్తమును] మీకిచ్చితిని.” అయితే, దేవుని సంకల్పానికి సంబంధించిన మహత్తరమైన విషయమొకటి క్రమేణా వెల్లడికానున్నది. ఆ ధర్మశాస్త్రం రాబోయే మేలులకు పూర్వఛాయగా పనిచేసింది. ఆ మేలులేమిటి?
13. యేసు మరణమెందుకు ప్రాముఖ్యమైనది?
13 నిజరూపం యేసుక్రీస్తు మరణంపై కేంద్రీకృతమై ఉంది. యేసు హింసించబడి, కొరత వేయబడ్డాడని మీకు తెలుసు. ఆయన ఒక నేరస్థునిలా మరణించాడు. పౌలు ఇలా వ్రాశాడు: “మనమింక బలహీనులమై యుండగా, క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనులకొరకు చనిపోయెను. . . . దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.” (రోమీయులు 5:6, 8) మన కొరకు చనిపోవడంలో క్రీస్తు మన పాపాలను కప్పివేయడానికి విమోచన క్రయధనం అందజేశాడు. ఆ విమోచన క్రయధనమే క్రైస్తవ సందేశానికి మూలాధారం. (మత్తయి 20:28; యోహాను 3:16; 1 కొరింథీయులు 15:3; 1 తిమోతి 2:6) ఈ విమోచన క్రయధనానికీ, జీవానికీ, రక్తానికీ ఏమి సంబంధముంది, దీనిలో మీ జీవితమెలా ఇమిడివుంది?
14, 15. (ఎ) కొన్ని భాషాంతరాలు ఎఫెసీయులు 1:7లో యేసు మరణాన్ని ఎలా నొక్కిచెబుతున్నాయి? (బి) ఎఫెసీయులు 1:7లోని ఏ వాస్తవం నిర్లక్ష్యానికి గురికావచ్చు?
14 కొన్ని చర్చీలు యేసు మరణాన్ని నొక్కిచెబుతాయి, వాటికి చెందిన సభ్యులు “యేసు నా కోసం చనిపోయాడు” అంటారు. ఎఫెసీయులు 1:7ను కొన్ని బైబిలు భాషాంతరాలు ఎలా అనువదించాయో పరిశీలించండి: “క్రీస్తు మరణమువలన మనము విముక్తులమైతిమి. మన పాపములు క్షమింపబడినవి.” (పవిత్ర గ్రంథము, క్యాతలిక్ అనువాదము) “క్రీస్తు మరణం ద్వారా మనకు స్వతంత్రత లభించింది, మన పాపాలు క్షమించబడ్డాయి.” (టుడేస్ ఇంగ్లీష్ వర్షన్, 1966) “క్రీస్తులో, ఆయన ప్రాణత్యాగం ద్వారా మనం విడుదల పొందాం, ఆ విడుదలకు పాప క్షమాపణ అని అర్థం.” (విలియం బార్క్లే వ్రాసిన ద న్యూ టెస్ట్‌మెంట్, 1969) “క్రీస్తు మరణం ద్వారానే మన పాపాలు క్షమించబడ్డాయి మరియు మనం విడుదల పొందాం.” (ద ట్రాన్స్‌లేటర్స్ న్యూ టెస్ట్‌మెంట్, 1973) ఇలాంటి అనువాదాల్లో యేసు మరణం నొక్కిచెప్పబడడం మీరు గమనించారా? ‘యేసు మరణం నిజంగా ప్రాముఖ్యం. మరి అలాంటప్పుడు ఈ అనువాదాల్లో ఉన్న లోపమేమిటి?’ అని మీరడగవచ్చు.
