కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w03 1/15 పేజీలు 4-7
  • దుష్టత్వం విజయం సాధించిందా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దుష్టత్వం విజయం సాధించిందా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మానవులు తమను తాము విజయవంతంగా పరిపాలించుకోగలరా?
  • సాతాను ప్రతి ఒక్కరిని దేవుని నుండి దూరం చేయగలడా?
  • భవిష్యత్తులో ఏముంది?
  • మీరు ఎవరి పక్షం వహిస్తారు?
  • ఆత్మ సామ్రాజ్యమందలి పరిపాలకులు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • దేవుడెందుకు బాధను అనుమతిస్తున్నాడు?
    నిత్యజీవానికి నడిపించే జ్ఞానము
  • జాగ్రత్తగా ఉండండి—సాతాను మిమ్మల్ని మింగేయాలని చూస్తున్నాడు!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
  • భూమిపట్ల దేవుని సంకల్పం ఏమిటి?
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
w03 1/15 పేజీలు 4-7

దుష్టత్వం విజయం సాధించిందా?

విశ్వవ్యాప్తంగా మంచితనానికి దుష్టత్వానికి మధ్య పోరాటమనే తలంపు చరిత్రంతటిలోనూ రచయితల, తత్వవేత్తల అంతులేని ఊహలకు కారణమయ్యింది. అయితే దేవునికి, అపవాదికి మధ్య పోరాటం గురించి ఖచ్చితమైన చరిత్రగల పుస్తకం ఒకటి ఉంది. ఆ పుస్తకమే బైబిలు. అది ఈ వివాదంలో భాగమైవున్న అంశాలపై వెలుగును ప్రసరింపజేసి, నిజంగా ఎవరు విజయం సాధించారనేదాన్ని నిశ్చయించేందుకు మార్గాన్ని చూపిస్తుంది.

మొదటి స్త్రీ పురుషులు సృష్టించబడిన వెంటనే, అపవాదియగు సాతాను అయిన ఒక అదృశ్య ఆత్మప్రాణి దేవుని పరిపాలనను సవాలు చేశాడు. ఎలా? దేవుడు తన సృష్టికి మంచివి అందకుండా చేస్తున్నాడనీ, ఆయన అదుపాజ్ఞలు లేకపోతే మానవులు మరింత మంచి జీవితాన్ని గడపవచ్చుననీ కుయుక్తితో సూచించడం ద్వారా సవాలు చేశాడు.​—ఆదికాండము 3:1-5; ప్రకటన 12:9.

ఆ తర్వాత, పితరుడైన యోబు కాలంలో సాతాను మరో వివాదాన్ని లేవదీశాడు. యోబుకు దేవుని పట్ల ఉన్న విశ్వసనీయతను పాడుచేయడానికి ప్రయత్నిస్తూ సాతాను ఇలా అన్నాడు: “చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును గదా.” (యోబు 2:4) అది ఎంత సాధారణీకృతమైన ఆరోపణో కదా! సాతాను యోబు పేరును ఉపయోగించే బదులు ‘నరుడు’ అనే పదాన్ని వాడడం ద్వారా ప్రతి మానవుని విశ్వసనీయతను శంకించాడు. ఒక విధంగా చెప్పాలంటే అతడు ఇలా అంటున్నాడు: ‘ఒక వ్యక్తి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఏమైనా చేస్తాడు. నాకు ఒక్క అవకాశమిస్తే, నేను ప్రతి ఒక్కరిని దేవుని నుండి దూరం చేయగలను.’

దేవునికి అపవాదికి మధ్య పోరాటంలో విజయం, ఈ రెండు ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ద్వారా నిశ్చయించబడుతుంది: మానవుడు తనను తాను విజయవంతంగా పరిపాలించుకోగల్గుతున్నాడా? అపవాది ప్రతి ఒక్కరిని సత్య దేవుని నుండి దూరం చేయగలిగాడా?

మానవులు తమను తాము విజయవంతంగా పరిపాలించుకోగలరా?

