మనకు నిజంగా ఇతరులు అవసరమా?
ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టైన్ ఇలా పేర్కొన్నాడు: “మన జీవితాలను, మన ప్రయత్నాల్ని పరీక్షించి చూస్తే, దాదాపు మన చర్యలు కోరికలు అన్నీ ఇతర మానవుల ఉనికితో ముడిపడి ఉన్నట్లు మనం గమనిస్తాం. మనం ఇతరులు పండించిన పంట తింటాము, ఇతరులు తయారు చేసిన బట్టలు వేసుకుంటాము, ఇతరులు నిర్మించిన ఇళ్ళలో నివసిస్తాము. . . . ఒక వ్యక్తి తానేమిటనేదానికీ, తాను సంపాదించుకున్న ప్రాధాన్యతకూ కారణం, అతనికున్న వ్యక్తిత్వం కాదు గానీ ఉయ్యాలనుండి కాటికెళ్ళే వరకు అతని భౌతిక, ఆధ్యాత్మిక ఉనికిని నిర్దేశించే గొప్ప మానవ సమాజంలో అతడొక సభ్యుడై ఉండడమే.”
జంతు ప్రపంచంలో, సహజ ప్రవృత్తిని బట్టి అవి సహజీవనం చేయడం మనకు సాధారణంగా కనిపిస్తుంటుంది. ఏనుగులు తమ పిల్లలను జాగ్రత్తగా కాపాడుకుంటూ గుంపులు గుంపులుగా సంచరిస్తాయి. ఆడసింహాలు కలిసి వేటాడి ఆహారాన్ని మగ సింహాలతో పంచుకుంటాయి. డాల్ఫిన్‌లు కలిసి ఆడుకుంటాయి, అంతేగాక అవి ప్రమాదంలోవున్న ఇతర జంతువులను, మానవులను కాపాడాయి కూడా.
అయితే, మానవుల మధ్యన, అధిక చింతను కలిగిస్తున్న ఒక ధోరణిని సమాజ శాస్త్రవేత్తలు గమనించారు. మెక్సికోలో ప్రచురించబడే ఒక వార్తాపత్రిక ప్రకారం, “దశాబ్దాల ఒంటరితనం, సాంఘిక జీవనం హరించిపోవడం అమెరికా సమాజంపై నాశనకరమైన ప్రభావాన్ని చూపించాయని” కొంతమంది శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. “జాతి సంక్షేమం బహుళార్థ సామాజిక మార్పుపై, తిరిగి సాంఘిక జీవనం ప్రారంభించడంపై ఆధారపడి ఉంది” అని ఆ వార్తాపత్రిక పేర్కొన్నది.
ప్రాముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లో నివసిస్తున్న వారిమధ్యన ఈ సమస్య ప్రబలంగా ఉంది. చాలామందిలో అందరికి దూరంగా ఒంటరిగా ఉండాలనే ధోరణి వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రజలు ‘తమ బ్రతుకు తాము బ్రతకాలని’ కోరుకుంటూ ఇతరులు ‘తమ విషయాల్లో జోక్యం చేసుకోవడాన్ని’ బలంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ దృక్పథం మానవ సమాజంలో భావోద్వేగ సమస్యలు, మానసిక కృంగుదల, ఆత్మహత్యలు ఎక్కువ కావడానికి దారితీసిందన్న అభిప్రాయం వ్యక్తం చేయబడింది.
ఈ విషయంలో, డా. డానియల్ గోల్‌మాన్ ఇలా అన్నాడు: “సమాజం నుండి దూరమైపోవడం—ఆంతరంగిక భావాలను పంచుకోవడానికి లేదా సన్నిహిత సంబంధం కలిగివుండడానికి ఎవరూ లేరన్న తలంపు—అనారోగ్యానికి లేదా మరణానికి గురయ్యే సాధ్యతను రెండింతలు చేస్తుంది.” సైన్స్ అనే పత్రికలో ప్రచురించబడిన ఒక నివేదిక, ‘పొగత్రాగడం, అధిక రక్తపోటు, అధిక కొలస్ట్రాల్, భారీ కాయం, శారీరక వ్యాయామం లేకపోవడం వంటివి మరణ రేటుకు ఎంతగా దోహదపడతాయో’ సమాజం నుండి దూరమైపోవడం కూడా అంతగానే దోహదపడుతుందని నిర్ధారించింది.
కాబట్టి, వివిధ కారణాలను బట్టి మనకు ఇతరులు నిజంగా అవసరం. మనం ఒంటరిగా మనుగడ సాగించలేము. అయితే ఒంటరితనం అనే సమస్యను ఎలా పరిష్కరించవచ్చు? అనేకుల జీవితాలకు ఏది నిజమైన అర్థాన్నిచ్చింది? తర్వాతి ఆర్టికల్ ఆ ప్రశ్నలకు సమాధానమిస్తుంది.
[3వ పేజీలోని బ్లర్బ్]
“దాదాపు మన చర్యలు కోరికలు అన్నీ ఇతర మానవుల ఉనికితో ముడిపడి ఉన్నాయి.”—ఆల్బర్ట్ ఐన్‌స్టైన్