వాళ్ళు ఇరుకు మార్గాన్ని వెతికారు
దాదాపు 550 సంవత్సరాల క్రితం, ప్రేగ్, కెల్చిట్సి, వైల్మోవ్, క్లాటొవి, ఇప్పుడు ఛెక్ రిపబ్లిక్‌గావున్న ప్రాంతంలోని ఇతర నగరాల్లో నివసించిన క్రైస్తవులు కొంతమంది తమ ఇళ్ళు వదిలి బయల్దేరారు. వాళ్ళు ఈశాన్య బొహెమియాలో ఒక లోయలో కున్వాల్డ్ అనే గ్రామంవద్ద స్థిరపడ్డారు, అక్కడ వాళ్ళు చిన్న ఇళ్ళు కట్టుకొని, భూమిని సేద్యం చేసుకుంటూ, తమ బైబిళ్ళను చదువుకొంటూ, తమను తాము యూనిటి ఆఫ్ బ్రదరెన్ (సహోదరుల ఐక్యత) లేదా లాటిన్‌లో యూనిటాస్ ఫ్రాట్రమ్ అని పిలుచుకునేవారు.
అక్కడ స్థిరపడినవారు వివిధ నేపథ్యాల నుండి వచ్చినవారు. వాళ్ళు రైతులు, ఉన్నత వంశంలో పుట్టినవారు, విశ్వవిద్యాలయ విద్యార్థులు, ధనికులు, పేదలు, స్త్రీలు, పురుషులు, విధవరాండ్రు, అనాథలు, వీరందరికీ ఒకేలాంటి కోరిక ఉండేది. “మేము దేవునికి మాత్రమే ప్రార్థించేవాళ్ళం, అన్ని విషయాలకు సంబంధించి ఆయన గొప్ప చిత్తమేమిటో వెల్లడిచేయమని మేము ఆయనను వేడుకునేవాళ్ళం. ఆయన మార్గాల్లో నడవాలని మేము కోరుకున్నాము” అని వాళ్ళు వ్రాశారు. నిజమే, ఈ యూనిటి ఆఫ్ బ్రదరెన్ లేదా ఆ తర్వాత వాళ్ళు పిలువబడినట్లు ఛెక్ బ్రదరెన్ ‘జీవమునకు పోవు ఇరుకు’ మార్గాన్ని వెతికారు. (మత్తయి 7:13, 14) వాళ్ళు చేసిన పరిశోధనవల్ల ఎలాంటి బైబిలు సత్యాలు వెలుగులోకి వచ్చాయి? వాళ్ళ నమ్మకాలకు, ఆ కాలంలో అంగీకరించబడిన నమ్మకాలకు మధ్య ఎలాంటి తేడాలుండేవి, మనం వాళ్ళనుండి ఏమి నేర్చుకోవచ్చు?
హింస లేదు—రాజీపడడం లేదు
15వ శతాబ్దం మధ్యకాలంలో సాగిన అనేక మత ఉద్యమాలు యూనిటి ఆఫ్ బ్రదరెన్ రూపొందడానికి కారణమయ్యాయి. వాటిలో ఒకటి, 12వ శతాబ్దానికి చెందిన వాల్డెన్సుల ఉద్యమం. వాల్డెన్సులు మధ్య యూరప్ ప్రభుత్వ మతమైన రోమన్ క్యాథలిక్ మతం నుండి వేరైపోయారు. అయితే ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ కొంతమేరకు క్యాథలిక్ బోధలను అంగీకరించారు. ప్రాబల్యంగల మరో గుంపు, జాన్ హుస్ అనుచరులైన హుస్సీయులు. ఛెక్ జనాభాలోని అధికశాతం ప్రజల మతానికి వాళ్ళు
ప్రాతినిధ్యం వహించారు, కానీ వాళ్ళు ఐక్యంగా ఉండేవారు కాదు. వాళ్ళలో ఒక గుంపు సామాజిక సమస్యలకు వ్యతిరేకంగా పోరాడితే, మరో గుంపు రాజకీయ ఉన్నతి కోసం మతాన్ని ఉపయోగించింది. ఖిలియాస్ట్ గుంపులచే, స్థానికంగావున్న విదేశీ బైబిలు విద్వాంసులచే కూడా బ్రదరెన్ ప్రభావితమయ్యారు.