వేల సంవత్సరాలపాటు మానవులు వివిధ రకాల పరిపాలనలతో ప్రయోగాలు చేశారు. గత కాలాల్లో రాజరికం, కులస్వామ్యం, ప్రజాస్వామ్యం, నిరంకుశ ప్రభుత్వం, ఫాసిజం, కమ్యూనిజం వంటి విభిన్న ప్రభుత్వాలను ప్రయత్నించి చూశారు. ఇలా ఎల్లప్పుడూ ప్రభుత్వాలను మార్చవలసిన అవసరత ఉందనే వాస్తవం, ఆ విభిన్న ప్రభుత్వాలలో ఏదీ సరిగ్గా లేదని సూచించడం లేదా?

1922లో ప్రచురించబడిన ప్రపంచ చరిత్ర (ఆంగ్లం) అనే పుస్తకంలో హెచ్‌. జి. వెల్స్‌ ఇలా వ్రాశాడు: “రోమ్‌ ప్రజలు తమకు తెలియకుండానే ఒక విస్తృతమైన కార్యనిర్వహణా ప్రయోగంలో నిమగ్నమై ఉన్నట్లు కనుగొన్నారు.” ఆయనింకా ఇలా అన్నాడు: “కార్యనిర్వహణ ఎప్పుడూ మారుతూ ఉండేది, అది ఎప్పుడూ స్థిరంగా లేదు. ఒక విధంగా చెప్పాలంటే ఆ ప్రయోగం విఫలమైంది. మరో విధంగా చెప్పాలంటే ఆ ప్రయోగం అసంపూర్ణంగా ఉండిపోయింది, మొదట ప్రపంచవ్యాప్త రాష్ట్ర వ్యవహారాల నిర్వహణకు సంబంధించి రోమ్‌లోని ప్రజలు ఎదుర్కొన్న క్లిష్ట సమస్యల్ని పరిష్కరించడానికి యూరప్‌, అమెరికాలు నేటికీ కృషి చేస్తున్నాయి.”

ప్రభుత్వాలకు సంబంధించిన ప్రయోగం 20వ శతాబ్దంలో కూడా కొనసాగింది. ఆ శతాబ్దాంతానికి ప్రజాస్వామ్య పరిపాలన మునుపెన్నడూ లేనంతగా అంగీకరించబడింది. ప్రజాస్వామ్యం సూత్రప్రాయంగానైతే ప్రతి ఒక్కరూ పరిపాలనలో భాగం వహించేందుకు అనుమతిస్తుంది. కానీ దేవుని సహాయం లేకుండా మానవుడు విజయవంతంగా పరిపాలించగలడని ప్రజాస్వామ్యం చూపించిందా? మాజీ భారత ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రజాస్వామ్యం మంచిదే అని చెప్పాడు గానీ ఆయన ఇలా కూడా అన్నాడు: “నేనిలా ఎందుకంటున్నానంటే ఇతర విధానాలు దీనికంటే ఘోరమైనవి.” ఫ్రాన్స్‌ మాజీ ప్రెసిడెంట్‌ వలరి గిస్‌కార్డ్‌ డె ఇస్టెయింగ్‌ ఇలా అన్నాడు: “మనం ప్రాతినిధ్య ప్రజాస్వామ్యపు సంక్షోభాన్ని చూస్తున్నాము.”

సా.శ.పూ. ఐదవ శతాబ్దంలో కూడా, గ్రీకు తత్వవేత్త ప్లేటో ప్రజాస్వామ్య పరిపాలనలో ఒక బలహీనతను కనుగొన్నాడు. రాజకీయ సిద్ధాంత చరిత్ర (ఆంగ్లం) అనే పుస్తకం ప్రకారం, ఆయన “ప్రజాస్వామ్యాలకు ప్రత్యేక శాపమైన రాజకీయవేత్తల అజ్ఞానంపై, అశక్తతపై” దాడి చేశాడు. పరిపాలన చేయడానికి అర్హులైన, సమర్థతగల వ్యక్తులను కనుగొనడంలో ఎదురవుతున్న ఇబ్బందిని బట్టి ఈనాటి రాజకీయవేత్తలు చాలామంది విలపిస్తున్నారు. ప్రజలు “తాము ఎంతో గంభీరమైన సమస్యలను ఎదుర్కొంటున్న సమయంలో అల్పులుగా కనిపించే నాయకులను బట్టి ఆగ్రహంతో ఉన్నారు” అని ద వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ అన్నది. అదింకా ఇలా అంది: “వారు తాము మార్గదర్శకం కోసం చూసినప్పుడు తమ నాయకులు నిర్ణయాలు తీసుకోలేకపోవడాన్ని, వారు చేస్తున్న భ్రష్టత్వాన్ని చూసి ఏవగించుకుంటున్నారు.”

