కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w03 8/15 పేజీలు 9-13
  • యెహోవా సేవకులకు నిజమైన నిరీక్షణ ఉంది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా సేవకులకు నిజమైన నిరీక్షణ ఉంది
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • సారాంశమేమి వెల్లడిచేస్తోంది
  • సర్వోన్నత ప్రభువగు యెహోవా మాట్లాడుతున్నాడు
  • దుష్ట అభ్యాసాలు మితిమీరాయి
  • మన కాలంలో గమనించదగిన సమాంతరాలు
  • మనం ఎల్లప్పుడు యెహోవా నామము స్మరిస్తూ నడుచుకుంటాం!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • యెహోవా మననుండి ఏమి కోరుతున్నాడు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • ప్రవక్తల్ని ఆదర్శంగా తీసుకోండి—మీకా
    మన రాజ్య పరిచర్య—2014
  • మీకా 6:8—“దీనమనస్సు కలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించు”
    బైబిలు వచనాల వివరణ
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
w03 8/15 పేజీలు 9-13

యెహోవా సేవకులకు నిజమైన నిరీక్షణ ఉంది

‘యాకోబు సంతతిలో శేషించినవారు ఆ యా జనములమధ్యను మనుష్య ప్రయత్నము లేకుండ యెహోవా కురిపించు మంచువలె ఉంటారు.’—మీకా 5:7.

1. ఆధ్యాత్మిక ఇశ్రాయేలీయులు సేదదీర్పుకెలా మూలాధారంగా ఉన్నారు?

యెహోవా వర్షాన్ని, మంచును సృష్టించిన గొప్ప సృష్టికర్త. వర్షం కొరకు లేదా మంచు కొరకు మనుషులపై ఆశపెట్టుకోవడం వ్యర్థం. ప్రవక్తయైన మీకా ఇలా వ్రాశాడు: “యాకోబు సంతతిలో శేషించిన వారు యెహోవా కురిపించు మంచువలెను, మనుష్య ప్రయత్నములేకుండను నరులయోచన లేకుండను గడ్డిమీదపడు వర్షమువలెను ఆ యా జనములమధ్యను నుందురు.” (మీకా 5:7) నేడు “యాకోబు సంతతిలో శేషించినవారు” ఎవరు? వారు ఆధ్యాత్మిక ఇశ్రాయేలీయులు, అంటే “దేవుని ఇశ్రాయేలు”లోని శేషించినవారు. (గలతీయులు 6:16) వారు భూమ్మీది “ఆ యా జనములకు” సేదదీర్చే “యెహోవా కురిపించు మంచువలె . . . గడ్డిమీదపడు వర్షమువలె” ఉన్నారు. అవును అభిషిక్త క్రైస్తవులు నేడు ప్రజలకు దేవుని ఆశీర్వాదముగా ఉన్నారు. యెహోవా తన నిజమైన నిరీక్షణా సందేశాన్ని ప్రజలకు చేరవేసేందుకు వారిని రాజ్య ప్రచారకులుగా ఉపయోగించుకుంటున్నాడు.

2. ఈ కల్లోలభరిత లోకంలో జీవిస్తున్నా మనకెందుకు నిజమైన నిరీక్షణవుంది?

2 ఈ లోకానికి నిజమైన నిరీక్షణ లేకపోవడం ఆశ్చర్యకరం కాదు. రాజకీయ అస్థిరత, నైతిక పతనం, నేరం, ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాదం, యుద్ధం వంటివి అపవాదియగు సాతాను అధికారం క్రింద ఉన్న లోకంలో ఉంటాయని మనం ఎదురుచూస్తాం. (1 యోహాను 5:19) భవిష్యత్తు ఎలా ఉంటుందోనని అనేకులు భయపడుతున్నారు. అయితే యెహోవా ఆరాధకులుగా మనం భయపడం ఎందుకంటే మనకు భవిష్యత్తును గురించి గట్టి నిరీక్షణుంది. అది దేవుని వాక్యంపై ఆధారపడినది కాబట్టి అదొక నిజమైన నిరీక్షణ. యెహోవా సెలవిచ్చేది అన్నిసమయాల్లో నెరవేరుతుంది కాబట్టి మనకు ఆయనపై, ఆయన వాక్యంపై విశ్వాసముంది.

