ఆంతరంగిక విషయాన్ని
వెల్లడి చేయవలసిన సమయం
కొన్ని ఆంతరంగిక విషయాలను వెల్లడి చేయడం శాంతికో వివాదానికో కారణం కావచ్చు. అయితే ఆంతరంగిక విషయాన్ని వెల్లడి చేయడానికి ఒక సమయం ఉందా? తన దేవుని గురించి ప్రవక్తైన ఆమోసు ఏమి చెబుతున్నాడో గమనించండి: ‘తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించినదానిని [“తన ఆంతరంగిక విషయాన్ని,” NW] బయలుపరచకుండ ప్రభువైన యెహోవా యేమియు చేయడు.’ (ఆమోసు 3:7) ఈ మాటలనుంచి, ఆంతరంగిక విషయాలను రహస్యంగానే ఉంచడానికి సంబంధించి మనం కొంత నేర్చుకోవచ్చు. యెహోవా కొన్ని నిర్దిష్టమైన విషయాలను కొంతకాలం వరకు రహస్యంగా ఉంచి, వాటిని కొంతమంది వ్యక్తులకు కాలక్రమేణా వెల్లడి చేయవచ్చు. ఈ విషయంలో మనం యెహోవాను ఎలా అనుకరించవచ్చు?
కొన్ని సమయాల్లో ఒక నిర్దిష్టమైన విషయాన్ని వెల్లడి చేయకుండా ఉండడం ప్రయోజనకరమని క్రైస్తవ సంఘంలో నియమించబడిన కాపరులు భావించవచ్చు. (అపొస్తలుల కార్యములు 20:28) ఉదాహరణకు, సంఘ ప్రయోజనాన్ని మనసులో ఉంచుకుని, కొన్ని ఏర్పాట్లను గురించిన లేదా సంఘ బాధ్యతల విషయంలో జరిగిన మార్పులను గురించిన వివరాలను ఒక నిర్దిష్ట సమయం వరకు రహస్యంగా ఉంచాలని వారు నిర్ణయించవచ్చు.
అయితే ఇలాంటి సందర్భంలో, ఒకవేళ ఆ విషయం వెల్లడి చేయబడవలసినదైతే, అది ఎప్పుడు, ఎలా వెల్లడి చేయబడుతుందన్న విషయాన్ని దానిలో ఇమిడి ఉన్న వారికి స్పష్టం చేయడం చాలా ప్రాముఖ్యం. ఒక విషయం బహిరంగంగా ఎప్పుడు వెల్లడి చేయబడుతుందనేది తెలుసుకుని ఉండడం, వారు ఆ విషయాన్ని రహస్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.—సామెతలు 25:9.