ఇప్పుడు ప్రాచీన ఇశ్రాయేలు రాజైన సొలొమోను పరిపాలనను పరిశీలించండి. యెహోవా దేవుడు సొలొమోనుకు విశేషమైన జ్ఞానాన్నిచ్చాడు. (1 రాజులు 4:29-34) సొలొమోను పరిపాలించిన 40 సంవత్సరాల్లో ఇశ్రాయేలు జనాంగం ఏమి అనుభవించింది? బైబిలు ఇలా సమాధానమిస్తోంది: “యూదావారును ఇశ్రాయేలువారును సముద్రపు దరినున్న యిసుక రేణువులంత విస్తార సమూహమై తినుచు త్రాగుచు సంభ్రమపడుచు నుండిరి.” ఆ వృత్తాంతం ఇలా కూడా చెబుతోంది: “సొలొమోను దినములన్నిటను ఇశ్రాయేలువారేమి యూదావారేమి దాను మొదలుకొని బెయేర్షెబా వరకును తమ తమ ద్రాక్షచెట్ల క్రిందను అంజూరపుచెట్ల క్రిందను నిర్భయముగా నివసించుచుండిరి.” (1 రాజులు 4:20, 25) సర్వోన్నతుడు, అదృశ్య పరిపాలకుడు అయిన యెహోవా దేవుని దృశ్య ప్రతినిధిగా ఒక జ్ఞానవంతుడైన రాజు పరిపాలిస్తుండగా ఆ జనాంగం సాటిలేని స్థిరత్వాన్ని, సమృద్ధిని, సంతోషాన్ని అనుభవించింది.

మానవుని పరిపాలనకు, దేవుని పరిపాలనకు ఎంత గొప్ప తేడా! పరిపాలనకు సంబంధించిన వివాదంలో సాతాను విజయం సాధించాడని ఎవరైనా నిజాయితీగా చెప్పగలరా? చెప్పలేరు, ఎందుకంటే యిర్మీయా ప్రవక్త స్పష్టంగా ఇలా ప్రకటించాడు: “యెహోవా, తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును.”​—యిర్మీయా 10:23.

సాతాను ప్రతి ఒక్కరిని దేవుని నుండి దూరం చేయగలడా?

సాతాను ప్రతి ఒక్కరిని దేవుని నుండి దూరం చేయగలనని తాను చేసిన ఆరోపణ విషయంలో విజయం సాధించాడా? హెబ్రీయులకు వ్రాసిన పత్రికలోని 11వ అధ్యాయంలో, అపొస్తలుడైన పౌలు క్రైస్తవ పూర్వ కాలాలకు చెందిన అనేకమంది నమ్మకమైన స్త్రీ పురుషుల పేర్లను పేర్కొన్నాడు. ఆ తర్వాత ఆయనిలా ప్రకటించాడు: “గిద్యోను, బారాకు, సమ్సోను, యెఫ్తా, దావీదు, సమూయేలను వారిని గూర్చియు, ప్రవక్తలనుగూర్చియు వివరించుటకు సమయము చాలదు.” (హెబ్రీయులు 11:32) పౌలు ఈ విశ్వసనీయులైన దేవుని సేవకులను ‘మేఘము వంటి గొప్ప సాక్షి సమూహము’ అని పేర్కొన్నాడు. (హెబ్రీయులు 12:1, 2) ఇక్కడ “మేఘము” కోసం ఉపయోగించబడిన గ్రీకు పదానికి, వేరు చేయబడిన, నిర్దిష్టమైన పరిమాణమూ ఆకారమూ గల మేఘమని కాదుగానీ ఒక ఆకారమంటూ లేని ఒక పెద్ద మేఘ సముదాయమని భావం. ఇది సముచితమైనదే ఎందుకంటే ప్రాచీన కాలంలోని నమ్మకమైన దేవుని సేవకులు ఎంత ఎక్కువ సంఖ్యలో ఉండేవారంటే వారు ఒక పెద్ద మేఘ సముదాయంలా ఉన్నారు. అవును శతాబ్దాలన్నిటిలోనూ, లెక్కలేనంతమంది యెహోవా దేవునికి తమ విశ్వసనీయతను చూపించడానికి ఇష్టపూర్వకంగా ఎంపిక చేసుకున్నారు.​—యెహోషువ 24:15.