3. (ఎ) ఇశ్రాయేలు, యూదాలమీద యెహోవా ఎందుకు చర్య తీసుకున్నాడు? (బి) మీకా మాటలు నేడెందుకు వర్తిస్తాయి?

3 దైవ ప్రేరేపిత మీకా ప్రవచనం యెహోవా నామము స్మరిస్తూ నడుచుకొనేలా మనల్ని బలపరచి, నిజమైన నిరీక్షణకు మనకొక ఆధారమిస్తుంది. మీకా ప్రవచించిన సా.శ.పూ. ఎనిమిదవ శతాబ్దంలో, దేవుని నిబంధన ప్రజలు ఇశ్రాయేలు, యూదా అనే రెండు దేశాలుగా విడిపోవడమే గాక ఆ ఇరు దేశాల వారూ దేవుని నిబంధనను అలక్ష్యం చేస్తున్నారు. ఫలితంగా, వారిలో నైతిక పతనం, మతభ్రష్టత్వం, ఐశ్వర్యాసక్తి అధికమయ్యాయి. అందువల్ల, యెహోవా వారిపై చర్య తీసుకుంటానని హెచ్చరించాడు. నిజానికి, మీకా సమకాలీనులనుద్దేశించే దేవుడు ఆ హెచ్చరికలు చేశాడు. అయితే, నేటి పరిస్థితి ఎక్కువగా మీకా కాలపు పరిస్థితిలాగే ఉన్నందున మీకా మాటలు ఇప్పుడు కూడా వర్తిస్తాయి. మీకా పుస్తకంలోని ఏడు అధ్యాయాల్లోని ఉన్నతాంశాలను కొన్నింటిని మనం పరిశీలిస్తుండగా ఈ విషయం స్పష్టమవుతుంది.

సారాంశమేమి వెల్లడిచేస్తోంది

4. మీకా 1 నుండి 3 అధ్యాయాలు ఏ సమాచారమిస్తున్నాయి?

4 మనం మీకా పుస్తకంలోని విషయాలను క్లుప్తంగా పరిశీలిద్దాం. మొదటి అధ్యాయంలో యెహోవా ఇశ్రాయేలు యూదాల తిరుగుబాటును బహిర్గతం చేస్తున్నాడు. వారి దోష ప్రవర్తనకు పర్యవసానంగా ఇశ్రాయేలు నాశనం చేయబడుతుంది, యూదాకు వచ్చే శిక్ష యెరూషలేము గుమ్మముల వరకు చేరుతుంది. ధనికులు, బలవంతులు బలహీనులను నిస్సహాయులను అణచివేస్తున్నారని 2వ అధ్యాయం వెల్లడిచేస్తుంది. అయితే, దానిలో ఒక దైవిక వాగ్దానం కూడా ఉంది. దేవుని ప్రజలు ఐక్యంగా సమకూర్చబడతారు. మూడవ అధ్యాయం జాతీయ నాయకులకు, దోషభరిత ప్రవక్తలకు వ్యతిరేకంగా యెహోవా దేవోక్తులను నివేదిస్తుంది. నాయకులు న్యాయాన్ని పెడత్రోవ పట్టిస్తుండగా, ప్రవక్తలు అబద్ధాలు పలుకుతున్నారు. పరిస్థితులు ఇలావున్నా, రాబోయే యెహోవా తీర్పును ప్రకటించేందుకు మీకా పరిశుద్ధాత్మచే బలపర్చబడ్డాడు.

5. మీకా 4, 5 అధ్యాయాల సారాంశమేమిటి?

5 అంత్యదినములలో యెహోవాచే బోధించబడడానికి సకల జనులు ఎత్తుగా ఎత్తబడిన యెహోవా మందిర పర్వతానికి వస్తారని 4వ అధ్యాయం ప్రవచిస్తోంది. దానికి ముందు, యూదా బబులోనుకు చెరగా కొనిపోబడుతుంది, కానీ యెహోవా దానిని విడిపిస్తాడు. యూదా బేత్లెహేములో మెస్సీయ జన్మిస్తాడని 5వ అధ్యాయం వెల్లడిచేస్తుంది. ఆయన తన ప్రజలకు కాపరిగావుండి, అణచివేసే జనాంగాల నుండి వారిని విముక్తుల్ని చేస్తాడు.

6, 7. మీకా ప్రవచనంలోని 6, 7 అధ్యాయాల్లో ఏ అంశాలు ప్రస్తావించబడ్డాయి?