15 నిజానికి మీరలాంటి భాషాంతరాలపై ఆధారపడితే, మీరు అతి ప్రాముఖ్యమైన ఒక అంశాన్ని నిర్లక్ష్యం చేసే ప్రమాదముంది, ఇది మీరు బైబిలు సందేశాన్ని అర్థంచేసుకోవడాన్ని అసంపూర్ణం చేయగలదు. అలాంటి అనువాదాలు ఎఫెసీయులు 1:7 మూలపాఠంలో “రక్తము” అనే అర్థంగల గ్రీకు పదం ఉందన్న వాస్తవాన్ని మరుగుచేస్తాయి. అందువల్ల, చాలా బైబిళ్లు పరిశుద్ధ గ్రంథములాంటి అనువాదపు మూలపాఠానికి చేరువగా ఉన్నాయి. అక్కడిలా ఉంది: ‘దేవుని కృపామహదైశ్వర్యమునుబట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది.’
16. “ఆయన రక్తము” అనే అనువాదం మనల్ని ఏమని ఆలోచింపజేయాలి?
16 “ఆయన రక్తము” అనే అనువాదంలో విశేష భావం ఉండడమేకాదు, అది మనల్ని ఆలోచింపజేయాలి కూడా. అది పరిపూర్ణ మనుష్యుడైన యేసు మరణమైనా సరే కేవలం మరణించడం మాత్రమే సరిపోదు. ఆయన ధర్మశాస్త్రంలో, ప్రత్యేకంగా ప్రాయశ్చిత్తార్థ దినాన పూర్వఛాయగా చూపించబడిన దానిని నెరవేర్చాడు. ఆ ప్రత్యేక దినాన నిర్దేశిత జంతువులు బలిగా అర్పించబడేవి. ఆ తర్వాత, ప్రధాన యాజకుడు వాటి రక్తంలో కొంత తీసుకొని దేవాలయపు గుడారంలోకి లేదా ఆలయంలోని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్లి తాను దేవుని సన్నిధిలో ఉన్నట్లుగా ఆయన ఎదుట దానిని సమర్పించేవాడు.—నిర్గమకాండము 25:22; లేవీయకాండము 16:2-19.
17. ప్రాయశ్చిత్తార్థ దినం పూర్వఛాయగా చూపించిన దానిని యేసు ఎలా నెరవేర్చాడు?
17 పౌలు వివరించినట్లుగా, యేసు ప్రాయశ్చిత్తార్థ దినం పూర్వఛాయగా చూపించిన దానిని నెరవేర్చాడు. ఇశ్రాయేలులో ప్రధాన యాజకుడు “తనకొరకును ప్రజల అజ్ఞానకృతముల కొరకును” రక్తం అర్పించడానికి అతి పరిశుద్ధ స్థలంలోకి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రవేశించేవాడని మొదట ఆయన పేర్కొన్నాడు. (హెబ్రీయులు 9:6, 7) ఆ ప్రకారమే, యేసు ఆత్మస్వరూపిగా లేపబడినప్పుడు ఆయన పరలోకానికే వెళ్లాడు. రక్తమాంసములుగల శరీరం లేని ఆత్మస్వరూపిగా ఆయన “మనకొరకు దేవుని సముఖమందు” కనబడుటకు వెళ్లగలిగాడు. ఆయన దేవునికి ఏమి సమర్పించాడు? శరీర సంబంధమైనదేదీ కాదుగాని విశేషార్థమున్న దానినే సమర్పించాడు. పౌలు ఇంకా ఇలా చెప్పాడు: “క్రీస్తు . . . ప్రధానయాజకుడుగా వచ్చి, తానే నిత్యమైన విమోచన సంపాదించి . . . మేకలయొక్కయు కోడెలయొక్కయు రక్తముతో కాక, తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధస్థలములో ప్రవేశించెను. ఏలయనగా మేకలయొక్కయు, ఎడ్లయొక్కయు రక్తము . . . శరీరశుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచినయెడల, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తుయొక్క రక్తము, నిర్జీవ క్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో యెక్కువగా శుద్ధిచేయును.” అవును, యేసు తన ప్రాణరక్తపు విలువను దేవునికి సమర్పించాడు.—హెబ్రీయులు 9:11-14, 24, 28; 10:11-14; 1 పేతురు 3:18.