ఛెక్ బైబిలు విద్వాంసుడు, సంస్కరణకర్త అయిన పీటర్ కెల్చీడ్కీకి (దాదాపు 1390-దాదాపు 1460) వాల్డెన్సుల, హుస్సీయుల బోధనల గురించి తెలుసు. హుస్సీయుల ఉద్యమం దౌర్జన్యపూరితంగా మారడం వల్ల ఆయన వారిని తిరస్కరించాడు, వాల్డెన్సులు తమ బోధల విషయంలో రాజీపడిపోయారు కాబట్టి ఆయన వారిని కూడా తిరస్కరించాడు. యుద్ధాలు చేయడం క్రైస్తవులకు తగదని ఆయన ఖండించాడు. ఒక క్రైస్తవుడికి ఎలాంటి పరిణామాలు ఎదురైనప్పటికీ అతణ్ణి ఎల్లప్పుడూ “క్రీస్తు నియమము” నియంత్రించాలని ఆయన భావించాడు. (గలతీయులు 6:2; మత్తయి 22:37-39) కెల్చీడ్కీ 1440లో తన బోధలను నెట్ ఆఫ్ ద ఫెయిత్ అనే పుస్తకంలో వ్రాశాడు.
విద్వాంసుడైన కెల్చీడ్కీ సమకాలీనుడు, యువకుడు, ప్రేగ్‌గు చెందినవాడు అయిన గ్రెగరి, కెల్చీడ్కీ బోధలచే ఎంతగా ప్రభావితమయ్యాడంటే ఆయన హుస్సీయుల ఉద్యమాన్ని విడిచిపెట్టాడు. 1458లో, చెకియాలోని వివిధ ప్రాంతాల్లో నివసించే హుస్సీయులలో కొంతమంది తమ ఇళ్ళు వదిలి వచ్చేలా గ్రెగరి వాళ్ళను ఒప్పించాడు. ఇతరులతోపాటు వాళ్ళు కూడా ఆయనను అనుసరించి కున్వాల్డ్ గ్రామానికి వెళ్ళి, అక్కడ ఒక క్రొత్త మత సమాజాన్ని స్థాపించారు. ఆ తర్వాత, కొంతమంది ఛెక్ వాల్డెన్సులు, జర్మన్ వాల్డెన్సులు కూడా అక్కడికి వెళ్ళారు.
గతానికి సంబంధించిన అంతర్దృష్టి
1464 నుండి 1467 వరకూ, క్రొత్తదే అయినప్పటికి అంతకంతకూ పెరుగుతున్న ఆ గుంపు కున్వాల్డ్ ప్రాంతంలో అనేక మత సభలను నిర్వహించి, తమ క్రొత్త మత ఉద్యమాన్ని నిర్వచించే అనేక తీర్మానాలు తీసుకుంది. వాళ్ళ తీర్మానాలన్నీ జాగ్రత్తగా వరుసగా కొన్ని పుస్తకాల్లో నమోదుచేయబడ్డాయి, ఇప్పుడు ఆక్టా యూనిటాటిస్ ఫ్రాట్రమ్ (యూనిటి ఆఫ్ బ్రదరెన్ కార్యకలాపాలు) అని పిలువబడుతున్న ఆ పుస్తకాలు ఇంకా ఉనికిలో ఉన్నాయి. ఆ పుస్తకాలు గతానికి సంబంధించిన అంతర్దృష్టిని అందజేసి, బ్రదరెన్ ఏమి నమ్మేవారో వివరంగా తెలియజేస్తాయి. ఆ పుస్తకాల్లో లేఖలు, ప్రసంగాల వ్రాతప్రతులు, వాళ్ళ తగాదాలకు సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి.