6 మీకా 6వ అధ్యాయం, తన ప్రజలపై యెహోవాచేసే ఆరోపణల్ని వ్యాజ్యముగా నివేదిస్తుంది. తన ప్రజలు తిరుగుబాటు చేసేందుకు యెహోవా చేసినదేమిటి? అలా చేసిందేమీలేదు. వాస్తవానికి, ఆయన కోరేవి చాలా సహేతుకమైనవి. తననారాధించేవారు తనతో నడిచేటప్పుడు న్యాయాన్ని, కనికరాన్ని, దీనమనస్సును కలిగి ఉండాలని ఆయన కోరుతున్నాడు. అలా చేయడానికి బదులు, ఇశ్రాయేలువారు యూదావారు తిరుగుబాటు చేశారు, దాని పర్యవసానాలు వారు అనుభవించాల్సిందే.

7 తన ప్రవచనపు చివరి అధ్యాయంలో, మీకా తన సమకాలీనుల దుష్టత్వాన్ని ఖండిస్తున్నాడు. అయితే, ఆయన ధైర్యం కోల్పోడు, ఎందుకంటే ఆయన యెహోవా కోసం ‘కనిపెట్టుకొని’ ఉండే దృక్పథం చూపించాలని తీర్మానించుకున్నాడు. (మీకా 7:7) యెహోవా తన ప్రజలపై దయచూపిస్తాడనే నమ్మకం వ్యక్తంచేస్తూ పుస్తకం ముగుస్తుంది. ఈ నిరీక్షణ నిజమైందని చరిత్ర ధృవీకరిస్తోంది. యెహోవా తన ప్రజలను శిక్షించడం పూర్తయినప్పుడు, అంటే సా.శ.పూ. 537లో శేషింపబడిన వారిని ఆయన దయాపూర్వకంగా వారి స్వదేశానికి తిరిగి తీసుకువచ్చాడు.

8. మీకా పుస్తక విషయాల సారాంశాన్ని మీరెలా వివరిస్తారు?

8 మీకా ద్వారా యెహోవా ఎంత చక్కని సమాచారం వెల్లడి చేస్తున్నాడో గదా! ఈ ప్రేరేపిత పుస్తకం తన సేవ చేస్తున్నామని చెప్పుకుంటూ నమ్మకద్రోహులుగా ఉండేవారితో యెహోవా ఎలా వ్యవహరిస్తాడో తెలిపే హెచ్చరికా మాదిరులను తెలియజేస్తుంది. నేడు జరుగుతున్న సంఘటనలను అది ప్రవచిస్తుంది. మన నిరీక్షణను దృఢపర్చుకోవడానికి ఈ కష్ట కాలాల్లో మనమెలా ప్రవర్తించాలనే విషయంలో అది మనకు దైవిక ఉపదేశాన్నిస్తోంది.

సర్వోన్నత ప్రభువగు యెహోవా మాట్లాడుతున్నాడు

9. మీకా 1:2 ప్రకారం, యెహోవా ఏమి చేయబోతున్నాడు?

9 ఇప్పుడు మనం మీకా గ్రంథాన్ని సవివరంగా పరిశీలిద్దాం. మీకా 1:2లో మనమిలా చదువుతాం: “సకల జనులారా, ఆలకించుడి, భూమీ, నీవును నీలోనున్న సమస్తమును చెవి యొగ్గి వినుడి; ప్రభువగు యెహోవా మీమీద సాక్ష్యము పలుకబోవుచున్నాడు, పరిశుద్ధాలయములోనుండి ప్రభువు మీమీద సాక్ష్యము పలుకబోవుచున్నాడు.” మీరొకవేళ మీకా కాలంలో జీవించివుంటే, ఆ మాటలు తప్పక మీ అవధానం ఆకట్టుకొనివుండేవే. ఎందుకంటే యెహోవా ఇశ్రాయేలు, యూదాను మాత్రమే గాక సర్వప్రాంతాల ప్రజలనుద్దేశించి తన పరిశుద్ధాలయంలో నుండి మాట్లాడుతున్నాడు. మీకా కాలంలో, ప్రజలు సర్వోన్నత ప్రభువగు యెహోవాను చాలాకాలం అలక్ష్యం చేశారు. త్వరలోనే ఆ పరిస్థితి మారుతుంది. యెహోవా నిర్ణయాత్మక చర్య తీసుకోవాలని తీర్మానించుకున్నాడు.