18. రక్తాన్ని వినియోగించే విషయంలో గురించి బైబిలు చెప్పే మాటలు నేడు క్రైస్తవులకు ఎందుకు ప్రాముఖ్యమైయుండాలి?
18 ఈ దైవిక సత్యం రక్తం గురించి బైబిలు చెబుతున్న దానిని అంటే దేవుడు దానినెలా దృష్టిస్తున్నాడు, మన దృక్కోణమెలా ఉండాలి, రక్తాన్ని ఉపయోగించే విషయంలో మనం దేవుని నిషేధాజ్ఞల్ని ఎందుకు గౌరవించాలి అనే ఆశ్చర్యకరమైన విషయాలను గ్రహించడానికి మనకు సహాయం చేస్తుంది. క్రైస్తవ గ్రీకు లేఖనాల పుస్తకాలు చదువుతున్నప్పుడు క్రీస్తు రక్తమును సూచించే అనేక వచనాలను మీరు చూస్తారు. (బాక్సు చూడండి.) ప్రతీ క్రైస్తవుడు ‘యేసు రక్తమునందు’ విశ్వాసముంచాలని అవి స్పష్టం చేస్తున్నాయి. (రోమీయులు 3:26) మనకు క్షమాపణ లభించడం, దేవునితో సమాధానం కలిగివుండడం కేవలం ‘[యేసు] రక్తము ద్వారానే’ సాధ్యం. (కొలొస్సయులు 1:19) యేసు తనతోపాటు పరిపాలన చేసేలా ఒక ప్రత్యేక నిబంధన చేసిన వారి విషయంలో ఇది ఖచ్చితంగా వాస్తవం. (లూకా 22:20, 28, 29; 1 కొరింథీయులు 11:25; హెబ్రీయులు 13:20) రాబోయే “మహాశ్రమలు” తప్పించుకొని, భూపరదైసులో నిత్యజీవం అనుభవించే నేటి “గొప్పసమూహము” విషయంలో కూడా ఇది వాస్తవం. అలంకారార్థంగా వారు ‘గొఱ్ఱెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుకుకుంటారు.’—ప్రకటన 7:9, 14.
19, 20. (ఎ) రక్తానికి హద్దు పెట్టాలని దేవుడెందుకు తీర్మానించాడు, దానిని మనమెలా భావించాలి? (బి) మనమేమి తెలుసుకోవడానికి ఆసక్తి చూపాలి?
19 దేవుని దృష్టిలో రక్తానికి ప్రత్యేక అర్థముందని స్పష్టమవుతోంది. మన దృష్టిలో కూడా అలాగే ఉండాలి. జీవంపట్ల శ్రద్ధగల సృష్టికర్తకు రక్తం విషయంలో మానవులు చేసేవాటికి హద్దులు పెట్టే హక్కువుంది. మన జీవంపట్ల కూడా అమిత శ్రద్ధగలవాడై ఆయన, ఒకే ఒక అతి ప్రాముఖ్యమైన విధానంలో, నిత్యజీవాన్ని సాధ్యంచేసే ఏకైక విధానంలో మాత్రమే రక్తాన్ని ఉపయోగించాలని తీర్మానించాడు. ఆ విధానంలో యేసు ప్రశస్తమైన రక్తం ఇమిడివుంది. ఈ జీవ సంరక్షణ విధానంలో రక్తాన్ని అంటే యేసు రక్తాన్ని ఉపయోగించడం ద్వారా మనకు మేలు చేయడానికి యెహోవా చర్య తీసుకున్నందుకు మనమెంత కృతజ్ఞులమో కదా! అలాగే మనకోసం బలియాగంగా తన రక్తాన్ని కుమ్మరించిన యేసుపట్ల మనమెంత కృతజ్ఞత కలిగివుండాలో కదా! అవును, అపొస్తలుడైన యోహాను వ్యక్తపరచిన మనోభావాలను మనం అర్థంచేసుకోవచ్చు. ఆయనిలా అన్నాడు: “మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపములనుండి మనలను విడిపించినవానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను జేసెను.”—ప్రకటన 1:5, 6.