మన కాలంలో మనమేమి చూస్తున్నాము? యెహోవాసాక్షులు 20వ శతాబ్దంలో తీవ్రమైన హింసను, వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పటికీ వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 60 లక్షలకంటే ఎక్కువయ్యింది. అదనంగా దాదాపు 90 లక్షలమంది వారితో సహవసిస్తున్నారు, వీరిలో అనేకులు దేవునితో సన్నిహిత వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటున్నారు.

మానవులను యెహోవా నుండి దూరం చేయగలనని సాతాను చేసిన ఆరోపణకు అత్యంత సముచితమైన జవాబు దేవుని స్వంత కుమారుడైన యేసుక్రీస్తు నుండి వచ్చింది. హింసా కొయ్యపై వేదనభరితమైన నొప్పి కూడా ఆయన విశ్వసనీయతను భగ్నం చేయలేదు. యేసు చివరి శ్వాస తీసుకుంటూ ఇలా కేకవేశాడు: “తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నా[ను].”​—లూకా 23:46.

సాతాను మానవులను తన ఆధీనంలో ఉంచుకునేందుకు, శోధనల నుండి తీవ్రమైన హింస వరకూ తనకు సాధ్యమైనదంతా చేస్తాడు. అతడు ప్రజలను శోధించడానికి ‘శరీరాశను, నేత్రాశను, జీవపుడంబమును’ ఉపయోగిస్తూ వారిని యెహోవా నుండి దూరంగా ఉంచడానికి లేదా యెహోవా నుండి దూరమయ్యేలా ప్రలోభపెట్టడానికి ప్రయత్నిస్తాడు. (1 యోహాను 2:16) అంతేగాక, “క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము” సాతాను “అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను.” (2 కొరింథీయులు 4:4) వాటితోపాటు సాతాను తన లక్ష్యాన్ని సాధించుకునేందుకు భయపెట్టడానికీ మనుష్యుల భయాన్ని ఉపయోగించుకోవడానికీ సంకోచించడు.​—అపొస్తలుల కార్యములు 5:40.

అయితే దేవుని వైపు ఉన్నవారిని అపవాది జయించడు. వారు యెహోవా దేవుని గురించి తెలుసుకొని ఆయనను ‘తమ పూర్ణహృదయముతోను తమ పూర్ణాత్మతోను తమ పూర్ణమనస్సుతోను ప్రేమించడం’ ప్రారంభించారు. (మత్తయి 22:37) అవును యేసుక్రీస్తుతో సహా అసంఖ్యాకులైన ఇతర మానవులు చూపించిన అచంచలమైన విశ్వసనీయత అపవాదియగు సాతానుకు ఘోర పరాజయం కలిగేలా చేసింది.

భవిష్యత్తులో ఏముంది?

ప్రభుత్వానికి సంబంధించి మానవులు చేస్తున్న ప్రయోగాలు నిరంతరం కొనసాగుతాయా? దానియేలు ప్రవక్త ఇలా ప్రవచించాడు: “ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు; అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును.” (దానియేలు 2:44) పరలోకమందున్న దేవుడు స్థాపించే రాజ్యం ఒక పరలోక ప్రభుత్వం, దానిని యేసుక్రీస్తు పరిపాలిస్తాడు. యేసు తన అనుచరులకు ప్రార్థించమని నేర్పించింది ఆ రాజ్యం గురించే. (మత్తయి 6:9, 10) ఆ రాజ్యం “సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధము”లో మానవ ప్రభుత్వాలన్నిటినీ నాశనం చేసి, భూమినంతటినీ ప్రభావితం చేస్తుంది.​—ప్రకటన 16:14, 16.

సాతానుకు ఏమి జరుగనుంది? ఈ భవిష్యత్‌ సంఘటనను బైబిలిలా వివరిస్తోంది: “[యెహోవా దూత] ఆదిసర్పమును, అనగా అపవాదియు సాతానును అను ఆ ఘటసర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి, ఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్రవేసెను.” (ప్రకటన 20:2, 3) సాతాను నిష్క్రియత అనే అగాధంలోకి పడవేయబడిన తర్వాతనే యేసుక్రీస్తు వెయ్యేండ్ల పరిపాలన ప్రారంభమవుతుంది.