బ్రదరెన్ నమ్మకాల గురించి ఆక్టా అనే పుస్తకాలు ఇలా చెబుతున్నాయి: “కేవలం బైబిలు చదవడం ద్వారా, మన ప్రభువు మరియు పరిశుద్ధ అపొస్తలుల మాదిరుల గురించి ధ్యానించడం ద్వారా, వినయం మరియు దీర్ఘశాంతం ద్వారా, శత్రువులను ప్రేమించడం ద్వారా, వారి కోసం మంచిని చేయడం మరియు మంచిని కోరుకోవడం ద్వారా, వారికోసం ప్రార్థన చేయడం ద్వారా మా సంస్థను స్థాపించాలని తీర్మానించుకున్నాము.” మొదట్లో బ్రదరెన్ ప్రకటనా పని కూడా చేసేవారని ఆ పుస్తకాలు చూపిస్తున్నాయి. వాళ్ళు ఇద్దరిద్దరుగా ప్రయాణించేవారు, స్థానికంగా స్త్రీలు విజయవంతమైన మిషనరీలుగా సేవచేశారు. బ్రదరెన్ రాజకీయ పదవులు చేపట్టేవారు కాదు, ప్రమాణాలు చేసేవారు కాదు, సైనిక చర్యల్లో భాగం వహించేవారు కాదు, ఆయుధాలు ధరించేవారు కాదు.
ఐక్యత నుండి అనైక్యత
అయితే కొన్ని దశాబ్దాల తర్వాత, యూనిటి ఆఫ్ బ్రదరెన్, దాని పేరుకు తగినట్లు ఉండలేకపోయింది. తమ నమ్మకాలను ఎంత అక్షరార్థంగా పాటించాలనే విషయంలో వివాదాలు తలెత్తి వాళ్ళ మధ్య విభజనలు ఏర్పడ్డాయి. 1494లో బ్రదరెన్ మేజర్ పార్టీ, మైనర్ పార్టీ అనే పేర్లతో రెండు గుంపులుగా విడిపోయారు. మేజర్ పార్టీ తన ప్రాథమిక నమ్మకాలను నీరుకార్చేసింది, అయితే మైనర్ పార్టీ మాత్రం రాజకీయాలకు, లోకానికి వ్యతిరేకంగా తాము తీసుకున్న స్థానంలో బ్రదరెన్ స్థిరంగా నిలబడాలని ప్రకటించింది.—“మేజర్ పార్టీ సంగతేమిటి?” అనే బాక్సు చూడండి.
ఉదాహరణకు మైనర్ పార్టీకి చెందిన ఒక సభ్యుడు ఇలా వ్రాశాడు: “రెండు దారుల్లో నడిచే ప్రజలు దేవుణ్ణి హత్తుకొని ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు చాలా అరుదుగా మరియు చాలా అల్పమైన విషయాల్లో మాత్రమే దేవునికి తమను తాము సమర్పించుకొని ఆయనకు విధేయత చూపించడానికి సుముఖంగా ఉంటారు కానీ గంభీరమైన విషయాలకు వచ్చేసరికి తమకు ఇష్టం వచ్చినట్లు చేస్తారు. . . . స్థిరమైన మనస్సుగలవారిగా, మంచి మనస్సాక్షిగల వారిగా, తమ సిలువను మోస్తూ ప్రతిరోజు ప్రభువు క్రీస్తును అనుసరిస్తూ ఇరుకు మార్గంలో నడిచేవారిగా ఉండాలని మేము కోరుకుంటున్నాము.”
మైనర్ పార్టీ సభ్యులు, పరిశుద్ధాత్మ దేవుని చురుకైన శక్తి అని “దైవశక్తి” అని నమ్మేవారు. యేసు విమోచన క్రయధన బలిని వాళ్ళు, పాపము చేసిన ఆదాము కోల్పోయినదాని కోసం పరిపూర్ణుడైన యేసు తన మానవ జీవితాన్ని చెల్లించాడని అర్థం చేసుకున్నారు. వాళ్ళు యేసు తల్లి మరియను ఆరాధించేవారు కాదు. అవివాహితులుగా ఉంటామని ప్రమాణం చేయకుండానే విశ్వాసులందరూ యాజకులుగా ఉండాలనే సిద్ధాంతాన్ని వాళ్ళు మళ్ళీ ప్రారంభించారు. సంఘ సభ్యులందరూ బహిరంగ ప్రకటనా పని చేయాలని వాళ్ళు ప్రోత్సహించారు, పశ్చాత్తాపపడని పాపులను వాళ్ళు బహిష్కరించేవారు. సైనిక మరియు రాజకీయ కార్యకలాపాల నుండి వాళ్ళు దూరంగా ఉండేవారు. (“మైనర్ పార్టీ బ్రదరెన్ నమ్మకాలేమిటి?” అనే బాక్సు చూడండి.) మైనర్ పార్టీవారు ఆక్టాలోని తీర్మానాలకు హత్తుకొని ఉండేవారు కాబట్టి, తొలి యూనిటి ఆఫ్ బ్రదరెన్‌కు తామే నిజమైన వారసులమని వాళ్ళు భావించేవారు.