10. మీకా 1:2లోని మాటలు మనకెందుకు ప్రాముఖ్యం?

10 మన కాలంలోనూ అలాగే జరుగుతుంది. యెహోవా తన పరిశుద్ధాలయం నుండి మరలా మాట్లాడుతున్నాడని ప్రకటన 14:18-20 చూపిస్తోంది. త్వరలోనే ఆయన నిర్ణయాత్మక చర్య తీసుకుంటాడు, ఆ విశేష సంఘటనలు మానవజాతిని మళ్ళీ కుదిపేస్తాయి. ఈసారి సాతాను విధానం సర్వనాశనమయ్యేలా, “భూమిమీదనున్న” చెడ్డ “ద్రాక్షపండ్లు” యెహోవా ఉగ్రత అనే పెద్ద తొట్టిలో వేయబడతాయి.

11. మీకా 1:3, 4లోని మాటల భావమేమిటి?

11 యెహోవా ఏమి చేయబోతున్నాడో వినండి. మీకా 1:3, 4 ఇలా చెబుతోంది: “ఇదిగో! యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు, ఆయన దిగి భూమియొక్క ఉన్నతస్థలములమీద నడువబోవుచున్నాడు. ఆయన నడువగా అగ్నికి మైనము కరుగునట్లు పర్వతములు కరిగిపోవును, లోయలు విడిపోవును, వాటముమీద పోసిన నీరు పారునట్లు అవి కరిగి పారును.” యెహోవా తన పరలోక నివాసం వదిలి వాగ్దాన దేశపు పర్వతాలపై, లోయల్లో అక్షరార్థంగా నడుస్తాడా? లేదు. ఆయనలా నడవాల్సిన అవసరం లేదు. ఆయన తన చిత్తం నెరవేర్చడానికి కేవలం తన అవధానం భూమివైపు మళ్ళిస్తే సరిపోతుంది. అంతేగాక, వర్ణించబడిన వాటిని అనుభవించేది అక్షరార్థ భూమి కాదు గానీ దానిలోని నివాసులే. యెహోవా చర్య తీసుకున్నప్పుడు, పర్వతాలు మైనంలా కరిగిపోయినట్లు భూకంపం కలిగి లోయలు విడిపోయినట్లు నమ్మకద్రోహులకు ఆ చర్య ఫలితం నాశనకరంగా ఉంటుంది.

12, 13. రెండవ పేతురు 3:10-12కు పొందికగా, మన నిరీక్షణను ఏది భద్రపరుస్తుంది?

12 మీకా 1:3, 4లోని ప్రవచనార్థక మాటలు భూమిపై సంభవించే నాశనకరమైన సంఘటనల గురించి ముందే తెలియజేసిన మరో ప్రేరేపిత ప్రవచనాన్ని మీకు గుర్తు చేయవచ్చు. రెండవ పేతురు 3:10లో అపొస్తలుడైన పేతురు ఇలా వ్రాశాడు: “ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములును కాలిపోవును.” మీకా ప్రవచనంలాగే పేతురు మాటలు అక్షరార్థమైన ఆకాశములకు, భూమికి వర్తించవు. ఈ భక్తిహీన విధానం మీదికొచ్చే మహాశ్రమను అవి సూచిస్తున్నాయి.

13 ఆ నాశనం రాబోతున్నా క్రైస్తవులు మీకా వలెనే భవిష్యత్తు గురించి నిశ్చయత కలిగి ఉండగలరు. ఎలా? పేతురు పత్రికలోని తర్వాతి వచనాల్లోని ఈ ఉపదేశాన్ని అనుసరించడం ద్వారానే. అపొస్తలుడైన పేతురిలా గట్టిగా చెబుతున్నాడు: “దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను.” (2 పేతురు 3:11, 12) మనం విధేయతా హృదయాన్ని పెంపొందించుకొని, మన ప్రవర్తన పరిశుద్ధంగా, మన జీవితం దైవభక్తి క్రియలతో నిండివుండేలా రూఢీపరచుకొంటే మన భవిష్యత్తు నిరీక్షణ స్థిరంగా ఉంటుంది. మన నిరీక్షణను భద్రంగా ఉంచుకునేందుకు, యెహోవా దినం తప్పకుండా వస్తుందనికూడా మనం గుర్తుంచుకోవాలి.