20 ఎంతోకాలంగా ఈ జీవ సంరక్షక కార్యం మన జీవదాత, సర్వజ్ఞానియైన దేవుని మనస్సులో ఉంది. కాబట్టి మనమిలా ప్రశ్నించుకోవచ్చు, ‘మన నిర్ణయాలపై, క్రియలపై ఇదెలాంటి ప్రభావం చూపాలి?’ తర్వాతి ఆర్టికల్ ఈ ప్రశ్నకు జవాబిస్తుంది.
మీరెలా సమాధానమిస్తారు?
• హేబెలు, నోవహు ఇమిడివున్న వృత్తాంతాల నుండి రక్తం విషయంలో దేవుని దృక్కోణం గురించి మనమేమి నేర్చుకోవచ్చు?
• ధర్మశాస్త్రంలో, రక్తాన్ని ఉపయోగించే విషయంలో దేవుడు ఎలాంటి నిషేధం విధించాడు, ఎందుకు?
• ప్రాయశ్చిత్తార్థ దినం పూర్వఛాయగా చూపించిన దానిని యేసు ఎలా నెరవేర్చాడు?
• యేసు రక్తం ఎలా మన ప్రాణం కాపాడగలదు?
[18వ పేజీలోని బాక్సు]
ఎవరి రక్తం ప్రాణాలు కాపాడుతుంది?
“దేవుడు తన స్వరక్తమిచ్చి [“కుమారుని రక్తమిచ్చి,” NW] సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి.”—అపొస్తలుల కార్యములు 20:28.
“కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయనద్వారా ఉగ్రతనుండి రక్షింపబడుదుము.”—రోమీయులు 5:9.
“నిరీక్షణలేనివారును, లోకమందు దేవుడులేనివారునైయుండి, క్రీస్తుకు దూరస్థులై యుంటిరని మీరు జ్ఞాపకము చేసికొనుడి. అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసునందు క్రీస్తు రక్తమువలన సమీపస్థులై యున్నారు.”—ఎఫెసీయులు 2:12, 13.
“ఆయనయందు సర్వసంపూర్ణత నివసింపవలెననియు, ఆయన సిలువ రక్తముచేత సంధిచేసి, ఆయనద్వారా సమస్తమును, . . . తనతో సమాధానపరచుకొన వలెననియు తండ్రి అభీష్టమాయెను.”—కొలొస్సయులు 1:19.
“సహోదరులారా, యేసు . . . రక్తమువలన పరిశుద్ధస్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది.”—హెబ్రీయులు 10:19.
“పితృపారంపర్యమైన మీ వ్యర్థప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా . . . క్షయ వస్తువులచేత మీరు విమోచింపబడలేదుగాని అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱెపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితి[రి].”—1 పేతురు 1:18, 19.
“ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల, మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును.”—1 యోహాను 1:7.
“నీవు ఆ గ్రంథమును తీసికొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి, ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, దేవునికొరకు మనుష్యులను కొ[న్నావు].”—ప్రకటన 5:9.
“మన సహోదరులమీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడియున్నాడు . . . వారు గొఱ్ఱెపిల్ల రక్తమునుబట్టియు, తామిచ్చిన సాక్ష్యమునుబట్టియు వానిని జయించియున్నారు.”—ప్రకటన 12:10, 11.
[16వ పేజీలోని చిత్రం]
పాప క్షమాపణలో రక్తం ఒక పాత్ర పోషించగలదని ధర్మశాస్త్రం ద్వారా దేవుడు స్పష్టంచేశాడు
[17వ పేజీలోని చిత్రం]
యేసు రక్తంద్వారా అనేకులు రక్షించబడగలరు