నిర్మొహమాటంగా మాట్లాడారు, హింసించబడ్డారు
మైనర్ పార్టీ, మేజర్ పార్టీతోపాటు ఇతర మతాలను నిర్మొహమాటంగా విమర్శించేది. వాళ్ళు అలాంటి మతాల గురించి ఇలా వ్రాశారు: “తమ స్వంత విశ్వాసం కలిగి ఉండలేని చిన్న పిల్లలకు బాప్తిస్మమివ్వడం అవసరమని మీరు బోధిస్తున్నారు, అలా చేయడానికి మీరు డియోనిసీయస్ అనే బిషప్ ప్రారంభించిన ఆచారాన్ని అనుసరిస్తున్నారు, ఆ బిషప్ కొంతమంది అజ్ఞానుల ప్రేరేపణతో శిశువుల బాప్తిస్మాన్ని ప్రారంభించాడు . . . బోధకులు, ప్రముఖ తత్వవేత్తలు, లూథర్, మెలాంక్థన్, బుట్సిరుస్, కొర్వీన్, యైలెష్, బులింగర్, . . . మేజర్ పార్టీ, దాదాపు అందరూ అదే బోధను నమ్ముతున్నారు.”
మైనర్ పార్టీ సభ్యులు హింసించబడడంలో ఆశ్చర్యమేమీ లేదు. మైనర్ పార్టీ నాయకుల్లో ఒకడైన యాన్ కాలెనెట్స్ 1524లో కొరడాలతో కొట్టబడి మంటల్లో కాల్చివేయబడ్డాడు. ఆ తర్వాత మైనర్ పార్టీ సభ్యులు ముగ్గురు కొయ్యకు కట్టబడి కాల్చివేయబడ్డారు. మైనర్ పార్టీ ఆఖరి నాయకుడు చనిపోయిన తర్వాత, దాదాపు 1550 కాలంలో అది కనుమరుగైపోయినట్లు అనిపిస్తుంది.
అయినా కూడా మధ్య యూరప్‌లోని మతపరమైన పరిస్థితులను మైనర్ పార్టీ ప్రభావితం చేసింది. నిజమే, మైనర్ పార్టీ ఉనికిలోవున్న రోజుల్లో ‘నిజమైన పరిజ్ఞానము’ ఇంకా అధికమవ్వలేదు కాబట్టి వాళ్ళు ఎంతోకాలంగా ఉన్న ఆధ్యాత్మిక అంధకారాన్ని పారదోలలేకపోయారు. (దానియేలు 12:4, NW) అయితే ఇరుకు మార్గాన్ని వెతకాలని, వ్యతిరేకత ఎదురైనప్పటికీ ఆ మార్గంలోనే నడవాలని వారు గాఢంగా కోరుకున్నారు, అది నేడు క్రైస్తవులు గుర్తుంచుకోవలసిన విషయం.
[13వ పేజీలోని బ్లర్బ్]
1500 నుండి 1510 వరకూ ముద్రించబడిన 60 బొహెమియన్ (ఛెక్) పుస్తకాల్లో 50 పుస్తకాలు యూనిటి ఆఫ్ బ్రదరెన్ సభ్యులు ముద్రించినవేనని చెప్పబడుతోంది
[11వ పేజీలోని బాక్సు]
మేజర్ పార్టీ సంగతేమిటి?
చివరికి మేజర్ పార్టీకేమి జరిగింది? మైనర్ పార్టీ ఉనికిలో లేకుండా పోయిన తర్వాత, మేజర్ పార్టీ యూనిటి ఆఫ్ బ్రదరెన్‌గానే పిలువబడుతూ ఒక మత ఉద్యమంగా కొనసాగింది. కొంతకాలానికి ఈ గుంపు తన తొలి నమ్మకాలను సవరించుకుంది. 16వ శతాబ్దం చివరికాలంలో యూనిటి ఆఫ్ బ్రదరెన్, ప్రాథమికంగా లూథరెన్‌లైన ఛెక్ యుట్రాక్విస్ట్‌లతోa కలిసి ఒక సమితిని రూపొందించారు. అయితే బైబిలును ఇతర మతసంబంధ పుస్తకాలను అనువదించి ముద్రించడంలో బ్రదరెన్ చురుకుగా పనిచేసేవారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, వాళ్ళు ముద్రించిన తొలి ప్రచురణల్లోని ప్రకాశకుల పేజీలో దేవుని వ్యక్తిగత నామంలోని నాలుగు హీబ్రూ అక్షరాలు అంటే టెట్రాగ్రమాటన్ ఉండేది.
1620లో ఛెక్ రాజ్యం మళ్ళీ రోమన్ క్యాథలిక్ చర్చి అధికారం క్రిందకు వచ్చింది. తత్ఫలితంగా మేజర్ పార్టీకి చెందిన బ్రదరెన్ అనేకులు ఆ దేశం వదిలి వేరే దేశాల్లో తమ కార్యకలాపాలను కొనసాగించారు. ఇతర దేశాల్లో ఆ గుంపు మొరావియన్ చర్చి (మొరావియా ఛెక్ దేశాల్లో ఒక భాగం) అని పిలువబడింది, అది ఇప్పటికీ ఉనికిలో ఉంది.
[అధస్సూచి]
a యుట్రాక్వి అనే లాటిన్ పదం నుండి వచ్చింది, “రెండింటిలో కొంత” అని దాని భావం. ప్రభువు పరిశుద్ధ విందు భోజనాన్ని ఆచరించేటప్పుడు రోమన్ క్యాథలిక్ ప్రీస్టులు సామాన్యులకు ద్రాక్షారసం ఇచ్చేవారు కాదు కానీ యుట్రాక్విస్ట్‌లు (హుస్సీయుల్లోని వివిధ గుంపులు) రొట్టె ద్రాక్షారసం రెండూ ఇచ్చేవారు.
[12వ పేజీలోని బాక్సు]
మైనర్ పార్టీ బ్రదరెన్ నమ్మకాలేమిటి?
15, 16 శతాబ్దాలకు చెందిన ఆక్టా యూనిటాటిస్ ఫ్రాట్రమ్ నుండి ఈ క్రింద ఇవ్వబడిన వ్యాఖ్యానాలు మైనర్ పార్టీ నమ్మకాల్లో కొన్నింటిని చూపిస్తున్నాయి. మైనర్ పార్టీ నాయకులు వ్రాసిన ఈ వ్యాఖ్యానాలు ప్రాథమికంగా మేజర్ పార్టీని ఉద్దేశించి వ్రాయబడ్డాయి.
త్రిత్వము: “మీరు బైబిలునంతటిని పరిశీలించినప్పుడు, ప్రజలు ఊహించినట్లుగా దేవుడు ఒక విధమైన త్రిత్వముగా అంటే వేర్వేరు పేర్లుగల ముగ్గురు వ్యక్తులుగా విభజించబడివున్నాడని ఎక్కడా కనిపించదు.”
పరిశుద్ధాత్మ: “పరిశుద్ధాత్మ దేవుని శక్తి, అది దేవుడిచ్చే వరం లేదా ఆదరణకర్త, క్రీస్తు బలి ఆధారంగా తండ్రి దానిని విశ్వాసులకు ఇస్తాడు. పరిశుద్ధాత్మ ఒక దేవుడిగా లేదా ఒక వ్యక్తిగా పిలువబడాలని పరిశుద్ధ లేఖనాల్లో మనకు ఎక్కడా కనిపించదు; అపొస్తలుల బోధల్లో కూడా ఎక్కడా అలా లేదు.”
యాజకత్వం: “వాళ్ళు మీకు తప్పుగా “ప్రీస్టు” అనే బిరుదును ఇస్తారు; మీరు జుట్టు తీయించుకోకపోతే, స్వస్థత కలిగిస్తుందని చెప్పుకొనే లేపనం మీ దగ్గర లేకపోతే మీరు సాధారణ మానవునితో సమానం. పరిశుద్ధుడైన పేతురు క్రైస్తవులందరూ ప్రీస్టులుగా ఉండాలని కోరుతూ ఇలా అన్నాడు: మీరు ఆత్మ సంబంధమైన బలులనర్పించు పరిశుద్ధయాజకులై ఉన్నారు. (1 పేతురు 2వ అధ్యాయం)”
బాప్తిస్మం: “ప్రభువైన క్రీస్తు తన అపొస్తలులకు ఇలా చెప్పాడు: మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి, నమ్మువారందరికి సువార్తను ప్రకటించుడి. (మార్కు 16వ అధ్యాయం) పైన చెప్పిన మాటలను నెరవేరుస్తూ, బాప్తిస్మం తీసుకున్న తర్వాతే వాళ్ళు రక్షించబడతారు. అయితే మీరు తమ స్వంత విశ్వాసం లేని చిన్న పిల్లలకు బాప్తిస్మం ఇవ్వాలని బోధిస్తారు.”
తటస్థత: “మీ తొలి సహోదరులు దుష్టమైనవనీ అపరిశుభ్రమైనవనీ దృష్టించినవాటిని, అంటే సైన్యంలో చేరడం, హత్య చేయడం, ఆయుధాలు ధరించి తిరగడం, ఇవన్నీ మంచివని మీరు దృష్టిస్తున్నారు . . . కాబట్టి ఇతర బోధకులతోపాటు మీరు కూడా ఈ ప్రవచన మాటలను కేవలం పాక్షికంగానే అర్థం చేసుకున్నారని మాకనిపిస్తోంది: అలా వింటిని అగ్ని బాణములను కేడెములను కత్తులను యుద్ధాయుధములను ఆయన విరుగగొట్టెను. (కీర్తనలు 75 [తెలుగు బైబిల్లో కీర్తనలు 76]) బైబిల్లోని మరో భాగంలో ఇలా ఉంది: నా పరిశుద్ధ పర్వతమందంతట వారు హాని చేయరు, ఎందుకంటే ప్రభువు లోకము దైవిక జ్ఞానముతో నిండి యుండును, మొదలైనవి. (యెషయా 11వ అధ్యాయం).”
ప్రకటించడం: “మొదట్లో, ఒక బిషప్ మరియు ప్రీస్టులందరి కంటే స్త్రీలే పరిచర్యలో ఎక్కువ విజయం సాధించారని మనకు బాగా తెలుసు. ఇప్పుడు ప్రీస్టులు చర్చి ద్వారా ఏర్పాటు చేయబడిన ఇళ్ళలో స్థిరపడిపోయారు. ఇది ఎంత తప్పో కదా! సర్వలోకమునకు వెళ్ళండి. సర్వసృష్టికి . . . ప్రకటించండి.”
[10వ పేజీలోని మ్యాపులు]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
జర్మనీ
పోలాండ్
ఛెక్ రిపబ్లిక్
మొరవ్యా
కున్వాల్డ్
వైల్మోవ్
క్లాటొవి
కెల్చిట్సి
ప్రేగ్
బొహెమియా
ఎల్బె నది
విటావా నది
డానుబె నది
[10, 11వ పేజీలోని చిత్రాలు]
ఎడమ వైపు: పీటర్ కెల్చీడ్కీ; క్రింద: “నెట్ ఆఫ్ ద ఫెయిత్”లోని పేజీ
[11వ పేజీలోని చిత్రం]
ప్రేగ్‌కు చెందిన గ్రెగరి
[13వ పేజీలోని చిత్రసౌజన్యం]
అన్ని చిత్రాలు: S laskavým svolením knihovny Národního muzea v Praze, C̆esko