14. ఇశ్రాయేలు యూదాలు ఎందుకు శిక్షార్హమైనవి?

14 యెహోవా తన ప్రాచీనకాల ప్రజలు ఎందుకు శిక్షార్హులో వివరిస్తున్నాడు. మీకా 1:5 ఇలా చెబుతోంది: “యాకోబు సంతతి చేసిన తిరుగుబాటునుబట్టియు, ఇశ్రాయేలు సంతతివారి పాపములనుబట్టియు ఇదంతయు సంభవించును. యాకోబు సంతతివారు తిరుగుబాటు చేయుటకు మూలమేది? అది షోమ్రోనే గదా; యూదావారి ఉన్నతస్థలములు ఎక్కడివి? యెరూషలేములోనివే కావా?” ఇశ్రాయేలు యూదాలు యెహోవా మూలంగానే ఉనికిలో ఉన్నాయి. అయినా, అవి ఆయనపై తిరుగుబాటు చేశాయి, కాగా ఆ తిరుగుబాటు నేరుగా వాటి రాజధానులైన షోమ్రోను యెరూషలేముల వరకు చేరింది.

దుష్ట అభ్యాసాలు మితిమీరాయి

15, 16. మీకా సమకాలీనులు ఎలాంటి దుష్టకార్యాల దోషులైయున్నారు?

15 మీకా సమకాలీనుల దుష్టత్వానికి ఒక ఉదాహరణ మీకా 2:1, 2లో స్పష్టంగా ఇలా వర్ణించబడింది: “మంచములమీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయువారికి శ్రమ! ఆలాగు చేయుట వారి స్వాధీనములో నున్నది గనుక వారు ప్రొద్దు పొడవగానే చేయుదురు. వారు భూములు ఆశించి పట్టుకొందురు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందురు, ఒక మనిషిని వాని కుటుంబమును ఇంటివానిని వాని స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమింతురు.”

16 దురాశాపరులు తమ పొరుగువారి పొలాలను ఇళ్ళను ఎలా ఆక్రమించుకోవాలా అని కుయుక్తులు పన్నుతూ రాత్రంతా మేల్కొని ఉంటారు. ఉదయాన్నే తమ పథకాల అమలుకు హడావిడిగా బయలుదేరతారు. వారొకవేళ యెహోవా నిబంధనను జ్ఞాపకముంచుకుంటే అలాంటి దుష్ట కార్యాలు చేయరు. మోషే ధర్మశాస్త్రంలో పేదవారిని కాపాడే ఏర్పాట్లు ఉన్నాయి. దాని ప్రకారం ఏ కుటుంబమూ తమ స్వాస్థ్యాన్ని శాశ్వతంగా కోల్పోకూడదు. అయితే, ఆ దురాశాపరులకు అదేమీ పట్టదు. “నిన్నువలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను” అని చెబుతున్న లేవీయకాండము 19:18లోని మాటలను వారు అలక్ష్యం చేస్తారు.

17. దేవుని సేవిస్తున్నామని చెప్పుకొనేవారు వస్తుసంపదల్ని మొదట ఉంచితే ఏమి సంభవించగలదు?

17 దేవుని సేవిస్తున్నామని చెప్పుకునే ప్రజలు ఆధ్యాత్మిక లక్ష్యాలను పెడచెవినబెట్టి వస్తుసంపదల్ని మొదట వెదికితే ఏం జరుగవచ్చో ఇది చూపిస్తుంది. పౌలు తన కాలపు క్రైస్తవులను ఇలా హెచ్చరించాడు: “ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును.” (1 తిమోతి 6:9) ఒక వ్యక్తి ధనార్జనే తన జీవిత ముఖ్య లక్ష్యంగా చేసుకుంటే అతడు సిరిని ఆరాధిస్తున్నట్లే. అది భవిష్యత్తు విషయమై ఖచ్చితమైన ఏ నిరీక్షణా ఇవ్వలేదు.—మత్త. 6:24.

18. మీకా కాలంలో వస్తుసంపదే సమస్తమనుకునే వారికి ఏమి జరగనైయుంది?