అప్పుడు ఈ భూమి ఎంత ఆనందభరితమైన స్థలంగా ఉంటుందో కదా! ఇక దుష్టత్వమూ ఉండదు, దాని కారకులూ ఉండరు. బైబిలు ఇలా వాగ్దానం చేస్తోంది: “కీడు చేయువారు నిర్మూలమగుదురు. . . . దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు క్షేమము కలిగి సుఖించెదరు.” (కీర్తన 37:9-11) వారి మధ్య నెలకొన్న సమాధానాన్ని మానవులే కాదు జంతువులు కూడా పాడుచేయలేవు. (యెషయా 11:6-9) గతంలో అజ్ఞానం వల్ల, యెహోవా గురించి తెలుసుకునే అవకాశం లభించనందు వల్ల అపవాది పక్షం వహించిన కోటానుకోట్ల మంది తిరిగి జీవాన్ని పొంది దైవిక విద్యను పొందుతారు.​—అపొస్తలుల కార్యములు 24:14, 15.

వెయ్యేండ్ల పరిపాలన ముగిసే సరికి, భూమి పరదైసు పరిస్థితులకు తీసుకురాబడుతుంది, దాని మీది మానవులు పరిపూర్ణతకు తీసుకురాబడతారు. ఆ తర్వాత సాతాను “కొంచెము కాలము” విడిచిపెట్టబడతాడు, ఇక దాని తర్వాత, దేవుని పరిపాలనను వ్యతిరేకించే వారందరితోపాటు శాశ్వతంగా నాశనం చేయబడతాడు.​—ప్రకటన 20:3, 7-10.

మీరు ఎవరి పక్షం వహిస్తారు?

సాతాను భూమిపై వినాశనాన్ని కలుగజేసిన కాలం 20వ శతాబ్దం. అయితే భూమిపైనున్న పరిస్థితులు సాతాను విజయం సాధించాడని సూచించే బదులు మనం ఈ దుష్టలోకపు అంత్యదినాల్లో ఉన్నామనే దానికి సూచననిస్తున్నాయి. (మత్తయి 24:3-14; ప్రకటన 6:1-8) ఎవరు విజయం సాధించారనే విషయాన్ని నిర్ణయించేది భూమిపైనున్న దుష్టత్వపు తీవ్రతా కాదు, అత్యధికుల దృక్కోణమూ కాదు. ఆ విషయాన్ని నిర్ణయించేది ఎవరి పరిపాలనా విధానం శ్రేష్ఠమైనది, ఎవరైనా ప్రేమతో దేవుని సేవ చేస్తున్నారా లేదా అనే అంశాలే. ఈ రెండింటికి సంబంధించిన వాస్తవాల ప్రకారం విజయం యెహోవాదే.

అనుమతించబడిన సమయం సాతానును ఇప్పటికే తప్పని నిరూపించివుంటే, మరి దుష్టత్వం కొనసాగడానికి దేవుడు ఇంకా ఎందుకు అనుమతిస్తున్నాడు? “యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు” యెహోవా సహనం చూపిస్తున్నాడు. (2 పేతురు 3:9) “మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలె[ను]” అన్నది దేవుని చిత్తం. (1 తిమోతి 2:4) మిగిలివున్న సమయాన్ని మీరు బైబిలు అధ్యయనం చేయడానికి, ‘అద్వితీయ సత్యదేవుని గురించిన, ఆయన పంపించిన యేసుక్రీస్తును గురించిన’ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాము. (యోహాను 17:3) విజయం సాధించే వైపు స్థిరంగా నిలబడివున్న లక్షలాదిమందితోపాటు మీరు కూడా ఉండేలా ఆ జ్ఞానాన్ని సంపాదించుకునేందుకు మీకు సహాయం చేయడానికి యెహోవాసాక్షులు సంతోషిస్తారు.

[5వ పేజీలోని చిత్రాలు]

యెహోవాసాక్షులు విశ్వసనీయతను కాపాడుకోవడం ద్వారా సాతాను ఘోరాపజయానికి దోహదపడ్డారు

[7వ పేజీలోని చిత్రం]

యెహోవా వైపున అనేకమంది విశ్వసనీయులు ఉన్నారు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి