“పరిశుద్ధుల” పట్ల ఆధునిక ఆకర్షణ
“మహాత్ముల గురించిన ప్రస్తావన వస్తే చాలు మనకు విసుగుపుట్టుకొచ్చిన కాలం మీకు గుర్తుందా? కానీ ఆ విషయం, సెప్టెంబరు 13వ తేదీన మదర్ థెరీసా అంత్యక్రియలను వీక్షించిన 42 లక్షలమంది అమెరికన్లను మాత్రం ప్రభావితం చేసినట్లు కనిపించలేదు. సెప్టెంబరు 5వ తేదీన ఆమె మరణించినప్పటి నుండి, ఆమెను ఆధికారికంగా పరిశుద్ధురాలిగా ప్రకటించమని ప్రజలు వాటికన్‌ను అభ్యర్థనలతో ముంచెత్తుతున్నారు. అది జరగకపోవచ్చు అని సందేహిస్తున్నవారు కేవలం కొంతమందే.”—సన్-సెంటినల్, అమెరికా, అక్టోబరు 3, 1997.
క్యాథలిక్ మిషనరీ మదర్ థెరీసా చేసిన మానవతావాద చర్యలను, దానధర్మాలను చాలామంది నిజమైన పరిశుద్ధులు చేయవలసిన పనులుగా పరిగణిస్తున్నారు. అలాంటి మహాత్ములు ఇతర మతాల్లో కూడా ఉన్నారు. అయితే రోమన్ క్యాథలిక్ చర్చి ద్వారా పరిశుద్ధులు అని ఆధికారికంగా ప్రకటించబడుతున్నట్లు ఇతర మతాలలోని వారెవ్వరూ ప్రకటించబడరు.
జాన్ పాల్ II, పోప్‌గా తన పరిపాలనా కాలంలో 450 కంటే ఎక్కువమందిని పరిశుద్ధులుగా ప్రకటించాడు. 20వ శతాబ్దంలోని ఇతర పోప్‌లందరూ పరిశుద్ధులుగా ప్రకటించినవారి మొత్తం కంటే ఎక్కువ మందిని ఆయన పరిశుద్ధులుగా ప్రకటించాడు.a సాధారణ క్యాథలిక్‌లకు అస్సలు పరిచయం లేని ఈ “పరిశుద్ధులకు” ఇలాంటి శాశ్వతమైన భక్తి ఎందుకు చూపించబడుతుంది?
నాటెర్ డామ్ విశ్వవిద్యాలయానికి చెందిన తత్వవేత్త లారెన్స్ కన్నింగ్‌హామ్ ఇలా వివరిస్తున్నాడు: “ఈ లోకంలో కూడా పరిశుద్ధత ఉండగలదన్న తలంపు ప్రజలకు ఆసక్తిని రేకెత్తిస్తుంది. పరిశుద్ధులు ఉన్నారని గుర్తించడం, నేడు కూడా మహాత్ములుగా జీవితాన్ని గడపగల అవకాశం ఉందని చూపిస్తుంది.” అంతేకాకుండా, “పరిశుద్ధులకు” దేవుణ్ణి సమీపించగల ప్రత్యేకమైన హక్కు ఉంది కాబట్టి, ప్రజలకూ దేవునికీ మధ్య వారు ప్రభావవంతమైన మాధ్యమంగా పనిచేయగలరని విశ్వసించబడుతోంది. ఒక “పరిశుద్ధుని” స్మృతి చిహ్నాలు లేదా అవశేషాలు దొరికినప్పుడు, వాటినుండి శక్తి వెలువడుతుందని నమ్ముతూ వాటిని పూజించడం జరుగుతోంది.
క్యాథలిక్ మత సిద్ధాంతాన్ని ధృవీకరించడానికి 16వ శతాబ్దంలో ప్రచురించబడిన కౌన్సిల్ ఆఫ్ ట్రెంట్ ప్రశ్నోత్తర బోధ ఇలా ఆధికారికంగా ప్రకటించింది: “మేము ‘ప్రభువునందు నిద్రిస్తున్న’ పరిశుద్ధులను గౌరవించడం, వారి మధ్యవర్తిత్వాన్ని అర్థించడం, వారి పవిత్రమైన స్మృతి చిహ్నాలనూ అస్థికలనూ పూజించడం వంటి పనులు దేవుని మహిమను తగ్గించే బదులు గమనార్హంగా పెంచడమే గాక తద్వారా ఒక క్రైస్తవుని నిరీక్షణ సజీవం చేయబడి బలపర్చబడి అతడు పరిశుద్ధుల మంచి గుణాలను అనుకరించడానికి ప్రోత్సహించబడతాడనే ముగింపుకు రావడం న్యాయసమ్మతమే.” (కౌన్సిల్ ఆఫ్ ట్రెంట్ ప్రశ్నోత్తర బోధ, 1905) మంచి జీవితాన్ని గడపాలని, దేవుణ్ణి సరైన విధంగా సమీపించాలని, దైవిక సహాయం పొందాలని నిజ క్రైస్తవులు ఖచ్చితంగా కోరుకుంటారు. (యాకోబు 4:7, 8) అయితే దేవుని వాక్యం ప్రకారం, నిజమైన పరిశుద్ధులవ్వడానికి ఎవరు అర్హులు? వారి పాత్ర ఏమిటి?
[అధస్సూచి]
a పరిశుద్ధుడిగా గుర్తించడం (కాననైజేషన్) అంటే చనిపోయిన ఒక రోమన్ క్యాథలిక్ విశ్వవ్యాప్తంగా తప్పనిసరిగా పూజించబడడానికి అర్హుడని ఆధికారికంగా నిర్ణయించడమే.