18 మీకా కాలంలోని అనేకులు వస్తుసంపదలపై ఆధారపడడం వ్యర్థమనే చేదునిజం అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. మీకా 2:4 ప్రకారం యెహోవా ఇలా చెబుతున్నాడు: “ఆ దినమున జనులు మిమ్మును గురించి బహుగా అంగలార్చుచు సామెత నెత్తుదురు. వారు చెప్పు సామెత ఏదనగా—మనము బొత్తిగా చెడిపోయి యున్నామనియు, ఆయన నా జనుల స్వాస్థ్యమును అన్యుల కిచ్చియున్నాడనియు, మనయొద్ద నుండకుండ ఆయన దానిని తీసివేసెనేయనియు, మన భూములను తిరుగబడినవారికి ఆయన విభజించియున్నాడనియు ఇశ్రాయేలీయులు అనుకొనుచున్నట్లు జనులు చెప్పుకొందురు.” అవును, ఇళ్ళను పొలాలను దోచుకునే వారు తమ సొంత కుటుంబ స్వాస్థ్యాన్నే పోగొట్టుకుంటారు. వారొక పరాయి దేశానికి తీసుకువెళ్ళబడతారు, వారి సంపదలు “తిరుగబడినవారికి” అంటే అన్యజనులకు దోపుడు సొమ్ము అవుతాయి. ఉజ్వల భవిష్యత్తు ఆశలన్నీ అడియాసలౌతాయి.

19, 20. యెహోవా యందు నమ్మకముంచిన యూదులు ఏమి అనుభవించారు?

19 అయితే, యెహోవాను నమ్ముకునేవారి నిరీక్షణ వ్యర్థంకాదు. యెహోవా తాను అబ్రాహాము, దావీదులతో చేసిన నిబంధనలకు నమ్మకంగా కట్టుబడి ఉన్నాడు, మీకావలె తనను ప్రేమించేవారిని, తోటి దేశవాసులు దేవునికి దూరమౌతున్నందుకు దుఃఖించే వారిని ఆయన కనికరిస్తాడు. యథార్థపరుల నిమిత్తం దేవుని నిర్ణయకాలంలో పునఃస్థాపన జరుగుతుంది.

20 బబులోను పతనం తర్వాత యూదుల శేషము స్వదేశానికి తిరిగి వచ్చినప్పుడు, అంటే సా.శ.పూ. 537లో అది నెరవేరుతుంది. ఆ సమయంలో, మీకా 2:12లోని మాటలు తొలిసారిగా నెరవేరతాయి. యెహోవా ఇలా అంటున్నాడు: “యాకోబు సంతతీ, తప్పక నేను మిమ్మునందరిని పోగుచేయుదును, ఇశ్రాయేలీయులలో శేషించినవారిని తప్పక సమకూర్చుదును. బొస్రా గొఱ్ఱెలు కూడునట్లు వారిని సమకూర్చుదును, తమ మేతస్థలములలో వారిని పోగుచేతును, గొప్ప ధ్వని పుట్టునట్లుగా మనుష్యులు విస్తారముగా కూడుదురు.” యెహోవా ఎంత ప్రేమగలవాడో గదా! తన ప్రజలను శిక్షించిన తర్వాత, శేషింపబడినవారు తిరిగివచ్చి, తాను వారి పితరులకిచ్చిన దేశంలో తనను సేవించడానికి ఆయన అనుమతిస్తాడు.

మన కాలంలో గమనించదగిన సమాంతరాలు

21. నేటి పరిస్థితులు మీకా కాలపు పరిస్థితులకు ఎలా పోలివున్నాయి?

21 మీకా పుస్తకంలోని మొదటి రెండు అధ్యాయాలను పరిశీలించిన తర్వాత, నేటి పరిస్థితులు వాటికెంత సారూప్యంగా ఉన్నాయో గమనించి మీరు అవాక్కయ్యరా? మీకా కాలంలోవలెనే నేడనేకులు దేవుని సేవిస్తున్నామని చెప్పుకుంటున్నారు. అయితే, వారు యూదా ఇశ్రాయేలుల మాదిరిగానే విభాగింపబడి, తమలోతామే యుద్ధాలు చేసుకున్నారు. క్రైస్తవమత సామ్రాజ్యపు ధనికులనేకులు పేదలను అణచివేశారు. అంతకంటే ఎక్కువగా, బైబిలులో నిర్ద్వందంగా ఖండించబడిన అభ్యాసాలను మతనాయకులు చూసీచూడనట్లు వదిలేశారు. క్రైస్తవమత సామ్రాజ్యం, ప్రపంచ ఆబద్ధమత సామ్రాజ్యమైన “మహా బబులోను”లోని మిగిలిన భాగంతో పాటు త్వరలోనే అంతమవుతుందనడంలో ఆశ్చర్యం లేదు! (ప్రకటన 18:1-5) అయితే, మీకా కాలపు మాదిరిని అనుసరిస్తూ యెహోవాకు నమ్మకమైన సేవకులు భూమిపై నిలిచివుంటారు.

