విశ్వాస నిర్భయాలను పురికొల్పే గాథ యుక్రెయిన్లోని యెహోవాసాక్షులు
మొదటి శతాబ్దపు క్రైస్తవులవలెనే, నేడు దేవుని ప్రజలు హింస అనుభవిస్తున్నారు. (మత్తయి 10:22; యోహాను 15:20) యుక్రెయిన్లో కలిగినంత తీవ్రమైన హింసను లేదా ఎంతోకాలంగా కొనసాగిన హింసను చాలా తక్కువ ప్రాంతాలు మాత్రమే అనుభవించాయి, అక్కడ రాజ్య ప్రకటనా పని 52 సంవత్సరాలపాటు నిషేధించబడింది.
2002, యెహోవాసాక్షుల వార్షిక పుస్తకం (ఆంగ్లం) ఆ దేశంలోని దేవుని ప్రజల గాథను వివరించింది. అది తీవ్ర వ్యతిరేకతవున్నా విశ్వాసం, బలం, నిర్భయాలను గురించిన గాథ. యెహోవాసాక్షుల యుక్రెయిన్ బ్రాంచి కార్యాలయానికి అందిన ప్రశంసా వ్యాఖ్యానాల్లో కొన్ని ఈ క్రింద ఇవ్వబడ్డాయి:
“2002, వార్షిక పుస్తకం చదవడం నేను పూర్తిచేశాను. యుక్రెయిన్లో మీ కార్యకలాపాల గురించి చదువుతుండగా కంటతడి పెట్టకుండా ఉండలేకపోయాను. అత్యంతాసక్తిగల మీ మాదిరి, బలమైన విశ్వాసం నుండి నేనెంతో ప్రోత్సాహం పొందానని తెలిపేందుకు మీకిది వ్రాస్తున్నాను. మీరున్న ఆధ్యాత్మిక కుటుంబంలోనే నేను కూడా ఉన్నందుకు నేను గర్విస్తున్నాను. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు!”—ఆండ్రా, ఫ్రాన్స్.
“2002, వార్షిక పుస్తకం అందించినందుకు మీకు, యెహోవాకు నేనెంత కృతజ్ఞురాలినో మాటల్లో వివరించలేను. సహోదరులు తమ ఉత్తమోత్తమ సంవత్సరాలను జైళ్లలో, నిర్బంధ శిబిరాల్లో గడిపిన అనేక అనుభవాలు చదువుతుంటే నాకు దుఃఖం ఆగలేదు. వారి నిర్భీతిని మెచ్చుకుంటున్నాను. నేను గత 27 సంవత్సరాలుగా సాక్షిగావున్నా, నేనింకా ఈ సహోదర సహోదరీల నుండి ఎంతో నేర్చుకోగలను. మన పరలోక తండ్రియగు యెహోవాపై వారు నా విశ్వాసం బలపరిచారు.”—వెరా, పూర్వపు యుగోస్లేవియా.
“వ్యతిరేకతవున్న ఆ సంవత్సరాలన్నింటిలో సహనం, నమ్మకత్వం విషయంలో మీరు చూపిన మంచి మాదిరినిబట్టి కలిగిన ఆనందంతో మీకు ఈ ఉత్తరం వ్రాస్తున్నాను. యెహోవాపై మీకున్న సంపూర్ణ నమ్మకం, విశ్వాసంలో స్థిరంగా ఉండాలనే మీ తీర్మానం మీకు ఘనత తెస్తున్నాయి. దానికితోడు, పరీక్షలు కలిగినప్పుడు మీరుచూపిన వినయం యెహోవా తన ప్రజలను ఎడబాయడనే నా దృఢ నమ్మకాన్ని బలపరిచాయి. నిర్భీతి, స్థిరత్వం, పట్టుదల విషయంలో మీరుంచిన మంచి మాదిరి కారణంగా మాకున్న చిన్న సమస్యలను మరింత సులభంగా ఎదుర్కోగలం.”—ట్యుటరెహియా, ఫ్రెంచ్ పొలినేషియా.
“వార్షిక పుస్తకం చదివిన తర్వాత, నేను మీకు ఈ ఉత్తరం వ్రాయకుండా ఉండలేకపోయాను. ప్రోత్సాహకరమైన ఆ అనుభవాలన్నీ చదివి నేనెంతో చలించిపోయాను. సరైన సమయంలో మనకు బలమిచ్చే, మద్దతిచ్చే ప్రేమగల తండ్రి నడిపిస్తున్న ఇలాంటి విశ్వసనీయమైన, ఐక్యతగల సంస్థలో సభ్యురాలినైనందుకు నేను గర్విస్తున్నాను. అంతమంది ఆసక్తిగల, నిర్భీతిగల యెహోవా సేవకులు ఎన్నో బాధలకోర్చి, తమ ప్రాణాలర్పించిన వైనం నాకెంతో దుఃఖం కలిగించింది. అయితే వారి ఆసక్తి, నిర్భీతి కారణంగా అనేకులు సత్యం నేర్చుకొని మన ప్రేమగల తండ్రిని తెలుసుకున్నందుకు నాకు చాలా ఆనందం కూడా కలిగింది.”—కోలెట్, నెదర్లాండ్స్.
“వార్షిక పుస్తకంలో యుక్రెయిన్ వృత్తాంతం చదువుతుండగా మా హృదయాలు స్పర్శించబడ్డాయని మీకు చెప్పడానికి నేను నా భార్య ఈ ఉత్తరం వ్రాస్తున్నాము. ఎంతోకాలం కొనసాగిన తీవ్రమైన కష్టంలోనూ నమ్మకమైన సహోదరులైన మీరు సహనం చూపించడంలో అసాధారణ మాదిరివుంచారు. సామెతలు 27:11 లోని మాటల ప్రకారం, అపవాది దుష్ట క్రియల మధ్యనూ యుక్రెయిన్లో అంతమంది నమ్మకమైన సహోదరులు అవిచ్ఛిన్న యథార్థతను కాపాడుకోవడాన్నిబట్టి యెహోవా ఎంతో సంతోషించి ఉంటాడు!”—ఆలెన్, ఆస్ట్రేలియా.
“యుక్రెయిన్లోని సహోదరుల గురించి చదివినప్పుడు నా కళ్లు చెమర్చాయి. అనేక సంవత్సరాల చెరసాలను, చిత్రహింసలను, అణచివేతను, కుటుంబాలనుండి విడదీయబడడం ఇలా ఎన్నింటినో వారు సహించారు. మీ సంఘాల్లో ఇంకా సేవచేస్తున్న ఆ సహోదరులందరిని ప్రేమిస్తున్నానని, వారంటే నాకు ఎనలేని గౌరవమని వారికి చెప్పడానికి ఇష్టపడుతున్నాను. వారి నిర్భీతి, స్థిరత్వాన్నిచూసి నేను ఆనందపడుతున్నాను. వారి బలానికి మూలం యెహోవా ఆత్మని నాకు తెలుసు. యెహోవా మనకు సన్నిహితంగావుండి మనకు సహాయం చేయాలనుకుంటున్నాడు.”—సెర్గియా, రష్యా.
“2002, వార్షిక పుస్తకం చదివి దుఃఖం ఆపుకోలేకపోయాను. మా సంఘంలో అనేకమంది సహోదర సహోదరీలు మీ గురించి మాట్లాడారు. మీరు నిజంగా పెన్నిధిలాంటివారు. ఇలాంటి విస్తృతమైన ఆధ్యాత్మిక కుటుంబంలో భాగమైనందుకు నేనెంతో సంతోషిస్తున్నాను.”—యూన్హీ, దక్షిణ కొరియా.
“మీ విశ్వాసం, సహనం, యెహోవాపట్ల, ఆయన రాజ్యంపట్ల మీరుచూపిన అచంచలమైన ప్రేమను గురించిన నివేదిక నన్ను బాగా కదిలించింది. మేము అనుభవిస్తున్న స్వేచ్ఛను, యెహోవా సమృద్ధిగా అందజేస్తున్న ఆధ్యాత్మిక ఆహారాన్ని విలువైనదిగా ఎంచడంలో కొన్నిసార్లు మేము తప్పిపోతాము. అయితే మీ విషయంలో అలా జరగలేదు. మన దేవునితో మనకు సన్నిహిత సంబంధముంటే, అన్నిరకాల పరీక్షలు తట్టుకోవడానికి ఆయన మనకు బలమిస్తాడని గ్రహించడానికి మీ విశ్వాస మాదిరి మాకు సహాయంచేస్తోంది.”—పౌలో, బ్రెజిల్.
“2002, వార్షిక పుస్తకంలో మీ అనుభవాలు చదివే ఆధిక్యత నాకు లభించింది. ప్రత్యేకంగా హృదయవిదారకమైన సహోదరి లిడెవా కుర్దాస్ అనుభవం నన్నెంతో పురికొల్పింది. ఆ సహోదరికి నేనెంతో సన్నిహితమైనట్లు భావించాను.”—నెడ్యా, కోస్టరికా.
“నేనీ రోజు 2002, వార్షిక పుస్తకం చదవడం పూర్తిచేశాను. నేనది చదువుతుండగా యెహోవాపై నా విశ్వాసం బలపడింది. ముఖ్యంగా నాయకత్వం వహించేవారిపై అనుమాన బీజాలు నాటబడడం గురించిన వృత్తాంతాన్ని నేనెన్నడూ మరచిపోను. నాయకత్వం వహించే సహోదరులను ఎన్నటికీ అనుమానించకూడదని అది నాకు నేర్పింది. మీకెన్నో కృతజ్ఞతలు! ఈ ఆధ్యాత్మిక ఆహారం ప్రోత్సాహకరమైనది, అలాగే అది మన విశ్వాసం పరీక్షించబడే సమయానికి మనలను సంసిద్ధులను చేస్తుంది.”—లిటిస్వా, అమెరికా.
“అద్భుతమైన వార్షిక పుస్తకం కోసం మా ధన్యవాదాలు. యుక్రెయిన్లోని మన సహోదరుల కార్యక్రమాలను అనేకమంది ప్రచారకులు మొదటిసారిగా చదివారు. ఇక్కడి సహోదరులు బలపరచబడ్డారు. అనేకులు, ప్రత్యేకంగా యౌవనులు తమ సేవా కార్యక్రమాన్ని విస్తృతపరచుకున్నారు. కొందరు సహాయ లేదా క్రమ పయినీరు సేవ ఆరంభించారు. నిషేధ కాలంలో యెహోవాను సేవించిన సహోదర సహోదరీల గాథల ద్వారా అందరూ ప్రోత్సహించబడ్డారు.”—ఒక సంఘ సేవా కమిటీ, యుక్రెయిన్.
యుక్రెయిన్లో మన సహోదరుల నమ్మకత్వం నిజంగా ప్రపంచవ్యాప్త యెహోవా ప్రజలకు ప్రోత్సాహానికి మూలకారణంగా ఉంది. వాస్తవానికి, ప్రతి సంవత్సరం వార్షిక పుస్తకంలో ప్రచురించబడే హృదయానందకరమైన వృత్తాంతాలు క్రమంగా చదవడం ఈ గమనార్హమైన కాలాల్లో మన విశ్వాసాన్ని బలపరచే చక్కని మార్గంగా ఉంటుంది.—హెబ్రీయులు 12:1.