22. ఏ రెండు గుంపులవారు తమ నిరీక్షణను దేవుని రాజ్యంపై ఉంచారు?

22 నమ్మకమైన అభిషిక్త క్రైస్తవులు చివరకు 1919లో క్రైస్తవమత సామ్రాజ్యం నుండి వేరై అన్ని జనాంగాలకు రాజ్య సువార్త ప్రకటించడం ప్రారంభించారు. (మత్తయి 24:14) మొదట వారు ఆధ్యాత్మిక ఇశ్రాయేలులో శేషింపబడిన వారిని వెదికారు. ఆ తర్వాత, వేరే గొఱ్ఱెల గొప్ప సమూహం సమకూర్చబడడం ఆరంభమైంది, దానితో రెండు గుంపులూ ‘ఒకే మంద’ కాగా ‘గొఱ్ఱెల కాపరి ఒక్కడే’ అయ్యాడు. (యోహాను 10:16) వారిప్పుడు 234 దేశాల్లో దేవుణ్ణి సేవిస్తున్నప్పటికీ, నమ్మకమైన ఈ యెహోవా ఆరాధకులందరూ నిజంగా ‘సమకూర్చబడ్డారు.’ ఇప్పుడు ఆ గొఱ్ఱెలమందలో స్త్రీలు, పిల్లలతోసహా “గొప్ప ధ్వని పుట్టునట్లుగా మనుష్యులు విస్తారంగా” ఉన్నారు. వారి నిరీక్షణ ఈ విధానంపై కాదుగానీ, త్వరలోనే ఈ భూమ్మీద పరదైసుకు నడిపే దేవుని రాజ్యంపై ఉంది.

23. మీ నిరీక్షణ తిరుగులేనిదని మీరెందుకు నమ్మకంగా ఉన్నారు?

23 యెహోవా నమ్మకమైన ఆరాధకులను గూర్చి మీకా 2వ అధ్యాయంలో చివరి వచనమిలా చెబుతోంది: “వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును.” యెహోవాయే నాయకుడుగా, రాజైన యేసుక్రీస్తును అనుసరిస్తూ సాగిపోయే ఆ విజయోత్సాహపు ఊరేగింపులో మీరు ఉన్నట్టుగా చూస్తున్నారా? అలాగయితే, విజయం నిశ్చయమని, మీ నిరీక్షణ తిరుగులేనిదని మీరు ధృడనమ్మకం కలిగియుండవచ్చు. మీకా ప్రవచనంలోని ఇతర ఉన్నతాంశాలను మనం పరిశీలిస్తుండగా ఇది మరింత ఎక్కువగా రూఢీ అవుతుంది.

మీరెలా సమాధానమిస్తారు?

• మీకా కాలంలో, ఇశ్రాయేలు యూదాలపై చర్య తీసుకోవాలని యెహోవా ఎందుకు నిర్ణయించుకున్నాడు?

• దేవుని సేవిస్తున్నామని చెప్పుకొనేవారు జీవితంలో వస్తుసంపదలను మొదట ఉంచితే ఏమి జరుగవచ్చు?

• మీకా 1, 2 అధ్యాయాలను పరిశీలించిన తర్వాత, మీ నిరీక్షణ తిరుగులేనిదని మీరెందుకు నమ్ముతున్నారు?

[9వ పేజీలోని చిత్రం]

మీకా ప్రవచనం మనల్ని ఆధ్యాత్మికంగా బలపర్చగలదు

[10వ పేజీలోని చిత్రాలు]

సా.శ.పూ. 537లోని యూదా శేషము వలెనే, ఆధ్యాత్మిక ఇశ్రాయేలీయులు వారి సహవాసులు సత్యారాధనను సమర్థిస్తున్నారు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి